flood relief operations
-
వరద సాయం డబ్బు ఏమైంది: మార్గాని భరత్
సాక్షి,తూర్పుగోదావరిజిల్లా:విజయవాడ వరద బాధితుల కోసం సేకరించిన డబ్బు ఏమైందని అని మాజీఎంపీ,వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి మార్గాని భరత్ ప్రశ్నించారు.ఈ విషయమై భరత్ మంగళవారం(అక్టోబర్8) మీడియాతో మాట్లాడారు.‘విజయవాడ వరద బాధితుల కోసం సేకరించిన డబ్బు ఏమైంది.మీరు ఖర్చు చేసిందెంత?ఎమ్మెల్యేలు అడ్డుగోలుగా దోచుకోలేదా..పులిహోరకు రూ. 23 కోట్లు ఖర్చు చేయడం దారుణం. అగ్గిపెట్టెలు,కొవ్వొత్తులకు 23 కోట్లు ఖర్చు చూపటం హాస్యాస్పదం.రూ.500 కోట్లు చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ ఏం చేశారు.కేంద్రం నుంచి వచ్చిన నిధులు ఏమయ్యాయి.చంద్రయాన్ కోసం ఇస్రో చేసిన ఖర్చు రూ. 618 కోట్లు అయితే చంద్రబాబు వరదల్లో చూపిన ఖర్చు రూ. 500 కోట్లని సోషల్ మీడియాలో ట్రోల్ అవుతోంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో నిల్వచేసిన 87లక్షల మెట్రిక్ టన్నుల ఇసుక ఏమైంది.రాజమండ్రిలో 28 మద్యం దుకాణాల్లో ఆరింటిని తమకు వదిలేయాలని స్థానిక ఈవీఎం ఎమ్మెల్యే చెప్పడం దారుణం.రాజమండ్రిలో కంబాల పార్కుకు ఎంట్రన్స్ టికెట్ రూ.50 తొలగిస్తామని గతంలో హామీ ఇచ్చారు ఇప్పటివరకు ఎందుకు తొలగించలేదు.ఒక్క అభివృద్ధి కార్యక్రమం కూడా ఎందుకు నిర్వహించలేకపోయారు.పార్కులు ఎందుకు పూర్తి చేయలేకపోతున్నారు’అని భరత్ నిలదీశారు.ఇదీ చదవండి: జీతాలు నిల్లు..పబ్లిసిటీ ఫుల్లు: విజయసాయిరెడ్డి సెటైర్లు -
వరద బాధితులకు అండగా వైఎస్సార్సీపీ
విజయవాడ, సాక్షి: మూడో దశ వరద సహాయక కార్యక్రమాలకు వైఎస్సార్సీపీ ఇవాళ (మంగళవారం) శ్రీకారం చుట్టింది. విజయవాడ వరద బాధిత కుటుంబాలకు సరుకులు పంపిణీ చేస్తోంది. నిత్యావసర సరుకుల వాహనాలను వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ జెండా ఊపి ప్రారంభించారు. మొత్తం 50 వేల కుటుంబాలకు వైఎస్సార్సీపీ తరపున నిత్యావసర సరుకుల పంపిణీ చేయనుంది. 33 డివిజన్లల్లో సరుకుల పంపిణీ జరగనుంది. వరద బాధితుల సహాయార్థం వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి రూ.కోటి విరాళం ప్రకటించిన విషయం తెలిసిందే. అదేవిధంగా వైఎస్సార్సీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు తమ నెల జీతం విరాళంగా ప్రకటించారు. ఇప్పటికే రెండు దశల్లో వరద నీటిలో అవస్థలు పడ్డ బాధితులకు పాల ప్యాకెట్లు, వాటర్ బాటిళ్లను పంచగా.. ఇప్పుడు మూడో విడతలో నిత్యావసరాలు ఇస్తున్నారు.ఇదీ చదవండి: మమ్మల్ని ఆడిపోసుకోవడం తప్ప పని చేయరా? -
నిండా మునిగాం.. ఆదుకోండి
సాక్షి ప్రతినిధి, ఖమ్మం/సాక్షి, మహబూబాబాద్: ‘‘అర్ధరాత్రి దాటాక అకస్మాత్తు వరద.. మెలకువ వచ్చి చూస్తే నీళ్లలో ఉన్నాం.. దిక్కుతోచని పరిస్థితిలో ఇంటిపైకి ఎక్కి, ఎత్తైన ప్రాంతాలకు పరుగెత్తి ప్రాణాలు మాత్రం కాపాడుకున్నాం.. కానీ సర్వం కోల్పోయాం.. నిత్యావసరాల నుంచి ఇంట్లో వస్తువుల దాకా అన్నీ కొట్టుకుపోయాయి.. ఉన్నా పాడైపోయాయి.. మా బతుకులకు ఆధారమైన పంట పొలాల్లో ఇసుక మేటలు వేశాయి. నిండా మునిగిపోయాం.. ఆదుకోండి’’ అని ముంపు బాధితులు కేంద్ర బృందానికి గోడు వెళ్లబోసుకున్నారు. భారీ వర్షాలు, వరదలతో రాష్ట్రంలోని ఉమ్మడి ఖమ్మం, వరంగల్, నల్లగొండ జిల్లాల పరిధిలో తీవ్ర నష్టం జరిగిన విషయం తెలిసిందే. దీనిని పరిశీలించి, నష్టం అంచనా వేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన బృందం బుధవారం రాష్ట్రంలో పర్యటించింది. రెండు సబ్ టీమ్‌లుగా విడిపోయి.. ఆరుగురు సభ్యులతో కూడిన కేంద్ర వరద పరిశీలన బృందం.. తొలిరోజు బుధవారం ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల్లో పర్యటించింది. నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అధికారి, హోంశాఖ జాయింట్ డైరెక్టర్ కల్నల్ కీర్తి ప్రతాప్‌సింగ్ నేతృత్వంలోని ఈ బృందంలో.. ఆర్థికశాఖ డిప్యూటీ డైరెక్టర్ మహేశ్‌కుమార్, వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ జాయింట్ డైరెక్టర్ శాంతినాథ్ శివప్ప, జాతీయ రహదారులు, రోడ్డు రవాణా సూపరింటెండెంట్ ఇంజనీర్ ఎస్.కె.కుశ్వంగ, గ్రామీణాభివృద్ధిశాఖ అధికారి టి.నియల్ ఖాన్సూన్, నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ శాస్త్రవేత్త శశివర్ధన్‌రెడ్డి సభ్యులుగా ఉన్నారు. ఈ బృందం రెండు సబ్ టీమ్‌లుగా విడిపోయి.. ఒక సబ్ టీమ్ పంట, ఆస్తి నష్టాలను పరిశీలించగా, మరో సబ్ టీమ్ తెగిపోయిన రోడ్లు, చెరువులు, వంతెనలు, కాల్వలు వంటివాటిని పరిశీలించింది. ఎక్కడిక్కడ రాష్ట్ర వ్యవసాయ, నీటిపారుదల శాఖల అధికారులు వరద నష్టాలను కేంద్ర బృందం సభ్యులకు వివరించారు. ఖమ్మంలో జిల్లాలో.. కేంద్ర బృందం సభ్యులు ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం భగవత్వీడ్ తండాలో కోతకు గురైన, ఇసుక మేటలు వేసిన పొలాలను పరిశీలించి రైతులతో మాట్లాడారు. ఖమ్మం, సూర్యాపేట మధ్యలో దెబ్బతిన్న జాతీయ రహదారిని, మల్లాయిగూడెంలో దెబ్బతిన్న రోడ్డును, పాలేరు వద్ద నాగార్జునసాగర్ కాలువకు పడిన గండిని, భక్తరామదాసు ఎత్తిపోతల పథకం పంపుహౌస్‌లను పరిశీలించారు. ఖమ్మం రూరల్ మండలంలోని గూడూరుపాడు, తనకంపాడు, తిరుమలాయపాలెం మండలంలోని రాకాసితండా, కస్నాతండాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా పాలేరు, మున్నేరు వరదలతో తీవ్రంగా నష్టపోయామంటూ బాధితులు కేంద్ర బృందం ముందు కన్నీటి పర్యంతమయ్యారు. రాకాసితండాలో దెబ్బతిన్న ఇళ్లలోకి వెళ్లి పరిశీలించారు. సమీపంలో ఆకేరు వరదతో కొట్టుకుపోయిన ప్రాంతాన్ని చూశారు. ఈ సందర్భంగా తమ ఇళ్లు, పంట పొలాలు నామరూపాల్లేకుండా కొట్టుకుపోయాయని.. తమను ఆదుకోవాలని మహిళలు కేంద్ర బృందం సభ్యులకు దండం పెట్టి వేడుకున్నారు. తమకు మరో ప్రాంతంలో నివాసం కల్పించాలని విన్నవించారు. మానుకోట జిల్లాలో పరిశీలించి.. కేంద్ర బృందం సభ్యులు మహబూబాబాద్ జిల్లాలోనూ రెండు సబ్ టీమ్‌లుగా పర్యటించారు. ఒక సబ్ టీమ్ సభ్యులు తొలుత మరిపెడ మండలం ఉల్లెపల్లిలో పర్యటించి అక్కడి ప్రజలతో మాట్లాడారు. సీతారాంతండాలో వరదతో సర్వం కోల్పోయిన ఇస్లావత్ మంగీలాల్ కుటుంబంతో మాట్లాడారు. వరద వచ్చినప్పుడు సమయమెంత? మీకు మెలకువ ఎలా వచ్చింది? సురక్షిత ప్రాంతాలకు ఎప్పుడు వెళ్లారు? ఎంత నష్టం జరిగింది అంటూ వివరాలు తెలుసుకున్నారు. అనంతరం డోర్నకల్ మండలం ముల్కలపల్లిలో పర్యటించి స్థానికులతో మాట్లాడారు. మరో సబ్ టీమ్ సభ్యులు.. మరిపెడ మండలం అబ్యాయిపాలెం, గాలివారిగూడెం, పురుషోత్తమాయ గూడెం, ముల్కలపల్లి గ్రామాల్లో తెగిన చెరువులు, రోడ్లు, వరద ప్రవాహం తీరును పరిశీలించారు. నష్టం ఫొటో ఎగ్జిబిషన్లను పరిశీలించారు. నేడు మున్నేరు ముంపు, సూర్యాపేట జిల్లాలో పర్యటన కేంద్ర బృందం సభ్యులు బుధవారం రాత్రి ఖమ్మంలో బస చేశారు. గురువారం ఖమ్మం రూరల్ మండలం, ఖమ్మం కార్పొరేషన్ పరిధిలోని మున్నేరు వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించనున్నారు. అనంతరం సూర్యాపేట జిల్లాలోని అనంతగిరి, కోదాడ మండలాల్లో నష్టాన్ని పరిశీలిస్తారు. -
వరద బాధితులకు అండగా YSRCP నేతలు
సాక్షి, అమరావతి: అధికారంలో ఉండి కూడా.. కూటమి నేతలు తమ బాధ్యతను సక్రమంగా నిర్వహించడం లేదు. వరద ప్రాంతాల వైపు కన్నెత్తి చూడడం లేదు. కానీ, తమ వంతుగా బాధితులకు సాయం అందించేందుకు వైఎస్సార్సీపీ నేతలు ముందుకు వస్తున్నారు.భారీ వర్షాలు, వరద ధాటికి విజయవాడ నగరం నీట మునిగింది. నాలుగు రోజులు గడుస్తున్నా.. ఇంకా వరద నీటిలోనే ఉండిపోయింది. పలు కాలనీలకు ఇంకా అధికారులు వెళ్లకపోవడం, సహాయక చర్యలు అందకపోవడం.. పరిస్థితులు చూస్తున్నాం. ఈ నేపథ్యంలో వైఎస్సార్సీపీ తన వంతు బాధత్యను నిర్వర్తిస్తోంది.వరద బాధితులకు అండగా వైఎస్సార్సీపీ నేతలు నిలుస్తున్నారు. ఈ ఉదయం నుంచి పలు ప్రాంతాలకు తిరిగి పాలు, వాటర్ బాటిళ్లు అందజేశారు. ఆ సమయంలో ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం అందలేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. అధైర్య పడొద్దని.. ఎలాంటి సాయమైనా అందించేందుకు వైస్సార్సీపీ సిద్ధంగా ఉందని నేతలు భరోసా ఇచ్చారు. ఇక.. ఇప్పటికే పార్టీ కోటి రూపాయల విరాళం ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఆ మొత్తాన్ని నేరుగా బాధితులకే అందేలా చూడాలని పార్టీ అధినేత వైఎస్ జగన్ నేతలకు సూచించారు. దీంతో.. బాధితుల అవసరాల మేరకు సహాయం అందించే ప్రయత్నాల్లో ఉన్నారు వైఎస్సార్సీపీ నేతలు. -
వరద బాధిత కస్టమర్లకు ఉచిత సేవలు
దేశంలోని వివిధ ప్రాంతాల్లో వరదల వల్ల నష్టపోయిన వినియోగదారుల కోసం నిస్సాన్ మోటార్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ప్రత్యేక సహాయక చర్యలు ప్రకటించింది. వరదలతో సతమవుతున్న కంపెనీ వినియోగదారులకు ఉచితంగా తమ వాహనాల కోసం రోడ్‌సైడ్ అసిస్టెన్స్ సేవలు అందుబాటులోకి తీసుకొచ్చినట్లు తెలిపింది.వరద ప్రభావిత ప్రాంతాల్లోని కంపెనీ కస్టమర్లకు సహాయం చేయడానికి ప్రత్యేకంగా నిస్సాన్ హెల్ప్‌డెస్క్‌ను ఏర్పాటు చేసింది. వరదల్లో చిక్కుకున్న వాహనాలను సమీపంలోని కంపెనీ సర్వీస్ వర్క్‌షాప్‌కు తీసుకెళ్లడానికి వీలుగా ఉచిత రోడ్‌సైడ్ అసిస్టెన్స్ (ఆర్ఎస్ఏ) సేవలను ప్రారంభించింది. దాంతోపాటు బీమా వాహనాలకు క్లెయిమ్ ప్రాసెస్ ఫీజు రూ.1000 మినహాయించినట్లు పేర్కొంది. బీమా క్లెయిమ్ చేయాలనుకునే కస్టమర్లపై ఆర్థిక భారాన్ని తగ్గించడమే కంపెనీ లక్ష్యమని తెలిపింది.ఈ సందర్భంగా నిస్సాన్ మోటార్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ సౌరభ్ వత్స మాట్లాడుతూ..‘దేశవ్యాప్తంగా వరదలు ముంచెత్తుతున్నాయి. దాంతో కంపెనీ కస్టమర్లు తీవ్రంగా నష్టపోతున్నారు. వినియోగదారులకు సహాయం చేయడానికి కంపెనీ సిద్ధంగా ఉంది. అందుకోసం ప్రత్యేకంగా హెల్ప్‌డెస్క్(1800 209 3456)ను ఏర్పాటు చేశాం. కస్టమర్లు సత్వర చర్యల కోసం ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలి’ అన్నారు.ఇదీ చదవండి: టోల్ ప్లాజాల ‘లైవ్ ట్రాక్’వరద బాధిత కస్టమర్లకు నిస్సాన్ మోటార్ ఇండియా ఇంజిన్ ఆయిల్ / ఆయిల్ ఫిల్టర్ రీప్లేస్మెంట్పై 10%, ఫ్లోర్ కార్పెట్ రీప్లేస్మెంట్పై 10% ప్రత్యేక రాయితీ ఇస్తున్నట్లు ప్రకటించింది. దాంతోపాటు వరద ప్రభావిత వాహనాలన్నింటికీ కంపెనీ సర్వీస్ వర్క్‌షాప్‌ల్లో ఫిట్నెస్ టెస్ట్ వివరాలు అందిస్తామని పేర్కొంది. -
Vijayawada Floods: ‘కన్నీటి’ వరద
సాక్షి ప్రతినిధి, విజయవాడ: విజయవాడ సింగ్‌నగర్ పరిధిలోని వాంబే కాలనీలో నివసించే శ్రావణి రెండు రోజులుగా ఇద్దరు బిడ్డల ఆచూకీ తెలియక తల్లడిల్లుతోంది. శనివారం ఉదయం కూలి పనుల కోసం వెళ్లిన శ్రావణికి కొద్దిసేపటికే వాంబే కాలనీ మునిగిపోయిందన్న సమాచారం తెలియడంతో గుండెలు అవిసిపోయాయి. 36 గంటల నుంచి తన కుమారుడు, కుమార్తె ఇంట్లో చిక్కుకుని ఉన్నారని.. కనీసం వారి పరిస్థితి ఎలా ఉందో కూడా తెలియడం లేదంటూ విలపిస్తోంది. చిన్నారులు ఇద్దరూ పదేళ్లలోపు వారే కావటంతో ఎలా ఉన్నారో అంతుబట్టక నిద్రాహారాలు లేకుండా కుమిలిపోతోంది. అధికారులకు తన మొర చెప్పుకుందామని వెళ్తే వినిపించుకునే నాథుడే లేకుండా పోయాడని కన్నీరు మున్నీరు అవుతోంది. ‘నా కన్నీటిని ఎవరూ పట్టించుకోవటంలేదు. కడుపున పుట్టిన బిడ్డలు విపత్కర పరిస్థితుల్లో ఉన్నారు. ప్రభుత్వ పెద్దనా సమస్యను ఆలకించడం లేదు’ అంటూ రోదిస్తోంది!! వరద ప్రాంతాల్లో బాధితుల దుస్థితికి ఇది ఓ ఉదాహరణ మాత్రమే. ఎవరిని కదిలించినా ఇలాంటి దీన గాథలే! సహాయ చర్యల్లో సర్కారు వైఫల్యంతో పలుచోట్ల మహిళలు, పిల్లలను వారి బంధువులు, వలంటీర్లు పీకల లోతు నీళ్లలో భుజాలపైకి ఎక్కించుకుని కాపాడి తెస్తున్న దృశ్యాలు కంట తడి పెట్టిస్తున్నాయి. వరద నీటిలో వస్తుండగా కాళ్లకు పాములు, విష జంతువులు చుట్టుకోవడంతో ఆర్తనాదాలు చేస్తున్నారు. నీట మునిగిన సింగ్‌నగర్ ఏరియల్ వ్యూ తెల్లారేసరికి ప్రాణాలతో ఉంటారో లేదో..‘ముందస్తు సమాచారం ఇవ్వకుండా మమ్మల్ని ముంచేశారు. కనీసం ముందుగా చెబితే కట్టుబట్టలతో ఒడ్డుకైనా చేరేవాళ్లం. ఆదివారం తెల్లారేసరికి నీరు చుట్టుముట్టింది. ఎంతోమంది చిన్నపిల్లలు, వృద్ధులు, గర్భిణులున్నారు. ఆహారం మాట దేవుడెరుగు.. ప్రాణం కాపాడుకునేందుకు గుక్కెడు మంచినీళ్లూ దొరకటం లేదు. చిన్నపిల్లలు పాల కోసం గుక్కపట్టి ఏడుస్తున్నారు. మెయిన్ రోడ్డు మీద కొన్ని పడవలు తిరుగుతున్నాయి. వాళ్లను ఎంత బతిమాలినా లోపల సందులోకి రావటం లేదు. ఆహారం, పాలు, నీళ్లు.. రోడ్డుపైన ఉన్న కొన్ని ఇళ్ల వారికి మాత్రమే అందుతున్నాయి. లోపల వేలాది కుటుంబాలున్నాయి. తెల్లారేసరికి ప్రాణాలతో ఉంటాయో లేదో! ఆదుకోవడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. కాలనీల్లో కింద గ్రౌండ్ ఫ్లోర్లు పూర్తిగా మునిగిపోవడంతో మిద్దెలు, పై ఫ్లోర్లలో తలదాచుకుంటున్నారు. ఏదైనా బోటు కనిపిస్తే నీళ్లు, పాల ప్యాకెట్లు పైకి వేయాలని వేడుకుంటున్నారు. విజయవాడలోని సింగ్‌నగర్‌లో ఆహారం, పాలు, తాగునీటి కోసం వరద బాధితుల అవస్థలు కట్టుబట్టలతో కొంతమంది ఎలాగోలా బయటపడగా చాలామంది ధైర్యం చాలక మిద్దెలపైన బిక్కుబిక్కుమంటు బతుకీడుస్తున్నారు. వరద ప్రభావిత కాలనీల్లో విద్యుత్ లేదు. ఫోన్లు పనిచేయడంలేదు. రాత్రిళ్లు నరకయాతన అనుభవిస్తున్నారు’ అంటూ వరద నుంచి ప్రాణాలతో బయటపడ్డ వారు చెబుతుంటే కళ్లు చెమరుస్తున్నాయి. రాజీవ్‌నగర్, కండ్రిక, గుణదల, లూనాసెంటర్, పాయకాపురం, తోటవారివీధి తదితర కాలనీల్లో ఇప్పటికీ సహాయ చర్యలు అందలేదు. పశువుల షెడ్లు కూలిపోవడంతో రెండు రోజులుగా మూగజీవాలు నీరు, తిండిలేక రోడ్లపైనే ఉన్నాయి. ఇళ్లు నీట మునిగిపోవడంతో సామగ్రి పూర్తిగా దెబ్బతింది. దుకాణాల్లోకి నీరు చేరడంతో సరుకులు ఎందుకూ పనికిరాకుండా పోయాయి. బాధితులు లక్షల్లో.. బోట్లు పదుల్లోవరద బాధితులు లక్షల్లో ఉండగా ప్రభుత్వం తెప్పించామని చెబుతున్న బోట్లు ఏ మూలకూ సరిపోవటం లేదు. రోడ్లపైన బాధితులకు నీరు, పాలు, ఆహారం తరలించేందుకే పరిమితం అవుతున్నాయి. పలు బోట్లకు పంక్చర్లు కావడంతో వెనక్కి వస్తున్నాయి. ఇదే అదునుగా కొందరు వెల కడుతూ బోట్ల వ్యాపారానికి తెగబడుతున్నారు. కుటుంబం అయితే రూ.5 వేలు, మనిషికి రూ.1,000–1,500 చొప్పున వసూలు చేస్తున్నారు. పేదలను మాత్రం బోట్లు ఎక్కనివ్వడం లేదు. 5 నియోజకవర్గాల పరిధిలో..బుడమేరు పొంగటంతో ఐదు నియోజక వర్గాలు.. విజయవాడ సెంట్రల్, ఈస్ట్, వెస్ట్, మైలవరం, గన్నవరం పరిధిలో కాలనీలు నీట మునగడంతో సుమారు 4.5 లక్షల మందికి పైగా ముంపు బారినపడ్డారు. ఇప్పటికీ పూర్తిగా నీటిలో చిక్కుని 2.5 లక్షల మందికిపైగా బాధితులు అల్లాడుతున్నారు. వివిధ కాలనీలకు సంబంధాలు తెగిపోయి బయటకు రాలేని పరిస్థితి నెలకొంది. సోమవారం సాయంత్రానికి 20వేల మందిని కూడా∙బయటకి తరలించలేని దుస్థితి.కనుచూపు మేర నీళ్లే 48 గంటల తరువాత కూడా లక్షల మందిని వరదల్లో వదిలేసి ప్రభుత్వం పూర్తిగా చేతులెత్తేసింది. బాధితుల ఇళ్లల్లో వంట సామగ్రి, గ్యాస్ స్టవ్‌లు, బీరువాలు, బట్టలు, ఫర్నిచర్, పుస్తకాలు.. బురదమయమైపోయాయి. ఇంట్లో ఉండలేక బయటకు వద్దామంటే కనుచూపు మేర నీళ్లే కనిపిస్తుండటంతో అల్లాడుతున్నారు. ప్రభుత్వం కనీసం కొవ్వొత్తులు కూడా సరఫరా చేయలేదు. బాధితులను హెలికాప్టర్లలో ఎయిర్ లిఫ్ట్ చేస్తామని సీఎం చంద్రబాబు ఆదివారం చెప్పిన మాటలు నీటిమూటలుగానే మిగిలిపోయాయి. సహాయ చర్యల కంటే వీఐపీల హడావుడి బాధితుల ఇక్కట్లను మరింత పెంచుతోంది. వీఐపీల వాహనాలు కి.మీ. కొద్దీ బారులు తీరాయి. అంబులెన్సులు వెళ్లే మార్గం కనిపించడంలేదు. పాలు, ఇతర నిత్యావసరాల ధరలు రెండు మూడు రెట్లు పెంచేసి దోపిడీ చేస్తున్నా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది.అన్నం పెట్టండంటే.. బాబు అభివాదంరెండు రోజులుగా ఆహారం లేక అల్లాడుతున్న బాధితులు తమ ప్రాంతానికి వస్తున్న ప్రజాప్రతినిధులను కనీసం తినడానికి ఏదైనా అందించాలంటూ నిస్సహాయంగా అర్థిస్తున్నారు. సింగ్ నగర్లో సీఎం చంద్రబాబు బోటులో పర్యటిస్తుండగా ఓ వృద్ధురాలు చిన్నారిని చూపిస్తూ ఆహారం అందించాలని ప్రాథేయపడింది. అయితే చంద్రబాబు నవ్వుతూ ఆమెకు అభివాదం చేస్తూ బోటులో వెళ్లిపోయారు. ఆమెకు ఆహారం అందించాలని అధికారులను కనీసం ఆదేశించకపోవడం విభ్రాంతి కలిగించింది. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో చంద్రబాబు తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.పునరావాస కేంద్రాల జాడేదీ..?వరద ప్రాంతాల్లో చిక్కుకున్న వారిలో కొందరు ఎలాగోలా ధైర్యం చేసి వలంటీర్లు, బంధువుల సాయంతో కర్రలు, తాళ్ల ద్వారా బయటికి వచ్చినా తలదాచుకునేందుకు ప్రభుత్వం కనీసం సహాయ శిబిరాలను కూడా ఏర్పాటు చేయలేదు. అరకొర శిబిరాలు సైతం నీళ్లలో మునగడంతో రోడ్లపై దయనీయంగా ఉన్నారు. తిండి లేక అల్లాడుతున్నారు. సహాయ చర్యలు చేపట్టడంలో ప్రభుత్వం దారుణంగా విఫలమైందని మండిపడుతున్నారు. వరద ప్రాంతాల్లో ఇప్పటికీ వైద్య శిబిరాలు ఏర్పాటు చేయలేదు. ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం కొరవడటంతో బాధితులు అవస్థలు ఎదుర్కొంటున్నారు.మంత్రులపై మండిపాటు.. ఫొటోల కోసం టూరిస్టుల్లా వచ్చారా?సింగ్‌నగర్, రాజీవ్‌నగర్ తదితర ప్రాంతాల్లో మంత్రులు అనిత, సంధ్యారాణి అచ్చెన్నాయుడు, డీజీపీని వరద బాధితులు నిలదీశారు. సహాయ చర్యలు అందటం లేదని, విజయవాడను కాపాడలేనివారు రాష్ట్రాన్ని ఏం కాపాడతారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం మంచినీళ్లు కూడా ఇవ్వలేకపోతున్నారని, టూరిస్టుల్లా బోట్లలో వచ్చి ఫొటోలు దిగి వెళ్లిపోతున్నారని నిలదీశారు. మంత్రులు అనిత, సంధ్యారాణి బాధితుల ఆగ్రహం చూసి అక్కడ నుంచి చల్లగా జారుకున్నారు.‘నా భార్య మౌనిక సింగ్‌నగర్‌లోని అమెరికన్ ఆసుపత్రిలో ఆగస్టు 31న బిడ్డకు జన్మనిచ్చింది. 15 రోజులు ఆసుపత్రిలోనే ఉండి చికిత్స తీసుకోవాలని చెప్పారు. ఇప్పుడు ఆసుపత్రి చుట్టూ నీళ్లు చేరడంతో మమ్మల్ని బయటకు పంపేశారు. మాతోపాటు మరో 15 మంది బాలింతలు పురిటి బిడ్డలతో ఒడ్డుకు చేరుకున్నాం. మమ్మల్ని కాపాడేందుకు ఒక్క బోటూ రాలేదు. మేమే ఈదుకుంటూ వచ్చాం. పచ్చి బాలింతైన నా భార్యను ఒక చేత్తో, అమ్మను మరో చేత్తో పట్టుకుని ఈదుకుంటూ ఫైఓవర్ వరకు తీసుకొచ్చా. మళ్లీ వెనక్కి ఈదుకుంటూ వెళ్లి మాకోసం ఆస్పత్రికి వచ్చిన బంధువును, సామాన్లను తెచ్చా. ఇక్కడ నుంచి కనీసం అంబులెన్స్ కూడా దొరకడం లేదు. ఏం చేయాలో.. ఎక్కడకి వెళ్లాలో అర్ధం కావట్లేదు’’ – రాగబాబు, నెక్కలం గొల్లగూడెం, ఆగిరిపల్లి మండలం ‘‘పక్షవాతంతో బాధపడుతున్న నా భర్తతోపాటు కుమారుడు, కోడలు, మనవడితో కలసి ఉంటున్నాం. ఉన్నట్టుండి ఇల్లు మునిగిపోయింది. చుట్టూ పీకల్లోతు నీళ్లు. ఒడ్డుకు చేర్చేందుకు ఎవరైనా వస్తారేమోనని ఎదురు చూస్తూ రాత్రంతా డాబాపై వర్షంలో నిరీక్షించాం. చివరకు నా భర్తను ఓ చెక్కపై కూర్చోబెట్టి చంటి బిడ్డను భుజాన వేసుకుని కర్రల సాయంతో ఒడ్డుకు చేరాం. పీకల్లోతు నీళ్లలో నడుచుకుంటూ వస్తుంటే పోలీసులు మా పక్క నుంచే బోట్లలో వెళ్లారు. రక్షించాలని అరుస్తున్నా వినపడనట్లు వెళ్లిపోయారు. ఫైఓవర్ దగ్గరకు వచ్చిన తరువాతనైనా కనీసం మంచి నీళ్లు ఇచ్చే దిక్కు లేకుండా పోయింది’’ – నందమూరి లక్ష్మి, వాంబే కాలనీమమ్మల్ని ఆ దేవుడే కాపాడాలి మేం బుడమేరు మధ్య కట్టలో ఉంటున్నాం. ఓ వైపు వరద నీరు.. మరోవైపు పాములు, తేళ్ల భయం. ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని బతికాం. రెండు రోజుల నుంచి భోజనం లేదు. తాగటానికి నీరు కూడా లేదు. భోజన ప్యాకెట్లు ఇచ్చారంటా. కానీ మా వరకు రాలేదు. ఇచ్చే ప్యాకెట్లు కూడా కొంతమందికే అందుతున్నాయి. సహాయం చేయటానికి వచ్చిన అధికారులు, సింబ్బంది మమల్ని కసురుతున్నారు. ఎలాంటి సహాయం అందలేదు. మమ్మల్ని ఆ దేవుడే కాపాడాలి. – మంగ, సరస్వతి, బడమేరు మధ్య కట్ట ఏరియా పిల్లలు తప్పిపోయారు నేను రిక్షా బండి తోలుకుని బతుకుతా. మమల్ని చూడటానికి మా అమ్మాయి ఊరి నుంచి వచ్చింది. ఆమె కూడా వరదలో చిక్కుకుపోయింది. ఇంట్లో వారికి భోజనం తీసుకువెళదామని ఒడ్డుకు వచ్చా. ఇప్పుడు పోలీసులు నన్ను లోపలికి వెళ్లనీయటంలేదు. లోపల పిల్లలు ఆకలితో అల్లాడుతున్నారు. తాగటానికి నీరు లేదు. తినటానికి తిండిలేదు. నేను బయటకు వచ్చాక నన్ను వెతుకుంటూ మావాళ్లు వచ్చారంటా. వారు తప్పిపోయారు. ఎక్కడ ఉన్నారో తెలియడంలేదు. – కృష్ణ, రిక్షా కార్మికుడు, బొంబాయి కాలనీ, పాయకాపురంప్రభుత్వం చెప్పేవన్నీ డొల్ల మాటలేనా భార్య రెండు రోజుల నుంచి జ్వరంతో బాధపడుతుండటంతో సింగ్‌నగర్‌లోని అమెరికన్ ఆస్పత్రికి వస్తే టైఫాయిడ్ అన్నారు. అక్కడే ఆస్పత్రిలో చేర్పించాను. ఆకస్మికంగా వరద రావడంతో జర్వంతో బాధపడుతున్న నా భార్యను, పిల్లను తీసుకుని ఒడ్డుకు రావాలని ప్రయత్నించగా, ఎవరూ సాయం చేయలేదు. నిన్నటి నుంచి తిండిలేదు. తాగటానికి నీరులేదు. అతి కష్టం మీద చేతికర్ర సాయంతో వరద నీటి నుంచి ఒడ్డుకు చేరాం. మాతోపాటు ఉన్న రోగులందరూ అలాంటి పరిస్థితే. గర్భిణులు, బాలింతల కూడా నీటిలో నడిచే వస్తున్నారు. ప్రభుత్వం సహాయక చర్యలు చేపట్టామని చెబుతున్నవన్నీ డొల్ల మాటలే. – శంకర్, మమత, సింగ్‌నగర్ ఏరియా ఆర్భాటం.. హడావుడే.. సాయం శూన్యం శుభకార్యం ఉందని బెంగళూరు నుంచి నాలుగు రోజుల క్రితం విజయవాడ వచ్చా. వరదలో చిక్కుకుపోయా. ఆర్భాటం, హడావిడి తప్పా బాధితులను పట్టించుకునేవారే లేరు. ఎవరెవరో వస్తున్నారు.. చూస్తున్నారు.. వెళ్తున్నారు.. కానీ సహాయం మాత్రం శూన్యం. నీరు, తిండి కోసం అల్లాడాం. – సాధిక్, బెంగళూరు కట్టుబట్టలతో మిగిలాం రెండు రోజుల నుంచి నరకం చూశాం. వరదతో కట్టుబట్టలతో వయటకు వచ్చేశాం. రాజరాజేశ్వరిపేటకు బోట్లు రావటం లేదు. లోపల ఉన్నవారంతా గగ్గోలు పెడుతున్నారు. మా ఇంటిలో సామాన్లన్నీ కొట్టుకుపోయాయి. ఇప్పుడు మా పరిస్థితేంటో అర్థం కావటంలేదు. ప్రభుత్వం పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారని చెబుతున్నారు. కానీ మమల్ని అక్కడికి తీసుకెళ్లేనాథుడు ఏరి? – ధనలక్ష్మి, దుర్గాప్రసాద్, రాజరాజేశ్వరిపేట -
ఉత్తరాఖండ్ వరదలు:పెద్ద మనసు చాటుకున్న అనంత్ అంబానీ
RIL Director Anant Ambani దేశీయ దిగ్గజ కంపెనీ రిలయన్స్ భారీ విరాళమిచ్చింది.భారీ వర్షాలు , వరదలు, కొండచరియలు విరిగిపడటం లాంటి వాటితో అతలా కుతమైన ఉత్తరాఖండ్‌కు రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ డైరెక్టర్ అనంత్ అంబానీ రూ. 25 కోట్ల విరాళాన్ని ప్రకటించారు. దీనికి సంబంధించి రిలయన్స్ ప్రతినిది తనయ్ ద్వివేది ఈ మొత్తాన్ని ముఖ్యమంత్రి సహాయ నిధికి అందించారు. (‘మస్క్ తప్పు చేశావ్..ఇప్పటికైనా అర్థమవుతోందా?’) ఈ మేరకు అనంత్ అంబానీ ఒక లేఖ రాశారు. తాము అందించిన సాయం ద్వారా ఉత్తరాఖండ్ ప్రజల కోసం వివిధ అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను మరింత ముందుకు తీసుకువెళుతుందని ఆశిస్తున్నామని ని అంబానీ సిఎం ధామీకి రాసిన లేఖలో పేర్కొన్నారు. రిలయన్స్ ద్వారా తాము పలు విద్య సామాజిక అభివృద్ధి కార్యక్రమాల ద్వారా 10 సంవత్సరాలకు పైగా రాష్ట్రానికి భాగస్వామిగా ఉండటం అదృష్టంగా భావిస్తున్నా మన్నారు. మరోవైపు ఆర్ఐఎల్కు, అనంత్ అంబానీకి ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ ధన్యవాదాలు తెలిపారు. (వరల్డ్ రిచెస్ట్ మేన్‌తో రహస్యంగా కవలలు: ఈ టాప్ ఎగ్జిక్యూటివ్ గురించి నమ్మలేని నిజాలు) కాగా రిలయన్స్ ఫౌండేషన్ 2021లో కోవిడ్-19 సహాయ చర్యలకు మద్దతుగా ఉత్తరాఖండ్ స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీకి రూ. 5 కోట్లను అందించింది. మహమ్మారిపై సమిష్టి పోరాటంలో దేశం పట్ల ఆర్థిక సహాయం చేయడం తన కర్తవ్యమని కంపెనీ తెలిపింది. అలాగే ఉత్తరాఖండ్‌లోని బద్రీనాథ్ , కేదార్నాథ్ ఆలయ కమిటీలకు ఆర్ఐఎల్ చైర్మన్ ముఖేష్ అంబానీ గత ఏడాది రూ.2.5 కోట్లు విరాళంగా ఇచ్చిన సంగతి తెలిసిందే. -
జనంతో జననేత మమేకం
సాక్షి అమలాపురం/అమరావతి: వరద ప్రభావిత ప్రాంతాల పరిశీలనలో భాగంగా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి రెండవ రోజు మంగళవారం డాక్టర్ బీ.ఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని ముమ్మిడివరం, పి.గన్నవరం నియోజకవర్గాల్లో పర్యటించారు. వరద సహాయక చర్యల గురించి ప్రజలను అడిగి తెలుసుకున్నారు. భద్రతా ఆంక్షలు పక్కన పెట్టి బాధితులతో మమేకమయ్యారు. అభిమానంతో చొచ్చుకువస్తున్న మహిళలు, యువత, చిన్నారులు, వృద్ధులను భద్రతా సిబ్బంది అడ్డుకోగా.. వారిని వారించి తన దగ్గరకు రప్పించుకుని మరీ మాట్లాడారు. వారితో సెల్ఫీలు దిగారు. జగనన్నా.. అని ఆప్యాయంగా పిలుస్తూ వచ్చిన వారిని అక్కన చేర్చుకున్నారు. ‘జగన్ మావయ్యా’ అని బిగ్గరగా అరిచిన చిన్నారులను పిలిపించుకుని సెల్ఫీలు తీయించుకున్నారు. మండుటెండను సైతం లెక్క చేయకుండా, చెమటలు కక్కుతూన్నా బాధితుల బాధలు ఓపికగా విన్నారు. వరద బాధతులను స్థానిక వలంటీర్లు సీఎం జగన్‌కు పరిచయం చేశారు. వరద సహాయం సరిగ్గా అందిందా లేదా? అని వారి సమక్షంలోనే సీఎం తెలుసుకున్నారు. లంకాఫ్ ఠాన్నేలంకకు చెందిన జయలక్ష్మి అనే మహిళ తన పెన్షన్ వేరే ఊరిలో ఉందని, ఇబ్బంది పడుతున్నానని చెప్పగానే సీఎం స్పందించి.. స్థానిక వలంటీర్‌ను పిలిచి దరఖాస్తు చేయించాలని చెప్పారు. తనను కలిసిన విద్యార్థులను విద్యా కానుక వచ్చిందా? అని అడిగారు. వరద సాయం పంపిణీలో పొరపాటులుంటే చెబితే సరిదిద్దుకుంటామన్నారు. ప్రభుత్వం, అధికారులు, వలంటీర్లు ఇంటింటికీ వచ్చి వరద సాయాన్ని అందించారని, ప్రభుత్వం సకాలంలో స్పందించి ఆదుకుందని ముంపు గ్రామాల ప్రజలు సీఎంకు తెలిపారు. డాక్టర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం రామాలయంపేటలో ప్రజలకు అభివాదం చేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మీరే మా ధైర్యం వరదలతో చాలా కష్టపడుతున్నాం. నష్టపోతున్నాం. అయితే ఈ ప్రభుత్వం వచ్చాక వరద వచ్చిన ప్రతిసారీ ఎంతో సాయం చేస్తోంది. ఊరు చుట్టూ వరదనీరు చేరినా పడవల్లో వచ్చి మరీ అధికారులు మాకు భోజనాలు, తాగునీరు అందించారు. గ్రామస్తులకే కాదు పశువులకు సైతం దాణా అందజేశారు. పేద, ధనిక తేడా లేకుండా ఇంటింటికీ రెండు వేల సాయం చేసి, దెబ్బతిన్న పూరిగుడిసెలకు 10 వేలు అందించారు. మీరే మా ధైర్యం. మీ మేలు ఎప్పటికీ మరచిపోం. – దుర్గాదేవి, కూనలంక, ముమ్మిడివరం మండలం మాకేం లోటు లేదు ఈ నాలుగేళ్లలో జగనన్న వచ్చిన దగ్గర నుండి మా పేదలందరం ఎంతో సంతోషంగా ఉన్నాం. మాకేం లోటు లేదు. కలెక్టర్ నుండి వలంటీర్ వరకు ప్రతి ఒక్కరూ ఇంటింటికీ తిరిగి సాయం అందించారు. నిత్యావసరాలు మొదలు భోజనాలు, తాగునీళ్ల దాకా సమస్తం మాకు లోటు లేకుండా పంపించారు. డ్యామేజ్ అయిన ఇళ్లకు రూ.10 వేలు అందించారు. మా లంక గ్రామాల ప్రజలంతా ముఖ్యమంత్రికి రుణపడి ఉంటాం. – పోతుల భారతి, కొండుకుదురులంక గ్రామం, తొత్తరమూడివారిపేట, అయినవిల్లి మండలం మాట నిలబెట్టుకున్నారు జగనన్న పాలనలో మాకెప్పుడూ అన్నివిధాలా సహాయ సహకారాలు అందుతున్నాయి. అమ్మ ఒడి, విద్యాదీవెన వస్తున్నాయి. ఎంత వరకూ కావాలన్నా చదువుకోండి చదివిస్తాను అని చెప్పిన మాట నిలబెట్టుకున్నారు. వరద సహాయక చర్యల్లో ఏ లోపం లేకుండా సమస్తం మాకు అందించి ఆదుకున్నందుకు ప్రభుత్వానికి, జగనన్నకు ధన్యవాదాలు. – పట్టా రజనీ, పొట్టిలంక మళ్లీ మీరే సీఎం కావాలి మీ నాన్నగారు నాకు చాలా మేలు చేశారు. నిమ్స్ ఆస్పత్రిలో ఆపరేషన్ చేయించుకుంటే అటెండర్లను పంపించారు. 16 ఏళ్లు అయ్యింది. బాగా ఉన్నాను. మీరు వచ్చాక íపింఛన్ అందుతోంది. వరద వచ్చినప్పుడల్లా వెంటనే 25 కేజీల బియ్యం, పప్పు, ఆయిలు, ఉల్లిపాయలు, బంగాళదుంపలు ఇస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో కూడా మీరు గెలిచి మళ్లీ సీఎంగా రావాలి. – నల్లా వెంకాయమ్మ, కూనలంక, ముమ్మిడివరం మండలం జగనన్న పాలన ఒక వరం జగనన్న పంపిన అధికార యంత్రాంగం ఉరుకులు పరుగులు పెడుతూ వచ్చి వరదల సమయంలో మమ్మల్ని ఆదుకుంది. అందుకు మా కొండుకుదురు ప్రజలంతా ముఖ్యమంత్రికి రుణపడి ఉంటాం. మా ఎమ్మెల్యే, కలెక్టర్, రెవిన్యూ సిబ్బంది, సచివాలయ సిబ్బంది, వలంటీర్లు అందరూ మాకు వెన్నంటి నిలిచారు. ఇలాంటి వ్యవస్థను ఏర్పాటు చేసిన జగనన్న పాలన మావంటి వారికి ఒక వరం. – నక్కా శ్రీనివాస్, పొట్టిలంక మీరే వస్తారని అనుకోలేదు వరదల సమయంలో చాలా కష్టపడుతున్నాం. పశువులకు మేత అందక మా మగవాళ్లు ఇతర ప్రాంతాలకు వెళ్లి మేత తెస్తున్నారు. అప్పుడు మీరే మేత పంపి చాలా మంచి పని చేశారు. ఈసారి రెండు రోజులు అన్నం పెట్టారు. తినని వాళ్లకు బతిమాలి అన్నం పెట్టారు. మా జగన్ ఉండగా మాకు లోటు ఉండదు. గతంలో ఎంతోమంది వచ్చి రోడ్డు మీద నుంచే వెళ్లేవారు. మా బిడ్డ మా దగ్గరకు ఇలా వస్తారని అనుకోలేదు. ఎంతో సంతోషంగా ఉంది. – బుద్దా నాగవేణి, కూనలంక, ముమ్మిడివరం మండలం మా గ్రామానికి వచ్చిన తొలి సీఎం మీరే ఎన్నిసార్లు వరద వచ్చి మా ఊళ్లు మునిగినా ఒక్క ముఖ్యమంత్రి కూడా మా గ్రామానికి వచ్చిన పాపాన పోలేదు. మా దగ్గరకు వచ్చి మా బాగోగులు అడిగిన తొలి ముఖ్యమంత్రి మీరే. మాకు ఏం కావాలో అది ఇచ్చారు. నవరత్నాలన్నింటిని ఇంటి వద్దకే వచ్చి ఇస్తున్నారు. చమురు సంస్థల నుంచి మత్స్యకార భరోసా ఇచ్చిన మీకు జీవితాంతం రుణపడి ఉంటాము. – శేరు గంగ, లంకాఫ్ ఠానేల్లంక,ముమ్మిడివరం మండలం -
ఈనాడు బురద రాతలు.. వరద సహాయక చర్యలపైనా అక్కసు
సాక్షి, అమరావతి/ సాక్షి, పాడేరు: గతంలో ఎప్పుడూ లేనివిధంగా ఎంతో ముందుచూపుతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పకడ్బందీగా వరద సహాయక చర్యలు చేపట్టడమే రామోజీరావు అక్కసుకు కారణమైంది. ఎలాంటి నష్టం జరగకుండా, ఏ లోటూ లేకుండా వరద బాధితులు పునరావాస కేంద్రాల్లో సురక్షితంగా ఉండటం చూసి ఆయన తట్టుకోలేక కన్నీటి వరద కారుస్తున్నారు. సీఎం వైఎస్ జగన్ నిరంతర పర్యవేక్షణలో గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అధికార యంత్రాంగం మొత్తం గోదావరి వరద బాధితులకు సహాయక చర్యల్లో నిమగ్నమైనా ఈనాడు మాత్రం అవి కనపడకుండా కళ్లు మూసుకొని, అధికార యంత్రాంగం మొద్దునిద్రలో ఉన్నట్లుగా భ్రమిస్తోంది. ఆ భ్రమలనే వార్తలుగా మలచి సీఎం వైఎస్ జగన్ పైన, ప్రభుత్వం పైన రకరకాల పచ్చి అబద్ధాలు ప్రచారం చేస్తోంది. వరదల సమాచారం అందిన వెంటనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధికారులను అప్రమత్తం చేశారు. జూలై 28వ తేదీన ప్రభావిత జిల్లాల కలెక్టర్లు, రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. వరదల వల్ల ఏ ఒక్కరూ ఇబ్బంది పడకూడదని స్పష్టం చేశారు. అవసరమైన అన్ని చర్యలు ఆగమేఘాలపై తీసుకునేలా యంత్రాంగాన్ని నడిపించారు. చదవండి: ‘టీడీపీ కార్యాలయంలో జై జగన్ నినాదాలు’ గ్రామ వలంటీర్ నుంచి సచివాలయాల సిబ్బంది, ఐఏఎస్ అధికారులు, రెవెన్యూ, ఇతర శాఖల సిబ్బంది వరద ప్రభావిత గ్రామాల్లోనే మకాం వేసి సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. గత ప్రభుత్వంలోకంటె ఇప్పుడు ఎంతో మిన్నగా వరద సహాయక చర్యలు చేపట్టారు. ఏ ప్రాంతానికి వెళ్లినా ఇవి స్పష్టంగా కనిపిస్తున్నాయి. చింతూరు పునరావాస కేంద్రంలో కూరగాయలు పంపిణీ చేస్తున్న సిబ్బంది 85 పునరావాస కేంద్రాలకు 49 వేల మంది తరలింపు వరద ప్రభావిత ఐదు జిల్లాల్లో 237 గ్రామాల్లోని 49,262 మందిని 85 పునరావాస కేంద్రాలకు తరలించారు. 10 లాంచీలు, 230 బోట్లతో బాధితుల్ని పెద్దఎత్తున తరలించే దృశ్యాలు అన్ని చోట్లా కనిపిస్తూనే ఉన్నాయి. పది ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలతో ప్రజలకు సేవలందిస్తున్నారు. ప్రభుత్వ సిబ్బంది ముంపు గ్రామాల్లో తిరుగుతూ అందరినీ పునరావాస కేంద్రాలకు తరలించారు. పునరావాస కేంద్రాల్లో అన్ని సౌకర్యాలూ కల్పించారు. తా గునీరు, నిత్యావసరాలకు ఎటువంటి లోటు లేకుండా ఏర్పాట్లు చేశారు. అంటువ్యాధులు ప్రబలకుండా బ్లీచింగ్, ఫాగింగ్ వంటి పారిశుధ్య చర్యలు చేపట్టారు. అవసరమైన వారికి వెంటనే వైద్యం అందించేందుకు వైద్య బృందాలను నియమించారు. బాధితులకు సచివాలయ సిబ్బంది, వలంటీర్లు ప్రతి క్షణం అందుబాటులో ఉంటున్నారు. బాధితులకు నిత్యావసరాలకు లోటు రాకుండా అన్ని రకాల సరకులని స్టాక్ పాయింట్లకు ముందే పంపించారు. ప్రతి బాధిత కుటుంబానికి 25 కిలోల బియ్యం, కిలో కందిపప్పు, ఉల్లిపాయలు, బంగాళాదుంపలు, లీటర్ పామాయిలు ఇస్తున్నారు. ముందే రూ.12 కోట్లు విడుదల వరద సహాయక చర్యల కోసం సీఎం జగన్ 5 జిల్లాలకు తక్షణమే రూ.12 కోట్లు విడుదల చేశారు. గతంలో ఎప్పుడూ ఇలా వరదల సమయంలోనే ముందుగా నిధులు విడుదల చేయలేదు. చంద్రబాబు హయాంలో వరదలు వచ్చి, అంతా మునిగిపోయి ప్రజలు గగ్గోలు పెట్టిన తర్వాత అరకొరగా నిధులిచ్చేవారు. దీంతో జిల్లా కలెక్టర్లు రకరకాల ఇబ్బందులు పడేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేకుండా సహాయక చర్యల ప్రారంభానికి ముందే నిధులిచ్చే సంప్రదాయానికి సీఎం జగన్ శ్రీకారం చుట్టారు. వరద బాధితులకు అందించే ప్రత్యేక ఆర్తిక సాయం విషయంలోనూ సీఎం సరికొత్త రీతిలో ముందుకెళుతుండడం ఈనాడుకు మింగుడుపడడంలేదు. చంద్రబాబు హయాంలో ఈ ప్రత్యేక సాయం ఊసే ఉండేది కాదు. వరద తగ్గిన తర్వాత తెలుగు తమ్ముళ్లు బాధితులకు ఇచ్చినట్లు రాసేసుకుని ఆ సొమ్ముని మింగేసేవారు. ఇప్పుడు అలాంటివేమీ లేకుండా వరద తగ్గిన తర్వాత బాధితులు తిరిగి ఇళ్లకు వెళ్లేటప్పుడు రూ.1,000 నుంచి రూ. 2,000 ఆర్థిక సాయం అందిస్తున్నారు. వరదల వల్ల దెబ్బతిన్న ఇళ్లకు ఇచ్చే పరిహారాన్ని కూడా సీఎం వైఎస్ జగన్ రూ.10 వేలకు పెంచారు. గతంలో ఇది రూ.5 వేలు మాత్రమే. అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఇవేమీ కనిపించని ఈనాడు ఈనాడు బృందం తిరిగినట్లుగా చెప్పుకొంటున్న అల్లూరి సీతారామరాజు జిల్లాలో ప్రభుత్వ చర్యలు విస్పష్టంగా కనిపిస్తున్నా, అక్కడ ఏదీ జరగనట్లే అబద్ధాలు రాసి, ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారు. వరదలపై ముఖ్యమంత్రి ముందస్తుగా ఆదేశించిన వెంటనే జిల్లా కలెక్టర్ సుమిత్‌కుమార్ పర్యవేక్షణలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు పెద్ద ఎత్తున సహాయక కార్యక్రమాలు చేపట్టారు. కలెక్టర్‌తో సహా అధికార యంత్రాంగం చింతూరులో మకాం వేసింది. వరదపై ప్రజలను ముందుగానే అప్రమత్తం చేసింది. పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసింది. సిద్ధం చేసింది. ఎన్డీఆర్ఎఫ్ బృందాలను కూడా సిద్ధంగా ఉంచింది. చింతూరు డివిజన్లోని నాలుగు మండలాల్లో 177 గ్రామాలు వరదలకు ప్రభావితమవగా 110 పునరావాస కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 24,279 కుటుంబాలను తరలించింది. బాధితులకు సత్వర సాయం వరద బాధితులకు తక్షణ సాయం అందించేందుకు ప్రభుత్వం నాలుగు మండలాల్లో ముందుగానే స్టాక్ పాయింట్లు ఏర్పాటు చేసి నిత్యావసర సరకులను నిల్వ చేసింది. ముంపు ప్రాంతాల్లో జూలై, ఆగస్టు నెలల రేషన్‌ను ముందుగానే పంపిణీ చేసింది. నాలుగు మండలాల్లో సహాయక చర్యల నిమిత్తం రూ.3 కోట్లు మంజూరు చేసింది. ఎలాంటి నష్టం జరగకుండా చర్యలు సీఎం జగన్ ఆదేశాల మేరకు వరద బాధితులకు ఎలాంటి నష్టం జరగకుండా నాలుగు మండలాల్లో ముందస్తు చర్యలు చేపట్టాం. ప్రతి మండలానికి ప్రత్యేకాధికారులను నియమించాం. పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి ప్రజలను సురక్షితంగా తరలించి వారికి నిత్యావసరాలు, కూరగాయలు పంపిణీ చేశాం. గర్భిణులను ముందుగానే సురక్షిత ప్రాంతాలకు తరలించాం. గ్రామాల్లో అంటువ్యాధులు ప్రబలకుండా పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టడంతో పాటు వైద్య శిబిరాలు నిర్వహించాం. గోదావరి, శబరి నదుల్లో వరద తగ్గడంతో ఆయా ముంపు గ్రామాల్లో సహాయక కార్యక్రమాలను మరింత విస్తృతం చేస్తున్నాం. – సుమిత్‌కుమార్, కలెక్టర్, అల్లూరి సీతారామరాజు జిల్లా అన్ని విధాలుగా ఆదుకున్నారు పునరావాస కేంద్రంలో తలదాచుకున్న మాకు ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంది. పక్కా భవనంలో విద్యుత్ సౌకర్యంతో పాటు నిత్యావసరాలు కొరత లేకుండా అందించింది. ప్రభుత్వ సిబ్బంది అందుబాటులో ఉంటూ మా బాగోగులు చూసుకున్నారు – కొండా సరోజిని, చింతూరు అన్ని సౌకర్యాలు కల్పించారు ఇంటి సమీపంలోకి వరద వస్తుండడంతో గురుకుల కళాశాలలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రానికి తీసుకొచ్చారు. ఇక్కడ అన్ని సౌకర్యాలు కల్పించారు. తాగు నీటికి ఇబ్బంది లేదు. బియ్యం, పప్పులు, కూరగాయలు, పాలు అందించారు. – మాటూరి శ్రీనివాసరావు, చింతూరు శబరిఒడ్డు అధికారులు అప్రమత్తం చేశారు వరద సమాచారంపై అధికారులు మమ్మల్ని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేశారు. పునరావాస కేంద్రాలకు తరలించారు. అందరం ఇక్కడ సురక్షితంగా ఉన్నాం. – బొర్రా పద్మారెడ్డి, వడ్డిగూడెం, వీఆర్‌పురం మండలం అధికారుల స్పందన బాగుంది వరదల సమయంలో అధికారుల స్పందన బాగుంది. ప్రభుత్వం చేపట్టిన సహా యక కార్యక్రమాలతో అందరం సురక్షితంగా ఉన్నాం. పునరావాస కేంద్రాల్లో ఉంటున్న మాకందరికీ నీరు, బియ్యం, పాలు సహా అన్నీ అందుబాటులో ఉంచుతున్నారు. ఏ లోటూ రాకుండా చూస్తున్నారు. – యడ్ల బాయమ్మ, టేకులబోరు, కూనవరం మండలం -
ఏపీలో ముమ్మరంగా సాగుతున్న వరద సహాయక చర్యలు.. ఇంకా ఇతర అప్డేట్స్
-
వరద గుప్పిట్లో అనంతపురం
సాక్షి ప్రతినిధి, అనంతపురం/కర్నూలు (అగ్రికల్చర్): భారీ వర్షాలతో అనంతపురం జిల్లా కకావికలమైంది. బుధవారం రాత్రి నుంచి గురువారం వరకు జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురిశాయి. కనీవినీ ఎరుగని రీతిలో అనంతపురంలో 15 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. రాయదుర్గంలో 14.6, బుక్కరాయసముద్రంలో 12, పెద్దపప్పూరులో 11.6, గుత్తిలో 9.8, పుట్లూరులో 8.5, యాడికిలో 8.3 సెంటీమీటర్ల చొప్పున వర్షం కురిసింది. ప్రధానంగా అనంతపురం మండలం కక్కలపల్లి, కాటిగాని కాలువ, కట్టకిందపల్లి, ఆలమూరు, కామారుపల్లి, సజ్జల కాలువ, కురుగుంట, కొడిమి, రాచానపల్లి, ఎ.నారాయణపురం తదితర ప్రాంతాలతో పాటు రుద్రంపేట, చంద్రబాబు కొట్టాల, విమలా ఫారుఖ్‌నగర్, సుందరయ్య కాలనీ, వికలాంగుల కాలనీ, జాకీర్ కొట్టాల, నగరంలోని ఆజాద్‌నగర్, విశ్వశాంతి నగర్, హనుమాన్ కాలనీ, శాంతినగర్, ప్రశాంతి నగర్, రంగస్వామి నగర్, రజక నగర్, ఆదర్శ నగర్, యువజన కాలనీ, నాలుగు, ఐదు, ఆరో రోడ్డు, సోమనాథ నగర్, సుఖదేవ నగర్, శ్రీశ్రీనగర్, గౌరవ్ గార్డెన్, తడకలేరు తదితర ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. వంక పరిసర ప్రాంతాల్లో నివాసముంటున్న ప్రజలను ఇళ్ల నుంచి ఖాళీ చేయించి పునరావాస ప్రాంతాలకు తరలించారు. వరద ఉధృతి కారణంగా చాలా ప్రాంతాలకు రాకపోకలు స్తంభించిపోయాయి. బుక్కరాయసముద్రం వద్ద వాగులో సిమెంట్ కంటైనర్ బోల్తాపడింది. అనంతపురం ఐదో రోడ్డులో ఆహార పొట్లాల పంపిణీ ఉమ్మడి కర్నూలులో భారీ వర్షాలు ఉమ్మడి కర్నూలు జిల్లాలో భారీ వర్షాలు కురిశాయి. బుధవారం అర్ధరాత్రి నుంచి గురువారం ఉదయం వరకు సగటున 85.1 మి.మీ. వర్షపాతం నమోదైంది. ఉమ్మడి జిల్లాలో దశాబ్దాల కాలంలో ఇంత భారీ వర్షాలు కురవడం ఇదే మొదటిసారి. దేవనకొండలో రికార్డు స్థాయిలో 160.2 మి.మీ. వర్షం కురిసింది. నందవరంలో 112.6, బనగానపల్లెలో 107.4, పగిడ్యాలలో 98.2, పెద్దకడబూరులో 97.2, గోనెగండ్లలో 96.2, వెల్దుర్తిలో 96.2 మి.మీ. చొప్పున వర్షపాతం నమోదైంది. హంద్రీ నది, వేదావతి నదితోపాటు వాగులు, వంకలు పొంగిపొర్లాయి. భారీ వర్షాలతో వెల్దుర్తి మండలంలో నాలుగు మట్టి మిద్దెలు కూలిపోయాయి. హాలహర్వి మండలం గూళ్యం సమీపంలో వేదావతి నది పొంగిపొర్లడంతో ఆంధ్ర, కర్ణాటక రాష్ట్రాల మధ్య రాకపోకలు స్తంభించిపోయాయి. గాజులదిన్నె ప్రాజెక్టుకు వరదనీరు పోటెత్తింది. దీంతో నాలుగు గేట్లు ఎత్తి 32 వేల క్యూసెక్కుల నీటిని హంద్రీ నదిలోకి విడుదల చేస్తున్నారు. కర్నూలు నగరంలో భారీ వర్షం కురవడంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. సీఎం చొరవతో సహాయక చర్యలు వేగవంతం అనంతపురంలో జిల్లాలోని వరద పరిస్థితిపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమీక్షించడంతో సహాయక చర్యలు మరింత వేగం పుంజుకున్నాయి. అన్ని శాఖల సమన్వయంతో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి బాధిత ప్రజలకు అన్న పానీయాలు, నిత్యావసర వస్తువులు, మందులు అందజేస్తున్నారు. స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉషశ్రీ చరణ్, ఎంపీ గోరంట్ల మాధవ్, ఎమ్మెల్యేలు అనంత వెంకటరామిరెడ్డి, తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి, మేయర్ వసీం, కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి, ఎస్పీ ఫక్కీరప్ప తదితరులు లోతట్టు ప్రాంతాల్లో బాధితులను పరామర్శించి సహాయక కార్యక్రమాలను పర్యవేక్షించారు. వరద బాధితులకు ప్రభుత్వం అన్నివిధాలా అండగా ఉంటుందని మంత్రి ఉషశ్రీ చరణ్ పేర్కొన్నారు. -
వేగంగా.. ఉదారంగా..
సాక్షి, అమరావతి: ఇటీవల గోదావరిని వరదలు రెండుసార్లు ముంచెత్తినా రాష్ట్ర ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన స్పందించి సహాయక చర్యలు చేపట్టడం ద్వారా ప్రాణనష్టాన్ని భారీగా తగ్గించగలిగింది. గతంలో ఎన్నడూ లేనివిధంగా వరద బాధితులకు ఆపన్న హస్తం అందించి అందరి మన్ననలు అందుకుంది. వరద హెచ్చరికలు జారీ అయిన మరుక్షణం నుంచే అప్రమత్తమై పక్కాగా సహాయక చర్యలు ప్రారంభించింది. ముంపు బాధితుల్ని పునరావాస కేంద్రాలకు తరలించడం నుంచి తిరిగి ఇంటికి వెళ్లే వరకు బాధ్యతగా అన్ని సౌకర్యాలు కల్పించింది. ఈ సంవత్సరం జులై, ఆగస్టు నెలల్లో రెండుసార్లు గోదావరి మహోగ్ర రూపం దాల్చింది. అల్లూరి సీతారామరాజు, అంబేద్కర్ కోనసీమ, ఏలూరు, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలపై తీవ్ర ప్రభావం చూపింది. సీఎం జగన్ సూచనలతో అధికార యంత్రాంగం లక్షలాది మందిని ఆదుకుంది. గతంలో విపత్తులు వచ్చినా వెంటనే ఆర్థికసాయం అందిన దాఖలాల్లేవు. పరిహారం కోసం నెలలు, సంవత్సరాలు ఎదురుచూసేవారు. చంద్రబాబు హయాంలో తిత్లీ తుపాను పరిహారం కోసం ఏడాదిపాటు ఎదురుచూడాల్సి వచ్చింది. కానీ, ఇప్పుడు జగన్ సర్కారు వెంటనే ఉదారంగా పరిహారాన్ని అందించి బాధితులకు భరోసా కల్పించింది. గోదావరి వరదల సమయంలో సహాయం అందిస్తున్న ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది(ఫైల్) శరవేగంగా సాయం పంపిణీ బాధితులను ఆదుకునేందుకు సహాయక చర్యలు శరవేగంగా చేపట్టినా వరద ప్రభావం, ఇళ్లు కూలిపోవడంతో ఏడుగురు మృత్యువాత పడ్డారు. వారి కుటుంబాలకు రూ.4 లక్షల చొప్పున రూ.28 లక్షల ఎక్స్‌గ్రేషియాను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అందించింది. ఇక 45 మండలాల్లో 467 గ్రామాలు వరద ప్రభావానికి గురయ్యాయి. 389 గ్రామాలు ముంపుబారిన పడ్డాయి. అల్లూరి సీతారామరాజు జిల్లాలోనే 205 గ్రామాలు ముంపు బారినపడ్డాయి. ఈ గ్రామాల నుంచి 1.50 లక్షల మందిని ప్రభుత్వం సురక్షిత ప్రాంతాలకు తరలించింది. ముంపు గ్రామాల నుంచి బోట్ల ద్వారా తరలించడానికి రూ.5.17 కోట్లు ఖర్చుచేసింది. ఇందుకోసం ప్రత్యేకంగా రెండు వేల బోట్లను అద్దెకు తీసుకుంది. 195 పునరావాస కేంద్రాలు ఏర్పాటుచేసి ప్రతిరోజు సగటున 1.07 వేల మందికి తాత్కాలికంగా ఆశ్రయం కల్పించింది. అక్కడ వారికి భోజనం, దుస్తులివ్వడంతోపాటు వైద్యసేవలు అందించింది. నిత్యావసరాలూ పంపిణీ చేసింది. ఇందుకోసం రూ.12.22 కోట్లు ఖర్చుచేసింది. వేగంగా పంట నష్టం అంచనా ఇక పంట నష్టం అంచనానూ శరవేగంగా నిర్వహిస్తోంది. గతంలో ఎప్పుడూలేని విధంగా ఏ సీజన్లో జరిగిన నష్టాన్ని ఆ సీజన్లోనే ఇవ్వాలన్న విధానపరమైన నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న విషయం తెలిసిందే. ఇందుకు అనుగుణంగా వచ్చే సీజన్ ఆరంభమయ్యేలోగానే ఇన్పుట్ సబ్సిడీని అందించాలన్న దృఢసంకల్పంతో సర్కారు ఉంది. అక్టోబర్‌లోగా ఇచ్చేందుకు కసరత్తు చేస్తోంది. ఎప్పుడూలేని విధంగా తక్షణ సాయం ఇక వరద తగ్గాక శిబిరాల నుంచి ఇంటికి వెళ్లేటప్పుడు బాధిత కుటుంబాలకు గతంలో ఎప్పుడూ లేనివిధంగా రాష్ట్ర ప్రభుత్వం తక్షణ సాయం కింద నగదు అందించింది. ► 94,715 కుటుంబాలకు వెయ్యి నుంచి రూ.2 వేల చొప్పున పంపిణీ చేసింది. ► ఒక లక్షా 966 కుటుంబాలకు 25 కేజీల బియ్యం, కేజీ చొప్పున కందిపప్పు, ఉల్లిపాయలు, బంగాళాదుంపలు, లీటర్ ఆయిల్‌ను పంపిణీ చేసింది. ► 2,429 టన్నుల బియ్యాన్ని రూ.3.84 కోట్ల ఖర్చుతో పంపిణీ చేసింది. ► వరద ధాటికి గుడిసెలు దెబ్బతిన్న 14,731 కుటుంబాలకు రూ.10 వేల చొప్పున మొత్తం రూ.14.73 కోట్ల సాయం అందించింది. ► ఇళ్లు దెబ్బతిన్న 4,509 కుటుంబాలకు రూ.15.16 కోట్ల పరిహారాన్ని ఇచ్చింది. ► పశువుల పాకలు కూలిపోయిన రైతులకు రూ.2,100 చొప్పున 10 మందికి రూ.21 వేలు అందించింది. ► 543 వైద్య శిబిరాలు ఏర్పాటుచేసి వైద్య పరీక్షలు చేయించింది. ► ముంపు ప్రాంతాల్లో ముందస్తుగా పారిశుధ్య చర్యలు చేపట్టి జ్వరాలు, అంటువ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకుంది. దోమలు పెరగకుండా ఫాగింగ్, బ్లీచింగ్ చల్లారు. ఇందుకోసం రూ.41 లక్షలు వినియోగించింది. ► ఇక రోడ్లు, డ్రెయిన్లు, ఇళ్లలో పేరుకుపోయిన బురద, చెత్త, ఇతర వ్యర్థాలను కార్మికులు తొలగించారు. ► ముంపు ప్రాంతాల్లో తాగునీటి సరఫరా పథకాలు దెబ్బతినడంతో యుద్ధప్రాతిపదికన ప్రత్యామ్నాయ ఏర్పాట్లుచేసింది. రూ.12.4 కోట్లతో ట్యాంకర్లు, అద్దె బోట్ల ద్వారా నీటిని అందించింది. ► దెబ్బతిన్న తాగునీటి సరఫరా వ్యవస్థలు, పారిశుధ్య వ్యవస్థలు, రోడ్లు, నీటిపారుదల వ్యవస్థల పునరుద్ధరణ కోసం రూ.18 కోట్లు ఖర్చుచేసింది. సహాయక చర్యల్లో 40 వేల మంది.. మరోవైపు.. వరద సహాయక చర్యల్లో గతంలో ఎన్నడూలేని విధంగా 40 వేల మందికిపైగా అధికారులు, సిబ్బంది పాలుపంచుకున్నారు. వరద హెచ్చరికలు మొదలైనప్పటి నుంచి సీఎం సహా ప్రభుత్వ యంత్రాంగమంతా అప్రమత్తమైంది. ఆరు జిల్లాల్లో ఆరుగురు కలెక్టర్లు, ఆరుగురు జేసీలు, ఆరుగురు ఎస్పీలు పక్కా ప్రణాళికతో విపత్తును ఎదుర్కొన్నారు. రెవెన్యూ అధికారులు, సిబ్బంది కలిసి 1,235 మంది.. గ్రామ సచివాలయ సిబ్బంది 8,960 మంది, గ్రామ వలంటీర్లు 13,241 మంది, పారిశుధ్య సిబ్బంది 2,650 మంది, వైద్య సిబ్బంది 1,294 మంది, బోటు డ్రైవర్లు, సహాయకులు 631 మంది ప్రత్యక్షంగా సహాయక చర్యల్లో పాల్గొన్నారు. వీరంతా కలిపి మొత్తం 28,029 మంది పనిచేశారు. వీరుకాక.. పోలీసులు, ఫైర్ సర్వీసెస్, పశు సంవర్థక, ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ తదితర శాఖల అధికారులు, సిబ్బంది మరో 10 వేల మందికిపైగా సహాయక చర్యల్లో నిరంతరాయంగా సేవలందించారు. ఇలా వరద బాధితులను ఎక్కడికక్కడ శరవేగంగా ఆదుకున్న తీరుపై సర్వత్రా సంతృప్తి వ్యక్తమైంది. -
సహాయం.. శరవేగం
సాక్షి, అమరావతి: గోదావరి వరద ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. వరద తీవ్రత తగ్గినా ఇంకా కొనసాగుతుండటంతో సహాయక చర్యల విషయంలో ప్రభుత్వం రాజీ పడకుండా ముందుకెళుతోంది. బాధితులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని చర్యలు తీసుకుంటోంది. 6 జిల్లాల్లో పరిధిలోని 62 మండలాలు, 727 గ్రామాల్లో అధికార యంత్రాంగం విరామం లేకుండా.. విశ్రమించకుండా పని చేస్తూనే ఉంది. 324 గ్రామాలు పూర్తిగా ముంపు బారినపడగా.. 403 గ్రామాల్లోకి వరద నీరు చేరింది. అల్లూరి సీతారామరాజు జిల్లాలో అత్యధికంగా 143 గ్రామాలు ముంపులో ఉండగా, 165 గ్రామాల్లోకి వరద నీరు చేరింది. ఏలూరు జిల్లాలో 76 గ్రామాలు ముంపులో ఉండగా, 93 గ్రామాల్లోకి నీరు చేరింది. కోనసీమ జిల్లాలో 61 గ్రామాలు మునిగిపోగా, 74 గ్రామాల్లో వరద ప్రభావానికి గురయ్యాయి. వీటితోపాటు తూర్పు, పశ్చిమ గోదావరి, కాకినాడ జిల్లాల్లో సహాయక చర్యలు చురుగ్గా కొనసాగుతున్నాయి. సురక్షిత ప్రాంతాలకు 1.42 లక్షల మంది 324 ముంపు గ్రామాల నుంచి మొత్తం 1,42,655 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అందులో 1,22,920 మంది ప్రభుత్వం ఏర్పాటు చేసిన 217 సహాయక శిబిరాల్లో ఆశ్రయం పొందుతున్నారు. అల్లూరి జిల్లాలోనే 103 సహాయక శిబిరాల్లో 69,112 మంది ఉన్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో 24,152 మంది, ఏలూరు జిల్లాలో 18,707 మంది, కోనసీమ జిల్లాలో 9,236 మంది, కాకినాడ జిల్లాలో 1,243 మంది, తూర్పుగోదావరి జిల్లాలో 470 మంది సహాయ శిబిరాల్లో ఆశ్రయం పొందుతున్నారు. సహాయక శిబిరాలు, వరద నీరు చేరిన గ్రామాల్లో 297 వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి అనారోగ్యానికి గురైన వారికి చికిత్స అందిస్తున్నారు. ముంపు ప్రాంతాల్లో ఇప్పటివరకు 5 లక్షల ఆహార పొట్లాలు, 25 లక్షల మంచినీళ్ల ప్యాకెట్లు పంపిణీ చేశారు. 321 మంది గర్భిణుల తరలింపు ముంపు ప్రాంతాల్లోని గర్భిణులు ఇబ్బందులు పడకుండా వైద్య శాఖ చర్యలు చేపట్టింది. వీరిని ముందే గుర్తించి సమీపంలోని ప్రభుత్వ ఆస్పత్రులు, సురక్షిత ప్రాంతాలకు తరలించింది. ఇప్పటివరకూ నాలుగు జిల్లాల్లో 321 మంది గర్భిణులను ఆస్పత్రులు, సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వీరికి వైద్య సేవలు అందించడం కోసం గైనకాలజిస్ట్, అనస్తీషియా, ఇతర స్పెషాలిటీ వైద్యులను ఇతర జిల్లాల నుంచి తరలించారు. రూ.41.50 కోట్లు విడుదల ముంపు ప్రాంతాల్లో తక్షణ అవసరాల కోసం ప్రభుత్వం రూ.41.50 కోట్లు విడుదల చేసింది. అల్లూరి జిల్లాకు రూ.10.50 కోట్లు, కోనసీమ జిల్లాకు రూ.12 కోట్లు, తూర్పు గోదావరికి రూ.4 కోట్లు, ఏలూరు జిల్లాకు రూ.9 కోట్లు, పశ్చిమ గోదావరి జిల్లాకు రూ.6 కోట్లు విడుదల చేయగా.. ఆయా జిల్లాల కలెక్టర్లు వాటిని సహాయక చర్యలకు వినియోగిస్తున్నారు. ముంపు బారిన పడిన కుటుంబాలకు రూ.వెయ్యి నుంచి రూ.2 వేల సహాయాన్ని అందిస్తున్నారు. బాధితులకు నిత్యావసర సరుకుల పంపిణీ చురుగ్గా సాగుతోంది. ఇందుకోసం ఇప్పటివరకు 944 టన్నుల బియ్యం, 89.89 టన్నుల కందిపప్పు, 60,051 లీటర్ల పామాయిల్, 80,685 లీటర్ల పాలు, 97,701 కేజీల ఉల్లిపాయలు, 97,701 కేజీల బంగాళా దుంపలు వినియోగించారు. మూగజీవాలకు రక్షణగా.. కనీవినీ ఎరుగని స్థాయిలో వరద పోటెత్తినప్పటికీ ఆరు జిల్లాల పరిధిలో మృత్యు వాత పడిన పశువులు కేవలం ఆరు మాత్రమే. పైగా 24 గంటల్లోనే పరిహారం కూడా అందించి పాడి రైతులకు ప్రభుత్వం అండగా నిలిచింది. 6 జిల్లాల పరిధిలో 84,592 పశువులుండగా, వరద ప్రభావానికి గురైన 226 గ్రామాల్లో చిక్కుకున్న దాదాపు 30 వేల పశువులను పశు సంవర్థక శాఖ అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. పునరావాస చర్యల కోసం 124 ప్రత్యేక వైద్య బృందాలను ఏర్పాటు చేశారు. ఇప్పటివరకు 594.95 టన్నుల దాణాను ఉచితంగా పంపిణీ వేశారు. పశువుల ఆరోగ్య పరిరక్షణ కోసం 111 ప్రత్యేక పశువైద్య శిబిరాలను ఏర్పాటు చేశారు. వ్యాధులు సోకకుండా 27,297 పశువులకు హెచ్ఎస్, బీక్యూ, బీటీ, ఈటీ వ్యాక్సినేషన్స్ చేశారు. వరదల వల్ల గాయపడిన 2,254 పశువులకు ప్రత్యేక వైద్య సహాయం అందించారు. రూ.14 లక్షల విలువైన మందులను ఉచితంగా అందించారు. పశువుల దాణా కోసం కోసం పశు సంవర్థక శాఖ రూ.2.41 కోట్లు విడుదల చేసింది. వరద ఉధృతి తగ్గినప్పటికీ ప్రభావిత లంక గ్రామాల్లో వైద్య శిబిరాలను కొనసాగిస్తున్నారు. కనీసం వారం రోజులకు సరిపడా దాణా, పశుగ్రాసం అందించేందుకు ఏర్పాట్లు చేశారు. సహాయక చర్యల్లో 40 వేల మంది గతంలో ఎన్నడూ లేని విధంగా గోదావరి వరద సహాయక చర్యల్లో 40 వేల మందికిపైగా అధికారులు, సిబ్బంది పాలు పంచుకుంటున్నారు. ఇంతకుముందు వరదలు, ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు ఏ ప్రభుత్వం కూడా ఈ స్థాయిలో సహాయక చర్యలకు యంత్రాంగాన్ని వినియోగించిన దాఖలాలు లేవు. కానీ ఈసారి వరద హెచ్చరికలు మొదలైనప్పటి నుంచి సీఎం సహా ప్రభుత్వ యంత్రాంగమంతా హుటాహుటిన అప్రమత్తమైంది. ఆరు జిల్లాల్లో ఆరుగురు కలెక్టర్లు, ఆరుగురు జాయింట్ కలెక్టర్లు, ఆరుగురు ఎస్పీలు పక్కా ప్రణాళికతో వరద విపత్తును ఎదుర్కొన్నారు. రెవెన్యూ అధికారులు, సిబ్బంది కలిసి 1,235 మంది విధుల్లో పాలు పంచుకుంటున్నారు. గ్రామ సచివాలయ సిబ్బంది 8,960 మంది, గ్రామ వలంటీర్లు 13,241 మంది, పారిశుధ్య సిబ్బంది 2,650 మంది, వైద్య సిబ్బంది 1,294 మంది, బోట్ల డ్రైవర్లు, సహాయకులు 631 మంది ప్రత్యక్షంగా వరద సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. వీరంతా కలిపి మొత్తం 28,029 మంది సహాయక చర్యల్లో అలుపు లేకుండా పనిచేస్తున్నారు. వీరుకాకుండా పోలీసులు, ఫైర్ సర్వీసెస్, పశు సంవర్థక, ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ తదితర శాఖల అధికారులు, సిబ్బంది మరో 10 వేల మందికిపైగా సహాయక చర్యల్లో నిరంతరాయం సేవలు అందిస్తున్నారు. మరోవైపు రాష్ట్ర స్థాయిలో విపత్తుల నిర్వహణ శాఖ ఆధ్వర్యంలో నడిచే స్టేట్ ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్ నుంచి విపత్తుల నిర్వహణ సంస్థ ముఖ్య కార్యదర్శి, సీసీఎల్ఏ సాయిప్రసాద్, ఎండీ అంబేడ్కర్‌తో కలిసి ఎప్పటికప్పుడు వరద పరిస్థితిని అంచనా వేస్తూ కలెక్టర్లు, యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. ఇలా సీఎం నుంచి గ్రామ వలంటీర్ వరకు వరద సహాయక చర్యల్లో నిమగ్నమై పనిచేయడంతో ప్రాణ నష్టాన్ని నివారించగలిగారు. -
CM YS Jagan: 48 గంటల్లో సాయం
వరద బాధితులను ఆదుకోవడంలో విరామం లేకుండా అవిశ్రాంతంగా పని చేస్తున్నప్పటికీ కొందరి రాజకీయ ప్రయోజనాల కోసం జరుగుతున్న దురుద్దేశపూర్వక ప్రచారాన్ని తిప్పికొట్టాలని అధికార యంత్రాంగానికి ముఖ్యమంత్రి జగన్ సూచించారు. ‘మీరు చేస్తున్న మంచి పనులు కళ్ల ముందు కనిపిస్తున్నప్పటికీ ఉద్దేశపూర్వకంగా బురద జల్లుతుంటే వెనకడుగు వేయాల్సిన అవసరం లేదు. ముందడుగు వేసి అలాంటి వాటి పట్ల దూకుడుగా వ్యవహరించాలి’ అని నిర్దేశించారు. –ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: గోదావరి వరద బాధిత కుటుంబాలకు 48 గంటల్లోగా రూ.రెండు వేల సాయం అందించడంతోపాటు రేషన్ పంపిణీని పూర్తి చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. ముంపు బారిన పడిన గ్రామాల్లో ఏ ఒక్క ఇల్లూ మిగిలిపోకుండా అందరికీ సాయం అందించాలని అధికార యంత్రాంగానికి నిర్దేశించారు. ఎక్కడా రూ.2 వేల సాయం, రేషన్ అందలేదనే మాటే వినిపించడానికి వీల్లేదని, కలెక్టర్లు, సీనియర్ అధికారులు దీన్ని సవాల్‌గా తీసుకుని పనిచేయాలని స్పష్టం చేశారు. 25 కిలోలు బియ్యం, కిలో కందిపప్పు, కిలో బంగాళాదుంపలు, కిలో ఉల్లిపాయలు, కిలో పామాయిల్‌తో రేషన్ సరుకుల పంపిణీ జరగాలన్నారు. బాధితులు శిబిరాలకు వచ్చినా రాకున్నా.. ముంపునకు గురైన చోట్ల ప్రతి కుటుంబానికీ రూ.2 వేలు, రేషన్ సరుకులు అందాలని స్పష్టం చేశారు. నిత్యావసర వస్తువులు అందుబాటులో ఉండేలా చూసుకోవాలని ఆయన సూచించారు. వరద నీరు క్రమంగా తగ్గుముఖం పడుతున్నందున సహాయ కార్యక్రమాలను ముమ్మరం చేయాలని సూచించారు. స్వార్థ ప్రయోజనాల కోసం కొందరు దురుద్దేశపూరితంగా చేస్తున్న అవాస్తవ ప్రచారాన్ని తిప్పికొట్టాలని అధికార యంత్రాంగానికి సూచించారు. గోదావరి వరద ప్రభావిత జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి సోమవారం సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. హోం, విపత్తుల నిర్వహణశాఖ మంత్రి తానేటి వనిత, సీఎస్ సమీర్‌శర్మ, డీజీపీ కేవీ రాజేంద్రనాథ్‌రెడ్డి, విపత్తుల నిర్వహణశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జి.సాయి ప్రసాద్ తదితరులు ఇందులో పాల్గొన్నారు. సీఎం సమీక్షలో ముఖ్యాంశాలు ఇవీ.. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడుతున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎలాంటి సాయానికైనా సిద్ధం.. మీకు ఇంకా ఏమైనా అవసరమైతే అన్ని రకాలుగా సమకూర్చేందుకు సిద్ధంగా ఉన్నాం. నిధుల సమస్య లేనే లేదు. చురుగ్గా ముందుకు వెళ్లండి. ఎలాంటి సమస్య ఎదురైనా పరిష్కారానికి ఫోన్ కాల్ చేస్తే చాలు. బాధిత కుటుంబాల పట్ల మానవతా ధృక్పథంతో వ్యవహరించండి. ఇప్పటివరకూ ఒకరు మాత్రమే మరణించినట్లు సమాచారం ఉంది. బాధిత కుటుంబానికి వెంటనే పరిహారం అందించండి. ఎక్కడ అవసరం ఉంటే అక్కడ సహాయ శిబిరాలు కొనసాగించాలి. బాధిత కుటుంబాలకు మంచి ఆహారం, తాగునీరు అందించాలి. పారిశుద్ధ్య నిర్వహణ సక్రమంగా ఉండాలి. వరద తగ్గగానే పంట నష్టం అంచనా వరద తగ్గుముఖం పట్టిన వెంటనే 10 రోజుల్లో పంట, ఆస్తి నష్టాలపై అంచనాలు పూర్తి చేయాలి. పశువులకు పశుగ్రాసం, దాణా సక్రమంగా అందించాలి. పశు సంపదకు నష్టం వాటిల్లితే అంచనాలు రూపొందించాలి. గర్భిణుల పట్ల ప్రత్యేక శ్రద్ధ గర్భిణిలు పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించి ఆస్పత్రులకు తరలించాలి. వైద్యాధికారులు, స్పెషలిస్టులు సేవలు అందేలా చర్యలు తీసుకోవాలి. ముంపు తగ్గగానే అంటువ్యాధులు ప్రబలే అవకాశాలున్నందున ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలి. ఆస్పత్రుల్లో తగినంత మంది సిబ్బంది, మందులను సిద్ధంగా ఉంచాలి. రక్షిత తాగునీటి సరఫరాను అవసరమైన ప్రాంతాలకు కొనసాగించాలి, క్లోరినేషన్ కొనసాగించండి. అన్ని మంచినీటి పథకాలను ఒకసారి పరిశీలించడంతో పాటు మరమ్మతులు అవసరమైతే వెంటనే చేయించండి. అదనపు సిబ్బంది తరలింపు.. వరద బాధిత ప్రాంతాలకు పక్క జిల్లాల నుంచి పారిశుద్ధ్య సిబ్బందిని తరలించి ముమ్మరంగా పనులు చేపట్టాలి. ఇతర జిల్లాల నుంచి తరలించేటప్పుడు సిబ్బంది వసతి, భోజన సదుపాయాలకు లోటు రాకుండా చూసుకోవాలి. పంచాయతీరాజ్, మునిసిపల్ శాఖల విభాగాధిపతులు దీన్ని దృష్టిలో ఉంచుకోవాలి. మురుగునీటి కాలువల్లో పూడిక తీత కార్యక్రమాలు చేపట్టాలి. నీరు తగ్గగానే కల్వర్టులు, బ్రిడ్జిలను క్షుణ్నంగా పరిశీలించి అవసరమైన మరమ్మతులు, నిర్మాణాలు చేపట్టాలి. కరకట్ట పరిశీలన.. పూడికతీత గోదావరి కరకట్ట బలహీనంగా ఉన్నచోట ప్రత్యేక శ్రద్ధ వహించాలి. పెట్రోలింగ్ నిరంతరం కొనసాగాలి. అన్ని డ్రెయిన్ల ముఖద్వారాలు మూసుకుపోయే అవకాశం ఉన్నందున పూడిక తొలగింపు పనులు చేయాలి. గట్లు, కాల్వలకు ఎక్కడైనా గండ్లు పడితే వెంటనే పూడ్చి వేయాలి. తక్షణం విద్యుత్తు పునరుద్ధరణ వరద బాధిత ప్రాంతాల్లో విద్యుత్ పునరుద్ధరణ, మరమ్మతుల పనులకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలి. వచ్చే 48 గంటల్లో ఈ సమస్యను పరిష్కరించాలి. పలు స్కూళ్లు, ప్రభుత్వ కార్యాలయాల్లో శిబిరాలను నిర్వహిస్తున్నందున తిరిగి అప్పగించేటప్పుడు పరిశుభ్రంగా అప్పగించాలి. అందుబాటులో అత్యుత్తమ వ్యవస్థ.. గతంలో రెండు జిల్లాలకు కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, ఎస్పీలు ఇద్దరు చొప్పున మాత్రమే ఉన్నారు. ప్రస్తుతం కాకినాడతో కలిపి ఆరుగురు కలెక్టర్లు, ఆరుగురు జేసీలు, ఆరుగురు ఎస్పీలున్నారు. సచివాలయాల వ్యవస్థ కూడా మీకు అందుబాటులో ఉంది. ప్రతి సచివాలయంలో 10 మంది ఉద్యోగులున్నారు. ప్రతి 50 ఇళ్లకూ ఒక వలంటీర్ ఉన్నారు. అందుబాటులో ఉన్న ఇలాంటి అత్యుత్తమ వ్యవస్థ ద్వారా నాణ్యమైన సేవలు అందించాలి. పంపిణీ ముమ్మరం చేయాలి. ఈ వ్యవస్థ ద్వారా ఎప్పుడూ జరగని విధంగా సహాయ కార్యక్రమాలు చేస్తున్నాం. గతంలో ఎప్పుడూ రూ.2 వేలు ఆర్థిక సాయం చేయలేదు. మన నైతిక స్థైర్యాన్ని దెబ్బ తీసేందుకు చంద్రబాబు, ఈనాడు, టీవీ–5, ఆంధ్రజ్యోతి, పవన్‌కళ్యాణ్ లాంటివారు బురద జల్లుతున్నారు. వీరంతా రాష్ట్ర ప్రతిష్ట, అధికారుల ప్రతిష్టను దెబ్బతీయడానికి ప్రయత్నిస్తున్నారు. కొందరికి రాజకీయ ప్రయోజనాలు చేకూర్చేందుకు ఇలాంటి ప్రచారాలు చేస్తారు. బురద జల్లడానికి నానా రకాలుగా ప్రయత్నిస్తున్నారు. మీరు మంచి చేస్తున్నప్పుడు వెనకడుగు వేయాల్సిన అవసరంలేదు. ఇలాంటి వాటిని తిప్పికొట్టాలి. దురుద్దేశ పూర్వకంగా చేసే ప్రచారాన్ని తిప్పికొట్టాలి. వదంతులను కూడా తిప్పికొట్టాలి. -
కళ్లెదుట సాయం కనిపిస్తున్నా... ఈనాడు కబోది రాతలు
ఏది నిజం? ఆరుగురు కలెక్టర్లు... ఆరుగురు జాయింట్ కలెక్టర్లు... ఆరుగురు ఎస్పీలు... వారం రోజులుగా ఉరుకులు పరుగులు పెడుతున్నారు. దాదాపు 30వేల మంది గ్రామ సచివాలయాల సిబ్బంది... వలంటీర్లు కలిసి ఓ సైన్యంలా అహర్నిశలూ పనిచేశారు. 90 శాతానికి పైగా యువకులతోనే నిండిన వైద్య బృందాలు శక్తివంచన లేకుండా ముంపు ప్రాంతాలకు పరుగులు పెడుతూ సేవలందించాయి. ముఖ్యమంత్రి గోదావరి గట్టున కూర్చుని హడావుడి చేయలేదు. సహాయ కార్యక్రమాలకు అడ్డు తగల్లేదు. తాను స్వయంగా ఏరియల్ సర్వే చేసి... నిత్యం అధికారులతో సమీక్షించారు. ప్రతి ఒక్క బాధితుడినీ మానవతా దృక్పథంతో ఆదుకోవాలని, మీరే ఆ స్థానంలో ఉంటే ఏమాశిస్తారో అవన్నీ వారికి చేయాలంటూ దిశానిర్దేశం చేశారు. ఎప్పటికప్పుడు అధికారులకు ఆదేశాలిచ్చారు. మంత్రులు అధికారులతో సమీక్షించటమే కాక... ముంపు ప్రాంతాల్లోనే ఉన్నారు. ఆయా ప్రాంతాల్లో స్వయంగా సహాయ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సారి గోదావరికి ‘నభూతో..’ అనే తరహాలో ప్రళయంలా వరదలొచ్చాయి. అది కూడా అనూహ్యంగా జూలైలో!!. 70 ఏళ్లు దాటిన వృద్ధులు సైతం... తాము పుట్టాక ఎన్నడూ ఇంతటి విపత్తు చూడలేదని వాపోయారంటే పరిస్థితి తేలిగ్గానే అర్థమవుతుంది. అంతటి విపత్తును సైతం... ఒక్క ప్రాణం కూడా నష్టపోకుండా ప్రభుత్వ యంత్రాంగం సమర్థంగా అధిగమించింది. పెద్దగా ప్రచారార్భాటాలు లేకుండానే అంతటి విలయాన్నీ తేలిగ్గా దాటగలిగింది. అదే వై.ఎస్.జగన్మోహన్రెడ్డి కాకుండా ఏ చంద్రబాబు నాయుడో అధికారంలో ఉంటే... ‘ఈనాడు’, దాని తోకపత్రిక, ఇతర ఎల్లో మీడియా కలిసి దీన్నో అరుదైన రికార్డుగా అభివర్ణించేవి. చంద్రబాబుకు తప్ప ఈ భూమ్మీద పుట్టిన మానవమాత్రుడెవ్వడికీ ఇంతటి సమర్థత సాధ్యం కాదని కీర్తించేవి. కాకపోతే ఇప్పుడు అధికారంలో ఉన్నది వై.ఎస్.జగన్ మోహన్‌రెడ్డి. కాబట్టి ప్రశంసల్లేవు సరికదా.. వరదొచ్చిన మొదటి రోజు నుంచీ ఒకటే పాట. సహాయ కార్యక్రమాలు సరిగా జరగటం లేదని, బాధితులకు కనీసం ఆహారం కూడా అందటం లేదని!!. పైపెచ్చు చంద్రబాబు నాయుడి హయాంతో పోలిక. అప్పట్లో పునరావాస శిబిరాలు ఏర్పాటు చేస్తే భోజనంతో పాటు పిల్లలకు పాలు, బిస్కెట్లు కావలసినన్ని ఇచ్చేవారంటూ కథనాలు. అసలు చంద్రబాబు హయాంలో ఎప్పుడు చూసినా కరువే తప్ప వరదలొచ్చింది ఎన్నడు? నిజంగా చంద్రబాబు హయాంలో ఇలాంటి పరిస్థితులొస్తే ఏమైనా చేశారా? అప్పటికీ, ఇప్పటికీ తేడాలేంటి? ‘‘పిల్లలకు పాలచుక్క లేదు.. పెద్దలకు తిండి లేదు’’ అంటూ రామోజీరావు రాసిన విషపు రాతల్లో నిజమెంత? ఏది నిజం? చంద్రబాబునాయుడి హయాంతో పోలిస్తే ఇప్పుడు జిల్లాల సంఖ్య రెండు నుంచి 6కు పెరిగింది. ఫలితంగా ఆరుగురు కలెక్టర్లు, అదే సంఖ్యలో జేసీలు, ఎస్పీలు అందుబాటులోకి వచ్చి సహాయ కార్యక్రమాలను ముందుండి నడిపించారు. గ్రామసచివాలయాలు గానీ, వలంటీర్లు గానీ అప్పట్లో లేనేలేరు. వీరి రూపంలో ఈ జిల్లాల నుంచి దాదాపు 30 వేల మందికిపైగా సైన్యం విరామమన్నది లేకుండా శ్రమించింది. ఇక శిబిరాల నుంచి వెళ్లేటపుడు బాధితులకు రూ.2వేలు ఇవ్వటమనేదీ లేదు. ప్రతి కుటుంబానికీ 25 కిలోల రేషన్‌తో పాటు కందిపప్పు, నూనె, ఉల్లిపాయలు ఇతర రేషన్ సరుకులు అందజేశారు. మరి ఇవేమీ లేకున్నా చంద్రబాబు హయాంలో అన్నీ అత్యద్భుతంగా చేశారని ఎలా రాస్తారు రామోజీరావు గారూ? పాఠకులంటే మరీ అంత చులకనా? రేపటి నుంచి వరద ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటిస్తారు కనక... దానికి తగ్గ రంగాన్ని సిద్ధం చేయటమే మీ వార్తల ఎజెండా అని చిన్నపిల్లాడిక్కూడా తెలుస్తూనే ఉంది? మీరు అచ్చోసిన వార్తలు చూపిస్తూ... బాధిత ప్రాంతాల్లో మీ మీడియా సమక్షంలో చంద్రబాబు చెలరేగిపోతారని... మళ్లీ మీరే వాటిని పతాక శీర్షికల్లో మరోసారి అచ్చు వేస్తారని తేలిగ్గా అర్థమవుతూనే ఉంది. అయినా క్షేత్ర స్థాయిలోని వాస్తవాలను తొక్కిపట్టి మీరేం చెబితే అది నమ్మటానికి ఇది 1990ల కాలం అనుకుంటున్నారా? ఎక్కడికక్కడ జరుగుతున్న కార్యక్రమాలు జనానికి తెలుస్తూనే ఉన్నాయి. వలంటీర్ల నుంచి ప్రతి ఒక్కరూ ప్రజలకు వాస్తవ సమాచారాన్ని చేరవేస్తూనే ఉన్నారు. అధికారులు పక్కా ప్రణాళికతో వెళ్ళారు కనకే... గోదావరికి ముందస్తుగా వరదలొచ్చినా... గతంలో ఏ ప్రభుత్వమూ చేయని విధంగా ఆఘమేఘాల మీద స్పందించి పక్కా ప్రణాళికతో వెళ్లారు. ప్రభుత్వం తక్షణం నిధులు విడుదల చేయటంతో కలెక్టర్లు వాటిని విత్‌డ్రా చేసుకుని సహాయ కార్యక్రమాల్లో వినియోగించారు. ఊళ్లు మునగక ముందే వాటిని ఖాళీ చేయించారు. లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు చేర్చారు. లక్ష మందికిపైగా బాధితుల్ని సహాయ శిబిరాల్లో ఉంచి వారికి భోజన సౌకర్యాలు ఏర్పాటు చేశారు. పిల్లలకు పాలు, బిస్కట్లు ఇచ్చారు. 6 జిల్లాల్లో ఏర్పాటు చేసిన 217 సహాయ శిబిరాలు... అందులో ఉన్న 1,00,775 మంది జనమే దీనికి నిదర్శనం. సహజంగానే ఇవేవీ ‘ఈనాడు’కు కనిపించలేదు. తొలిరోజు నుంచీ ఇప్పటివరకూ వీటి వంకే చూడని ‘ఈనాడు’... ఎక్కడో దూరంగా సొంత టెంట్లు వేసుకుని ఉన్నవారిని పలకరించి... వారిలో కూడా ఒకరిద్దరికి ఎక్కడైనా భోజనాలు అందలేదేమో వెదికి... వారినే ఉదాహరణగా చూపిస్తూ మొత్తం పరిస్థితి ఇలాగే ఉందంటూ విషం చిమ్మటానికి పూనుకుంది. ఇంతటి భారీ విపత్తులొచ్చినపుడు ఎక్కడో ఒక మూలన ఒకరిద్దరికి సాయం అందకపోయే అవకాశాలుండొచ్చు. ప్రభుత్వ యంత్రాంగం వారిని గుర్తించలేకపోయి ఉండొచ్చు. తాము బంధువుల ఇంట్లో ఉన్నా కూడా... భోజనాల సమయానికి శిబిరాలకు వెళ్లి తెచ్చుకున్నామని కొన్ని వేల మంది చెబుతున్నారు. తాము శిబిరాలకు వెళ్లకపోయినా ఇళ్లకొచ్చి మరీ భోజనాలు అందించారని మరికొన్ని వేల మంది చెప్పారు. వాళ్లెవరూ ఈ పచ్చకామెర్ల రామోజీకి కనిపించరు. ఆయనకు కావాల్సిందల్లా ఒకటే!!. చంద్రబాబు గొప్పోడని తాను రాసే తప్పుడు వార్తలకు మద్దతుగా ఒకరిద్దరు చాలు. అంతే! చెలరేగిపోతారు. అదే జరుగుతోంది గత వారంరోజులుగా..!! లక్ష మందికిపైగా తరలింపు ► వరద ముంపులో చిక్కుకున్న ఆరు జిల్లాల్లోని 263 గ్రామాలకు చెందిన లక్షా 775 మందికి ప్రభుత్వం సహాయ శిబిరాల్లో ఆశ్రయం కల్పించింది. ఇంతమందిని శిబిరాలకు తరలించడానికి అధికార యంత్రాంగం అలుపు లేకుండా పనిచేసింది. ► అల్లూరి జిల్లాలో గోదావరి మధ్య కొండల్లో ఉన్న గిరిజన గ్రామాలు, మారుమూల ప్రాంతాల్లో గోదావరి ఒడ్డునున్న గ్రామాలకు చెందిన వారిని తీసుకురావడం మామూలు విషయం కాదు. శ్రమించి వారిని సురక్షిత ప్రాంతాలకు తీసుకువచ్చారు. దీనివల్లే ఊహించని విధంగా భారీ వరద వచ్చినా నష్టాన్ని పరిమితం చేయగలిగారు. ► తరలించిన వారందరి కోసం అల్లూరి, అంబేద్కర్ కోనసీమ, ఏలూరు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కాకినాడ జిల్లాల్లో 217 సహాయ శిబిరాలు ఏర్పాటు చేశారు. ఒక్క అల్లూరి సీతారామరాజు జిల్లాలోనే 103 శిబిరాల్లో 59,476 మందికి ఆశ్రయం కల్పించారు. ► ఈ శిబిరాల్లో ఉన్న వారికి అల్పాహారం, రెండు పూటలా భోజనం... చిన్న పిల్లలకు పాలు, బ్రెడ్ అందించారు. ముంపు గ్రామాల్లోని పశువులను సైతం పడవల్లో సురక్షిత ప్రాంతాలకు తరలించి అక్కడ దాణా ఉంచడంతో పాటు పశు వైద్యులను కూడా అందుబాటులో ఉంచారు. ► వరద నీరు చేరిన 403 గ్రామాల్లోని కుటుంబాలకు 25 కేజీల బియ్యం, కేజీ చొప్పున కందిపప్పు, ఉల్లిపాయలు, బంగాళా దుంపలు, లీటర్ ఆయిల్ అందజేశారు. 5 జిల్లాల్లో 1124 మెట్రిక్ టన్నుల బియ్యం, 77.26 టన్నుల కందిపప్పు, 22471 లీటర్ల పామాయిల్, 66703 లీటర్ల పాలు, 21451 కేజీల ఉల్లిపాయలు, 19521 కేజీల బంగాళా దుంపలు పంపిణీ చేశారు. ► సహాయ శిబిరాల వద్దే వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు. మొత్తం 6 జిల్లాల్లో 260 వైద్య శిబిరాలు నిర్వహించారు. ► 10 ఎన్డీఆర్ఎఫ్, 10 ఎస్డీఆర్ఎఫ్ బృందాలు ముంపు ప్రాంతాల్లో విరామం లేకుండా సహాయక చర్యల్లో పాల్గొన్నాయి. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు 182 మందిని రక్షించగా 3006 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించాయి. ఎస్డీఆర్ఎఫ్ బృందాలు 4501 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించాయి. ► రెండు హెలికాఫ్టర్ల ద్వారా ఏలూరు జిల్లా కుక్కునూరు మండలం నల్లకుంట, వంజాం, తొండిపాక, మిట్టగూడెం, బంజారగూడెం, గుంపునల్లి, ఇబ్రహీంపేట, అల్లగూడెం, బొనగరి, వెంకటాపురం, బురుగువాయి గ్రామాల్లో ఆహార పొట్లాలు, కూరగాయలు, నిత్యావసరాల ప్యాకెట్లు జార విడిచారు. -
ప్రతిపక్షాలు బురద రాజకీయం చేస్తున్నాయి: మంత్రి వేణు
సాక్షి, తాడేపల్లి: ఏపీ వరద సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయని, భారీ వరదలు వచ్చినా అదృష్టం కొద్దీ ఎక్కడా ప్రాణనష్టం జరగలేదని రాష్ట్ర బీసీ సంక్షేమ, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ పేర్కొన్నారు. వరద ప్రభావిత ఐదు జిల్లాల్లో 191 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు ఆయన మీడియాకు తెలిపారు. ‘‘వలంటీర్ వ్యవస్థ నుంచి జిల్లా స్థాయి వరకు అందరూ బాగా పని చేశారు. సహాయక చర్యలపై ఎల్లోమీడియా అసత్య ప్రచారం చేస్తోంది. ప్రతిపక్షాలు బురద రాజకీయం చేస్తున్నాయి. గత ప్రభుత్వంలో చంద్రబాబులా హెలికాప్టర్లో విహార యాత్ర చేయలేదు. సీఎం జగన్ ప్రతికూల పరిస్థితుల్లోనూ ఏరియల్ సర్వే చేశారు. చంద్రబాబు హయాంలో వర్షాలు లేవు.. ఎప్పుడూ కరువే. ప్రజాగ్రహంలో చంద్రబాబు కొట్టుకుపోయారు’’ అని మంత్రి వేణు గుర్తు చేశారు. -
పునరావాసం.. అలుపెరగని యంత్రాంగం
సాక్షి, అమరావతి: మహోగ్ర రూపం దాల్చిన గోదావరి ఎగువన ఏజెన్సీ.. దిగువన లంక గ్రామాలను ముంచెత్తింది. ఇళ్ల చుట్టూ నీరు చేరి దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్న ప్రజలను ఆదుకునేందుకు ప్రభుత్వం వారం రోజులుగా అనేక చర్యలు చేపడుతూనే ఉంది. ఓ వైపు ముంపులో చిక్కుకున్న వారిని రక్షించడం.. నిలువ నీడ లేకుండా పోయిన వారిని పునరావాస శిబిరాలకు తరలించడం.. వారికి ఎలాంటి ఇబ్బంది రాకుండా భోజన, వసతి సౌకర్యాలు కల్పించడం.. ఇళ్లను వదిలి బయటకు రావడానికి ఇష్టపడకుండా మేడలు, మిద్దెలపైనే ఉంటున్న కుటుంబాలకు బియ్యం, పప్పులు, పాలు, మంచినీరు వంటి నిత్యావసర సరుకుల్ని బోట్ల ద్వారా చేరవేయడం.. పునరావాస కేంద్రాల్లో తలదాచుకుంటున్న వారికి ఎలాంటి ఆరోగ్య సమస్యలు రాకుండా కంటికి రెప్పలా కాపాడటం.. ముంపులోనూ ఇళ్లను వదిలి రానివారు అనారోగ్యం బారినపడితే అక్కడికే వెళ్లి వైద్య సేవలు అందించడం.. నెలలు నిండిన గర్భిణులను హెలికాప్టర్లలో సైతం ఆస్పత్రులకు తరలించడం.. మిగిలిన గర్భిణులకు ఎప్పటికప్పుడు వైద్య సేవలు అందించడం.. చివరకు లంకల్లో చిక్కుకుపోయిన పశువులను రక్షించడమే కాకుండా వాటికి కూడా ప్రత్యేక రక్షణ కేంద్రాలు ఏర్పాటు చేసి మేత సమకూర్చడం వంటి ఎన్నో రకాల సహాయ కార్యక్రమాలను రాష్ట్ర ప్రభుత్వం చేపడుతూనే ఉంది. తూర్పు గోదావరి జిల్లాలోని ముంపు గ్రామాల వారిని పడవల ద్వారా సురక్షిత ప్రదేశాలకు తరలిస్తున్న విపత్తు నిర్వహణ సిబ్బంది ఎన్డీఆర్ఎఫ్, ఎస్టీఆర్ఎఫ్ బృందాల కీలకపాత్ర వరద బాధితులను, ప్రాణాపాయ స్థితిలో చిక్కుకున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించడంలో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు, రెవెన్యూ, ఇతర ప్రభుత్వ శాఖలు కీలకపాత్ర పోషించాయి. అల్లూరి, ఏలూరు జిల్లాల్లోని పలు గ్రామాలకు హెలికాప్టర్లలో వెళ్లి సహాయక చర్యలు అందించారు. కాగా, బాధితులకు 1.25 లక్షల ఆహార పొట్లాలు, సుమారు 13 లక్షల వాటర్ ప్యాకెట్లను ప్రభుత్వం పంపిణీ చేసింది. ఇవికాకుండా ఎక్కడికక్కడ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు, నాయకులు తమ పరిధిలోని బాధిత ప్రాంతాలకు రెండు పూటలా భోజనాలు పంపించారు. బాధితులకు ఇబ్బందులు లేకుండా చూశారు. సహాయక చర్యలు పకడ్బందీగా, ఒక ప్రణాళిక ప్రకారం అందిస్తుండటంతో ఎక్కడా అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోలేదు. 10,757 ఎకరాల్లో పంట నష్టం వరద తీవ్రతకు ఆరు జిల్లాల్లో పంటలు, మౌలిక వసతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఆయా ప్రాంతాల్లో అధికారులు ప్రాథమికంగా నష్టాన్ని అంచనా వేశారు. 6 జిల్లాల్లో 10,757 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్టు గుర్తించారు. 3,375 ఎకరాల్లో వ్యవసాయ పంటలు, 7,382 ఎకరాల్లో ఉద్యాన పంటలు దెబ్బతిన్నట్టు ప్రాథమికంగా అంచనా వేశారు. కోనసీమ జిల్లాలో 5,253 ఎకరాలు, తూర్పు గోదావరి జిల్లాలో 1,802 ఎకరాల్లో ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయి. దాదాపు వెయ్యి కిలోమీటర్ల మేర రోడ్లు వరద ప్రభావానికి ధ్వంసమయ్యాయి. 156 చోట్ల రోడ్లకు గండ్లు పడ్డాయి. 35 రోడ్లపై వరద నీరు ప్రవహించింది. 34,749 ట్రాన్స్ఫార్మర్లు పాడయ్యాయి. ఇవి ప్రాథమిక అంచనాలు మాత్రమే. వరద తీవ్రత పూర్తిగా తగ్గిన తర్వాత అధికారులు పూర్తి స్థాయి నష్టాలను అంచనా వేయనున్నారు. రూ.30 కోట్ల వినియోగం వరద సహాయక చర్యల కోసం 6 జిల్లాల్లో అత్యవసరంగా రూ.30 కోట్లు ఖర్చు చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా ఆదేశాలు జారీ చేసింది. తొలుత రూ.2 కోట్ల చొప్పున వినియోగానికి అనుమతి ఇచ్చినా.. వరద తీవ్రత పెరగడంతో ఆ పరిమితిని పెంచారు. అల్లూరి జిల్లాలో రూ.7 కోట్లు, కోనసీమ జిల్లాలో రూ.8 కోట్లు, ఏలూరు జిల్లాలో రూ.7 కోట్లు, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో రూ.4 కోట్ల చొప్పున ఖర్చు చేసేందుకు అత్యవసర అనుమతిచ్చారు. వరద హెచ్చరికలు మొదలైన నాటినుంచీ.. వరదల్లో చిక్కుకున్న వారి కోసం ప్రభుత్వ ఆదేశాలను అనుసరించి యంత్రాంగం అలుపెరగకుండా సహాయక చర్యలు అందిస్తోంది. ముందస్తు వరద హెచ్చరికలు మొదలైనప్పటి నుంచి వారం రోజులుగా అధికారులు, అన్ని శాఖల సిబ్బంది కంటిమీద కునుకు లేకుండా వరద ప్రభావిత ప్రాంతాల్లో పని చేస్తున్నారు. ముంపు ప్రాంతాల నుంచి ప్రజలను తరలించడం, సహాయ శిబిరాల్లో వారికి ఆశ్రయం కల్పించడం, అక్కడ ఆహారం, మంచినీరు అందించడం, వరదల్లో చిక్కుకున్న వారిని సురక్షితంగా బయటకు తీసుకు రావడం వంటి పనుల్ని యంత్రాంగం ఒక యజ్ఞంలా నిర్వహిస్తోంది. ఫలితంగానే వరద ప్రభావానికి గురైన 6 జిల్లాల్లోని 62 మండలాల పరిధిలోని 626 గ్రామాల నుంచి 97,205 మందిని సురక్షిత ప్రాంతాలకు చేర్చారు. వారి కోసం పాఠశాలలు, కమ్యూనిటీ హాళ్లు, ఇతర ప్రదేశాల్లో 191 సహాయ శిబిరాలు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఆ శిబిరాల్లో 84,734 మంది తల దాచుకుంటున్నారు. ఒక్క అల్లూరి జిల్లాలోనే 290 గ్రామాలకు చెందిన 53,107 మంది 103 సహాయ శిబిరాల్లో ఆశ్రయం పొందుతున్నారు. గోదావరి మధ్యలో, గోదావరి ఒడ్డున ఉన్న జిల్లాల్లోని గ్రామాల ప్రజలను చాలా శ్రమకోర్చి సాహసోపేతంగా ఈ శిబిరాలకు తీసుకువచ్చారు. ఏలూరు జిల్లాలోని 169 గ్రామాల నుంచి 18,707 మందిని 23 సహాయ శిబిరాలకు తరలించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని 74 లంక గ్రామాల నుంచి 9,290 మందిని 29 సహాయ శిబిరాలకు తీసుకువచ్చారు. నిత్యావసర సరుకుల పంపిణీ వరద బాధితులకు 25 కేజీల బియ్యం, కేజీ చొప్పున పప్పు, పామాయిల్, ఉల్లిపాయలు, బంగాళా దుంపలను ప్రభుత్వం పంపిణీ చేసింది. 729.67 మెట్రిక్ టన్నుల బియ్యం, 50 మెట్రిక్ టన్నుల కందిపప్పు, 22,390 లీటర్ల పామాయిల్, 54,766 లీటర్ల పాలు, 13,564 కేజీల ఉల్లిపాయలు, 11,564 కేజీల బంగాళా దుంపలను ముంపు ప్రాంతాల్లో పంపిణీ చేసింది. -
కోనసీమకు రూ.3 లక్షల విలువైన టమాటాలు
పుంగనూరు: రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశాల మేరకు కోనసీమలోని వరద బాధితుల కోసం రూ.3 లక్షల విలువ చేసే టమాటాలు విరాళంగా పంపించారు. శనివారం ఏఎంసీ చైర్మన్ నాగరాజారెడ్డి ఆధ్వర్యంలో టమాటా మండి వ్యాపారులంతా ప్రత్యేక లారీలో టమాటాలను తరలించారు. చైర్మన్ నాగరాజారెడ్డి మాట్లాడుతూ సుమారు 270 బాక్సుల టమాటాలను అందరి సహకారంతో వరద బాధితులకు పంపిణీ చేసేందుకు తరలించామన్నారు. టమాటా మండి వ్యాపారులు రెడ్డెప్పరెడ్డి, రాజారెడ్డి, వైఎస్సార్సీపీ ఆర్టీసీ మజ్దూర్ సంఘ్ అధ్యక్షుడు జయరామిరెడ్డి పాల్గొన్నారు. -
మేమున్నామని.. మీకేం కాదని..
నట్రా సత్యవతి గర్భిణి.. పురిటి కోసం పది రోజుల క్రితం లంకాఫ్ ఠాణేలంకలోని పుట్టింటికి వచ్చింది. ఊహించని రీతిలో గోదావరి వరద ఇంట్లోకి వచ్చి, మోకాలు లోతున చేరింది. ఈ ఇంట్లో గర్భిణి ఉందన్న వార్త శనివారం అధికారులకు అందింది. పీహెచ్సీ వైద్యాధికారులు వెంటనే ప్రత్యేక బోటులో అక్కడకు చేరుకున్నారు. డాక్టర్ జాకబ్, వైద్య సిబ్బంది సత్యవతిని పరీక్షించారు. మందులు ఇచ్చారు. ఆమెకు ధైర్యం చెప్పారు. గ్రామం నుంచి సురక్షిత ప్రాంతానికి తరలించారు. ఊహించనంతగా విరుచుకుపడిన వరదతో వణికిపోతున్న లంక గ్రామాల ప్రజలకు ప్రభుత్వం ఇస్తున్న భరోసాకు ఇది ఒక నిదర్శనం. కోనసీమ నుంచి సాక్షి ప్రతినిధులు వడ్డాది శీనివాసరావు, పంపాన వరప్రసాద్: ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా సహాయ, పునరావాస చర్యలు చేపడుతోంది. బాధిత ప్రజల ఆరోగ్యాన్ని పరిరక్షించేందుకు అన్ని ఏర్పాట్లు చేసింది. వరద నీటిలో చిక్కుకున్న గ్రామాలకు అధికారులే వెళ్లి ప్రజలకు ధైర్యం చెబుతున్నారు. వారికి కావల్సిన నిత్యావసరాలు, వైద్య సహాయం అందిస్తున్నారు. సురక్షిత ప్రాంతాలకు తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకోసం ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్లకు చెందిన 25 బృందాలు, 1,200 మంది గజ ఈతగా>ళ్లు, మత్స్య శాఖకు చెందిన 750 బోట్లను వినియోగిస్తున్నారు. పక్కా ప్రణాళికతో ప్రజలకు రక్షణ గోదావరి వరదలో చిక్కుకున్న బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో వరద అంతకంతకూ పెరుగుతుండటంతో ప్రభుత్వం ముందుగానే అప్రమత్తమైంది. వివిధ ప్రభుత్వ శాఖలతో పాటు వైఎస్ జగన్ సర్కారు ఏర్పాటు చేసిన గ్రామ, వార్డు సచివాలయాలు, వలంటీర్లు, ఆర్బీకే వంటి ప్రత్యేక వ్యవస్థలను కూడా ఉపయోగించుకొని చక్కటి ప్రణాళిక రచించింది. గ్రామాలవారీగా రెవెన్యూ, పోలీస్, పంచాయతీరాజ్, వైద్య, పశు సంవర్ధక శాఖల అధికారులతో బృందాలను ఏర్పాటు చేసింది. వలంటీర్లు, సచివాలయ, ఆర్బీకే సిబ్బంది ఇంటింటికీ వెళ్లారు. ఇంట్లో ఎంత మంది ఉన్నారు, వారి స్థితిగతులు, ఆరోగ్యం ఇతర సమాచారాన్ని నమోదు చేశారు. దీంతో గ్రామాలవారీగా చేపట్టాల్సిన సహాయక చర్యలపై అధికార యంత్రాంగానికి స్పష్టత వచ్చింది. ప్రణాళిక ప్రకారం ప్రజలను, మూగజీవాలను సకాలంలో సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఈ కారణంగా రికార్డు స్థాయిలో వరద ముంచెత్తినప్పటికీ ఎలాంటి ప్రాణనష్టం, పశునష్టం జరగలేదు. లంకలను విడిచి రాని వారిని కూడా కంటికిరెప్పలా చూసుకుంటూ వలంటీర్ల ద్వారా వారికి కావాల్సిన నిత్యావసరాలు, మంచినీరు, మందులు సరఫరా చేస్తున్నారు. మనిషికి 5 కిలోల బియ్యం, కుటుంబానికి కిలో చొప్పున కందిపప్పు, ఉల్లిపాయలు, దుంపలు, లీటర్ వంటనూనె, పాలు, కొవ్వొత్తులు సరఫరా చేశారు. మొత్తం 3 వేల టన్నుల బియ్యం, 1.2 టన్నుల చొప్పున కందిపప్పు, ఉల్లిపాయలు, టమాటా, వంటనూనె, 1150 లీటర్ల పాలు, 32 వేల కొవ్వొత్తులు అందించారు. పునరావాస శిబిరాల నిర్వహణ కోనసీమ జిల్లాలో 65 పంచాయతీలకు 84 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో 14, ఏలూరు జిల్లాలో 58, పశ్చిమ గోదావరి జిల్లాలో 18 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇప్పటివరకు 50 వేల మందిని ఈ కేంద్రాలకు తరలించారు. వీరికి భోజనం, అల్పాహారం అందిస్తున్నారు. తాగునీరు, మందులు, దుస్తులు మొదలైనవి సరఫరా చేస్తున్నారు. చిన్న పిల్లలు కలిగిన కుటుంబాలకు 2 లీటర్లు, ఇతర కుటుంబాలకు లీటర్ చొప్పున 1.40 లక్షల పాల ప్యాకెట్లు పంపిణీ చేశారు. శిబిరాల్లో ఉన్న పిల్లలు, వృద్ధుల కోసం మొత్తం 33 వేల బిస్కెట్ ప్యాకెట్లు, 13వేల బ్రెడ్ ప్యాకెట్లను అందించారు. పూర్తి స్థాయిలో వైద్య సేవలు లంక గ్రామాలను ఆనుకొని ఉన్న వరద గట్ల పక్కనే ప్రభుత్వం 160 ప్రత్యేక వైద్య శిబిరాలను ఏర్పాటు చేసింది. గ్రామాల నుంచి తీసుకొస్తున్న ప్రజలకు అక్కడే ప్రాధమిక వైద్య పరీక్షలు చేసి, మందులు ఇస్తున్నారు. మెరుగైన వైద్యం అవసరమైన వారిని ఆస్పత్రులకు తరలిస్తున్నారు. మరికొన్ని వైద్య బృందాలు ప్రత్యేక బోట్లలో లంక గ్రామాల్లో ఇంటింటికి వెళ్లి ప్రతి వ్యక్తినీ పరీక్షిస్తున్నాయి. వారికి అవసరమైన వైద్య సహాయం అందిస్తున్నాయి. పునరావాస శిబిరాల్లో కూడా వైద్య సిబ్బందిని అందుబాటులో ఉంచారు. వేలాది పశువులను ప్రత్యేక బోట్ల ద్వారా సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. వాటికి సంపూర్ణ మిశ్రమదాణా, పచ్చి గడ్డిని అందుబాటులో ఉంచారు. పశువులు వ్యాధుల బారిన పడకుండా వ్యాక్సిన్లు, మందులు ఇస్తున్నారు. అప్రమత్తంగా అధికార యంత్రాంగం మరో 24 గంటలు వరద తీవ్రంగా ఉంటుందన్న అంచనాతో యంత్రాంగం అప్రమత్తంగా ఉంది. ఎగువ ప్రాంతాల అధికారులతో సమన్వయం చేసుకుంటూ తీవ్రతను అంచనా వేస్తోంది. కాలువ గట్లకు గండి పడకుండా ముందస్తు చర్యలు చేపట్టింది. గట్ల వెంబడి ఇసుక బస్తాలు సిద్ధం చేసింది. ప్రత్యేక బృందాలతో గట్లను 24 గంటలూ పర్యవేక్షిస్తోంది. అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారు నాకు 87 ఏళ్లు. ఎన్నో వరదలను చూశా. ఇంత పెద్ద వరద ఎప్పుడూ చూడలేదు. ఊళ్లో ఉండలేక అందరం పునరావాస కేంద్రాలకు వచ్చేశాం. అధికారులు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారు. – పొల్నాటి కొండమ్మ, అయినవిల్లిలంక సత్వరమే వైద్యసహాయం అందిస్తున్నాం లంక గ్రామాల్లో ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు పర్యటిస్తున్నారు. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశాం. ముంపు గ్రామాల్లో 5,063మంది ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నాం. – డాక్టర్ ఎస్.జాకబ్, కొత్తలంక పీహెచ్సీ వైద్యుడు పునరావాస కేంద్రాలకు వెళ్తున్నాం వరద ఇంత వస్తుందని ఊహించలేదు. అర్ధరాత్రి తర్వాత ఇంట్లోకి నీరు చొచ్చుకు రావడంతో ఆందోళన చెందాం. అధికారులు మంచినీరు, ఆహారం అందిస్తున్నారు. అధికారుల సూచనల మేరకు పునరావాస కేంద్రాలకు వెళ్తున్నాం. – అంగాడి ముత్యాలరావు, లంకాఫ్ ఠానేలంక -
మరో 24 గంటలు.. అప్రమత్తంగా ఉండాలని సీఎం జగన్ ఆదేశం
సాక్షి, అమరావతి: గోదావరి వరద నేపథ్యంలో మరో 24 గంటల పాటు అత్యంత అప్రమత్తంగా ఉండాలని అధికార యంత్రాంగాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. ఎక్కడా ప్రాణనష్టం జరగకుండా అవసరమైన ముందస్తు జాగ్రత్తలన్నీ చేపట్టాలని స్పష్టం చేశారు. గోదావరి వరదలు, సహాయ కార్యక్రమాలపై సీఎం జగన్ శనివారం ఉదయం సమీక్షించారు. గోదావరి ప్రవాహం, తాజా పరిస్థితిపై ఆరా తీశారు. సహాయ బృందాలను వినియోగించుకుంటూ శిబిరాలు ఏర్పాటు చేసి బాధితులకు నాణ్యమైన సేవలు అందించాలని నిర్దేశించారు. రేషన్ సరుకులు.. నగదు సాయం వరద బాధిత కుటుంబాలకు యుద్ధ ప్రాతిపదికన రేషన్ పంపిణీ చేయాలని సీఎం జగన్ ఆదేశించారు. ప్రతి కుటుంబానికీ 25 కిలోల బియ్యం, కిలో కందిపప్పు, కిలో బంగాళాదుంపలు, కిలో పామాయిల్, కిలో ఉల్లిపాయలు అందించాలన్నారు. ప్రతి కుటుంబానికి రూ.2 వేలు లేదా వ్యక్తికైతే రూ.వెయ్యి చొప్పున వెంటనే నగదు సాయం అందించాలని సూచించారు. ఈ కార్యక్రమాలకు అత్యధిక ప్రాధాన్యమిస్తూ వరద పరిస్థితిపై గంట గంటకూ తనకు నివేదించాలని అధికారులను ఆదేశించారు. -
వరద బాధితులను ఆదుకోండి: భట్టి
సాక్షి, హైదరాబాద్: భారీ వర్షాల వల్ల వరదల్లో చిక్కుకున్న బాధిత ప్రజానీకానికి కాంగ్రెస్ శ్రేణులు ఆపన్నహస్తం అందించాలని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క శుక్రవారం పిలుపునిచ్చారు. వరద సహాయక చర్యల్లో రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ నేతలు, నాయకులు పాల్గొనాలని, బాధితులకు నిరంతరం అండగా ఉండాలని ఒక ప్రకటనలో సూచించారు. వరద బాధితులకు ఆహారం, పాలు, మంచినీరు, మందులు, నిత్యావసరాలు, బట్టలు మొదలైనవి అందించేందుకు కాంగ్రెస్ కార్యకర్తలు ముందుకు రావాలని కోరారు. -
ఎస్డీఆర్ఎఫ్ ఆపన్నహస్తం
సాక్షి, అమరావతి: గోదావరి వరద బాధితులకు స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎస్డీఆర్ఎఫ్) బృందాలు ఆపన్నహస్తం అందిస్తున్నాయి. ప్రాణనష్టం లేకుండా చూసేందుకు అవసరమైన చర్యలను యుద్ధప్రాతిపదికన చేపడుతున్నాయి. ఏలూరు, అల్లూరి సీతారామరాజు, బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాల్లో గోదావరి వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయ, పునరావాస కార్యక్రమాల్లో ఎస్డీఆర్ఎఫ్ బృందాలు క్రియాశీలక పాత్ర పోషిస్తున్నాయి. వరద తీవ్రత దృష్ట్యా 150 మంది సభ్యులతో కూడిన 5 ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. ముంపు ప్రాంత ప్రజలను పునరావాస కేంద్రాలకు సురక్షితంగా తరలిస్తున్నాయి. పోలవరం ప్రాజెక్టు కింద ఏడు ముంపు మండలాలపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరించడంతోపాటు ఏలూరు, అల్లూరి, కోనసీమ జిల్లాల్లో పెద్ద ఎత్తున సహాయక చర్యలు చేపడుతున్నాయి. అల్లూరి జిల్లాలోని కూనవరం, వీఆర్ పురం, రాజుపేట ఎస్సీ కాలనీ, ఏలూరు జిల్లాలోని సుడిగుమ్మరీపగుమ్మ, కోనసీమ జిల్లాలోని టేకుల సెట్టిపాలెం, వీరవల్లిపాలెం, కొట్టిలంక, గుంజరామేక తదితర గ్రామాల ప్రజలను గురువారం సురక్షిత ప్రాంతాలకు తరలించారు. పోలవరం ముంపు మండలాల పరిధిలో పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలకు హాజరయ్యే 30 మంది విద్యార్థులకు ఎస్డీఆర్ఎఫ్ బృందాలు భద్రత కల్పించాయి. పునరావాస కేంద్రాల్లో ఉంటున్న వారికి ఆహారం పంపిణీ చేశాయి. -
గాలింపు చర్యలు ముమ్మరం
శ్రీనగర్: అమర్నాథ్ ఆలయం సమీపంలో అకస్మాత్తుగా సంభవించిన వరదల్లో ఆచూకీ తెలియకుండా పోయిన వారి కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. అన్వేషణ, సహాయక చర్యల కోసం ఆర్మీకి చెందిన పర్వత గస్తీ బృందాలను, డ్రోన్లు, జాగిలాలు, అత్యాధునిక పరికరాలను వినియోగిస్తున్నారు. శనివారం ఉదయం ఆరుగురు యాత్రికులను హెలికాప్టర్ల ద్వారా సురక్షిత ప్రాంతానికి తీసుకెళ్లినట్లు పేర్కొంది. ఇప్పటి వరకు 16 మృతదేహాలను బాల్టాల్ బేస్ క్యాంప్‌నకు తరలించినట్లు బీఎస్ఎఫ్ తెలిపింది. టెంట్లు, సామూహిక వంటశాలల మీదుగా పోటెత్తిన వరద, బురదమట్టి కారణంగా గాయపడిన 25 మంది ఆస్పత్రులకు తరలించారు. మరోవైపు, గుహాలయం సమీపంలో చిక్కుకుపోయిన మొత్తం 15వేల మందినీ దిగువనున్న పంజ్తరణి బేస్ క్యాంపునకు సురక్షితంగా తరలించారు. 11వ బ్యాచ్‌లోని 6వేల మంది యాత్రికులు శనివారం జమ్మూ నుంచి అమర్నాథ్ దిశగా బయలుదేరారని అధికారులు తెలిపారు. అమర్నాథ్లో శుక్రవారం సాయంత్రం 4.30–6.30 గంటల ప్రాంతంలో నమోదైంది 31 మి.మీ. వర్షపాతమేనని వాతావరణ విభాగం తెలిపింది. గంట వ్యవధిలో 100 మి.మీ. వాన నమోదైన సందర్భాల్లోనే కుండపోత వర్షంగా పరిగణిస్తామంది. అకస్మాత్తు వరదలకు ఎగువనున్న పర్వత భాగాల్లో కురిసిన వానలే కారణం కావచ్చని పేర్కొంది. -
అసోం వరదలు.. రూ.25 కోట్ల సాయం ప్రకటించిన రియలన్స్ ఫౌండేషన్
వరదల కారణంగా అతలాకుతలమైన అసోంకు బాసటగా నిలిచేందుకు రిలయన్స్ ఫౌండేషన్ ముందుకు వచ్చింది. వరద సాయం కోసం ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.25 కోట్ల సాయం అందిస్తున్నట్టు రియలన్స్ ఫౌండేన్ ప్రకటిచింది. రిలయన్స్ సాయం పట్ల అసోం ముఖ్యమంత్రి హేమంత బిశ్వశర్మ హర్షం వ్యక్తం చేశారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు అసోంలో వరదలు ముంచెత్తాయి. వేలాది గ్రామాల్లో లక్షలాది మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. గత నెలరోజులుగా అసోంతో పాటు కేంద్ర ప్రభుత్వాలకు సహాకారం అందిస్తూ క్షేత్రస్థాయిలో తన వంతు సేవా కార్యక్రమాలను రిలయన్స్ ఫౌండేషన్ కొనసాగిస్తూ వస్తోంది. ముఖ్యంగా వరదల కారణంగా తీవ్రంగా దెబ్బతిన్న కచర్, సిల్చర్, కలైన్, బర్కోలా జిల్లాలో బాధితుగలకు అండగా రిలయన్స్ ఫౌండేషన్ అనేక కార్యక్రమాలు చేపడుతోంది. చదవండి: 'ట్రెండ్స్' ఫెస్టివల్ సేల్,దుస్తులపై భారీ డిస్కౌంట్! -
వరద సాయం తక్షణమే విడుదల చేయాలి
సాక్షి, న్యూఢిల్లీ: ఇటీవల అకాల వర్షాలు, వరదలతో ఆంధ్రప్రదేశ్‌లో నాలుగు జిల్లాల్లో తీవ్రనష్టం వాటిల్లిందని, కేంద్రం తక్షణ సాయం వెంటనే విడుదల చేయాలని వైఎస్సార్సీపీ ఎంపీలు డిమాండ్ చేశారు. రాష్ట్రానికి భంగం కలిగించేలా ప్రతిపక్షాలు వ్యవహరించరాదని హితవు పలికారు. ప్రత్యేక హోదా, పోలవరం డిమాండ్లు నెరవేర్చాలని కోరారు. టీడీపీ అధినేత చంద్రబాబు కారణంగానే అమరావతి ఉద్యమం సాగుతోందని ప్రజలందరికీ తెలుసన్నారు. అమరావతి రైతులకు ఎవరూ వ్యతిరేకం కాదని చెప్పారు. న్యూఢిల్లీలోని ఏపీ భవన్లో బుధవారం వైఎస్సార్సీపీ ఎంపీలు ఆదాల ప్రభాకర్‌రెడ్డి, గోరంట్ల మాధవ్, తలారి రంగయ్య, చింతా అనూరాధ, గొడ్డేటి మాధవి, ఎన్.రెడ్డెప్ప, వంగా గీతావిశ్వనాథ్లు మీడియాతో మాట్లాడారు. విపరీతమైన వర్షాలు, వరదలు నాలుగు జిల్లాల్లోని రెండు లక్షలమంది ప్రజలపై ప్రభావం చూపాయని ఎంపీ ఆదాల ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. తక్షణ సాయంగా రూ.వెయ్యి కోట్లు ఇవ్వాలని కేంద్రాన్ని ఇప్పటికే సీఎం జగన్మోహన్రెడ్డి కోరారని చెప్పారు. రాష్ట్ర అధికారుల ప్రాథమిక అంచనా ప్రకారం రూ.6వేల కోట్ల నష్టం జరిగిందన్నారు. ఇదే విషయాన్ని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి దృష్టికి తీసుకెళ్లామని, కమిటీ నివేదిక రాగానే సాయంచేస్తామని చెప్పారని తెలిపారు. జస్టిస్ చంద్రుపై చంద్రబాబు వ్యాఖ్యలు సరికాదు ఎంపీ గోరంట్ల మాధవ్ మాట్లాడుతూ జస్టిస్ చంద్రుపై టీడీపీ అధినేత చంద్రబాబు వ్యాఖ్యలు చేయడం సరికాదని చెప్పారు. సీఎం జగన్మోహన్రెడ్డి ప్రజలకు మేలుచేసే కార్యక్రమాలు చేపడితే చంద్రబాబు వాటిని ప్రజలకు అందనీయకుండా వ్యవహరిస్తున్నారన్నారు. ఎంపీ తలారి రంగయ్య మాట్లాడు తూ కేంద్రం ప్రత్యేక హోదా విషయంలో ఏపీని మభ్యపెడుతూనే పాండిచ్చేరికి ఇస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చడం దారుణమని విమర్శించారు. 20 ఏళ్లలో ఎన్డీయే, యూపీఏ సంయుక్తంగా కలిసి చేసిన పని రాష్ట్ర విభజన ఒక్కటేనన్నారు. హోదా మరుగునపడిన అంశం కాదని, నిరంతరం పోరాడతామని చెప్పారు. ఎంపీ చింతా అనూరాధ మాట్లాడుతూ రెవె న్యూ లోటు కింద రాష్ట్రానికి ఇవ్వాల్సిన నిధులను, ఇతరత్రా పెండింగ్ సొమ్మును వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సీఎం జగన్మోహన్రెడ్డి సూచనల మేరకు పార్లమెంటులో పోరాడుతున్నామన్నారు. ఎంపీ గొడ్డేటి మాధవి మాట్లాడుతూ విజయనగరం జిల్లా సాలూరులో గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటుకు సీఎం జగన్మోహన్రెడ్డి చూపిన చొరవకు గిరిజనుల తరఫున కృతజ్ఞతలు చెబుతున్నామన్నారు. ఇది గిరిజనుల అభివృద్ధికి సహకరిస్తుందని చెప్పారు. హామీలు నెరవేర్చకపోతే ప్రజలు ఊరుకోరు ఎంపీ రెడ్డెప్ప మాట్లాడుతూ ప్రత్యేక హోదాపై కేంద్రం నిమ్మకు నీరెత్తినట్లు ఉంటోందని విమర్శించారు. ఇచ్చిన హామీలు నెరవేర్చని కేంద్రానికి ప్రజలు తప్పకుండా గుణపాఠం చెబుతారన్నారు. త్వరలో కేబినెట్ సమావేశం పెట్టి రాష్ట్రానికి హోదా మంజూరు చేయాలని కోరారు. చంద్రబాబు అధికారంలో లేకుంటేనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందన్నారు. చంద్రబాబు వల్లే అమరావతి ఉద్యమం జరుగుతోందని పేర్కొన్నారు. ఎంపీ వంగా గీతా విశ్వనాథ్ మాట్లాడుతూ రాష్ట్రాభివృద్ధి విషయంలో ప్రతిపక్షాలు కలసిరావాలని కోరారు. కొత్త రాష్ట్రం ఏర్పడినప్పుడు మొక్కను సరిగా నాటకపోవడం వల్లనే ఇప్పుడు వైఎస్సార్సీపీ ప్రభుత్వం వృక్షంగా మార్చడానికి ఎన్నో ఇబ్బందులు పడుతోందన్నారు. కరోనా వల్ల ఇబ్బందులు ఎదురైనా ఎంతో సమర్థంగా ఎదుర్కొన్నామని, ప్రజలతో ఉండి సీఎం జగన్మోహన్రెడ్డి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని తెలిపారు. కేంద్రం నుంచి రావాల్సిన ఎఫ్‌సీఐ, ఉపాధి నిధులు కూడా ఆలస్యం అవుతున్నాయని చెప్పారు. ప్రత్యేక హోదా, విశాఖ జోన్, పోలవరం, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ విషయాల్లో ప్రజల్లో ఆందోళన నెలకొందని తెలిపారు. ఏపీలో ఇప్పటి వరకు ఎవరూ చేయనట్లుగా పారదర్శక పాలన అందిస్తున్న సీఎం జగన్ పేదల గౌరవాన్ని పెంచారని చెప్పారు. కర్నూలులో హైకోర్టు పెట్టాలని బీజేపీ అజెండాలో కూడా ఉందని గుర్తుచేశారు. అమరావతి రైతుల పట్ల అందరికీ సానుభూతి ఉందన్నారు. జమ్మూకశ్మీర్, అయోధ్య రామాలయం వంటి వాటిని లక్ష్యంగా పెట్టుకుని పూర్తిచేసినట్లే పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాలని ఆమె కేంద్రాన్ని కోరారు. -
ప్రభాస్ మంచి మనసు.. ఏపీ వరద బాధితులకు భారీ విరాళం
Prabhas Donating 1 Crore Rupees To AP CM Relief Fund: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. ఈ పేరు వింటే చాలు అభిమానులు 'అన్నయ్య', 'డార్లింగ్' అంటూ గుండెల్లో గుడి కట్టుకుంటారు. తన యాక్టింగ్ స్టైల్, మంచి మనసుతో ఎందరో అభిమానులు సంపాదించుకున్నాడు ఈ డార్లింగ్. రాజమౌళి తీసిన బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగాడు. తర్వాత వచ్చిన 'సాహో'తో మరింత పాపులర్ అయ్యాడీ మిస్టర్ ఫర్ఫెక్ట్. ఫైటింగ్‌లు, రొమాన్స్‌లు కాకుండా ఆపదలో ఉన్నవారికి ఆపన్న హస్తం అందించడంలోనూ ప్రభాస్ బాహుబలినే. ఇందుకు తాజా నిదర్శనం ఆంధ్రప్రదేశ్ వరద బాధితులను తన మంచి మనసుతో ఆదుకోవడం. ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లో వరదలు ముంచెత్తిన సంగతి తెలిసిందే. అందులో నష్టపోయిన వారిని ఆదుకునేందుకు ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్‌కు రూ. కోటి విరాళంగా ప్రకటించాడు. దీనికి సంబంధించిన చెక్కును త్వరలో సీఎం కార్యాలయానికి పంపనున్నాడు. గతంలో కరోనా సమయంలోనూ ఈ పాన్ ఇండియా స్టార్ రెండు తెలుగు రాష్ట్రాలకు చెరో రూ. 50 లక్షల చొప్పున విరాళం అందించాడు. ప్రధానమంత్రి సహాయనిధికి మరో రూ. 3 కోట్లు ఇచ్చాడు. ప్రస్తుతం 'రాధేశ్యామ్' మూవీతో అభిమానులు, ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాడు డార్లింగ్ ప్రభాస్. Rebel Star #Prabhas Donated Rupees 1 CRORE Towards “AP CM Relief Fund”for #AndhraPradesh flood victims @AndhraPradeshCM . pic.twitter.com/Vduo1GI8T2 — BA Raju's Team (@baraju_SuperHit) December 7, 2021 -
బాధితులకు తాత్కాలిక బస
సాక్షి, అమరావతి: వరదల్లో ఇళ్లు కోల్పోయిన బాధితులకు తాత్కాలిక వసతి కల్పించాలని అధికార యంత్రాంగాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. తాత్కాలిక వసతిలో కనీస సదుపాయాలుండాలని స్పష్టం చేశారు. వరదల్లో ఇళ్లు పూర్తిగా ధ్వంసమైన వారికి కొత్తవి మంజూరు చేయడంతోపాటు వెంటనే పనులు కూడా ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని నిర్దేశించారు. మళ్లీ వసతి సమకూరేవరకు వారి బాగోగుల పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పంట నష్టంపై ఎన్యూమరేషన్ పూర్తయ్యే కొద్దీ సోషల్ ఆడిట్ కూడా నిర్వహించాలని స్పష్టం చేశారు. వరద బాధిత ప్రాంతాల్లో సహాయ కార్యక్రమాలపై వైఎస్సార్ కడప, చిత్తూరు, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు, అనంతపురం జిల్లాల కలెక్టర్లు, అధికారులతో ముఖ్యమంత్రి జగన్ సోమవారం తన క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. అంశాలవారీగా పనులను సీఎం ఆరా తీశారు. ప్రస్తుతం ఆయా జిల్లాల్లో కురుస్తున్న వర్షాలపైనా సమాచారం తెలుసుకుని పలు సూచనలు చేశారు. ఆ వివరాలివీ.. గొలుసుకట్టు చెరువులు.. వర్షాల నేపథ్యంలో చెరువుల మధ్య అనుసంధానం చేయడంతో పాటు గండ్లు పడకుండా అప్రమత్తంగా ఉండాలి. చెరువులు నిండగానే అదనపు నీటిని నేరుగా కాల్వలకు తరలించే వ్యవస్థపై దృష్టి సారించాలి. అన్నమయ్య ప్రాజెక్టు తెగిపోవడంతో నీటిని నిల్వచేయలేని పరిస్థితి నెలకొంది. చాలాచోట్ల తాగునీటి సరఫరాకు ఆధారమైన చెరువులకు గండ్లు పడ్డాయి. వీటిపై ఆధారపడ్డ పట్టణాలు, గ్రామాల్లో తాగునీటి కొరత తలెత్తకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. వచ్చే వేసవిని కూడా దృష్టిలో ఉంచుకుని ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలి. నిత్యావసరాలు అందించిన ప్రతి కుటుంబానికీ అదనపు సహాయం రూ.2 వేలు కూడా అందాలి. క్షేత్రస్థాయి పర్యటనలకు వెళ్లినప్పుడు బాధితుల నుంచి అందే విజ్ఞప్తులపై అధికారులు ఉదారంగా వ్యవహరించాలి. ఆర్బీకేల్లో విత్తనాలను సిద్ధం చేసి పంపిణీకి అన్ని ఏర్పాట్లూ చేశాం. ఆ పెద్ద మనిషి.. బురద రాజకీయాలు రాష్ట్రంలో వరదలతో రూ.6 వేల కోట్ల మేర నష్టం జరిగితే ఇచ్చింది రూ.34 కోట్లే అని కొందరు విమర్శలు చేస్తున్నారు. 40 శాతం రోడ్లకు, 30 శాతానికిపైగా పంటల రూపంలో, సుమారు 18 శాతం ప్రాజెక్టులకు నష్టం వాటిల్లింది. గత ప్రభుత్వ హయాంలో హుద్‌హుద్ తుపాన్ వల్ల రూ.22 వేల కోట్ల నష్టం జరిగిందని చెప్పారు. మరి నాడు ఇచ్చింది రూ.550 కోట్లు మాత్రమే. అదంతా కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చింది. రూ.22 వేల కోట్ల మేర నష్టం జరిగిందని చెప్పిన ఆ పెద్ద మనిషి అప్పుడు బాధితులకు ఇచ్చింది రూ.550 కోట్లే. ఇప్పుడు కలెక్టర్లు, అధికారులు బాగా పనిచేసి పరిహారాన్ని వేగంగా అందిస్తే దానిపై కూడా బురద జల్లుతున్నారు. గతంలో కనీసం నెల.. ఇప్పుడు వారంలోనే అన్నీ వరద ప్రాంతాల్లో బాధితులను ఆదుకునేందుకు ఇంత శరవేగంగా చర్యలు తీసుకోవడం ఎన్నడూ జరగలేదు. గతంలో కనీసం నెల సమయం పట్టగా ఇప్పుడు వారం రోజుల్లోనే బాధితులకు సాయాన్ని అందించగలిగాం. బాధిత కుటుంబాలకు అన్ని రకాలుగా నష్ట పరిహారాన్ని అందించాం. గతంలో ఇల్లు ధ్వంసమైనా, దురదృష్టవశాత్తూ ఎవరైనా మరణించినా పరిహారం ఇవ్వాలంటే నెల రోజులు పట్టేది. గల్లంతైన వారికి ఎలాంటి పరిహారాన్ని ఇచ్చేవారు కాదు. అలాంటిది ఇప్పుడు వారం రోజుల్లోనే ఆయా కుటుంబాలకు పరిహారం చెల్లించి ఆదుకున్నాం. గతంలో రేషన్, నిత్యావసరాలు ఇచ్చి సరిపెట్టగా ఇప్పుడు వాటిని అందించడమే కాకుండా రూ.2 వేల చొప్పున తక్షణ సాయం కూడా చెల్లించాం. నష్టపోయిన రైతులకు సీజన్ ముగిసేలోగా సాయం చేసిన దాఖలాలు గతంలో లేవు. ఇప్పుడు యుద్ధప్రాతిపదికన ఎన్యుమరేషన్ పూర్తిచేసి సీజన్‌లోగా వారికి సహాయం అందిస్తున్నాం. ఇక గతంలో ఇన్పుట్ సబ్సిడీ అందాలంటే కనీసం సంవత్సరం పట్టేది. ఆ తర్వాత కూడా ఇచ్చిన దాఖలాలు లేవు. ఇవాళ పంట నష్టపోయిన సీజన్ ముగిసేలోగానే పరిహారాన్ని అందిస్తున్నాం. -
AP Floods: వేగంగా సాయం..
సాక్షి, నెట్వర్క్: భారీ వర్షాలు, వరద ప్రభావిత జిల్లాల్లో తక్షణమే సహాయ చర్యలు చేపట్టి అధికార యంత్రాంగం అంతా క్షేత్రస్థాయిలో నిరంతరం పర్యవేక్షిస్తుండటంతో క్రమంగా సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. వైఎస్సార్, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో మంత్రులు, స్థానిక ప్రజా ప్రతినిధులు స్వయంగా బాధిత ప్రాంతాలకు చేరుకుని సహాయ చర్యల్లో పాలు పంచుకుంటున్నారు. బాధితులకు తక్షణ ఆర్థిక సాయం, నిత్యావసరాల పంపిణీని ఇప్పటికే పూర్తి చేశారు. రోడ్ల పునరుద్ధరణతోపాటు దెబ్బతిన్న విద్యుత్తు లైన్లకు మరమ్మతులు కూడా దాదాపుగా పూర్తయ్యాయి. చెన్నై–విజయవాడ ప్రధాన లైన్‌లోని పడుగుపాడు–నెల్లూరు సెక్షన్లో వరదల వల్ల దెబ్బతిన్న రైల్వే ట్రాక్‌ను 40 గంటల వ్యవధిలోనే పునరుద్ధరించడంతో రైళ్ల రాకపోకలు సాధారణ స్థితికి చేరుకున్నాయి. వడివడిగా సహాయ చర్యలు వైఎస్సార్ కడప జిల్లాలో ప్రత్యేక అధికారుల ఆధ్వర్యంలో పునరావాసం, సహాయ చర్యలు అత్యంత వేగంగా సాగుతున్నాయి. ఎగువ మందపల్లె, దిగువ మందపల్లె, పులపత్తూరు, గుండ్లూరు తదితర పది ముంపు గ్రామాల్లో ప్రత్యేక అధికారులను నియమించి 40 రోజులపాటు ఇవే బాధ్యతలు అప్పగించారు. అన్ని గ్రామాలలో ఒకేసారి పునరావాస పనులను పూర్తి చేసేలా చర్యలు చేపట్టారు. విద్యుత్ సరఫరా పునరుద్ధరణ పనులు యుద్ధ ప్రాతిపదికన సాగుతున్నాయి. ఇప్పటికే ఎగువ మందపల్లె, దిగువ మందపల్లె గ్రామాల్లో పనులు పూర్తి కాగా మరో నాలుగు రోజుల్లో మిగిలిన చోట్ల కూడా పూర్తి కానున్నాయి. వరదల్లో సర్టిఫికెట్లు కొట్టుకుపోయిన విద్యార్థుల వివరాలను గ్రామాల వారీగా నమోదు చేస్తున్నారు. మరింత కుంగిన వంతెన... జమ్మలమడుగు, ముద్దనూరు మధ్య పెన్నా వరద బీభత్సానికి కుంగిన హైలెవల్ బ్రిడ్జి మరింత కిందకు కుంగిపోవడంతో రాకపోకలను నిలిపివేసి ప్రజలను అప్రమత్తం చేశారు. పెన్నా నదిలో వరదనీటి ప్రవాహం కొంత తగ్గింది. రెండు రోజుల క్రితం మైలవరం జలాశయం నుంచి పెన్నాలోకి 70 వేల నుంచి 45 వేల క్యూసెక్కుల నీరు వదలగా తాజాగా పది వేల క్యూసెక్కులకే పరిమితం చేశారు. హైలెవెల్ బ్రిడ్జికి మరమ్మతులు జరిగే వరకూ పురాతన లోలెవల్ బ్రిడ్జికి మరమ్మతులు చేసి రాకపోకలను కొనసాగించాలని ప్రజలు కోరుతున్నారు. వైఎస్సార్ కడప జిల్లాలో ఇన్‌ఛార్జి మంత్రి ఆదిమూలపు సురేష్, ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి, జెడ్పీ చైర్మన్ ఆకేపాటి అమర్నాథరెడ్డి, అధికారులు ముంపు గ్రామాల్లో పర్యటించారు. నీట మునిగిన వరి, చీనీ, అరటి పంటలను, అన్నమయ్య ప్రాజెక్టు ప్రాంతాన్ని మంత్రి పరిశీలించారు. ఎమ్మెల్సీ సి.రామచంద్రయ్య మందపల్లె, పులపుత్తూరు గ్రామాల్లో పర్యటించి బాధితులకు బకెట్లు, జగ్గులు, చీరెలు, దుప్పట్లు, టవళ్లు, బియ్యం పంపిణీ చేశారు. చిత్తూరు జిల్లాలో ఆచూకీ లేని ఐదుగురు.. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గంలో స్వర్ణముఖి పరీవాహక ప్రాంతాల్లో సహాయ చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. 132 శిబిరాల ద్వారా 32,310 మందికి పునరావాసం కల్పించి నిత్యావసరాలు, తక్షణ ఆర్థిక సాయం, వసతి, భోజన సౌకర్యాలను కల్పించారు. చిత్తూరు జిల్లావ్యాప్తంగా 66 మండలాల్లో 489 గ్రామాలు వరద ముంపునకు గురైనట్లు గుర్తించారు. 126 గ్రామాలు జలదిగ్భంధంలో చిక్కుకున్నాయి. 62,865 మంది బాధితులు వరదల వల్ల ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు ప్రాథమికంగా అంచనా వేశారు. జిల్లాలో 11 మంది వరదల్లో కొట్టుకుపోగా ఇప్పటివరకు ఆరు మృతదేహాలు లభ్యమయ్యాయి. ఐదుగురి ఆచూకీ తెలియరాలేదని అధికారులు తెలిపారు. రామచంద్రాపురం మండలంలోని రాయలచెరువు లీకేజ్ పనులను చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, కలెక్టర్ హరినారాయణన్, ఇరిగేషన్ అధికారులు పర్యవేక్షిస్తూ మరమ్మతులు వేగంగా పూర్తయ్యేలా చర్యలు చేపట్టారు. చిత్తూరులోని కైలాసపురం వద్ద ముంపునకు గురైన వరద బాధితులను డిప్యూటీ సీఎం నారాయణస్వామి, ఆర్టీసీ వైస్ చైర్మన్ విజయానందరెడ్డి, రాష్ట్ర మొదలియార్ కార్పొరేషన్ చైర్మన్ బుల్లెట్ సురేష్ పరామర్శించి నిత్యావసర వస్తువులు, దుస్తులను పంపిణీ చేశారు. 48,900 కుటుంబాలకు తక్షణ సాయం, నిత్యావసరాలు.. జనజీవనం కకావికలమైన శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పెన్నా పరీవాహక ప్రాంతాల్లో ప్రజాప్రతినిధులతోపాటు స్వచ్ఛంద సంస్థలు సహాయ కార్యక్రమాల్లో పాలు పంచుకుంటున్నాయి. నష్టపోయిన 48,900 కుటుంబాలకు రూ.2 వేల తక్షణ ఆర్థిక సాయంతోపాటు నిత్యావసర సరుకులు, బియ్యం పంపిణీ అందించారు. 92 వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు. జిల్లావ్యాప్తంగా 212 ఇళ్లు పూర్తిస్థాయిలో దెబ్బతినడంతో ఆర్థిక సాయం పంపిణీకి సిద్ధం చేశారు. నష్టంపై శాఖలవారీగా ప్రాథమిక అంచనాలతో నివేదిక రూపొందించారు. జిల్లా ఇన్చార్జి మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, మంత్రులు మేకపాటి గౌతమ్‌రెడ్డి, డాక్టర్ పి.అనిల్‌కుమార్ యాదవ్‌తోపాటు ఎమ్మెల్యేలు నలపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి, కిలివేటి సంజీవయ్య, కాకాణి గోవర్ధన్‌రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, వెలగపల్లి వరప్రసాద్‌రావు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తూ సహాయ కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు. ఆత్మకూరు నియోజకవర్గం అప్పారావుపాళెం పునరావాస కేంద్రంలో ఆశ్రయం పొందుతున్న బాధితులను పరామర్శించిన అనంతరం మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి గిరిజన గూడేనికి చేరుకుని దెబ్బతిన్న ఇళ్లను పరిశీలించారు. 40 గంటల్లో పడుగుపాడు–నెల్లూరు ట్రాక్ పనులు పూర్తి చెన్నై–విజయవాడ ప్రధాన లైన్‌లోని పడుగుపాడు–నెల్లూరు సెక్షన్లో వరదల కారణంగా దెబ్బతిన్న రైల్వే ట్రాక్‌లను విజయవాడ డీఆర్ఎమ్ షివేద్రమోహన్ పర్యవేక్షణలో అధికారులు, సిబ్బంది అవిశ్రాంత కృషితో కేవలం 40 గంటల వ్యవధిలోనే అప్‌లైన్, డౌన్లైన్లలో పునరుద్ధరించారు. దీంతో ఈ మార్గంలో రైళ్ల రాకపోకలు సాధారణ స్థితికి చేరుకున్నాయి. వరద నీటి ఉధృతితో 1.8 కిలోమీటర్ల మేర ట్రాక్‌లు పూర్తిగా ధ్వంసం అయ్యాయి. దీంతో ఆ మార్గంలో అన్ని రైళ్లను రద్దు చేయడంతోపాటు కొన్నిటిని దారి మళ్లించి నడిపారు. ఆదివారం ఉదయం 6.30 గంటలకు యుద్ధ ప్రాతిపాదికన పునరుద్ధరణ పనులు చేపట్టారు. రోడ్డు మార్గం దెబ్బతినడంతో కార్మికులను తరలించేందుకు 6 వర్కుమెన్ స్పెషల్ రైళ్లు, 12 జేసీబీలు, 4 ఎక్స్కవేటర్లు, 2 రైల్ లారీలను వినియోగించారు. 300 మంది కార్మికులు రాత్రి, పగలు అవిశ్రాంతంగా శ్రమించి పునరుద్ధరణ పనులను విజయవంతంగా పూర్తి చేశారు. ఊరట చెందుతున్నాం.. గంటల వ్యవధిలో వరద ప్రవాహం ఇంట్లో చేరడంతో అంతా నీటి పాలైంది. వలంటీర్ల ద్వారా ప్రభుత్వం రూ.2 వేలు అందచేసింది. 25 కేజీలు బియ్యం, పప్పు, నూనె, ఇతర సరుకులు కూడా ఇచ్చారు. రెండు మూడు రోజుల్లో మరో రూ.3,800 నగదు ఇస్తామని హామీ ఇవ్వడంతో ఊరటగా ఉంది. – శీరం రమణమ్మ పడుగుపాడు, కోవూరు మండలం (నెల్లూరు జిల్లా) ప్రభుత్వ సాయం బాగుంది వరద గ్రామాల్లో అధికారులు చేపట్టిన సహాయ కార్యక్రమాలు బాగున్నాయి. డోజర్లు, జేసీబీలతో రోడ్లపై బురదను తొలగిస్తున్నారు. విరిగిపోయిన విద్యుత్ స్తంభాల స్థానంలో కొత్తవి అమర్చుతున్నారు. ప్రతి ఇంటికి రూ.5,800 ఆర్థిక సాయం అందించారు. నిత్యావసర సరుకులు కూడా ఇచ్చారు. – శ్రీనివాసులు, మందపల్లె (కడప జిల్లా) ఇంటింటికీ మందులు, నిత్యావసరాలు వరదల వల్ల గ్రామాల్లోకి పెద్ద ఎత్తున బురద కొట్టుకుని వచ్చింది. ఫైరింజన్ల ద్వారా అధికారులు బురదను తొలగించారు. ప్రతి పూట భోజనాలు, మంచినీరు అందిస్తున్నారు. వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి ఇంటింటికి మందులు ఇచ్చారు. రేషన్, నగదు, నూనె లాంటివి అందించి ఆదుకున్నారు. – లక్ష్మిదేవి, మందపల్లె (కడప జిల్లా) -
ఏపీ వరద బాధితులకు గీతా ఆర్ట్స్ సాయం..
Geeta Arts Funding To Andhra Pradesh Flood Victims: సినిమాలు నిర్మిస్తూ డబ్బులు సంపాదించడమే కాదు, అవసరానికి సహాయం కూడా చేస్తారు సినీ నిర్మాతలు. అలాంటి కోవకే చెందినదే ప్రముఖ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్. అయితే గత కొన్నిరోజులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వరదలు ముంచెత్తున్నాయి. రాష్ట్రంలోని తిరుపతి, నెల్లూరు ప్రాంతాల్లో వరద ఉద్ధృతికి ప్రజలు అవస్థలు పడుతున్నారు. వరద బాధితులను ఆదుకోడానికి పలువురు తమవంతు సాయం కూడా అందిస్తున్నారు. తాజాగా టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ తిరుపతి వరద బాధితులకు ఆర్థిక సాయం అందించింది. వారికోసం రూ. 10 లక్షలను ఆంధ్రప్రదేశ్ సీఎం రిలీఫ్ ఫండ్‌కు విరాళంగా ఇచ్చింది. ఈ విషయాన్ని గీతా ఆర్ట్స్ స్వయంగా ట్విటర్లో ప్రకటించింది. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలకు తమవంతు సాయం చేస్తున్నట్లు పేర్కొంది. We have made a humble donation of Rs 10 lakh to @AndhraPradeshCM relief fund to help with the relief measures in flood-affected areas of #TirupatiRains. — Geetha Arts (@GeethaArts) November 24, 2021 ఇలా ఇంతకుముందు 'గీతా ఆర్ట్స్2' బ్యానర్లో వచ్చిన 'గీతా గోవిందం' సినిమా ఫ్రాఫిట్‌ను కేరళ వరద బాధితులకు సహాయంగా అందించారు. మరోవైపు గీతా ఆర్ట్స్ బ్యానర్లో మెగా హీరో వరుణ్ తేజ్ నటించిన 'గని' చిత్రం ఈ క్రిస్మస్కి థియేటర్లలో సందడి చేయనుంది. -
వరద సాయం అందడంలో తప్పులు జరగకూడదు: సీఎం జగన్
సాక్షి, అమరావతి: ఏపీలో వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మరోసారి సమీక్ష నిర్వహించారు. నెల్లూరు, చిత్తూరు, వైఎస్సార్, అనంతపురం జిల్లాల కలెక్టర్లతో బుధవారం సచివాలయంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ సమీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా గత సమావేశంలో ఇచ్చిన ఆదేశాల అమలు ప్రగతిని సీఎం పరిశీలించారు. నిత్యవసరాల పంపిణీ, వరద బాధిత కుటుంబాలకు అదనంగా రూ.2వేల పంపిణీ, సహాయ శిబిరాలు, విద్యుత్తు–తాగునీటి సరఫరా పునరుద్ధరణ, వైద్య–ఆరోగ్య శిబిరాలు, దురదృష్టవశాత్తూ ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు పరిహారం, గల్లంతైన వ్యక్తుల ఆచూకీ, పశుదాణా పంపిణీ తదితర అంశాలపై ముఖ్యమంత్రి సమగ్రంగా చర్చించారు. చదవండి: ప్రధాని మోదీ, అమిత్‌షాకు సీఎం వైఎస్ జగన్ లేఖ అనంతరం అంశాల వారీగా వరద నష్టం నివేదికలను– సహాయ చర్యల్లో ప్రగతిని సీఎంకు అధికారులు వివరించారు. 95,949 వరద బాధిత కుటుంబాలకు నిత్యావసరాలు అందించే కార్యక్రమం శరవేగంగా చేశామని కలెక్టర్లు తెలిపారు. మొత్తం నాలుగు జిల్లాల్లో 19,832 మందికి మినహా అందరికీ నిత్యావసరాలు అందాయని తెలిపారు. ఈ సాయంత్రంలోగా వీరికి కూడ నిత్యావసరాలు అందిస్తున్నామన్నారు. వరద బాధిత కుటుంబాలకు రూ.2వేల చొప్పున అదనపు సహాయం దాదాపుగా అందిందని వివరించారు. సహాయక శిబిరాల నుంచి ప్రజలంతా తిరిగి ఇళ్లకు వెళ్లారన్నారు. చదవండి: తమాషా చేస్తున్నావా?.. డ్యూటీ అంటే లెక్కలేదా? కడపలో 155 గ్రామాలకు విద్యుత్తు అంతరాయం కలిగితే.. అన్నింటికీ పునరుద్ధరించామని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ ప్రాంత సీఎండీ ఇక్కడే ఉండి... విద్యుత్తును పూర్తిగా పునరుద్ధించారని పేర్కొన్నారు. నిన్న మళ్లీ భారీ వర్షం కారణంగా 8 ఆవాసాలకు మాత్రమే విద్యుత్తు పునరుద్ధరణలో ఇబ్బందులు వచ్చాయని, ఈరోజు పునరుద్ధరిస్తామన్నారు. అన్ని తాగునీటి పథకాలను పునరుద్ధరిస్తున్నామని, ట్యాంకర్ల ద్వారా సరఫరా చేస్తున్నామని చెప్పారు. రాజంపేటలో 36 బోర్లు వేసి.. వాటిద్వారా నీటిని పంపిణీ చేస్తున్నామని పేర్కొన్నారు. చదవండి: నవరత్నాలతో ప్రతీ ఎస్సీ కుటుంబానికి లబ్ధి.. అసెంబ్లీలో మంత్రి విశ్వరూప్ సమ్మర్ స్టోరేజీ ట్యాంకును పునరుద్ధరించే చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఫైర్ టెండర్లతో ప్రతి ఇంటినీ క్లీన్ చేస్తున్నామని తెలిపారు. దురదృష్టవశాత్తూ వరదల కారణంగా మరణించిన వారికి నష్టపరిహారాన్ని కూడా శరవేగంగా అందించామని కలెక్టర్లు తెలిపారు. మృతదేహాలు లభ్యమైన కుటుంబాలకు వెంటనే అందించామని చెప్పారు. గల్లంతై ఆచూకీ లభ్యంకాని వారి విషయంలో ఎఫ్ఐఆర్, పంచనామాలు పూర్తిచేస్తున్నామని తెలిపారు. సహాయ చర్యలపై అధికారులకు సీఎం ఆదేశాలు.. దాదాపు 95 వేల కుటుంబాలు వరదలకు ప్రభావితం అయ్యాయని, ప్రభుత్వం ఇస్తున్న సహాయం పూర్తిగా వారికి అందాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. సహాయం అందించడంలో ఎక్కడా తప్పులు జరగడానికి వీల్లేదని స్పష్టం చేశారు. కలెక్టర్లు స్వయంగా పర్యవేక్షించాలన్నారు. తాగునీటి విషయంలో అధికారులు శరవేగంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోయినందున.. తాగునీటి కొరత రాకుండా చూడాలని, దీనిపై పటిష్టమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇంకా ఆయన మాట్లాడుతూ.. ►రానున్న రోజుల్లో కూడా ఇబ్బంది రాకుండా సమగ్ర ప్రణాళిక రూపొందించాలి. ►తాగునీరు, కరెంటుకు సంబంధించి ప్రజల నుంచి ఎలాంటి ఫిర్యాదులు రాకూడదు. ►తాగునీటి అంశాన్ని అధికారులు సీరియస్‌గా తీసుకోవాలి. ► ప్రతిరోజూ కూడా వ్యక్తిగతంతా కలెక్టర్లు పర్యవేక్షించాలి. ►104 కాల్ సెంటర్‌కు వచ్చిన వినతులపై వెంటనే రెస్పాండ్ కావాలని సీఎం ఆదేశం ► శానిటేషన్‌మీద బాగా శ్రద్ధ పెట్టాలి. ►కలెక్టర్లు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలి. ►104 నంబర్‌ను బాగా ప్రచారం చేయాలి. ►ఎవరికైనా ఏదైనా అందకపోయినా, ఏదైనా ఇబ్బంది ఉన్నా 104కు కాల్చేస్తే వెంటనే స్పందించాలి, వారికి సహాయాన్ని అందించాలి. పశునష్ట పరిహారమూ అందించాలి ►చనిపోయిన పశువులకు వెంటనే పరిహారం అందించాలి. ►పశువులకు వాక్సినేషన్ చేయాలి. ►పశువుల దాణా కూడా పంపిణీచేయాలి. పూర్తిగా దెబ్బతిన్నవారికి కొత్త ఇళ్లు ►పూర్తిగా దెబ్బతిన్న, పాక్షికంగా దెబ్బతిన్న ఇళ్లకు సంబంధించి పరిహారాన్ని వేగంగా అందించాలి. ►వచ్చే 3–4 రోజుల్లో ఇళ్లకు సంబంధించి పరిహారం వారికి అందాలి. ►అంతేకాక పూర్తిగా దెబ్బతిన్న ఇళ్లకు సంబంధించి కొత్త ఇళ్లను మంజూరు చేయాలి. ► వారికి రూ.95వేల చొప్పున పరిహారంతోపాటు కొత్త ఇంటికి రూ.1.8లక్షలు మంజూరుచేయాలి. ►దీనివల్ల వారు వెంటనే పనులు ప్రారంభించగలుగుతారు. పంట నష్టపరిహారం ► పంట నష్టహారానికి సంబంధించి కూడా ఎన్యుమరేషన్ చురుగ్గా సాగాలి. ►రోడ్ల పునరుద్ధరణకు సంబంధించి కలెక్టర్లు వెంటనే నివేదికలు ఇవ్వాలి. ►ఈ నివేదికలు ప్రకారం వెంటనే ప్రణాళికలు వేసి పనులు ప్రారంభించాలి. ►ఈ పనులకు ప్రాధాన్యత ఇచ్చి నిధులను మంజూరుచేయాలి. ►నెలరోజుల్లోగా శాశ్వత పనులు మంజూరు కావాలి. ►కలెక్టర్లతో సమన్వయం చేసుకుని వెంటనే పనులు ప్రారంభమయ్యేలా చూసుకోవాలి. ►ఈలోగా రవాణాకు ఇబ్బంది రాకుండా తాత్కాలిక పనులు వెంటనే చేపట్టాలి. ►చెరువులు, గట్లకు సంబంధించి పునరుద్ధరణ పనులు వెంటనే మొదలుకావాలి. 2017లో అన్నమయ్య ప్రాజెక్టు నివేదికను పట్టించుకోలేదు ►గతంలో అన్నమయ్య ప్రాజెక్టుపై నివేదికలను పట్టించుకోలేదు. ►చెయ్యేరు ప్రాంతంలో గతంలో ఉన్నడూలేని విధంగా వరద వచ్చింది. ►పింఛ, అన్నమయ్య ప్రాజెక్టుల నీటి విడుదల సామర్థ్యానికి మంచి వరదనీరు వచ్చింది. ►అన్నమయ్య ప్రాజెక్టు 2.85 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేసేలా డిజైన్ చేయాలి, కానీ 2.17 లక్షల క్యూసెక్కులు మాత్రమే విడుదల చేయగలదు, అప్పుడు అలానే డిజైన్ చేశారు ►కాని దురదృష్టవశాత్తూ 3.2 లక్షల క్యూసెక్కులనీరు వచ్చింది. ►2017లో అన్నమయ్య ప్రాజెక్టుపై నివేదిక కూడా ఇచ్చారు, ప్రాజెక్టును మెరుగుపరచమన్నారు. ►ఇవాళ ప్రాజెక్టు విషయంలో విమర్శలు చేస్తున్న నాయకులు అప్పుడు పట్టించుకోలేదు. ►పింఛా విడుదల సామర్థ్యం 58వేల క్యూసెక్కులు అయితే, 1.38 లక్షల క్యూసెక్కుల వరద నీరు వచ్చింది. ►దీనిపై ఉన్న అన్ని వాగులు, వంకలు కూడా ఎప్పుడూలేని విధంగా వరదనీరు వచ్చింది. ►ప్రాజెక్టుల వద్ద, చెరువుల వద్ద నీటి విడుదల సామర్థ్యానికి మంచి వరద వచ్చింది. ►చెయ్యేరు వెంబడికూడా ఇలాంటి పరిస్థితి వచ్చింది. ►భవిష్యత్తులో ఇలాంటి వరద వస్తుందని అంచనా వేసుకుని ఆ మేరకు చర్యలు తీసుకోవాలి. ► ప్రస్తుతం వచ్చిన వరదను దృష్టిలో ఉంచుకుని.. అన్నమయ్య ప్రాజెక్టును పునరుద్ధరించాలి, రీ డిజైన్‌చేయాలి: అధికారులకు సీఎం ఆదేశాలు ఇరిగేషన్ ప్రాజెక్టులపై తక్షణ నివేదిక ►13 జిల్లాల్లో ఉన్న ఇరిగేషన్ ప్రాజెక్టుల భద్రతపై దృష్టిపెట్టండి. ►డ్యాంల భద్రతపై గత ప్రభుత్వాల్లో ఇచ్చిన నివేదికలు బయటకు తీయండి. ►ప్రస్తుతం ఉన్న నీటి విడుదల సామర్థ్యం, గరిష్ట వరద ప్రవాహంపై అంచనాలను మరోసారి పరిశీలించి, నివేదికలు తయారుచేయాలి. ►ఉదాసీనత వల్ల ఇప్పటివరకూ పెండింగులో ఉన్న డ్యాంల భధ్రతపై దృష్టిపెట్టండి. ►అన్నమయ్య లాంటి ఘటనలు భవిష్యత్తులో జరక్కూడదు. ►దీనికోసం అన్ని చర్యలూ తీసుకోవాలి. 26 నుంచి వర్షాలు –అప్రమత్తత ►ఈనెల 26 నుంచి వర్షాలు ఉన్నాయన్న సమాచారం నేపథ్యంలో జాగ్రత్తలు కూడా తీసుకోవాలి: ►27, 28, 29 తేదీల్లో నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు: ►భారీ వర్ష సూచనపై కలెక్టర్లకు నివేదికలు పంపించండి: సీఎం ►తద్వారా ఆయా ప్రాంతాల్లో చర్యలు తీసుకునేందుకు వీలు ఉంటుందని అధికారులకు సీఎం జగన్ దిశానిర్దేశం చేశారు. సమీక్షా సమావేశానికి సీఎస్ డాక్టర్ సమీర్ శర్మ, డీజీపీ గౌతం సవాంగ్, వ్యవసాయశాఖ స్పెషల్ సీఎస్ పూనం మాలకొండయ్య, గృహనిర్మాణశాఖ స్పెషల్ సీఎస్ అజయ్ జైన్, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్, రెవెన్యూశాఖ ముఖ్య కార్యదర్శి వి ఉషారాణి, ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ కాటమనేని భాస్కర్, ఇంధనశాఖ కార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్, సివిల్ సఫ్లైస్ కమిషనర్ ఎం గిరిజా శంకర్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ ఎం ఎం నాయక్ ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అనంతపురము జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి, చిత్తూరు జిల్లా కలెక్టర్ ఎం హరినారాయణ, వైయస్సార్ కడప జిల్లా కలెక్టర్ వి విజయరామరాజు, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం ఎన్ హరీంద్రప్రసాద్‌లు హాజరయ్యారు. -
హమాలీగా మారి.. బస్తాలు మోసిన ఎమ్మెల్యే చెవిరెడ్డి
తిరుపతి రూరల్: రాయల చెరువు సమీపంలో వరద ముంపు ప్రజలకు నిత్యావసర సరుకులు అందించేందుకు ప్రభుత్వ విప్, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి హమాలీగా మారి బస్తాలను మోసారు. మంగళవారం తిరుపతి విమానాశ్రయం నుంచి ఆర్సీపురం మండలంలోని 11 గ్రామాలకు రాష్ట్ర ప్రభుత్వం పంపించిన 10 టన్నుల నిత్యావసర సరుకులు హెలికాప్టర్ ద్వారా వచ్చాయి. ఆ బస్తాలను చెవిరెడ్డి తన సహచరులతో కలిసి హెలికాప్టర్ నుంచి కిందకు దించి ముంపు బాధితులకు అందజేశారు. వరద ముంపు నేపథ్యంలో ఏ ఒక్క వ్యక్తి ఆకలితో అలమటించే పరిస్థితి ఉండకూడదని, చెరువుకు గండి పడినా ఏ ఒక్కరికీ ప్రాణహాని జరగకూడదనేది సీఎం జగన్ ఆదేశించారని ఆయన చెప్పారు. ఇప్పటికే 7 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించామన్నారు. ముంపు బాధితులకు సత్వర సాయం అందించేందుకు నేవీ హెలికాప్టర్ల ద్వారా దాదాపు 5 వేల మందికి నిత్యావసర సరుకులను గ్రామాలకు చేర్చినట్టు తెలిపారు. -
సహాయ కార్యక్రమాలను పర్యవేక్షించండి.. మంత్రులు, ఎమ్మెల్యేలకు సీఎం జగన్ ఆదేశం
సాక్షి, అమరావతి: తక్షణమే వర్షాలు, వరద ప్రభావిత ప్రాంతాలకు చేరుకుని సహాయ కార్యక్రమాలను పర్యవేక్షించాలని ఆయా జిల్లాలకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇన్చార్జ్ మంత్రులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. గ్రామాల్లో పర్యటించి బాధితులకు తక్షణ సాయం అందించాలన్నారు. ఎక్కడికక్కడ అధికారులతో సమన్వయం చేసుకుంటూ ప్రజలకు తోడుగా నిలవాలని సీఎం నిర్దేశించారు. వరద ప్రభావిత ప్రాంతాలకు చెందిన ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రావాల్సిన అవసరం లేదని, వారి ప్రాంతాల్లోనే సహాయ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాలని ఆదేశించారు. సమస్యలను అధికారుల దృష్టికి తెచ్చి పరిష్కరించి తిరిగి సాధారణ పరిస్థితులు నెలకొనే వరకు వరద బాధితులకు అండగా నిలవాలని సూచించారు. పట్టణాల్లో పారిశుధ్యం, డ్రైనేజీల పూడికతీత పనులతో పాటు వరద ప్రాంతాల్లో అంటువ్యాధులు ప్రబలకుండా వైద్య సదుపాయాలు కల్పించడంపై దృష్టి సారించాలని సీఎం జగన్ ఆదేశించారు. బాధితులకు ప్రభుత్వం తరపున రేషన్ సరుకుల పంపిణీ చేపట్టడంతోపాటు నష్టంపై పక్కాగా అంచనాలు రూపొందించాలని సూచించారు. పంటలు పూర్తిగా దెబ్బతిన్న రైతులు తిరిగి సాగు చేపట్టేలా విత్తనాలు, తదితరాలు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. -
వరద బాధితులకు మెరుగైన సేవలందించండి
సాక్షి, అమరావతి: వరద బాధితులకు మెరుగైన వైద్య సేవలందించాలని డిప్యూటీ సీఎం, వైద్యారోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని ఆదేశించారు. మంగళగిరిలోని ఏపీఐఐసీ భవనంలో శనివారం వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారులతో వరద ముంపు జిల్లాల్లో అందుతున్న వైద్య సేవలపై మంత్రి సమీక్ష నిర్వహించారు. ముంపు ప్రాంతాల్లో పరిస్థితులను ఆయా జిల్లాల వైద్యారోగ్య శాఖ అధికారుల నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తెలుసుకున్నారు. ఈ సందర్భంగా నాని మాట్లాడుతూ.. వరద ప్రభావిత ప్రాంతాల్లో మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసి, ప్రతి క్యాంపులో సీనియర్ వైద్యుల బృందం అందుబాటులో ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు, వైఎస్సార్, అనంతపురం, చిత్తూరు జిల్లాలు సహా వరద ప్రభావిత ప్రాంతాల్లో వైద్య బృందాలు 24 గంటలూ ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు. కరోనా నిబంధనలు పాటిస్తూ వరద బాధితులకు అవసరమైన వైద్య సేవలు అందించేలా వైద్య సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. అలాగే శానిటేషన్‌పై ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. వరద తగ్గిన ప్రాంతాల్లో వైద్య సిబ్బంది ఇంటింటికీ వెళ్లి ప్రజల ఆరోగ్య పరిస్థితిపై వివరాలు సేకరించాలని, అవసరమైన మందులు పంపిణీ చేయాలని ఆదేశించారు. ఆయా జిల్లాల వైద్యారోగ్య శాఖ అధికారులు ఎప్పటికప్పుడు ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తూ ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలన్నారు. అన్ని జిల్లాల్లోని వైద్యారోగ్య శాఖ కార్యాలయాల్లో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేయాలని చెప్పారు. అలాగే మెడికల్ క్యాంపుల వద్ద 108 అంబులెన్స్‌లను అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. సమీక్షలో వైద్యారోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్, కమిషనర్ కాటమనేని భాస్కర్, ఆరోగ్యశ్రీ సీఈవో వినయ్ చంద్ పాల్గొన్నారు. -
వరద సాయం ఎప్పుడిస్తారు?
సాక్షి,హైదరాబాద్: గతేడాది సంభవించిన వరదల కారణంగా నష్టపోయిన హైదరాబాద్ వాసులకు వరద సాయం ఎప్పుడిస్తారని ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రావణ్ కుమార్ ప్రశ్నించారు. జీహెచ్ఎంసీ ఎన్నికలు అయిపోగానే బ్యాంకు ఖాతాల్లో రూ.10వేల నగదు సాయం ఇస్తామని చెప్పి ఇప్పటి వరకు ఎందుకు జమ చేయలేదో జవాబు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆదివారం మంత్రి కేటీఆర్‌కు ఆయన లేఖ రాశారు. ‘రాత్ గయి బాత్ గయి’తరహాలో రూ.10వేలు నగదు ఇస్తామని చెప్పి ఓట్లు వేయించుకున్న తర్వాత బాధితులను గాలికొదిలేయడం సమంజసం కాదని పేర్కొన్నారు. వరద సాయం పొందిన వారి వివరాలు పబ్లిక్ డొమైన్లో పెట్టి పారదర్శకంగా ఎందుకు వ్యవహరించడం లేదని ప్రశ్నించారు. హైదరాబాద్‌లోని దాదాపు 5 లక్షల మంది గతేడాది అక్టోబర్ నుంచి వరదసాయం కోసం ఎదురుచూస్తున్నారని, దీన్ని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. గత కొద్దిరోజులుగా కురుస్తున్న వర్షాలతో దాదాపు రూ.200 కోట్ల వరకు నష్టం జరిగిందని ప్రాథమిక అంచనాలు చెబుతున్నాయని, ఈ పరిహారాన్ని కూడా ఎప్పుడు చెల్లిస్తారో చెప్పాలని కోరారు. 8 నెలల క్రితమే వరదలు ముంచెత్తి నష్టాన్ని కలిగించినా రాష్ట్ర ప్రభుత్వం మేలుకోకపోవడం దురదృష్టకరమన్నారు. ఇప్పటివరకు వరద సాయం ఎందుకు ఇవ్వలేదో, ఎప్పుడు ఇస్తారో ప్రభుత్వం అధికారికంగా ప్రకటించాలని ఆ లేఖలో కోరారు. డ్రైనేజీ వ్యవస్థ, నాలాల విస్తరణ, మ్యాన్‌హోల్స్, ఓపెన్‌నాలా సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. -
వరద సాయం ఆపండి
సాక్షి, హైదరాబాద్ : జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో నగరంలో వరద బాధిత కుటుంబాలకు అందిస్తున్న సాయాన్ని వెంటనే నిలిపివేయాలని ప్రభుత్వాన్ని రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్ఈసీ) ఆదేశించింది. దరఖాస్తుల స్వీకరణ, పంపిణీని ఆపాలని సూచించింది. ‘అది విపత్తు సాయం కిందికి వస్తుంది కాబట్టి.. నేరుగా బాధితుల బ్యాంక్ అకౌంట్లలోకి ప్రభుత్వం ట్రాన్స్ఫర్ చేయవచ్చు’ అని మంగళవారం నోటిఫికేషన్ విడుదల సందర్భంగా కమిషనర్ పార్థసారథి ఒక ప్రశ్నకు సమాధానమిచ్చారు. 24 గంటలు గడవకముందే.. దీనికి భిన్నంగా బుధవారం ఎస్ఈసీ కార్యదర్శి ఎం.అశోక్‌కుమార్ అత్యవసరంగా ఒక లేఖను మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శికి పంపిం చారు. మంగళవారం నోటిఫికేషన్‌తో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చిందని, ఫలితాలు వెలువడే వరకు ఇది కొనసాగుతుందని లేఖలో స్పష్టం చేశారు. వరద సాయం పంపిణీ ఎన్నికల కోడ్ ఉల్లంఘన కిందికి వస్తుందని, ఓటర్లను ప్రభావితం చేసే అవకాశం ఉన్నందున వెంటనే దాన్ని నిలిపివేయాలని సూచించారు. దీని ప్రతిని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి కూడా పంపించారు. ఎస్ఈసీ ఆదేశాల మేరకు వరద సాయం దరఖాస్తుల స్వీకరణను తక్షణమే నిలిపివేస్తున్నట్లు మీ సేవ కేంద్రాల్లోనూ, ఆన్‌లైన్‌లోనూ డిస్ప్లే చేశారు. ఇదిలా ఉండగా, ఇప్పటివరకు హైదరాబాద్‌లో మొత్తం 6.64 లక్షల బాధిత కుటుంబాలకు వరద సాయం కింద రూ.664 కోట్లు అందజేసినట్లు ప్రభుత్వం ఒక ప్రకటనలో పేర్కొంది. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చినందున ఎస్ఈసీ ఆదేశాల మేరకు సాయం పంపిణీని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు తెలిపింది. ఎన్నికల కోడ్ ముగిసిన అనంతరం దరఖాస్తుల స్వీకరణ, సాయం పంపిణీని తిరిగి ప్రారంభించనున్నట్లు వెల్లడించింది. బురద రాజకీయం భారీ వర్షాలు, వరదల వల్ల దెబ్బతిన్నహైదరాబాద్ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా బురద రాజకీయం చేస్తోంది. ఇప్పటికే 6.78 లక్షల మందికి వరద సాయం అందజేశాం. కేంద్రం రూపాయి ఇవ్వకపోగా... పేదలకు ఆర్థిక సాయం నిలిపివేయాలని ఎన్నికల సంఘానికి బీజేపీ ఫిర్యాదు చేసింది. పేదల నోటికాడి బుక్కలాక్కునేలా చిల్లర రాజకీయాలు చేస్తోంది. - సీఎం కేసీఆర్ ప్రమాణానికి నేను సిద్ధం రూ. 10 వేలు వరద సాయం ఇచ్చుకోవచ్చని చెప్పిన ఎన్నికల సంఘం ఇప్పుడు ఎందుకు ఆపింది. ఇంతకన్నా చిల్లర ప్రభుత్వం ఇంకోటి ఉంటుందా. సోషల్ మీడియాలో నా పేరుపై సర్క్యులేట్ అవుతున్న లెటర్ నాది కాదు.ఆ లెటర్ హెడ్, అందులో సంతకం కూడా నాది కాదు. కేసీఆర్‌కు సంతకాలు ఫోర్జరీ చేయడం పెద్ద విషయం కాదు. ఆ లెటర్‌పై విచారణ చేపట్టాలి. - బండి సంజయ్ -
గ్రేటర్లో వరద సాయానికి బ్రేక్!
-
వరద సాయం; ఈసీ కీలక ఆదేశాలు
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్‌లో వరద సాయానికి బ్రేక్ పడింది. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మంగళవారం నగారా మోగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎన్నికల ప్రవర్తనా నియామవళి(మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్) అమల్లోకి రావడంతో రాష్ట్ర ఎన్నికల సంఘం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. జీహెచ్ఎంసీ పరిధిలో ప్రభుత్వం అమలు చేస్తోన్న వరద సాయం కోసం దరఖాస్తుల స్వీకరణ, పంపిణీని నిలిపివేయాలని ఆదేశించింది. ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం ఈ పథకాన్ని యథావిధిగా కొనసాగించుకోవచ్చని ఎస్ఈసీ స్పష్టం చేసింది. కాగా నగరంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు జనజీవనం అతలాకుతలమైన విషయం విదితమే. వరదలు ముంచెత్తడంతో చాలా మంది ఇళ్లు కోల్పోయి నిరాశ్రయులు కాగా, ఎంతో మందికి భారీగా ఆస్తి నష్టం జరిగింది. (చదవండి: ‘టీఆర్ఎస్ ఇచ్చే డబ్బులు ఏ మూలకు సరిపోవు’) -
లోతట్టు ప్రాంతాలు జలమయం
సాక్షి ప్రతినిధి, ఏలూరు/సాక్షి/అమరావతి బ్యూరో/అమలాపురం/జగ్గంపేట/కర్నూలు (అగ్రికల్చర్): తెలంగాణ నుంచి వస్తున్న వరద ప్రవాహంతో పశ్చిమగోదావరి జిల్లాలోని తమ్మిలేరు ఉగ్రరూపం దాల్చింది. ఏలూరులో ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తుండటంతో పల్లపు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని వెంటనే స్పందించి రెండుచోట్ల భారీ గండ్లు పెట్టించడంతో ఏలూరు ముంపు నుంచి తప్పించుకుంది. నగరంలో ఆరు చోట్ల పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. తమ్మిలేరు కాల్వపై నిర్మించిన వంతెనకు కృష్ణా జిల్లా వైపు గండిపడే ప్రమాదం ఉండటంతో రెండు జిల్లాల మధ్య రాకపోకలు నిలిపివేశారు. తాడేపల్లిగూడెం మండలం వీరంపాలెంలో ఎర్రకాల్వకు, దెందులూరు మండలం సత్యనారాయణపురంలో గండేరువాగుకు రెండు గండ్లు పడ్డాయి. దీంతో జోగన్నపాలెం, దోసపాడు, దెందులూరు దళితవాడల్లో ఇళ్లల్లోకి వర్షపు నీరు చేరింది. నిడదవోలు మండలం తిమ్మరాజుపాలెంలో కోటసత్తెమ్మ అమ్మవారి ఆలయంలోకి వరద నీరు ప్రవేశించింది. భీమవరం మండలం తోకతిప్పలో వర్షానికి రేకుల షెడ్డు కూలి వృద్ధురాలు మృతి చెందింది. కామవరపుకోట మండలం అడమిల్లిలో చేపలు పట్టడానికి వెళ్లి బాలస్వామి మరణించాడు. ‘తూర్పు’లో ముంపులోనే పలు ప్రాంతాలు తూర్పుగోదావరి జిల్లాలో పిఠాపురం, పెద్దాపురం, ప్రత్తిపాడు, కాకినాడ రూరల్, కాకికాడ నియోజకవర్గాలు ముంపు బారిన పడ్డాయి. గొల్లప్రోలు, పిఠాపురం, కొత్తపల్లి మండలాల్లో లోతట్టు కాలనీలు నీటమునిగాయి. ఏలేరు రిజర్వాయర్ ముంపు నీరు కాకినాడ శివారులో ట్రెజరీ కాలనీ, టీచర్స్ కాలనీ, రమణయ్యపేట జనచైతన్య కాలనీలను ముంచేసింది. అధికారులు పడవలపై వెళ్లి బాధితులకు ఆహారం, నీరు, మందులు అందజేశారు. జగ్గంపేట మండలం రామవరంలో వరద ఉధృతికి ఇల్లు కూలిపోయింది. మంగళవారం ఉదయం 8 గంటల నుంచి బుధవారం ఉదయం ఎనిమిది గంటల వరకు జిల్లాలో సగటున 10.3 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. మెట్టలో తాండవ, పంపా రిజర్వాయర్ల గేట్లు మూసివేశారు. కరపలో ముంపుబారిన పడిన వరి చేలను వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు పరిశీలించి రైతులకు భరోసా ఇచ్చారు. భారీ వర్షాలకు విజయవాడలో రాణీగారితోట, కృష్ణలంక, రామలింగేశ్వర్‌నగర్, రణవీర్నగర్, బాలాజీ నగర్, యనమలకుదురు తదితర ప్రాంతాల్లో ఇళ్లు నీట మునిగాయి. కర్నూలు జిల్లాలో 44 మండలాల్లో తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిశాయి. నీట మునిగిన తూర్పుగోదావరి జిల్లా కాకినాడ ఎఫ్‌సీఐ కాలనీ తూర్పు గోదావరి జిల్లాలో పది మందిని కాపాడిన హోంగార్డ్ ప్రాణాలకు తెగించి వరదలో చిక్కుకున్న పదిమంది కార్మికులను కాపాడిన ఓ హోంగార్డ్ సాహసం అందరి ప్రశంసలు పొందింది. తూర్పుగోదావరి జిల్లా రామవరంలో బుధవారం పోలవరం ఎడమ కాలువ, పుష్కర కాలువలకు గండ్లు పడి వరదనీరు భారీగా గ్రామాన్ని ముంచెత్తింది. దీంతో బయటకు వచ్చే దారిలేక రామవరం వద్ద సిరామిక్ ఫ్యాక్టరీలో 10 మంది కార్మికులు చిక్కుకుపోయారు. వీరిలో పురుషులతోపాటు మహిళలు కూడా ఉన్నారు. వీరిని రక్షించేందుకు హైవే మొబైల్ డ్రైవర్‌గా పనిచేస్తున్న హోంగార్డ్ అర్జున్ నడుము లోతు నీళ్లల్లోనే వెళ్లి వారిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చాడు. అతడి సాహసాన్ని హోం మంత్రి సుచరితతోపాటు పలువురు అభినందించారు. కోస్తా, సీమకు మోస్తరు వర్షసూచన సాక్షి, విశాఖపట్నం: వచ్చే రెండు రోజులు కోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని విశాఖ వాతావరణ కేంద్రం బుధవారం వెల్లడించింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతం నుంచి తూర్పు మధ్య అరేబియా సముద్రం వరకు ఉత్తర కోస్తా, తెలంగాణలపై అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఈ ఉపరితల ఆవర్తనం మీదుగా 3.1 కి.మీ నుంచి 5.8 కి.మీ ఎత్తు మధ్య ఉపరితల ద్రోణి ఉంది. కాగా, గత 24 గంటల్లో కోస్తాలో విస్తారంగా, రాయలసీమలో అక్కడక్కడ భారీ నుంచి మోస్తరు వర్షాలు కురిశాయి. -
వరద సాయం శరవేగం
విద్యుత్ సరఫరాను వెంటనే పునరుద్ధరించాలి. కాలువలు, చెరువుల గండ్లు పూడ్చాలి. రహదారుల మరమ్మతులు తక్షణం చేపట్టాలి. భారీ వర్షాలు, వరదల కారణంగా వేర్వేరు జిల్లాల్లో మృతి చెందిన పది మంది కుటుంబాల వారికి వెంటనే పరిహారం చెల్లించాలి. వారంలోగా నష్టంపై అంచనాలు పంపించాలి. చిత్తూరు జిల్లాలో 40 శాతం అధిక వర్షాలు కురిసినా, కేవలం 30 శాతం మాత్రమే ట్యాంకులు నిండాయి. ఈ పరిస్థితిని మార్చాలి. కురిసే ప్రతి నీటి బొట్టును ఒడిసి పట్టి.. రిజర్వాయర్లు, చెరువులు నింపాలి. కరువు నివారణకు శాశ్వత పరిష్కారం చూపాలి. – సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సాక్షి, అమరావతి: యుద్ధ ప్రాతిపదికన సహాయ, పునరుద్ధరణ చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జిల్లాల అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. సహాయ శిబిరాల్లో ఉన్న వారి పట్ల మానవతా దృక్పథంతో వ్యవహరించాలని, వారికి రూ.500 చొప్పున ఇవ్వాలన్నారు. వారు ఇళ్లకు తిరిగి వెళ్లాక ఇబ్బందులకు గురి కాకుండా అన్ని విషయాలు ఆరా తీసి సహకరించాలని చెప్పారు. రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదలు, సహాయ కార్యక్రమాలపై బుధవారం ఆయన తన క్యాంపు కార్యాలయం నుంచి జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ జిల్లాల్లో భారీ వర్షాలు, వరద పరిస్థితులపై కలెక్టర్లను ఆరా తీశారు. వాయుగుండం నిన్న(మంగళవారం)నే తీరం దాటింది కాబట్టి ఇబ్బంది లేదని, అయినా పూర్తి అప్రమత్తతతో ఉండాలని సూచించారు. ఈ సమీక్షలో సీఎం ఆదేశాలు, సూచనలు ఇలా ఉన్నాయి. వరద సహాయక కార్యక్రమాలపై జరిగిన సమీక్షలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్. చిత్రంలో హోం మంత్రి సుచరిత తదితరులు ప్రకాశం బ్యారేజీకి భారీ వరద – తెలంగాణలో భారీ వర్షాల వల్ల ప్రకాశం బ్యారేజీకి భారీ వరద వస్తోంది. బ్యారేజీ వద్ద ఇప్పటికే భారీ వరద కొనసాగుతోంది. శ్రీశైలం నుంచి 4 లక్షల క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. మరో 24 గంటల్లో ఆ వరద చేరుతుంది. – ప్రకాశం బ్యారేజీ వద్ద 7.5 లక్షల క్యూసెక్కుల వరద వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఎలాంటి పరిస్థితి అయినా ఎదుర్కోవడం కోసం గుంటూరు, కృష్ణా జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలి. విజయవాడలో ఇళ్లు ఖాళీ చేయించే వారికి తప్పనిసరిగా వసతి కల్పించాలి. 45 నెలల్లో శాశ్వత మరమ్మతులు – రహదారుల మరమ్మతు పనులు వేగంగా జరగాలి. 45 నెలల్లో శాశ్వత ప్రాతిపదికన కూడా మరమ్మతులు పూర్తి చేయాలి. వారం రోజుల్లో నష్టంపై అంచనాలు పంపించాలి. – తూర్పు గోదావరి జిల్లాలో ఏలేరు రిజర్వాయర్ వల్ల పిఠాపురంలో వరద వస్తోంది. కాబట్టి అవసరమైన ఆధునికీకరణ చర్యలు చేపట్టాలి. వ్యాధులు ప్రబలకుండా చర్యలు – కలుషిత నీరు లేకుండా పరిశుభ్రమైన తాగునీరు సరఫరా చేయాలి. ఎక్కడా వ్యాధులు ప్రబలకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. డయేరియా వంటివి పూర్తిగా నివారించాలి. – అన్ని పీహెచ్సీలలో అవసరమైన మందులు అందుబాటులో ఉంచాలి. క్లోరినేషన్ చేయాలి. వరదలు తగ్గాక పాము కాట్లు పెరిగే ప్రమాదం ఉంటుంది కాబట్టి ఇంకాస్త అప్రమత్తంగా ఉండాలి. నీటి వృథాను అరికట్టాలి – రిజర్వాయర్లు నింపాలి. అక్కడి నుంచి కాలువల ద్వారా ప్రతి చెరువు నింపడంపై రాయలసీమ, శ్రీకాకుళం, విజయనగరం, ప్రకాశం జిల్లాల కలెక్టర్లు ప్రత్యేక దృష్టి పెట్టాలి. ఆ మేరకు కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలి. – నెల్లూరు జిల్లా కండలేరులో ఈసారి గరిష్టంగా 60 టీఎంసీల నీరు నిల్వ చేయబోతున్నాం. ఇప్పటి వరకు గరిష్టంగా 50 టీఎంసీలు మాత్రమే నిల్వ చేశాం. వరద తగ్గాక వ్యవసాయ శాస్త్రవేత్తల సూచనలు – వరదలు తగ్గుముఖం పట్టాక వ్యవసాయ, ఉద్యానవన వర్సిటీలు, కృషి విజ్ఞాన కేంద్రాలకు చెందిన వ్యవసాయ శాస్త్రవేత్తలు రైతులకు అవసరమైన సూచనలు చేస్తారని వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య వెల్లడించారు. పంటల పరిస్థితిపై కలెక్టర్లు వీలైనంత త్వరగా అంచనాలు పంపాలన్నారు. ధాన్యం సేకరణకు రైతు భరోసా కేంద్రాల వద్ద రిజిస్ట్రేషన్ కొనసాగుతోందని చెప్పారు. – వరదలు సంభవించిన అన్ని చోట్ల శానిటేషన్ కోసం తగిన ఏర్పాట్లు చేశామని, బ్లీచింగ్ పౌడర్ అందుబాటులో ఉంచామని పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేదీ పేర్కొన్నారు. తాగు నీటిని ట్యాంకర్ల ద్వారా సరఫరా చేస్తున్నామని చెప్పారు. – ఈ సమీక్షలో మంత్రులు మేకతోటి సుచరిత, బొత్స సత్యనారాయణ, సీఎస్ నీలం సాహ్ని, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
వరద బాధితులకు అదనంగా ఉచిత సరుకులు
సాక్షి, అమరావతి: గోదావరి ముంపు బాధిత కుటుంబాలకు సాధారణంగా (రెగ్యులర్) ఇచ్చే రేషన్‌కు అదనంగా నిత్యావసరాలు ఇవ్వాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. రెగ్యులర్‌గా ఇచ్చే రేషన్‌కు ఇది అదనంగా ఇవ్వాలని స్పష్టం చేశారు. ఆ సరుకులను సెప్టెంబర్ 7వ తేదీకల్లా పంపిణీ చేసేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్లకు సూచించారు. ‘స్పందన’లో భాగంగా మంగళవారం ఆయన తన క్యాంపు కార్యాలయం నుంచి కలెక్టర్లు, ఎస్పీలతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో వరద సహాయక చర్యలపై సమీక్షించారు. వివరాలు ఇలా ఉన్నాయి. ► సెప్టెంబర్ 7వ తేదీలోగా గోదావరి ముంపు బాధితుల్లో ఒక్కో కుటుంబానికి రూ.2 వేల చొప్పున అదనపు సహాయం ఇచ్చేలా ప్రణాళిక వేసుకోండి. ఇంతే కాకుండా 25 కేజీల బియ్యం, 2 లీటర్ల కిరోసిన్, 1 కేజీ కందిపప్పు, 1 లీటరు పామాయిల్, 1 కేజీ ఉల్లిపాయలు, 1 కేజీ బంగాళా దుంపలు రెగ్యులర్‌గా ఇచ్చే రేషన్‌కు అదనంగా ఇవ్వాలి. ► వరదల కారణంగా దెబ్బ తిన్న చోట్ల వెంటనే పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలి. రోగాలు ప్రబలే అవకాశం ఉన్నందున మందులు అందుబాటులో ఉంచుకోవాలి. ► వరద తగ్గుముఖం పట్టింది కాబట్టి.. రోగాలు రాకుండా మనం పోరాటం చేయాల్సి ఉంటుంది. ఈ దిశగా వెంటనే వైద్య శిబిరాలను ప్రారంభించాలి. మండల స్థాయిలో నిత్యావసర సరుకులను పూర్తి స్థాయిలో నిల్వ చేసుకోవాలి. పారిశుధ్య కార్యక్రమాలు, తాగు నీటి క్లోరినేషన్ కోసం చర్యలు తీసుకోవాలి. ► దేవుడి దయతో గోదావరిలో వరదలు తగ్గుముఖం పట్టాయి. గోదావరిలో 10 లక్షల క్కూసెక్కుల కంటే తక్కువ వరద ఉందన్న సమాచారం వస్తోంది. కృష్ణా నదిలో కూడా వరదలు తగ్గుముఖం పడుతున్నాయి. ► శ్రీశైలంలో గేట్లు కూడా మూసివేసిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ► సెప్టెంబర్ 7లోగా పంట నష్టంపై అంచనాలు రూపొందించి, కలెక్టర్లు ఆ మేరకు బిల్లులు సమర్పించాలి. దీనిపై ఉభయ గోదావరి జిల్లాల కలెక్టర్లు శ్రద్ధ పెట్టాలి. కృష్ణా జిల్లా సహా మిగిలిన చోట్ల ఎక్కడ పంటలు దెబ్బ తింటే.. అక్కడ వెంటనే చర్యలు చేపట్టాలి. వరద వేళ బాగా పని చేసిన ఉభయ గోదావరి జిల్లాల కలెక్టర్లకు అభినందనలు. -
వరద బాధితులను ఆదుకున్న మంత్రులు
సాక్షి, పశ్చిమగోదావరి : అసలే గోదావరి నది.. ఆపై జూలై, ఆగస్టు నెలలు వచ్చాయంటే వరద గోదావరిగా మారుతుంది. ఈ ఏడాది అదే జరిగింది. వరద గోదావరి నదీ పరీవాహ ప్రాంతాలను ముంచెత్తింది. అయితే ఎప్పటిలానే వరదను ఎదుర్కొనేందుకు అధికారులు సిద్ధమయ్యారు. నాయకులు కదిలారు. కానీ గతంలో చేసిన ఏర్పాట్లకంటే భిన్నంగా... ఎన్నడూ చేయని విధంగా ప్రభుత్వం కదిలింది. వరద బాధితులను ఆదుకుంది. ప్రజాప్రతినిధులు, అధికారులు బాధితులకు మేమున్నామంటూ అండగా నిలబడ్డారు. జూలై 30వ తేదీ అర్ధరాత్రి గోదావరి ఉగ్రరూపం దాల్చనుందని జిల్లా యంత్రాంగానికి సమాచారం అందింది. 31వ తేదీ ఉదయమే జిల్లా అధికారులు స్పందించారు. వరదను ఎప్పటికప్పుడు అంచాన వేస్తూ ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. వరద హెచ్చరికలు వచ్చిన వెంటనే జిల్లా కలెక్టర్ ముత్యాలరాజు ఈ విపత్తు ఎదుర్కొనేందుకు చర్యలు తీసుకున్నారు. ప్రధానంగా ప్రతి గ్రామానికి ప్రత్యేకాధికారులను నియమించారు. ప్రత్యేకాధికారులు వరద వచ్చే ప్రాంతాలకు చేరుకుని ప్రజలను అప్రమత్తం చేశారు. స్పందించిన నాయకులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసిన రోజే వర్షంలోనే ఉపముఖ్యమంత్రి, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్, ఇన్చార్జి మంత్రి, రెవెన్యూ శాఖ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్, మహిళా శిశుసంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత, స్థానిక శాసన సభ్యులు తెల్లం బాలరాజులతో కలిసి కలెక్టర్, జాయింట్ కలెక్టర్, ఎస్పీ, ఆర్డీఓ ముంపు ప్రాంతాలకు గోదావరిలో పడవలపై ప్రయాణించారు. ముంపునకు గురయిన కుటుంబాలను అధైర్యపడొద్దు అంటూ, అండగా ఉంటామంటూ భరోసా ఇచ్చారు. అప్పటికప్పుడే బియ్యం, కిరోసిన్, పంచదార, కందిపప్పు అందచేశారు. వారికి కావాల్సిన మందులు, జనరేటర్లు, టార్ఫాలిన్లు సిద్ధం చేశారు. వశిష్టగోదావరి వరదకు ఆచంటలోని లంకగ్రామాలు ముంపునకు గురై తే గృహనిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు రోజూ లంక గ్రామాలకు వెళ్లా రు. ప్రభుత్వం ఇస్తున్న సాయానికి అదనంగా సొంత డబ్బుతో కుటుంబానికి 10 కిలోల బి య్యం చొప్పున 180క్వింటాళ్లు పంపిణీ చేశారు. ముఖ్యమంత్రి తక్షణ స్పందన గోదావరి వరదపై ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి తక్షణం స్పందించారు. ఢిల్లీ పర్యటన నుంచి నేరుగా పోలవరం చేరుకుని ఏరియల్ సర్వే చేశారు. రాజమండ్రి విమానాశ్రయంలో సమీక్ష నిర్వహించి చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ప్రతి బాధిత కుటుంబానికి రూ.5వేలు పరిహారం ప్రకటించారు. తక్షణం బాధితులకు సహాయం అందించాలని ఆదేశించారు. అధికారులు అక్కడే కలెక్టర్ రేవు ముత్యాలరాజు ముంపు గ్రామాల్లో పర్యటించారు. జేసీ వేణుగోపాల్‌రెడ్డి నిత్యం పర్యవేక్షించారు. ఐటీడీఏ పీఓ ఆర్వీ సూర్యనారాయణ రోజూ ఏర్పాట్లు పరిశీలించారు. ఆర్డీఓ శివ నారాయణరెడ్డి ఏర్పాట్లు చేశారు. డెల్టాలో నరసాపురం ఆర్డీఓ సలీంఖాన్ ముంపు గ్రామాల్లో పరిస్థితులు చక్కబెట్టారు. కలెక్టర్, జేసీ ఆధ్వర్యంలో ఉన్నతాధికారులు, ప్రత్యేకాధికారులు, వైద్యాధికారులు, వ్యవసాయాధికారులు ఎప్పటికప్పుడు వరదను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండి నిరంతరం పర్యవేక్షించి ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేశారు. సహాయం మరువలేనంత బాధితులకు ప్రభుత్వం రూ.5వేల సహాయంతో పాటుగా తక్షణమే కిరోసిన్, బియ్యం, టార్పాలిన్లు, బంగాళదుంపలు, ఉల్లిపాయలు, పామాయిల్, ఉప్పు, మంచినీటి ప్యాకెట్లు అందించింది. ప్రత్యేక పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసింది. -
‘ఫొని’ నష్టం రూ.58.61 కోట్లు
సాక్షి, అమరావతి : ఫొని తుపాను కారణంగా రాష్ట్రంలోని శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలో రూ.58.61 కోట్ల నష్టం వాటిల్లిందని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం వెల్లడించారు. ఇది ప్రాథమిక అంచనా అని ఆయన చెప్పారు. తుపాను సహాయక చర్యలపై శనివారం ఢిల్లీ నుంచి కేంద్ర కేబినెట్ సెక్రటరీ ప్రదీప్‌కుమార్ సిన్హా రాష్ట్రంతో పాటు ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో జరిగిన నష్టం, తీసుకున్న చర్యలను సీఎస్ ఆయనకు వివరించారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం మండలంలో అత్యధికంగా 19.7 సెంమీల వర్షపాతం నమోదైందన్నారు. ఇదే జిల్లాలోని నాలుగు మండలాల్లో 2 లక్షల 74వేల మంది తుపానుకు ప్రభావితమయ్యారన్నారు. 304 ఇళ్లు దెబ్బతినగా, వాటిలో 168 ఇళ్లు పాక్షికంగాను, 19 పక్కా ఇళ్లు.. 35 కచ్చా ఇళ్లు పూర్తిగాను దెబ్బతిన్నాయని సిన్హాకు సీఎస్ వివరించారు. శ్రీకాకుళం జిల్లాలో 15,460 మందిని 139 పునరావాస కేంద్రాలకు, విజయనగరం జిల్లాలో 2వేల మందిని 15 పునరావాస కేంద్రాలకు తరలించామన్నారు. బాధితుల కోసం 348 వైద్య శిబిరాలను నిర్వహించామని తెలిపారు. 958 హెక్టార్లలో పంటలకు నష్టం కాగా, తుపాను కారణంగా ఈ రెండు జిల్లాల్లో 958 హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నాయని ఎల్వీ చెప్పారు. 214 హెక్టార్లలో వరి, 743 హెక్టార్లలో వేరుశనగ, పత్తి, జొన్న, పొద్దుతిరుగుడు వంటి పంటలకు నష్టం కలిగిందన్నారు. సుమారు 10 వేల కొబ్బరి చెట్లు నేలకూలగా 1,991 మంది రైతులు నష్టపోయారని తెలిపారు. విజయనగరం జిల్లాలో 229 ఎకరాల్లో అరటి తోటలు దెబ్బతిన్నాయని ఎల్వీ సుబ్రహ్మణ్యం కేంద్ర కేబినెట్ కార్యదర్శికి వివరించారు. అలాగే, రోడ్లు, భవనాల శాఖకు రూ.21.57 కోట్లు, పంచాయతీరాజ్ శాఖ రహదారులకు రూ.20.05 కోట్లు, విద్యుత్ శాఖకు రూ.9.75 కోట్లు, ఉద్యానవన శాఖకు రూ.4.09 కోట్లు, మున్సిపల్ పరిపాలనా శాఖకు రూ.1.82 కోట్లు, గ్రామీణ రక్షిత మంచినీటి విభాగానికి రూ.42.68 లక్షలు, గృహ నిర్మాణానికి రూ.85.35 లక్షలు, పశు సంవర్థక శాఖకు రూ.3.94 లక్షలు కేటాయించామన్నారు. కాగా చేనేత జౌళిశాఖ సహా పలు రంగాలకు సంబంధించి ప్రాథమిక నష్టం అంచనాలను కూడా రూపొందిస్తున్నట్లు ఆయన తెలిపారు. దెబ్బతిన్న విద్యుత్ స్తంభాలు 2,100 తుపాను కారణంగా శ్రీకాకుళం జిల్లాలోని 14 మండలాల్లో 733 గ్రామాలకు విద్యుత్ సరఫరాలో అంతరాయం కలిగిందని వీడియో కాన్ఫరెన్స్‌లో సీఎస్ చెప్పారు. 33 కేవీ ఫీడర్లు 19, 11 కేవీ ఫీడర్లు 101, 11/33 కేవీ ఫీడర్లు 45 దెబ్బతినగా సుమారు 2,100 విద్యుత్ స్తంభాలు దెబ్బతిన్నాయని వివరించారు. అన్ని మండల కేంద్రాలకు ఇప్పటికే విద్యుత్ సరఫరాను పునరుద్ధరించామన్నారు. మరో 74 గ్రామాల్లో పనులు జరుగుతున్నాయని తెలిపారు. దెబ్బతిన్న స్తంభాలన్నింటితోపాటు.. లక్షా 73 వేల వ్యవసాయేతర విద్యుత్ సర్వీసులను పునరుద్ధరించామన్నారు. గ్రామీణ మంచినీటి సరఫరా, మున్సిపల్ పరిపాలన, ఆర్ అండ్ బి శాఖలకు సంబంధించిన పనులు యుద్ధప్రాతిపదికన జరుగుతున్నాయన్నారు. సమావేశంలో సిన్హా మాట్లాడుతూ.. నష్టం అంచనాలను త్వరితగతిన అంచనా వేసి పునరుద్ధరణ పనులు త్వరగా పూర్తిచేయాలని ఆదేశించారు. ఒడిశాకు రాష్ట్రం చేయూత రాష్ట్రం నుంచి రెండు లక్షల టార్పాలిన్ ప్లాస్టిక్ షీట్లు, 12 లక్షల మంచినీటి ప్యాకెట్లు, యాంత్రిక రంపాలను హెలికాప్టర్ ద్వారా ఒడిశాకు పంపిస్తున్నట్లు సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం కేంద్ర కేబినెట్ కార్యదర్శికి తెలిపారు. ఈ మేరకు ఒడిశా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో కూడా ఎల్వీ మాట్లాడారు. అవసరాన్ని బట్టి వీటిని యుద్ధప్రాతిపదికన పంపించాలని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ కార్యదర్శి వరప్రసాద్‌ను సీఎస్ ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో ఐటీ, ట్రాన్స్‌కో సీఎండీ కే విజయానంద్, ఆర్టీజీఎస్ సీఈఓ బాబు పాల్గొన్నారు. -
సీఎస్ మార్గనిర్దేశంతో తగ్గిన ఆస్తి నష్టం
సాక్షి, అమరావతి: ఎలాంటి హడావిడి లేకుండా అధికార యంత్రాంగాన్ని తమ పని తాము చేసుకోనిస్తే అద్భుత ఫలితాలుంటాయనడానికి ‘ఫొని’ తుపాను సందర్భంగా జరిగిన పరిణామాలు తేటతెల్లం చేస్తున్నాయి. ‘రేయింబవళ్లు సమీక్షలు లేవు.. అది చేయండి.. ఇది చేయండి.. ఇలా కాదు.. అలా కాదు.. అనే సీఎం చంద్రబాబు హడావిడి అసలే లేదు.. మంత్రులు, సీఎం పర్యటనలు లేవు.. తుపాను సన్నద్ధత, బాధితులకు సహాయ కార్యక్రమాలను గాలికొదిలి సీఎం బాబు కోసం నిరీక్షణ అంతకన్నా లేదు.. వెరసి ఉత్తరాంధ్రలో తుపాను ప్రభావిత ప్రాంతాల్లో అధికారులు ఎవరి బాధ్యతలు వారు పక్కాగా నిర్వహించారు. లోతట్టు ప్రాంతాల్లో, పునరావాస ప్రాంతాల్లో ఎలాంటి ముందు జాగ్రత్తలు తీసుకోవాలి? సన్నద్ధత ఎలా ఉండాలి? అనే అంశాలపై వివిధ కీలక హోదాల్లో పని చేసిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్మహ్యణ్యంకు ఉన్న అనుభవం ఇప్పుడు ఫొని తుపానును సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ఉత్తరాంధ్ర అధికార యంత్రాంగానికి బాగా ఉపయోగపడింది. ‘తుపాను ప్రభావం చూపడానికి రెండు మూడు రోజుల ముందే సీనియర్ అధికారులు, ఉత్తరాంధ్ర జిల్లాల కలెక్టర్లతో సీఎస్ సమీక్షించారు. ఎక్కడెక్కడ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో స్పష్టంగా వివరించారు. విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుందని ముందే తెలిసినందున జనరేటర్లను సిద్ధంగా ఉంచుకోవాలని ఆదేశించారు. నిత్యావసర సరుకులు సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు. ఇలా అన్ని అంశాలపై అధికారులకు తన అనుభవంతో ఎల్వీ సుబ్రహ్మణ్యం మార్గనిర్దేశం చేశారు. సంబంధిత అధికారులంతా అంకిత భావంతో పనిచేశారు. దీంతో ఎక్కడా ఎలాంటి సమస్య లేకుండా సహాయ కార్యక్రమాలన్నీ సజావుగా సాగాయి. హడావిడి మాటే లేదు. ఎక్కడెక్కడ ఏయే పనులు చేయాలో అవన్నీ యథా ప్రకారం జరిగిపోయాయి. తుపాను తీరం దాటిన రెండో రోజుకే ప్రభావిత ప్రాంతాల్లో దాదాపుగా ప్రజలకు ఇబ్బందులు లేకుండా చేశారు. మార్గనిర్దేశం బాగుంటే ఫలితాలు ఇలాగే ఉంటాయి’ అని క్షేత్ర స్థాయి అధికారులతోపాటు ఐఏఎస్ అధికారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. విపత్తు నియమావళి చెప్పిందదే.. ‘విపత్తులు సంభవించినప్పుడు క్షేత్ర స్థాయి అధికారులను ఎవరి పని వారు చేసుకోనివ్వాలి. వీఐపీలు, ప్రజా ప్రతినిధులు వెళ్లి హడావిడి చేస్తే బాధితులకు సేవలు పక్కన పెట్టి అధికారులు, వీరి వెంట పరుగులు తీయాల్సి వస్తుంది. ఇది సహాయ కార్యక్రమాలకు ప్రతికూలంగా మారుతుంది. అందువల్ల విపత్తులు సంభవించినప్పుడు ప్రజా ప్రతినిధులు, వీఐపీలు సాధ్యమైనంత వరకు ఆ ప్రాంతాల పర్యటనలు పెట్టుకోరాదు’ అని విపత్తు నిర్వహణ నియమావళి స్పష్టంగా చెబుతోంది. సీఎం చంద్రబాబు ప్రచార యావతో దీనికి విరుద్ధంగా వ్యవహరించడం రివాజుగా మారింది. 2014 అక్టోబర్‌లో హుద్ హుద్ తుపాను సందర్భంగా చంద్రబాబు విశాఖలో మకాం వేసి సహాయ కార్యక్రమాలకు అంతరాయం కలిగించారు. గత ఏడాది అక్టోబర్‌లో ‘తిత్లీ’ తుపాను సందర్భంగానూ ఇలాగే హడావిడి చేశారు. అధికారులంతా ఆయన వెంట తిరిగేందుకు ప్రాధాన్యం ఇవ్వక తప్పలేదు. దీంతో వారాల తరబడి నిత్యావసర సరుకులు, తాగునీరు సైతం అందక బాధితులు ధర్నాలకు దిగడం తెలిసిందే. ఐఎండీపై ఐక్యరాజ్యసమితి ప్రశంసల జల్లు ‘ఫొని’ తుపాను ప్రభావం ఎంత తీవ్రంగా ఉంటుందనే విషయంలో భారత వాతావరణ విభాగం (ఐఎండీ) అత్యంత కచ్చితమైన ముందస్తు అంచనాతో భారత ప్రభుత్వం చాలా వరకు నష్టాన్ని తగ్గించగలిగిందని ఐక్యరాజ్య సమితి ప్రశంసించింది. చక్కటి అంచనాలతో ప్రజలను, ప్రభుత్వ యంత్రాంగాన్ని అప్రమత్తం చేయడం వల్లే ఆస్తి, ప్రాణ నష్టం బాగా తగ్గిందని ఐక్యరాజ్యసమితికి చెందిన డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ ఆర్గనైజేషన్ ఓ ప్రకటనలో కొనియాడింది. తుపాను.. తీరం ఎక్కడ దాటుతుంది? ఈ సమయంలో ఎంత వేగంతో గాలులు వీస్తాయి? దాని ప్రభావం ఎంత వరకు ఉంటుందనే అంశాలన్నింటినీ చాలా ముందుగా అత్యంత కచ్చితంగా ఐఎండీ అంచనాలు వేసిందని, అందువల్లే ప్రభుత్వం 11 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు చేరవేయగలిగిందని ప్రశంసించింది. ఈ మేరకు ఐఎండీకి లేఖ పంపినట్లు తమకు సమాచారం అందిందని ఐఎండీ డైరెక్టర్ జనరల్ డాక్టర్ కేజే రమేష్ ‘సాక్షి’ ప్రతినిధికి తెలిపారు. ఉత్తరాంధ్ర జిల్లాల ప్రజల్లో హర్షం ఒడిశాను అతలాకుతలం చేసిన ఫొని తుపాన్ వల్ల రాష్ట్రంలో ఎక్కువ నష్టం జరగకుండా అధికార యంత్రాంగం అన్ని రకాల ముందు జాగ్రత్తలు తీసుకుందని ఉత్తరాంధ్ర ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ‘పెనుగాలులకు స్తంభాలు వంగిపోవడం, వైర్లు తెగిపోవడం లాంటి కారణాలవల్ల 740 గ్రామాలకు విద్యుత్తు సరఫరా ఆగిపోయినా యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేసి శనివారం ఒక్కరోజే అత్యధిక గ్రామాలకు సరఫరాను పునరుద్ధరించారు. గాలుల వేగం ఎలా ఉంటుంది? వర్షం ఏ మోతాదులో కురుస్తుందనే అంశాలపై ఐఎండీ ఇచ్చిన అంచనాల మేరకు సీఎస్ మార్గనిర్దేశం వల్ల పెద్దగా నష్టం చేకూరలేదు. రెండు మూడు రోజుల్లోనే సాధారణ పరిస్థితి ఏర్పడనుంది. పంట నష్టపోయిన వారికి పెట్టుబడి సాయం తర్వాత అందిస్తారు’ అని విపత్తు నిర్వహణపై అపారమైన అనుభవం ఉన్న ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి ‘సాక్షి’తో అన్నారు. -
కేరళకు రూ. 600 కోట్ల వరద సాయం
సాక్షి, న్యూఢిల్లీ : వరదలతో తల్లడిల్లిన కేరళకు కేంద్ర ప్రభుత్వం రూ. 600 కోట్లు విడుదల చేసింది. కేరళ వరదలను తీవ్ర ప్రకృతి విపత్తుగా ప్రకటించిన కేంద్రం ఆ దిశగా వరద సాయం కింద ఈ నిధులను విడుదల చేసింది. కేరళకు అదనంగా బియ్యం, పప్పు ధాన్యాలు సరఫరా చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఆ రాష్ట్రానికి తరలించే వరద సహాయ సామాగ్రి, ఆహార పదార్ధాలపై జీఎస్టీ మినహాయింపును ప్రకటించింది. భారీ వర్షాలు తగ్గుముఖం పట్టిన క్రమంలో విద్యుత్, టెలికాం సేవల పునరుద్ధరణపై కేంద్రం ప్రధానంగా దృష్టిసారించింది. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో తక్షణమే మౌలిక సేవల పునరుద్ధరణకు చర్యలు చేపట్టింది. ఎల్పీజీ సిలిండర్ల పంపిణీకి ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. క్యాబినెట్ కార్యదర్శి నేతృత్వంలో జాతీయ సంక్షోభ నిర్వహణ కమిటీ సమావేశంలో కేంద్రం ఈ నిర్ణయాలు తీసుకుంది. కాగా వరద బీభత్సంతో భీతిల్లిన కేరళను అన్నివిధాలా ఆదుకుంటామని ప్రధాని నరేంద్ర మోదీ ఇప్పటికే ప్రకటించగా, పలు రాష్ట్రాల సీఎంలు, నేతలు, సినీ నటులు, పారిశ్రామిక వేత్తలు భారీ విరాళాలతో ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. -
వరద బాధితులను ఆదుకుందాం: ఆమీర్‌ఖాన్
ముంబై: ఇటీవలి వరదలకు బీహార్ రాష్ట్రం అతలాకుతలమైందని, వరద బాధితులను ఆదుకునేందుకు ప్రజలు తమవంతు సాయం చేయాలని ప్రముఖ బాలీవుడ్ నటుడు ఆమీర్‌ఖాన్ విజ్ఞప్తి చేశారు. తన తదుపరి సినిమా ‘సీక్రెట్ సూపర్‌స్టార్’ ప్రమోషన్ కార్యక్రమంలో నిమగ్నమైన ఆయన సోమవారం ముంబైలో మీడియాతో మాట్లాడారు. ప్రకృతి వైపరీత్యాలు రాకుండా చూడడం మన చేతుల్లో లేదని.. కానీ తదుపరి పరిస్థితులు మెరుగుపడేందుకు మనవంతు సాయం చేయగలం అని అన్నారు. ప్రభుత్వం కూడాబాధితులను ఆదుకుని పరిస్థితిని చక్కదిద్దుతుందని, దేశ ప్రజలందరూ బీహార్ సీఎం రిలీఫ్ ఫండ్‌కు తమవంతుగా విరాళాలు అందజేయాల్సిందిగా కోరుతున్నానన్నారు. -
120 ఏళ్లలో అమరావతికి వరద ముప్పు లేదు
ఎన్జీటీలో రాష్ట్ర ప్రభుత్వ వాదన సాక్షి, న్యూఢిల్లీ: గడిచిన 120 ఏళ్ల చరిత్రలో అమరావతి ప్రాంతం కృష్ణా జలాలతో ముంపునకు గురైన దాఖలా లేదని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జాతీయ హరిత ట్రిబ్యునల్ దృష్టికి తెచ్చింది. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి వరద ముప్పు ఉందని దాఖలైన పిటిషన్లపై విచారణను జాతీయ హరిత ట్రిబ్యునల్ సోమవారం చేపట్టింది. ప్రతివాది అయిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది ఎ.కె.గంగూలీ తన వాదనలు వినిపిస్తూ... .కృష్ణా నదీ జలాలతో అమరావతికి వరద ముప్పు ఉండదని పేర్కొన్నారు. తదుపరి వాదనలను మంగళవారం వింటామని చెబుతూ ధర్మాసనం విచారణను వాయిదావేసింది. -
వరద బాధితుడు కోహ్లీకి రూ. 47 లక్షలు!
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా వరద బాధితుడేనట. ఆయనకు ఉత్తరాఖండ్ ప్రభుత్వం అందుకు సంబంధించిన నిధుల నుంచి రూ. 47.19 లక్షలు చెల్లించింది. రుద్రప్రయాగ జిల్లా కోసం కేటాయించిన ఈ నిధులను కోహ్లీకి మళ్లించినట్లు ఆర్టీఐ ద్వారా తెలిసింది. బీజేపీ నాయకుడు అజయ రాజేంద్ర సమాచార హక్కు చట్టం ప్రకారం దాఖలుచేసిన ఓ దరఖాస్తుకు సమాధానంగా ప్రభుత్వం ఈ వివరాలు వెల్లడించింది. రుద్రప్రయాగ జిల్లా విపత్తు నివారణ సంస్థకు కేటాయించిన నిధుల నుంచి 2015 జూలై నెలలో రూ. 47.19 లక్షలు విరాట్ కోహ్లీకి చెల్లించినట్లు తెలిపింది. ఉత్తరఖండ్ టూరిజం ప్రమోషన్ కోసం వచ్చినందుకు కోహ్లీకి ఈ మొత్తాన్ని ముంబైలోని మెసర్స్ కైలాష్ ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ చెల్లించిందని అన్నారు. కేదార్నాథ్ వరదలతో విధ్వంసమైన రుద్రప్రయాగ జిల్లా పునర్నిర్మాణం కోసం ఈ నిధులు కేటాయించారు. పెద్ద పెద్ద సెలబ్రిటీలు వివిధ రాష్ట్రాలకు ఎండార్స్మెంట్లు చేయడం కొత్తేమీ కాదు గానీ.. విపత్తు నివారణ, తదనంతర చర్యల కోసం కేటాయించిన నిధులను ప్రభుత్వ ప్రచారం కోసం ఖర్చుపెట్టడమే విమర్శలకు కారణమైంది. రాష్ట్రంలో టూరిజాన్ని ప్రమోట్ చేసుకోడానికి రాష్ట్ర ప్రభుత్వం దాదాపు గంట నిడివి ఉన్న ఆడియా - వీడియో క్లిప్‌ను రిలీజ్ చేసింది. అందులో విరాట్ కోహ్లీ కనిపిస్తాడు. అయితే.. ఇలా చెల్లించడంలో తాము నిబంధనలను ఉల్లంఘించలేదని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి హరీష్ రావత్ సలహాదారు సురేంద్ర అగర్వాల్ చెప్పారు. కేదార్నాథ్ యాత్ర విజయవంతం కావాలన్నదే తమ ఉద్దేశమని ఆయన అన్నారు. -
'నిరాశ్రయులను ప్రభుత్వం ఆదుకోవాలి'
► వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షురాలు రెడ్డి శాంతి శ్రీకాకుళం : జిల్లాలో విస్తారంగా కురుస్తున్న వర్షాలు వల్ల 150 ఇళ్లు నేలమట్టం కావడంతో నిరాశ్రయులైన ప్రజలను ప్రభుత్వం ఆదుకోవాలని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షురాలు రెడ్డి శాంతి కోరారు. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన 14వ ఆర్థిక సంఘం నిధులను గ్రామాల్లో పారిశుద్ధ్య పనులకు, వైద్య శిబిరాలకు వెచ్చించాలని డిమాండ్ చేశారు. వ్యాధుల బారిన పడిన గిరిజనులకు రక్త పరీక్షలు నిర్వహించి, మెరుగైన వైద్యం అందించాలని కోరారు. గిరిజన గ్రామాల్లో అంటువ్యాధులపై అవగాహన కల్పించాలని అధికారులకు డిమాండ్ చేశారు. దోమలపైదాడి ప్రకటనలకే పరిమితం చేయకుండా నిధులు విడుదల చేయాలని, గ్రామాల్లో పారిశుద్ధ్యం మెరుగుపర్చాలని డిమాండ్ చేశారు. -
చేజారిన ఆశ..
ఈవిడేంటీ.. గాల్లో ఆ క్యాచులేంటీ.. అనుకుంటున్నారా? నగరంలో కురుస్తున్న భారీ వర్షాలకు ప్రజలు పడుతున్న పాట్లకు నిదర్శనమిది. ఆరు రోజులుగా జల దిగ్బంధంలో చిక్కుకున్న ఆల్విన్ కాలనీ ధరణినగర్ అపార్ట్‌మెంట్‌వాసులు.. ఎవరు వస్తున్నా తమకు తినేందుకు ఏదన్నా ఇవ్వకపోతారా అని ఆశతో ఎదురు చూస్తున్నారు. ఆదివారం అక్కడి వరద బాధితులకు బిస్కెట్ ప్యాకెట్లు పంచారు. కిందికి వచ్చి తీసుకునే అవకాశం లేదు. దీంతో విసిరిన ప్యాకెట్లను దుకునేందుకు మహిళ పడుతున్న తాపత్రయమిది. ఆశగా అందుకుందామని ప్రయత్నించినప్పటికీ.. అది కాస్తా చేజారిపోవడంతో ఆమె ఎంతగా బాధపడుతుందో ఈ చిత్రం చెబుతోంది. -
అధికారులూ శభాష్
వర్షాల్లో వారి సేవలు బాగున్నాయి వరద నష్టం అంచనాలపై నివేదికలు రూపొందించాలి అంటు వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలి రబీకి కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలి డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి హన్మకొండ అర్బన్ : జిల్లాలో నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల్లో ప్రభుత్వం తరపున ప్రజలకు అధికారులు అందించిన సేవలు అభినందనీయమని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. రానున్న మూడు రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో విపత్కర పరిస్ధితులను ఎదుర్కొనేందుకు అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. హన్మకొండలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో గ్రేటర్ మేయర్ నన్నపునేని నరేందర్, కలెక్టర్ వాకాటి కరుణ, నగర పోలీస్ కమిషనర్ సుధీర్‌బాబు, రూరల్ ఎస్పీ అంబర్‌కిషోర్ ఝాతో కలిసి జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలు, వరదలు, సహాయక చర్యలపై ఆయన అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం శ్రీహరి మాట్లాడుతూ పది రోజుల నుంచి జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తుండడంతో చెరువులు, కుంటలు, చిన్న నీటి ప్రాజెక్టులు నీటితో నిండి ప్రవహిస్తున్నాయన్నారు. జిల్లా యంత్రాంగం , పోలీసు అధికారులు అప్రమత్తంగా ఉండి వర్షాల కారణంగా ఎలాంటి ప్రాణనష్టం జరుగకుండా చర్యలు తీసుకోవడం సంతోషకరమన్నారు. నగరంలోని గోపాలపురం చెరువుకట్టపై నుంచి వరదనీరు పోతుందని, చిన్న వడ్డేపల్లి చెరువు మత్తడి పోసి లోతట్టు ప్రాంతాలు జలమ యమయ్యాయన్నారు. సాటునీటి పారుదల, ఇంజనీరింగ్, నగర పాలక సంస్ధ అధికారులు ప్రత్యేక దృష్టి సారించి అక్కడి నుంచి నీటిని పంపించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. వర్షాలు తగ్గేవరకు అధికారులు క్షేత్రస్థా«యిలో అందుబాటులో ఉండాలన్నారు. అలాగే ఎలాంటి సెలవులు మంజూరు చేయొద్దని కలెక్టర్‌కు సూచించారు. 66 చెరువులకు బుంగలు జిల్లా›లో వర్షాలతో 5550 చెరువుల్లో 66 చెరువులు బుంగపడ్డాయని డిప్యూటీ సీఎం తెలిపారు. పంచాయతీరాజ్‌శాఖ పరిధిలోని 22 రహదార్లు తెగిపోగా, 6 చోట్ల అర్అండ్బీ రహదారులు దెబ్బతిన్నట్లు తెలిసిందన్నారు. పునారావాస సహాయక శిబిరాల్లో ఉంటున్న వారికి వసతి, భోజనం సదుపాయం కల్పించాలన్నారు.వ్యవసాయ అధికారులు వర్షం తగ్గిన వెంటనే పంట నష్టం వివరాలు పూర్తిస్థాయిలో అంచనా వేసి నివేదిక సమర్పించాలన్నారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు సర్ప్లస్ నీటిని రేపటిలోగా ఎల్ఎండీకి వదులుతున్నందున జిల్లాలో రెండో విస్తీర్ణం పెరుగుతుందన్నారు. రబీకి కార్యచరణ ప్రణాళిక సిద్ధం చేసుకుని అవసరమైన ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉంచుకోవాలన్నారు. విద్యుత్ అధికారులు అంతరాయం లేకుండా కరెంట్ సరఫరా చేయాలన్నారు. వైద్యఆరోగ్య శాఖ అధికారులు అంటువ్యాధుల నివారణకు చర్యలు తీసుకోవాలన్నారు. వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి ప్రజలకు చికిత్సలు అందించాలన్నారు. నగర మేయర్ నన్నపునేని నరేందర్ మాట్లాడుతూ నగరంలో 12 అర్బన్ హెల్త్ సెంటర్లు ఉన్నాయని తెలిపారు. ఐఎంఏ, ప్రైవేట్ నర్సింగ్‌హోంల సహకారంతో వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. సమీక్షలో వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
'బాధితులను ఆదుకోవటంలో సర్కారు విఫలం'
హైదరాబాద్: భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ హెచ్చరించినా పాలకులు పెడచెవిన పెట్టారని టీటీడీపీ విమర్శించింది. ముంపు బాధితులను ఆదుకోవడంలోనూ, కనీసం మంచినీళ్లు, ఆహారపొట్లాలు, మందులను అందించడంలోనూ అధికారులు విఫలమయ్యారని ఆ పార్టీ నాయకులు ఎల్.రమణ, రేవంత్‌రెడ్డి విమర్శించారు. మూడురోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు హైదరాబాద్‌లో పలు కాలనీలు, లోతట్టు ప్రాంతాలు, బస్తీలు జలదిగ్భంధంలో చిక్కుకుని ప్రజలు విలవిల్లాడుతుంటే ప్రభుత్వం బాధితుల వైపు కన్నెత్తి చూడడం లేదన్నారు. ముంపు బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించడంలోనూ ప్రభుత్వం విఫలమైందన్నారు. శుక్రవారం హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల నాయకులతో వారు టెలీకాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడిన సందర్భంగా ముంపు బాధితులకు ఆపన్నహస్తం అందించేందుకు నాయకులు, అనుబంధ విభాగాలు, కార్యకర్తలు, టీఎన్ఎస్ఎఫ్, తెలుగుయువత నాయకులు సహాయచర్యల్లో పాల్గొనాలని సూచించారు. ప్రభుత్వం ఇచ్చిన టోల్ ప్రీ నెంబర్‌కు బాధితులు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా స్పందించడం లేదన్నారు. బాధితులను ఆదుకునేందుకు రాష్ర్ట కార్యాలయంలోని హెల్ప్‌లైన్ సెంటర్‌కు సమాచారాన్ని ఇవ్వాలని కోరారు. కేవలం ప్రచారానికి పరిమితం: రావుల వరద బాధితులకు సహాయాన్ని అందించడంలో టీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైందని, కేవలం ప్రచార ఆర్భాటాలకే పరిమితమై కంటి తుడుపు చర్యలు చేపడుతోందని టీటీడీపీ నేత రావుల చంద్రశేఖరరెడ్డి ధ్వజమెత్తారు. ప్రభుత్వం అందించే సహాయం కిందివరకు వెళ్లడం లేదన్నారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రభుత్వానికి ముందుచూపు లేకపోవడంతోనే గ్రేటర్ హైదరాబాద్ ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురికావల్సి వస్తోందన్నారు. ఢిల్లీ నుంచి సీఎం కేసీఆర్ ఆదేశాలు ఇవ్వడమే కాకుండా నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. -
జమ్మూకశ్మీర్‌ను ముంచెత్తుతున్న వరదలు
-
వరద సాయం ‘స్వాహా’...!
* పీయూష్ సంచలన వ్యాఖ్య * 1400 కోట్లు మింగేసినట్టు ఆరోపణ సాక్షి, చెన్నై: అన్నాడీఎంకే సర్కారుపై కేంద్ర విద్యుత్‌శాఖ మంత్రి పియూష్ గోయల్ మరో మారు సంచలన ఆరోపనలు చేశారు. కేంద్రం ఇచ్చిన వరద సాయం రూ.రెండు వేల కోట్లలో రూ. 1400 కోట్లను అన్నాడీఎంకే సర్కారు స్వాహా చేసిందని ఆరోపించారు. గోయల్ ఇటీవల రాష్ర్టంలో వార్తల్లో వ్యక్తిగా అవతరించి ఉన్న విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి జయలలితను ఒక కేంద్ర మంత్రిగా తాను సంప్రదించ లేని పరిస్థితి ఉందని, ఉదయ్ పథకం అమలు చేయని దృష్ట్యా, ఆ రాష్ట్రానికి కోట్లు నష్టం అవుతోందంటూ ఇటీవల తీవ్రంగా విరుచుకు పడ్డారు. ఆయన బాటలో పలువురు మంత్రులు అనుసరించారు. సీఎం అనుమతి కరువు కావడంతో, పోయేస్ గార్డెన్‌కు పరిమితమైన జయలలితపై విసుర్లు, విమర్శలు బయలు దేరాయి. పీయూష్ చేసిన వ్యాఖ్యలు నేటికి చర్చనీయాంశంగానే ఉన్నాయి. తన వ్యాఖ్యలకు ఇంకా కట్టుబడి ఉన్నానని పదే పదే పీయూష్ స్పందిస్తూనే వస్తున్నారు. ఈ పరిస్థితుల్లో సోమవారం సీఎం జయలలిత ఎన్నికల బరిలో ఉన్న ఆర్కేనగర్ వేదికగా మరో సంచలన ఆరోపణలు చేశారు. అక్కడి బీజేపీ అభ్యర్థి ఎంఎన్ రాజకు మద్దతుగా ప్రచారంలో పాల్గొన్న పీయూష్ ఓపెన్ టాప్ వాహనం నుంచి ప్రసంగిస్తూ సీఎం జయలలిత సర్కారుపై విరుచుకు పడ్డారు. వరద సాయం స్వాహా : ఉదయ్ పథకం వ్యవహారంలో తాను చేసిన వ్యాఖ్యలకు ఇంకా కట్టుబడి ఉన్నాని స్పందిస్తూ, తన ప్రసంగాన్ని సాగించారు. చెన్నైను వరదలు ముంచెత్తిన సమాచారంతో ప్రధాని నరేంద్ర మోదీ తల్లడిల్లారని, తక్షణం ఆయన చెన్నైకు రావడమే కాకుండా రూ. వెయ్యి కోట్లను సాయంగా ప్రకటించారన్నారు. అంతకు ముందుగా వరదసాయం నిమిత్తం రూ. 900 కోట్లకు పైగా ప్రకటించిన విషయాన్ని గుర్తుచేశారు. కేంద్రం నుంచి వరద సాయంగా రూ. రెండు వేల కోట్ల వరకు నిధులు మంజూరు అయ్యాయని, అయితే, అవన్నీ బాధితులకు మాత్రం చేర లేదని ఆరోపించారు. 60 శాతం మేరకు బాధితులు ఇంకా కష్టాల్లోనే ఉన్నారని పేర్కొన్నారు. కేవలం రూ. 600 కోట్లను మాత్రం వెచ్చింది. మిగిలిన 1400 కోట్లను స్వాహా చేసి ఉన్నారని, ప్రజాల సంక్షేమాన్ని విస్మరించిన ఈ ప్రభుత్వాన్ని సాగనంపాలని పిలుపు నిచ్చారు. ఆర్కేనగర్లో బీజేపీ అభ్యర్థిని గెలిపించి, జయలలితకు గుణపాఠం చెప్పాలని ఓటర్లను కోరారు. ముందుగా విరుగంబాక్కం ఎన్నికల బరిలో ఉన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు తమిళి సై సౌందరాజన్‌కు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. విరుగంబాక్కం అభివృద్ధికి తానుచేపట్టబోయే కార్యక్రమాల్ని వివరిస్తూ తమిళి సై రూపొందించిన ఎన్నికల మేనిఫెస్టోను పీయూష్ గోయల్ విడుదల చేశారు. -
మీ కోసమే..
సాక్షి, చెన్నై : వరద బాధితులకు భరోసా ఇచ్చే విధంగా ‘అమ్మ’(జయలలిత) తన సందేశాన్ని ప్రజల్లోకి పంపించారు. ప్రత్యక్షంగా బాధితుల్ని పరామర్శించకున్నా, తన జీవితం మీ కోసమేనని.., మీ కష్టాల్ని పంచుకుంటూ..., కొత్త వెలుగులు నింపుతానన్న హామీ ఇచ్చే యత్నం చేశారు. వాట్సాప్ రూపంలో అమ్మ సందేశం హల్ చల్ చేయడంతో ప్రతి పక్షాలు దుమ్మెత్తి పోసే పనిలో పడ్డాయి. వాట్సాప్‌లో వడ కాల్చుతున్నట్టుందని డీఎంకే కోశాధికారి స్టాలిన్ ఎద్దేవా చేశారు. కష్టం సరే...నష్టాన్ని మోస్తారా..? అని పీఎంకే నేత రాందాసు ప్రశ్నించారు. చెన్నై, తిరువళ్లూరు, కాంచీపురం, కడలూరుల్లో వరద ప్రళయం, మిగిలిన జిల్లాల్లో వాన కష్టాలు రాష్ట్ర ప్రజానీకాన్ని కన్నిటి మడుగులో ముంచాయి. వరద బాధితుల్ని ఆదుకునే పనిలో సర్వత్రా ఉరకలు తీస్తున్నారు. అన్ని రాజకీయ పక్షాల నాయకులు స్వయంగా బాధితుల్ని పరామర్శిస్తూ వస్తున్నారు. మంత్రులు సహాయకాల పంపిణీలో బిజీగా ఉన్నారు. బాధితుల్ని ఆదుకోవడం లక్ష్యంగా డెరైక్షన్లు ఇస్తున్న సీఎం జయలలిత స్వయంగా వారిని పరామర్శించేందుకు అడుగు తీసి బయట పెట్టలేదని చెప్పవచ్చు. ఏరియల్ సర్వేతో సరి. సీఎం తీరుపై, చెంబరంబాక్కం నీటి విడుదలపై సర్వత్రా ఆగ్రహం బయలు దేరింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం విప్పే వారి సంఖ్య పెరిగింది. ఈ సమయంలో వరద బాధితులకు తాను ఉన్నాన్న భరోసా ఇచ్చే విధంగా సీఎం జయలలిత స్పందించారు. తన సందేశాన్ని వాట్సాప్ రూపంలో ప్రజల్లోకి పంపించే యత్నం చేశారు. దీంతో ఏ మొబైల్స్‌లలో చూసినా వాట్సాప్ ద్వారా ఆమె ప్రసంగమే సాగుతున్నది. అమ్మ సందేశం : మీ ప్రియమైన సోదరి జయలలిత మాట్లాడుతున్నట్టుగా ఆరంభం అయ్యే ఆ ప్రసంగం ప్రజల కన్నీళ్లు తుడిచేందుకు తాను ఉన్నానని, కష్టాల్ని తాను కూడా పంచుకున్నట్టు వివరించే యత్నం చేశారు. తనకు వ్యక్తిగత జీవితం లేదు అని, కుటుంబం కూడా లేదు అని, తనకు సర్వం ప్రజలేనని వ్యాఖ్యానించారు. స్వలాభాపేక్ష అన్నది తనలో లేదు అని, తన తల్లిదండ్రులు పెట్టిన జయలలిత అన్న పేరును మరచి పోయే విధంగా ‘అమ్మ..అమ్మ’ అన్న ఒక్క పిలుపుతో తన జీవితాన్ని పూర్తిగా ప్రజల కోసం అర్పించి ఉన్నానని వివరించారు. ప్రళయం సృష్టించిన కష్టంలో పాలు పంచుకుంటున్నానని పేర్కొంటూ, సహాయక చర్యల్ని వేగవంతం చేసి ఉండటాన్ని గుర్తు చేశారు. కష్టాలు తొలగి అందరి జీవితాల్లో వెలుగు నింపే విధంగా ముందుకు సాగుతానని హామీ ఇచ్చారు. అయితే, ఈ వాట్సాప్ సందేశం మీద ప్రతి పక్షాలు దుమ్మెత్తి పోస్తున్నాయి. ప్రజల్లోకి నేరుగా వచ్చి భరోసా ఇవ్వలేని సీఎం, ప్రజల్ని పరామర్శించ లేని సీఎం ఇప్పుడు మొసలి కన్నీళ్లుకారుస్తున్నారని మండి పడుతున్నారు. వడ కాల్చుతున్నట్టుంది : వాట్సాప్ సందేశం మీద డీఎంకే కోశాధికారి ఎంకే స్టాలిన్ తీవ్రంగానే స్పందించారు. వాట్సాప్‌లో వడ కాల్చుతున్నట్టుందని ఎద్దేవా చేశారు. తనకు కుటుంబం లేదని చెప్పుకునే ఆమెకు కోడనాడు , సిరుదావూర్లతో పాటుగా మరెన్నో కోట్ల ఆస్తులు ఎందుకో అని ప్రశ్నించారు. సినీమా డైలాగులతో మొసలి కన్నీళ్లు కారుస్తున్నారని మండి పడ్డారు. సీఎం జయలలిత నెచ్చెలి శశికళ కుటుంబం వేళచ్చేరిలోని ఓ మాల్లో 11 సినీ స్కీన్లను వేల కోట్లకు కొన్నట్టుగా ఆధారాలతో సహా బయట పడ్డప్పుడు నోరు మెదపని ఆమె , సెంబరంబాక్కం నీటి విడుదల వ్యవహారంలో మౌనం వహించిన ఆమె, ఇప్పుడు కొత్త నాటకాన్ని రచించి ఉన్నారని మండి పడ్డారు. కష్టం సరే...నష్టం మాటేమిటో...: ప్రజల కష్టాల్లో పాలు పంచుకుంటున్నట్టు వ్యాఖ్యలు చేసిన సీఎం, నష్టం ఊసెత్తక పోవడం విడ్డూరంగా ఉందని పీఎంకే అధినేత రాందాసు వ్యాఖ్యానించారు. ప్రజల కష్టాల్ని మాత్రం మోసే ఆమె, నష్టాల్ని భరించేందుకు ముందుకు రాక పోవడం విచారకరంగా పేర్కొన్నారు. తనకు కుటుంబమే లేదంటూ.. పదే పదే చెప్పుకునే జయలలిత, పోయెస్ గార్డెన్ వేదికగా రాష్ట్రాన్ని శాసిస్తున్న కుటుంబం ఎవరిదో స్పష్టం చేయాలని ప్రశ్నించారు. -
ఒక్క రోజే రూ.12 కోట్లు ...
అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు, ఎంపీలు వరద బాధితులకు అండగా నిలిచేందుకు నిర్ణయించారు. నెల రోజు వేతనాన్ని విరాళంగా ప్రకటించారు. మంగళవారం ఒక్క రోజే వరద నివారణ నిధికి రూ.12 కోట్లు వచ్చాయి. చెన్నై : ఈశాన్య రుతు పవనాల ప్రభావంతో చెన్నై, కాంచీపురం, తిరువళ్ల్లూరు, కడలూరులు తీవ్ర ప్రభావానికి లోనైన విషయం తెలిసిందే. తీవ్రంగా నష్టపోయిన తమిళనాడును ఆదుకునేందుక స్వచ్ఛంద సంస్థలు, సంఘాలు కదిలాయి. పెద్ద ఎత్తున విరాళాల్ని అందించేందుకు పలువురు ముందుకు వస్తున్నారు. ఈ పరిస్థితుల్లో డీఎంకే ఎమ్మెల్యేలు తమ నెల రోజుల జీతాన్ని విరాళంగా ఇచ్చేందుకు ముందుకు రావడంతో అదే బాటలో అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు, ఎంపీలు సిద్ధమయ్యారు. అన్నాడీఎంకేకు అసెంబ్లీలో సంఖ్యా పరంగా 150 మందికి పైగా ఉన్నారు. అలాగే, పార్లమెంట్ సభ్యులు 37 మంది, మరి కొంత మంది రాజ్యసభ సభ్యులు ఉన్నారు. వీరంతా తమ నెలరోజుల వేతనాన్ని సీఎం రీలీఫ్ ఫండ్‌కు అప్పగించేందుకు నిర్ణయించారు. జయలలిత ఇచ్చిన పిలుపు మేరకు తమ నియోజకవర్గ అభివృద్ధి నిధుల నుంచి రూ. కోటి చొప్పున కేటాయించేందుకు ప్రయత్నాలు ఆరంభం అయ్యాయి. మంగళవారం కూడా పలు సంస్థలు సీఎం జయలలితను కలిసి విరాళాలు అందజేశాయి. కరూర్ వైశ్యాబ్యాంకు రూ.3 కోట్లు అందజేసింది. -
కరుణ అభయం
వరద బాధితులకు తాను ఉన్నానన్న అభయాన్ని డీఎంకే అధినేత ఎం కరుణానిధి ఇచ్చారు. చెన్నైలో వరద బాధిత ప్రాంతాల్లో ఆయన పర్యటించారు. సహాయకాల పంపిణీ వేగవంతం చేయాలని పార్టీ వర్గాలను ఆదేశించారు. ఇక, చిదంబరంలో జోరు వానలోనూ బాధితుల్ని డీఎంకే దళపతి ఎంకే స్టాలిన్ పరామర్శించారు. సాక్షి, చెన్నై : వరద బాధితుల సహాయార్థం డీఎంకే వర్గాలు సహాయక చర్యల్లో దూసుకెళుతున్నారు. పెద్ద ఎత్తున ఆ పార్టీ కార్యాలయం అరివాలయానికి రాష్ట్రం నలుమూలల నుంచి లారీలు, ఇతర వాహనాల్లో సహాయకాలు వచ్చి చేరుతున్నాయి. వీటన్నింటిని వరద బాధిత ప్రాంతాలకు తరలిస్తూ వస్తున్నారు. ఈ పనుల్ని దగ్గరుండి మరీ కరుణానిధి పరిశీలిస్తూ వచ్చారు. ఈ పరిస్థితుల్లో బుధవారం వరద బాధితుల్ని పరామర్శించేందుకు ఆయన నిర్ణయించారు. వీల్ చైర్లో ఉన్న కరుణానిధి తన వాహనం నుంచి వరద బాధిత ప్రాంతాల్ని పర్యటించారు. ఆయా ప్రాంతాల్ని పరిశీలిస్తూ, తొలుత చింతాద్రి పేటలోని నెడుంజెలియన్ నగర్లో పర్యటించారు. అక్కడి బాధితులకు తాను ఉన్నాన్న అభయాన్ని ఇచ్చారు. సహాయకాలను ఇంటింటికి తీసుకెళ్లి చేర్చాలని అక్కడి పార్టీ వర్గాలను ఆదేశించారు. తదుపరి ఆ పరిసరాల్లో సహాయకాలను డీఎంకే వర్గాలు పంపిణీ చేశాయి. అనంతరం సైదాపేట మరై మలై అడిగళార్ వంతెన వద్ద నుంచి దెబ్బ తిన్న ప్రాంతాల్ని పరిశీలించారు. అక్కడి నుంచి అడయార్ , కోట్టూరు పురంలలో పర్యటించి బాధితుల్ని ఓదార్చారు. త్వరితగతిన ఇంటింటికి సహాయకాలను అందించాలని ఆయా ప్రాంతాల్లోని నేతల్ని ఆదేశించారు. ఇక, తన పర్యటనలో భాగంగా కడలూరులో బుధవారం ఎంకే స్టాలిన్ పర్యటించారు. చిదంబరంలో జోరు వానలోనూ ముందుకు సాగుతూ బాధితుల్ని పరామర్శించారు. సహాయకాలను అందజేశారు. సోత్తుపాడి, కురింజి పాడి మీదుగా కడలూరులో ఆయన పర్యటన సాగింది. -
‘అమ్మ’ బొమ్మకు ఒత్తిడి
స్వచ్ఛంద సంస్థలకు నిర్బంధం పలు చోట్ల దాడులు ‘అమ్మ’ బొమ్మకు ఒత్తిడి పాలకుల తీరుపై అసంతృప్తి చెన్నై: మానవత్వంతో బాధితుల సేవలో ఉన్న స్వచ్ఛంద సంస్థలు, సంఘాలకు అధికార పక్షం ఒత్తిళ్లు తప్పడం లేదు. తాము చెప్పిన ప్రదేశాలకే సహాయకాలను సరఫరా చేయాలంటూ కొందరు, తమ నేతృత్వంలోనే అందించాలంటూ ఇంకొందరు, ఇక అమ్మ బొమ్మ తథ్యం అంటూ మరి కొందరు నిర్బంధిస్తుండడంతో మానవతా హృదయులు ఉక్కిరి బిక్కిరి కాక తప్పడం లేదు. తాము చెప్పింది వినకుంటే దాడులు తప్పవని హెచ్చరించి ప్రత్యక్షంగా చూపిస్తుండడంతో ఆయా సంస్థలు, సంఘాల ప్రతినిధులు ఆవేదనకు లోనవుతున్నారు. ఇది చెన్నై పరిధిలో పలు చోట్ల సాగుతున్న అధికార జులుం కావడంతో సర్వత్రా అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ప్రకృతి ప్రళయానికి చెన్నై, శివారులు నరకయాతనను చవిచూస్తున్నాయి. ఇళ్లను, వస్తువులను కోల్పోయి కట్టుబట్టలతో నిలబడ్డ వాళ్లు వేలాది మంది ఉన్నారు. లక్షలాది మంది వరద తాకిడితో ఆపన్న హస్తం కోసం చేతులు చాచక తప్పడం లేదు. ఏ రోడ్డులో చూసినా తమను ఆదుకునేందుకు ఎవరో ఒకరు సహాయకాలతో రాక పోతారా అని ఎదురు చూసే పేద కుటుంబాలు ఎన్నో కనిపిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో చెన్నై నగరవాసుల్ని ఆదుకునేందుకు తామున్నామంటూ అనేక స్వచ్ఛంద సంస్థలు, సంఘాలు, మానవతా హృదయం కల్గిన వాళ్లు కదిలారు. అన్నం కోసం, తాగునీటి కోసం అలమటిస్తున్న నగరవాసుల్ని ఆదుకునేందుకు ఉరకలు తీస్తున్నారు. ఆహార పదార్థాలే కాదు, సర్వం కోల్పోయిన వాళ్లకు అవసరమైన వస్తువుల్ని సైతం అందించేందుకు చెన్నై బాట పట్టారు. వందలాది సంస్థలు, సంఘాలు చె న్నై బాధితుల సేవలో నిమగ్నమయ్యాయి. ఆధునిక యుగంలో ఇంకా మానవత్వం ఎక్కడో ఒక చోట ఉందని నిరూపించుకునే విధంగా సాగుతున్న ఈ సహాయకాలకు అధికార అడ్డంకులు ఎదురవుతున్నాయి. చెన్నై శివారుల్లోనూ లారీల్ని ఆపడం, అమ్మ బొమ్మలను తగిలించ డం వంటి చర్యలకు పాల్పడే అన్నాడీఎంకే వర్గాలు కొందరు అయితే, తాము పెట్టిందే చట్టం, తాము చెప్పినట్టు వినాల్సిందే, తాము చెప్ని చోటే పంచాలంటూ ఒత్తిళ్లు తీసుకొచ్చే వారు మరి కొందరు. సహాయకాలు రాగానే, తమను పిలిచి , తమ చేతుల మీదుగానే పం పిణీ చేయించాలంటూ స్వచ్ఛంద సంస్థలు, సంఘాల ప్రతినిధులపై మరెందరో అధికార జులుం సాగించే పనిలో పడ్డారు. కొన్ని చోట్ల కార్పొరేషన్‌కు అప్పగిస్తే, వాళ్లే చూసుకుంటారంటూ ఒత్తిడి తెస్తున్నారు. ఇక నోరు మెదప లేని కొన్ని సంఘాలు వారి ఒత్తిళ్లకు తలొగ్గుతుంటే, మరెందరో మానవతా హృదయులు ఇదేంటంటూ పెదవి విప్పే పనిలో పడ్డారు. మరి కొందరు ఒత్తిళ్లకు తలొగ్గడం లేదు. ఇ లాంటి వారిపై ఏకంగా దాడులకు సైతం దిగుతుండడంతో పాలకుల తీరుపై అసంతృప్తి రగులుతోంది. కింది స్థాయి, ద్వితీయ శ్రేణి నాయకుల వీరంగాలకు ఉక్కిరి బిక్కిరి అవుతోన్నామంటూ స్వచ్ఛంద సంస్థలకు, సంఘాలకు చెందిన పలువురు మీడియా ఎదుట ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో తాము చెప్పింది వినకుంటే దాడులు సైతం చేస్తామని హెచ్చరించి మరీ, చేసి సైతం చూపించడంతో స్వచ్ఛంద సంస్థలు, సంఘాలు ఆందోళనకు గురి కావాల్సిన పరిస్థితి. దాడితో కలవరం: నిర్బంధం, ఒతిళ్లు ఓ వైపు సాగుతుంటే, సోమవారం అన్నానగర్‌లో ఏకంగా దాడి సైతం జరగడంతో సర్వత్రా విస్మయంలో పడ్డారు. అడయార్, కోట్టూరుపురంలలో పోలీసుల ద్వారా అడ్డుకోవడంతో అధికార జులుంపై విమర్శలు బయలు దేరుతున్నాయి. దాడికి గురైన వాళ్లు తమిళనాడులోని సంస్థలకు చెందిన వాళ్లు కూడా కాదు, పొరుగు రాష్ట్రం నుంచి వచ్చి సేవల్ని అందిస్తున్న బెంగళూరుకు చెందిన మానవతా హృదయులు. బెంగళూరు నుంచి ఓ సంస్థ నేతృత్వంలో పదిహేను బృందాలు చెన్నైలో రెండు రోజులుగా సేవల్ని అందిస్తున్నాయి. ఇక్కడున్న మరో సంస్థ సహకారంతో అక్కడున్న బృందాలు అన్నానగర్‌లోని గంగయమ్మన్ ఆలయం వద్ద అన్నాహారాలు స్వయంగా తయారు చేస్తూ, ఎక్కడెక్కడల్లా బాధితులు ఆకలితో అలమటిస్తున్నారో తమ బృందాల ద్వారా గుర్తించి అక్కడికి సరఫరా చేస్తూ వచ్చారు. ఈ పరిస్థితుల్లో సోమవారం ఉదయం అక్కడకు వచ్చిన అన్నాడీఎంకే డివిజన్ కార్యదర్శి తమిళ్‌సెల్వన్ , ఆయన మద్దతుదారుడు రాజాతో కూడిన బృందం ఆ సంస్థ ప్రతినిధుల్ని పిలిపించి ఓ లిస్టు చేతిలో పెట్టారు. ఆ లిస్టు ఆధారంగా ఆహార ప్యాకెట్లను అక్కడున్న తమ వాళ్ల చేతికి ఇవ్వాలని సూచించారు. ఇందుకు ఆ సంస్థ ప్రతినిధులు నిరాకరించారు. తమ బృందాలు తోడుగా వస్తాయని, ఎక్కడెక్కడ సరఫరా చేయాలో తమ వాళ్లే చేస్తారని సూచించారు. ఇందుకు అంగీకరించని తమిళ్‌సెల్వన్ బృందం తమ చేతికి పని పెట్టారు. పత్రికల్లో రాయలేని పదజాలాలతో ఆ మానవతా హృదయుల్ని దూషించారు. ఇక్కడి నుంచి ఆహార పదార్థాలు బయటకు వెళ్లనీయకుండాఅడ్డుకుంటామంటూ దాడికి సైతం దిగారు. ఆ సంస్థ ప్రతినిధుల్ని తరిమి తరిమి కొట్టడంతో అక్కడున్న జనంలో ఆగ్రహం రేగింది. మానవత్వంతో ఎక్కడి నుంచో వచ్చి రెండు రోజలుగా వర్షంలో తడుస్తూ స్వయంగా తయారు చేసి మరీ వేలాది మందికి ఆహార పదార్థాలను సరఫరా చేస్తున్న వాళ్లపై ఏమిటీ ఈ జులుం అంటూ ప్రశ్నించడమే కాదు, తిరగబడే యత్నం చేశారు. ప్రజలు తిరగబడడంతో అక్కడి నుంచి తమిళ్‌సెల్వన్ బృందం జారుకుంది. అయితే, ఆ సంస్థ ప్రతినిధులు తీవ్ర ఆవేదనకు లోనయ్యారు. అయినా, తమ సేవను మాత్రం ఆపలేదు. ఇదే నిజమైన మానవత్వం అంటే అని నిరూపించుకున్నారు. తమిళ్‌సెల్వన్ బృందం వీరంగాన్ని అక్కడున్న యువత రహస్యంగా తమ మొబైల్స్‌లో చిత్రీకరించి, దానిని ఓ మీడియాకు పంపించడంతో అధికార పార్టీ నాయకుల జులుం ఇలా కూడా ఉంటుందా అని రాష్ట్రానికి తెలిసి వచ్చింది. ఇదే విధంగా అడయార్, కొట్టూరుపురంలలో బాధితులకు దుప్పట్లను పంచుతున్న యువకులపై తిరగబడడమే కాదు, వారేదో నేరం చేసిన వారిలా పట్టుకుని మరీ పోలీసులకు అప్పగించారు. వారి చేతుల్లో ఉన్న దుప్పట్లను, సహాయకాలను అధికార సేనలు లాక్కెళ్లడం కూడా మరో చానల్లో ప్రత్యక్షం కావడం గమనార్హం. ఎలాంటి స్వలాభం చూసుకోకుండా, జాతి మతం భేదం లేకుండా సేవల్ని అందిస్తున్న సంఘాలపై ఇలాంటి దాడులు సాగడం సిగ్గు చేటు అని పలువురు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదే పరిస్థితి మరెన్నో చోట్ల నగరంలో సాగుతున్నాయన్న విమర్శలు, ఆరోపణలు బయలు దేరి ఉండడంతో వీటికి అడ్డుకట్ట వేయడానికి సీఎం జయలలిత స్పందిస్తారా.? అన్నది వేచిచూడాల్సిందే. లేని పక్షంలో మరేదైనా విపత్తులు ఎదురైనప్పుడు తమిళనాడు వైపుగా వచ్చేందుకు మానవతా హృదయులు భవిష్యత్తులో ఆలోచించుకోవాల్సి వస్తుందేమో! -
వరద మృతుల కుటుంబాలకు 2 లక్షల ఎక్స్‌గ్రేషియా
చెన్నై: తమిళనాడులో భారీ వర్షాలు, వరదల్లో మరణించినవారి కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. ఒక్కో కుటుంబానికి 2 లక్షల రూపాయల చొప్పున ఇవ్వనున్నట్టు శనివారం ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించారు. రెండు రోజుల క్రితం తమిళనాడు వరద ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించిన మోదీ.. తక్షణ సాయంగా ఆ రాష్ట్రానికి వెయ్యి కోట్లు విడుదల చేస్తున్నట్టు చెప్పారు. పలు రాష్ట్రాలు, సినీ ప్రముఖులు తమిళనాడుకు సాయం ప్రకటించారు. వరద తీవ్రత నుంచి కాస్త కుదుటపడుతున్న తమిళనాడులో సహాయక చర్యలను వేగవంతం చేశారు. కాగా వర్షాలు తగ్గుముఖం పట్టినా చాలా ప్రాంతాలు వరద ముంపులోనే ఉన్నాయి. -
తెలుగు సినీ నటులు ఆర్ధిక సాయం
-
ఉత్తరం రాస్తే వరద సాయం రాదు: వెంకయ్య
ఆంధ్రప్రదేశ్‌లో వరద నష్టాలపై లేఖ రాస్తే కేంద్రం పరిహారం ఇవ్వదని, సమగ్ర నివేదిక ఇవ్వాలని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు స్పష్టంచేశారు. ఇప్పటిదాకా రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర నివేదిక ఇవ్వలేద న్నారు. ఆయన ఆదివారం విశాఖలో గ్లోబల్ యూత్ మీట్ సదస్సులో పాల్గొన్న అనంతరం విలేకరులతో మాట్లాడారు. 'ఏపీకి ప్రకృతి వైపరీత్యాల కింద ఇవ్వాల్సిన రెండు విడతల నిధులను కేంద్రం విడుదల చేసింది. ఇటీవల వరదల నష్టానికి అదనంగా పరిహారం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఉత్తరం రాసింది. ఉత్తరం రాస్తే పరిహారం రాదు.. ఇంత పంట నష్టం, ఇన్ని రోడ్లు, సమాచార, రవాణా వ్యవస్థ దెబ్బతిన్నాయని సమగ్ర నివేదిక పంపిస్తే కేంద్ర బృందం వస్తుంది. వారు కొన్ని ప్రాంతాలు తిరిగి ఓ అంచనాకొస్తారు. విశాఖలో హుద్‌హుద్ తుపానుకు నష్టంపై కేంద్రానికి నివేదిక ఇచ్చారు. అది రూ. 733 కోట్లు నష్టమని నిరూపించారు.' అని వెంకయ్య వివరించారు. అలాగే వారం పది రోజుల్లో వస్తు సేవా పన్ను (జీఎస్టీ) బిల్లును ఆమోదిస్తామని ఆయన తెలిపారు. -
తమిళనాడుకు రూ.940 కోట్ల వరద సాయం
న్యూఢిల్లీ : భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలం అవుతున్న తమిళనాడు రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం తక్షణ సాయంగా రూ.924 కోట్లు ప్రకటించింది. ప్రస్తుతం మలేషియా పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ...ఈ మేరకు వరద సాయం విడుదల చేయాలని సోమవారం అధికారులు ఆదేశించారు. తమిళనాడులో వరదల కారణంగా తీవ్రంగా నష్టపోయిన ప్రాంతాలను ఆదుకునేందుకు తక్షణమే రూ.2 వేల కోట్లు విడుదల చేయాలంటూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జయలలిత ...ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాసిన విషయం తెలిసిందే. వరదల కారణంగా తమిళనాడులో కడలూరు, కాంచీపురం, చెన్నై, తిరువెల్లూరు జిల్లాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. భారీ స్థాయిలో ఆస్తి, ప్రాణనష్టం చోటుచేసుకోగా ఇప్పటికీ పలు లోతట్టు ప్రాంతాలు ఇప్పటికీ జలమయమై ఉన్నాయి. చెన్నై నగరంలో వీధుల్లో చిన్నపడవల సహాయంతో తిరుగుతున్నారంటే పరిస్థితి ఎలా ఉందో ఊహించుకోవచ్చు. వరదల బారిన పడిన తమిళనాడుకు అన్నివిధాలా సహకరిస్తామని ఇప్పటికే కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ హామీ ఇచ్చారు. అంతే కాకుండా సహాయక చర్యలకు కేంద్ర బలగాలను పంపారు. ఇక వరద నష్టంపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి నివేదిక అందిన అనంతరం మిగతా సాయాన్ని కేంద్రం ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. కాగా బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం రోవాన్ తుఫానుగా మారి తమిళనాడు రాష్ట్రంపైన, కొన్ని ఆంధ్రప్రదేశ్ జిల్లాలపైన వర్షాలు విరుచుకుపడిన విషయం తెలిసిందే. -
'రైతులకు నష్టపరిహారం చెల్లించాలి'
కోవూరు: గత ఐదు రోజులుగా కురిసిన భారీ వర్షాలు శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో జన జీవనానికి తీవ్ర ఇబ్బందులు గురి చేసింది. వేల ఎకరాల్లో పంట దెబ్బతింది. కోవూరు మండలంలో వైఎస్సార్సీపీ నాయకులు గురువారం రైతులను పరామర్శించారు. ఎనమడుగు గ్రామంలో వర్షానికి దెబ్బతిన్న 300 ఎకరాల తమలపాకు తోటను నేతలు పరిశీలించారు. వర్షాల వల్ల పంటలు దెబ్బతిన్న రైతులకు వెంటనే నష్టం పరిహారం ప్రకటించి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ పర్యటనలో వైఎస్సార్సీపీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నల్లపు రెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి, జడ్పీ చైర్మన్ రాఘవేంద్రరెడ్డితో పాటు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. -
వరద బాధితులకు రవీంద్రనాథ్‌రెడ్డి పరామర్శ
వైఎస్సార్ జిల్లా: గత ఐదు రోజులుగా కురుస్తున్న వర్షాలకు నష్టాల పాలైన రైతులను వెంటనే ప్రభుత్వం ఆదుకోవాలని కమలాపురం వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి డిమాండ్ చేశారు. గురువారం ఆయన కమలాపురం మండలంలో పర్యటించి, బాధితులను పరామర్శించారు. కొండాయపల్లెలో సుమారు 74 గొర్రెలను కోల్పోయిన పెంపకందారులతో ఎమ్మెల్యే మాట్లాడారు. నష్టపోయిన వరి రైతులకు ఎకరాకు రూ.20వేలు, గొర్రెకు రూ.10వేలు చొప్పున పరిహారం అందజేయాలని అధికారులను కోరారు. అలాగే, మొలకవారిపల్లెలో శిథిలావస్థలో ఉన్న ఇళ్లను పరిశీలించి, పక్కా గృహాల మంజూరుకు ప్రతిపాదనలు పంపాలని తహశీల్దార్ రామమోహన్‌కు సూచించారు. గంగవరం గ్రామంలో వరి పైరును పరిశీలించి బాధిత రైతులతో రవీంద్రనాథ్‌రెడ్డి మాట్లాడారు. -
కాశ్మీర్ ప్రజలకు హెచ్చరికలు
శ్రీనగర్: కాశ్మీర్ ప్రజలకు ప్రభుత్వం మరోసారి వరద ముప్పు హెచ్చరికలు జారీ చేసింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఇప్పటికే జీలం నది సాధారణ స్థాయిని మించి ఉధృతరూపం దాల్చి ప్రవహిస్తుండటంతో లోతట్టు, లోయ ప్రాంత ప్రజలకు ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ఎత్తైన ప్రాంతాలను ఆశ్రయించేందుకు సిద్ధంగా ఉండాలని సూచించింది. వీలయినంత త్వరగా సురక్షిత ప్రాంతాలకు తరలాలని హెచ్చరించింది. సాధారణ స్థాయిని మించి ప్రస్తుతం జీలం నది ప్రవాహం 19.10 అడుగుల మేర ఉందని అధికారులు తెలిపారు. కాగా, అనంతనాగ్ జిల్లాలోని సంగం ఏరియాలో 22.30 అడుగులకు చేరి జీలం ప్రవహిస్తుందని ఇది ప్రమాదకరమని ప్రభుత్వం తెలిపింది. గత రెండు రోజులుగా కాశ్మీర్లో కాస్త అయిన తెరపునివ్వకుండా వర్షం పడుతోంది. -
చెక్కులో నగదు చూసి అవాక్కయిన రైతులు
జమ్ము: జమ్మూ రాష్ట్రంలో పలువురు రైతులు పంట మీదే ఆధారపడ్డారు. పంట పండితే ఈ ఏడాది కష్టాలుండవనుకున్నారు. పంట చేతికి వస్తుందని అనుకున్న తరుణంలో.. వరదల వచ్చి పడ్డాయి. రైతన్న ఆశలు ఆవిరయ్యాయి. గతేడాది సెప్టెంబర్‌లో జమ్మూ కాశ్మీర్లో రైతుల పరిస్థితి ఇది. నమ్ముకున్న పంట వరదల రూపంలో నట్టేటమునగడంతో రైతులు తీవ్ర నిరాశ చెందారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన పీడీపీ - బీజేపీ ప్రభుత్వం అదుకుంటుందని అంతా భావించారు. ప్రభుత్వం సదరు రైతులకు చెక్కులు అందజేసింది. ఆ చెక్కుల్లోని నగదు చూసి రైతులు అవాక్కయ్యారు. ఒక్కో రైతుకు అక్షరాల రూ.32 చెక్కుల రూపంలో అందజేశారు. పంట నష్టం ఎక్కువ జరిగిన ఒకొక్క రైతుకు రూ.113 రూపాయిలు ఇచ్చారు. దీంతో రైతుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. పంట నష్టంతో ఏర్పడిన పాత గాయాలను రాష్ట్ర ప్రభుత్వం మళ్లీ రేపుతుందని రైతులు ఆరోపించారు. రైతులు చెక్కులను తిరిగి వ్యవసాయశాఖకు అందజేశారు. తావీ నది వరదలతో వేలాది రూపాయిలు నష్టపోయిన తమను ఈ ప్రభుత్వం ఇంత తక్కువ నష్ట పరిహారం అందజేసి తమని అవమాన పరిచిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
నిరసన సెగ
పాలకొండ రూరల్/పాలకొండ/వీరఘట్టం:తుపాను బాధిత ప్రాంతాల్లో పర్యటించిన మంత్రులకు వరద బాధితుల నుంచి నిరసన సెగ తగిలింది. పర్యటనకు అడుగడుగునా అంతరాయం కలిగిలింది. రోజుల తరబడి జలదిగ్బంధంలో చిక్కుకున్నా కనీసం ఆదుకునేవారే లేరని, కాసిన్ని బియ్యం గింజలు కూడా అందజేయలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. నష్టపరిహారం పరిశీలనలో అధికార పార్టీ కార్యకర్తలకే పెద్దపీట వేస్తున్నారంటూ నిలదీశారు. కాన్వాయ్‌ల ముందు బైఠాయించి నిరసన తెలిపారు. వ్యవసాయశాఖామంత్రి పత్తిపాటి పుల్లారావు, కార్మిక శాఖామంత్రి అచ్చెన్నాయుడు, ఎక్సైజ్ శాఖామంత్రి కె.రవీంద్రలు పాలకొండలోని గారమ్మకాలనీ, గోపాలపురం, వీరఘట్టం మండలంలోని కంబర తదితర వరద బాధిత ప్రాంతాల్లో ఆదివారం పర్యటించారు. కంబర వద్ద మంత్రులను మహిళలు అడ్డుకున్నారు. పంట నష్టం గుర్తింపులో వివక్ష చూపుతున్నారంటూ రైతులు కాన్వాయ్‌లను అడ్డుకున్నారు. మంత్రులను నిలదీశారు. పాలకొండ మండలం గారమ్మకాలనీకి విద్యుత్ సరఫరా చేయలేదంటూ కాలనీ వాసులు ఆందోళన వ్యక్తంచేశారు. అక్కడ నుంచి గోపాలపురం చేరుకున్న మంత్రులు రోడ్డుపైనుంచే పరిశీలన పూర్తి చేశారు. అనంతరం ఆర్డీవో కార్యాలయం వద్ద కొండాపురం గ్రామానికి చెందిన వందలాది మంది మహిళలు మంత్రుల కాన్వాయ్‌ను అడ్డుకొని నిరసన తెలిపారు. పకటనలతో సరిపెడుతున్నారని, తక్షణసాయంగా కనీసం బియ్యం కూడా అందించలేదని నిలదీశారు. మంత్రులు కాన్వాయ్ దిగకుండా వెళ్లేందుకు ప్రయత్నించగా మహిళలు కాన్వాయ్ ముందు బైఠాయించారు. వీరికి ప్రజా సంఘాల నాయకులు తోడవ్వడంతో పరిస్థితి ఉధ్రిక్తంగా మారింది. పోలీసులు రంగ ప్రవేశం చేసి బాధితులను నెట్టేసేందుకు ప్రయత్నించారు. అరుుతే, మంత్రులు సమాధానం చెప్పేవరకు కదిలేది లేదని చెప్పడంతో చేసేది లేక మంత్రి అచ్చెన్నాయుడు మాత్రమే కారు దిగి బాధితులకు సమాధాన పరిచారు. జిల్లాపై తనకు పూర్తి అవగాహన ఉందని, అందరికీ న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఇంతజరుగుతున్నా వ్యవసాయ, ఎక్సైజ్ శాఖామంత్రులు వాహనాలను కూడా దిగకపోవడం విశేషం. దీనిపై బాధితులు మరింత అక్రోశం వెల్లగక్కుతూ నినాదాలు చేశారు. వీరితో పాటు నియోజకవర్గ ఇన్చార్జి నిమ్మక జయకృష్ణ, జెడ్పీటీసీ సభ్యుడు సామంతుల దామోదరరావు, ఎంపీపీ ప్రతినిధి వారాడ సుమంత్‌నాయుడు, ఎస్టీసెల్ కన్వీనర్ నిమ్మక పాండురంగతో పాటు స్థానిక నాయకులు, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు. బాలింతకు ఎదురుచూపే... ఇటీవల వరదలో కొట్టుకుపోయిన టి.గణేష్ భార్య సరోజనికి రూ.5 లక్షల చెక్కు అందజేస్తామని ఉదయం నుంచి అధికారులు హడావిడి చేశారు. నెల రోజులైన బాలింతను ఆర్డీవో కార్యాలయం వద్ద గంటల తరబడి ఉంచారు. సాయంత్రం వరకు ఆమె ఎదురు చూసినా చెక్ మాత్రం అందజేయలేదు. దీంతో ఆమె నిరాశతో ఇంటికి చేరుకోవాల్సి వచ్చింది. మంత్రులు కాన్వాయ్ దిగకపోగా, బాధితురాలిని శ్రీకాకుళం వచ్చి చెక్కు తీసుకోవాలని సూచించడం గమనార్హం. -
వరద బాధితుల సహాయార్థం విరాళాల సేకరణ
ఆదిలాబాద్ కల్చరల్ : కాశ్మీర్ వరద బాధితుల సహాయార్థం జిల్లా కేంద్రంలో రెడ్‌క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో సోమవారం విరాళాలు సేకరించారు. ముందుగా రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి జోగు రామన్న నుంచి సొసైటీ సభ్యులు విరాళం స్వీకరించారు. ఈ నెల 19 నుంచి కాశ్మీర్ వరద బాధితుల సహాయార్థం జిల్లాలో విరాళాలు సేకరిస్తున్నట్లు సభ్యులు తెలిపారు. బ్యాంకులు, దుకాణాలు, ప్రముఖుల నుంచి విరాళాలు సేకరిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆపదలో ఉన్నవారిని ఆదుకునేందుకు సొసైటీ అన్నివేళల్లో ముందుంటుందని సభ్యుడు బాలశంకర్‌కృష్ణ తెలిపారు. సొసైటీ ఆధ్వర్యంలో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో కార్యవర్గ సభ్యులు రాంచంద్ర మహాత్మ, సతీశ్, గంగేశ్వర్, హక్, విజయకుమార్, మిట్టు రవి, బండారి దేవన్న, జమీర్ తదితరుల పాల్గొన్నారు. -
వరద బాధితులకు సచిన్ భారీ సహాయం!
క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ మరోసారి దేశ ప్రజలను ఆకట్టుకున్నారు. ఈసారి బ్యాట్ తో కాకుండా హృదయంతో ప్రజలకు చేరువయ్యారు. వరదలతో ముంచెత్తిన జమ్మూ,కాశ్మీర్ ప్రజలకు బాసటగా నిలిచేందుకు నిర్ణయం తీసుకున్నారు. వరద భాదితులకు ఐదు టన్నుల తినుభండారాలు, కప్పుకోవడానికి 1000 బ్లాంకెట్లుతోపాటు మరికొంత విలువైన వస్తువులను పంపించారు. జమ్మూ ప్రజలకు సహాయం అందించేందుకు శనివారం రెండు ట్రక్కులు ముంబై నుంచి వెళ్లాయి. ఈ విషయాన్ని కాశ్మీర్ అధికారి రంజిత్ కల్రా వెల్లడించారు. పదివేల మందికి తాగునీరు అందించేందుకు 400 వాటర్ ఫిల్టర్లు, లక్ష క్లోరిన్ టాబ్లెట్లు, ఐదు టన్నుల ఆహార పదార్థాలు, కూరగాయలు పంపారని అధికారులు తెలిపారు. -
గోదారంత తిప్పలకు.. గుప్పెడు గింజలూ కరువే
- వరద బాధితుల పట్ల సర్కారు నిర్దయ - వారంపాటు లంక గ్రామాల వారి పాట్లు - కనీస సాయానికి నిబంధనల అడ్డంకి - పస్తులున్న వారికీ జాబితాలో దక్కని చోటు - 10 వేల కుటుంబాలకు అందని సాయం సాక్షి ప్రతినిధి, కాకినాడ : గోదావరి ఉగ్రరూపంతో ఈ నెల రెండో వారంలో జిల్లాలో పలు లంకగ్రామాలు, తీర ప్రాంత గ్రామాలు నీట మునిగిపోయాయి. వేలాది కుటుంబాలు దాదాపు వారం రోజుల పాటు ముంపు నీటిలోనే ముప్పుతిప్పలు పడ్డాయి. ముంపు నుంచి తేరుకుని బయటపడ్డ అలాంటి కుటుంబాలకు ఆపన్నహస్తం అందించడంలో చంద్రబాబు సర్కారుకు ఇంకా చేతులు రాలేదు. ప్రజల సంక్షేమమే ధ్యేయమని గొప్పలకు పోయే తెలుగుదేశం ప్రభుత్వం ఆచరణలో నిబంధనల సాకుతో సాయమందించకుండా ముంపు బాధితులకు మొండిచెయ్యి చూపింది. వరదతో జిల్లాలో 15 మండలాలు ప్రభావితమయ్యాయి. సుమారు 300 లంక గ్రామాలను వరదనీరు చుట్టుముట్టింది. వందల ఇళ్ళలోకి నీరు చేరింది. లంక గ్రామాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. లంక గ్రామాలకు చెందిన వేలాదిమంది బడుగు బలహీన వర్గాల వారు ముంపు వల్ల పనులు లేక పస్తులున్నారు. ఏ ప్రభుత్వమైనా ప్రకృతి వైపరీత్యాల బాధితులకు నిబంధనలతో నిమిత్తం లేకుండా తక్షణ సాయంగా కనీసం బియ్యం, కిరోసిన్ అందజేస్తుంది. గత ప్రభుత్వాలు జిల్లాలో వరదలు సంభవించినప్పుడు నిబంధనలు సడలించి బాధిత కుటుంబాలకు 20 కిలోల బియ్యం, 5 లీటర్ల కిరోసిన్ చొప్పున అందజేశాయి. గత ఏడాది వరదల్లో అప్పటి కిరణ్ సర్కార్ కూడా ఇదే రీతిలో సాయం అందించింది. గత సర్కార్లు ఇచ్చిన సాయంలో కోత అయితే తాజా వరదల్లో బాధితులకు తెలుగుదేశం ప్రభుత్వం నిబంధనల సాకుతో సాయానికి కోత పెట్టింది. గత ప్రభుత్వాలు ఇచ్చిన సాయంలో సగానికి సగం తగ్గించి, ఒక్కో బాధిత కుటుంబానికి 10 కిలోల బియ్యం, ఒక లీటరు కిరోసిన్ ఇవ్వడానికి నిర్ణయించింది. వీటిలో ఇప్పటికి 10 కిలోల బియ్యం మాత్రమే అందజేసింది. ఇస్తానన్న లీటరు కిరోసిన్ కూడా వరదలు వచ్చి ఇన్ని రోజులయ్యాక కూడా ఇవ్వలేకపోయింది. వరద నీరు ఇంట్లోకి వచ్చిన లేదా ఇంటిని చుట్టుముట్టిన కుటుంబాలకు మాత్రమే బియ్యం, కిరోసిన్ ఇవ్వాలని నిర్ణయించారు. గ్రామాన్ని వరద నీరు చుట్టుముట్టి, రాకపోకలు స్తంభించి, పనులకు వెళ్లే దారిలేక పస్తులతో గడిపిన కుటుంబాలకు పిడికెడు బియ్యం ఇచ్చే ఔదార్యం సర్కారుకు లేకపోయింది. అన్యాయమన్న అధికార పార్టీ ఎమ్మెల్యే.. పి.గన్నవరం మండలంలో ఊడిమూడిలంక, మునగల్లంక, జి.పెదపూడిలంక, అరిగెలవారిలంక, కె.ఏనుగుపల్లి తదితర 17 లంక గ్రామాలు వరదల్లో ముంపుబారిన పడ్డాయి. ఆ గ్రామాల వారు బాహ్య ప్రపంచంలోకి వెళ్లాలంటే పడవలే దిక్కయ్యాయి. వారం రోజులపాటు వారికి ముంపు తిప్పలు తప్పలేదు. సుమారు రెండువేల కుటుంబాల వారు రాకపోకలే కాదు.. దైనందిన జీవనమూ గడవక ఇబ్బంది పడ్డారు. వీరిలో అత్యధికులు రెక్కాడితేగాని డొక్కాడని వ్యవసాయకూలీలే. వారం రోజులపాటు జన జీవనం స్తంభించినా.. నిబంధనల పుణ్యమా అని ఈ మండలం మొత్తం మీద.. నీరు చేరిన, నీరు చుట్టుముట్టిన 420 ఇళ్ల వారిని మాత్రమే బాధితులుగా గుర్తించి 10 కిలోల బియ్యం అందజేశారు. మిగిలిన కుటుంబాలను బాధితులుగా గుర్తించనేలేదు. మామిడికుదురు మండలం అప్పనపల్లి, అయినవిల్లి, నాలుగుల్లంక గ్రామాల్లో బాధితులను కూడా సర్కారు సాయానికి దూరం చేసింది. అయినవిల్లి, ఐ.పోలవరం, ముమ్మిడివరం, ఆత్రేయపురం తదితర మండలాల్లోని లంక గ్రామాల్లో బాధితులదీ ఇదే దుస్థితి. ఇలా కోనసీమతో పాటు ఇతర మండలాల్లో వరద పీడిత లంక గ్రామాల్లో సుమారు 10 వేల కుటుంబాలకు పైగా సాయానికి నోచుకోలేదంటున్నారు. తన నియోజకవర్గంలో వరద బాధిత కుటుంబాలకు నిబంధనల వల్ల అన్యాయం జరుగుతోందని అధికారపార్టీకే చెందిన పి.గన్నవరం ఎమ్మెల్యే పులపర్తి నారాయణమూర్తి అధికారులను నిలదీయడం గమనార్హం. దీనిపై ఆయన కలెక్టర్ నీతూప్రసాద్‌కు కూడా ఫిర్యాదు చేశారు. ఇకనైనా.. ప్రభుత్వం కనీస కారుణ్యాన్ని కనబరచాలని, చిరుసాయానికి కూడా మోకాలడ్డుతున్న నిబంధనలను సడలించి తమను ఆదుకోవాలని బాధితులు కోరుతున్నారు. -
వరద బాధితులను ఆదుకుంటాం
భీమవరం : గోదావరి వరదకు నష్టపోయిన బాధితులను ప్రభుత్వపరంగా అన్నివిధాలా ఆదుకుంటామని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత, రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ, గనుల శాఖ మంత్రి పీతల సుజాత తెలిపారు. ఆదివారం జిల్లాలోని వరద ముంపు ప్రాంతాలను పర్యటించి వచ్చిన అనంతరం వారు భీమవరంలో ఎంపీ తోట సీతారామలక్ష్మి నివాసంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సునీత మాట్లాడుతూ వరదల కారణంగా పంట పొలాలు మునిగి దెబ్బతిన్నాయని వాటిని చూసి చలించిపోయానని చెప్పారు. బాధితులందరికీ ప్రభుత్వం పరంగా ఆదుకునేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకువెళతానన్నారు. వరద బాధితులకు ఇప్పటికే బియ్యం, కిరోసిన్ పంపిణీ చేసినట్టు చెప్పారు. సమావేశంలో మంత్రి సుజాత మాట్లాడుతూ జిల్లాలోని పోలవరం, కొవ్వూరు, నిడదవోలు, ఆచంట, నరసాపురం, పాలకొల్లు నియోజకవర్గాల్లోని గోదావరి తీర ప్రాంతంలో వరద నష్టం జరిగినట్లు గుర్తించామన్నారు. పోలవరం నియోజకవర్గంలో పొగాకు, అరటి తోటలు, ఆచంట, పాలకొల్లు ప్రాంతాల్లో అరటి, తమలపాకు, కొబ్బరి, వరి పొలాలు దెబ్బతిన్నాయన్నారు. వీటి నష్టాన్ని అంచనా వేసి నివేదించాలని జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించామని తెలిపారు. త్వరలో అధికారులు బృందాలు వరద ప్రాంతాల్లో పర్యటించి జరిగిన నష్టాన్ని అంచనా వేస్తాయన్నారు. సమావేశంలో విప్ అంగర రామ్మోహన్, ఎమ్మెల్యేలు పులపర్తి రామాంజనేయులు, డాక్టర్ నిమ్మల రామానాయుడు, బండారు మాధవనాయుడు, గన్ని వీరాంజనేయులు, మెంటే పార్ధసారథి, భీమవరం మునిసిపల్ చైర్మన్ కొటికలపూడి గోవిందరావు తదితరులు పాల్గొన్నారు. -
కాశ్మీర్లో వర్షం.. రోడ్లపైనే వరద బాధితులు
శ్రీనగర్: భారీ వరదలతో అతలాకుతలమైన జమ్మూకాశ్మీర్‌లో మళ్లీ వర్షం కురిసింది. ఆదివారం ఉదయం కాశ్మీర్ లోయలో శ్రీనగర్ సహా పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. దీంతో సహాయక చర్యలకు విఘాతం ఏర్పడింది. నిరాశ్రయులైన వరద బాధితులు రోడ్లపైనే బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. 60 ఏళ్లుగా ఎన్నడూ చూడనివిధంగా కాశ్మీర్‌ను వరదలు ముంచెత్తిన సంగతి తెలిసిందే. ఐదు రోజులుగా వర్షం తెరిపినివ్వడంతో సైన్యం వరద బాధితులను ఆదుకునేందుకు రంగంలోకి దిగింది. ఈ రోజు వర్షం కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. -
కాశ్మీర్ బాధితులకు యూత్ కాంగ్రెస్ విరాళం
జమ్మూకాశ్మీర్ వరద బాధితులను ఆదుకునేందుకు రాష్ట్ర యువజన కాంగ్రెస్ నుంచి రూ.10లక్షల ఆర్థిక సహాయం అందజేస్తున్నట్లు కాంగ్రెస్ ఎమ్మెల్యే వంశీచంద్ రెడ్డి తెలిపారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల నుంచి కాశ్మీర్‌కు భారీగా ఆర్థిక సహాయం, ఇతర సహాయక చర్యలు అందిస్తున్నామని ఆయన చెప్పారు. కొత్త జిల్లాల ఏర్పాటుపై ముందుగా ఉన్నతాధికారులతో కమిటీ వేయాలని, ఆ కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా అసెంబ్లీలో చర్చించిన తర్వాత మాత్రమే కొత్త జిల్లాలను ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే వంశీచంద్ రెడ్డి కోరారు. -
వరద బాధితులకు పీఎంవో విరాళం
న్యూఢిల్లీ: జమ్మూకాశ్మీర్ వరద బాధితులకు ప్రధానమంత్రి కార్యాలయ (పీఎంవో) సిబ్బంది, అధికారులు తమ ఒక రోజు వేతనాన్ని విరాళంగా ప్రకటించారు. ఒక రోజు వేతనాన్ని స్వచ్ఛందంగా ప్రధాన మంత్రి జాతీయ సహాయ నిధికి అప్పగించాలని సిబ్బంది, అధికారులు నిర్ణయించినట్టు పీఎంవో గురువారం ఒక ప్రకటనలో పేర్కొంది. ఆరు దశాబ్దాల కాలంలో ఎన్నడూ కనివినీ ఎరుగనిరీతిలో జమ్మూకాశ్మీర్‌ను వరదలు ముంచెత్తడంతో ఇప్పటి వరకూ 215 మంది మృత్యువాతపడగా.. లక్షలాది మంది నిరాశ్రయులైన సంగతి తెలిసిందే. -
నాలుగేళ్ల క్రితమే ఊహించారు!
శ్రీనగర్: కాశ్మీర్‌ను వణికిస్తున్న ఈ వరద బీభత్సాన్ని నాలుగేళ్ల క్రితమే ఆ రాష్ట్ర ‘వరద నియంత్రణ విభాగం’ అంచనా వేసిందని గ్రేటర్ కాశ్మీర్ అనే స్థానిక ఇంగ్లీష్ దినపత్రిక బుధవారం వెల్లడించింది. వచ్చే ఐదేళ్లలో రాష్ట్రానికి భారీ వరద ముప్పు ఉందని, ఆ వరదల్లో శ్రీనగర్- జమ్మూ హైవే కొట్టుకుపోతుందని, కాశ్మీర్ లోయకు సంబంధాలు తెగిపోతాయని ఆ విభాగం ఒక నివేదికలో హెచ్చరించింది. ఆ నివేదికను కేంద్ర జలవనరుల శాఖకు పంపించింది. దాంతోపాటు రాష్ట్రంలో వరదల్ని ఎదుర్కొనేలా మౌలిక వసతులఅభివృద్ధి కోసం రూ. 2200 కోట్ల ప్రాజెక్టు ప్రతిపాదనలనూ పంపించింది.వాతావరణ మార్పుల వల్లనే: వాతావరణ మార్పు వల్లనే కాశ్మీర్ వరదల వంటి ఉత్పాతాలు చోటు చేసుకుంటున్నాయని సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ పేర్కొంది. తెలుగువారిని రక్షించండి న్యూఢిల్లీ: కాశ్మీర్ వరదల్లో చిక్కుకున్న తెలుగువారికి తగిన సహాయం అందించడంతో పాటు, అక్కడ నుంచి సురక్షితంగా ఢిల్లీకి చేర్చేందుకు చర్యలు తీసుకోవాలని ఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అధికార ప్రతినిధి కంభంపాటి రామ్మోహన్రావు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ విషయమై బుధవారం ఢిల్లీలో ప్రధాని కార్యాలయ వ్యవహారాల మంత్రి జితేంద్రసింగ్‌ను కలుసుకున్నట్టు కంభంపాటి చెప్పారు. వరదల్లో చిక్కుకున్న 60 మంది తెలుగు విద్యార్థులను కాపాడాలని జమ్ము కాశ్మీర్ అధికారులకు ఫోన్లో విజ్ఞప్తి చేసామన్నారు. బాధితుల సమాచారాన్ని తెలిపేం దుకు ఏపీభవన్‌లో 011-23384188 నంబర్‌తో కంట్రోల్‌రూంను ఏర్పాటు చేశామన్నారు. -
విజయ్ కాంత్ 10 లక్షల విరాళం
చెన్నై: వరదలతో అతలాకుతలమైన జమ్మూ,కాశ్మీర్ ను ఆదుకునేందుకు డీఎండీకే వ్యవస్థాపక అధ్యక్షుడు విజయ్ కాంత్ 10 లక్షల రూపాయల ఆర్ధిక సహాయాన్ని ప్రకటించారు. గత 60 సంవత్సరాల్లో ఎన్నడూ లేనంతగా జమ్మూ, కాశ్మీర్ ను వరదలు ముంచెత్తాయి. వరదల కారణంగా ప్రజల జీవితం దుర్భరంగా మారిందని విజయ్ కాంత్ తెలిపారు. విజయ్ కాంత్ తన సహాయాన్ని ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధికి అందించారు. కష్టాల్లో ఉన్న జమ్మూ,కాశ్మీర్ ప్రజలను ఆదుకునేందుకు సంపన్నులు, వ్యాపారవేత్తలు, యువకులు ముందుకు రావాలని ఓ ప్రకటనలో కోరారు. -
వరద బాధితుల ఆక్రందన
కూనవరం,న్యూస్‌లైన్: వరద బాధితులతో ఆక్రందనలతో మండల కేంద్రమైన కూనవరం మిన్నంటుతోంది. అర్హులకు పరిహారం ఎందుకు మంజూరు చేయలేదంటూ ఆందోళనలు కొనసాగుతున్నాయి. వరద పట్టనివారికి పరిహారం ఇచ్చి, మూడుసార్లు ముంపుకు గురైనవారికి మొండిచేయిచూపిస్తారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వరదభాదితులు శుక్రవారం తహశీల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. అనంతరం ఆర్అండ్బీ రోడ్డుపైకివచ్చి సుమారు గంటపాటు రాస్తారోకో నిర్వహించారు. వాహనాలు నిలిచిపోయి రాకపోకలు స్తంభించడంతో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి.తహశీల్దార్ కమల, వీఆర్‌పురం ఎస్సై శ్రీధర్ ఆందోళన వద్దకు వచ్చి అర్హుల గుర్తింపునకు రీ సర్వే నిర్వహిస్తామని హామీ ఇవ్వడంతో బాధితులు ఆందోళన విరమించారు. సర్వేలో అవకతవకలు మండల కేంద్రంలో వరద బాధితులు ఐదు రోజుల నుంచి ఆందోళనలు చేస్తున్నారు. సర్వేలో అవకతవకలు చోటుచేసుకోకపోవడంత వరదముంపు బాధితులకు తీవ్ర అన్యాయం జరిగింది. ఎన్యూమరేషన్ సర్వే సమయంలోనే రెవెన్యూధికారులు లోపాయికారి ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. వరదపట్టని ప్రదేశాలకు చెందిన కొందరు ఎన్యూమరేషన్ జాబితాలో తమపేర్లు చేర్చినట్లైతే పరిహారం మంజూరయ్యాక చెరిసగం పంచుకుందామంటూ ఒప్పందం చేసుకున్నట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. ఇళ్ళసర్వేకి వచ్చిన రెవెన్యూ సిబ్బంది రాత్రి సమయంలో తహశీల్దార్ కార్యాలయంలో బస చేసినప్పుడు వారికి స్థానిక సిబ్బంది తోడై ఈ తతంగం నడిపినట్లు తెలుస్తోంది. ఇలాంటివి సమర్థించుకునేందుకు సదరు అధికారులు పక్కాభవనాలకు, దుకాణాలకు, రెండుమూడు పోర్షన్‌ల్లో ఉన్నవారికి నష్టపరిహారం రాదని చెబుతున్నారు. అయితే ఇటీవల పంపిణీ చేసిన వరద నష్టపరిహారం చెక్కుల్లో పూరిగుడిసెల్లో వారికంటే పైన పేర్కొన్నవారే అధికంగా ఉండటం గమనార్హం. వాస్తవానికి గత ఆగస్టులో సంభవించిన గోదావరి వరదలు మూడో ప్రమాదస్థాయి హెచ్చరికలు దాటిప్రవహించింది. తద్వారా మండలంలో మూడువంతులు పైగాగ్రామాలు వరద ముంపునకు గురయ్యాయి. ఉదయభాస్కర్ కాలనీలో పక్కాగృహాలు సైతం కుప్పకూలాయి. పూరిళ్ల సంగతి చెప్పనక్కర లేదు. మండలవ్యాప్తంగా సుమారు 2000 ఇళ్లకుపైగా వరదలకు దెబ్బతిన్నాయి. సదరు అధికారులు నెలరోజుల తరువాత సర్వే నిర్వహించి కేవలం 599 ఇళ్లు మాత్రమే వరద తాకిడికి దెబ్బతిన్నట్లు తేల్చారు. టేకుబాకలో ఒకే ఒక ఇల్లు వరద ముంపునకు గురైనట్లు గుర్తించారు. అధికారులు నిర్లక్ష్యం వీడి రీ సర్వే చేసి అర్హులకు పరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని బాధితులు కోరుతున్నారు. మొదట మునిగేది మా ఇల్లే .. వరదొస్తే మొదట మునిగేది మా ఇల్లే. ఆ సమయంలో రెవెన్యూ అధికారులు మా ఇంటి ముందు నుంచే లాంచీ ఎక్కి అటూ ఇటూ తిరుగుతారు. ఇల్లంతా మునిగిపోయి, పై నుంచి లాంచీలు తిరిగినా నాకు నష్టపరిహారం ఇవ్వలేదు . - దగ్గుబల్లి భద్రమ్మ, కూనవరం మధ్యనున్న ఇల్లు మునగలేదంట మాంటి ముందు, వెనుక, పక్కనున్న ఇళ్లకు పరిహారం వచ్చింది. మధ్యనున్న నా ఇల్లు ముంపుకు గురికాలేదట. అధికారుల సర్వేలో అన్నీ అవకతవకలే. ఇదీ రెవెన్యూ అధికారుల నిర్వాకం. - నాసుపల్లి రాజమ్మ, కూనవరం మూడు సార్లు మునిగినా పరిహారం ఇవ్వలేదు కొద్దిపాటి వ రద వచ్చినా మొదట మునిగేది ఉదయ భాస్కర కాలనీయే. అందులో మొట్ట మొదట మునిగే ఇల్లు కూడా మాదే. ఇప్పటికి మూడు సార్లు వరదలు వచ్చాయి. అయినా అధికారులు పరిహారం ఇవ్వలేదు. - చిలకా వెంకటలక్ష్మి, ఉదయభాస్కర కాలనీ -
ప్రధాని మాట నీటి మూట!
గల్లంతైన రూ.వెయ్యి కోట్ల తక్షణ వరద సాయం హామీ రూ.700 కోట్ల అడ్వాన్సుతోనే సరిపెట్టిన కేంద్రం రూ. 1,145 కోట్ల బకాయిల విడుదల మాటే లేదు సాక్షి, హైదరాబాద్: వరద సాయంపై సాక్షాత్తు ప్రధానమంత్రి మన్మోహన్సింగ్ ఇచ్చిన మాట నీటిమూటైంది. కేవలం నెల రోజుల వ్యవధిలో మూడు తుపాన్లు, భారీ వర్షాలు, వరదలవల్ల తీవ్రంగా నష్టపోయిన రాష్ట్రానికి తక్షణ సాయం విషయంలో కేంద్రం కరుణించలేదు. అక్టోబరులో పైలీన్ తుపాను, తర్వాత వారం రోజులకే భారీ వర్షాలు, నవంబరులో హెలెన్ తుపానువల్ల రాష్ట్రంలో 53 వేల ఎకరాల్లో పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. 63 మంది మృత్యువాత పడ్డారు. రోడ్లు, వంతెనలు, చెరువు కట్టలు కొట్టుకుపోవడం, విద్యుత్తు స్తంభాలు కూలిపోవడంవల్ల ఆయా శాఖలకు భారీ నష్టం వాటిల్లింది. పైలీన్ తుపాను అనంతరం సీఎం నేతృత్వంలో ప్రతినిధి బృందం కలిసినప్పుడు సాయంగా తక్షణమే రూ. వెయ్యికోట్లు అడ్వాన్సు కింద ఇస్తామని ప్రధాని ప్రకటించారు. పైలీన్ తర్వాత వారం రోజులపాటు ఎడతెరపిలేని వర్షాలవల్ల రాష్ట్రంలో పంటలన్నీ తుడిచిపెట్టుకుపోయాయి. తర్వాత పది రోజులకే వచ్చిన హెలెన్ తుపానుతో అక్కడక్కడా మిగిలిన పంటలు కూడా నీటిపాలై రైతులు కోలుకోలేని విధంగా నష్టపోయారు. రూ. 6,400కోట్ల వరద సాయం అందించాలంటూ రాష్ట్ర ప్రభుత్వం పంపిన వినతిపత్రం ఆధారంగా కేంద్ర బృందం కూడా రాష్ట్రంలో పర్యటించింది. ఊహించిన దానికంటే అధిక నష్టం వాటిల్లినందున నివేదికను సవరించి పంపాలని రాష్ట్రానికి సూచించింది. దీని ప్రకారమే రాష్ట్ర ప్రభుత్వం రూ. 7,513.84 కోట్ల సాయం కోరుతూ సవరించిన నివేదికను పంపింది. ఈ నేపథ్యంలో అడ్వాన్సు కింద వరదసాయం పెంచాల్సిన కేంద్రం మరింత తగ్గించడం గమనార్హం. బుక్ అడ్జెస్ట్మెంట్... పైలీన్ సాయం కింద రూ.1,000 కోట్లు తక్షణమే విడుదల చేస్తామని ప్రధాని ప్రకటించగా, జాతీయ విపత్తు సహాయ నిధి (ఎన్డీఆర్ఎఫ్) కింద రూ. 700 కోట్లు మాత్రమే కేంద్రం అడ్వాన్సు కింద విడుదల చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రాష్ట్ర విపత్తు సహాయ నిధి (ఎస్డీఆర్ఎఫ్) కింద రెండో విడతలో సాధారణంగానే ఈనెలలో విడుదల కావాల్సిన రూ.300 కోట్లను కూడా బుక్ అడ్జెస్ట్‌మెంటు కింద కేంద్రం పేర్కొంది. దీనిపై విపత్తు నిర్వహణ శాఖ అధికారులు పెదవి విరుస్తున్నారు. ‘ప్రధాని రూ. వెయ్యి కోట్ల అడ్వాన్సు ప్రకటిస్తే వాస్తవంగా కేంద్రం ఎన్డీఆర్ఎఫ్ కింద రూ. 700 కోట్లే విడుదల చేసింది.. మామూలుగానే ఎస్డీఆర్ఎఫ్ కింద ఈనెలలో విడుదల కావాల్సిన రూ.300 కోట్లను కూడా అడ్వాన్సు కింద పేర్కొని రూ. వెయ్యి కోట్లు విడుదల చేసినట్లు లెక్కచూపారు. మన రాష్ట్రానికి విపత్తు సాయం కింద రావాల్సిన రూ.1,145కోట్ల బకాయిల గురించి కోరగా పరిశీలిస్తామని ప్రధాని చెప్పారు. ఇలా చెప్పడం మినహా బకాయిలు ఇచ్చేది ఉండదు. ఇది రాష్ట్రంపై కేంద్ర ప్రభుత్వ వివక్షకు నిదర్శనం’ అని రాష్ట్రానికి చెందిన ఒక అధికారి ‘సాక్షి’తో అన్నారు. -
నేతన్న దైన్యం
చీరాల, న్యూస్‌లైన్: మగ్గం ఆడితేనే పూటగడిచే చేనేత కార్మికులు ప్రస్తుతం నిస్సహాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. వరదలు వీడి నెల రోజులు దాటుతున్నా.. మగ్గం గుంతల్లో తడి ఆరలేదు. వరద బాధితులకు ప్రభుత్వ సాయం అరకొరగానే అందింది. మగ్గం, నూలు దెబ్బతిని ఆర్థికంగా నష్టపోయిన కార్మికులకు పరిహారం అందించడంలో తాత్సారం జరుగుతోంది. చేనేత కార్మికులను ఆదుకుంటామని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి స్వయంగా ఇచ్చిన హామీ కూడా ఇప్పట్లో నెరవేరేలా లేదు. చీరాల ప్రాంతంలో పదివేల మగ్గాలపైనే ఉన్నాయి. అక్టోబర్‌లో కురిసిన భారీ వర్షాలకు మండలంలోని బుర్లవారిపాలెం పంచాయతీలోని సాయి కాలనీ, తోటవారిపాలెం పంచాయతీలోని అవ్వారు సుబ్బారావు, మహాలక్ష్మమ్మ కాలనీ, బండారు నాగేశ్వరరావు కాలనీ, మార్కండేయ కాలనీలన్నీ జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. మగ్గం గుంతల్లోకి నీరు చేరి అవి దెబ్బతిన్నాయి. వస్త్రాలు నేసేందుకు సిద్ధం చేసుకొన్న నూలు వర్షాల ధాటికి పాడైపోయింది. నిరాశ్రయులైన కుటుంబాలకు అందించే సాయం కూడా అందరికీ అందలేదు. ప్రభుత్వం ఒక్కో కుటుంబానికి పది కేజీల బియ్యం, రెండు లీటర్ల కిరోసిన్ మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకుంది. నెలన్నర రోజులుగా పనులు లేక, తినడానికి తిండి లేక పస్తులుంటున్నప్పటికీ అధికారులు పట్టించుకోలేదు. ప్రభుత్వం తక్షణ సాయం కింద ఇచ్చిన బియ్యం, కిరోసిన్ కూడా అందరికీ కాకుండా కొందరికి మాత్రమే ఇచ్చారు. సీఎం హామీ ఎప్పటికి నెరవేరేనో..? భారీ వర్షాల కారణంగా ముంపునకు గురైన సాయి కాలనీని సీఎం కిరణ్ సందర్శించి చేనేతలను అన్ని విధాలా ఆదుకుంటామని హామీలిచ్చారు. వర్షాల కారణంగా దెబ్బతిన్న చేనేత మగ్గాలు, నూలుకు నష్టపరిహారం చెల్లిస్తామని చెప్పినా.. అది నేటికీ అమలుకు నోచుకోలేదు. దెబ్బతిన్న మగ్గానికి రూ. 5 వేలు, పని దినాలు కోల్పోయినందుకు రూ. 5 వేలు, దెబ్బతిన్న నూలుకు రూ.5 వేలు చొప్పున ఒక్కో కుటుంబానికి నష్టపరిహారం చెల్లిస్తామని హామీ ఇచ్చారు. ఈ మేరకు అధికారులు నష్టపోయిన మగ్గాల అంచనాలను పూర్తి చేశారు. కానీ పరిహారం వస్తుందో... లేదో అన్న అనుమానాలు కార్మికుల్లో వ్యక్తమవుతున్నాయి. గతంలో వచ్చిన నీలం తుపానుతో నష్టపోయిన చేనేత కార్మికులకు ప్రభుత్వం నేటికీ నష్టపరిహారం అందించలేదు. అప్పటి నష్టపరిహారాన్నే ఇవ్వని ప్రభుత్వం ప్రస్తుతం జరిగిన నష్టానికి పరిహారం అసలు ఇస్తుందా అనే సందేహం కార్మికులను పీడిస్తోంది. -
వాడీవేడిగా
ఒంగోలు, న్యూస్‌లైన్: జిల్లా అభివృద్ధిపై అధికారులకు ఏమాత్రం చిత్తశుద్ధిలేదని జిల్లా ఇన్చార్జి మంత్రి సాకే శైలజానాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక సీపీఓ కాన్ఫరెన్స్ హాలులో ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు జిల్లా సమీక్ష మండలి(డీఆర్సీ) సమావేశం వాడీవేడిగా జరిగింది.‘జిల్లాలో ఏం జరుగుతుందో తెలియడంలేదు. నిధులు ఎలా మంజూరు చేయించుకోవాలో తెలియదు. వచ్చిన వాటిని ఎలా ఖర్చు చేయాలో మీకు అర్థం కాదు’ అని మంత్రి ధ్వజమెత్తారు. సభ్యుల ప్రశ్నలతో సమావేశం ఉత్కంఠగా సాగింది. ఒక పూట భోజనం పెడితే సరిపోతుందా? గత నెలలో సంభవించిన వరదల వల్ల ముంపునకు గురైన ప్రాంతాల గురించి అధికారులు పట్టించుకోలేదని వైఎస్సార్సీఎల్పీ విప్ బాలినేని శ్రీనివాసరెడ్డి ధ్వజమెత్తారు. సంకువానిగుంట గ్రామస్తులు ఆరురోజులపాటు నడుం లోతు నీళ్లల్లో ఉన్నారని.. వారంతా దళితులేనని తెలిపారు. వారి బాగోగులు పట్టించుకోకుండా ఒక్కరోజు భోజనం పెడితే సరిపోతుందా? అని ప్రశ్నించారు. ఇప్పటివరకు బాధితులకు ఎలాంటి పరిహారం అందలేదన్నారు. తామే పడవలో వెళ్లి బాధితులకు ఆహారం అందించాల్సి వచ్చిందని తెలిపారు. హైలెవల్ బ్రిడ్జి నిర్మించాలి.. బాధితులను ఆదుకోవాలని తాను కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినా ప్రభుత్వం సరిగా చర్యలు తీసుకోలేదని వైఎస్సార్ సీపీ కేంద్రపాలక మండలి సభ్యుడు జూపూడి ప్రభాకరరావు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆ ప్రాంత సమస్య పరిష్కరించాలంటే వాగుపై హైలెవల్ బ్రిడ్జి నిర్మించాలని కోరారు. దీనిపై ఒంగోలు ఆర్డీఓ మాట్లాడుతూ రోడ్లు కోతకు గురికావడంతో ఆ ప్రాంతానికి వెళ్లలేకపోయామని.. ఇప్పుడు పంపిణీ చేయిస్తామనడంతో సభ్యులతో పాటు మంత్రి అభ్యంతరం వ్యక్తం చేశారు. సాయంత్రం లోగా ఆ గ్రామంలో బియ్యం, కిరోసిన్ పంపిణీ చేయాలని ఆదేశించారు. ప్రభుత్వమే శనగలు కొనుగోలు చేయాలి జిల్లాలోని కోల్డుస్టోరేజీల్లో పేరుకుపోయిన శనగలను ప్రభుత్వమే వ్యవసాయ మార్కెట్ కమిటీల ద్వారా కొనుగోలు చేయాలని ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, పర్చూరు ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వరరావులు ప్రతిపాదించారు. శనగ రైతులపై బ్యాంకర్ల ఒత్తిడి తగ్గించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. తమ ప్రాంతంలో 44 వేల ఎకరాల్లో పంట నష్టం సంభవించిందని చీరాల ఎమ్మెల్యే ఆమంచి తెలిపారు. నియోజకవర్గంలో ఒక అంగన్వాడీ కేంద్రం భవనాన్ని కూల్చివేసి అందులోని సామగ్రిని అమ్ముకున్నారని ఆరోపించారు. గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు ఐసీడీఎస్ సమస్యలను ప్రస్తావించారు. విద్యాశాఖలో పదోన్నతులు కల్పించాలని ఎమ్మెల్సీ యండపల్లి శ్రీనివాసరెడ్డి కోరారు. జిల్లాలో 18 హెచ్ఎం పోస్టులు.. 150 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. హాస్టళ్ల నిర్మాణాలు ఎక్కడ? సింగరాయకొండ, తిమ్మసముద్రంలో చేపట్టిన బీసీ హాస్టళ్ల నిర్మాణాలు గత నాలుగైదు సంవత్సరాలుగా అర్ధాంతరంగా నిలిచిపోయాయని కొండపి, సంతనూతలపాడు ఎమ్మెల్యేలు జీవీ శేషు, బీఎన్ విజయ్‌కుమార్‌లు సమావేశం దృష్టికి తెచ్చారు. ఈ విషయం తమకు సంబంధంలేదంటూ బీసీ సంక్షేమ శాఖ అధికారి ప్రకటించడంతో.. మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంట్రాక్టర్ కూడా ఎవ రో తెలియకుండానే పని చేస్తున్నారా? అని ప్రశ్నించారు. విచారణ చేపట్టి.. కారకులకు నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు. ప్రాజెక్టులపై రచ్చ.. పాలేటిపల్లి, మల్లవరం రిజర్వాయర్లు, కొరిశపాడు చినపోలిరెడ్డి ఎత్తిపోతల పథకం, వెలిగొండ ప్రాజెక్టుల పురోగతిపై అధికారుల వివరణ ఎవరినీ సంతృప్తి పరచలేదు. వెలిగొండ టన్నెల్ నిర్మాణం కేవలం 46 శాతం పూర్తయితే.. నిర్మాణం మొత్తం ఎప్పటికి పూర్తవుతుందని ఎస్ఈని ప్రశ్నించారు. కనిగిరి ఎమ్మెల్యే ముక్కు ఉగ్రనరసింహారెడ్డి మాట్లాడుతూ ప్రాజెక్టు పరిధిలోని తమ భూములు స్వాధీనం చేసుకొని కాలువలు తవ్వుతున్నారని.. కానీ ఇప్పటికీ నష్టపరిహారం పంపిణీ చేయలేదన్నారు. ప్రాజెక్టు వ్యవహారాలపై ఇంజినీరింగ్, నీటిపారుదల, ఆర్డబ్ల్యూఎస్, ఆర్అండ్బీ, జాతీయరహదారుల శాఖల తో మరోసారి సమావేశం కావాలని తీర్మానించా రు. రిమ్స్ నిర్మాణాల్లో జాప్యం జరిగితే కాంట్రాక్టర్‌కు నోటీసులు జారీ చేయాలని కోరారు. బ్యాంకర్లు సహకరించడంలేదు.. బ్యాంకర్ల వల్ల రైతుల నష్టపరిహారం పంపిణీ జాప్యమవుతోందని వ్యవసాయశాఖ జేడీ దొరసాని తెలిపారు. నీలం తుపాను పరిహారంగా జిల్లాకు రూ 5.12 కోట్లు మంజూరయ్యాయన్నారు. ఇప్పటికి రూ 2.38 కోట్లు పంపిణీ చేసినట్లు తెలిపారు. ఎస్బీఐ, ఎస్బీహెచ్ అధికారులు రైతుల అకౌంట్లలో నగదు జమ చేయడానికి సహకరించడంలేదని ఫిర్యాదు చేశారు. దీనిపై కలెక్టర్ విజయకుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. లీడ్‌బ్యాంకు మేనేజర్ వివరణ ఇస్తూ సోమవారమే అకౌంట్లకు జమయ్యేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. -
వరదల్లో చనిపోయినవారికి రూ.2 లక్షలు
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్, ఒడిశాలలో పైలీన్ తుపాను, వరదల వల్ల మృతి చెందిన కుటుంబాలకు ఒక్కొక్కరికి ప్రధాన మంత్రి జాతీయ సహాయ నిధి నుంచి కేంద్ర ప్రభుత్వం రెండు లక్షల రూపాయలు ఇవ్వనుంది. అలాగే గాయపడిన వారికి 50వేల రూపాయలు ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. ఆంధ్రప్రదేశ్, ఒడిశా రెండు రాష్ట్రాలకు తక్షణ సాయం కింద కేంద్రం వెయ్యికోట్ల రూపాయలు విడుదల చేసింది. పూర్తిస్థాయిలో నివేదికలు అందిన తరువాత కేంద్రం ఈ సహాయాన్ని పెంచుతుంది.