సాక్షి, హైదరాబాద్: పై-లీన్ తుపాను, కుండపోత వర్షాల వల్ల రాష్ట్రంలో భారీ నష్టం వాటిల్లిన విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఇతోధిక సాయం అందించాలని ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్‌కు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి విజ్ఞప్తి చేయనున్నారు. పై-లీన్ తుపాను, గత నెల 21 నుంచి 27వ తేదీ వరకూ సంభవించినభారీ వర్షాల వల్ల కలిగిన నష్టాన్ని వివరించి రూ.6,191 కోట్ల మేర ఆర్థిక సాయం కోరేందుకు సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి శనివారం ప్రధానిని కలుస్తారు. పై-లీన్, వరద నష్టాలపై రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ అధికారులు రూపొందించిన నివేదికలను రెవెన్యూ శాఖ మంత్రి రఘువీరారెడ్డి ముఖ్యమంత్రికి పంపించారు. ఈ నివేదికలను ప్రధాన మంత్రికి సీఎం అందజేస్తారు. వరుస విపత్తులతో నష్టపోతున్న రాష్ట్రానికి ఉదారంగా ఆర్థికసాయం అందించాలని సీఎం కోరనున్నారు.
ప్రధాన మంత్రితో అపాయింట్‌మెంట్ ఖరారైందని సీఎం కార్యాలయ వర్గాలు తెలిపాయి. వర్షాల వల్ల రాష్ట్రాన్ని ఆదుకునేందుకు రూ.6,149.14 కోట్ల ఆర్థిక సాయం కోరుతూ విపత్తు నిర్వహణ శాఖ మరో నివేదిక రూపొందించింది. అలాగే గత నెలలో సంభవించిన పై-లీన్ తుపానువల్ల రాష్ట్రంలో 763.21 కోట్ల నష్టం వాటిల్లింది. సహాయ, పునరావాస, తాత్కాలిక మరమ్మతు పనుల కోసం రూ. 42.26 కోట్లు అవసరం అని మరో నివేదికలో పేర్కొంది. ఈ రెండు నివేదికలను ముఖ్యమంత్రి శనివారం ప్రధానికి అందజేస్తారని రెవెన్యూ మంత్రి రఘువీరారెడ్డి అధికారులకు తెలిపారు.
కరువుపై వారం రోజుల్లో నివేదిక: కరువు మండలాలపై వారం రోజుల్లో నివేదికలు తెప్పించాలని మంత్రి రఘువీరారెడ్డి ఆదేశించారు. విపత్తుల నిర్వహణ, వ్యవసాయ, ఉద్యాన తదితర శాఖల అధికారులతో శుక్రవారం సమీక్షించారు. విపత్తుల నిర్వహణ కమిషనర్ పార్థసారథి, అధికారులు పాల్గొన్నారు.