గల్లంతైన రూ.వెయ్యి కోట్ల తక్షణ వరద సాయం హామీ
రూ.700 కోట్ల అడ్వాన్సుతోనే సరిపెట్టిన కేంద్రం
రూ. 1,145 కోట్ల బకాయిల విడుదల మాటే లేదు
సాక్షి, హైదరాబాద్: వరద సాయంపై సాక్షాత్తు ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్ ఇచ్చిన మాట నీటిమూటైంది. కేవలం నెల రోజుల వ్యవధిలో మూడు తుపాన్లు, భారీ వర్షాలు, వరదలవల్ల తీవ్రంగా నష్టపోయిన రాష్ట్రానికి తక్షణ సాయం విషయంలో కేంద్రం కరుణించలేదు. అక్టోబరులో పైలీన్ తుపాను, తర్వాత వారం రోజులకే భారీ వర్షాలు, నవంబరులో హెలెన్ తుపానువల్ల రాష్ట్రంలో 53 వేల ఎకరాల్లో పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. 63 మంది మృత్యువాత పడ్డారు. రోడ్లు, వంతెనలు, చెరువు కట్టలు కొట్టుకుపోవడం, విద్యుత్తు స్తంభాలు కూలిపోవడంవల్ల ఆయా శాఖలకు భారీ నష్టం వాటిల్లింది. పైలీన్ తుపాను అనంతరం సీఎం నేతృత్వంలో ప్రతినిధి బృందం కలిసినప్పుడు సాయంగా తక్షణమే రూ. వెయ్యికోట్లు అడ్వాన్సు కింద ఇస్తామని ప్రధాని ప్రకటించారు.
పైలీన్ తర్వాత వారం రోజులపాటు ఎడతెరపిలేని వర్షాలవల్ల రాష్ట్రంలో పంటలన్నీ తుడిచిపెట్టుకుపోయాయి. తర్వాత పది రోజులకే వచ్చిన హెలెన్ తుపానుతో అక్కడక్కడా మిగిలిన పంటలు కూడా నీటిపాలై రైతులు కోలుకోలేని విధంగా నష్టపోయారు. రూ. 6,400కోట్ల వరద సాయం అందించాలంటూ రాష్ట్ర ప్రభుత్వం పంపిన వినతిపత్రం ఆధారంగా కేంద్ర బృందం కూడా రాష్ట్రంలో పర్యటించింది. ఊహించిన దానికంటే అధిక నష్టం వాటిల్లినందున నివేదికను సవరించి పంపాలని రాష్ట్రానికి సూచించింది. దీని ప్రకారమే రాష్ట్ర ప్రభుత్వం రూ. 7,513.84 కోట్ల సాయం కోరుతూ సవరించిన నివేదికను పంపింది. ఈ నేపథ్యంలో అడ్వాన్సు కింద వరదసాయం పెంచాల్సిన కేంద్రం మరింత తగ్గించడం గమనార్హం.
బుక్ అడ్జెస్ట్‌మెంట్...
పైలీన్ సాయం కింద రూ.1,000 కోట్లు తక్షణమే విడుదల చేస్తామని ప్రధాని ప్రకటించగా, జాతీయ విపత్తు సహాయ నిధి (ఎన్‌డీఆర్‌ఎఫ్) కింద రూ. 700 కోట్లు మాత్రమే కేంద్రం అడ్వాన్సు కింద విడుదల చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రాష్ట్ర విపత్తు సహాయ నిధి (ఎస్‌డీఆర్‌ఎఫ్) కింద రెండో విడతలో సాధారణంగానే ఈనెలలో విడుదల కావాల్సిన రూ.300 కోట్లను కూడా బుక్ అడ్జెస్ట్‌మెంటు కింద కేంద్రం పేర్కొంది. దీనిపై విపత్తు నిర్వహణ శాఖ అధికారులు పెదవి విరుస్తున్నారు. ‘ప్రధాని రూ. వెయ్యి కోట్ల అడ్వాన్సు ప్రకటిస్తే వాస్తవంగా కేంద్రం ఎన్‌డీఆర్‌ఎఫ్ కింద రూ. 700 కోట్లే విడుదల చేసింది.. మామూలుగానే ఎస్‌డీఆర్‌ఎఫ్ కింద ఈనెలలో విడుదల కావాల్సిన రూ.300 కోట్లను కూడా అడ్వాన్సు కింద పేర్కొని రూ. వెయ్యి కోట్లు విడుదల చేసినట్లు లెక్కచూపారు. మన రాష్ట్రానికి విపత్తు సాయం కింద రావాల్సిన రూ.1,145కోట్ల బకాయిల గురించి కోరగా పరిశీలిస్తామని ప్రధాని చెప్పారు. ఇలా చెప్పడం మినహా బకాయిలు ఇచ్చేది ఉండదు. ఇది రాష్ట్రంపై కేంద్ర ప్రభుత్వ వివక్షకు నిదర్శనం’ అని రాష్ట్రానికి చెందిన ఒక అధికారి ‘సాక్షి’తో అన్నారు.