ఒక్కో రాష్ట్రానికి వెయ్యి కోట్లు: ప్రధాని
తుపాను, వరదలతో నష్టపోయిన ఆంధ్ర, ఒడిశాలకు ప్రధాని తాత్కాలిక సాయం
వరద నష్టంపై మన్మోహన్‌ను కలిసి విన్నవించిన కిరణ్, కేంద్ర, రాష్ట్ర మంత్రులు
సాక్షి, న్యూఢిల్లీ: పై-లీన్ తుపాను, భారీ వర్షాలతో అతలాకుతలమైన ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాలను ఆదుకునేందుకు ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ ఒక్కో రాష్ట్రానికి రూ.1000 కోట్ల చొప్పున తాత్కాలిక సాయం ప్రకటించారు. అంతర్ మంత్రిత్వశాఖల కేంద్ర బృందం ఈ రెండు రాష్ట్రాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించి పరిస్థితిని అంచనా వేసి ఇచ్చే నివేదికలను పరిశీలించాక మొత్తం సహాయం ఎంత అందించాలనేది నిర్ణయిస్తామని ప్రధాని కార్యాలయం శనివారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. ఈ తాత్కాలిక సాయానికితోడు తుపాను మృతుల కుటుంబాలకు ప్రధాన మంత్రి జాతీయ సహాయ నిధి నుంచి రూ.2 లక్షల చొప్పున పరిహారం, తీవ్రంగా గాయపడిన వారికి రూ.50 వేల చొప్పున సాయాన్ని ప్రధాని మంజూరు చేశారు.
ప్రధానితో సీఎం కిరణ్ భేటీ..
తుపాను సాయం ప్రకటనకు ముందు ముఖ్యమంత్రి ఎన్.కిరణ్‌కుమార్‌రెడ్డి నేతృత్వంలో పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు, ఎంపీల బృందం ప్రధానిని ఆయన నివాసంలో కలిసింది. బృందం వెంట రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్ ఉన్నారు. రాష్ట్రంలో ఇటీవలి కాలంలో వరుసగా సంభవించిన ప్రకృతి వైపరీత్యాలతో పెద్ద ఎత్తున ప్రాణనష్టం, పంటనష్టం, ఆస్తినష్టం జరిగిందని సీఎం, బృంద సభ్యులు ప్రధానికి విన్నవించారు. రంగాలవారీగా నష్టం అంచనాలను తెలుపుతూ, రాష్ట్రానికి ఉదారంగా సాయం అందించాలని కోరుతూ వినతిపత్రాన్ని అందజేశారు. పంటరుణాలపై వడ్డీని పూర్తిగా మాఫీచేసే అంశాన్ని పరిశీలించాలని అందులో కోరారు. తమ వినతికి స్పందించి ప్రధాని రూ.1000 కోట్ల మొత్తాన్ని అడ్వాన్స్‌గా రాష్ట్రానికి విడుదల చేశారని సీఎం కిరణ్ చెప్పారు.
ప్రధానితో భేటీ అనంతరం ఆయన పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, కేంద్ర, రాష్ట్ర మంత్రులతో కలిసి ఏపీ భవన్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 2009-10 నుంచి 2012-13 వరకు తుపాన్లు, కరువు వల్ల నష్టపోయిన రాష్ట్రానికి జాతీయ విపత్తు సహాయ నిధి నుంచి రావాల్సిన ఆర్థిక సహాయంలో రూ.1,145.46 కోట్లు కోత పెట్టారని, ఉన్నతస్థాయి కమిటీ మంజూరుచేసిన ఈ మొత్తాన్ని సైతం వెంటనే రాష్ట్రానికి విడుదల చేయాలని ప్రధానిని కోరామన్నారు. దీనికి ప్రధాని స్పందిస్తూ, ఈ విషయంలో అన్నీ సవ్యంగా ఉంటే ఆ మొత్తాన్ని కూడా వెంటనే విడుదల చేయడానికి ఆదేశాలిస్తామని చెప్పారని కిరణ్ పేర్కొన్నారు. కేంద్ర మంత్రులు పల్లంరాజు, చిరంజీవి, పనబాక, ఎంపీలు సాయిప్రతాప్, వెంకట్రామిరెడ్డి, కేవీపీ, రాష్ట్ర మంత్రులు పార్థసారథి, గంటా శ్రీనివాసరావు, శైలజానాథ్ తదితరులు కూడా ముఖ్యమంత్రితోపాటు ప్రధానిని కలిసిన బృందంలో ఉన్నారు.