=మూడు వారాలైనా పూర్తికాని వైనం
=ప్రభుత్వం ఆంక్షలతో పరిహారంపై అనుమానాలు
=నైరాశ్యంలో అన్నదాతలు
ప్రకృతి విపత్తులు, ప్రభుత్వ పోకడలతో రక్షణ కొరవడిన సేద్యం గాలిలో దీపమవుతోంది. అతివృష్టి అన్నదాతల వెన్ను విరిస్తే.. ఆదుకోవాల్సిన ప్రభుత్వం ఆంక్షలు విధిస్తోంది. నష్టం అంచనాలు త్వరితంగా పూర్తిచేయాల్సిన యంత్రాంగం మీనమేషాలు లెక్కిస్తోంది. మొత్తంగా రైతన్నల్లో నైరాశ్యం అలుముకుంటోంది. వరదలు వచ్చి మూడు వారాలవుతున్నా.. పంట నష్టం అంచనాలు పూర్తి కాలేదు. వారం రోజుల్లో పరిహారం అందిస్తామన్న సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి హామీ నీటిమూటలయింది. మంత్రులు, ఎమ్మెల్యేలు దాని ఊసెత్తడం లేదు. కనీసం రైతుల దుస్థితిని పట్టించుకున్న దాఖలాలే లేవు.
విశాఖ రూరల్, న్యూస్‌లైన్ : జిల్లాను వరదలు ముంచెత్తి మూడు వారాలవుతోంది. అవి తగ్గిన రెండో రోజునే రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. బాధితులను ఆదుకుంటామని వారం రోజుల్లోగా నష్టం అంచనాలను పూర్తి చేసి పరిహారం అందిస్తామని ప్రకటించారు. కానీ ఆ ప్రక్రియ పూర్తి కాలేదు. గత నెల 21 నుంచి 27వ తేదీ వరకు కురిసిన భారీ వర్షాలకు జిల్లాలో వేలాది ఎకరాల్లో పంటలు నీట మునిగాయి.
అధికారుల ప్రాథమిక అంచనా ప్రకారం 17,855 హెక్టార్లలో వరి, 6079 హెక్టార్లలో చెరకు, 1212 హెక్టార్లలో పత్తి, 143 హెక్టార్లలో జొన్న, 653 హెక్టార్లలో రాజ్‌మా, 255 హెక్టార్లలో పొగాకు, 70 హెక్టార్లలో వేరుశెనగ, 813 హెక్టార్లలో రాగి, 155 హెక్టార్లలో పెసలు, 50 హెక్టార్లలో కంది పంటలు ఇలా మొత్తంగా 27,285 హెక్టార్లలో పంటలు దెబ్బతిని రూ.54.57 కోట్లు నష్టం వాటిల్లినట్లు అధికారులు అంచనా వేశారు. అలాగే ఉద్యానవన పంటలైన కూరగాయలు 811 హెక్టార్లు, తమలపాకు 135, పువ్వులు 101, అరటి 20, బొప్పాయి 65 హెక్టార్లు నీట మునగడంతో రూ.5.05 కోట్లు నష్టం జరిగింది. వారం రోజుల అనంతరం ప్రభుత్వం నష్టం అంచనాలకు మార్గదర్శకాలను రూపొందించింది.
ఇళ్లు కోల్పోయిన వారి పరిస్థితి దయనీయంగా మారడంతో జిల్లా అధికారులు ముందుగా వాటికి సంబంధించిన లెక్కలు తయారు చేశారు. అనంతరం పంట నష్టం అంచనా పనిలో పడ్డారు. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం ఇందుకు మండల స్థాయిలో కమిటీలను ఏర్పాటు చేశారు.
వాటి పనితీరు పట్ల సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది. మరో వారం రోజులకు కానీ నష్టం అంచనాలు పూర్తికావని స్వయానా అధికారులే పేర్కొంటున్నారు. ఆ తర్వాత ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం బాధిత రైతుల జాబితాను తహశీల్దారు, ఎంపీడీవో, గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో మూడు రోజులు ప్రదర్శించాల్సి ఉంటుంది. అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకొని తుది జాబితాను రూపొందిస్తారు. అనంతరం జిల్లా కలెక్టర్ ఆమోదంతో ప్రభుత్వానికి పంపుతారు. ఇదంతా పూర్తయ్యేసరికి మరో రెండు మూడు వారాలైన సమయం సమయం పడుతుంది.
పరిహారంపై సందేహాలు
వేలాది ఎకరాల్లో పంట నీట మునిగినట్లు స్పష్టంగా కనిపిస్తున్నా.. రైతులకు అందించే పరిహారంపై అనేక అనుమానాలు ముసురుకుంటున్నాయి. 50 శాతం కంటే అధికంగా పంట నష్టపోతేనే పరిగణనలోకి తీసుకోవాలన్న ప్రభుత్వ నిబంధనతో అన్యాయం జరుగుతుందేమోనన్న భయం రైతుల్లో వ్యక్తమవుతోంది. గతేడాది నీలం తుపాను పరిహారం కొందరు రైతులకు ఇప్పటికీ పూర్తిగా అందలేదు. ఈఏడాది మరోసారి తీవ్ర నష్టం వాటిల్లింది. ప్రధానంగా ఉద్యానవన పంట రైతుల పరిస్థితి దారుణంగా మారింది. గతేడాది ఉద్యానవన పంటలకు సంబంధించి రూ.4.12 కోట్లు ప్రతిపాదనలు పంపగా ప్రభుత్వం కేవలం రూ.67 లక్షలు మాత్రమే విడుదల చేసింది.
వేలాది రైతులకు మొండి చేయి చూపించింది. ఈసారి పంటల నష్టం లెక్కింపులో జాప్యం, జాబితాల తయారీ, నిధులు విడుదల, పంపిణీలో ఆలస్యంతో రైతు సంఘాలు ప్రభుత్వంపై మండిపడుతున్నాయి.
సా...గుతున్ననష్టం అంచనా
Published Thu, Nov 14 2013 1:37 AM | Last Updated on Mon, Jul 29 2019 5:28 PM
Advertisement