=భారీవర్షాలకు నీటమునిగిన పంటలు
= రెండు క్రాప్‌హాలిడేలు ఇచ్చినా జరగని పనులు
=ఆధునికీకరణ పూర్తయితే నష్టం తప్పేది
=ఈ నిర్లక్ష్యం ప్రభుత్వానిదే అంటున్న అన్నదాతలు
జిల్లాలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు రూ. 683 కోట్ల నష్టం వాటిల్లింది. డెల్టాలో 39 వేల హెక్టార్లలో వరి పంట ముంపు బారిన పడింది. డెల్టా ఆధునికీకరణ పనులు పూర్తయితే రైతులకు ఇంత పంట నష్టం జరిగేది కాదు. వైఎస్ రాజశేఖరరెడ్డి మరణానంతరం డెల్టా ఆధునికీకరణ పనులపై ప్రభుత్వం శ్రద్ధ చూపడం లేదు. ఆ పనులు పూర్తయితే తమ కష్టాలు తీరతాయన్న భావనతో రైతన్న వరుసగా రెండేళ్లపాటు రబీలో క్రాప్‌హాలిడేకి అంగీకరించినా.. పనులు మాత్రం మూడో వంతు కూడా పూర్తికాలేదు. అసలు సర్కారు నిర్లక్ష్యం వల్లే తమకీ దుర్గతి పట్టిందని ఆరోపిస్తున్నారు.
సాక్షి, విజయవాడ : జిల్లాలో ఆధునికీకరణ పనులు నత్తనడకన జరుగుతుండడంతో రైతులను ముంపు బెడద వెంటాడుతోంది. చాలా ప్యాకేజీల గడువు ఈ ఏడాది డిసెంబర్‌కు ముగుస్తుండగా, కొన్ని ప్యాకేజీలు ఇప్పటికే అదనపు గడువు తీసుకున్నాయి. అయినా ఇప్పటివరకు జరిగిన పనులు చూస్తే మరో పదేళ్లయినా ఆధునికీకరణ పూర్తయ్యే అవకాశం కనపడడం లేదు. రెండుసార్లు క్రాప్‌హాలిడే ప్రకటించినా పనులు అనుకున్న స్థాయిలో జరగలేదు. గత ఏడాది సీఎం కిరణ్ కనీసం సమీక్షలైనా చేశారు.
ఈ ఏడాది ఉన్నతస్థాయి సమీక్షలు జరిగిన పాపాన పోలేదు. అధికార పార్టీ ప్రజాప్రతినిధులు వీటిని పట్టించుకోవడం లేదు. అధికారులు కూడా మొక్కుబడిగానే పనులు పూర్తి చేయించారు. రైతాంగానికి ఉపయోగపడేలా కాల్వలు వెడల్పు చేయడం, డ్రైనేజీలలో డ్రెడ్జింగ్ పనులు చేసి ఉంటే పొలాల్లో నుంచి నీరు త్వరగా వెళ్లిపోయి ఉండేది. కాంట్రాక్టర్లు అసలు కాలువలను వెడల్పు చేయడం, లైనింగ్ పనులు మాని బ్రిడ్జిలు, రెగ్యులేటర్ల నిర్మాణానికే పరిమితం కావటం వల్ల ఇప్పటివరకూ జరిగిన పనులు కూడా రైతులకు ఉపయోగం లేకుండా పోయాయి. కీలక ప్రాంతాల్లో కాల్వల లైనింగ్ పనులు ప్రారంభమే కాలేదు.
ఆధునికీకరణకు వైఎస్ నిర్ణయం..
గతంలో ఓగ్ని తుపాను సమయంలో డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా లేక జిల్లా వ్యాప్తంగా పంటపొలాలు నీట మునిగాయి. డెల్టా ప్రాంతంలో వారం రోజుల పాటు నీరు పొలాల నుంచి బయటకు వెళ్లని పరిస్థితి ఏర్పడింది. జిల్లా పర్యటనకు వచ్చిన అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి పరిస్థితిని లోతుగా సమీక్షించారు. 150 ఏళ్ల క్రితం ఏర్పాటు చేసిన సాగునీటి విధానం తప్ప, ఆ తర్వాత కాలంలో ఎటువంటి ఆధునికీకరణ జరగలేదని గుర్తించారు. దీంతో డెల్టాను పూర్తిస్థాయిలో ఆధునికీకరించాలని నిర్ణయించారు.
కృష్ణా తూర్పు డెల్టాలో పంట కాల్వల ఆధునికీకరణకు 20 ప్యాకేజీలుగా టెండర్లు పిలిచారు. ఇందుకు రూ. 2,180 కోట్లకు పరిపాలనాపరంగా అనుమతి లభించింది. 14 ప్యాకేజీల కింద రూ. 1429.25 కోట్ల పనులకు ఆమోద ముద్ర పడింది. మొబలైజేషన్ అడ్వాన్సుల కింద రూ. 45.64 కోట్లు చెల్లించారు. ఐదేళ్లలో ఇప్పటివరకూ ఖర్చు పెట్టింది రూ. 412.32 కోట్లు మాత్రమే. ఈ సీజన్‌లో రూ. 429 కోట్ల విలువైన డెల్టా ఆధునీకరణ పనులు లక్ష్యంగా ఇరిగేషన్ అధికారులు నిర్ణయించారు. తర్వాత దీన్ని రూ. 327 కోట్లకు కుదించారు. ఈ సీజన్ కూడా పూర్తి అయిన తర్వాత చేసింది సగం కూడా లేదు. కేవలం రూ. 161 కోట్ల పనులు చేయించి మమ అనిపించారు.
రైవస్ కాల్వ కిందే అధిక ఆయకట్టు..
తూర్పు డెల్టాలో కేఈ మెయిన్ కెనాల్ నుంచి తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద ఏలూరు, రైవస్, బందరు కాల్వలుగా విడిపోతుంది. ఒక్క రైవస్ కాల్వ కిందే ఎక్కువ ఆయకట్టు ఉంది. ఈ మూడు కాల్వలను నగరంలో వాటి సామర్ధ్యానికి అనుగుణంగా విస్తరించి లైనింగ్ చేయాల్సి ఉంది. వీటిని ఒకటో ప్యాకేజీలో చేర్చారు. సుమారు రూ. 204 కోట్ల విలువైన ఈ ప్యాకేజీ కింద కృష్ణామెయిన్ కెనాల్, ఏలూరు, బందర్ కాల్వలపై రెగ్యులేటర్ల పనులు మాత్రమే జరుగుతున్నాయి. రైవస్ కాల్వపై రెగ్యులేటర్ ఈ మధ్య కాలంలోనే నిర్మించడంతో గేట్లు మాత్రమే మారుస్తున్నారు. దిగువ ప్రాంతంలో లైనింగ్ పనులు జరుగుతున్నాయి. కాంట్రాక్టర్లు రెగ్యులేటర్లను పూర్తి చేసి చేతులు దులుపుకొనే అవకాశం కనపడుతోంది. అసలు బందరు కాల్వ ఆధునికకీరణకు ఇప్పటి వరకూ టెండర్లు రాలేదు.