కన్నీటి సేద్యం (రౌండప్ 2013)
ఏడాది గడిచిపోయింది. కాలగర్భంలో కలిసిపోతున్న 2013లో అన్నదాతలకు అన్నీ కష్టాలే. కర్షక లోకానికి కలిసిరాని సంవత్సరంగా మిగిలిపోయింది. మొదట్లో ఊరించి, మధ్యలో ఎండగట్టి, చివరిలో ముంచేసి రైతన్నను కకావికలు చేసింది. వరుస తుపాన్లతో రైతులకు కంటిమీద కునుకు లేకుండా పోయింది. ఏడాది పొడవునా ఆటుపోట్లు ఎదుర్కొన్నారు. కష్టాలను దిగమింగి.. కన్నీటితో సేద్యం చేశారు. ఆదుకోవాల్సిన ప్రభుత్వం చేష్టలుడిగి చూడటంతో సాగంటేనే భయపడే దుస్థితి దాపురించింది. ప్రకృతి ప్రకోపంతో రైతాంగానికి తీరని అన్యాయమే జరిగింది. 2013లో అన్నదాతలు ఎదుర్కొన్న కష్టాలను ఒక్కసారి అవలోకనం చేసుకుందామిలా..
-సాక్షి, విశాఖపట్నం
కొంప ముంచిన నిబంధనలు
ప్రభుత్వ నిబంధనలు రైతుల కొంప ముంచాయి. పంట నష్టాల విషయంలో ప్రాథమిక అంచనాకు, తుది అంచనాకు పొంతన లేకుండా పోయింది. 50 శాతం పైబడి నష్టపోతేనే లెక్కలోకి తీసుకోవాలన్న నిబంధనలతో జిల్లావ్యాప్తంగా 14,923 హెక్టార్లలో పంట నష్టం వాటిల్లినట్టు పేర్కొన్నారు. 59,387మంది రైతులకు రూ.13.85 కోట్ల మేరకు ఇన్‌పుట్ సబ్సిడీ చెల్లించాల్సి ఉందని స్పష్టం చేశారు. అంటే రైతుకొచ్చేది కంటి తుడుపు సాయమే.
ఉద్యానవన పంటలదీ అదే పరిస్థితి
ఉద్యాన వన పంటలకు అదే పరిస్థితి ఎదురైంది. అల్పపీడనంతో కురిసిన భారీ వర్షాలకు 1132 హెక్టార్లలో కూరగాయలు, అరటి, బొప్పాయి , పువ్వులు తదితర పంటలు నీట మునిగాయి. దాదాపు రూ.5.05 కోట్లు నష్టం వాటిల్లినట్టు అంచనా వేశారు. కానీ నిబంధనల కారణంగా ఎన్యూమరేషన్ పూర్తయ్యేసరికిరూ.1031 హెక్టార్లలో మాత్రమే పంట దెబ్బతిని, సుమారు రూ.4 కోట్ల నష్టం జరిగిందని లెక్క తేల్చారు.
పరిహారం పరిహాసం
గతేడాది నవంబర్‌లో సంభవించిన నీలం తుపాను కారణంగాా నష్టపోయిన రైతులకు రూ.30.24 కోట్లకు పెట్టుబడి రాయితీ ఇవ్వవలసి ఉండగా రెండు విడతలుగా రూ.23 కోట్లను మాత్రమే ఈ ఏడాది విడుదల చేసింది. ఈ ఏడాది జరిగిన నష్టానికైతే అతీగతి లేదు. కనీసం ఆదుకునే ప్రయత్నం చేయలేదు. వర్షాలు తెరిపిచ్చాక సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, కేంద్ర మంత్రి చిరంజీవి, జిల్లా మంత్రులు పర్యటించి హామీలిచ్చి వెళ్లిపోయారే తప్ప ఇంతవరకు ఒక్కపైసా విడుదల చేసిన దాఖలాల్లేవు.
రబీ ఆలస్యం
కాస్త ఆలస్యమైనా రబీ సాగు ఈ ఏడాది పెరగనుంది. భారీ వర్షాలకు పెరిగిన నీటి వనరులతో జిల్లాలో సాధారణ విస్తీర్ణం కన్నా ఎక్కువ సాగు కానుంది. ఖరీఫ్ నష్టాన్ని రబీలో కొంతైనా భర్తీ చేసుకునే అవకాశం ఉంది. 41,310 హెక్టార్లలో సాగు జరగొచ్చని అంచనా వేశారు. ఇప్పటివరకు 13,623 హెక్టార్లలో సాగు జరిగింది. భారీ వర్షాల కారణంగా నీటిలోనే పంటలు దాదాపు ఉండటంతో కోత ఆలస్యం జరిగింది. దీంతో రబీ సీజన్ నిర్దేశిత సమయానికి ప్రారంభం కాలేదు. జనవరిలో ముమ్మరంగా సాగు జరగనుంది.
ఇసక మేటలు
అక్టోబర్‌లో కురిసిన భారీ వర్షాలతో నదులు, చెరువులు, రిజర్వాయర్లు పొంగి ప్రవహించాయి. వీటితోపాటు ఎగువ ప్రాంతాల నుంచి వచ్చిన వరద నీరుతో నదీ పరివాహక ప్రాంతాల్లోని పొలాల్లో ఇసుక మేటలు ఏర్పడ్డాయి. తాండవ, వరాహ, శారద నదులను ఆనుకుని ఉన్న పొలాల్ని దాదాపు కప్పేసేలా ఇసుక చేరింది. దాదాపు 120 హెక్టార్లకు ఇసుకమేటలు ఏర్పడాయి. ఇప్పుడా ఇసుకను తొలగించాలంటే ప్రభుత్వమే ఆదుకోవాలి. కానీ ఇంతవరకు స్పందించలేదు. కరకట్టలు నిర్మించాలని ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా రూ.110 కోట్లతో ప్రతిపాదనలు పంపించారు.
ఖరీఫ్ ఆరంభం బాగుంది
ఖరీఫ్‌కు ముందే వర్షాలు కురవడంతో రైతన్న సంబరపడ్డాడు. ఖరీఫ్‌లో పంట పండుతుందని భావించాడు. దీంతో జిల్లా సాధారణ విస్తీర్ణం 2 లక్షల 3 వేల 308 హెక్టార్లు కాగా లక్షా 91 వేల 857 హెక్టార్లలో వివిధ పంటలు సాగులోకి వచ్చాయి. ఇందులో వరి ఒక్కటే 96,682 హెక్టార్లలో సాగయ్యింది. సాధారణ విస్తీర్ణం కన్నా 15 హెక్టార్ల ఎక్కువే. కానీ సాగు మొదలు పెట్టాక వర్షాలు ఎండగట్టాయి. దీంతో దాదాపు 30 మండలాల్లో కరువు ఛాయలు అలుముకున్నాయి. అనంతరం అక్టోబర్‌లో కురిసిన భారీ వర్షాలతో అదేమీ కనిపించకుండా పోయింది. వర్షపాతం, వరదలతో నాలుగైదు మండలాలు మినహా దాదాపు ఎక్కడా కరువు లేదని అధికారులు తేల్చేశారు. ప్రభుత్వానికి అదే నివేదిక ఇచ్చారు.
ఏజెన్సీలో రాజ్‌మాకు తీవ్ర నష్టం
భారీ వర్షాలకు ఏజెన్సీలో ప్రధాన పంటైన రాజ్‌మా తీవ్రంగా దెబ్బతింది. 3,312 ఎకరాల్లో రూ.83 లక్షల విలువైన పంట నష్టపోయింది. అసలే ఏజెన్సీ, ఆ పై గిరిజనులు. ఇప్పుడు వార్ని ఆదుకోకపోతే నట్టేట మునగాల్సిందే.
రైతుకు అందని చేయూత
వ్యవసాయ యాంత్రీకరణ, ఆహార భద్రతా మిషన్ కార్యక్రమాలతో రైతులు మరింత దిగుబడులు సాధించొచ్చన్న ఉద్దేశంతో సబ్సిడీపై పలు యూనిట్లు మంజూరు చేసే అవకాశం ఉంది. ఈమేరకు యాంత్రీకరణ కింద 1400 యూనిట్లు అందజేసేందుకు జిల్లాకు .4.41 కోట్లు విడుదల అవ్వగా ఇంతవరకు రూ.7 లక్షలతో కేవలం 25 పనిముట్లను మాత్రమే అందజేశారు. ఆహార భద్రతా మిషన్ కింద ఈ ఏడాది వరి, పప్పు దినుసుల సాగు ప్రోత్సాహం కోసం 50 శాతం సబ్సిడీతో 1248 పనిముట్లు అందజేసేందుకు రూ.1.13 కోట్లు విడుదలవ్వగా ఇంతవరకు రూ.43 లక్షల విలువైన 443 యూనిట్లు మాత్రమే అందజేశారు. రాష్ట్రీయ కృషి వికాస్ యోజన కింద 1097 యూనిట్లు పంపిణీ చేసేందుకు గాను 2.01 కోట్లు విడుదలవ్వగా వీటిలో 6.19 లక్షలు విలువైన 313 యూనిట్లు మాత్రమే రైతులకు అందజేశారు.
ముంచేసిన అల్పపీడనం
పై-లీన్..హెలెన్.. లెహర్.. మాది.. ఇలా తుపాన్ల బెడద తప్పినప్పటికీ.. మధ్యలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ముంచెత్తిన వర్షాలు పంటలకు తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి. దాదాపు వారం రోజులపాటు వర్షాలు పడ్డాయి. ప్రాథమిక అంచనా ప్రకారం 27,285 హెక్టార్లలో రూ.60 కోట్లు నష్టం వాటిల్లింది. 17,855 హెక్టార్లలో వరి, 6079 హెక్టార్లలో చెరకు, 1212 హెక్టార్లలో పత్తి, 143 హెక్టార్లలో జొన్న, 653 హెక్టార్లలో రాజ్‌మా, 255 హెక్టార్లలో పొగాకు, 70 హెక్టార్లలో వేరుశనగ, 813 హెక్టార్లలో రాగి, 155 హెక్టార్లలో పెసలు, 50 హెక్టార్లలో కంది పంటలు దెబ్బతిన్నాయి.
చెరకు రైతు పరిస్థితి దయనీయం
చెరకు రైతుకు సాగు వ్యయం పెరుగుతున్న స్థాయిలో కేంద్రం ఇచ్చే మద్దతు ధర పెరగడం లేదు. దీంతో సహకార చక్కెర కర్మాగారాల దయాదాక్షిణ్యాలపైన చెరకు రైతులు ఆధారపడుతున్నారు. 2012-13లో కేంద్ర ప్రభుత్వం రూ. 1700 మద్దతు ధర ప్రకటించింది. దీనికి రాష్ట్రం మరో రూ. 300 కలిపి రూ. 2వేల వరకు ఇస్తుందని ఆశించా రు. సీజన్ ముగిసినా ఎటువంటి సాయం రాలేదు. దీంతో కర్మాగారాలే తమకొచ్చిన లాభాల నుంచి కొంత మొత్తం ఇచ్చాయి. కానీ ఆ సాయం ఎటూ సరిపోలేదు. రైతులు నష్టాలనే చవిచూశారు. 2013-14లో కేంద్ర ప్రభుత్వం టన్నుకు రూ.2100 మద్దతు ధర ప్రకటించింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన రాలేదు. ఈలోపే భారీ వర్షాలు పడ్డాయి. వేలాది ఎకరాల చెరకు నీట మునగడంతో దిగుబడిపై తీవ్ర ప్రభావం చూపింది. చోడవరంలో జరిగిన రచ్చబండలో రాష్ట్ర ప్రభుత్వం కొంతైనా సాయం చేయాలని సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డిని స్థానిక ఎమ్మెల్యేలు కోరినా పట్టించుకోలేదు.