Annadata
-
రైతులకు చంద్రన్న గిఫ్ట్ ఆశ దోస అప్పడం వడ..
-
డిజిటల్లో దుమ్ము దులిపేస్తోంది
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ‘వైఎస్సార్ రైతు భరోసా ఛానల్’ దుమ్ము దులిపేస్తోంది. మూడేళ్ల క్రితం ఏర్పాటు చేసిన ఈ చానల్ నిరంతరాయంగా వీక్షకుల మన్ననలు పొందుతోంది. రైతాంగానికి కావాల్సిన సలహాలిస్తూ, వ్యవసాయం అనుబంధ రంగాలకు సూచనలు అందించి తోడ్పాటు ఇవ్వడంలో ముందు వరుసలో ఉంది. ఫలితంగా తక్కువ కాలంలోనే రైతులు ఆర్బీకే ఛానల్‌పై అధిక సంతృప్తి కనపరుస్తున్నారు. సొంతగా యూ ట్యూబ్ ఛానెల్ నెలకొల్పి అన్నదాతకు ఆసరాగా నిలబడుతుండడంతో ఏపీ ప్రభుత్వాన్ని పలు రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకొని అక్కడ కూడా ఏర్పాటు చేసేలా అడుగులు వేస్తున్నాయి. అన్నపూర్ణగా వెలుగొందుతున్న ఏపీ వ్యవసాయ రంగంలో కాలానికి తగినట్లుగా విప్లవాత్మక మార్పులు రావడంతో రైతాంగం హర్షం వ్యక్తం చేస్తున్నారు. సాక్షి, అమరావతి: వైఎస్సార్ రైతు భరోసా ఛానల్ అనతి కాలంలోనే అన్నదాతలతో పాటు వ్యవసాయ అనుబంధ రంగాలకు చెందిన వారి మన్ననలు చూరగొంటోంది. ప్రారంభించి మూడేళ్లు కూడా పూర్తి కాకుండానే 2.75లక్షల సబ్ స్క్రిప్షన్, 55 లక్షల వ్యూయర్ షిప్‌తో దూసుకుపోతోంది. దేశంలో మరెక్కడా లేని విధంగా ‘ఆర్బీకే’ పేరిట ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఈ యూ ట్యూబ్ ఛానల్ జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది. కేంద్రంతోపాటు పొరుగు రాష్ట్రాలు, జాతీయ, అంతర్జాతీయ సంస్థలు, ప్రముఖుల ప్రశంసలందుకుంటోంది. ఏపీ స్ఫూర్తితో ఇప్పటికే రాజస్థాన్ ప్రభుత్వం రైతుల కోసం సొంతంగా యూ ట్యూబ్ ఛానల్ ఏర్పాటు చేస్తుండగా.. పలు రాష్ట్రాలు ఆ దిశగా అడుగులు వేస్తున్నాయి. నీతి ఆయోగ్, ఐసీఎఆర్, ఆర్బీఐ వంటి జాతీయ సంస్థలకే కాదు వరల్డ్‌బ్యాంక్, యూఎన్‌కు చెందిన ఎఫ్ఏఒతోపాటు వివిధ దేశాల ప్రముఖులను సైతం ఆకట్టుకుంది. తెలంగాణ, తమిళనాడు, కేరళ, రాజస్థాన్‌తో పాటు వివిధ రాష్ట్రాల మంత్రులు, ఉన్నతాధికారులు ఛానల్‌ను సందర్శించి నిర్వహణ తీరును ప్రశంసించారు. ఎస్ఎంఎస్ ద్వారా రైతులకు సమాచారం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలతో పాటు సాగులో వస్తున్న నూతన విధానాలను ఎప్పటికప్పుడు డిజిటల్ మీడియా ద్వారా రైతులకు చేరువ చేసే లక్ష్యంతో ఆర్బీకే ఛానల్‌ను ఏర్పాటు చేసింది. రైతుల అభ్యుదయ గాథలు, ఆదర్శ రైతుల అనుభవాలను ఆకట్టుకునేలా తీర్చి దిద్ది ప్రసారం చేస్తున్నారు. అలాగే సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పాల్గొనే అధికారిక కార్యక్రమాలను ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నారు. వైఎస్సార్ యంత్ర సేవా కేంద్రాల్లో ఉండే పరికరాలు, ఉపయోగాలు రైతులందరికీ తెలిసేలా రైతు గ్రూపులతో ఛానల్ ద్వారా ఇంటరాక్షన్ కార్యక్రమాలు నిర్వహిసున్నారు. ఏ రోజు ఏ శాఖకు చెందిన కార్యక్రమాలు ప్రసారం అవుతున్నాయో? ఆర్బీకేల ద్వారా ప్రసారం చేసున్నారు. ఛానల్ ద్వారా ప్రసారమయ్యే కార్యక్రమాలను యూ ట్యూబ్‌లో అప్లోడ్ అవుతుండడంతో ఎప్పుడు కావాలంటే అప్పుడు మొబైల్ ద్వారా రైతులు వీక్షిస్తున్నారు. 1,628 వీడియోలు.. 500కు పైగా ప్రత్యక్ష ప్రసారాలు ఆర్బీకే ఛానల్ కోసం ప్రత్యేకంగా గన్నవరం ఇంటిగ్రేటెడ్ కాల్ సెంటర్లో మూడేళ్ల క్రితం డిజిటల్ స్టూడియోను ఏర్పాటు చేసింది. డిజిటల్ రంగంలో విశేష అనుభవం కలిగిన సిబ్బందిని ప్రత్యేకంగా నియమించారు. క్షేత్ర స్థాయిలో ఆదర్శ, అభ్యుదయ రైతులు సాధిస్తోన్న విజయాలపై ఇంటరŠూయ్వలు, డాక్యుమెంటరీలు రూప కల్పన కోసం ప్రత్యేకంగా అవుట్ డోర్ యూనిట్‌ను కూడా ఏర్పాటు చేసారు. శాఖల వారీగా అప్లోడ్ చేస్తున్న వీడియోలు, ప్రత్యక్ష ప్రసారాలకు అనూహ్య స్పందన లభిస్తోంది. ఇప్పటి వరకు 599 వ్యవసాయ, 589 ఉద్యాన, 257 పశు సంవర్ధక, 97 మత్స్య, 13 పట్టు శాఖలకు చెందిన వీడియోలతో పాటు వివిధ సంక్షేమ పథకాలకు సంబంధించి 73 వీడియోలు కలిపి ఇప్పటి వరకు 1,628 వీడియోలను అప్లోడ్ చేశారు. 500కు పైగా ప్రత్యక్ష ప్రసారాలను చేసారు. ఛానల్‌ను 2.75లక్షల మంది సబ్ స్క్రిప్షన్ చేసుకోగా, జనవరి 4వ తేదీ నాటికి అప్లోడ్ చేసిన వీడియోలు, ప్రసారాలను 54,67,079 మంది వీక్షించారు. ప్రభుత్వ పరంగా ఏర్పాటు చేసిన ఓ యూట్యూబ్ ఛానల్‌కు ఈ స్థాయి వ్యూయర్ షిప్ లభించడం గొప్ప విషయమని చెబుతున్నారు. ఆర్బీకే ఛానల్ ద్వారా ఎంతో మేలు ‘ఆర్బీకే చానల్’ చాలా బాగుంది. ఈ ఛానల్ ద్వారా ప్రసారం చేసే వీడియోలను రెగ్యులర్‌గా వీక్షిస్తుంటాను. సీజన్లో విత్తనాలు, ఎరువులు ఏ మేరకు నిల్వ ఉన్నాయి. ఎలా బుక్ చేసుకోవాలి. సాగులో సందేహాలనే కాకుండా.. విత్తు నుంచి విక్రయం వరకు రైతులు ఎదుర్కొనే సమస్యలకు చక్కని పరిష్కారాలు చూపిస్తున్నారు. ఈ తరహా ప్రయోగం ప్రభుత్వ పరంగా చేపట్టడం నిజంగా ప్రశంసనీయం. –నందం రఘువీర్, మొక్కల జన్యు రక్షక్షుకుని అవార్డు గ్రహీత, పెనమూలురు, కృష్ణ జిల్లా రైతులు స్వచ్చందంగా సబ్ స్ర్కైబ్ రైతు ప్రాయోజిత కార్యక్రమాలను ప్రసారం చేసే ఈ ఛానల్‌కు వ్యూయర్షిప్ అరకోటి దాటడం నిజంగా గొప్ప విషయం. సాగులో సందేహాలను నివృత్తి చేయడమే కాకుండా ఎప్పటికప్పుడు వ్యవసాయ అనుబంధ రంగాల్లో వస్తోన్న మార్పులు, నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఛానల్ ద్వారా రైతులకు చేరువ చేస్తున్నాం. రైతులు స్వచ్చందంగా సబ్ స్ర్కైబ్ చేసుకుంటున్నారు. –చేవూరు హరికిరణ్, స్పెషల్ కమిషనర్, వ్యవసాయ శాఖ -
టెక్సాస్‌లో ‘అన్నదాత’ సేవా కార్యక్రమాలు
టెక్సాస్: అన్నదాత చారిటీస్ సంస్థ నెల వారీ నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలలో ప్రముఖ ప్రవాస భారతీయ నాయకుడు, ఇండియన్ అమెరికన్ ఫ్రెండ్షిప్ కౌన్సిల్ అధ్యక్షుడు డా. ప్రసాద్ తోటకూర ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. శనివారం (జూన్ 15) ఆయన మాట్లాడుతూ.. 'ప్రముఖ సంఘ సేవకుడు భాస్కర్ రెడ్డి నేతృత్వంలో ‘అన్నదాత’ ను 2011లో స్థాపించారని అన్నారు. అటు భారత్ లోను ఇటు అమెరికాలోను అన్నార్తులకు ఆపన్న హస్తం అందించే ఒక పెద్ద సంస్థగా ఎదగడం సంతోషదాయకమన్నారు. డాలస్, ఫోర్టువర్త్ నగరాలలో నేపాల్, భూటాన్, బర్మా లాంటి దేశాల నుంచి వచ్చిన దాదాపు 200 మంది శరణార్థులకు ప్రతి నెలా మూడో శనివారం నిత్యావసర వస్తువులను అందజేయటం అభినందనీయమన్నారు. సాటి మనిషికి సాయం చేయాలనే మానవతావాద దృక్పధం ఉన్నతమైనదని ప్రసాద్ తోటకూర ప్రశంసించారు. ప్రముఖ స్వచ్ఛంద సేవకురాలు పూర్ణా నెహ్రు మాట్లాడుతూ కేవలం నిత్యావసర వస్తువులే గాక దుస్తులు, కుట్టు మెషిన్లు, కంప్యూటర్లు ఉచితంగా పంపిణీ చేస్తూ అర్హులైన వారికి తగు తర్ఫీదు ఇస్తూ ఉపాధి అవకాశాలను కల్పిస్తామన్నారు. అన్నదాత చారిటీస్ వ్యవస్థాపకుడు భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ.. మూడు వందల డాలర్ల ఖర్చుతో స్థాపించబడిన సంస్థ ఇప్పుడు నెలకు 5,000 డాలర్ల వ్యయంతో 200 మందికి పైగా సహాయపడే విధంగా ఎదగడం ఆనందదాయకమన్నారు. ఈ కార్యక్రమానికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్న కార్యసిద్ధి హనుమాన్ టెంపుల్ (ఫ్రిస్కో నగరం), షిరిడీ సాయిబాబా టెంపుల్ (ప్లానో నగరం), షిరిడీ సాయిబాబా మందిర్ (ఇర్వింగ్ నగరం) యాజమాన్యాలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమ నిర్వహణలో తోడ్పడుతున్న స్వచ్చంద సేవకులు రాజా రెడ్డి, పూర్ణా నెహ్రు, ప్రసాద్ గుజ్జు, రజని, సురేష్, అర్జున్, పులిగండ్ల విశ్వనాధం, మురళి తుమ్మల, శంకరన్, వివేక్ దత్త, శివాజీ, మీనా శర్మ లకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. -
వానమ్మా .. వేల వందనాలమ్మా..
* వానలతో అన్నదాతల్లో ఆనందం.. * పంటపొలాల్లో సందడి.. జగదేవ్‌పూర్: చినుకు చిందేయడంతో అన్నదాతల్లో అనందం అంబరాన్నంటుతోంది. పంటపొలాల్లో సందడి ప్రారంభమైంది. వ్యవసాయ పనుల్లో ఇంటల్లిపాది తలమునకలయ్యారు..వానమ్మ వానమ్మా..నీకు వేల వేల వందనాలమ్మా అంటూ పల్లె జనం పదం కలుపుతూ వడివడిగా నాట్లు వేస్తున్నారు.. చినుకు చిందేసింది. నెలతల్లి పూర్తిగా తడిపేసింది. అన్నదాతను అనందంలో ముంచేసింది. పుడమి వాకిట కొత్త బంగారులోకాన్ని సృష్టిస్తూ ఏరువాకకు సాగమని అప్పగించింది. నాలుగు రోజులుగా పడుతున్న ఖరీఫ్ వర్షాలతో రైతన్న ఉత్సాహంతో ఖరీఫ్ పనుల్లో నిమగ్నమయ్యారు. దుక్కి దున్నడం నాట్లు వేయడం, గట్లు సిద్దం చేసుకొవడం ఇలా ఎవుసం పనులతో ఉత్సాహపూరితంగా సాగుతున్నారు. ముసురు పడుతునే పంట చేలలో కూలీలు మునుము కొనసాగిస్తున్నారు. ఓ వైపు కలుపు, మరో వైపు నాట్లు పనుల్లో బిజీగా ఉన్నారు. అలాగే చిన్నారులు సైతం కన్నవాళ్లకు అసరాగా ఎవుసం పనుల్లో మేం సైతం అంటూ పాల్గొంటున్నారు. -
ఆగని ఆత్మహత్యలు
- మైసూరులో మరో రైతన్న బలవన్మరణం - పంట పొలాల్లోనే నేలకొరుగుతున్న అన్నదాతలు సాక్షి, బెంగళూరు: నేల తల్లినే నమ్ముకున్న అన్నదాతలు చివరకు ఆ తల్లి ఒడిలోనే కుప్పకూలిపోతున్నారు. ప్రాణానికి ప్రాణంగా కాపాడుకుంటూ వచ్చిన పంటపొలాల్లోనే బలవన్మరణానికి పాల్పడుతున్నారు. అప్పుల బాధలను తాళలేక పంటకు అంటించిన నిప్పుల్లోనే మండ్యకు చెందిన రైతు నింగేగౌడ గురువారం సజీవదహనం కాగా, మైసూరుకు చెందిన మరో రైతు శివలింగేగౌడ సైతం అప్పుల బాధ తట్టుకోలేక శుక్రవారం మధ్యాహ్న సమయంలో తన పంటపొలంలోనే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. మైసూరు జిల్లా నంజనగూడులోని సిద్దగుండినహుండి గ్రామానికి చెందిన రైతు శివలింగేగౌడ చెరకు, వరి పంటలను పండిస్తున్నారు. వ్యవసాయం కోసం దాదాపు రూ.5 లక్షల వరకు అప్పులు చేశారు. చెరకు పంటకు చెల్లించాల్సిన బకాయిలు చక్కెర ఫ్యాక్టరీల యాజమాన్యాలు చెల్లించకపోవడంతోపాటు, ప్రస్తుతం పండిం చిన చెరకును సరైన ధరకు అమ్ముకునే పరిస్థితులు కనిపించకపోవడంతో దిక్కుతోచని పరిస్థితుల్లో శివలింగేగౌడ ఆత్మహత్యకు పాల్పడ్డారు. శుక్రవారం మధ్యాహ్నం తన పంట పొలానికి చేరుకున్న శివలింగేగౌడ పంట కోసం వినియోగించే పురుగులమందును తా గి ప్రాణాలు వి డిచారు. పొలానికి వెళ్లిన శివలింగేగౌడ ఎంతకూ రాకపోవడంతో కంగారు పడ్డ అతని కుటుంబసభ్యులు పొలానికి వెళ్లి చూడగా అక్కడ అచేతన స్థితిలో పడి ఉన్న శివలింగేగౌడను గుర్తించి పోలీసులకు సమాచారాన్ని అందజేశారు. నెలకు ఇద్దరు అన్నదాతలు ఇక కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రెండేళ్లలో మొత్తం 58 మంది అన్నదాతలు అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్నారు. అంటే సగటున నెలకు ఇద్దరు అన్నదాతలు బలవన్మరణానికి పాల్పడినట్లు లెక్క. ఈ గణాంకాలు ఇటీవల జరిగిన విలేకరుల సమావేశంలో స్వయంగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కృష్ణబేరేగౌడ వెల్లడించినవే. ఇక రెండేళ్లలో 58 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని అధికారిక గణాంకాలు చెబుతున్నా క్షేత్ర స్థాయిలో ఈ సంఖ్య మరింత ఎక్కువగా ఉంటుందని రైతు సంఘాల నేతలు చెబుతున్నారు. గత నెల రోజుల్లోనే మొత్తం 19 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని రాష్ట్ర రైతు సంఘం అధ్యక్షుడు కోడిహళ్లి చంద్రశేఖర్ చెబుతున్నారు. రైతుల సంక్షేమం పట్ల రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం బాధ్యత లేకుండా ప్రవర్తిస్తోందని అందువల్లే రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నింగేగౌడ కుటుంబానికి నేతల ఓదార్పు అప్పుల బాధతో చెరుకు పంటకు నిప్పుపెట్టి అదే పంటలోకి దూకిన రైతు నింగేగౌడ నివాసానికి అనేక మంది నేతలు తరలివచ్చారు. మాజీ ప్రధాని హెచ్.డి.దేవేగౌడతో పాటు మాజీ ముఖ్యమంత్రి బి.ఎస్.యడ్యూరప్ప తదితరులు శుక్రవారం ఉదయం నింగే గౌడ నివాసానికి చేరుకొని నింగేగౌడ కుటుంబసభ్యులను ఓదర్చారు. ఈ సందర్భంగా మాజీ ప్రధాని హెచ్.డి.దేవేగౌడ మాట్లాడుతూ, ‘చెరకు రైతుల సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వంతో పోరాడతాం. ఇక ముందు ఇలాంటి ఘటనలు చోటుచేసుకోకుండా చూడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది. అంతేకాక రైతులు కూడా తమ కుటుంబ సభ్యుల పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని ఇలాంటి చర్యలకు పాల్పడకుండా ఉండాలని కోరుతున్నాను’ అని అన్నారు. ఇదే సందర్భంలో నింగేగౌడ కుటుంబానికి రూ.1లక్ష సహాయాన్ని దేవేగౌడ ప్రకటించారు. అనంతరం మాజీ ముఖ్యమంత్రి బి.ఎస్.యడ్యూరప్ప మాట్లాడుతూ, నింగేగౌడ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం తక్షణం రూ.5లక్షల నష్ట పరిహారాన్ని చెల్లించాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీ సమావేశాల్లో రైతు సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీయనున్నట్లు చెప్పారు. -
ఆపదలో అన్నదాత
పంట దిగుబడి పడిపోవడంతో రైతుల ఆక్రందన 83శాతానికి తగ్గిన సాగు విస్తీర్ణం తీవ్ర వర్షాభావమే కారణం వ్యవసాయశాఖ నివేదికలో వెల్లడి చుక్కల్ని తాకుతున్న బియ్యం, పప్పు ధాన్యాల ధరలు సాక్షి, హైదరాబాద్: ఊరించి ఉస్సూరనిపించిన రుతుపవనాలు.. సరిగా కురవని వానలు.. ఎండిపోయిన బావులు.. వట్టిపోయిన బోర్లు.. అన్నీ కలసి అన్నదాతను నట్టేట ముంచేశాయి. దిగుబడి గణనీయంగా తగ్గిపోవడంతో ఖరీఫ్ పంటలు రైతన్నను రోడ్డున పడేశాయి. నానాతిప్పలూ పడి, అప్పులూ తెచ్చి పెట్టిన పెట్టుబడులు గాలిలో కలిసిపోయాయి. ఎటూ తోచక కూలీలుగా మారిపోయే దుస్థితిని తెచ్చిపెట్టాయి.. రైతు కష్టం ఇటు సామాన్యుడికీ తిప్పలు తెచ్చిపెట్టింది. పంటల దిగుబడి తగ్గిపోవడంతో ఆహార ధాన్యాల ధరలు చుక్కలను తాకుతున్నాయి. రాష్ట్రంలోని తొమ్మిది జిల్లాల్లోనూ వర్షాభావ పరిస్థితులు ఏర్పడడంతో పంటలు బాగా దెబ్బతిన్నాయి. దీనికితోడు సాగు విస్తీర్ణం కూడా తగ్గడంతో 2014-15 ఖరీఫ్ ఆహార ధాన్యాల దిగుబడి భారీగా తగ్గిపోయింది. ప్రభుత్వ నిర్దేశిత లక్ష్యంతో పోల్చినా.. గత రెండేళ్లతో పోల్చినా ఈ సారి దిగుబడి, ఉత్పాదకత గణనీయంగా పడిపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఖరీఫ్ పంటల దిగుబడులు దాదాపుగా రైతుల చేతుల్లోకి వచ్చాయి. ఖరీఫ్ ఆలస్యం కారణంగా అక్కడక్కడా కొంతమేర పంట పూర్తి కావాల్సి ఉన్నా దాదాపు 95 శాతం వరకు పూర్తయినట్లు వ్యవసాయశాఖ అంచనా వేసింది. ఈ మేరకు దిగుబడులపై ఆ శాఖ తయారు చేసిన నివేదిక ‘సాక్షి’కి అందింది. ఆ వివరాల ప్రకారం గతంలో వేసుకున్న అంచనాలు తలకిందులయ్యాయి. ఇది ఆహార భద్రతకు ముప్పు కలిగిస్తుందని వ్యవసాయ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 31 శాతం తగ్గిన ఉత్పత్తి.. ఖరీఫ్‌లో ఆహారధాన్యాల మొత్తం ఉత్పత్తి లక్ష్యం 78.98 లక్షల టన్నులుగా వ్యవసాయశాఖ నిర్దేశించుకుంది. కానీ దిగుబడి మాత్రం 53.86 లక్షల టన్నుల వరకు మాత్రమే వచ్చింది. అంటే ఏకంగా 25.11 లక్షల టన్నుల (31.81%) ఉత్పత్తి తగ్గిపోయింది. ఇందులో వరి దిగుబడి లక్ష్యం 50.81 లక్షల టన్నులుకాగా... దిగుబడి 35.27 లక్షల టన్నులకే పరిమితమైంది. ఈ లెక్కన 15.54 లక్షల టన్నులు (30.59%) తగ్గింది. ఇక పప్పుధాన్యాల పరిస్థితీ అంతే. శనగ ఉత్పత్తి లక్ష్యం 47 వేల టన్నులుకాగా.. దిగుబడి 14 వేల టన్నులకే పరిమితమైంది. సోయాబీన్ 4.7 లక్షల టన్నుల లక్ష్యానికి 4.12 లక్షల టన్నులు దిగుబడి అయింది. పంటలు వేసిన విస్తీర్ణం తగ్గిపోవడంతో పాటు ఉత్పాదకత తగ్గడం మూలంగానే దిగుబడి బాగా తగ్గిపోయింది. వర్షాలు సరిగా కురవకపోవడం, పంటలు ఎండిపోవడంతో ఉత్పాదకత తగ్గిందని వ్యవసాయ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 2012-13 ఖరీఫ్‌లో బియ్యం ఉత్పాదకత హెక్టారుకు 3,263 కేజీలు అయితే, 2013-14 ఖరీఫ్‌లో 3,227 కేజీలకు, ఈ ఖరీఫ్‌లో 3,072 కేజీలకు తగ్గిపోయింది. మిగతా పంటల ఉత్పాదకత పరిస్థితి కూడా అలాగే ఉంది. గతేడాదితో పోలిస్తే పత్తి దిగుబడి ఐదున్నర లక్షల టన్నులు తగ్గిపోవడం ఆందోళనకరమైన విషయం. సాగు తగ్గడం, వర్షాభావమే కారణం: ఖరీఫ్‌లో రుతుపవనాలు సకాలంలో రాకపోవడం, వర్షాలు సరిగా కురవకపోవడం, పంటల సాగు తగ్గిపోవడం వల్లే ఆహారధాన్యాల ఉత్పత్తి భారీగా తగ్గిపోవడానికి ప్రధాన కారణమని వ్యవసాయాధికారులు పేర్కొంటున్నారు. మహబూబ్‌నగర్ మినహా ఏ జిల్లాలోనూ ఖరీఫ్‌లో సాధారణ వర్షపాతం నమోదుకాలేదు. ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి జూన్ ఒకటో తేదీ నుంచి సెప్టెంబర్ 30 వరకు రాష్ట్రంలో 715 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదుకావాలి. కానీ ఈ సారి 498.1 మిల్లీమీటర్లు మాత్రమే నమోదైంది. అంటే 30 శాతం లోటు వర్షపాతం నమోదైంది. రాష్ట్రంలోని మొత్తం 464 మండలాలకుగాను 339 మండలాల్లో లోటు వర్షపాతమే ఉంది. కేవలం 80 మండలాల్లో మాత్రమే సాధారణ వర్షపాతం నమోదైంది. వర్షాలు సరిగా కురవని కారణంగా.. రాష్ట్రంలో భూగర్భ జలాలు అడుగంటాయి. ఇది కూడా సాగు విస్తీర్ణం పడిపోవడానికి కారణమయింది. ఖరీఫ్‌లో 20.60 లక్షల హెక్టార్లలో ఆహారధాన్యాల సాగు జరగాల్సి ఉండగా... 17.18 లక్షల హెక్టార్లకు (83%) పడిపోయింది. అందులో వరి 10.04 లక్షల హెకార్లలో సాగుకావాల్సి ఉండగా... 8.17 లక్షల హెక్టార్లకు (81%) తగ్గిపోయింది. పప్పుధాన్యాల సాగు 4.92 లక్షల హెకార్లకుగాను 3.45 లక్షల హెక్టార్లకు (70%) పడిపోయింది. కూలీలుగా మారుతున్న రైతులు.. ఖరీఫ్ సాగు విస్తీర్ణం తగ్గడం, ఆహారధాన్యాల దిగుబడులు భారీగా పడిపోవడం, గిట్టుబాటు ధర లభించకపోవడం, రబీలోనూ కరువు ఛాయలు కనిపిస్తుండడంతో... రాష్ట్రంలో అన్నదాతలు నిండా ఆందోళనలో మునిగిపోయారు. దిగుబడి తగ్గిపోవడంతో పంటల కోసం పెట్టిన పెట్టుబడులు కూడా అందలేదు. ఫలితంగా రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోయారు. ఎటూతోచని పరిస్థితుల్లో కూలీలుగా మారుతున్నారు. రాష్ట్రంలో అనేక చోట్ల రైతులు ‘ఉపాధి’ హామీ పనులకు వెళుతున్నారు. మరోవైపు తెలంగాణవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ వలసలు పెరుగుతున్నాయి. ఏదో పనిచేసుకొని పొట్టపోసుకునేందుకు రైతులు పట్టణాలకు వస్తున్నారు. భవన నిర్మాణ కూలీలుగా, వాచ్మన్లుగా చేరుతున్నారు. కొందరు ఆటో రిక్షాలనూ నడుపుతున్నారు. చుక్కల్ని తాకుతున్న ధరలు.. వరి, పప్పుధాన్యాల దిగుబడి గణనీయంగా తగ్గిపోవడంతో వాటి ధరలు చుక్కలను తాకుతున్నాయి. గత నెలతో పోలిస్తే సూపర్‌ఫైన్ బియ్యం ధర కిలోకు రూ.5 నుంచి రూ. 10 వరకు పెరిగింది. సాధారణంగా రూ. 35 బియ్యం ధరలు రూ. 40కి.. రూ. 40 నుంచి రూ. 45 వరకు ఉన్న బియ్యం ధరలు రూ. 50 వరకు పెరిగాయని వ్యాపారులు చెబుతున్నారు. ఇక పప్పుల ధరలు కిలోకు రూ. పది నుంచి పదిహేను వరకు పెరిగాయి. రాబోయే రోజుల్లో మరిం తగా పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు చెబుతుండడం ఆందోళన కలిగిస్తోంది. -
కరువు ప్రకటన కానరాదేమీ!
ఆ ఊసేఎత్తని సర్కార్ జెడ్పీ తీర్మానాలూ బుట్టదాఖలు ఆందోళనలో అన్నదాతలు సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : ఖరీఫ్ కాలం పూర్తయి, రబీ పంటల సాగు షురువైనా సర్కారు మాత్రం కరువు జిల్లా ప్రకటన ఊసెత్తడం లేదు. రూ.వేలల్లో పెట్టుబడులు పెట్టి పంటలు సాగు చేసిన అన్నదాతలు సరైన దిగుబడులు రాక అప్పుల ఊబిలో కూరుకుపోయారు. కొందరు రైతులు ఏకంగా బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. ప్రభుత్వం నుం చి మాత్రం ఎటువంటి ప్రకటన రావడం లేదు. అధికార యంత్రాంగం నివేదికలకే కాదు, జిల్లాలో ప్రజాప్రతినిధులంతా కొలువుదీరే జిల్లా పరిషత్‌లో చేసిన తీర్మానాలకూ మోక్షం లభించడం లేదు. సాధారణంగా నవంబర్ నెలాఖరులోపే కరువుపై ప్రభుత్వం ప్రకటన చేయాల్సి ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు. డిసెంబర్ ముగిసి.. జనవరి ప్రారంభమైనా ఆ ఊసే లేదు. దీంతో రబీ పంటలు సాగు చేస్తున్న అన్నదాతల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. ప్రభుత్వం కరువు జిల్లాగా ప్రకటిస్తే ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన అన్నదాతలకు కొంతలో కొంతైనా ఉపశమనం ఉండేది. పడిపోయిన దిగుబడులు.. జిల్లాలో ప్రధాన పంటల్లో ఒకటైన సోయా దిగుబడి దారుణంగా పడిపోయింది. ఎకరానికి పది నుంచి 11 క్వింటాళ్ల దిగుబడి రావాల్సి ఉండగా, కేవలం ఒకటిన్నర, నుంచి రెండు క్వింటాళ్లకు మించ లేదు. దీంతో విత్తనాలు, ఎరువుల ఖర్చు కూడా చేతికందలేదు. ఖరీఫ్‌లో జిల్లా వ్యాప్తంగా 1.11 లక్షల హెక్టార్లలో సోయాను సాగు చేసిన రైతులు నిండా మునిగారు. సోయా గింజలు సట్టల్లా ఉన్నాయి. తీవ్రంగా నష్టపోయిన సోయా రైతులను ఆదుకోవాలని అధికార పార్టీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప కలెక్టర్‌ను కలిసి గతంలో వినతిపత్రం అందజేశారు. కానీ.. ఇప్పటివరకు సోయా రైతులను ఆదుకున్న దాఖలాలు కనిపించడం లేదు. పత్తి రైతులదీ ఇదే పరిస్థితి. కాస్తో కూస్తో దిగుబడి వచ్చినా, మద్దతు ధర దక్కకపోవడంతో రైతులు నిండా మునుగుతున్నారు. ఈ ధరకు విక్రయిస్తే పెట్టిన పెట్టుబడులు కూడా రావని ఆత్మహత్యలే శరణ్యమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 33 శాతం తక్కువ వర్షపాతం నమోదు.. ఈసారి వర్షపాతం సాధారణం కంటే తక్కువ నమోదైంది. 998 మిల్లీ మీటర్ల సాధారణ వర్షపాతం కాగా కేవలం 737 మి.మీలు మాత్రమే నమోదైంది. సాధారణం కంటే 33 శాతం తక్కువ కురిసిందని అధికారులు ప్రభుత్వానికి పంపిన నివేదికల్లో పేర్కొన్నారు. అలాగే జూన్, జూలై మాసాల్లో ఏకంగా డ్రైస్పెల్‌లు నమోదయ్యాయి. బజార్హత్నూర్, నార్నూర్, బెజ్జూరు, నెన్నెల తదితర మండలాల్లో అతితక్కువ వర్షపాతం నమోదైంది. దీనికితోడు విద్యుత్ కోతలతో కళ్లముందే పంటలు ఎండిపోయాయి. దీంతో రైతులు తీవ్ర ఆవేదనకు గురయ్యారు. ఈ పరిస్థితులను అధికారులు ప్రభుత్వానికి నివేదించినా ఫలితం లేకుండా పోయింది. రబీపై ప్రభావం.. ఖరీఫ్ కరువు ప్రభావం రబీ పంటలపై తీవ్రంగా పడుతోంది. ఖరీఫ్‌లో తీవ్ర కరువు పరిస్థితులను ఎదుర్కొన్న అన్నదాతలు రబీ సాగుకు కాడి కిందపడేశారు. 90 వేల హెక్టార్లలో సాగు కావాల్సిన రబీ పంటలు ప్రస్తుతం 25 వేల హెక్టార్లకు మించలేదంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఖరీఫ్‌లో 5.97 లక్షల హెక్టార్లకు గాను కేవలం 5.40 లక్షల హెక్టార్లలో మాత్రమే వివిధ పంటలు సాగుచేశారు. ఈ పంటలు సరిగ్గా చేతికందక పోవడంతో రబీ పంటల సాగుకు రైతన్నలు ఆలోచించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. అన్నదాత బలవన్మరణాలు.. జిల్లాలో 2014లో సుమారు 78 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. అధికార యంత్రాంగం మాత్రం 51 మంది రైతుల ఘటనలను విచారించి కేవలం 18 మంది మాత్రమే రైతు ఆత్మహత్యలుగా గుర్తించింది. ఇందులో ఆత్మహత్యలు చేసుకున్న కేవలం 11 మంది రైతు కుటుంబాలకు మాత్రమే పరిహారం చెల్లించారు. పంటల సాగు వ్యయం పెరిగి, దిగుబడులు పడిపోవడం, కళ్లముందే పంటలు ఎండిపోవడంతో తట్టుకోలేకపోతున్న అన్నదాతలు తనువు చాలిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించి రబీలోనైనా అన్నదాతలకు భరోసా ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
కరువు సాయం కోసం నిరీక్షణ
సాక్షి,చిత్తూరు: జిల్లాలో అన్నదాతలకు కరువు సాయం ఇప్పట్లో అందేలా కనిపించడంలేదు. పేరుకు మాత్రం జిల్లాలో 42 మండలాలను కరువు కింద ప్రకటించినా ఇప్పటికీ అధికారులు పంట నష్టం అంచనాలను ప్రభుత్వానికి నివేదించలేదు.ఎప్పటిలోగా అంచనాలు తయారు చేసి ప్రభుత్వానికి నివేదిస్తారో తెలియడంలేదు. దీంతో జిల్లా రైతులకు సకాలంలో కరువు సాయం అందుతుందన్న భరోసా లేకుండా పోయింది. జిల్లాలో 42 మండలాలను కరువు మండలాలుగా ప్రభుత్వం గత నెలలో ప్రకటించింది. కరువు మండలాల ఎంపికలోనూ పారదర్శకత లోపించింది. తీవ్ర వర్షాభావ పరిస్థితి నెలకొన్నా కొన్ని మండలాలకు కరువు జాబితాలో చోటు దక్కలేదు. అధికారులు తొలుత 38 మండలాలను, ఆ తరువాత 20 మండలాలను ప్రతిపాదించినా చివరకు 42 మండలాలను మాత్రమే ప్రభుత్వం కరువు కింద ఎంపిక చేయడంపై విమర్శలు వెల్లువెత్తాయి. కరువు మండలాల ఎంపిక వివాదం సంగతి పక్కన పెడితే తీవ్ర వర్షాభావంతో జిల్లాలో ఖరీఫ్‌లో సాగైన పంటలు, పండ్లతోటలు దెబ్బతిన్నాయి. ప్రధానంగా లక్షా 6 వేల హెక్టార్లలో సాగైన వేరుశెనగ పంట పూర్తిగా దెబ్బతింది. అన్నదాతలు *500 కోట్లమేర నష్టపోయినట్లు అంచనా. జిల్లా వ్యాప్తంగా పంటలు దెబ్బతిన్నా అధికారులు మాత్రం 42 మండలాల్లో మాత్రమే వేరుశెనగ నష్టం అంటూ నివేదికలిచ్చారు. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోనున్నారు. కరువు కింద ఎంపికైతేనే హెక్టారుకు *10 వేల ఇన్పుట్ సబ్సీడీ వస్తుంది. ఈ లెక్కన మిగిలిన 24 మండలాల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ అందే అవకాశం లేకుండా పోయింది. పోనీ 42 మండలాల రైతులకైనా త్వరగా కరువు సాయం అందిస్తారనుకుంటే ఇప్పటికీ అతీగతీ లేదు. కరువుకింద ఎంపికైన మండలాల పరిధిలో 76 వేల 452 హెక్టార్లలో వేరుశెనగ పంట సాగైనట్లు అధికార గణాంకాలు చెబుతున్నాయి. 50 శాతం పంట దెబ్బతింటేనే ఇన్పుట్ సబ్సిడీ వస్తుందని ఈ లెక్కన జిల్లాలో వేరుశెనగ పంటకు మాత్రమే ఇన్పుట్ సబ్సిడీ వచ్చే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. పోనీ ఆ వచ్చే మొత్తమైనా రైతులకు ఇప్పట్లో అందించే పరిస్థితి కానరావడంలేదు. కరువు కింద ఎంపికైతే ఇన్పుట్ సబ్సిడీతోపాటు తాగునీటి సరఫరా, పశుగ్రాసం, ఉపాధి పనులు, ఇరిగేషన్ పనులకు ప్రాధాన్యం ఇస్తారు. కరువు మండలాలకు అధికంగా నిధులు కేటాయించాల్సి ఉంది. కానీ కరువు మండలాల పరిస్థితిపై జిల్లా అధికారులు ఇప్పటికీ ప్రభుత్వానికి నివేదికలు అందించకపోవడం చూస్తుంటే కరువు సాయం ఇప్పట్లో అందేలా లేదన్న విషయం తేటతెల్లమవుతోంది. గతేడాది ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వని ప్రభుత్వం కరువు నేపథ్యంలో గతేడాది జిల్లాలో 33 మండలాలను కరువు మండలాలుగా ప్రభుత్వం ప్రకటించింది. లక్షా ఒక వెరు్య హెక్టార్లలో వేరుశెనగపంట దెబ్బతింది. హెక్టార్‌కు *10 వేల చొప్పున ఇన్పుట్ సబ్సిడీ కింద 110 కోట్లు ఇవ్వాల్సి ఉంది. ఎన్నికల సమయంలో రైతులకు ఇవ్వాల్సిన ఇన్పుట్ సబ్సిడీని చెల్లిస్తామని చెప్పిన చంద్రబాబు ఇంతవరకూ పైసా ఇవ్వలేదు. మామిడి రైతులు నష్టపోయినా వారిని ఆదుకున్న పాపానపోలేదు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది కరువు సాయం అందేలా లేదని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. -
అన్నదాత ఆత్మహత్యాయత్నం
బ్యాంకు అధికారుల వేధింపులు తాళలేక... భూపాలపల్లి: వరంగల్ జిల్లా భూపాలపల్లి మండలం దీక్షకుంట గ్రామానికి చెందిన రైతు అజ్మీరా శ్రీనివాస్ బ్యాంకు అధికారుల వేధింపులు తాళలేక శనివారం ఆత్మహత్యాయత్నం చేశాడు. వివరాలు.. శ్రీనివాస్ గొల్లబుద్దారం గ్రామానికి చెందిన రామన్నతో కలిసి 1998లో ట్రాక్టర్ కొనుగోలు నిమిత్తం తమ వ్యవసాయ భూమిపై భూపాలపల్లి డీసీసీబీ బ్యాంకులో రూ. 5 లక్షల రుణం తీసుకున్నారు. రుణం తీసుకున్న నాటి నుంచి వాయిదాలు చెల్లించలేదు. దీంతో బ్యాంకు అధికారులు ఇటీవల శ్రీనివాస్, రామన్నపై తీవ్ర ఒత్తిడి తీసుకువచ్చారు. చేసేది లేక వీరువురు ఈ నెల 10న డబ్బులు చెల్లిస్తామని హామీ ఇచ్చారు. ఈ మేరకు శనివారం మధ్యాహ్నం బ్యాంకు రికవరీ అధికారులు శ్రీనివాస్ ఇంటికి వెళ్లి డబ్బులు చెల్లించాల్సిందిగా కోరారు. డబ్బులు లేవని, కొంత గడువు ఇవ్వాలని ఆయన కోరగా, అధికారులు వినకుండా ఇంటిలోని వస్తువులను జప్తు చేస్తామని బెదిరించారు. దీంతో శ్రీనివాస్ తన ఇంట్లో ఉన్న క్రిమిసంహారక మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. గమనించిన కుటుంబ సభ్యులు అతడిని భూపాలపల్లిలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించారు. కాగా, బ్యాంకు బాకీ డబ్బుల కోసం గ్రామానికి వెళ్లగా శ్రీనివాస్, అతని కుటుంబ సభ్యులు డిప్యూటీ జనరల్ మేనేజర్ శ్రీనివాస్, సిబ్బందిపై దాడికి పాల్పడ్డారని బ్యాంకు అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. -
ధాన్యం రైతు దైన్యం
⇒80 కేజీలకు రూ.900 దక్కడమే గగనం ⇒మిల్లర్లకే వంతపాడుతున్న కొనుగోలు కేంద్రాలు ⇒ఛీఛీ.. ఇవేం ధాన్యం మాకొద్దంటున్న మిల్లర్లు ⇒బతిమాలించుకొని తక్కువ ధరకు కొనుగోలు ⇒ మనస్తాపానికి గురవుతున్న అన్నదాత ⇒భయపెడుతున్న అప్పులు, పండుగ ఖర్చులు ⇒ధర వచ్చే వరకు నిరీక్షించలేని దుస్థితి పాలకొండ: భూమినే నమ్ముకొని బతుకుతున్న భూమిపుత్రుడు పండిన ఫలాన్ని అమ్ముకుందామన్నా వీలుకావడం లేదు. ఇటు కొనుగోలు కేంద్రాలు, అటు వ్యాపారులు నానారకాల సాకులు, సవాలక్ష నిబంధనలతో ధర విషయంలో రైతన్నను దోపిడీ గురిచేస్తూనే.. ఛీత్కారాలు, చీదరింపులతో మనస్తాపానికి గురి చేస్తున్నారు. ఫలితంగా ప్రకృతి వైపరీత్యాలను తట్టుకొని చేతికొచ్చిన కొద్దిపాటి ధాన్యాన్నే అమ్ముకోలేక అన్నదాత అవస్థల పాలవుతున్నాడు. చివరికి ఎంతో కొంత ధరకు ధాన్యాన్ని అమ్ముకోక తప్పని దైన్యాన్ని ఎదర్కొంటున్నాడు. జిల్లాలో ఈ ఏడాది తుపాను కారణంగా ధాన్యంలో కొంతమేర పటుత్వం తగ్గిన మాట వాస్తవమే. ఇదే అవకాశాన్ని ఇటు మిల్లర్లు, దళారులు వినియోగించుకుంటున్నారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల నిబంధనలు వీరికి అనుకూలంగా మారాయి. అప్పులు, పండుగ ఖర్చుల కారణంగా నూర్పు చేసిన పంటను దాచుకునే పరిస్థితుల్లో లేని అన్నదాతల యథేచ్ఛగా దోచుకుంటున్నారు. మిల్లర్లందరూ సిండికేట్‌గా మారి 80 కేజీల ధాన్యానికి రూ. 850 నుంచి రూ.900 లోపే ధర నిర్ణయించారు. నాణ్యత సాకుతో అంతకుమించి ధర ఇచ్చేందుకు ససేమిరా అంటున్నారు. ధాన్యం పట్టుకొని మిల్లు వద్దకు వెళ్లిన రైతులకు ‘ఛీఛీ.. ఈ పంట మాకొద్దు...పూర్తిగా విరిగిపోతున్నాయి.. మేము కొనలేం’ అని ఛీత్కరిస్తున్నారు. దీంతో దిక్కుతోచని రైతులు మిల్లర్లు చెప్పిన ధరకే అమ్మాల్సి వస్తోంది. మిల్లర్ల మాటకే సై ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలు రైతులకు విచిత్ర పరిస్థితిని కల్పిస్తున్నాయి. పరీక్షలకు శ్యాంపిల్‌గా ధాన్యం తీసుకెళితే నాణ్యత లేవని సమాధానం చెబుతున్నారు. కేంద్రాల్లో ఉన్న సిబ్బందికి దీనిపై అవగాహన లేకపోవడంతో తప్పించుకొనే ధోరణిలోనే వ్యవహరిస్తున్నారు. మిల్లర్లు చెప్పిన నిబంధనలనే అమలు చేస్తున్నారు. మిల్లర్లు సరే అంటేనే ధాన్యం తీసుకొనే పరిస్థితిలో కొనుగోలు కేంద్రాలు కొనసాగుతున్నాయి. తగ్గిన డిమాండ్ ఈ ఏడాది ధాన్యానికి డిమాండ్ పూర్తిగా తగ్గింది. గతంలో ఇతర ప్రాంతాల నుంచి వ్యాపారులు వచ్చి కొనుగోలు చేయడంతో మిల్లర్లు కొంతమేర భయపడే వారు. లెవీకి కూడా ధాన్యం సేకరించలేమన్న ఉద్దేశంతో ధర పెంచేవారు. అయితే ఇటీవల అక్రమంగా ధాన్యం తరలిపోతున్నాయంటూ అధికారులు హడావుడి చేయడంతో ఇతర ప్రాంతాల వ్యాపారులు జిల్లాకు రావడం రాలేదు. పొరపాటున అక్కడక్కడ కొనుగోలు చేసినా అధికారులు వాహనాలను అడ్డుకొని తనిఖీల పేరుతో రెండు మూడు రోజుల పాటు పోలీస్ స్టేషన్ల వద్దే నిలిపివేస్తుండటంతో ఎందుకీ తలనొప్పి అన్న ఉద్దేశంతో బయటి వ్యాపారులు రావడం మానుకున్నారు. స్థానిక వ్యాపారులు దీన్ని తమకు అనుకూలంగా మార్చుకొని రైతులను నిలువునా దోచుకుంటున్నారు. రవాణా చార్జీల్లో మతలబు రైతులకు రవాణా చార్జీల్లోనూ ప్రభుత్వం కోత విధించింది. గత ఏడాది వరకు ఒక క్వింటాకు రూ.28 చొప్పున రైతుకు నేరుగా రవాణా చార్జీలు ఇచ్చేవారు. ఈ ఏడాది రైతుకు చెల్లించడం నిలిపివేశారు. ఇందుకోసం జిల్లాలో మూడు డివిజన్లను ముగ్గురు కాంట్రాక్టర్లకు అప్పగించారు. రైతులు కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకొస్తే అక్కడి నుంచి మిల్లుకు తరలించే బాధ్యత వీరికి అప్పగించారు. దీంతో రైతులు కొనుగోలు కేంద్రాలనే మరిచిపోయే పరిస్థితి కల్పించారు. ఈ విధానంపై రైతు సంఘాలు, వ్యవసాయ సంఘాలు ఆందోళన బాట పట్టేందుకు సిద్ధమవుతున్నాయి. -
అన్నదాతల ఇళ్లలో చావుడప్పు!
-
అన్నదాతల ఇళ్లలో చావుడప్పు!
టీడీపీ హయాంలో ఇదో పరంపర ఈ ఆర్నెల్ల కాలంలో 86 మంది రైతుల బలవన్మరణం రైతుల గోడు పట్టని సీఎం చంద్రబాబు ‘మీ కోసం’ పాదయాత్రలో రైతుల కష్టాలను కళ్లారా చూశానని, అధికారంలోకి రాగానే రుణాలన్నీ మాఫీ చేస్తానన్న టీడీపీ అధినేత అధికారం చేపట్టి ఆరు నెలలైనా రైతాంగానికి సాంత్వన చేకూర్చే ఒక్క నిర్ణయమూ తీసుకోలేదు రైతుల ఖాతాలు తగ్గించడానికే ఆర్నెల్లూ కసరత్తు రుణ భారంతో పాటు, అపరాధ వడ్డీ భారం కూడా తోడై మరింత కుంగిపోతున్న అన్నదాత ఒక్క అనంతపురం జిల్లాలోనే 40 మంది బలవన్మరణం.. కర్నూలు జిల్లాలో 33 మంది ప్రాణాలు వదులుతున్న రైతుల్లో ఎక్కువ మంది బడుగు, బలహీన వర్గాలు, సన్న, చిన్నకారు రైతులే సాక్షి, హైదరాబాద్: బంగరు భూమిలో విషాదం చిమ్ముతోంది. పచ్చటి పొలాల్లో కన్నీరు పారుతోంది. ప్రభుత్వం హామీలు అమలు కాక, కాలం కలిసి రాక రైతన్న కుదేలవుతున్నాడు. రుణాలు మాఫీ చేస్తుందని సర్కారుపై పెట్టుకున్న ఆశలు అడియాశలై, కుప్పలా పేరుకున్న అప్పులు తీర్చలేక తనువు చాలిస్తున్నాడు. ఇల్లాలి పుస్తెలమ్మి పంట కోసం తెచ్చుకున్న పురుగుమందు తాగో, సద్దిమూట తగిలించాల్సిన చెట్టు కొమ్మకు ఉరేసుకొనో బలవన్మరణం పొందుతున్నాడు. మరికొందరు గుండె పగిలి మరణిస్తున్నారు. అన్నదాతకు అండగా నిలిచి, సిరులు పండించేలా చేయూతనివ్వాల్సిన సర్కారు.. రైతన్న బలవన్మరణం పొందుతున్నా పట్టించుకోవడంలేదు. వ్యవసాయం దండగ, టూరిజమే పండగన్న సిద్ధాంతంతో దేశదేశాలు తిరిగొస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు ఇక్కడి రైతుల గోడు మాత్రం వినిపించడంలేదు. అధికారం కోసం పాదయాత్రలు చేసి, అడ్డగోలు హామీలిచ్చి గద్దెనెక్కిన చంద్రబాబు ఈ ఆర్నెల్లలో రైతన్న కష్టాలను మరింతగా పెంచారు. ‘మీ కోసం’ పాదయాత్రలో రైతుల కష్టాలను కళ్లారా చూశానని, అందుకే అధికారంలోకి రాగా నే రైతుల రుణాలన్నీ సంపూర్ణంగా మాఫీ చేస్తానన్న బాబు.. అధికారం చేపట్టి ఆరు నెలలైనా రైతాంగానికి సాంత్వన చేకూర్చే ఒక్క నిర్ణయం తీసుకోలేదు. తొలి సంతకం అంటూ హడావుడి చేసి రుణమాఫీని మసిపూసి మారేడు కాయ చేశారు. ఇచ్చిన హామీ ప్రకారం 87,612 కోట్ల రూపాయల రుణాలను మాఫీ చేయకపోగా, వారి ఖాతాలను తగ్గించడంలోనే ఆరు నెలలు సాగదీశారు. దాని పర్యవసానాలను రైతులు ఎదుర్కొంటున్నారు. అప్పులు తీరుతాయని, కొంతలో కొంతైనా భారం తగ్గుతుందని భావించిన రైతాంగానికి, రుణ భారంతో పాటు దానికిప్పుడు అపరాధ వడ్డీ భారం కూడా తోడైంది. మరో వైపు సీజన్ సరిగా లేక , భారంగా మారిన అప్పులు, వడ్డీల సంగతేంటో రైతులు మరింతగా కుంగిపోతున్నారు. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత నుంచి ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటివరకు 86 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డట్లు లెక్కలు చెబుతున్నాయి. అనధికారికంగా ఈ సంఖ్య ఇంకా ఎక్కువే ఉంటుందని, ఆత్మహత్యల పరంపర కొనసాగుతోందని రాజకీయపార్టీలు చెబుతున్నాయి. అసలే కరువు కాటకాలతో తల్లడిల్లే రాయలసీమ జిల్లాల్లో ఈసారి వ్యవసాయదారులకు మరిన్ని ఇబ్బం దులు తలెత్తాయి. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఒక్క అనంతపురం జిల్లాలోనే 40 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ సంఖ్య 60కంటే ఎక్కువేనని జిల్లాకు చెందిన ప్రజా సంఘాలు అంటున్నాయి. కర్నూలు జిల్లాలోనూ 33 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. కడప జిల్లాలో ఇద్దరు, చిత్తూరు జిల్లాలో ఒకరు ఆత్మహత్య చేసుకున్నారు. ఆరు నెలల్లోనే ఈ స్థాయిలో ఆత్మహత్యలకు పాల్పడటం రైతుల దయనీయస్థితిని తెలియజేస్తోందని ప్రజా సంఘాలు వ్యాఖ్యానిస్తున్నాయి. రాయలసీమలోనే కాదు.. ఇంతో అంతో సేద్యం చేయడానికి వీలున్న ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం జిల్లాలోనూ ఇద్దరు రైతులు మరణించారు. పంట నష్టపోయి, అప్పు ఎలా తీర్చాలో తెలియక గుండెచెదిరి కన్నుమూశారు. దక్షిణాది ధాన్యాగారంగా పేరుగాంచిన ఉభయ గోదావరి జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఒక్కొక్కరు మరణించారు. కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో ఇద్దరేసి చొప్పున మరణించారు. నేల రాలుతున్న వారిలో ఎక్కువ మంది బడుగు, బలహీనవర్గాల వారు, సన్న, చిన్నకారు రైతులే. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల శ్రేయస్సే లక్ష్యంగా ప్రకటించుకున్న చం ద్రబాబు ఇంతవరకు రైతన్నల ఆత్మహత్యలను మాటమాత్రమైనా ప్రస్తావించలేదు. ఏ ఒక్క కుటుంబాన్నీ పరామర్శించలేదు. చిల్లి ఏగాణి సాయం ప్రకటించలేదు సరికదా.. ‘డబ్బులేమైనా చెట్లకు కాస్తాయా?’ అని ప్రశ్నిస్తున్నారు. ఎరువుల ధరలపై నోరెత్తరేం? ముఖేష్ అంబానీ కంపెనీకి లబ్ధి చేకూర్చేలా గ్యాస్ ధరను సవరించేందుకు నానా తంటాలు పడిన చంద్రబాబు, ఆయన మిత్రబృందం.. కరెంటు చార్జీలు రెట్టింపు అయినా, ఎరువుల ధర పెరిగినా కిమ్మనరు. పూలమ్మిన చోటే కట్టెలమ్మినట్టు సొంత పొలంలోనే రైతులు వ్యవసాయ కూలీలుగా మారుతున్నా, గ్రామీణ ప్రాంతాలను వదిలి పట్టణాలకు వలసపోతున్నా పట్టించుకోరు. రైతన్నను సంపన్నుణ్ణి చేస్తామం టూ మాటలతో సరిపెడతారు. స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానాన్నే కిందిస్థాయిలో ఉన్న రైతుకు అం దించలేని పాలకులు.. విదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో సుసంపన్నం చేస్తామని నమ్మబలుకుతూ రైతుల్ని నట్టేట ముంచే ప్రయత్నం చేస్తున్నారు. సబ్సిడీలకు ఎగనామం పెట్టేందుకే.. గ్రామీణ వ్యవహారాలను నిశితంగా పరిశీలించే ప్రముఖ జర్నలిస్టు పాలగుమ్మి సాయినాధ్ కొద్దికాలం చెప్పిన మాటలు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబుకి సరిపోతాయని చెప్పొచ్చు. ‘కార్పొరేట్ కంపెనీ నుంచి వచ్చే ఎంబీఏ గ్రాడ్యుయేట్ రైతు గ్రూపులను ఏర్పాటు చేస్తాడు. వరి, రాగి, మిర్చి, పత్తి ఎలా పండించాలో వ్యవసాయంలో అప్పటికే ఆరితేరిన వారికి సలహాలు ఇస్తాడు. పాఠాలు చెప్తాడు. రైతులకిచ్చే కోట్లాది రూపాయల సబ్సిడీలను బొక్కేందుకు కార్పొరేట్ కంపెనీలు పన్నిన పన్నాగం ఇది’ అంటారు సాయినాధ్. చంద్రబాబు వ్యవహార శైలి కూడా ఇంచుమించు ఇలాగే ఉంది. కార్పొరేట్లకు వంత పాడి, కర్షకుల కడుపు కొడుతున్నారు. అందుకే రైతు ఆత్మహత్యల్ని చంద్రబాబు పెద్దగా పట్టించుకోవడంలేదు. ప్రభుత్వం ఇప్పటికైనా... ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించాలి. పెరిగిన సాగుబడి వ్యయంతో కొట్టుమిట్టాడుతున్న రైతుకు పెట్టుబడి రాయితీ కల్పించాలి. రైతులకు అండగా నిలిచేలా పంటలకు మార్కెటింగ్ సౌకర్యం కల్పించాలి. సబ్సిడీలను పెంచాలి. సాగు మెళకువల్ని పెంచేలా పరిశోధనలు జరగాలి. రుణ ప్రణాళికను ప్రకటించి, వ్యవసాయంలో ప్రభుత్వ రంగ పెట్టుబడులను పెంపొందించాలి. అప్పుడే రైతుకు భరోసా కలిగి, ఆత్మహత్యల్ని నివారించగలుగుతాము. గతంలో బాబు హయాంలో 11,952 మంది ఆత్మహత్యలు.. చంద్రబాబు నేతృత్వంలోని తెలుగుదేశం పార్టీ ఏలుబడిలో రైతుల ఆత్మహత్యలు కొత్తేమీ కాదు. సాక్షాత్తు నేషనల్ క్రైమ్ బ్యూరో రికార్డుల్లో ఉన్న వివరాల ప్రకారం చంద్రబాబు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో 11,952 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ప్రతికూల పరిస్థితుల్లో దేశంలో రోజుకు 2,000 మంది రైతులు వ్యవసాయాన్ని వదిలేస్తుంటే, రాష్ట్రంలో ఆ సంఖ్య 375 మందికి చేరింది. ‘సాక్షి నెట్వర్క్’ పరిశీలన ప్రకారం చంద్రబాబు అధికారం చేపట్టిన ఈ ఆరు నెలల కాలంలో ఆత్మహత్యలు చేసుకున్న రైతుల సంఖ్య 86కు చేరింది. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక, కార్పొరేట్ అనుకూల విధానాలతో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారనేది జగద్విదితం. రుణ మాఫీపై గంపెడాశలు పెట్టుకున్న రైతాంగం, ఆ హామీ వమ్మయినట్లేనని నిర్ధారణకు వచ్చి, నిస్పృహకు లోనై ఆత్మహత్యల వైపు అడుగు వేస్తున్నారని నిపుణులు చెబుతున్నారు. హక్కుల వేదిక డిమాండ్ ఇది.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో అన్నదాతల ఆత్మహత్యలపై నిజ నిర్ధారణ చేసిన మానవ హక్కుల వేదిక (హెచ్ఆర్ఎఫ్) సమగ్ర రుణ ప్రణాళికను ప్రకటించాలని ఉభయ ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేసింది. ఏపీలోని అనంతపురం, తూర్పు గోదావరి జిల్లాల్లో ఆత్మహత్యలకు దారితీసిన పరిస్థితులపై హెచ్ఆర్ఎఫ్ సోమవారమిక్కడ ఓ ప్రకటన చేసింది. ‘చనిపోతున్న వారిలో ఎక్కువ మంది సన్న, చిన్నకారు, కౌలు రైతులు. ఉభయ రాష్ట్రాల్లో ఇప్పటివరకు 910 మంది చనిపోయారు. రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయకపోడం వల్ల అప్పుల పాలై బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. ఆత్మహత్యలు చేసుకున్న రైతులకు అమలు చేయాల్సిన జీవో 421 ని కూడా అమలు చేయడంలేదు. ప్రతి కుటుంబానికీ ఆర్థిక సాయాన్ని అందజేయాలి. ప్రస్తుతం ఇస్తున్న లక్షన్నరను రూ.5 లక్షలకు పెంచాలి’ అని వేదిక ప్రతినిధులు వీఎస్ కృష్ణ, ఎ. చంద్రశేఖర్ డిమాండ్ చేశారు. -
కాటేసిన కరెంటు తీగలు
వేలాడుతున్న కరెంటు తీగలే మృత్యుపాశాలయ్యూరుు. అందరు చూస్తుండగానే అన్నదాత ప్రాణాలు అనంతవాయువుల్లో కలిశారుు. పశుగ్రాసం తరలిస్తుండగా జరిగిన ప్రమాదంలో రైతు మృతదేహం దాదాపుగా కాలిపోరుుంది. పంటల సాగే కాదు.. పశుపోషణా కష్టతరంగా మారింది. ఈ క్రమంలో పొరుగూరు నుంచి పశుగ్రాసాన్ని తరలిస్తూ కష్టజీవి మృత్యువాత పడడం చూపరులను కంటతడి పెట్టించింది. మరోచోట బోరుబావిలో పైపు దించుతున్న అన్నదాత కూడా కరెంటు తీగలకు బలయ్యూడు. పరకాలరూరల్: మండలంలోని నడికూడ శివారులోని గొల్లపల్లిలో విద్యుత్ తీగలు తగిలి రైతన్న మృతిచెందాడు. ప్రత్యక్షసాక్షుల కథనం ప్రకారం.. కంఠాత్మకూరు గ్రామానికి చెందిన బాసిక బిక్షపతి(45) ఎకరం వరి, మూడెకరాల్లో పత్తి సాగు చేశాడు. వర్షాల్లేక పొలం బీడుగా మారింది. తన పశువులకు మేత కరువైంది. అత్తగారి ఊరు పులిగిల్ల నుంచి గడ్డి తెచ్చేందుకు ట్రాక్టర్లో గ్రామస్తులు చేరాలు, కొంరయ్య, రవితో కలిసి గురువారం ఉదయం వెళ్లారు. సాయంత్రం గడ్డిలోడ్తో తిరుగుపయనమయ్యూరు. దారిలో కరెంటు తీగలను తప్పించేందుకు బిక్షపతి గడ్డిపైనే ఉన్నాడు. తాను పడిపోకుండా ఉండేందుకు నడుము, కాళ్లను కట్టేసుకున్నాడు. ముందు కూర్చున్న కూలీలు అప్రమత్తం చేస్తుండగా విద్యుత్ తీగలను తప్పిస్తూ వచ్చాడు. గొల్లపల్లి శివారులో డ్రైవర్ రమేశ్ ఒక్కసారిగా ట్రాక్టర్‌ను ముందుకు ఉరికించాడు. అదే సమయంలో 11కేవీ తీగలు తగిలి బిక్షపతి అక్కడికక్కడే మృతిచెందాడు. మృతదేహం పూర్తిగా కాలిపోరుుంది. స్థానికుల అరుపులతో అప్రమత్తమైన డ్రైవర్.. ఇంజిన్ భాగాన్ని వేరు చేశాడు. ఫైరింజన్ వచ్చి మంటలార్పేసింది. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించేందుకు ఎస్సై వినయ్‌కుమార్ ప్రయత్నించగా బిక్షపతి కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతోనే ఘోరం జరిగిందని, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్‌చేశారు. విద్యుత్ ఏఈ కన్నయ్య హామీ మేరకు ఆందోళన విరమించారు. ఒకే రోజు ఇంట్లో, అత్తారింట్లోనూ అందరితో సరదాగా గడిపిన బిక్షపతి మరణాన్ని కుటుంబసభ్యులు, బంధువులు జీర్ణించుకోలేకపోతున్నారు. బిక్షపతికి భార్య, ఇద్దరు కుమారులున్నారు. బాధిత కుటుంబాన్ని జెడ్పీటీసీ పాడి కల్పనాదేవి, ప్రతాప్‌రెడ్డి, ఎంపీపీ నేతాని సులోచన, నడికూడ, ధర్మారం, కంఠాత్మకూర్ సర్పంచులు సర్పంచ్ రావుల పద్మ, అయిలయ్య, గుండెబోయిన రాజు, ఎంపీటీసీ సభ్యుడు దురిశెట్టి చంద్రమౌళి పరామర్శించారు. -
ప్రభుత్వ తీరు.. అన్నదాత బేజారు..
కడప అగ్రికల్చర్ : రుణమాఫీ విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుతో అన్నదాత బేజారు చెందుతున్నాడు. దిక్కుతోచకని స్థితిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు. రుణమాఫీ విషయంలో ప్రభుత్వం పలు రకాల షరతులు విధించి జీఓ జారీ చేసింది. అయితే బంగారు రుణాలకు మాత్రం బంగారు తాకట్టుతో సంబంధం లేకుండా రుణం తీసుకున్న ఏడాదిలో జిల్లా కమిటీ నిర్ణయించిన స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం పంటసాగు కోసం తీసుకునే రుణానికి మాత్రమే మాఫీ వర్తిస్తుందని జీఓ నంబరు 164 లోని 14 నుంచి 16 వరకు ఉన్న అంశాల ప్రకారం రుణమాఫీ ఉంటుందని పేర్కొన్నారు. దీంతో బంగారం తాకట్టుపెట్టి రుణం తీసుకున్న రైతులు ఆందోళన చెందుతున్నారు. పంట రుణాలకు మాత్రం పట్టాదారు పాసుపుస్తకం బ్యాంకులో తాకట్టుపెట్టి రుణాలను రైతులు తీసుకున్నారు. అది కూడా 2013 మార్చి1 నుంచి, 2013 డిసెంబరు నెల 31వ తేదీ వరకు పంటల సాగుకు తీసుకున్న రుణాలకే రుణమాఫీ వర్తిస్తుందని, ఆ తర్వాత తీసుకున్న వారికి వర్తింపు ఉండదని పేర్కొన్నారు. ఉద్యాన పంటలకు తీసుకున్న రుణాలు మాఫీ చేసేది లేదని ప్రభుత్వం తెగేసి చెప్పింది. స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ అంటే...: ప్రతి ఏటా ఏప్రిల్ నెలలో డీసీసీ బ్యాంకు చీఫ్ మేనేజరు, లీడ్‌బ్యాంకు మేనేజరు, అన్ని ప్రధాన బ్యాంకుల మేనేజర్లు, వ్యవసాయశాఖ జేడీ, ఉద్యానశాఖల ఏడీలు, మార్కెటింగ్‌శాఖ అధికారులు, ఒకరిద్దరు అభ్యుదయ రైతులు ఈ సమావేశంలో పాల్గొంటారు. ఏఏ పంటకు ఎంతెంత పెట్టుబడి అవుతుందనే విషయమై చర్చిస్తారు. ముందుగా ఆయా శాఖల అధికారులు రూపొందించిన రుణ ప్రణాళికలను సమావేశం ముందుంచుతారు. అన్ని ప్రణాళికలపై చర్చ నిర్వహించి, అనంతరం ఒక కటాఫ్ పెట్టుబడి రుణాన్ని నిర్ణయించి రాష్ట్రస్థాయి కమిటీకి పంపుతారు. అక్కడ అటుఇటుగా ఒక మొత్తాన్ని నిర్ణయించి జిల్లాకు పంపిస్తారు. దాని ఆధారంగా బ్యాంకర్లు రుణాలను రైతులకు అందజేస్తారు. దీని ప్రకారం బ్యాంకర్లు రైతు బ్యాంకుకు సమర్పించే పాసుపుస్తకంలో ఉన్న భూమికి జిల్లా కమిటీ నిర్ణయించిన స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం రుణాన్ని ఇస్తారు. స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం 2013లో వరి పంటకు ఎకరాకు రూ. 18,000లు, జొన్నకు రూ. 8,000లు, కందికి 8,000లు, శనగకు రూ. 12,000, పొద్దుతిరుగుడుకు రూ. 10,000లు, వేరుశనగకు రూ. 11,000లు, పత్తి పంటకు నీటి ఆధారం, వర్షాధారం కింద రూ. 22 వేలు, ఆముదం పంటకు రూ. 8000లు ఇలా రుణాన్ని అన్ని పంటల సాగుకోసం రైతులకు అందజేశారు. ఉదాహరణకు రైతు ఒక ఎకరం పొలం ఉన్నప్పుడు ఆ ఎకరం పంటసాగుకు 5 తులాల బంగారాన్ని తాకట్టు పెట్టి రూ లక్ష రుణం తీసుకుంటే ఆ పంటకు స్కేల్ ఆఫ్ ఫైనాన్స్‌లో ఎంత రుణం ప్రకటించారో అంతే మొత్తం మాఫీ అవుతుందిగాని లక్ష రూపాయలు మాఫీ కాదని బ్యాంకర్లు చెబుతున్నారు. -
మొలకెత్తని ఆశలు
రైతులను నిండా ముంచిన ఏపీ సీడ్స్ వరి విత్తనాలు మళ్లీ నారుమడులు పోయాల్సిందే అన్నదాతలకు అదనపు భారం అనిగండ్లపాడు (పెనుగంచిప్రోలు) : వ్యవసాయ అధికారులు సబ్సిడీపై పంపిణీచేసిన ‘ఏపీ సీడ్స్’ వరి విత్తనాలు మొలకెత్తలేదు. నాసిరకం విత్తనాల కారణంగానే ఈ పరిస్థితి ఏర్పడిందని అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పెనుగంచిప్రోలు మండలం, అనిగండ్లపాడు సహకార సంఘానికి తొలి విడతగా ఏసీ సీడ్స్ ద్వారా 10 టన్నులు, పెనుగంచిప్రోలు సహకార సంఘానికి 15 టన్నుల వరి విత్తనాలు వచ్చాయి. 25 కిలోల సంచులుగా ఈ విత్తనాలు సరఫరా చేశారు. కిలోకు రూ.5ల సబ్సిడీపై 25 కిలోల వరి విత్తనాల సంచిని రూ.562.50లకు రైతులకు అందజేశారు. ఈ విత్తనాలతో చాలా మంది రైతులు నారుమడులు పోసుకున్నారు. అయితే విత్తనాలు పూర్తిస్థాయిలో మొలకెత్తలేదు. 80 శాతం మొలక వస్తేనే మంచి విత్తనాలుగా గుర్తిస్తారు. కొందరు రైతులు మండె కట్టి మొలకేస్తే కేవలం 40 నుంచి 50 శాతం మాత్రమే మొలకెత్తాయి. పెనుగంచిప్రోలు మండలంలోనే 40 మంది రైతులు నష్టపోయారు. నాసిరకం విత్తనాల కారణంగానే మొలకశాతం తగ్గిందని వారు ఆరోపించారు. మొలక శాతం తగ్గడంతో రైతులు సహకార సంఘాలకు తమ గోడు చెప్పుకున్నారు. సహకార సంఘాల బాధ్యులు వ్యవసాయాధికారులకు సమాచారం ఇచ్చారు. మొలక రాని ధాన్యం సంచులను రైతుల నుంచి తిరిగి తీసుకుని వేరే సంచులు ఇవ్వాలని వ్యవసాయాధికారులు చెప్పారని సొసైటీల పాలకులు పేర్కొంటున్నారు. అదును దాటిపోతుండటంతో చేసేది లేక రైతులు చాలామంది ప్రయివేటు డీలర్ల వద్ద నుంయి విత్తనాలు కొనుగోలు చేసి, మళ్లీ నారుమడులు పోసుకుంటున్నారు. దీని వల్ల పెట్టుబడుల మొత్తం పెరుగుతోందని రైతులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ప్రయివేటు డీలర్లను ప్రోత్సహించేందుకే ఏపీ సీడ్స్ అధికారులు నాసిరకం విత్తనాలను సరఫరా చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. గతంలో పంపిణీచేసిన జీలుగ, ఇప్పటి వరి విత్తనాలు నాసిరకమేనని పేర్కొంటున్నారు. ఈ నాసిరకం విత్తనాలపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. 150 మందికి నష్టం గుడ్లవల్లేరు : మండలంలోని వెణుతురుమిల్లి, కౌతవరం, పసుభొట్లపాలెం, పెసరమిల్లి ప్రాంతాల్లో దాదాపు 150మంది రైతులు ప్రయివేటు వ్యాపారుల వద్ద విత్తనాలు కొని నారు పోసుకున్నారు. అయితే విత్తనాలు జల్లి రోజులు గడుస్తున్నా మొలక రాకపోవడంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు. నారు మడి పోయాలంటే ఎకరానికి కనీసం రూ.1,500 ఖర్చవుతుందని, సాగు ఆరంభంలోనే నష్టపోయిమని రైతులు ఆందోళన చెందుతున్నారు. గతంలోను ఇంతే ఏపీ సీడ్స్ వరి విత్తనాలను ఇంటి దగ్గర మండె కట్టాం. మొలక శాతం పూర్తిగా తగ్గింది. దీంతో విత్తనాలను తిరిగి బస్తాల్లో పట్టి సహకార సంఘానికి తరలించాం. కొందరు రైతులు విత్తనాలను పొలంలో చల్లారు. వారికి బాగా నష్టం వచ్చింది. గతంలో కూడా నాసిరకం విత్తనాలు రైతులను ముంచాయి. - గంగూరి కోటేశ్వరరావు, రైతు, అనిగండ్లపాడు 12రోజులైనా మొలకలేదు... 1232వరి రకం విత్తనం వేసి, 12రోజులైంది. అయినా పెద్దగా మొలక రాలేదు. మామూలుగా నాలుగు రోజుల్లో మొలక వచ్చేస్తుంది. పక్కన ఉన్న చేలల్లో రెండు రోజుల వెనుక వేరే రకం వేసినా నూటికి నూరు శాతం బాగానే ఎదిగింది. దళారుల నియంత్రణ లేకే మాకు ఈ తిప్పలు. - పడమటి సుబ్రహ్మణ్యేశ్వరరావు, పెసరమిల్లి రైతు రైతుల నుంచి తిరిగి తీసుకుంటాం మొలక రాని విత్తనాల గురించి మాట్లాడగా ఏపీ సీడ్స్ కార్పోరేషన్ డీఎం వాటిని తిరిగి తీసుకోవాలని సూచించారు. కొన్ని లాటుల విత్తనాలే మొలకెత్తలేదు. తరువాత మరో వచ్చిన 15 టన్నులు బాగానే ఉన్నాయి. రైతులకు ఎటువంటి నష్టాన్ని కలుగనీయం. రైతులు చాలామంది విత్తనాల సంచులను తిరిగి ఇచ్చేశారు. - రామ్‌కుమార్, మండల వ్యవసాయాధికారి -
అప్పుడే మొదలు
రుణమాఫీపై కొరవడిన స్పష్టత రీషెడ్యూల్పైనా అయోమయం బకాయిలు చెల్లించాలంటున్న బ్యాంకర్లు ప్రైవేటు అప్పుల కోసం రైతుల అగచాట్లు వరుణుడు కరుణించినా.. ప్రభుత్వం మాత్రం అన్నదాతలతో పరిహాసమాడుతూనే ఉంది. కురుస్తున్న వర్షాలు కొత్త ఆశలు చిగురింపచేస్తున్నా.. చేతిలో చిల్లి గవ్వ లేక రైతు దిక్కులు చూస్తున్నాడు. రుణ మాఫీ పేరుతో వంచించిన ప్రభుత్వం తాజాగా రీ షెడ్యూల్ ప్రకటన తెరపైకి తెచ్చింది. అయితే అన్నదాతలు బ్యాంకులకు వెళితే తమకు ఎటువంటి ఆదేశాలు రాలేదంటూ సిబ్బంది తిప్పి పంపుతున్నారు. దాంతో ఖరీఫ్ మదుపుల కోసం అంతా ప్రైవేటు వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. విశాఖ రూరల్/నర్సీపట్నం రూరల్ : తెలుగుదేశం ప్రభుత్వం తప్పుడు హామీలు కారణంగా రైతులకు తీవ్ర నష్టం జరుగుతోంది. రుణాలు రద్దు చేస్తామని చెప్పిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటి వరకు ఆ విషయాన్ని తేల్చలేదు. రుణాలు రీషెడ్యూల్కు ఆర్బీఐ సిద్ధంగా ఉన్నట్లు ప్రభుత్వం చెబుతున్నప్పటికీ ఇప్పటి వరకు బ్యాంకర్లకు ఎటువంటి ఉత్తర్వులు అందలేదు. రీషెడ్యూల్ కారణంగా వడ్డీ భారమవుతోందని రైతులు ఆందోళన చెందుతున్నారు. 2013-14 ఖరీఫ్, రబీ సీజన్లలో జిల్లాలోని 2,10,881 మంది రైతులు వ్యవసాయ పెట్టుబడులకు జాతీయ, సహకార బ్యాంకుల్లో సుమారుగా రూ. 894 కోట్లు రుణాలుగా తీసుకున్నారు. ఖరీఫ్ మార్చి చివరిలోగా, రబీ బకాయిలు జూన్ చివరిలోగా చెల్లించాల్సి ఉంది. కాలం కలిసి రాకపోవడంతో పాటు ప్రస్తుత అధికార పార్టీ రుణ మాఫీ ప్రకటించడంతో చెల్లింపులన్నీ నిలిచిపోయాయి. ఇదిలా ఉంటే ఈ సీజన్లో మొత్తం 2 లక్షల 304 మంది రైతులకు రూ.700 కోట్లు పంట రుణాలుగా ఇవ్వాలని అధికారులు లక్ష్యాన్ని నిర్దేశించారు. ఇందులో కొత్త వారి కంటే రెన్యువల్స్‌కే ప్రాధాన్యమివ్వాలని నిర్ణయించారు. ఈ ఖరీఫ్‌లో 58,211 మంది కొత్త వారికి రూ.250 కోట్లు మాత్రమే ఇవ్వాలన్నది లక్ష్యం. రెన్యువల్స్ విషయానికి వస్తే 1,42,093 మంది రైతులకు రూ.450 కోట్లు మంజూరు చేయాలని నిర్ణయించారు. అయితే ఇప్పటి వరకు 1668 మంది రైతులకు కేవలం 3.03 కోట్లు రుణాలు మాత్రమే అందజేశారు. మిగిలిన వారు రుణాల కోసం ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం వర్షాలు కురుస్తూ పరిస్థితులు ఆశాజనకంగా ఉన్నప్పటికీ చేతిలో చిల్లిగవ్వలేక పంటలు వేయలేని దుస్థితి. ఇప్పటికైనా ప్రభుత్వం రుణాలు అందించే విషయంలో సత్వరం చర్యలు తీసుకోని పక్షంలో రైతాంగం తీవ్రంగా నష్టపోయే ప్రమాదముంది. బ్యాంకర్లు... మరో‘సారీ’ కొత్త ప్రభుత్వం అధికారం చేపట్టి నెల రోజులు దాటినా ఇంతవరకు రుణ మాఫీపై స్పష్టత లేకుండా పోయింది. దీనికై సీఎం వేసిన ప్రత్యేక కమిటీ నేటికీ నివేదిక ఇవ్వలేదు. దీంతో ఇటీవల రుణ మాఫీ స్థానే రీ షెడ్యూల్ అంశాన్ని తెరపైకి తెచ్చింది. ఈ విధానాన్ని ప్రకటించి రోజులు గడుస్తున్నా దీనికి సంబంధించిన విధి విధానాలపై బ్యాంకర్లకు ఎటువంటి ఆదేశాలు రాలేదు. ఈ నేపథ్యంలో రుణాల కోసం బ్యాంకులకు వెళ్లిన రైతులకు వారు ఇదే విషయాన్ని చెప్పి తిరిగి పంపిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో అడపా, దడపా చినుకులు పడుతుండడంతో రైతులు సాగు చేసేందుకు ఇబ్బందులు పడుతున్నారు. బ్యాంకర్లు రుణాలు ఇవ్వకపోవడంతో వడ్డీ ఎక్కువైనా ప్రైవేటు అప్పులు చేయక తప్పదంటూ ఆవేదన చెందుతున్నారు. రుణాలు ఇస్తేనే... నాది గొలుగొండ మండలం పాత మల్లంపేట పంచాయతీ ద్వారకానగర్. ఏటా 6 ఎకరాల్లో ఖరీఫ్ వరి సాగు చేస్తాను. ప్రస్తుతం అడపాదడపా వర్షా లు పడుతున్నాయి. బ్యాంకర్లు అప్పులిస్తారన్నఆశతో గ్రామం లోని పెద్దల వద్ద చేబదులుగా కొంత నగదు తెచ్చి విత్తనాలు జల్లాను. ఉబాలు, నాట్లు, ఎరువులు, క్రిమిసంహారక మందులకు మరి కొంత అవసరం ఉంటుంది. రుణం విషయమై బ్యాంకర్లు నోరు మెదపకపోవడంతో ప్రైవే టు అప్పుల కోసం తిరుగుతున్నాను. - సుర్ల సన్యాసిపాత్రుడు, రైతు, పాత మల్లంపేట ప్రైవేటు అప్పులే దిక్కు నాది గొలుగొండ మండలం జోగుంపేట. నాకున్న ఐదెకరాల్లో వరి సాగుకు సిద్ధమయ్యాను. గతేడాది పంట కలిసిరాకపోవడంతో బ్యాంకుల నుంచి తీసుకున్న రుణం చెల్లించలేకపోయాను. ఈ ఏడాది రుణాల రీ షెడ్యూల్‌కు ప్రభుత్వం ఆదేశించినా బ్యాంకర్లు కొత్త అప్పులిచ్చేందుకు వెనుకంజవేస్తున్నారు. ఇలా అయితే ప్రైవేటు అప్పులతో బాగా నష్టపోవడం తప్పదు. - కె.రామకృష్ణ, రైతు,జోగుంపేట. -
ఖరీఫ్..కన్నీరేనా?
జూలై నెలాఖరుకు వర్షాలు పడకుంటే రైతులకు కష్టకాలమే ప్రత్యామ్నాయ పంటలపై అధికారుల అత్యవసర సమావేశం విత్తనాల కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు అతివృష్టి.. అనావృష్టి అన్నదాతలను అతలాకుతలం చేస్తున్నాయి. వరుసగా నాలుగో ఏటా పరిస్థితి అగమ్యగోచరంగా కనిపిస్తోంది. వర్షాభావ పరిస్థితులతో జిల్లాలో అప్పుడే కరువు ఛాయలు అలముకున్నాయి. జూలై నెలాఖరుకు కూడా వరుణుడు కరుణించకుంటే పరిస్థితి దయనీయమే. దీంతో వ్యవసాయాధికారులు శనివారం అత్యవసర సమావేశం నిర్వహించారు. ప్రత్యామ్నాయ పంటల ప్రణాళికను సిద్ధం చే శారు. స్వల్పకాలిక వంగడాలు, ఆరుతడి పంటలకు ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపించనున్నారు. కానరాదు. ఏటా వీటి నుంచి రూ. కోట్లలో ఆదాయం రావాల్సి ఉన్నా రూ. లక్షలకు మించడం లేదన్నది అధికారుల వాదన. వీటన్నింటినీ అధిగమించేందుకు లెక్కలన్నీ పక్కాగా చేసేందుకు ప్రభుత్వం ఆన్లైన్ విధానం అమల్లోకి తెచ్చింది. ఇటీవల ఆశాఖ మంత్రి అధికారులను ఆదేశించారు. ఆలయభూముల వివరాలు, ఏటా వచ్చే ఆదాయం, సిబ్బంది, ఇతర వ్యయ వివరాలు పూర్తిగా ఆన్లైన్లో నమోదు చేయాలని సూచించారు. దీనివల్ల ఏటా వచ్చే ఆదాయంతో పాటు ఖర్చు వివరాలు పక్కాగా తెలుస్తాయి. వీటిని నేరుగా వైబ్సైట్లో ఎక్కడినుంచైనా, ఎవరైనా పరిశీలించేటట్టు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇంతవరకు ఆలయాల ఆస్తులు, ఆదాయం, ఖర్చుల వివరాలను ఏడాదికోసారి దేవాలయ ప్రాంగణంలోని నోటీసు బోర్డుపై ఉంచేవారు. దీనిని క్షుణ్ణంగా పరిశీలించే అవకాశం లేకపోవడంతో ఎక్కువ శాతం ఆలయ అధికారులు, సిబ్బంది కొంతమేర దుర్వినియోగానికి పాల్పడే వారనే వాదన ఉంది. అదేవిధంగా ఆలయానికి సంబంధించిన భూములను ఏళ్ల తరబడి ఒకే వ్యక్తికి కౌలుకిచ్చి కొంతమేర సొమ్మును స్వాహా చేసేవారనే ఆరోపణలున్నాయి. వీటితో పాటు ఏటా నిర్వహించే ఆడిట్‌ను సైతం కొంతమంది దేవాలయ అధికారులు నిర్లక్ష్యం చేసేవారు. ఈ జమా ఖర్చుల్ని తేల్చలేక ఆడిట్ అధికారులు సైతం చేతులేత్తేసే పరిస్థితి. ఆడిట్‌లోని అభ్యంతరాలు సైతం దశాబ్దాలుగా పరిష్కారానికి నోచుకోని వైనం అందరికీ స్పష్టమే. ఇలాంటి పరిస్థితుల్లో ఆన్లైన్ విధానంతో గతంలో చోటుచేసుకున్న నిర్వాకాలకు అడ్డుకట్ట వేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే ఆలయాలకు చెందిన ఆస్తులు, మాన్యాలు, భూములు, అభరణాల వివరాలను నమోదు చేస్తున్నారు. ఇది పూర్తయిన వెంటనే ఆదాయ, వ్యయ వివరాలను నమోదు ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఈ పరిస్థితుల్లో ఇక నుంచి ప్రభుత్వంతో పాటు ప్రజలకు సైతం జవాబుదారీగా ఉండాల్సిన వస్తుందని ఆలయ అధికారులు భయపడుతున్నారు. -
రాలని చినుకు
అయోమయంలో అన్నదాతలు ప్రత్యామ్నాయ పంటలు సూచిస్తున్న వ్యవసాయాధికారులు అపరాలు, చిరుధాన్యాలు మేలు అనకాపల్లి : జిల్లాలో వర్షాభావ పరిస్థితులు నెలకొంటున్నాయి. మైదానంలో పరిస్థితి తీవ్రంగా ఉంది. ఏజెన్సీలో అప్పుడప్పుడు చినుకులు పడుతున్నప్పటికీ మిగతా ప్రాంతాల్లో సాధారణంలో సగం కూడా వర్షపాతం నమోదు కాలేదు. వర్షాలు పుంజుకుంటేనే పంటలసాగు మెరుగవుతుంది. ఖరీఫ్‌లో గట్టెక్కగలమన్న ఆశలు రైతుల్లో అడుగంటుతున్నాయి. జిల్లాలో ఈ సమయానికి 128.8 మి.మీ. వర్షపాతం కురవాల్సి ఉండగా ప్రస్తుతం 39.8 మి.మీ. మాత్రమే నమోదైంది. ఈ ఖరీఫ్‌లో మొత్తం 2,27,400 హెక్టార్లలో సాగు లక్ష్యంగా వ్యవసాయాధికారులు నిర్దేశించారు. లక్షా 10 వేల హెక్టార్లలో వరి, 40 వేల హెక్టార్లలో చెరకు, 25 వేల హెక్టార్లలో రాగులు, 20 వేల హెక్టార్లలో మొక్కజొన్న, 32,400 హెక్టార్లలో ఇతర పంటలు చేపట్టాలని వ్యవసాయాధికారులు ప్రణాళికలు రూపొందిం చారు. గతేడాది ఖరీఫ్ జూలై చివరి వారంలో ప్రారంభమైంది. ఈ ఏడాది ఆగస్టు వరకు వేచి ఉండాల్సి వస్తుందని వ్యవసాయాధికారులు చెబుతున్నారు. అప్పటికీ వర్షాలు అనుకూలించకుంటే ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారిస్తామంటున్నారు. జిల్లాలో భూ గర్బజాలాలూ అడుగంటుతున్నాయి. ఈ సీజన్లో సగటున 24.84 అడుగుల లోతున నీరు లభ్యం కావాల్సి ఉంది. కానీ వర్షాభావ పరిస్థితులు కారణంగా భూగర్భజలాలు 26 అడుగుల కిందకు వెళ్లిపోయాయి. జూన్ నెలాఖరవుతున్నా వాన జాడ లేదు. రైతులతో పాటు, వ్యవసాయ విస్తరణ, పరిశోధన విభాగాల అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి వర్షాలు అనుకూలిస్తే జూన్ 15నాటికి వరి నారుపోతలు పూర్తవ్వాలి. రోజులో 30 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైతేనే నారుమళ్లకు అవసరమైన తేమ లభిస్తుంది. ఈ పరిస్థితుల్లో చినుకు జాడలేకపోవడంతో రైతులు జూలై, ఆగస్టు వర్షాలపైనే ఆశలు పెట్టుకున్నారు. జూన్‌లో వర్షాలు అనుకూలిస్తే శ్రీకాకుళం సన్నాలు, స్వర్ణ, ఇంద్ర వంటి రకాలను చేపట్టవచ్చు. కానీ వర్షాలు కలిసి రాలేదు. ఇప్పుడు జూలై వర్షాలే ఆదుకోవాలి. అదే జరిగితే వసుంధర, కాటన్దొర సన్నాలు, సురేఖ రకాలు నారుగా పోసుకోవాలని ఏరువాక కేంద్రం శాస్త్రవేత్త సి.వి. రామారావు సూచిస్తున్నారు. జూలైలో కూడా వరుణుడు కరుణించకుంటే ఆగస్టులో స్వల్ప కాలిక వంగడాలను నేరుగా ఎదజల్లే పద్ధతిలో నాట్లు వేసుకోవాలన్నారు. అప్పుడు ఎంటీయూ 1001,ఎంటీయూ 1010 వంగడాలను వినియోగిస్తే మేలు. వీటిని డ్రమ్‌సీడర్ ద్వారా లేదా నేరుగా ఎదజల్లే పద్ధతిలో వేస్తే రైతులకు ప్రయోజకరంగా ఉంటుంది. ఈ ఏడాది వర్షపాతం తక్కువగా ఉంటుందని వాతావరణ విభాగం అధికారులు సూచించడంతో వరి సాగుని తగ్గించి, మెట్టపంటలు వేసుకోవాలని వ్యవసాయాధికారులు పేర్కొం టున్నారు. నీటి వనరులు అధికంగా అవసరమయ్యే వరి విస్తీర్ణాన్ని తగ్గించి అపరాలు, చిరుధాన్యాలు, జోన్న వంటి పంటలను చేపట్టాలని చెబుతున్నారు. -
ధీమాలేని బీమా
జారీకాని ప్రీమియం చెల్లింపు నోటిఫికేషన్ రైతాంగ సమస్యలపై దృష్టి సారించని సర్కార్ పట్టనట్టు వ్యవహరిస్తున్న ప్రజాప్రతినిధులు విశాఖ రూరల్, న్యూస్‌లైన్: అన్నదాతపై ప్రభుత్వం అడుగడుగునా నిర్లక్ష్యం ప్రదర్శిస్తోంది. రైతుల సంక్షేమ పార్టీ అని చెప్పుకుంటూ అధికారం చేజిక్కించుకున్న సర్కారు ఇప్పుడు వారి విషయాన్ని గాలికొదిలేసింది. ఖరీఫ్ సీజ న్ ప్రారంభమవుతున్నప్పటికీ ఇప్పటి వరకు అందుకు అవసరమైన ఒక్క కార్యక్రమాన్ని కూడా చేపట్టలేదు. రైతు చైతన్య యాత్రలు నిర్వహించలేదు. యాంత్రీకరణ రాయితీ తేల్చలేదు. పంటల బీమా ఉందో లేదో స్పష్టత లేదు. దీంతో రైతాంగంలో అయోమయం నెలకొంది. గత మూడేళ్లుగా వరుసగా నష్టాల్లో కూరుకుపోయిన రైతులకు ఈ ఖరీఫ్ సీజన్ కూడా కష్టంగానే కనిపిస్తోంది. ఇటువంటి పరిస్థితుల్లో రైతులకు వెన్నుదన్నుగా నిలిచి.. బీమా, ప్రత్యామ్నాయ పంటలు, కొత్త రుణాల అందించే కార్యక్రమాలు చేయాల్సిన ప్రభుత్వం కనీసం ఆ విషయాలపై దృష్టి సారించడం లేదు. దీంతో రైతులు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. బీమా ఉన్నట్టా.. లేనట్లా.. : పంటల బీమాపై స్పష్టత లేకుండా పోయింది. ఏటా ఈ సమయానికి పంటల బీమా ప్రీమియం చెల్లింపునకు ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసేది. కాని ఇప్పటి వరకు ఆ ఊసే ఎత్తడం లేదు. జిల్లాలో మూడేళ్లుగా వాతావరణ బీమా అమలులో ఉంది. సాధారణంగా జూలై 15లోపు ప్రీమియం చెల్లించిన రైతులకు దీనిని వ ర్తింపజేస్తూ వస్తున్నారు. ఇందుకు నోటిఫికేషన్ మే నెలలోనే విడుదల చేసేవారు. కాని ఈసారి జూన్ నెలాఖరైనా నోటిఫికేషన్ ఇవ్వలేదు. తెలుగుదేశం ప్రభుత్వం రైతాంగ సమస్యలపై పూర్తి స్థాయిలో దృష్టి సారించడం లేదు. జిల్లా ప్రజాప్రతినిధులు కూడా రైతులను పట్టించుకోవడం లేదు. కేంద్ర ప్రభుత్వమేమో పంటల బీమాలో సమూలమైన మార్పులు తీసుకొస్తామని చెబుతోంది. బడ్జెట్ సమావేశాల్లో దీన్ని ప్రవేశపెట్టనున్నట్లు ప్రకటించింది. అది పూర్తయి అమల్లోకి వచ్చే సరికి ఈ ఏడాది పరిస్థితి ఏమిటన్నదే రైతాంగంలో అయోమయం నెలకొంది. గతేడాది జిల్లాలో వర్షాభావ పరిస్థితులతో పాటు వరదలకు రైతులు నష్టపోయారు. ఈ నష్టమెంతో ఇప్పటి వరకు తెలియకపోగా బీమా సంస్థ జిల్లాకు ఎంత నష్టపరిహారం చెల్లిస్తుందో వెల్లడించలేదు. వాతావరణ బీమాను అమల్లోకి తీసుకొచ్చే సమయంలో మాత్రం సీజన్ పూర్తయిన నెల రోజుల్లోపు బీమా రైతుల ఖాతాల్లో జమవుతుందని ప్రకటించారు. కాని ఆచరణలో అది అమలు జరగడం లేదు. -
వానమ్మా.. రావమ్మా!
అన్నదాత చూపు.. ఆకాశం వైపు - వర్షాకాలం ఆరంభమైనా కానరాని వాన - నిరాశపర్చిన నైరుతి రుతుపవనాలు - వెలవెలబోతున్న జలాశయాలు - ఆందోళన చెందుతున్న రైతులు ‘‘వానమ్మా.. ఓ వానమ్మా.. యాడున్నవమ్మా..! తొలకరి జల్లులతో మురిపించావు.. నల్లటి మబ్బులతో మరిపించావు. హమ్మయ్యా.. ఈయేడు నీళ్లకు తిప్పలు ఉండవని సంబురపడుతుండగనే తలతిప్పుకు పోయావు. పోనిలే.. విత్తు వేసుకునే సమయానికైనా వస్తావని ఎదురుచూస్తే.. పత్తా లేవు. పొలం దున్నడం మొదలుపెట్టి.. ఎరువులు, విత్తనాలు తెచ్చుకోవడం దాకా.. అరువుదెచ్చుకోనైనా అన్నీ సిద్ధం చేసుకున్నం. కానీ ఏం లాభం..? అసలు నువ్వేలేంది.. ఇవన్నీ ఉట్టియే కదా..! పొద్దుగల్ల లేవంగనే మొదలు మొగులునే జూస్తున్నం.. ఇయ్యళ్లన్న చినుకు రాకపోతుందా అని. ఓ దిక్కు విత్తుకునే కాలం గడిసిపోతుంది.. దినదినం పరేషాన్ ఎక్కువైతుంది. ఆరుగాలం కష్టాలు పడుతూ.. అందరికీ అన్నం పెట్టడమే తెలిసినోళ్లం.. మాపై కోపమెందుకే తల్లీ..!’’ అంటూ అన్నదాత కోటిఆశలతో ఆకాశంకేసి చూస్తున్నడు. చినుకు జాడలేక పోవడంతో చింత పెంచుకుంటున్నడు. కామారెడ్డి/నిజాంసాగర్: కోటి ఆశలతో ఖరీఫ్ సాగుకు సిద్ధమైన రై తన్నను జాడలేని వానలు ఆందోళన పెట్టిస్తున్నా యి. ఓవైపు సాగు సమయం మించిపోతున్నా.. చినుకులు కురవకపోవడంతో కర్షకులు కలవరపడుతున్నారు. తొలకరి జల్లులతో మురిపించిన వర్షం.. మళ్లీ కనిపించడం లేదు. కారుమబ్బులు కమ్ముకుంటున్నా.. నీటిచుక్కలు మాత్రం కురవడం లేదు. బండెడు ఆశతో ఎదురుచూసిన నైరుతి రుతుపవనాలు నిరాశపర్చాయి. గత ఏడాది ఈ సమయానికి వ ర్షాలు కురిసి.. పల్లెలు పంటసాగులో నిమగ్నమయ్యా యి. ప్రతీసారి జూన్ రెండోవారానికి వానలు వచ్చేవి. ఇప్పుడు మూడోవారం కావస్తున్నా వర్షాల జాడలేదు. సీజన్ తొలినాళ్లలోనే పరిస్థితులు ఇలా ఉంటే మున్ముం దు ఎలాంటి ఇబ్బందులుంటాయోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. విత్తు మొలకెత్తేనా..! ఖరీఫ్ పంటల సాగు కోసం రైతులు భూములను దు క్కి చేసి విత్తనాలను అలికినా.. విత్తు మొలకెత్తడం లేదు. చినుకులు రాకపోవడంతో మొలకలు రావ డం కష్టంగా మారనుంది. వరితో పాటు పలు పంటలు వర్షాధారంపైనే పండిస్తారు. సోయా, మొక్కజొన్న, పెసర, మినుము వంటి పంటల సాగుకూ సమయం ఆసన్నమైంది. చెరువులు, కుంటలు, ప్రాజెక్టులు, వ్యవసాయ బోరుబావుల కింద వరి సాగుకు సమాయత్తమైన రైతులు సైతం వర్షాల కోసం వేచిచూస్తున్నారు. నారుమడుల కోసం విత్తనాలను విత్తుకున్నారు. పడిపోయిన వర్షపాతం వర్షాకాలం మొదలై వారాలు గడుస్తున్నా వానల కురవకపోవడంతో జిల్లాలో వర్షపాతం నమోదు పడిపోయింది. జూన్ ఆరంభం నుంచి నెలాఖరు వరకు జిల్లాలో 181 మిల్లీమీటర్ల సాధార ణ వర్షపాతం నమోదు కావాల్సి ఉంది. కానీ ఇప్పటి వరకు 51.8 మిల్లీమీటర్ల వర్షపాతం మాత్రమే నమోదైనట్లు నీటిపారుదలశాఖ అధికారులు పేర్కొన్నారు. గత ఏడాది జూన్ మూడోవారం నాటికి జిల్లాలో 171.50 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. దీంతో పోలిస్తే ఈ నెలలో రెండింతల కన్నా తక్కువగా వర్షం కురిసింది. నిరుడు మృగశిర కార్తె నుంచి వర్షాలు కురవడంతో జిల్లాలోని జలాశయాలన్నీ జలకళను సంతరించుకున్నాయి. ఈసారి జిల్లా వరప్రదాయని నిజాంసాగర్, ఉత్తర తెలంగాణ పెద్దదిక్కు శ్రీరాంసాగర్లతో పాటు ఏ ప్రాజెక్టులోనూ చుక్కనీరు చేరలేదు. తగ్గనున్న సాగు విస్తీర్ణం..! ఈ ఖరీఫ్ సీజన్లో జిల్లాలో 3.98 లక్షల హెక్టార్లలో పంటలు సాగవుతాయని జిల్లా అధికారులు అంచనా వేశారు. ఇందులో ముఖ్యంగా వర్షాధార పంటలైన సోయా, మొక్కజొన్న 2లక్షల హెక్టార్లలో సాగవుతాయని భావించారు. అయితే ఇప్పటి వరకు వర్షాల జాడలేకపోవడంతో వర్షాధార పంటల సాగుపై తీవ్ర ప్రభావం పడనుంది. మరో వారం దాకా వర్షాలు కురవకుంటే వరి, సోయా పంటల సాగు విస్తీర్ణం సగానికి సగం తగ్గవచ్చని భావిస్తున్నారు. వరణుడి కరుణ కోసం గ్రామాల్లో దేవతామూర్తులకు పూజలు చేస్తూ.. బోనాలు సమర్పిస్తున్నారు. వనభోజనాలకూ వెళ్తున్నారు. -
ముంగారు... కంగారు!
మొహం చాటేసిన వరుణుడు జలాశయాల్లో కనిష్ట స్థాయికి నీటిమట్టం జూన్ కోటా నీటి కోసం తమిళనాడు డిమాండ్ అన్నదాతల్లో ఆందోళన సాక్షి, బెంగళూరు : రాష్ట్రంలో ఈసారి కూడా వరుణుడు మొహం చాటేయడంతో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. ప్రముఖ జలాశయాల్లో నీటి మట్టం కనిష్ట స్థాయికి పడిపోయింది. పరిస్థితులు ఇలా ఉంటే పొరుగున ఉన్న తమిళనాడు ప్రభుత్వం మాత్రం తమకు జూన్ కోటా కావేరి నీటిని విడుదల చేయాల్సిందేనని పట్టుపడుతోంది. రాష్ట్రంలో ముంగారు ప్రారంభమై దాదాపు 20 రోజులు గడిచినా కూడా ఇప్పటి వరకూ అనుకున్న స్థాయిలో వర్షాలు పడలేదు. భారత వాతావరణ శాఖ కర్ణాటక విభాగం గణాంకాలను అనుసరించి దక్షిణ కన్నడలో ఇప్పటి వరకూ 76.7 మిల్లీమీటర్ల వర్షం పడాల్సి ఉండగా 64.4 మిల్లీ మీటర్ల వర్షం మాత్రం నమోదైంది. అంటే కురవాల్సిన దానికన్నా 12.3 శాతం తక్కువగా వర్షం పడింది. అదేవిధంగా కరావళి ప్రాంతలో 440.5 మి.మీ వర్షం పడాల్సి ఉండగా 32 శాతం తక్కువ వర్షపాతం నమోదైంది. ఇక ఉత్తర కర్ణాటక ప్రాంతంలో ఇప్పటి వరకూ ఈ ప్రాంతంలో 59.7 మి.మీ వర్షం కురవాల్సి ఉండగా 36 మి.మీ వర్షం పడింది. అంటే కురవాల్సిన వర్ష పరిమాణంతో పోల్చినప్పుడు ఇది 40 శాతం తక్కువ. దీంతో వాతావరణ పరిభాష ప్రకారం రాష్ట్రంలోని మూడు వాతావరణ రీజియన్లలో దక్షిణ కర్ణాటక ప్రాంతంలో మాత్రం సాధారణ వర్షపాతం నమోదు కాగా, మిగిలిన రెండు ప్రాంతాల్లోనూ వర్షపుకొరత (డెఫిషియంట్) పరిస్థితులు ఏర్పడ్డాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా రాష్ట్రంలో వర్షాలు సరిగా పడక పోవడంతో ప్రధాన జలాశయాల్లో నీటి పరిమాణం కూడా అడగంటి పోతోంది. కావేరి నదీ తీరంలోని నాలుగు జలాశయాల్లో మొత్తం నీటి నిల్వ సామర్థ్యం 115 టీఎంసీలు కాగా, వర్షాకాలం ప్రారంభమై దాదాపు 20 రోజులు గడుస్తున్నా ఇప్పటి వరకూ కేవలం 18 టీఎంసీల నీరు మాత్రమే అందుబాటులో ఉంది. ఈ నీరు ఆయా ప్రాంతాల తాగునీటి కోసం మాత్రమే సరిపోతోందని అయితే సాగు నీటి కోసం రాష్ట్ర రైతులు పట్టుపడుతున్నారు. రాష్ట్రంలో పరిస్థితి ఇలాగా ఉంటే జూన్ కోటా 10 టీఎంసీల కావేరి నీటిని ఇవ్వాల్సిందేనని తమిళనాడు పట్టుపడుతుండటం మూలిగేనక్కపై తాటి పండు పడ్డ చందంగా ఉందని నీటి పారుదల శాఖ అధికారులు వాపోతున్నారు. కృష్ణా నదీ పరివాహక ప్రాంతంలోని ఐదు ప్రధాన జలాశయాల్లో కూడా ఇదే పరిస్థితి ఉంది. దీంతో పరిస్థితి ఇలాగే కొనసాగి రానున్న రోజుల్లో వరణుడు కరుణించక పోతే దాదాపు మూడేళ్ల నుంచి రాష్ట్రాన్ని పీడిస్తున్న కరువు ఈ సారి కూడా పునరావృతం అవుతుందని నిపుణుతోపాటు సాధారణ ప్రజలు కూడా పేర్కొంటున్నారు. -
సన్నగిల్లుతున్న ఆశలు
రుణమాఫీపై స్పష్టత లేకపోవడంతో ఆందోళన కోటయ్య కమిటీకీ గడువు కావాలనడంపై ఆగ్రహం ఖరీఫ్ పెట్టుబడుల కోసం అన్నదాతల తంటాలు రుణమాఫీ కథ కంచికి చేరేటట్టు కనిపించడం లేదు. అమలు విషయంలో కాలయాపనతో చంద్రబాబు ప్రభుత్వం అన్నదాతలను నమ్మించి మోసం చేస్తోందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. బకాయిలను నగదు రూపేణా ప్రభుత్వమే చెల్లించాలని ఆర్బీఐ పేర్కొనడం, కోటయ్య కమిటీకి మరింత గడువు కావాలని ఆర్థిక మంత్రి ఆదివారం ప్రకటించడంతో అన్నదాతల్లో ఆశలు సన్నగిల్లుతున్నాయి. అమలవుతుందో లేదోనన్న బెంగ పట్టి పీడిస్తోంది. చోడవరం/నర్సీపట్నం: రుణమాఫీపై స్పష్టత కొరవడడంతో రైతులు అయోమయానికి గురవుతున్నారు. బ్యాంకులు అప్పులివ్వకపోగా ఉన్నవి తీర్చాలంటూ ఒత్తిడి చేయడం అన్నదాతలకు మింగుడు పడడం లేదు. మరోపక్క మాఫీపై విధివిధానాల అధ్యయనానికి నియమించిన కోటయ్య కమిటీ నివేదికకు మరికొంత సమయం పడుతుందంటూ ఆర్థిక శాఖ మంత్రి ఆదివారం ప్రకటించడంతో రైతుల్లో ఆందోళన మరింత పెరిగింది. ఖరీఫ్ రుణాల కోసం బ్యాంకులను ఒప్పించే ప్రయత్నిస్తున్నామని మంత్రి చెప్పడంపై రైతుల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. 2013-14 ఖరీఫ్, రబీల్లో జిల్లాలోని 2,10,881 మంది రైతులు జాతీయ, సహకార బ్యాంకుల్లో సుమారు రూ. 894 కోట్ల రుణాలు తీసుకున్నారు. వీటిని ఇప్పటికే చెల్లించి, ఈ ఏడాది ఖరీఫ్ పెట్టుబడికి రుణాలు తీసుకోవా ల్సి ఉంది. గతేడాది సాగు అనుకూలించక పోవడంతో పాటు చంద్రబాబు రుణ మాఫీ హామీ తో ఈ బకాయిలు పేరుకుపోయాయి. వాస్తవానికి వర్షాలు అనుకూలిస్తే ఇప్పటికే ఖరీఫ్ పనులు ప్రారంభించాలి. వరుణుడు ముఖం చాటేయడంతో వ్యవసాయపనులు పెద్దగా ప్రారంభం కాలేదు. కానీ అదను ముంచుకురావడంతో అప్పుల కోసం వెంపర్లాడుతున్నారు. కమిటీ నివేదిక పేరుతో మాఫీపై ప్రభుత్వం జాప్యం పట్ల సర్వత్రా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. మరోపక్క గతేడాది అప్పులు తీర్చాలంటూ కొన్ని బ్యాంకులు రైతులకు నోటీసులు జారీ చేశాయి. నెలాఖరులోగా చెల్లించకపోతే బంగారాన్ని వేలం వేస్తామంటూ హెచ్చరిస్తుండటంతో రైతులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు.ఇదిలా ఉండగా అధికారంలోకి వచ్చిన వెంటనే ఎటువంటి షరతుల్లేకుండా రుణమాఫీ అమలు చేస్తానంటూ ఎన్నికల్లో హామీ ఇచ్చిన చంద్రబాబు ప్రమాణస్వీకారం అనంతరం కోటయ్య కమిటీ ఏర్పాటుకే పరిమితమయ్యారు. ఈ నేపథ్యంలో మాఫీ విధానంతో బ్యాంకులు ఆర్థికంగా నష్టపోతాయంటూ ఆర్బీఐ అభిప్రాయపడింది. ఈమేరకు ఈ నెల 11న ప్రభుత్వానికి లేఖ రాసింది. మాఫీ తప్పనిసరిగా అమలు చేయాలంటే బకాయిలను నగదు రూపంలో బ్యాంకులకు చెల్లించాలంటూ అందులో పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వం సెక్యూరిటీలను తాము ఆమోదించబోమని స్పష్టం చేసింది. ఆర్థికస్థితి నామమాత్రంగా ఉన్న పరిస్థితుల్లో మాఫీ అమలు సాధ్యమా అన్న అనుమానాన్ని మేథావులు సైతం వ్యక్తం చేస్తున్నారు. రుణాలు మాఫీ చేయాలి నాది కె.కోటపాడుమండలం వారాడ సంతపాలెం. నాకు 3ఎకరాలు పొలం ఉంది. ఇందులో ఏటా వరి పంట వేస్తుంటాను. మదుపుల కోసం ఏపీజీవీబీలో రెండేళ్ల కింద రూ.50వేలు అప్పుతీసుకున్నాను. పంట కలిసిరాకపోవడంతో అప్పు తీర్చలేకపోయాను. టీడీపీ రుణమాఫీ ప్రకటనతో సంబరపడ్డాను. కానీ ఇప్పుడు ఇంకా సమయం పడుతుందని మంత్రి ప్రకటించడం రైతులను మోసగించడమే. ఇలాంటి మాటలు కాకుండా వెంటనే వ్యవసాయ రుణాలు మాఫీ చేయాలి. - వేచలపు సింహాద్రప్పడు, రైతు, వి.సంతపాలెం. మంత్రి ప్రకటనతో భయంగా ఉంది నాది చోడవరం మండలం మైచర్లపాలెం గ్రామం. నాకు రెండెకరాల భూమి ఉంది. వ్యవసాయ పెట్టుబడుల కోసం చోడవరం ఆంధ్రాబ్యాంకులో రెండు తులాల బంగారు ఆభరణాలు గతేడాది కుదువ పెట్టి రూ.30వేలు రుణం తీసుకున్నాను. ప్రభుత్వం రుణ మాఫీ చేస్తుం దని ఎదురు చూస్తున్నాను. ఇంతలో బ్యాంక్ నుంచి నోటీసు వచ్చింది. నెలాఖరులోగా అప్పు తీర్చకుంటే ఆభరణాలు వేలం వేస్తామంటున్నారు. ఆర్థిక మంత్రి ప్రకటనతో ఆందోళనకరంగా ఉంది. - నానుబిల్లి అర్జునరావునాయుడు, రైతు, మైచర్లపాలెం. ప్రభుత్వం మోసం చేస్తోంది నాది దేవరాపల్లి మండలం కొత్తపెంట. నాకు రెండెకరాల పొలం ఉంది. వరి,చెరకు పంటలు వేస్తున్నాను. గతేడాది కె.కోటపాడు స్టేట్బ్యాం క్లో ఆరు తులాల బంగారు ఆభరణాలు తాకట్టుపెట్టి పంట రుణంగా రూ.1.2లక్షలు తీసుకున్నాను. కోటయ్య కమిటీ నివేదికకు మరికొన్ని రోజులు పడుతుందని ఆర్థిక శాఖ మంత్రి చెప్పడం రైతులను మోసం చేయడమే. -రొంగలి వెంకట్రావు, రైతు, కొత్తపెంట. -
కష్టాల ఖరీఫ్
చినుకు జాడ లేదు...విత్తనాల ఊసు లేదు రుణం తీరదు...కొత్త అప్పు పుట్టదు కష్టాల ఖరీఫ్‌లో అన్నదాత ఎదురీత ఈ ఏడాదీ ఖరీఫ్‌కు కష్టాలు తప్పేట్టు లేదు...సకాలంలో రాని రుతుపవనాలు, విత్తనాలకు రాయితీ ఎత్తివేత వీటితో పాటు రుణమాఫీ ప్రకటనతో అప్పులివ్వని బ్యాంకర్లు వెరసి ఖరీఫ్ సాగు చేసేందుకు రైతులు నానా కష్టాలు పడుతున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే సకాలంలో ఖరీఫ్ సాగు కాకపోతే ప్రకృతి వైపరీత్యాల బారిన పడే ప్రమాదం ఉంది. నర్సీపట్నం : ఈ ఏడాది ఖరీఫ్‌లో జిల్లా వ్యాప్తంగా 2.27 లక్షల హెక్టార్లలో అన్ని రకాల పంటలు సాగుచేయాలని అధికారులు లక్ష్యంగా చేసుకున్నారు. జిల్లా సాధారణ విస్తీర్ణం 2.03 లక్షల హెక్టార్లు కాగా, వాతావరణం అనుకూలిస్తే మరింత ఎక్కువ సాగుచేయాలనే లక్ష్యంతో ప్రణాళిక తయారు చేశారు. దీనిలో అధికంగా లక్ష హెక్టార్లకు మించి విస్తీర్ణంలో వరి పంటను సాగుచేస్తారని భావిస్తున్నారు. మిగిలిన విస్తీర్ణంలో ప్రధానంగా చెరకు 40 వేలు, రాగులు 25 వేలు, చిరు ధాన్యాలు 16,500, గంటి 6 వేలు, మొక్కజొన్న 6,500 హెక్టార్లలో సాగుచేయాలని లక్ష్యంగా చేసుకున్నారు. వినిపించని ‘రుతు’రాగం కేరళను తాకిన రుతుపవనాలు ఈ నెల ప్రారంభానికే రాష్ట్రంలోకి ప్రవేశిస్తాయని వాతావరణ విభాగం అంచనా వేసినా, జిల్లాలో పరిస్థితి దానికి భిన్నంగా ఉంది. ప్రస్తుత విషయానికొస్తే జూన్ సాధారణ వర్షపాతం 128.8 మిల్లీమీటర్లు కాగా ఇప్పటివరకు 36.9 మి.మీ నమోదయ్యింది. గత ఏడాది ఇదే సమయానికి 90.3 మి.మీ వర్షపాతం నమోదయ్యిందంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక రుణాల విషయానికొస్తే 2013-14 ఖరీఫ్, రబీ సీజన్లకు గాను జిల్లాలోని 2,10,881 మంది రైతులు వ్యవసాయ పెట్టుబడులకు జాతీయ, సహకార బ్యాంకుల్లో సుమారుగా రూ. 894 కోట్లు రుణాలుగా తీసుకున్నారు. ఖరీఫ్ మార్చి చివరిలోగా, రబీ బకాయిలు జూన్ చివరిలోగా చెల్లించాల్సి ఉంది. కాలం కలిసి రాకపోవడంతో పాటు రుణ మాఫీ ప్రకటించడంతో చెల్లింపులన్నీ నిలిచిపోయాయి. ఈ పరిస్థితుల్లో ఈ ఏడాది ఖరీఫ్ రుణ లక్ష్యం రూ. 700కోట్లు ఇచ్చేందుకు అధికారులు లక్ష్యంగా చేసుకున్నా ఇంతవరకు ఒక్కరికి రుణం ఇచ్చిన దాఖలాలు లేవు. దీంతో వడ్డీ ఎక్కువైనా ప్రైవేటు అప్పుల కోసం రైతులు వెతుకులాట ప్రారంభించారు. విత్తనాల్లో రాయితీకి కోత ఇక విత్తనాల విషయానికొస్తే జిల్లాలో వరి సాగుచేసేందుకు వివిధ రకాలైన 19.5 వేల క్వింటాళ్లు విత్తనాలను ఏపీ సీడ్స్ సిద్ధం చేసింది. వీటిలో అధికశాతం రైతులు వినియోగించే శ్రీకాకుళం సన్నాలు (ఆర్జీఎల్) విత్తనాల్లో రాయితీకి కోత విధించడంతో రైతులకు మరికొంత భారంగా మారింది. ప్రస్తుతం ఆర్జీఎల్ 510 క్వింటాళ్లు సిద్ధం చేయగా, మరో 340 క్వింటాళ్లు సరఫరా చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక ఎరువుల విషయానికొస్తే జిల్లాలో ఖరీఫ్ సాగుకు అవసరమైన 4,917 మెట్రిక్ టన్నుల యూరియా, 6,600 మెట్రిక్ టన్నుల కాంప్లెక్స్ ఎరువులను సిద్ధం చేశారు. ఈ విధంగా ఈ ఏడాది ఖరీఫ్ కష్టాల మయంగా మొదలు కాబోతుంది. -
వరుణుడిపైనే ఖరీఫ్ ఆశలు
దుర్భిక్షం వర్షాలు కురిస్తేనే సాగునీరు దేవుడిపైనే భారం ఎండిన మంచినీటి చెరువులు గ్రామాల్లో దాహం కేకలు విజయవాడ సిటి : ఈ ఏడాది ఖరీఫ్ సాగు ప్రశ్నార్థకంగా మారింది. జూన్ నెల పూర్తికావస్తున్నా నేటికి చినుకు రాలకపోవడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. సాగునీటి కోసం 20 రోజుల నుంచి ఎదురుచూపులు చూస్తున్నా వరుణుడు కరుణించకపోవడంతో కాలువలు, చెరువులు ఎండిపోయాయి. దుక్కులు దున్ని చినుకురాక కోసం ఎదురుచూపులు చూస్తున్న రైతన్నలు ఈ ఏడాది ఖరీఫ్ సాగు ఎలా చేపట్టాలో అర్థం కాక అయోమయంలోపడ్డారు. వర్షాలు కురిస్తేనే సాగునీరు విడుదలయ్యే అవకాశం ఉండడంతో వచ్చేనెల వరకు సాగునీటి విడుదల కష్టమని అధికారులు చెబుతున్నారు. మరోవైపు కనీసం మంచినీటికైనా నీరు విడుదల చేస్తారో లేదోనని ప్రజలు ఆందోళన చెం దుతున్నారు. ఈక్రమంలో రుతుపవనాలు జాడ లేక వర్షం కురవకపోవడం, భూగర్భజలా లు అడుగంటడంతో కృష్ణా జిల్లాలో తీవ్ర కరువుపరిస్థితులు నెలకొన్నాయి. పశ్చిమ కృష్ణా మెట్టప్రాంతంలో నెలరోజులుగా వర్షాలు లేక మంచినీటికి కూడా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.మచిలీపట్నం, గుడివాడ, అవనిగడ్డ, చల్లపల్లి, ఉయ్యూరు, డెల్టాప్రాంతంలో కూడా అదే పరిస్థితి నెల కొంది. జిల్లాలో రెండువేలకు పైగా మంచినీటి చెరువులు ఎండిపోయాయి. జూన్‌లో కూడా విపరీతమైన వడగాడ్పులు వీస్తుండడంతో జిల్లాలో డెల్టా, మెట్ట ప్రాంతాలలో ఖరీఫ్ సాగు ప్రశ్నార్థకంగా మారింది. ఎగువ నుంచి నీరు వచ్చేనా? కర్ణాటకలో కూడా వర్షాలు లేకపోవడంతో ఆల్మట్టీ, నారాయణపూర్ డ్యామ్‌లలో కూడా జలసిరులు నిండుకున్నాయి. ఈరెండు ప్రాజెక్టులు నిండితేనే శ్రీశైలం,సాగర్‌లోకి నీరు చేరి దిగువనున్న కృష్ణానదికి విడుదల చేసే పరిస్థితి ఉంది. ఎగువ ప్రాంతంలో కర్ణాటక, మహారాష్ట్ర, సాగర్‌లో వర్షపు నీరు కిందికి వస్తే కృష్ణా డెల్లాకు నీరు విడుదల అయ్యే అవకాశం లేదని అధికారులు చెబుతున్నారు. మరోవైపు రాష్ట్ర విభజన జరగడం తెలంగాణా ఎగువ నుంచి నీరు విడుదల మరో సమస్యకానుంది. తూర్పు కృష్ణాలో ఆరున్నర లక్షల ఎకరాల్లో ప్రతి ఏటా వరినాట్లు వేస్తారు. జూలైలో కూడా సాగు నీరు విడుదల కాకపోతే నాట్లు ఆలస్యమై సెప్టెంబర్, నవంబర్ నె లలో తుఫానులు అధికంగా వచ్చే సీజన్లో పంట దెబ్బతింటుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. పశ్చిమ కృష్ణాలో అదే పరిస్థితి ఎండవేడిమి, విద్యుత్ కోతలతో పశ్చిమకృష్ణా మెట్ట ప్రాంతంలో నాలుగున్నర లక్షల మెట్టపొలాల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఈప్రాంతంలో దాదాపు వెయ్యికి పైగా చెరువులురెండు నెలలుగా ఎండిపోయాయి. మరో వైపు ఎండవేడిమి, విద్యుత్ కోతలతో వ్యవసాయ బోర్లు సరిగా పని చేయడంలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తిరువూరు, మైలవరం, జగ్గయ్యపేట, నంది గామ, నూజివీడు, విస్సన్నపేట ప్రాంతాల్లో కూడా ప్రజలు మంచినీటికి అల్లాడుతున్నారు. పశువులకు కూడా నీటి కొరత ఏర్పడడంతో పశుపోషకులు ఇబ్బందులు పడుతున్నారు. అడుగంటిన భూగర్బజలాలు కొద్ది రోజులుగా ఎండవేడిమికి భూగర్భజలాలు కూడా అడుగంటాయి. బావులలో, బోర్లలో నీరు లోతుకు వెళ్లాయి. జిల్లాలో డెల్టా ప్రాంతంలో 4.90మీటర్ల లోతులో భూగర్భ జలాలు ఉన్నాయి. మెట్టప్రాంతంలో 1.20మీటర్ల లోతులోకి వెళ్లాయని అధికారులు తెలిపారు. జిల్లా సగటున 8.75 మీటర్ల లోతుకు వెళ్లి నట్లు భూగర్బజల అధికారులు వివరించారు. గత నెల కంటే ఈ నెలలో రెండు మీటర్ల లోతుకు భూగర్బజలాలు వెళ్లాయి. 25 నుంచి నీరు విడుదల ప్రభుత్వం ఈ నెల 25 నాటికి కృష్ణా డెల్లాకు మంచినీరు విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు ఇరిగేషన్ అధికారులు చెబుతున్నారు. ఈ నెల 20 నాటికి డెల్టాలో అన్నికాలువలు మరమ్మతులు పూర్తిచేసి అప్పగించాలని అధికారులు కాంట్రాక్టర్లను ఆదేశించారు. ై వర ్షపు నీటితోనైనా తాగడానికి నీరు ఇచ్చేం దుకు అధికారులు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. -
ఆదర్శం అంతర్థానం!
ఆదర్శ రైతులను తొలగిస్తామన్న సీఎం కొత్త ప్రభుత్వం కొలువుతీరిన వారానికే అన్నదాతల వెన్ను విరిచే ప్రయత్నం విశాఖ రూరల్: చంద్రబాబు ప్రభుత్వం కొలువుతీరిన వారం రోజులకే రైతుల వెన్ను విరిచే కార్యక్రమాలు మొదలయ్యాయి. వ్యవసాయాభివృద్ధికి దోహదపడే ఆదర్శరైతు వ్యవస్థ నిర్వీర్యానికి పూనుకుంటోంది. అన్నదాతలకు అండగా ఉండే వీరిని తొల గించేందుకు సిద్ధమవుతోంది. ఏడాదిన్నరగా గౌరవ భృతి అంద కపోయినా.. రైతులకు వెన్నుదన్నుగా ఉంటున్నవారిని పక్కనపెట్టే ఆలోచన పట్ల రైతాంగంలో ఆందోళన వ్యక్తమవుతోంది. రైతులకు బాసటగా నిలుస్తూ, ఆధునికసాగు పద్ధతులను రైతులకు చేరవేసే లక్ష్యంతో దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర్‌రెడ్డి 2007లో ఆదర్శ రైతు పథకాన్ని ప్రవేశపెట్టారు. దీని ప్రకారం జిల్లాలో 1958 మందిని ఆదర్శ రైతులుగా నియమించారు. వీరికి ఒక్కొక్కరికీ నెలకు రూ.వెయ్యి చొప్పున గౌరవ భృతి చెల్లించాలని నిర్ణయించారు. వైఎస్ మరణానంతరం కాంగ్రెస్ ప్రభుత్వం వీరిని పట్టించుకోలేదు. వారికి గౌరవభృతిని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాదిన్నరగా సక్రమంగా అందించలేదు. ఇప్పట వరకు మొత్తం రూ.2.82 కోట్లు చెల్లించాల్సి ఉంది. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం పనితీరు బాగోలేదంటూ వీరిలో కొందరిని అధికారులు తొలగించారు. అలాగే మరికొంత మంది వివిధ ఎన్నికల్లో పోటీ చేయడం, ఇతరత్రా కారణాల వల్ల జిల్లాలో 389 ఆదర్శ రైతుల పోస్టులు ఖాళీ అయ్యాయి. రెండేళ్లుగా వీటిని భర్తీ చేయలేదు. ఇదేనా చిత్తశుద్ధి! కొత్త ప్రభుత్వమైనా తమకు సక్రమంగా వేతనాలు ఇస్తుందని ఆదర్శరైతులు ఆశించారు. కానీ వారిని తెలుగుదేశం ప్రభుత్వం వారిని తొలగిస్తున్నట్టు ప్రకటించడంతో సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది. వ్యవసాయాభివృద్ధి కోసం రైతుల్లో చైతన్యం కలిగించడానికి ప్రయత్నించాల్సిన ఆదర్శ రైతులను టీడీపీ ప్రభుత్వం అప్పుడే రోడ్డెక్కి ఆందోళనలకు దిగేలా చేసింది. చంద్రబాబు నిర్ణయం పట్ల ఆదర్శ రైతుల సంఘం మండిపడుతోంది. నిర్ణయాన్ని ఉపసంహరించుకోకపోతే రాష్ట్రంలో ఉన్న 48 వేల ఆదర్శ రైతులందరూ ఉద్యమించాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు. ఉద్యోగ భద్రత కల్పించాలి: ఉద్యోగ భద్రత కల్పించి ఆదుకోవాలి. వ్యవస్థను రద్దు చేసే కన్నా ప్రక్షాళన చేసి తప్పులు సరిదిద్దాలి. కార్మిక శాఖ ఆదేశాల మేరకు జీతం ఇవ్వాలి. వ్యవస్థ ద్వారా ఎంతో మంది ఉపాధి పొందుతున్నారు. - సోమునాయుడు, ఆదర్శరైతు, పరవాడ మండలం బాగా పనిచేస్తున్నాం: 2007లో దివంగత సీఎం వైఎస్సార్ మంచి ఉద్దేశంతో ఈ వ్యవస్థను ప్రారంభించారు. నాటి నుంచి రైతులు, వ్యవసాయాధికారులు, బ్యాంకులతో అనుసంధానంగా పనిచేస్తున్నాం. పార్టీలకతీతంగా రైతుల పక్షానే ఉంటున్నాం. ఆదర్శరైతుల రిక్రూట్మెంట్ ఏకపక్షంగా జరిగిందనే నెపంతో సీఎం చంద్రబాబు వ్యవస్థను రద్దు చేస్తామనడం సమంజసం కాదు. - పాటూరు వెంకట్రావు, కె.కోటపాడు మండలం రుణమాఫీకి సహకరిస్తాం రుణ మాఫీ అమలు కష్టతరం. అయినప్పటికీ సీఎం చంద్రబాబుకు సహకరిస్తూ మావంతు కృషి చేస్తాం. రైతుల రుణమాఫీకి మా వంతు సాయంగా ఒక నెల జీతం(వెయ్యి రూపాయల జీతాన్ని) అందిస్తాం. ఆదర్శరైతుల్లో డిగ్రీ పూర్తి చేసిన వారు కూడా ఉన్నారు. వ్యవస్థను రద్దు చేయకుండా పనిచేయని వారిని తీసేసి మమ్మల్ని ఆదుకోవాలి. - వంటాకు రెడ్డినాయుడు, గొండుపాలం ఆభరణాలు వేలం వేస్తారట.. నాది చీడికాడ మండలం అర్జునగిరి. నాకు రెండెకరాల పొలం ఉంది. చెరకు పండిస్తాను. 2011లో నాలుగు తులాల బంగారు ఆభరణాన్ని కుదువపెట్టి రూ.40వేలు వ్యవసాయ రుణం తీసుకున్నారు. మెట్టభూమి కావడంతో రెండేళ్లుగా పంట కలిసిరాలేదు. అప్పు తీర్చలేకపోయాను. ఇంతలో చంద్రబాబునాయుడు వ్యవసాయ రుణాలు మాఫీ అంటూ హామీ ఇచ్చారు. సంతోషించాను. అయితే అప్పు ఇచ్చిన చోడవరం ఆంధ్రాబ్యాంక్ వారు చెల్లించాలంటూ శుక్రవారం నోటీసు పంపారు. లేదంటే ఈనెల 20న ఆభరణాన్ని వేలం వేస్తామని అందులో పేర్కొన్నారు. ఆందోళనగా ఉంది. -బోడాల రాజబాబు, రైతు, అర్జునగిరి. -
పంట కాల్వలు ఇలా..సాగుకు నీరెలా?
పూడికతీత చేపట్టలేదు రసాయనాల పిచికారీకి అనుమతులు రావాలట దుస్థితిలో పంట కాలువలు సాగుపై అన్నదాతల ఆందోళన ఖరీఫ్ సీజన్ ముంచుకొస్తోంది. మరికొద్దిరోజుల్లో రుతుపవనాలు వచ్చే అవకాశాలూ కనిపిస్తున్నాయి. దీంతో రైతులు సాగుకు సన్నద్ధమవుతున్నారు. సాగునీటిని సరఫరా చేసే పంట కాలువల పరిస్థితి మాత్రం దయనీయంగా ఉంది. అనేక కాలువలు చెత్తాచెదారం, గుర్రపుడెక్కతో నిండిపోయాయి. కాలువ గట్లు బలహీనంగా ఉన్నాయి. దెబ్బతిన్న రివిట్మెంట్లకు మరమ్మతులు లేవు. డెల్టా ఆధునికీకరణ పేరుతో కాలువల్లో పూడికతీత పనులను పక్కన పెట్టేశారు. దీంతో ఈ ఏడాది సాగు జరిగేదెలా అని అన్నదాతలు ఆందోళనకు గురవుతున్నారు. మచిలీపట్నం, న్యూస్‌లైన్ : జిల్లా వ్యాప్తంగా ఈ ఏడాది ఖరీఫ్ సీజన్లో 6.34 లక్షల ఎకరాల్లో వరిసాగు జరుగుతుందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. వాతావరణ పరిస్థితులు అనుకూలిస్తే జూన్ నెలాఖరు నాటికి నారుమడులు పోసుకునేందుకు రైతులు సన్నద్ధమవుతున్నారు. సాగునీటి కాలువల్లో పూడికతీతకు కనీస చర్యలు చేపట్టకపోవటంతో రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. గత నాలుగేళ్లుగా డెల్టా ఆధునికీకరణ పేరుతో సాగునీటి కాలువల్లో పూడికతీత పనులను పక్కన పెట్టేశారు. కేఈబీ తదితర కాలువలపై డెల్టా ఆధునికీకరణ పేరుతో వంతెనలను మాత్రమే నిర్మించారు. కాలువల్లో గుప్పెడు మట్టి తీసిన దాఖలాలు లేవు. 2011-12లో డెల్టా ఆధునికీకరణలో 20 శాతం, 2012-13లో కేవలం ఎనిమిది శాతం మాత్రమే పనులు చేసి సరిపెట్టారు. జిల్లా రైతులు రెండేళ్లపాటు రెండో పంటను వదులుకున్నా ఆధునికీకరణ పనులు ఆశించిన స్థాయిలో జరగలేదు. రసాయనాల పిచికారీకి అనుమతులు రావాల్సిందే... ఏటా వేసవిలో సాగునీటి కాలువల్లో పేరుకుపోయిన గుర్రపుడెక్క, తూటుకాడ, నాచులను నిర్మూలించేందుకు రసాయనాలు పిచికారీ చేస్తారు. మండు వేసవిలో ఈ రసాయనాలు పిచికారీ చేస్తే ఉపయోగం ఉంటుందని రైతులు చెబుతున్నారు. జూన్‌లో వర్షాలు కురిసే సమయంలో రసాయనాలు పిచికారీ చేసినా ఉపయోగం ఉండదనేది అధికారుల వాదన. రసాయనాలు పిచికారీ చేసిన ఒకటి రెండు రోజులకు వర్షం కురిస్తే నాచు, తూటుకాడ మళ్లీ పిలకలు తొడుగుతుందని రైతులు అంటున్నారు. ఈ ఏడాది జిల్లా వ్యాప్తంగా సాగునీటి కాలువల్లో రసాయనాలను పిచికారీ చేసేందుకు రూ.2.50 కోట్లతో అంచనాలు తయారుచేసి అనుమతుల కోసం పంపినట్లు నీటిపారుదల శాఖాధికారులు చెబుతున్నారు. ప్రభుత్వం నుంచి అనుమతి వస్తేనే రసాయనాల పిచికారీ ఉంటుందని పేర్కొంటున్నారు. ప్రభుత్వం ఈ పనులకు ఎప్పటికి అనుమతులిస్తుంది.. ఎప్పటికి పనులు పూర్తిచేస్తారనే అంశంపై రైతుల్లో సందిగ్ధత నెలకొంది. జిల్లాలోని పలు కాలువల పరిస్థితి ఇదీ... డెల్టా ప్రాంతానికి శివారున ఉన్న అవనిగడ్డ, నాగాయలంక, కోడూరు, బంటుమిల్లి, కృత్తివెన్ను మండలాలకు సాగునీటిని సరఫరా చేసే ప్రధాన కాలువల్లో కనీస పూడికతీత పనులు చేయటం లేదు. అవనిగడ్డ, కేఈబీ కాలువకు పులిగడ్డ-అవనిగడ్డల మధ్య రిటైనింగ్ వాల్ పనులు నత్తనడకన సాగుతున్నాయి. గుడివాడ తదితర ప్రాంతాల్లో బల్లిపర్రు, దోసపాడు తదితర చానళ్లు ఉన్నాయి. వీటిలో తూడుకాడ, గుర్రపుడెక్క పేరుకుపోవటంతో పాటు కాలువలు పూడుకుపోయాయి. గట్లు దెబ్బతిన్నాయి. ఈ కాలువల కనీస మరమ్మతులు ఇంతవరకు చేపట్టలేదని ఆ ప్రాంత రైతులు చెబుతున్నారు. బంటుమిల్లి చానల్‌కు సాతులూరు - చినతుమ్మిడి గ్రామాల మధ్య ఆధునికీకరణ పనుల్లో భాగంగా గత ఏడాది వంతెన నిర్మించారు. ఈ వంతెనకు అప్రోచ్ పనులను కాంట్రాక్టర్లు పక్కన పెట్టేశారని రైతులు చెబుతున్నారు. కోడూరు, నాగాయలంక కాలువలకు అండర్ టన్నెల్ నిర్మించేందుకు పునాదులు వేశారు. ఇవి నీటి ప్రవాహానికి అడ్డుగా ఉన్నాయని రైతులు మొరపెట్టుకుంటున్నా పట్టించుకునే నాథుడే లేకుండా పోయాడు. వీటి ప్రభావంతో రామకృష్ణాపురం, మందపాకల తదితర ప్రాంతాలకు సాగునీటి విడుదలలో తీవ్ర జాప్యం జరుగుతోంది. కైకలూరు, కలిదిండి తదితర ప్రాంతాలకు పోల్‌రాజ్ కాలువ, క్యాంప్‌బెల్ కాలువ, సీబీ చానల్ ద్వారా సాగునీటి సరఫరా జరుగుతోంది. ఈ ప్రధాన కాలువల్లో ఈ ఏడాది ఇంతవరకు పూడికతీత పనులే చేపట్టలేదు. క్రస్ట్ గేట్లు, లాకులకు కనీస మరమ్మతులు చేయలేదు. మైలవరంలో వెల్వడం, చెవుటూరు మేజర్ చానల్స్‌తో పాటు బొర్రగూడెం, మైనర్ కాలువలు పూడుకుపోయాయి. ఏళ్ల తరబడి ఈ కాలువలకు మరమ్మతులు చేయకపోవటంతో గట్లు దెబ్బతిన్నాయి. శివారు ప్రాంతాలకు సాగునీరు అందించేందుకు అధికంగా నీరు విడుదల చేస్తే గండ్లు పడుతున్న ఘటనలు ఏటా జరుగుతున్నాయి. దీంతో శివారుకు సాగునీందని పరిస్థితి నెలకొంటోంది. ఇబ్రహీంపట్నం కటికలపూడి ఎత్తిపోతల పథకం పనిచేయటం లేదు. ఎన్ఎస్పీ కాలువలో మూడేళ్ల క్రితం నామమాత్రంగా పూడికతీత పనులు చేశారు. ఈ పనుల వల్ల ఉపయోగం లేకుండాపోయిందని స్థానిక రైతులు చెబుతున్నారు. బందరు మండలంలోని నాగులేరు, రామరాజుపాలెం కాలువలకు గత పదేళ్లుగా మరమ్మతులు చేయలేదు. పూడికతీత పనులు చేపట్టలేదు. రామరాజుపాలెం కాలువ ద్వారా బందరు, పెడన, గూడూరు మండలాలకు సాగునీరు విడుదలవుతుంది. ఈ కాలువ గట్లు బలహీనంగా మారాయి. గూడూరు సమీపంలో కాలువ గట్లకు రివిట్మెంట్ పూర్తిగా దెబ్బతింది. కనీస మరమ్మతులు ఇక్కడ చేయటం లేదు. పెడన మండలానికి సాగునీటిని సరఫరా చేసే న్యూ ఎస్వీఎస్, ఓల్డ్ ఎస్వీఎస్, పుల్లపాడు చానళ్లకు పదేళ్లుగా మరమ్మతులు లేవు. దీంతో ఈ కాలువలు పూడుకుపోయి శివారు ప్రాంతాలకు సాగునీరందని పరిస్థితి నెలకొంది. -
ఆశలన్నీ.. రుణమాఫీ పైనే
రైతులను నమ్మించి ఓట్లు దండుకున్న టీడీపీ జిల్లాలో రూ.9,137 కోట్ల పంట రుణ బకాయిలు అన్నదాతల్లో అయోమయం - హామీ అమలుపై సందిగ్ధం రైతు రుణమాఫీ.. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు సార్వత్రిక ఎన్నికల్లో ప్రకటించిన ప్రధాన హామీ ఇది. ఆ పార్టీ గెలుపులో ఈ హామీ కూడా ప్రధాన భూమిక పోషించిందనడంలో సందేహం లేదు. మరికొద్దిరోజుల్లో ఆ పార్టీ అధినేత చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఇప్పుడు రైతుల ఆశలన్నీ రుణాల మాఫీపైనే ఉన్నాయి. ఎన్నికలకు ముందు రుణమాఫీ చేసి చూపిస్తాం.. అంటూ మాట్లాడిన టీడీపీ నాయకులు.. ఫలితాల తర్వాత దాన్ని దాటవేస్తుండటం అన్నదాతలకు ఆందోళన కలిగిస్తోంది. రుణ మాఫీ అమలుపై అనుమానాలు రేకెత్తిస్తోంది. మచిలీపట్నం, న్యూస్‌లైన్ : సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ రైతు రుణాల మాఫీ అంశాన్ని ప్రధాన అజెండాగా తీసుకుంది. దీన్ని విస్తృతస్థాయిలో ప్రచారం చేసింది. రుణమాఫీ చేసి తీరుతామంటూ అన్నదాతలను నమ్మించింది. ఎన్నికల్లో లబ్ధి పొంది అధికారం దక్కించుకుంది. అప్పులు తీర్చేస్తామంటూ ఆ పార్టీ అధినేత చంద్రబాబు నమ్మకంగా చెబుతున్నా.. అన్నదాతల్లో ఏదో మూలన సందేహం వెంటాడుతూనే వచ్చింది. అధికారంలో ఉన్న తొమ్మిదేళ్లూ వ్యవసాయం, రైతులను పట్టించుకోకుండా.. హైటెక్ ముఖ్యమంత్రిగా వెలుగొందిన చంద్రబాబు రుణమాఫీ చేస్తారా అనే సందేహం ఉన్నా సరే ఓట్లు వేశారు. తీరా ఇప్పుడు చంద్రబాబు గానీ, ఆ పార్టీ నేతలు గానీ రుణమాఫీ హామీని అమలు చేస్తామని ఎక్కడా స్పష్టం చేయడం లేదు. ఇది రైతుల్లో ఆందోళన రేకెత్తిస్తోంది. అనుమానాలున్నా సరే టీడీపీని గెలిపించిన అన్నదాతలు రుణమాఫీపై మెండుగా ఆశలు పెట్టుకుని ప్రభుత్వం వైపు దీనంగా చూస్తున్నారు. చంద్రబాబు హామీతో అప్పు చెల్లించని రైతులు... గత ఏడాది ఖరీఫ్‌తోపాటు అంతకు ముందు రైతులు బ్యాంకుల్లో పంట రుణాలు తీసుకున్నారు. జిల్లాలో దాదాపు రూ.9,137 కోట్ల బకాయిలున్నాయి. ‘అన్నదాతలారా ఎవరూ బ్యాంకులకు అప్పు కట్టకండి. మేం అధికారంలోకి వస్తే రుణాలు చెల్లిస్తాం...’ అంటూ చంద్రబాబునాయుడు పాదయాత్ర సమయంలో విస్తృతంగా ప్రచారం చేయడంతో దాదాపు జిల్లా రైతులంతా తిరిగి అ్ష్మప్పులు చెల్లించలేదు. తన తొలి సంత కం రుణమాఫీపైనే చేస్తానని చంద్రబాబు హామీ ఇచ్చిన నేపథ్యంలో ప్రమాణ స్వీకారం అనంతరం ఆ ఫైలుపై తొలి సంతకం చేస్తారని జిల్లాలోని రైతులంతా వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. అన్నదాతల్లో ఆందోళన... ఒక పక్క రుణాలు మాఫీ అవుతాయనే ఆశ.. మరోవైపు బ్యాంకర్ల వద్ద పరువుపోతుందనే భయం.. ఏం చేయాలో పాలుపోక రైతులు ఆవేదన చెందుతున్నారు. అప్పు చెల్లిద్దామంటే చేతిలో డబ్బు లేదు. ప్రభుత్వం చెల్లిస్తుందా.. అంటే స్పష్టత లేదు. బ్యాంకర్ల ఒత్తిళ్లు తట్టుకోలేక రైతులు సతమతమవుతున్నారు. ఒకవేళ ప్రభుత్వం రుణాలు మాఫీ చేయకుంటే రైతు బతుకు అధోగతే. వడ్డీ రాయితీ లేక, లక్షలకు లక్షలు చెల్లించలేక ఆస్తులు తెగనమ్ముకోవాల్సిన దుస్థితి తలెత్తే ప్రమాదం ఉంది. ఖరీఫ్ రుణాలు ఇచ్చేనా... పంట రుణమాఫీపై ప్రభుత్వం జూన్ 15లోగా స్పష్టమైన నిర్ణయం తీసుకుని బ్యాంకు అధికారులకు మార్గదర్శకాలు ఇస్తే ఖరీఫ్‌లో కొత్త రుణాలు పొందేందుకు అవకాశం ఉంటుందని రైతులు ఆశతో ఉన్నారు. రుణమాఫీపై ఎన్నికల మేనిఫెస్టోలో తెలుగుదేశం పార్టీ హామీ ఇవ్వటంతో రైతులు రుణాలు చెల్లించకుండా నిలిపివేశారు. ఈ నేపథ్యంలో ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి కొత్త రుణం మంజూరు చేస్తారా, లేదా అనే అనుమానాలు రైతులను వెంటాడుతున్నాయి. ఇప్పటి వరకు బ్యాంకు అధికారులు కూడా రుణాలు చెల్లించాలని రైతులకు నోటీసులు జారీ చేయలేదు. ప్రభుత్వం నుంచి రుణమాఫీపై ఆదేశాలు వస్తే రైతులకు రుణమాఫీ చేయాలా, కొత్త రుణాలు మంజూరు చేయాలా అనే అంశంపై చర్యలు తీసుకుంటామని బ్యాంకర్లు చెబుతున్నారు. హామీని నిలబెట్టుకోవాలి ఎన్నికల సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఇచ్చిన రుణమాఫీని వెంటనే అమలు చేస్తే రైతులకు వెసులుబాటు ఉంటుంది. ఖరీఫ్ సీజన్ త్వరలో ప్రారంభం కాబోతుండగా ప్రస్తుత రుణమాఫీ వల్ల రైతులకు లబ్ధి చేకూరుతుంది. ఇప్పటికే రెండు పంటల్లో నష్టపోయిన రైతులకు కొత్తగా అప్పులు తేవాలంటే తలకు మించిన భారమే. - కూనసాని లకో్ష్మజీ,కొమాళ్లపూడి కోఆపరేటివ్ బ్యాంకు మాజీ చైర్మన్ అయోమయం తొలగించాలి ఖరీఫ్ సాగుకు రైతులు సంసిద్ధులు కావాలంటే ఆర్థిక వెన్నుదన్ను అవసరం. రైతులు బ్యాంకుల్లో తీసుకున్న రుణాలను రద్దు చేస్తారనే నమ్మకంతో బకాయిలు చెల్లించటం లేదు. బ్యాంకర్లు డిమాండ్ చేయటం లేదు. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్లో వ్యవసాయ పనులు ప్రారంభించాలంటే పెట్టుబడి కావాల్సిందే. రుణమాఫీ జరిగి రైతులకు పంట రుణాలు ఇస్తేనే సాగు సజావుగా సాగుతుంది. - కె.సత్యనారాయణ, రైతు, కొమాళ్లపూడి -
రుణ మాఫీపై గంపెడాశలు
మారటోరియం విధిస్తామన్న బాబు అప్పులు చెల్లించని అన్నదాతలు ముక్కుపిండి వసూలు చేస్తామంటున్న బ్యాంకర్లు విశాఖ రూరల్, న్యూస్‌లైన్: కొత్త ప్రభుత్వం రుణాలను మాఫీ చే స్తుందా? చేయదా? బ్యాంకుల నుంచి తీసుకున్నవి తిరిగి చెల్లించాలా? వద్దా? ఇలా అనేక సందేహాలు అన్నదాతలను చుట్టుముడుతున్నాయి. అధికారంలోకి రాగానే రైతుల రుణ మాఫీ ఫైలుపై తొలిసంతకం చేస్తామని తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబునాయుడు హామీ పట్ల జిల్లా రైతాంగం గంపెడాశలు పెట్టుకుంది. ఈ అంశాన్ని టీడీపీ మేనిఫెస్టోలో చేర్చిన నాటి నుంచి రుణాలు చెల్లింపునకు రైతులు ఆసక్తి కనబరచలేదు. జిల్లాలో సుమారు 2 లక్షల మంది రైతులు రుణమాఫీ కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. అయితే ఎన్నికల ఫలితాలు వచ్చిన రెండో రోజునే రుణ మాఫీ కష్టమని, మారటోరియం విధిస్తామని బహిరంగంగానే చంద్రబాబు ప్రకటన చేశారు. దీంతో ఎన్నికల్లో హామీ మేరకు రుణ మాఫీ చేయాలంటూ సర్వత్రా ఒత్తిళ్లు వస్తున్నప్పటికీ దీనిపై ఎటువంటి స్పష్టత కానరావడంలేదు. బ్యాంకర్లు మాత్రం రుణాలు సకాలంలో చెల్లించాలంటూ రైతుల వెంటపడుతున్నారు. దీంతో విపక్షాల నుంచే కాకుండా, ఆ పార్టీ శ్రేణులు, రైతుల నుంచి ఆందోళనలు వ్యక్తం కావడంతో రుణమాఫీపై ఆలోచన చేస్తున్నట్లు మరోసారి ప్రకటించారు. ఇలా రోజుకో ప్రకటన రైతులను కలవరపెడుతోంది. రుణమాఫీ చేయకుంటే తీసుకున్న రుణాలు తిరిగి చెల్లించేందుకు ఏడాది లేదా రెండేళ్ల పాటు సమయం ఇవ్వడంతో పాటు ప్రస్తుత ఖరీఫ్‌నకు కొత్త రుణాలు అందించే అవకాశాన్ని కల్పిస్తారన్న ప్రచారం సాగుతోంది. ఒకవేళ రుణమాఫీ చేయాల్సి వస్తే.. కొన్ని నిబంధనలు, ఆంక్షలు విధించి వీలైనంత తక్కువ మంది రైతులకు, తక్కువ మొత్తంలో రుణాలను మాఫీ చేయవచ్చని టీడీపీ శ్రేణులు పేర్కొంటున్నాయి. ఏదేమైనా ప్రకృతి వైపరీత్యాలతో తీవ్రంగా నష్టపోతున్న రైతులను ఆదుకోవాలని, ఎన్నికల్లో ఇచ్చిన రుణమాఫీ హామీని నిలబెట్టుకోవాలని సర్వత్రా డిమాండ్ వ్యక్తమవుతోంది. రూ.1046 కోట్లు రుణాలు జిల్లాలో గతేడాది ఖరీఫ్, రబీలకు కలిపి బ్యాంకర్లు రూ.1046 కోట్లు పంట రుణాలుగా రైతులకు ఇచ్చారు. ఖరీఫ్‌లో వరుస తుపాన్లు కారణంగా పంటలు తుడిచిపెట్టుకుపోయాయి. ఇన్పుట్ సబ్సిడీ, ఇన్సూరెన్స్ ఇచ్చి ఆదుకోవాల్సిన ప్రభుత్వ ఆంక్షల పేరుతో రైతులను మరింత కుంగదీసింది. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం అధికారులు నామమాత్రంగా నష్టపరిహారం జాబితాను రూపొందించి ప్రభుత్వానికి పంపారు. ఇది జరిగి నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి ఎటువంటి సాయమందలేదు. వరదలు కారణంగా పంటలు కోల్పోయిన రైతులు బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను చెల్లించలేని స్థితిలో ఉన్నారు. ఈ పరిస్థితుల్లో జిల్లాలో దాదాపుగా 2 లక్షల మంది రైతులు ఎదురు చూస్తున్నారు. -
మద్దతు మూరెడు..ఖర్చు బారెడు
2013-14కు వరి మద్దతు ధర పెంపు గత ఏడాది కంటే కేవలం రూ.60 పెంచిన కేంద్రం ధరల పెరుగుదల..ప్రకృతి విపత్తులతో అన్నదాతలు కుదేలు విశాఖ రూరల్, న్యూస్‌లైన్ : ధరల పెరుగుదల ఒకవైపు.. ప్రకృతి విపత్తులు మరోవైపు అన్నదాతలను నిలువునా ముంచుతున్నాయి. ఆదుకోవాల్సిన ప్రభుత్వాలు అరకొరగా చేయి విదిలిస్తూ చేతులు దులుపుకొంటున్నాయి. నష్టపరిహారాల మాటెలా ఉన్నా.. వరి మద్దతు ధర పెంపు విషయంలో కేంద్రం రైతులపై కనికరం చూపడం లేదు. దీంతో పంటల పెట్టుబడికి.. దిగుబడిపై వస్తున్న రాబడికి పొంతన లేకుండా పోతోంది. ఈ ఏడాదైనా వరి మద్దతు ధరను కేంద్రం అధికంగా పెంచుతుందని రైతాంగం గంపెడాశలు పెట్టుకుంది. అయితే ఈ ఏడాది కూడా క్వింటాకు కేవలం రూ.60 వరకు మాత్రమే పెంచి రైతన్నల ఆశలపై నీళ్లు చల్లింది. జిల్లాలో రబీ వరి కోతలు దాదాపుగా చివరి దశకు చేరుకున్నాయి. ధాన్యాన్ని మార్కెట్‌కు తరలించే పనిలో రైతులు నిమగ్నమై ఉన్నారు. వాతావరణం సహకరిస్తే ఖరీఫ్ సాగును సకాలంలో చేపట్టాలని భావిస్తున్నారు. రూ.60 పెంపు ఏటా ఖరీఫ్ సాగుకు రైతులను ప్రోత్సహించేందుకు మే, జూన్ నెలల్లో కేంద్ర ప్రభుత్వం వరితో పాటు వివిధ రకాల పప్పుధాన్యాలకు మద్దతు ధర పెంచడం ఆనవాయితీ. కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖకు అనుబంధంగా ఉన్న కేంద్ర వ్యవసాయ ఉత్పత్తుల ధరల నిర్ణాయక కమిటీ(సీఏసీపీ) వరి, గోధుమ, ఇతర పప్పుధాన్యాలకు ఎంత వరకు మద్దతు ధర పెంచాలనే దానిపై నివేదిక ఇస్తుంది. దీనికి అనుగుణంగా తొలుత వ్యవసాయ శాఖ, తరువాత ఆర్థిక శాఖ నిర్ణయం తీసుకున్నాక కేంద్రం మద్దతు ధర పెంచుతుంది. అయితే గత ఏడాది నవంబర్‌లో రాష్ట్రంలో పర్యటించిన సీఏసీపీ చైర్మన్ అశోక్ గులాటీ వరికి మూడేళ్ల పాటు మద్దతు ధర పెంచే అవకాశం లేదని ప్రకటించారు. ఇప్పటికే వరికి మద్దతు ధర ఎక్కువగా ఉన్నందున కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. అయితే ఎన్నికల సమయం కావడంతో కేంద్రం మద్దతు ధర పెంచుతున్నట్లు ప్రకటించింది. 2013-2014కు సంబంధించి ధాన్యం సాధారణ రకం క్వింటాకు రూ.1310, గ్రేడ్-ఎకు రూ.1345గా పెంచారు. గత ఏడాది సాధారణ రకానికి రూ.1250, గ్రేడ్-ఎకు రూ.1280గా ఉండేది. గత ఏడాది కంటే కేవలం రూ.60, రూ.65 మాత్రమే పెంచడంతో రైతన్నలు నైరాశ్యంలోకి జారుకున్నారు. ధరలు విపరీతం పంటల సాగుకు రైతులు కష్టకష్టాలు పడుతున్నారు. విత్తనాల నుంచి కూలీల వరకు అన్నింటి ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. ఫలితంగా పెట్టుబడులు రెట్టింపవుతున్నాయి. కానీ దిగుబడిపై వస్తున్న రాబడి మాత్రం కనిపించడం లేదు. దీంతో అన్నదాతలు అప్పులపాలవుతున్నారు. ఖరీఫ్ సగటు పెట్టుబడి ఎకరాకు రూ.12 వేలు నుంచి రూ.15 వేలు వరకు ఖర్చవుతుందని అధికారులు చెబుతున్నారు. దిగుబడి ఎకరాకు 26 నుంచి 28 బస్తాలు(ఒక్కో బస్తా 75 కేజీలు) వరకు ఉంటుందని వ్యవసాయాధికారులు పేర్కొంటున్నారు. దీన్ని బట్టి చూస్తే రైతుకు ఎకరాకు రూ.2 వేలు నుంచి రూ.2500 మించి మిగిలే పరిస్థితి లేదు. మూడేళ్లుగా వరుసగా కరువు, వరదలు కారణంగా ఖరీఫ్ పంటలు తీవ్రంగా దెబ్బతింటూ వచ్చాయి. దీంతో రైతులు లాభాలను మరిచిపోయి కనీసం పెట్టుబడులు కూడా రాని పరిస్థితి ఎదుర్కొంటున్నారు. కౌలు రైతుల పరిస్థితి మరింత దయనీయం. రుణ అర్హత కార్డులు ఉన్నా కూడా రుణాలు అందక.. అప్పులు చేసి వేసిన పంట చేతికందక అల్లాడుతున్నారు. ఈ నేపథ్యంలో మద్దతు ధర పెంపుపైనే రైతులు ఆశలు పెట్టుకోగా కేంద్రం ఊసూరుమనిపించింది. స్వామినాథన్ సిఫార్సులపై ఆశలు వ్యవసాయాన్ని లాభసాటి చేసేందుకు గతంలో ఎన్డీఏ ప్రభుత్వ సారధి వాజ్‌పాయి నియమించిన స్వామినాథన్ కమిటీ సిఫార్సులను మోడీ నేతృత్వంలో ఏర్పడే ఈ ఎన్డీఏ ప్రభుత్వమైనా నెరవేరుస్తుందని రైతులు ఆశగా ఎదురుచూస్తున్నారు. ఆ కమిటీ సిఫార్సుల్లో ప్రధానమైనది లాభసాటి ధర. పంట దిగుబడికి 50 శాతం లాభాన్ని కలిపి దాన్నే మద్దతు ధరగా ప్రకటించాలని స్వామినాథన్ సూచించారు. ఆ సిఫార్సులను యూపీఏ ప్రభుత్వ పక్కనపెట్టింది. ప్రస్తుతం ఎన్డీఏ తిరిగి అధికారం చేపట్టడంతో ఆ సిఫార్సులు అమలుకు నోచుకుంటాయో లేదో వేచి చూడాలి మరి. -
రైతు బంద్
జిల్లాలో పడకేసిన రైతు బంధు పథకం పౌరసరఫరాల శాఖ సేవలో తరిస్తున్న మార్కెటింగ్ శాఖ జిల్లాలో 21 ప్రభుత్వ గోదాములు ఖాళీ నష్టపోతున్న అన్నదాతలు సాక్షి, విశాఖపట్నం: పండించిన పంటకు గిట్టుబాటు ధర పలికే వరకు వ్యవసాయ ఉత్పత్తులను నిల్వ చేసి ఆ తర్వాత విక్రయిస్తేనే అన్నదాతల కు కాస్తోకూస్తో లాభం మిగిలేది. ఇదే ఉద్దేశంతో పుట్టిన రైతుబంధు పథకం ఇప్పుడు అధికారుల నిర్లక్ష్యం కారణంగా పడకేసింది. మార్కెట్లో రేటు పెరిగినప్పుడు దాచిన ఉత్పత్తులను విక్రయించుకునేలా ప్రభుత్వం రైతులను చైతన్యం చేయకపోవడంతో ఏటా గిట్టుబాటు లేకున్నా తక్కువధరకే పంటలు విక్రయిస్తూ వారు నష్టపోతున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు మొద్దునిద్ర వీడకుండా రైతుల వ్యవసాయ ఉత్పత్తులను దాచి ఉంచాల్సిన 21 గోదాములను పౌరసరఫరాలశాఖకు అప్పగించి కళ్లుమూసుకున్నారు. అన్నదాతలంటే అలుసే... జిల్లాలో వరి, మొక్కజొన్న, పసుపు,మిరియాలు, జొన్న తదితర పంటలు పుష్కలంగా 98 పండుతాయి. ఈ ఆహార,వాణిజ్య,ఇతర వ్యవసాయ ఉత్పత్తులకు బహిరంగ మార్కెట్లో మంచి ధర పలకనప్పుడు వాటిని కొంతకాలం నిల్వ ఉంచి తిరిగి మార్కెట్ ఆశాజనకంగా ఉన్నప్పుడు విక్రయిస్తే వారికి కాసిన్ని కాసులు మిగులుతాయి. ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతుబంధు పథకం ఉద్దేశం ఇదే. ఇందుకుగాను రైతులు తమ ఉత్పత్తులను నిల్వ ఉంచుకునేందుకు మార్కెటింగ్‌శాఖ ఆయా ప్రాంతాల్లో గోదాములు ఇస్తుంది. ఇందులో రైతులు తమ ఉత్పత్తులను మూడు నెలల వరకు ఉచితంగా నిల్వ ఉంచుకోవచ్చు. పైగా ఈసమయంలో నిల్వ ఉంచిన పంట విలువ ఆధారంగా ప్రభుత్వం రుణం కూడా ఇస్తుంది. ఇన్ని సౌకర్యాలున్నా పథకం మాత్రం జిల్లాలో అన్నదాతలకు ఏమాత్రం అక్కరకు రావడంలేదు. పథకం పాతదే అయినా అధికారులు ఎప్పటికప్పుడు రైతుల్లో అవగాహన కల్పించే ప్రయత్నా లు చేయడం లేదు. దీంతో అంగట్లో గిట్టుబాటు ధర వచ్చే అవకాశం ఉన్నా అది తెలియక అన్నదాతలు పథకం ప్రయోజనాలకు దూరమై పోతున్నారు. ప్రసుత్తం జిల్లాలో 21 భారీ గోదాములున్నాయి. కాని వీటిలో అన్నదాతల ప్రయోజనాలకు ఉపయోగపడుతున్నవి లేవనే చెప్పాలి.రైతులు ఎలాగూ వీటిని వాడుకోవడం లేదనే సాకుతో మార్కెటింగ్ శాఖ అధికారులు వీటిని వేరే శాఖ అవసరాలకు అప్పగించేస్తున్నారు. రికార్డుల్లో మాత్రం వ్యవసాయ ఉత్పత్తులతో గోదాములు ఖాళీగా లేవని చూపిస్తున్నారు. ఫలితంగా రైతుల వ్యవసాయ ఉత్పత్తులను నిల్వ ఉంచాల్సిన గోదాముల్లో ఇప్పుడు బియ్యం,పప్పులు,నూనెలు దాస్తున్నారు. వీటిలో ఉత్పత్తులను దాచుకోవడానికి ముందుకు వచ్చే రైతులకు ఇచ్చే రుణసదుపాయాన్ని గతేడాది రూ.50వేల నుంచి రూ.లక్ష వరకు పెంచారు. అయినా అధికారులు క్షేత్రస్థాయిలో రైతులకు ఇవన్నీ వివరించకపోవడంతో ఈ పథకం నిరుపయోగమవుతోంది. అనకాపల్లి, నర్సీపట్నం, చోడవరం, మాడుగుల, పాయకరావుపేట తదితర ప్రాంతాల్లో వరి, మొక్కజొన్న, ఇతర కూరగాయలు పండించే రైతుల పరిస్థితి దారుణంగా మారింది. -
దిగాలుగా అన్నదాత
వరంగల్ సిటీ, న్యూస్‌లైన్ : మార్కెట్లో అన్నదాత నిలువు దోపిడీకి గురవుతున్నాడు. రబీలో చేతికొచ్చిన పంటలను అకాల వర్షాలు దెబ్బతీశాయి. మిగిలిన పంటను మార్కెట్‌కు తరలిస్తే వ్యాపారులు ధర పెట్టకపోవడంతో దిగాలు పడుతున్నాడు. వరంగల్ ఏనుమూముల వ్యవసాయ మార్కెట్లో ఇప్పటివరకు ధాన్యం కొనుగోళ్ల కోసం ఐకేపీ కేంద్రాలు ఏర్పాటు కాలేదంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. మండల, నియోజకవర్గాల కేంద్రాలు, చిన్నా, పెద్ద వ్యవసాయ మార్కెట్లలో ధాన్యాన్ని ఐకేపీ సెంటర్ల ద్వారా కొనుగోలు చేస్తున్నారు. అయితే జిల్లా కేంద్రంలోని మార్కెట్లో మాత్రం ఐకేపీ కేంద్రం ఏర్పాటు చేయలేదు. దీంతో వ్యాపారులు ఇష్టానుసారంగా ధర నిర్ణయిస్తూ ధాన్యం రైతులకు కుచ్చుటోపి పెడుతున్నారు. ఇక్కడి పరిస్థితిని గమనించిన రైతులు చాలావరకు మార్కెట్‌కు ధాన్యం తీసుకురావడం లేదు. తెచ్చినా.. ధాన్యాన్ని మద్దతు ధరకు కొనుగోలు చేసే ప్రభుత్వరంగ సంస్థలు అందుబాటులో లేకపోవడంతో ఇబ్బంది పడుతున్నారు. ప్రస్తుతం మార్కెట్‌కు రోజూ వెయ్యి బస్తాల వరకు ధాన్యం వస్తోంది. మార్కెట్లో ధాన్యం సన్నరకాలు క్వింటాల్‌కు రూ.1,250 నుంచి రూ.1,300 వరకు ధర పలుకుతోంది. దొడ్డు రకం ధాన్యానికి రూ.1,150 లోపే ధర పెడుతున్నారు. నిజానికి సన్నరకానికి మద్దతు ధర రూ.1,340, దొడ్డురకానికి రూ.1,300 ధర చెల్లించాలి. అయితే వ్యాపారులు కూడా మద్దతు ధరకు కొనుగోలు చేయకుండా క్వింటాల్‌కు రూ.100 నుంచి రూ.150 వరకు తగ్గిస్తున్నారు. -
సుజలం.. సఫలమివ్వాలి
విజయనగరం జిల్లా వైఎస్ కృషితో నీటికళ... ఆయన మరణంతో పడకేసిన ప్రాజెక్టుల నిర్మాణాలు న్యూస్‌లైన్, నెల్లిమర్ల, అన్నదాతలను రాచిరంపాన పెట్టిన చంద్రబాబు పాలనను గుర్తుచేస్తేనే రైతులు ఉలిక్కిపడుతున్నారు. ఆయన హయాంలో విజయనగరం జిల్లాలో ఒక్క ప్రాజెక్టు పూర్తికాలేదు. రైతుల కష్టాలను దూరం చేసేందుకు వైఎస్ అనేక ప్రాజెక్టులకు రూపకల్పన చేశారు. ఆయన మరణంతో వాటి నిర్మాణాలు నిలిచిపోయాయి. చంద్రబాబు హయాంలో.. నెల్లిమర్ల, డెంకాడ, పూసపాటిరేగ, భోగాపురం మండలాల్లో ఎక్కడికి వెళ్లినా ఎండిపోయిన పంటలే కన్పించేవి. నెర్రెలుబారిన నేలలే దర్శనమిచ్చేవి. డెంకాడ, కుమిని గ్రోయింగ్ ఆనకట్టలు మినహా సాగునీటికి ఒక్క అవకాశమూ ఉండేది కాదు. వరుణుడు కరుణిస్తే 9 వేల ఎకరాల్లో వరి పండేది. మిగతా 16 వేల ఎకరాల్లో సరుగుడు, నీలగిరి తోటలే దిక్కయ్యేవి. చంపావతిపై ప్రాజెక్టులు కడితే 25 వేల ఎకరాలకు నీరు ఇవ్వొచ్చని నిపుణులు నివేదికలు ఇస్తే, చంద్రబాబు సర్కారు కనీసం వాటిని తెరిచి చూసిన పాపానపోలేదు. ఎన్టీఆర్ హయాంలో తారకరామ ప్రాజెక్టు నిర్మించాలనే తలంపు వచ్చినా... చంద్రబాబు కాలంలో మాత్రం దాన్ని నిరర్థక ఆలోచనగానే భావించారు. ఫలితంగా ఉత్తరాంధ్రలోని విజయనగరం జిల్లాలో అనేక పల్లెలు ఎడారిని తలపించాయి. వైఎస్ హయాంలో... - రైతన్న ఆవేదన చూసి కలత చెందిన వైఎస్ తారకరామ తీర్థసాగర్ రిజర్వాయర్‌కు రూపకల్పన చేశారు. జలయజ్ఞం కింద భారీగా నిధులు వెచ్చించారు. - పెద్దగడ్డ రిజర్వాయర్ కోసం చంద్రబాబు ఒక్కపైసా కూడా ఇవ్వకుండా నిర్లక్ష్యం చేస్తే... వైఎస్ ఏకంగా రూ.103.55 కోట్లు వెచ్చించారు. ఫలితంగా 12 వేల ఎకరాలు సాగులోకి వచ్చాయి. - నెల్లిమర్ల నియోజకవర్గంలోని నాలుగు మండలాలకు సాగునీరు, జిల్లా కేంద్రానికి తాగునీరు అందించే ప్రాజెక్టుకు 2006లో వైఎస్ రూపకల్పన చేశారు. రూ.181 కోట్లు విడుదల చేశారు. 2008 నాటికి ప్రాజెక్టును పూర్తిచేయాలని భావించారు. కానీ టీడీపీ నేతలు భూ నిర్వాసితులను రాజకీయ లబ్ధికోసం వాడుకున్నారు. పరిహారం సాకుతో చట్టపరమైన చిక్కులు సృష్టించారు. వీటన్నింటినీ దాటుకుని ముందుకు వెళ్లేందుకు వైఎస్ రాజశేఖరరెడ్డి స్వయంగా అధికారులతో సంప్రదింపులు జరిపారు. ప్రాజెక్టుకు కావాల్సిన అనుమతుల కోసం ఆయనే కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడారు. - చంద్రబాబు తొమ్మిదేళ్ల పాలనలో ఈ ప్రాజెక్టు కోసం కేవలం రూ.7.78 కోట్లు ఖర్చుచేస్తే, వైఎస్ నాలుగేళ్లలోనే రూ.64.56 కోట్లు వెచ్చించారు. ఎదురుచూపులే మిగిలాయి తారకరామ పూర్తికాకపోవడంతో ప్రతి ఖరీఫ్‌లోనూ పంటలకు పూర్తిస్థాయిలో సాగునీరు అందడం లేదు. ఏటా సాగు మొదలు పెట్టేందుకు వర్షాలపైనే ఆధారపడుతున్నాం. మాకు ఈ కష్టాలు ఇంకెన్నాళ్లో? - వి.సూర్యనారాయణ, రైతు, పెదతాడివాడ గ్రామం వైఎస్ తర్వాత... జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులను పూర్తిగా విస్మరించారు. నిధుల్లో ఊహించని విధంగా కోత పెట్టారు. ఫలితంగా తారకరామ తీర్థసాగర్ ప్రాజెక్టు భవిష్యత్ అగమ్యగోచరంగా మారింది. - పస్తుతం పనులు జరుగుతున్న తీరు చూస్తుంటే మరో ఐదేళ్లయినా ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తయ్యే అవకాశమే లేదని రైతులు చెబుతున్నారు. మళ్లింపు కాలువ పనులకు గుర్ల గ్రామ పరిధిలోని రైల్వేట్రాక్ వద్ద అనుమతులు వచ్చినప్పటికీ ఇప్పటికీ ప్రభుత్వం నుంచి రైల్వేశాఖ అడిగిన నిధులు విడుదల కాకపోవడంతో పనులు నిలిచిపోయాయి. - కాలువ నిర్మాణానికి రామతీర్థం వద్ద కొండను తొలవాల్సి ఉంది. దీనికి అటవీ శాఖ నుంచి అనుమతులు లేవు. కుమిలి, సారిపల్లి, కుదిపి, జగ్గరాజుపేట గ్రామాల పరిధిలో సుమారు 15 కిలోమీటర్ల మేర ప్రధాన బండింగ్ నిర్మాణం చేపట్టాల్సి ఉంది. బండింగ్ నిర్మాణం విషయంలో పాత కాంట్రాక్టర్ వ్యయం పెంచాలని కోరుతూ 2009 నుంచి పనులు నిలిపివేశారు. - మారిన ధరల ప్రకారం టెండర్లు పిలవడంతో ప్రధాన బండింగ్ వ్యయం ఏకంగా రూ.56 కోట్లు అదనంగా పెరిగింది. - ముంపునకు గురవుతున్న కోరాడపేట, ఆత్మారాముని అగ్రహారం గ్రామాలకు ప్రభుత్వం పునరావాస ప్యాకేజీ ప్రకటించింది. అయితే ఇప్పటివరకు పునరావాస పనులు ఏమాత్రం ముందుకు సాగలేదు. కోరాడపేటకు పునరావాసానికి స్థలం కేయించినప్పటికీ అభివృద్ధి చేయలేదు. జగన్ మాట పోలవరం, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, వంశధార, గాలేరు నగరి, హంద్రీనీవా, వెలిగొండ సహా జలయజ్ఞం కింద ప్రారంభించిన అన్ని సాగునీటి ప్రాజెక్టులనూ పూర్తిచేస్తాం. కృష్ణా, గోదావరి, పెన్నా బేసిన్లో మురుగు కాల్వల వ్యవస్థను గణనీయంగా మెరుగుపరుస్తాం. రాజన్న లక్ష్యానికి తూట్లు దివంగత నేత రాజన్న లక్ష్యానికి జంజావతి అధికారులు, కాంగ్రెస్ పాలకులు తూట్లు పొడిచారు. జంజావతి నుంచి సుమారు 24వేల ఎకరాలకు పూర్తిస్థాయిలో సాగునీరందివ్వాలన్న ఉద్దేశంతో మహానేత ఆస్ట్రియా పరిజ్ఞానంతో రబ్బర్‌డ్యామ్ నిర్మించి 12వేల ఎకరాలకు సాగునీరందించారు. వైఎస్ మరణా నంతరం పాలకులు, అధి కారులు ఆయన ఆశయానికి తూట్లు పొడిచారు. ప్రస్తుతం పూడుకుపోయిన కాలువలు, నిర్మాణం కాని కాలువలు, పిల్లకాలువలే కనిపిస్తున్నాయి. కనీసం 2వేల ఎకరాలకు కూడా సాగునీరందించలేని దుస్థితి ఏర్పడింది. దీంతో రాజన్న లక్ష్యం నీరుగారింది. - పడాల సత్యం నాయుడు, రైతు సోమినాయుడువలస, కొమరాడ మండలం వైఎస్ వల్లే బతుకుతున్నాం.. రైతులు ప్రస్తుతం దిక్కుతోచని పరిస్థితితో అల్లాడు తున్నారు. కుటుంబ అవసరాల కోసం ఉన్న భూములను అమ్ముకుందామన్నా కొనేవారు లేని పరిస్థితి. బోర్లు తీసుకుని వ్యవసాయం చేద్దామన్నా కుదరట్లేదు. 200 అడుగుల లోతు కు వెళ్లినా చుక్కనీరు పడదు. వైఎస్ ఉన్నపుడు జలయజ్ఞంలో భాగంగా మారుమూలన ఉన్న పెద్దగెడ్డ జలా శయ నిర్మాణానికి చర్యలు తీసుకున్నారు. దీంతో ఈ ప్రాంత రైతులకు మహర్దశ పట్టింది. ఆయన దయ వల్ల ఇప్పుడు రెండు పంటలు పండించుకుంటూ హాయిగా జీవిస్తున్నాం. కారణం వైఎస్ నిర్మించిన పెద్దగెడ్డ జలాశయమే. ఈ ప్రాంతంలో ఏ రైతు కూడా ఆయనను ఎన్నటికీ మరిచిపోరు. - ఇజ్జాడ అప్పలనాయుడు పాచిపెంట మండలం, విజయనగరం జిల్లా -
వరికి వర్షం దెబ్బ
ఒంగోలు టూటౌన్, టూటౌన్ :అకాల వర్షం అన్నదాతను కలవర పరుస్తోంది. ఊహించని విధంగా బుధవారం ఉరుములు.. మెరుపులతో కూడిన చిన్నపాటి వర్షం కురవడం ప్రారంభించడంతో రైతుల్లో ఆందోళన మొదలైంది. కోసిన వరి ఓదెలన్నీ చేలోనే ఉన్నాయి. ఇంటి వద్ద వసతి, గ్రామంలో మార్కెట్ సౌకర్యం లేక పొలాల్లోనే ఎంతో మంది ధాన్యం నిల్వ ఉంచుకున్నారు. జిల్లాలో ఈ సీజన్లో 86 వేల హెక్టార్లలో వరి సాగు చేశారు. సాగర్ ఆయకట్టు పరిధిలో ఆరుగాలం కష్టపడి పండించిన వందల ఎకరాల పంట నూర్పిళ్లకు సిద్ధంగా ఉంది. కొత్తపట్నం మండలంలో మోటుమాల, పాదర్తి, అల్లూరు, ఈతముక్కల, మడనూరు ప్రాంతాల్లో కొన్ని కోసిన చేలు ఉండగా మరికొన్ని కోతకు సిద్ధంగా ఉన్నాయి. అసలు పంట చేతికందుతుందో లేదోనన్న బెంగ రైతన్నను కుంగదీస్తోంది. ఇప్పటికే చేసిన అప్పులకు వడ్డీలు కట్టలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎకరాకు 40 బస్తాలు కూడా పండని పరిస్థితితో దిగాలు చెందుతుంటే అకాల వర్షం అసలుకే ముంచేటట్లు ఉందని వాపోతున్నారు. వరి రైతులతో పాటు పొగాకు రైతును అకాల వర్షం ఇబ్బంది పెట్టేటట్లు ఉంది. పందిళ్లపై ఆకు తడిస్తే రంగు మారుతుందని ఆందోళన చెందుతున్నారు. చిరుజల్లులు కాస్తా భారీ వర్షంగా మారితే రైతన్నకు కోలుకోలేని దెబ్బ తగలనుంది. -
తుమ్మపాల.. పీడకల
మొరాయిస్తున్న పురాతన యంత్రాలు 30 వేల టన్నుల లోపే గానుగాట ? లక్ష టన్నుల లక్ష్యం ఫలించని స్వప్నం 8 శాతం లోపు రికవరీతో కలవరం ఏ క్షణం ఏమవుతుందోనన్న భయం డెబ్భై ఐదేళ్లుగా అనకాపల్లి కీర్తికి నిలువెత్తు నిదర్శనం.. దశాబ్దాలుగా వేలాది మంది రైతులకు ఆధారం.. తుమ్మపాల చక్కెర కర్మాగారం! కానీ అంత ప్రశస్తి ఉన్న ఈ అన్నదాత ఆశాకిరణం ఇప్పుడు వెలవెలపోతోంది. కాలం చేసిన మాయాజాలం కారణంగా పడుతూ లేస్తూ ప్రయాణం సాగిస్తోంది. మూలకు చే రే తీరులో ఉన్న యంత్రాలు చీటికీ మాటికీ మొరాయిస్తుండడంతో భవిష్యత్తు భయపెడుతోంది. గానుగ లక్ష్యం దిగజరిపోతోంది. రికవరీ శాతం కలవరపెడుతోంది. లక్ష టన్నుల క్రషింగ్ దేవుడెరుగు.. అందులో పావుసగం సాధిస్తే గొప్పేనన్న నిర్లిప్తత నీరసం కలిగిస్తోంది. అనకాపల్లి, న్యూస్‌లైన్: చేరువలో ఉన్న గోవాడ దూసుకు పోతూ ఉంటే, అనకాపల్లి వి.వి.రమణ (తుమ్మపాల) సహకార చక్కెర కర్మాగారం మాత్రం పడుతూ లేస్తూ పయనం సాగిస్తోంది. సుమారు 75 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ కర్మాగారాన్ని యాంత్రిక వైఫల్యం శాపంలా వెంటాడుతోంది. కాలం చెల్లిన యంత్రాలు మొరాయిస్తుండడంతో ఏటేటా రికవరీ శాతం తగ్గిపోతోంది. లక్ష టన్నుల క్రషింగ్ కలేనన్న అభిప్రాయం బలపడుతోంది. పరువు కాపాడుకునేందుకైనా గానుగాట నిర్వహించాలని ముందుకు వచ్చిన తుమ్మపాల కర్మాగారానికి మళ్లీ కష్టాలు వచ్చి పడ్డాయి. ఒకవైపు చెరకు కొరత, మరొక వైపు సాంకేతిక సమస్యలు జంటగా వెంటాడుతున్నాయి. లక్ష టన్నుల మాట అటుంచి కనీసం గతేడాది చేపట్టిన క్రషింగ్ లక్ష్యాన్ని అధిగమించగలమా అనే అనుమానం తుమ్మపాల యాజమాన్యాన్ని వేధిస్తోంది. 30 వేల టన్నుల లోపే? ఆశలు ఎన్ని ఉన్నా, వెంటాడుతున్న వాస్తవాలతో యాజమాన్యం బెంబేలెత్తుతోంది. తుమ్మపాల కర్మాగార ప్రస్తుత సీజన్ క్రషింగ్ 30 వేల టన్నుల లోపే ఉంటుందని ఆందోళన చెందుతోంది. ప్రస్తుతం 25 వేల టన్నుల వరకు క్రషింగ్ చేపట్టినప్పటికీ రికవరీ శాతం దయనీయంగా మారింది. కేవలం 7.92 రికవరీ శాతం నమోదవుతున్న పరిస్థితుల్లో ఎంత గానుగాడినా ఆస్థాయిలో నష్టాలే వస్తాయని ఆర్ధిక నిపుణుల అంచనాగా ఉంది. ఈ నేపథ్యంలో గానుగాటను ఎంత పొడిగించినా లాభం లేదని ఇప్పటికే కర్మాగార వర్గ్గాలు ఒక అంచనాకు వచ్చాయి. ఇదే సమయంలో చెరకు కొరత ఆందోళన కలిగిస్తోంది. క్రషింగ్ ఏరోజైనా ముగించే పరిస్థితి కనిపిస్తోంది. అటు ఉత్సాహం.. ఇటు నీరసం పక్కనున్న గోవాడ కర్మాగారం దూసుకుపోతోంది. 3 లక్షల టన్నుల గానుగాటతో 9.27 రికవరీ శాతం నమోదయింది. తుమ్మపాల తీరు మరీ తీసికట్టుగా ఉంది. 25 వేల టన్నులు గానుగాడి 7.92 రికవరీ శాతం నమోదయిందంటే పరిస్థితి అర్ధమవుతుంది. వెంటాడుతున్న బకాయిల భయం, సిబ్బంది జీతాల సమస్య, కానరాని ఆధునికీకరణ నిధులు, చేరని క్రషింగ్ లక్ష్యం .. భవిష్యత్తు భయంగా ఉంది. రాజకీయంగా కూడా అనిశ్చిత వాతావరణం ఉండడంతో రాబోయే ప్రభుత్వం ద్వారానే తుమ్మపాలకు మేలు జరగాలని అన్ని వర్గాల వారు భావిస్తున్నారు. -
అన్నదాతకు చేరువలో కొత్త వంగడాలు
వచ్చే ఏడాది మార్కెట్లోకి ఎంసీఎం 100, 101 పరిశీలనలో ఎంసీఎం 103 వ్యవసాయ విభాగం రీసెర్చ్ డెరైక్టర్ వెల్లడి అన్నదాతకు కొత్త వంగడాలు అందుబాటులోకి రానున్నాయి. తక్కువ ఖర్చుతో అధిక దిగుబడులు సాధించడం, విపత్తులను తట్టుకోవడం లక్ష్యంగా వీటిని తయారుచేశారు. ఎంసీఎం 100, 101 పేరిట రూపొందించిన ఈ వంగడాలను వచ్చే ఏడాది మార్కెట్లోకి విడుదల చేయనున్నారు. శుక్రవారం కరగ్రహారంలోని వ్యవసాయ పరిశోధన క్షేత్రాన్ని సందర్శించిన హైదరాబాదు వ్యవసాయ పరిశోధన క్షేత్రం డెరైక్టర్ డాక్టర్ కె.రాజారెడ్డి ఈ వివరాలు వెల్లడించారు. మచిలీపట్నం, న్యూస్‌లైన్ : తక్కువ ఖర్చుతో అధిక దిగుబడులు సాధించే దిశగా వ్యవసాయ పరిశోధన క్షేత్రాలు నూతన వంగడాలను ఉత్పత్తి చేస్తున్నాయని హైదరాబాదు వ్యవసాయ పరిశోధన క్షేత్రం డెరైక్టర్ డాక్టర్ కె.రాజారెడ్డి అన్నారు. మచిలీపట్నం కరగ్రహారంలోని వ్యవసాయ పరిశోధన క్షేత్రాన్ని గుంటూరు లాం ఫామ్ అసోసియేట్ డెరైక్టర్ డాక్టర్ ఇ.నారాయణతో కలిసి శుక్రవారం ఆయన సందర్శించారు. క్షేత్రంలో ఉన్న వసతులు, నూతన వంగడాలను తయారుచేసే విధానం తదితర అంశాలను పరిశీలించారు. కరగ్రహారంలో 19.50 ఎకరాల విస్తీర్ణంలో సాగవుతున్న వివిధ రకాల నూతన వంగడాలను, విత్తనశుద్ధి క్షేత్రాన్ని పరిశీలించి శాస్త్రవేత్తలకు పలు సూచనలు, సలహాలు అందించారు. మార్కెట్లోకి ఎంసీఎం 100, 101 వంగడాలు... హైదరాబాదు వ్యవసాయ పరిశోధన క్షేత్రం డెరైక్టర్ డాక్టర్ కె.రాజారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం... ఎంసీఎం 100, 101 రకం వరి వంగడాలను వచ్చే ఏడాది మార్కెట్లోకి విడుదల చేయనున్నారు. మచిలీపట్నం వ్యవసాయ పరిశోధన క్షేత్రం సీనియర్ సైంటిస్ట్ టి.అనురాధ పరిశోధించి వీటిని తయారుచేశారు. ఎంసీఎం 100 రకం 145 రోజుల వ్యవధిలో కోతకు వస్తుంది. దీనిని ఖరీఫ్ సీజన్లో సాగుచేసే వీలుంటుంది. ఎంసీఎం 101 రకం వరి వంగడం 125 రోజుల్లో కోతకు వస్తుంది. దీనిని రబీ సీజన్లో సాగు చేసే వీలుంటుంది. మచిలీపట్నం వ్యవసాయ పరిశోధన క్షేత్రంలో తయారైన ఎంసీఎం 103 రకం వరి వంగడాన్ని మార్కెట్లోకి విడుదల చేసేందుకు ఇంకా నాలుగేళ్లు పడుతుంది. ఈ వంగడం ఇటీవల జరిగిన అంతర్జాతీయ పరిశోధన ఫలితాల్లో మొదటి స్థానంలో నిలిచింది. ఇది 140 రోజుల్లో కోతకు వస్తుంది. ఎంసీఎం 100 రకం వరి వంగడాన్ని ముదినేపల్లి మండలం వడాలి గ్రామంలో గత ఏడాది ఓ రైతు సాగు చేశారు. పదిరోజుల పాటు ఈ పైరు నీటిలోనే ఉన్నా ఎలాంటి పంట నష్టం వాటిల్లలేదని రుజువైంది. ఈ రకం వంగడాల కోసం రైతులు ఎదురుచూస్తున్నారని, దీనికి మరింత సాంకేతికత జోడించి తుది మెరుగులు దిద్దేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని రాజారెడ్డి వెల్లడించారు. పరిశోధనలకు రూ.16.50 కోట్లు విడుదల... వ్యవసాయ పరిశోధనల నిమిత్తం గతంలో ప్రభుత్వం రూ.100 కోట్లతో ప్రత్యేక ప్రణాళిక రూపొందించిందని రాజారెడ్డి చెప్పారు. తొలి విడతగా రూ.16.50 కోట్లు విడుదలయ్యాయన్నారు. ఈ నిధులతో గుంటూరులో వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాల నిర్మించామన్నారు. రూ.23 లక్షల వ్యయంతో గుంటూరు లాం ఫామ్‌లో పాలికార్బోనెట్ హౌస్‌ను ఏర్పాటు చేసి వివిధ రకాల పంటలపై పరిశోధనలు చేస్తున్నట్లు చెప్పారు. పరిశోధన క్షేత్రంలో సౌకర్యాలు కల్పించండి... మచిలీపట్నం వ్యవసాయ పరిశోధన క్షేత్రంలో సాగునీటి సమస్య అధికంగా ఉందని, దీని నివారణ కోసం క్షేత్రంలో చెరువును తవ్వించేందుకు అనుమతులు ఇవ్వాలని వ్యవసాయ పరిశోధన క్షేత్రం శాస్త్రవేత్త టి.అనురాధ అధికారులను కోరారు. వ్యవసాయ పరిశోధన క్షేత్రంలో సిబ్బంది కొరత అధికంగా ఉందని, పనిచేస్తున్న వారంతా డెప్యుటేషన్ పైనే ఉన్నారని తెలిపారు. రెగ్యులర్ సిబ్బందిని నియమించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. దీనిపై రాజారెడ్డి స్పందిస్తూ కావాల్సిన వసతులపై నివేదిక పంపితే పరిశీలించి నిధుల లభ్యతను బట్టి ప్రాధాన్యత ఇస్తామన్నారు. మచిలీపట్నం వ్యవసాయ పరిశోధన క్షేత్రంలో బ్రీడర్ దశలో ఉన్న ఎంసీఎం 103 సెమినార్‌ను ఆయన పరిశీలించారు. -
వ్యవసాయానికి సర్కారు ‘షాక్’
గంట విద్యుత్ కోతపై అన్నదాత ల ఆగ్రహం ప్రభుత్వం కక్షగట్టిందని మండిపాటు ఏడు గంటలు ఇవ్వాల్సిందేనని రైతుల డిమాండ్ యాచారం/ తాండూరు న్యూస్‌లైన్: రైతులకు సర్కారు షాక్ ఇచ్చింది. వ్యవసాయానికి విద్యుత్ సరఫరాలో గంట కోత విధించింది. ఇప్పటికే అనధికారిక విద్యుత్ కోతలతో సతమతమవుతున్న అన్నదాతలను మరింత కష్టాల్లోకి నెట్టింది ప్రభుత్వం. వ్యవసాయానికి రెండు విడతల విద్యుత్ సరఫరా అనధికారిక కోతలతో 4-5గంటలకు మించి అందని పరిస్థితి. ఈ నేపథ్యంలో ఒక గంట విద్యుత్ సరఫరాకు అధికారికంగా కోత పెట్టడంతో రైతన్నల పరిస్థితి ‘గోరు చుట్టుపై రోకటి పోటు’ చందంగా మారింది. ఏడు గంటల త్రీఫేజ్ కరెంటు ఇచ్చిన రోజుల్లోనే సరిగ్గా మూడు గంటలు కూడా సరఫరా కాని విద్యుత్ గంట కోత కారణంగా రెండు గంటలు కూడా నాణ్యమైన విద్యుత్ సరఫరా అయ్యే అవకాశాలు ఉండవని రైతులు అంటున్నారు. రైతులు బోరుబావులపైనే ఆధారపడి పంటలు సాగు చేశారు. యాచారం మండలంలోని 20 గ్రామాల్లో దాదాపు రెండు వేల ఎకరాలకు పైగా వరి సాగు చేశారు. రెండు వేల ఎకరాలకు పైగా వివిధ రకాల కూరగాయల పంటలను సాగు చేయడానికి రైతులు సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం పంటలన్నీ ప్రారంభ దశలో ఉన్నాయి. మున్ముందు ఎండలు ముదరనుండడంతో నీరు ఎక్కువగా అవసరముంటుంది. ఏడు గంటలకు బదులు తొమ్మిది గంటల కరెంటు ఇచ్చినా పంటలకు నీరు అందడం కష్టమే. అటువంటి సమయంలో ఏడు గంటలు ఇచ్చే త్రీఫేజ్ ఉచిత విద్యుత్‌ను గంట కోత విధించి ఇక ఆరు గంటలే ఇస్తాననడంతో పంటలు ఎండిపోయి అప్పులుపాలు చేయడమేనని రైతులు మండిపడుతున్నారు. వరి, వేరుశనగ, కూరగాయల పంటలపై ప్రభావం అనధికార, అధికార కోతలతో వివిధ పంటల సాగుపై ప్రభావం పడే అవకాశం ఉందని వ్యవసాయరంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా ప్రస్తుతం రబీలో రెండో పంటగా వరి, కాయ తయారీ చివరి దశలో ఉన్న వేరుశనగ, పొలాల్లో చెరకు పంట సాగుకు కర్రలు నాటేందుకు రైతులు సిద్ధంగా ఉన్నారు. వేసవిలో పెళ్లిళ్ల సీజన్ ఉంటుంది. ఈ క్రమంలో హైదరాబాద్ చుట్టూ విస్తరించి ఉన్న జిల్లాలో వేసవి పంటలుగా బెండ, టమాటా, వంకాయ తదితర కూరగాయల పంటలు అధికంగా సాగు చేస్తారు. పెళ్లిళ్ల సీజన్లో కూరగాయల వినియోగం అధికంగా ఉంటుంది కాబట్టి ఇప్పటి నుంచే పంటలు సాగు చేస్తే ఏప్రిల్, మే నెల నాటికి దిగుబడులు వస్తాయి. ఈ పరిస్థితుల్లో ఆయా పంటలకు నీటి వినియోగం ఎక్కువగా ఉంటుంది. దాదాపు ఆయా పంటలన్నీ బోర్ల కింద రైతులు సాగు చేస్తారు. ఈ నేపథ్యంలో గంట కోత విధించడం ఆయా పంటల సాగుకు నీటి కష్టాలు తప్పవని రైతులు దిగులు చెందుతున్నారు. జిల్లా శివారు ప్రాంతాల్లో పాల వినియోగం అధికం. అవసరమైన పాల ఉత్పత్తికి రైతులు పశువులకు పచ్చిమేతకు బోర్లకింద పశుగ్రాసం సాగు చేస్తారు. తాజాగా కరెంట్ కోత కారణంగా ఆయా పంటలకు ఇబ్బందులు తప్పవని వ్యవసాయ రంగ నిపుణులు అంటున్నారు. కక్షపూరితంగా ప్రభుత్వ నిర్ణయం ప్రభుత్వం రైతులపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోంది. సమృద్ధిగా వర్షాలు కురిసిన సమయంలో రైతులు పంటలు పూర్తిగా సాగు చేసుకున్నారు. ఈ దశలో కరెంటు సమస్యలు రైతులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. మళ్లీ గంట కోత విధింపు వల్ల పంటలు గట్టెక్కడం కష్టమే. - కాయితి యాదగిరిరెడ్డి, సీపీఐ నాయకుడు మాల్, యాచారం మండలం అప్పుల పాలు ఖాయం నీటి వనరులతో పేద రైతులు వేల రూపాయలు ఖర్చు చేసి పంటలు సాగు చేసుకున్నారు. నేను రూ. 30 వేలు ఖర్చు చేసి రెండెకరాల్లో వరి, కూరగాయల పంటలు సాగు చేశాను. కరెంటు ఉంటేనే పొలం పారేది. కానీ ప్రస్తుత తీరు చూస్తుంటే పంటలు ఎండి అప్పులు మిగలడం ఖాయమనిస్తోంది. - జోగు యాదయ్య, రైతు, యాచారం మండలం మున్ముందు నీటి అవసరం ఎక్కువ వచ్చేది ఎండా కాలం నీటి అవసరం ఎక్కువగా ఉంటుంది. నేను రూ. 60 వేలకు పైగా పెట్టుబడితో ఐదు ఎకరాల్లో వరి పంట సాగు చేశాను. కరెంటు ఆరు గంటలు ఉన్నప్పుడే పొలం పారడం కష్టంగా మారింది. ఇక గంట కోత విధింపుతో కష్టంగా మారనుంది. 15 రోజుల్లో ఎండలు ప్రారంభం కావడం, కోతల వల్ల పైరు ఎదగడం కష్టంగానే ఉంటుంది. - లిక్కి పాండురంగారెడ్డి, రైతు, చింతపట్ల, యాచారం మండలం కోత ఎత్తేయాలి రైతుల ఇబ్బందులను ప్రభుత్వం దృష్టిలో పెట్టుకోవాలి. గంట కోత ఎత్తేసి నాణ్యమైన ఏడు గంటల త్రీఫేజ్ ఉచిత విద్యుత్ ఇవ్వాలి. అప్పుడే పంటలు చేతికొచ్చే అవకాశం ఉంటుంది. కానీ ప్రభుత్వానికి ఇవేమీ పట్టడం లేదు. అన్నదాలంటే చులకనైంది. వైఎస్ మరణం తర్వాత రైతుల బాధలను పట్టించుకునే వారే లేకుండాపోయారు. - అమీర్‌పేట్ బుగ్గరాములు, రైతు, చౌదర్పల్లి, యాచారం మండలం -
ఆదర్శం అదృశ్యం!
ఆదర్శ రైతులకు ఏడాదిగా అందని భృతి బకాయిలు రూ.1.88 కోట్లు జిల్లాలో 389 పోస్టులు ఖాళీ నియామకంపై దృష్టి సారించని ప్రభుత్వం అన్నదాతలకు దూరమవుతున్న ప్రయోజనం ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ‘ఆదర్శ’ం మంటకలుస్తోంది. వ్యవసాయాభివృద్ధికి దోహదపడేందుకు ఏర్పాటు చేసిన ఆదర్శ రైతు వ్యవస్థ నిర్వీర్యమవుతోంది.ఏడాదిగా గౌరవ భృతి లేక.. ఖాళీ అయిన స్థానాల్లో కొత్త వారిని నియమించకపోవడంతో పథకం లక్ష్యం నీరుగారుతోంది. ఈ వ్యవస్థను బలోపేతం చేయాలంటూ ఆదర్శ రైతులు ఉద్యమిస్తున్నా.. ప్రభుత్వం కనీసం పట్టించుకోకపోవడం రైతుల పట్ల కాంగ్రెస్ చిత్తశుద్ధిని చాటుతోంది. విశాఖ రూరల్/నర్సీపట్నం, న్యూస్‌లైన్: అన్నదాతలకు అండగా ఉంటూ, ఆధునికసాగు పద్ధతులను రైతులకు చేరవేసే లక్ష్యంతో దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర్‌రెడ్డి 2007లో ఆదర్శరైతు పథకాన్ని ప్రవేశపెట్టారు. వ్యవసాయ రంగంలో ప్రభుత్వం తీసుకొచ్చే కొత్త విధానాల అమలుతోపాటు అధికారులు, రైతులకు అనుసంధానంగా వ్యవహరించడం దీని ముఖ్యోద్దేశం. పొలంబడి, శ్రీవరి వంటి నూతన ప్రయోగాలను రైతులకు వివరించేందుకు ప్రభుత్వం ప్రయత్నం చేసింది. ఇందులో భాగంగా జిల్లాలో 1958 మందిని ఆదర్శ రైతులుగా నియమించారు. ఏడాదిగా గౌరవ వేతనం లేదు : ఆదర్శ రైతులు ఒక్కొక్కరికీ నెలకు రూ.వెయ్యి చొప్పున గౌరవ వేతనం చెల్లించాల్సి ఉంది. కనీస వేతనం కోసం వారు డిమాండ్ చేస్తున్నప్పటికీ పట్టించుకోని ప్రభుత్వం వారికిచ్చే రూ.వెయ్యి కూడా సక్రమంగా ఇవ్వడం లేదు. ఐదు ఆరు నెలలకు ఒకసారి నిధులను మంజూరు చేస్తోంది. గతేడాది ఫిబ్రవరి నుంచి ఇప్పటి వరకు వీరికి రూపాయి కూడా విడుదల చేయలేదు. వ్యవసాయాభివృద్ధి కోసం రైతుల్లో చైతన్యం కలిగించడానికి ప్రయత్నించాల్సిన ఆదర్శ రైతులు గౌరవ భృతి కోసం రోడ్డెకేలా చేసింది. ఇప్పట్లో వారికి రూ.1.88 కోట్లు అందించే అవకాశాలు కనిపించడం లేదు. జిల్లాలో 389 ఖాళీలు : జిల్లాలో 1958 మంది ఆదర్శ రైతులను గతంలో నియమించగా ప్రభుత్వ ఆదేశాల ప్రకారం పనితీరు బాగోలేదంటూ వారిలో కొంత మందిని అధికారులు తొలగించారు. మరికొంత మంది వివిధ ఎన్నికల్లో పోటీ చేయడం, ఇతరత్రా కారణాల వల్ల జిల్లాలో 389 ఆదర్శ రైతుల పోస్టులు ఖాళీ అయ్యాయి. రెండేళ్లుగా వీటిని భర్తీ చేయలేదు. వాస్తవానికి కొత్త వారి నియామకానికి సంబంధించి జిల్లా ఇన్చార్జి మంత్రి తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. రెండేళ్లలో జిల్లాకు ముగ్గురు ఇన్చార్జి మంత్రులు మారారు. ఏ ఒక్కరూ ఆ దిశగా ఆలోచన చేయకపోవడం గమనార్హం. ఇప్పట్లో ఖాళీలను భర్తీ చేసే అవకాశం లేదని అధికారులే చెబుతున్నారు. దీని బట్టి చూస్తే కాంగ్రెస్ ప్రభుత్వ భవిష్యత్తులో ఆదర్శ రైతు వ్యవస్థను కొనసాగిస్తుందా.. లేక నిర్వీర్యం చేస్తుందా? అన్న సందేహాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. -
చెరకు రైతుకు నిరాశే!
మద్దతు ధరపై చేతులెత్తేసిన ‘గోవాడ’ టన్నుకు రూ.2100 మాత్రమేనని ప్రకటన గిట్టుబాటు కాదని అన్నదాతల ఆందోళన చోడవరం, న్యూస్‌లైన్ : రైతుల ఆశలపై గోవాడ సుగర్ ఫ్యాక్టరీ నీళ్లు చల్లింది. వ్యవసాయ పెట్టుబడులు పెరిగిపోవడంతో టన్నుకు కనీసం రూ.2500 అయినా చెల్లిస్తారని ఎదురుచూసిన అన్నదాతలకు నిరాశే మిగిలింది. 2014-15 సీజన్‌కు సంబంధించి టన్ను రూ.2100లే ఇస్తామని యాజమాన్యం ప్రకటించింది. టీడీపీకి చెందిన ప్రస్తుత చైర్మన్ మల్లునాయుడు అధికారంలోకి రాకముందు టన్నుకు రూ. కనీసం 2500దాటి ఇవ్వాలని పలుమార్లు తన పార్టీ ఎమ్మెల్యేలు కెఎస్ఎన్ఎస్ రాజు, గవిరెడ్డి రామానాయుడుతో కలిసి ఫ్యాక్టరీ ఎదుటు ధర్నాలు, ఆందోళనలు చేపట్టారు. రైతులు దీనిని నమ్మి మల్లునాయుడు బృందానికి పట్టం కట్టారు. అధికారం చేపట్టిన వెంటనే గత సీజన్లో టన్నుకు రూ.300 బోనస్ ఇచ్చారు. ఇప్పుడు మాత్రం రూ.2100లుగా మద్దతు ధర ప్రకటించడాన్ని రైతులు జీర్ణించుకోలేకపోతున్నారు. అందరిలో ఆగ్రహం వ్యక్తమవుతోంది. గతేడాది వరకు కేంద్రం మద్దతు ధర ఆశాజనకంగా ప్రకటించకపోవడం వల్లే తాము ఇవ్వలేకపోతున్నామంటూ ఫ్యాక్టరీలు తప్పించుకునేవి. ఈ సారి టన్నుకు రూ.2125 విధిగా చెల్లించాలని కేంద్రం ముందుగానే ప్రకటించింది. గతంలో కేంద్రం ప్రకటించిన ధరకు అదనంగా మూడు నాలుగు వందలు కలిపి రైతులకు ఫ్యాక్టరీ యాజమాన్యాలు చెల్లించేవి. కేంద్రం ప్రకటించిన రూ.2125 ధరను కూడా గోవాడ ఫ్యాక్టరీ ఇవ్వకపోవడంతో రైతుల్లో నిరాశ వ్యక్తమవుతోంది. ఈ ఫ్యాక్టరీ కంటే చిన్నదైన ఏటికొప్పాక ఇటీవల జరిగిన మహాజన సభలో రూ.2125లు మద్దతు ధరను ప్రకటించిన విషయం తెలిసిందే. సమీపంలోని ఫ్యాక్టరీ చెల్లిస్తున్న ధరను కూడా గోవాడ ఎందుకు ఇవ్వలేకపోతోందని రైతులు ప్రశ్నిస్తున్నారు. రైతులకు ప్రస్తుత ధర ఏ మాత్రం గిట్టుబాటు కాదు. గతేడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది పెట్టు బడులు బాగా పెరిగాయి. తుఫాన్లకు పంట ముంపునకు గురయింది. రోజుల తరబడి నీటి నిల్వతో దిగుబడి తగ్గిపోయింది. ఈ పరిస్థితుల్లో ఫ్యాక్టరీ గతేడాది కంటే ఎక్కువ ధర ఇచ్చి ఆదుకుంటుందని అనుకుంటే చేతులత్తేయడంతో చెరకు రైతు దిగ్గుతోచని స్థితిలో పడ్డాడు. ఇక చెరకు సాగు చేయలేమని ఆందోళన వ్యక్తం చేస్తున్నాడు. ఇంతకు మించి ఇవ్వలేం: చైర్మన్, ఎండీ ప్రస్తుత పరిస్థితుల్లో టన్నుకు రూ.2100 మించి చెల్లించలేమని ఫ్యాక్టరీ చైర్మన్ గూనూరు మల్లునాయుడు,ఎండీ వెంకటరమణారావు బుధవారం తేల్చి చెప్పేశారు. మార్కెట్లో క్వింటా పంచదార ధర రూ.2600కు ఘోరంగా పడిపోవడంతో ఉత్పత్తి ఖరీదే రావడంలేదని వారు చెప్పా రు. పంచదార నిల్వలు అమ్ముడవ్వక ఇప్పటికే ఇబ్బందిపడుతున్నామని చెప్పారు. -
నీరు వృథా..రైతు వ్యధ
రిజర్వాయర్లు నిరుపయోగం పూడిక తో ఇబ్బందులు పాడైన గేట్లతో ఇక్కట్లు 1600 ఎకరాలకు సాగునీరు ప్రశ్నార్థకం పట్టించుకోని అధికారులు మాకవరపాలెం, న్యూస్‌లైన్ : నీటి కోసం అన్నదాత అష్టకష్టాలు పడే రోజులివి.. అనావృష్టి కారణంగా పచ్చని పొలాలు బీడువారి పోతూ ఉంటే కన్నీళ్లతో చూస్తూ కుమిలిపోవడం తప్ప మరేం చేయలేని కాలమిది.. ఇటువంటి పరిస్థితుల్లో విలువైన జీవజలం వృథాగా పోతూ ఉంటే వ్యవసాయదారుకు ఎంత వేదనగా ఉంటుం ది? మాకవరపాలెం మండలంలోని మామిడిపాలెం, పాపయ్యపాలెం రిజర్వాయర్ల దిగువన గల రైతన్నలకు ఈ పరిస్థితి అనుభవమవుతోంది. అటు పేరుకుపోతున్న పూడిక వల్ల, ఇటు పాడైన రిజర్వాయర్ గేట్ల వల్ల నీరు పొలాలకు చెందకుండా పోతోంది. పూడికతో సతమతం : మండలంలోని తూటిపాల పంచాయతీ శివారు మామిడిపాలెం గ్రామ సమీపంలో 1975లో రిజర్వాయర్‌ను నిర్మించారు. తూటిపాల, మామిడిపాలెం, పాతలూరు, అడిగర్లపాలెం, రామారాయుడుపాలెం గ్రామాలకు చెందిన 600 ఎకరాలకు నీరందించేందుకు లక్ష్యంగా నిర్ణయించారు. నిర్మించిన ఐదు సంవత్సరాలపాటు రిజర్వాయర్ నుంచి సక్రమంగా నీరు అందింది. అనంతరం ఇసుక రిజర్వాయర్ గర్భంలో చేరింది. ఇదీ పరిస్థితి రిజర్వాయర్ గర్భం సుమారు 12 అడుగలమేర పూడిక పేరుకుపోయింది. భారీ వర్షాలు కురిసినా చుక్కనీరు కూడా రిజర్వాయర్ నిల్వ ఉండడం లేదు. పిచ్చిమొక్కలు పెరిగాయి. రిజర్వాయర్ పక్కనే ఉన్న రాతికట్టు కూడా గతంలో కురిసిన భారీ వర్షాలకు కొట్టుకుపోయింది. పదేళ్లుగా ఈ రిజర్వాయర్ వృథాగా పడి ఉండడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. 2009లో మదుముల మరమ్మతులకు రూ.10 లక్షలు వెచ్చించినా ప్రయోజనం లేదు. ఇదీ దుస్థితి లైనింగ్ పనులు పూర్తి చేసినా నీటిని విడుదల చేసే గేట్లు శిథిలమై రిజర్వాయర్‌లో ఉన్న నీరు నిత్యం వృథా అవుతోంది. కొంతైనా నీటిని పొలాలకు మళ్లించుకునేందుకు రైతులు గేటువద్ద ఇసుక మూటలు వేసుకుంటున్నారు. ఈ రిజర్వాయర్ల ద్వారా పూర్తి స్తాయిలో సాగునీరు అందేలా చూడాలని గత కొన్నేళ్లుగా అధికారులు, ప్రజా ప్రతినిదులకు రైతులు చేస్తున్న విన్నపాలు నీటిమూటలుగానే మిగిలాయి. మరమ్మతులకు నోచని గేట్లు మండలంలోని పాపయ్యపాలెం గ్రామ సమీపంలో 1998లో జిజిగెడ్డ ఆధారంగా రిజర్వాయర్‌ను నిర్మించారు. ఈ రిజర్వాయర్ నుంచి బూరుగుపాలెం, పాపయ్యపాలెం, బుచ్చన్నపాలెం, ముసిడిపాలెం, వెంకటాపురం, రామారాయుడుపాలెం ప్రాంతాల్లోని 1000 ఎకరాలకు సాగునీరు అందేది. కొన్ని సంవత్సరాలు సాగునీరు బాగానే అందినా క్రమేపీ కాలువలు పూడుకుపోయి భూములకు నీరు సక్రమంగా అందేదికాదు. ఈ పరిస్థితుల్లో రైతుల అభ్యర్ధన మేరకు అప్పటి మంత్రి కొణతాల రామకృష్ణ చొరవతో 2009లో నాటి సీఎం రాజశేఖరరెడ్డి కాలువ లైనింగ్‌కు రూ. 38 లక్షలు నిధులు విడుదల చేశారు. -
కరువా! ఏదీ, ఎక్కడ?
=ప్రభుత్వానికి కనిపించని అన్నదాత కష్టం =కరువు జిల్లాల జాబితాలో విశాఖకు దొరకని స్థానం =రైతుల కొంప ముంచిన అక్టోబర్ వర్షం సాక్షి, విశాఖపట్నం : అనుకున్నట్టే అయింది... అన్నదాతకు ప్రభుత్వం చల్లగా షాకిచ్చింది. కరువు ఛాయలు జిల్లాలో లేనేలేవని స్పష్టం చేసింది. అక్టోబర్‌లో కురిసిన భారీ వర్షాల సాక్షిగా దుర్భిక్షానికి జిల్లాలో ఆస్కారం లేదని తేల్చేసింది. మార్గదర్శకాల ప్రకారం జిల్లాలో కరువు లేనేలేదని తేల్చి చెప్పేసింది. రైతన్నకు మొండి చేయి చూపింది. పొరుగు జిల్లా విజయనగరంలోని ఐదు మండలాల్ని కరువు జాబితాలో చేర్చినప్పటికీ మన జిల్లాలో ఒక్క దానికీ చోటు కల్పించకుండా వింత పోకడ అనుసరించింది. నిబంధనల కారణంగా ఇప్పటికే వరద పరిహారానికి దూరమైన జిల్లా రైతులకు ఇదొక షాక్ అయ్యింది. ఖరీఫ్ సీజన్‌కు ముందే రుతు పవనాలు ప్రవేశించడంతో ఈ ఏడాది వర్షాలు బాగా పడతాయని భావించి పంటలు సాగు చేశారు. సాధారణ విస్తీర్ణం 2.02,308 హెక్టార్లైతే అందులో 1,91,857 హెక్టార్లలో సాగు చేశారు. భారీ ఎత్తున వరి సాగు చేశారు. కానీ సీజన్ ప్రారంభం తర్వాత వరుణుడు ఎండగట్టేశాడు. దీంతో వేలాది హెక్టార్లు ఎండిపోయాయి. తక్కువ వర్షపాతం నమోదైన కారణంగా దాదాపు 30మండలాల్లో కరువు ఏర్పడిందని అధికారులు సూచన ప్రాయంగా తేల్చారు. ఈ నేపథ్యంలో ఎన్ని ఎకరాలకు కరువు ముప్పు వాటిల్లిందో అంచనా వేసి, అక్టోబర్ నెలాఖరు కల్లా నివేదిక ఇవ్వాలని వ్యవసాయ అధికారుల్ని కలెక్టర్ ఆదేశించారు. దీంతో కరువును ఎదుర్కొన్న రైతులంతా అధికారులపైనే ఆశలు పెట్టుకున్నారు. కానీ వారి ఆశలు అడియాసలయ్యాయి. ఈలోపే బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా అక్టోబర్‌లో కురిసిన భారీ వర్షాలు దాదాపు పంటను ముంచేశాయి. అంతేకాకుండా అంతవరకు ఉన్న కరువు పరిస్థితుల్ని కన్పించకుండా చేశాయి. కానీ కలెక్టర్ ఆదేశాల మేరకు కరువు నివేదిక తయారీ కోసం అధికారులు క్షేత్రస్థాయికి వెళ్లేసరికి కరువు పరిస్థితులు కన్పించలేదు. సాధారణ విస్తీర్ణానికి సమానంగా సాగు విస్తీర్ణం జరిగిందని వారి సర్వేలో తేలింది. జూన్ నుంచి అక్టోబర్ వరకు వర్షపాతం తక్కువగానే ఉంది. ఒక్క అక్టోబర్‌లో అత్యధిక వర్షం పడింది. దీంతోఅధికారులు క్షేత్రస్థాయికి వెళ్లే చూసేసరికి ఎండి పొయిన పంటలు కన్పించలేదు. ఆవిధంగానే ప్రభుత్వానికి వ్యవసాయ అధికారులు నివేదిక పంపించారు. మండలాన్ని ఒక యూనిట్‌గా తీసుకుని ప్రాంతాల వారీ సాధారణ వర్షపాతం కన్న 25నుంచి15శాతం తక్కువ నమోదైన వాటినే కరువు మండలాల కింద రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేసింది. అధికారుల నివేదిక ప్రకారం ఈ మార్గదర్శకాల పరిధిలోకి జిల్లాలో ఏ ఒక్క మండలం రాలేదు. దీంతో జిల్లాలో కరువే లేదని తేల్చేసింది. వరద పరిహారంలో కూడా రైతులకు న్యాయం జరగలేదు. నిబంధనల మేరకు 50 శాతం పైబడి పంట నష్టపోయిన రైతుల్ని మాత్రమే ఎంపిక చేయడంతో ఆ లోపు ఉన్న రైతులందరికీ అన్యాయం జరిగింది. మొత్తానికి అటు కరువుకు నోచుకోక, ఇటు వరద పరిహారానికి ఎంపిక కాక రైతులు తీవ్ర నష్టపోయిన పరిస్థితి ఏర్పడింది. -
కన్నీటి సేద్యం (రౌండప్ 2013)
ఏడాది గడిచిపోయింది. కాలగర్భంలో కలిసిపోతున్న 2013లో అన్నదాతలకు అన్నీ కష్టాలే. కర్షక లోకానికి కలిసిరాని సంవత్సరంగా మిగిలిపోయింది. మొదట్లో ఊరించి, మధ్యలో ఎండగట్టి, చివరిలో ముంచేసి రైతన్నను కకావికలు చేసింది. వరుస తుపాన్లతో రైతులకు కంటిమీద కునుకు లేకుండా పోయింది. ఏడాది పొడవునా ఆటుపోట్లు ఎదుర్కొన్నారు. కష్టాలను దిగమింగి.. కన్నీటితో సేద్యం చేశారు. ఆదుకోవాల్సిన ప్రభుత్వం చేష్టలుడిగి చూడటంతో సాగంటేనే భయపడే దుస్థితి దాపురించింది. ప్రకృతి ప్రకోపంతో రైతాంగానికి తీరని అన్యాయమే జరిగింది. 2013లో అన్నదాతలు ఎదుర్కొన్న కష్టాలను ఒక్కసారి అవలోకనం చేసుకుందామిలా.. -సాక్షి, విశాఖపట్నం కొంప ముంచిన నిబంధనలు ప్రభుత్వ నిబంధనలు రైతుల కొంప ముంచాయి. పంట నష్టాల విషయంలో ప్రాథమిక అంచనాకు, తుది అంచనాకు పొంతన లేకుండా పోయింది. 50 శాతం పైబడి నష్టపోతేనే లెక్కలోకి తీసుకోవాలన్న నిబంధనలతో జిల్లావ్యాప్తంగా 14,923 హెక్టార్లలో పంట నష్టం వాటిల్లినట్టు పేర్కొన్నారు. 59,387మంది రైతులకు రూ.13.85 కోట్ల మేరకు ఇన్పుట్ సబ్సిడీ చెల్లించాల్సి ఉందని స్పష్టం చేశారు. అంటే రైతుకొచ్చేది కంటి తుడుపు సాయమే. ఉద్యానవన పంటలదీ అదే పరిస్థితి ఉద్యాన వన పంటలకు అదే పరిస్థితి ఎదురైంది. అల్పపీడనంతో కురిసిన భారీ వర్షాలకు 1132 హెక్టార్లలో కూరగాయలు, అరటి, బొప్పాయి , పువ్వులు తదితర పంటలు నీట మునిగాయి. దాదాపు రూ.5.05 కోట్లు నష్టం వాటిల్లినట్టు అంచనా వేశారు. కానీ నిబంధనల కారణంగా ఎన్యూమరేషన్ పూర్తయ్యేసరికిరూ.1031 హెక్టార్లలో మాత్రమే పంట దెబ్బతిని, సుమారు రూ.4 కోట్ల నష్టం జరిగిందని లెక్క తేల్చారు. పరిహారం పరిహాసం గతేడాది నవంబర్‌లో సంభవించిన నీలం తుపాను కారణంగాా నష్టపోయిన రైతులకు రూ.30.24 కోట్లకు పెట్టుబడి రాయితీ ఇవ్వవలసి ఉండగా రెండు విడతలుగా రూ.23 కోట్లను మాత్రమే ఈ ఏడాది విడుదల చేసింది. ఈ ఏడాది జరిగిన నష్టానికైతే అతీగతి లేదు. కనీసం ఆదుకునే ప్రయత్నం చేయలేదు. వర్షాలు తెరిపిచ్చాక సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, కేంద్ర మంత్రి చిరంజీవి, జిల్లా మంత్రులు పర్యటించి హామీలిచ్చి వెళ్లిపోయారే తప్ప ఇంతవరకు ఒక్కపైసా విడుదల చేసిన దాఖలాల్లేవు. రబీ ఆలస్యం కాస్త ఆలస్యమైనా రబీ సాగు ఈ ఏడాది పెరగనుంది. భారీ వర్షాలకు పెరిగిన నీటి వనరులతో జిల్లాలో సాధారణ విస్తీర్ణం కన్నా ఎక్కువ సాగు కానుంది. ఖరీఫ్ నష్టాన్ని రబీలో కొంతైనా భర్తీ చేసుకునే అవకాశం ఉంది. 41,310 హెక్టార్లలో సాగు జరగొచ్చని అంచనా వేశారు. ఇప్పటివరకు 13,623 హెక్టార్లలో సాగు జరిగింది. భారీ వర్షాల కారణంగా నీటిలోనే పంటలు దాదాపు ఉండటంతో కోత ఆలస్యం జరిగింది. దీంతో రబీ సీజన్ నిర్దేశిత సమయానికి ప్రారంభం కాలేదు. జనవరిలో ముమ్మరంగా సాగు జరగనుంది. ఇసక మేటలు అక్టోబర్‌లో కురిసిన భారీ వర్షాలతో నదులు, చెరువులు, రిజర్వాయర్లు పొంగి ప్రవహించాయి. వీటితోపాటు ఎగువ ప్రాంతాల నుంచి వచ్చిన వరద నీరుతో నదీ పరివాహక ప్రాంతాల్లోని పొలాల్లో ఇసుక మేటలు ఏర్పడ్డాయి. తాండవ, వరాహ, శారద నదులను ఆనుకుని ఉన్న పొలాల్ని దాదాపు కప్పేసేలా ఇసుక చేరింది. దాదాపు 120 హెక్టార్లకు ఇసుకమేటలు ఏర్పడాయి. ఇప్పుడా ఇసుకను తొలగించాలంటే ప్రభుత్వమే ఆదుకోవాలి. కానీ ఇంతవరకు స్పందించలేదు. కరకట్టలు నిర్మించాలని ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా రూ.110 కోట్లతో ప్రతిపాదనలు పంపించారు. ఖరీఫ్ ఆరంభం బాగుంది ఖరీఫ్‌కు ముందే వర్షాలు కురవడంతో రైతన్న సంబరపడ్డాడు. ఖరీఫ్‌లో పంట పండుతుందని భావించాడు. దీంతో జిల్లా సాధారణ విస్తీర్ణం 2 లక్షల 3 వేల 308 హెక్టార్లు కాగా లక్షా 91 వేల 857 హెక్టార్లలో వివిధ పంటలు సాగులోకి వచ్చాయి. ఇందులో వరి ఒక్కటే 96,682 హెక్టార్లలో సాగయ్యింది. సాధారణ విస్తీర్ణం కన్నా 15 హెక్టార్ల ఎక్కువే. కానీ సాగు మొదలు పెట్టాక వర్షాలు ఎండగట్టాయి. దీంతో దాదాపు 30 మండలాల్లో కరువు ఛాయలు అలుముకున్నాయి. అనంతరం అక్టోబర్‌లో కురిసిన భారీ వర్షాలతో అదేమీ కనిపించకుండా పోయింది. వర్షపాతం, వరదలతో నాలుగైదు మండలాలు మినహా దాదాపు ఎక్కడా కరువు లేదని అధికారులు తేల్చేశారు. ప్రభుత్వానికి అదే నివేదిక ఇచ్చారు. ఏజెన్సీలో రాజ్మాకు తీవ్ర నష్టం భారీ వర్షాలకు ఏజెన్సీలో ప్రధాన పంటైన రాజ్మా తీవ్రంగా దెబ్బతింది. 3,312 ఎకరాల్లో రూ.83 లక్షల విలువైన పంట నష్టపోయింది. అసలే ఏజెన్సీ, ఆ పై గిరిజనులు. ఇప్పుడు వార్ని ఆదుకోకపోతే నట్టేట మునగాల్సిందే. రైతుకు అందని చేయూత వ్యవసాయ యాంత్రీకరణ, ఆహార భద్రతా మిషన్ కార్యక్రమాలతో రైతులు మరింత దిగుబడులు సాధించొచ్చన్న ఉద్దేశంతో సబ్సిడీపై పలు యూనిట్లు మంజూరు చేసే అవకాశం ఉంది. ఈమేరకు యాంత్రీకరణ కింద 1400 యూనిట్లు అందజేసేందుకు జిల్లాకు .4.41 కోట్లు విడుదల అవ్వగా ఇంతవరకు రూ.7 లక్షలతో కేవలం 25 పనిముట్లను మాత్రమే అందజేశారు. ఆహార భద్రతా మిషన్ కింద ఈ ఏడాది వరి, పప్పు దినుసుల సాగు ప్రోత్సాహం కోసం 50 శాతం సబ్సిడీతో 1248 పనిముట్లు అందజేసేందుకు రూ.1.13 కోట్లు విడుదలవ్వగా ఇంతవరకు రూ.43 లక్షల విలువైన 443 యూనిట్లు మాత్రమే అందజేశారు. రాష్ట్రీయ కృషి వికాస్ యోజన కింద 1097 యూనిట్లు పంపిణీ చేసేందుకు గాను 2.01 కోట్లు విడుదలవ్వగా వీటిలో 6.19 లక్షలు విలువైన 313 యూనిట్లు మాత్రమే రైతులకు అందజేశారు. ముంచేసిన అల్పపీడనం పై-లీన్..హెలెన్.. లెహర్.. మాది.. ఇలా తుపాన్ల బెడద తప్పినప్పటికీ.. మధ్యలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ముంచెత్తిన వర్షాలు పంటలకు తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి. దాదాపు వారం రోజులపాటు వర్షాలు పడ్డాయి. ప్రాథమిక అంచనా ప్రకారం 27,285 హెక్టార్లలో రూ.60 కోట్లు నష్టం వాటిల్లింది. 17,855 హెక్టార్లలో వరి, 6079 హెక్టార్లలో చెరకు, 1212 హెక్టార్లలో పత్తి, 143 హెక్టార్లలో జొన్న, 653 హెక్టార్లలో రాజ్మా, 255 హెక్టార్లలో పొగాకు, 70 హెక్టార్లలో వేరుశనగ, 813 హెక్టార్లలో రాగి, 155 హెక్టార్లలో పెసలు, 50 హెక్టార్లలో కంది పంటలు దెబ్బతిన్నాయి. చెరకు రైతు పరిస్థితి దయనీయం చెరకు రైతుకు సాగు వ్యయం పెరుగుతున్న స్థాయిలో కేంద్రం ఇచ్చే మద్దతు ధర పెరగడం లేదు. దీంతో సహకార చక్కెర కర్మాగారాల దయాదాక్షిణ్యాలపైన చెరకు రైతులు ఆధారపడుతున్నారు. 2012-13లో కేంద్ర ప్రభుత్వం రూ. 1700 మద్దతు ధర ప్రకటించింది. దీనికి రాష్ట్రం మరో రూ. 300 కలిపి రూ. 2వేల వరకు ఇస్తుందని ఆశించా రు. సీజన్ ముగిసినా ఎటువంటి సాయం రాలేదు. దీంతో కర్మాగారాలే తమకొచ్చిన లాభాల నుంచి కొంత మొత్తం ఇచ్చాయి. కానీ ఆ సాయం ఎటూ సరిపోలేదు. రైతులు నష్టాలనే చవిచూశారు. 2013-14లో కేంద్ర ప్రభుత్వం టన్నుకు రూ.2100 మద్దతు ధర ప్రకటించింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన రాలేదు. ఈలోపే భారీ వర్షాలు పడ్డాయి. వేలాది ఎకరాల చెరకు నీట మునగడంతో దిగుబడిపై తీవ్ర ప్రభావం చూపింది. చోడవరంలో జరిగిన రచ్చబండలో రాష్ట్ర ప్రభుత్వం కొంతైనా సాయం చేయాలని సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డిని స్థానిక ఎమ్మెల్యేలు కోరినా పట్టించుకోలేదు. -
ఆంక్షల తూకం..
ధాన్యం కొనుగోలు కేంద్రాల తీరిదీ =నూజివీడు డివిజన్లో మినహా చాలాచోట్ల బోణీ కాని వైనం =జిల్లాలో 93 కేంద్రాల్లో ఐదు కేంద్రాల్లోనే సేకరణ =కొనుగోళ్లలో నిబంధనలతో ఆవైపే చూడని అన్నదాత =బయటిమార్కెట్‌లో రైతులను దోచుకుంటున్న దళారులు సాక్షి, మచిలీపట్నం : పేరుకే అవి ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు.. వాస్తవానికి అక్కడ పెట్టే మెలికలతో చికాకు వచ్చిన రైతులు మళ్లీ కమీషన్ ఏజెంట్లకే ధాన్యాన్ని అమ్ముకోక తప్పట్లేదు. ప్రస్తుత సార్వా సీజన్లో దెబ్బతిన్న పంటను కనీస మద్దతు ధరకు కొనుగోలు చేసేలా గత నెల 25న జిల్లాలో 93 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటుచేశారు. జిల్లాలోని నాలుగు సబ్ డివిజన్ల పరిధిలో ఐకేపీ ద్వారా 42, ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల (పీఏసీఎస్) ద్వారా 51 కొనుగోలు కేంద్రాలను తెరిచారు. విచిత్రం ఏమిటంటే కొనుగోలు కేంద్రాలు తెరిచి 20 రోజులు దాటినా ఇప్పటివరకు జిల్లాలో వీటి ద్వారా సేకరించిన ధాన్యం 1100 క్వింటాళ్లు మాత్రమే. నూజివీడు డివిజన్లో 27 కొనుగోలు కేంద్రాలుంటే.. వాటిలో మర్లపాలెం, రెడ్డిగూడెం, చెక్కలపల్లి, కూనపరాజుపర్వ నాలుగు కేంద్రాల్లో మాత్రమే కొనుగోళ్లు బాగున్నాయి. విజయవాడ డివిజన్లో 20 కొనుగోలు కేంద్రాలు తెరిచినా గొల్లపూడి సెంటర్లో మాత్రమే బోణీ అయ్యింది. మచిలీపట్నం డివిజన్లో 30, గుడివాడ డివిజన్లో 16 కొనుగోలు కేంద్రాలు ఉన్నా వాటి దరిదాపులకే రైతులు వెళ్లడంలేదు. ఆ డివిజన్లలో మిల్లర్లదే పైచేయి కావడంతో అయినకాడికి వారికే అమ్ముకుంటున్నారు. దెబ్బతిన్న పంటకు ధరేదీ? జిల్లాలో వరుస వైపరీత్యాలతో కుదేలైన రైతులకు ధాన్యం కొనుగోలు కేంద్రాలు అక్కరకు రాకపోవడంతో కమీషన్ ఏజెంట్లు, మిల్లర్లను ఆశ్రయిస్తున్నారు. ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో రైతుకు కష్టమెక్కువ ధర తక్కువ అనే రీతిలో కొనుగోలు కేంద్రాలు ఉన్నాయి. అసలే దెబ్బతిన్న పంటను అరకొరగానైనా దక్కించుకునేందుకు హడావుడిగా మాసూళ్లు చేసే రైతాంగానికి కొనుగోలు కేంద్రాలు ఏ మాత్రం ఉపయోగపడటం లేదు. అందుకే ఆవైపు కన్నెత్తి కూడా చూడటం లేదు. అక్కడ ఇచ్చే ధర తక్కువగా ఉండటంతో పాటు సవాలక్ష ఆంక్షలు పెట్టడం కూడా కారణమని రైతులు చెబుతున్నారు. తూకంలో ఆంక్షలు... కొనుగోలు కేంద్రాల్లో ఆంక్షల తూకంతో రైతులు వాటిపై ఆసక్తి చూపడం లేదు. ధాన్యం సేకరణకు ఇచ్చిన మార్గదర్శకాల్లో మట్టిబెడ్డలు, రాళ్లు, ఇతర పదార్థాలు ఒక శాతం, రంగుమారిన, దెబ్బతిన్న ధాన్యం, పురుగుశాతం 4 శాతం వరకు, తప్ప తాలు గింజలు 3 శాతం, ధాన్యంలో మిగిలిన రకాలు కలిసిపోవడం 7 శాతం, తేమ 17 శాతం వరకు అనుమతిస్తున్నారు. ఈ నిబంధనలకు లోబడి ఉంటేనే బస్తా ధాన్యం రూ.1008కి కొనుగోలు చేసేలా ధర నిర్ణయించారు. వరుస విపత్తుల వల్ల కొనుగోలు కేంద్రాల్లోని నిబంధనలకు లోబడి ధాన్యం లేకపోవడం సమస్యగా మారింది. ఈ నేపథ్యంలో రైతులు ఆయా కేంద్రాల్లో ధాన్యం నాణ్యత పరిశీలన కోసం పడిగాపులు పడలేక, అక్కడి నిబంధనలు తట్టుకోలేక అయినకాడికి కమీషన్ ఏజెంట్లు, మిల్లర్లు, దళారులకు అమ్ముకోవాల్సిన పరిస్థితి దాపురించింది. దళారుల రైతుల పరిస్థితి ఆసరాగా చేసుకొని బస్తాకు రూ.800 నుంచి రూ.1000 వరకు చెల్లిస్తున్నారు. రవాణా ఖర్చులతో పోల్చితే నాణ్యమైన ధాన్యానికి కాస్త మెరుగైన ధరే లభిస్తున్నా.. విపత్తుల వల్ల నాణ్యత తగ్గిన ధాన్యం విషయంలో రైతులు దళారులు చెప్పిన ధర చెల్లించాల్సిన పరిస్థితి నెలకొంది. వారిని ఆదుకునేందుకు ప్రభుత్వం ఎలాంటి చర్యలూ తీసుకోకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. కొనుగోలు కేంద్రాలతో అమ్మకాలు వేగం జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు తెరవటం వల్ల బయట మార్కెట్లో ధాన్యం ధర దక్కేలా చేయగలిగాం. కనీస మద్దతు ధరకు కొనుగోలు కేంద్రాల్లో కొనేలా మార్గదర్శకాలు ఉన్నాయి. బస్తా ధాన్యం రూ.1008కి కొనుగోలు కేంద్రాల్లో కనీస మద్దతు ధరను నిర్ణయించాం. దీని వల్ల బయట మార్కెట్లో అదనపు ధరకు రైతు అమ్ముకునే అవకాశం వచ్చింది. జిల్లాలోని అన్ని కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొనుగోళ్లు ముమ్మరం చేసేలా చర్యలు తీసుకున్నాం. - చిట్టిబాబు, పౌరసరఫరాల శాఖ జిల్లా మేనేజర్ మొక్కుబడి కేంద్రాలు... జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు రైతులకు ఏమాత్రం ఉపయోగపడని మొక్కుబడి కేంద్రాలుగానే మారాయి. అక్కడ పెట్టే ఆంక్షలతో రైతులు వాటిపై ఆసక్తి చూపడం లేదు. గత్యంతరంలేని స్థితిలో రైతులు కమీషన్‌దారులను ఆశ్రయించి అయినకాడికి అమ్ముకుంటున్నారు. వరుస ప్రకృతి వైపరీత్యాలతో నష్టపోయిన రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. తడిసిన, రంగుమారిన ధాన్యాన్ని మద్దతు ధరకు కొనుగోలు చేసేలా ప్రభుత్వం ఇప్పటివరకు నిర్ణయాన్ని ప్రకటించలేదు. నిబంధనలు సడలించి కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం మద్దతు ధరకే కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలి. - ఎంవీఎస్ నాగిరెడ్డి, వైఎస్సార్సీపీ రైతు విభాగం రాష్ట్ర కన్వీనర్ నిబంధనల్లో సడలింపు ఏదీ నష్టపోయిన పంటల్ని జిల్లాలో పరిశీలించిన కేంద్ర బృందం ధాన్యం కొనుగోళ్లలో నిబంధనలు సడలిస్తామని చెప్పేసి వెళ్లారు. ఆ తర్వాత నిబంధనల్ని సడలించామన్న ఒక ప్రకటన కూడా ప్రభుత్వం నుంచి రానే లేదు. రంగుమారిన, సగం పాలుపోసుకున్న ధాన్యానికి మద్దతు ధర ఇవ్వకపోతే ఒక్క గింజ కూడా కొనుగోలు కేంద్రానికి తోలే అవకాశమే లేదు. - పెన్నేరు ప్రభాకర్, వడ్లమన్నాడు రైతు క్లబ్ కన్వీనరు -
అప్పుల ఊబిలో అన్నదాత
=పకృతి విపత్తులతో తప్పని తిప్పలు =పెరుగుతున్న రుణ భారంతో అవస్థలు =రాబడి తగ్గి, ఖర్చు పెరిగి బెంబేలు గాదుల్లో ధాన్యానికి బదులు బతుకుల్లో దైన్యం కదలాడుతోంది. ఇళ్లల్లో సిరులకు బదులు కళ్లలో దిగులు కనిపిస్తోంది. పదిమందికి కడుపు నింపే తృప్తితో బతికే రైతన్నకు కడుపు కాలే పరిస్థితి ఎదురవుతోంది. కాడి పట్టి లోకానికి పిడికెడు మెతుకులు పెట్టాల్సిన కర్షకుడు పుట్టెడు కష్టంలో విలవిలలాడాల్సి వస్తోంది. అక్షయంగా పంటలు పండించే అన్నదాత అప్పుల కోసం పరుగులు తీయాల్సి వస్తోంది. యలమంచిలి, న్యూస్‌లైన్: అన్నదాతలు అప్పుల తిప్పలు పడుతున్నారు. తమ చేతుల్లో సాగయిన పంటను పదిమందికీ పెట్టాల్సిన వారు ఆహార ధాన్యా ల కోసం దేవులాడుతున్నారు. ధాన్యరాశుల మధ్య కాలం గడపాల్సిన వారు సాయం కో సం దీనంగా చూస్తున్నారు. సేద్యం అప్పుల ను మిగిలిస్తూ ఉండడంతో చేయూత కోసం అలమటిస్తున్నారు. ఏడాదంతా చెమటోడ్చి కష్టపడుతున్న రైతులు బ్యాంకులు, వ్యాపారులకు వడ్డీలు చెల్లించలేక మొహం చాటేసే అవమానానికి సిద్ధపడుతున్నారు. ఏటా ప్రకృతివైపరీత్యాలు, తుఫా న్లు రైతులకు తీవ్రనష్టాలను చవిచూపిస్తున్నాయి. పరిహారం కోసం కళ్లుకాయలు కాసేలా ఎదురు చూడాల్సిన పరిస్థితి ఎదురవుతోంది. పెరిగిన కూలి ధరలు, ఎరువులు, క్రిమిసంహారక మందుల ధరలు రైతులకు గుదిబండగా మారాయి. పండించిన పం టలకు గిట్టుబాటు ధరలు లేక రైతులు ఏ ఏటికాయేడు అప్పుల ఊబిలో చిక్కుకుంటున్నారు. వెంటాడుతున్న అప్పులు... జిల్లా రైతులను ఏళ్ల తరబడి అప్పులు వెంటాడుతున్నాయి. ఏటా తీసుకున్న అప్పులకు కనీసం వడ్డీ చెల్లించలేని దుస్థితి నెలకొంది. రైతులకు కొత్త అప్పులు ఇచ్చేవాళ్లు లేకపోవడంతో ఇంట్లో ఆభరణాలను కుదువ పెట్టి, భూములను తనఖా పెట్టి కొత్త అప్పుల గండంనుంచి గట్టెక్కుతున్నారు. ఈ ఏడాది ఖరీఫ్‌లో రూ. 600 కోట్ల రుణాలు ఇచ్చామంటున్న అధికార యంత్రాంగం కొత్త రైతులకు రుణాలు ఇచ్చి న దాఖలాలు కనిపించలేదు. జిల్లాలో 50 వేల మంది కౌలు రైతులు ఉండగా 3341మందికి మాత్రమే రుణ అర్హత కార్డు లు మంజూరుచేసి కేవలం 41మంది మాత్రమే రుణాలు పం పిణీ చేసినట్టు అధికారులు చెబుతున్నారు. జాతీయ వ్యవసాయ బీమా పథకంలో కూడా సవాలక్ష నిబంధనలతో పలువురు రైతులు బీమా ప్రయోజనాన్ని పొందలేకపోతున్నారు. గిట్టుబాటేదీ? నాలుగేళ్లనుంచి ప్రకృతి వైపరీత్యాలు, తుఫాన్లతో ముంపుకు గురవుతుండడంతో పంటల దిగుబడితోపాటు నాణ్యత తగ్గుతోంది. ముఖ్యంగా వరిపంట ముంపువల్ల ధాన్యం రంగు మారుతోంది. ప్రభుత్వం మొక్కుబడిగా ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటుచేసి చేతులు దులుపుకోవడంతో రైతులు తక్కువధరలకు మిల్లర్లకు ధాన్యం అమ్ముకోవలసి వస్తోంది. చెరుకు మద్దతు ధరపై రైతులు పెదవి విరుస్తున్నారు. ఈఏడాది అల్పపీడనం, తుఫాన్లతో పలు ప్రాంతాల్లో ఎకరాకు కనీసం 10 టన్నుల చెరుకు దిగుబడి రాని పరిస్థితులు ఉన్నాయి. -
డెల్టాకు ఆల్మట్టి
వరికి ఇక ఉరే.. =బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ తీర్పు పర్యవసానం =డెల్టా రైతన్నకు తీరని అన్యాయం =వాదనలు సమర్థంగా వినిపించ లేకపోయిన ప్రభుత్వం ఇది కృష్ణాడెల్టాకు గుండెకోత.. వరి సిరులు పండించే మాగాణులను బీళ్లుగా మార్చే తీర్పు..మన పాలకుల నేరపూరిత అసమర్థ నిర్వాకానికి తరతరాలు మూల్యం చెల్లించుకోవాల్సిన దుస్థితి.. అంతర్జాతీయ నదీజలాల పంపిణీకి అనుసరించే సహజ న్యాయసూత్రాలకు సమాధి కడుతూ బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ కృష్ణానదీ జలాల పంపిణీపై ఇచ్చిన తీర్పు డెల్టా అన్నదాతకే కాదు ప్రతిఒక్కరికీ తీరని శాపంగా, శోకంగా మారింది. మిగులు జలాల హక్కును హరించింది. మునేరు, పాలేరు వరదనీటిని మిగులుజలాలుగా చూపి తీరని అన్యాయం చేసింది. ఆల్మట్టి ఎత్తుపెంపును సమర్థించి జనం నోటమట్టికొట్టింది. ఈ తీర్పుపై జిల్లా ఒక్కసారిగా భగ్గుమంది. సాక్షి, విజయవాడ : కృష్టాడెల్టాను ఎడారిలా మార్చే తీర్పుతో బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ జిల్లావాసులకు తీరని అన్యాయం చేసింది. డెల్టాలోని 13లక్షల ఎకరాల్లో వరికి ఉరి వేస్తూ అన్నదాతల తలరాతను తలకిందులు చేసేలా తయారైంది. ఈ తీర్పుపై జిల్లావాసులు ఒక్కసారిగా భగ్గుమన్నారు. రాష్ట్ర ప్రభుత్వ అసమర్థ, నిర్లక్ష్యపూరిత ఉదాసీన వైఖరి వల్లే ఈ పరిస్థితి దాపురించిందని రైతు సంఘాల నేతలు, సాగునీటిరంగ నిపుణులు విమర్శిస్తున్నారు. ఈ తీర్పు వెలువడిన వెంటనే నిరసన వ్యక్తంచేస్తూ వైఎస్సార్సీపీ నగర కన్వీనర్ జలీల్‌ఖాన్ ఆధ్వర్యంలో వన్‌టౌన్ కాళేశ్వరరావు సెంటర్లో రాస్తారోకో నిర్వహించారు. వివిధ పార్టీల నేతలు, ప్రజాసంఘాల వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తూ ఆందోళనలకు సమాయత్తమవుతున్నారు. నాగార్జునసాగర్ దిగువభాగంలోని పరీవాహక ప్రాంతంలో మునేరు, పాలేరు ఉప నదుల నుంచి వచ్చే 50టీఎంసీల నీటిని నికర జలాలుగా బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ లెక్కగట్టడం అర్థరహితమని పలువురు రైతు నాయకులు పేర్కొన్నారు. ఎగువ ప్రాంతం నుంచి వరదలు వచ్చే సమయంలోనే ఈ రెండు ఉపనదుల నీరు కృష్ణా నదిలోకి చేరుతుంది. అయితే ప్రకాశం బ్యారేజీ వద్ద మూడు టీఎంసీల కన్నా ఎక్కువ నీరు నిల్వ చేసే అవకాశం లేదు. అందువల్ల ఈ రెండు ఉపనదుల నుంచి వచ్చే నీరు వృథాగా సముద్రంలోకి పోవడమే తప్ప డెల్టాకు ఏ విధంగానూ ఉపయోగపడవు. ఇప్పటి వరకూ అటువంటి దాఖలాల్లేవు. ఈ నేపథ్యంలో బ్రిజేష్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పు వల్ల కృష్ణాడెల్టాకు జూన్, జూలై నెలల్లో నీరు ఇచ్చే అవకాశం లేకుండా పోతుంది. దీంతో వరినాట్లు ఆలస్యమవుతాయి. ఫలితంగా నవంబరు, డిసెంబర్ నెలల్లో వచ్చే తుపాన్లకు పంట చేతికి రాకుండాపోతుంది. ఈ ఏడాది ఆలస్యంగా నీరివ్వడంతో వరినాట్లు ఆలస్యమయ్యాయి. పై-లీన్, హెలెన్, లెహర్ వరుస తుపాన్లు వచ్చి రైతన్న వెన్నువిరిచిన విషయం తెలిసిందే. మిగులు జలాలపై పూర్తిహక్కు ఉన్నప్పుడే 2002, 2003 సంవత్సరాల్లో సాగర్ ఆయకట్టు పరిధిలో 20 లక్షల ఎకరాల్లో భూములు బీళ్లుగా మారాయి. ఈ తీర్పుతో డెల్టాలో సాగు ఒకటి రెండు నెలలు వెనక్కి వెళ్లే అవకాశం ఉంది. దీనివల్ల డెల్టాకు తీరని నష్టం వాటిల్లే ప్రమాదం తలె త్తుతుంది. దశాబ్దాలుగా తీరని కలగా ఉన్న పులిచింతల ప్రాజెక్టు పనులు వైఎస్ అధికారంలోకి వచ్చే వరకూ ప్రారంభం కాలేదు. ఆయన మృతితో ఆ పనులు నత్తనడక సాగుతూ ఇంకా పూర్తికాలేదు. అదే విధంగా బ్యారేజీ వద్ద మూడు టీఎంసీల నీరు కూడా ప్రస్తుతం నిల్వ ఉండడంలేదు. ఎన్టీటీపీఎస్కు నీటి సరఫరాకు బ్యారేజీలో 12 అడుగులు నిల్వ ఉంచాల్సి వస్తోంది. దీంతో బ్యారేజీలో పూడిక చేరి మట్టిదిబ్బలు ఏర్పడ్డాయి. వాటిని తొలగించకపోవడంతో ప్రస్తుతం 1.8 టీఎంసీలే నిల్వ ఉంటున్నాయి. వర్షాభావం, పైనుంచి నీరు రాకపోవడం వల్ల భూగర్బజలాలు తగ్గిపోతున్నాయి. దీంతో సముద్రపునీరు చొచ్చుకొచ్చి డెల్టాలోని చాలా భాగం ఉప్పుతేలి పంటలు పండని పరిస్థితి పొంచి ఉంది. బోర్ల కింద సాగుకు దెబ్బతింటుంది. ఆల్మట్టి ఎత్తు పెంచడం వల్ల డెల్టా రైతునోట్లో మట్టికొట్టినట్లయింది. ఈ తీర్పు ఆ ఎత్తు పెంచడాన్ని సమర్థించి డెల్టా రైతుకు తీరని అన్యాయం చేసింది. 2003-04లో రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితు ఏర్పడగా ఆల్మట్టిలో 137 టిఎంసీల నీరు ఉన్నా 10 టిఎంసీలు విడుదలచేయలేదు. భవిష్యత్‌లో కూడా ఇదే పరిస్థితి ఉండదని గ్యారెంటీ లేదు. 1956లో అంతరాష్ట్ర నదీజలాల చట్టం ప్రకారం ఏర్పాటుచేసిన ఈ ట్రిబ్యునల్ జస్టిస్ బచావత్ ట్రిబ్యునల్‌కు పూర్తి విరుద్ధంగా వ్యవహరించింది. జస్టిస్ బచావత్ ట్రిబ్యునల్ 85 ఏళ్లలో ఎంత ప్రవాహం ఉందో లెక్కగట్టి 75శాతం డిపెండబులిటీని ఆధారంగా చేసుకుని మూడు రాష్ట్రాలకు నదీజలాలను పంచింది. బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ 47 ఏళ్ల ప్రవాహాన్ని గమనంలోకి తీసుకుని 65 శాతం డిపెండబులిటీని లెక్కించడం అశాస్త్రీయమనే వాదన వ్యక్తమవుతోంది. ఈ ట్రిబ్యునల్ మధ్యంతర తీర్పు ఇచ్చినప్పుడు దీన్ని సమీక్షించేందుకు అలహాబాద్ మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అంబటి లక్ష్మణరావు నేతృత్వంలో ఒక కమిటీని కృష్ణాడెల్టా పరిరక్షణ సమితి ఏర్పాటు చేసింది. ఈ కమిటీ ముఖ్యమంత్రి ముందుకు పలు సూచనలు చేసింది. ఉత్తరాది రాష్ట్రాలలో నీటిపంపిణీకి సంబంధించిన తీర్పులలో ప్రాజెక్టులలో సిల్ట్ మేనేజ్మెంట్ (పూడిక నిర్వహణ)అనే పద్ధతిని అవలంబిస్తున్నాయి. ప్రాజెక్టులలో పూడిక ఏర్పడటం వల్ల ఎక్కువ ప్రవాహం వచ్చినా వాటిని నిల్వ చేసుకునే అవకాశం ఉండదు. ఈ అంశాలన్నింటినీ రివ్యూ పిటిషన్లో చేర్చాలని నిపుణుల కమిటీ సూచించింది. దీనిపై ముఖ్యమంత్రి హామీ ఇచ్చినా.. ట్రిబ్యునల్ ముందు సరైన పద్ధతిలో వాదించకపోవడం వల్లే ఈ సమస్య తలెత్తిందని రైతు నాయకులు విమర్శిస్తున్నారు. సరైన వాదనలు వినిపించనందున నష్టం వాటిల్లిందని దుయ్యబడుతున్నారు. డెల్టా రైతాంగానికి శరాఘాతం కృష్ణా జలాలపై బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పు డెల్టా రైతాంగానికి శరాఘాతంలా ఉంది. ఈ తీర్పులో కృష్ణా మిగులు జలాలను వాడుకునే హక్కు కూడా ఆంధ్రప్రదేశ్‌కు లేదని చెప్పడం డెల్టా రైతాంగానికి గొడ్డలిపెట్టులాంటిది. కర్ణాటకలోని ఆల్మట్టి డ్యాం ఎత్తును పెంచుకోవచ్చని తీర్పునివ్వడం దారుణం. ఈ తీర్పుతో అన్నపూర్ణగా వెలుగొందిన ఆంధ్రప్రదేశ్ ఎడారిగా మారుతుంది. ఈ విషయమై కర్ణాటక, మహారాష్ట్ర ప్రభుత్వాలు నిపుణులైన న్యాయవాదులను ఏర్పాటుచేసి బలమైన వాదనలు వినిపించడంవల్లే మనకు వ్యతిరేకంగా తీర్పువచ్చింది. మన రాష్ట్ర ప్రభుత్వం నిపుణులైన న్యాయవాదులను నియమించడంలో ఘోరంగా వైఫల్యం చెందింది. ఈ తీర్పు వల్ల కృష్ణాడెల్టాకు తీవ్ర నష్టం వాటిల్లుతుంది. సర్ ఆర్థర్ కాటన్ ఎప్పుడో కృష్ణా డెల్టాకు సాగునీరందించేందుకు విజయవాడలో ప్రకాశం బ్యారేజీ నిర్మాణం చేపట్టారు. కృష్ణా మిగులు జలాలను వినియోగించుకునే హక్కు ఆంధ్రప్రదేశ్‌కు ఉందనే కాటన్ బ్యారేజీ నిర్మాణం చేపట్టారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి స్పందించి తక్షణమే అఖిలపక్ష కమిటీ సమావేశాన్ని నిర్వహించి చర్చించాలి. కృష్ణా మిగులు జలాలపై మనకున్న హక్కులను కాపాడుకునేందుకు సుప్రీంకోర్టులో పోరాడాలి. నిపుణులైన న్యాయవాదులను నియమించి సుప్రీంకోర్టులో వాదనలు వినిపించేలా సీఎం చర్యలు తీసుకోవాలి. - వసంత నాగేశ్వరరావు, వైఎస్సార్సీపీ నాయకుడు డెల్టాకు తీరని అన్యాయం గతంలో ఇచ్చిన తీర్పునకే బ్రిజేష్ కమిటీ కట్టుబడి ఉన్నట్టుంది. డెల్టా రైతుల ఆందోళన, గోడును అసలు పరిగణనలోకి తీసుకోలేదు. ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంచుకునేందుకు అనుమతివ్వడం డెల్టాకు మరింత ఇబ్బందులు తెచ్చిపెడుతుంది. ఇప్పటికే కర్ణాటకలో రిజర్వాయర్లు నిండిన తరువాత డెల్టాకు నీరు విడుదల చేయడం వల్ల పంటల సాగుకు తీవ్ర జాప్యం జరుగుతోంది. ఈ తీర్పుతో డెల్టా భూములకు సరైన సమయంలో నీరందక సకాలంలో పంటలు వేసుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది. డెల్టా రైతాంగం తరఫున సుప్రీంకోర్టులో ఇప్పటికే కేసు వేసి ఉన్నాం. అక్కడైనా న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాం. రాష్ట్ర విభజనకు ముందే డెల్టాకు సరిగా సాగునీరు అందని పరిస్థితి నెలకొంది. విభజన జరిగి, కమిటీ తీర్పు అమలైతే డెల్టాలో రైతుల పరిస్థితి మరింత దారుణంగా ఉంటుంది. - మండలి బుద్ధప్రసాద్, రాష్ట్ర అధికార భాషా సంఘం చైర్మన్ కిరణ్ అసమర్థతే కారణం సీఎం కిరణ్ అసమర్థత వల్లే తెలుగు ప్రజలకు బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ రూపం లో ప్రమాదం ముంచుకొచ్చింది. గతంలో మధ్యంతర ఉత్తర్వుల్లో ఏవైతే ఆదేశాలున్నాయో దాదాపు ప్రస్తుత తీర్పులోనూ అవే ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం 12 సవరణలకు విజ్ఞప్తి చేస్తే ఒకదానిపై కూడా న్యాయం చేయకపోవడం దారుణం. ఆంధ్రపదేశ్ అభ్యంతరాలను పట్టించుకోకుండా కర్ణాటకకు అనుకూలంగా ఇచ్చిన తీర్పు వల్ల రాష్ట్రంలోని కృష్ణానదీ పరీవాహక ప్రాంతం మొత్తం తీవ్ర ప్రమాదంలోకి వెళ్లనుంది. ఎగువ ప్రాజెక్టులలోని నీరు దామాషా ప్రకారం ఆంధ్రప్రదేశ్‌కు విడుదలయ్యేలా ఒత్తిడి తేవాల్సి ఉంది. డిపెండబిలిటీ 65 శాతం కాకుండా 75 శాతం ఉండాలి. అప్పుడే ఆంధ్రప్రదేశ్‌కు న్యాయం జరుగుతుంది. ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లి సమర్థనీయమైన లాయర్లను నియమించి మిగులు జలాల్లో న్యాయం జరిగేలా పోరాడాలి. - సామినేని ఉదయభాను, వైఎస్సార్సీపీ జిల్లా కన్వీనర్ సుప్రీం కోర్టులో న్యాయ పోరాటం బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ తీర్పుపై సుప్రీంకోర్టులో న్యాయపోరాటం చేస్తాం. మిగులు జలాలపై ట్రిబ్యునల్ తీర్పుతో రాష్ట్రానికి తీవ్ర అన్యాయం, నష్టం జరగనుంది. రాష్ట్రం విడిపోతే ఇలాంటి సమస్యలు అనేకం వస్తాయనే రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు పోరాడుతున్నాం. తీర్పును, జలాల సమస్యను రాజకీయం చేయవద్దు. ఆల్మట్టి నిర్మాణం ఎత్తు పెంపు, మిగుల జలాలను దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డికి ముడిపెడుతూ ఆరోపణలు చేయటం సరికాదు. వాస్తవాలు తెలుసుకొని ఎవరైనా మాట్లాడాలి. ట్రిబ్యునల్‌లో వాదించే న్యాయవాదులను కాంగ్రెస్ మార్చటం వల్లే రాష్ట్రానికి అన్యాయం జరిగిందని ప్రతిపక్షాలు ఆరోపించటం మంచి పద్ధతి కాదు. - కొలుసు పార్థసారథి, రాష్ట్ర మాధ్యమిక విద్యాశాఖ మంత్రి అసమర్థ వాదన వల్లే అన్యాయం బ్రిజేష్‌కుమార్ తుది తీర్పు రైతాంగ ప్రయోజనాలను తీవ్రంగా నష్టపరిచేలా ఉంది. బచావత్ ట్రిబ్యునల్ 75 శాతం విశ్వసనీయతను ప్రామాణికంగా తీసుకున్న అంశాన్ని అలా ఉంచి కర్ణాటక రాష్ట్రానికి ఎక్కువ కేటాయించాలనే ఆలోచనతో 65 శాతం విశ్వసనీయతను తీసుకోవడం ఎంతమాత్రం సమర్థనీయం కాదు. ప్రభుత్వం తరఫున నియమితులైన న్యాయవాదుల అసమర్థ వాదన కారణంగానే తీర్పులో గెలవలేకపోయాం. ఏడాది క్రితం ప్రాథమిక తీర్పు వెలువరించిన అనంతరం కృష్ణా, గుంటూరు జిల్లాలకు సంబంధించిన ప్రజాప్రతినిధులు, రైతుసంఘ నాయకులం వెళ్లి ప్రభుత్వానికి సమర్థవంతమైన లాయర్లను పెట్టాలని సూచించాం. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రాథమిక తీర్పులో ఓడిన లాయర్లనే మళ్లీ నియమించారు. ఈ చర్య వల్లే తీర్పులో పూర్తిగా అన్యాయం జరిగింది. ఇప్పటికైనా ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లి సమర్థనీయమైన లాయర్లను నియమించి మిగులు జలాల్లో న్యాయం జరిగేలా పోరాడాలి. - వడ్డే శోభనాద్రీశ్వరరావు, మాజీ మంత్రి మన రైతులకు ఇబ్బందే.. గతంలో మాదిరిగా మిగులు జలాలను వాడుకునే సౌకర్యం లేకపోవటం మన రైతులకు ఇబ్బందే. నికర జలాల విషయంలో కృష్ణా జలాలు 456 టీఎంసీలు మనకు వచ్చిన తరవాతే ఎగువ రాష్ట్రం వాడుకోవాలని చెప్పటం ఊరటనిచ్చే అంశం. ఆల్మట్టి ఎత్తు పెంచినప్పుడు మూడేళ్ల క్రితం ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వుల్లో చెప్పిన విషయాలనే మళ్లీ చెప్పటం జరిగింది. - యెర్నేని నాగేంద్రనాధ్, రైతాంగ సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు -
మరో గండంరైతు గుండెల్లో లెహర్రర్
=అన్నదాతపై ప్రకృతి పగ =మొన్న అల్పపీడనం, నిన్న హెలెన్.. =ముంచుకొస్తున్న మరో ముప్పు =అంతటా కమ్ముకున్న మేఘాలు =అక్కడక్కడా చిరు జల్లులు యలమంచిలి, న్యూస్‌లైన్: అన్నదాతలపై ప్రకృతి పగబట్టింది. లెహర్ రూపంలో ఇప్పుడు తుపాను ముంచుకొస్తోంది. మొన్న అల్పపీడనం, నిన్న హెలెన్‌కు వర్షాలు ముంచెత్తడంతో రైతులు కుదేలయ్యారు. మరో ముప్పు పొంచి ఉండటంతో ఆందోళన చెందుతున్నారు. ఏటా నష్టాలను చవిచూస్తున్న తాము ఈ గండం నుంచి గట్టెక్కడమెలా అని కలవరపడుతున్నారు. శనివారం వర్షం తెరిపినిచ్చినప్పటికీ ఆదివారం జిల్లాలోని పలు ప్రాంతాల్లో మేఘాలు కమ్ముకున్నాయి. అక్కడక్కడా చిరుజల్లులు పడ్డాయి. గతంలో ఎన్నడు లేని విధంగా తుపాన్లు రైతులను హడలెత్తిస్తున్నాయి. నెలరోజుల్లో రెండు తుపాన్లు,అల్పపీడనం ఒకదాని వెంట ఒకటి అన్నదాతలను నిలువునా ముంచేశాయి. ఫై-లీన్ ప్రభావం పెద్దగా లేనప్పటికీ జిల్లా రైతాంగాన్ని అల్పపీడనం కోలుకోలేని దెబ్బతీసింది. ఆ తర్వాత హెలెన్‌తో కుదేలయ్యారు. మళ్లీ లెహర్ అన్నదాతలను భయపెడుతోంది. దీని ప్రభావం హెలెన్ కంటే తీవ్రంగా ఉంటుందన్న వాతావరణశాఖ అధికారుల హెచ్చరికలతో రైతులు భయాందోళనలకు గురవుతున్నారు. నెలరోజులుగా వీరికి కంటిమీద కునుకు ఉండటంలేదు. పంటపొలాల్లోని వరద నీటిని బయటకు తరలించడానికి, వాలిపోయిన, నీటమునిగిన వరిని నిలబెట్టడానికి అష్టకష్టాలు పడుతున్నారు. అల్పపీడనం ప్రభావంతో 27,285 హెక్టార్లలో ఆహార పంటలు, 1132 హెక్టార్లలో ఉద్యానవన పంటలు నీటమునిగాయి. ఇంకా పంట నష్టం అంచనా పూర్తికాకుండానే మూడు రోజుల క్రితం హెలెన్ హడలెత్తించింది. జిల్లాలో పెద్దగా వర్షం పడనప్పటికీ, ఈదురు గాలులకు కోత దశలో వరిపంట నేలకొరిగింది. ఈ ఏడాది ఖరీఫ్‌లో రైతులు ఎక్కువగా సాంబమసూరి, ఆర్జీఎల్ వరి రకాలను చేపట్టారు. ఎకరాకు 25 నుంచి 30 బస్తాల దిగుబడి వస్తుందని ఆశించారు. కానీ ఈ పంటకు తీవ్రంగా నష్టం వాటిల్లింది. దాదాపు 50శాతం పంటను రైతులు కోల్పోయినట్టే. ఇప్పటికే ఏజన్సీతో పాటు మైదానంలో వరి కోత దశలో ఉంది. పలు ప్రాంతాల్లో కోతలు కూడా మొదలయ్యాయి. హెలెన్ కారణంగా కోతలుపూర్తయి. పొలాల్లో ఉన్న వరిపనలు నీటమునిగాయి. వరితోపాటు చెరకు, పత్తి, అరటి పంటలకు నష్టం వాటిల్లింది. ఈ గాయం నుంచి తేరుకునే ప్రయత్నంలో రైతులు ఉండగా లెహెర్ ప్రభావం తీవ్రంగా ఉంటుందన్న వార్తలతో రైతులు ఆందోళన చెందుతున్నారు. -
హెలెన్ తుపానునిండా ముంచింది
=తుపాను ప్రభావంతో జిల్లా అంతటా వర్షాలు =2.25 లక్షల ఎకరాల్లో వరి నీటమునక =అప్పులే మిగులుతాయని అన్నదాతల ఆవేదన =గుండె ఆగిన కౌలు రైతు =వేర్వేరు ఘటనల్లో నలుగురు మృతి =వాగుల్లో ఇద్దరి గల్లంతు హెలెన్ తుపాను అన్నదాతను కోలుకోలేని దెబ్బతీసింది. పంట చేతికందే తరుణంలో నీటమునగడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. జిల్లాలో 2.25 లక్షల ఎకరాల్లో వరి నీటమునిగినట్లు వ్యవసాయ అధికారుల అంచనాగా ఉంది. పంట దెబ్బతినడంతో తట్టుకోలేక కౌలురైతు గుండె ఆగి మృతిచెందాడు. విద్యుదాఘాతానికి ఇద్దరు, చలిగాలులకు ఇద్దరు వేర్వేరు చోట్ల చనిపోయారు. మరో ఇద్దరు వాగుల్లో గల్లంతయ్యారు. మచిలీపట్నం, న్యూస్‌లైన్ : హెలెన్ తుపాను జిల్లా రైతును నిండా ముంచింది. శుక్ర, శనివారాల్లో జిల్లావ్యాప్తంగా కురిసిన భారీ వర్షాలు, గాలుల ప్రభావానికి కోతకు సిద్ధమైన వరి చేలు నేలవాలి నీటమునిగాయి. జిల్లాలో ఖరీఫ్‌లో 6.34 లక్షల ఎకరాల్లో వరిసాగు జరగగా హెలెన్ తుపాను ప్రభావంతో 2.25 లక్షల ఎకరాల్లోని వరి నీటమునిగిందని వ్యవసాయాధికారుల ప్రాథమిక అంచనా. ఎకరానికి రూ.20 వేలు ఖర్చు చేశామని, పంట చేతికొచ్చే దశలో తుపాను ప్రభావంతో వీచిన బలమైన గాలులకు పంట నేలవాలటం, దానిపై నీరు చేరటంతో పూర్తిగా నష్టపోయే పరిస్థితి ఏర్పడిందని రైతులు చెబుతున్నారు. ఈ ఖరీఫ్ సీజన్లో సాగునీటి విడుదల ఆలస్యం కావడంతో తక్కువ వ్యవధిలో పంట చేతికొచ్చే బీపీటీ 5204 రకం విత్తనాన్ని జిల్లా రైతులు అత్యధికంగా సాగు చేశారు. ఈ రకం విత్తనం రెండు రోజులకు పైబడి నీటిలో నానితే గింజ కుళ్లిపోతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తుపాను శుక్రవారమే తీరం దాటినా దీని ప్రభావంతో శనివారం జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు నమోదయ్యాయి. జిల్లాలో అత్యధికంగా పెదపారుపూడిలో 17.8 సెంటీమీటర్ల అత్యధిక వర్షపాతం, అత్యల్పంగా చాట్రాయిలో 0.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. జిల్లా సగటు వర్షపాతం 5.7 సెంటీమీటర్లుగా నమోదైనట్లు అధికారులు తెలిపారు. తుపాను ప్రభావంతో వీచిన బలమైన గాలులకు జిల్లాలోని 500 ఎకరాల్లో అరటితోటలు, 50 ఎకరాల్లో బొప్పాయి తోటలు, 200 ఎకరాల్లో దొండ, బీర పందిళ్లు దెబ్బతిన్నాయి. చినగొల్లపాలెం దీవిలో 200 కొబ్బరిచెట్లు విరిగిపడ్డాయి. పంట బీమా ఇప్పించాలి... ప్రకృతి విపత్తులు సంభవించిన సమయంలో పంటలు కోల్పోతే ప్రభుత్వం ఇచ్చే నష్టపరిహారం సకాలంలో అందని దుస్థితి నెలకొంది. హెలెన్ తుపాను ప్రభావంతో తీవ్రంగా నష్టపోయిన రైతులకు పంట బీమా ఇప్పించేందుకైనా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలనే డిమాండ్ రైతుల నుంచి వ్యక్తమవుతోంది. కౌలు రైతుల పరిస్థితి మరింత దయనీయం... కౌలు రైతుల పరిస్థితి మరింత దయనీయంగా మారింది. జిల్లా వ్యాప్తంగా 1.60 లక్షల మంది కౌలురైతులు 3.50 లక్షల ఎకరాలు సాగు చేస్తున్నారు. పంటబీమా, నష్టపరిహారం, కౌలురైతులకు అందే పరిస్థితి లేదు. హెలెన్ తుపాను ప్రభావంతో పంటలు కోల్పోయిన కౌలు రైతులకు నష్టాలే మిగిలే పరిస్థితి దాపురించింది. పరిహారం అందేనా? గత నెల అక్టోబరులో కురిసిన భారీ వర్షాల కారణంగా పంట నష్టం ఇప్పించాలని రైతులు కోరిన మీదట నీలం తుపాను నష్టపరిహారం ఇస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఇంతవరకు ఈ ప్రక్రియ ప్రారంభం కాలేదు. ఈలోపే హెలెన్ తుపాను కారణంగా రైతులు మరోసారి నష్టపోయారు. ఈ పంట నష్టం అంచనాలు ఎప్పటికి పూర్తిచేస్తారో పరిహారం ఎప్పటికి అందిస్తారోనని రైతులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఎకరాకు రూ.10 వేలు పరిహారం అందించాలి : నాగిరెడ్డి వరుస దెబ్బలతో జిల్లా రైతాంగం తీవ్ర సంక్షోభంలో పడుతోందని వైఎస్సార్సీపీ రైతు విభాగం రాష్ట్ర కన్వీనర్ ఎంవీఎస్ నాగిరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. హెలెన్ తుపాను తాకిడికి నేలవాలిన పంటలు కుళ్లిపోతాయని, ఈ పంటను కోయకుండానే దమ్ము చేసి దాళ్వా పంట వేసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయని ఆయన అన్నారు. ప్రభుత్వం రైతులను ఆదుకునేందుకు పంట నష్టపరిహారాన్ని ఎకరానికి రూ.10 వేలు చొప్పున అందించాలని ఆయన డిమాండ్ చేశారు. నేడు వ్యవసాయాధికారుల సమావేశం తుపాను ప్రభావంతో ఏర్పడిన పంట నష్టం అంచనాలు, జాబితాల తయారీలో తీసుకోవాల్సిన విధివిధానాలపై జిల్లాలోని ఆయా మండలాల వ్యవసాయాధికారులతో ఆదివారం సమావేశం నిర్వహించనున్నారు. సోమవారం నుంచి ప్రత్యేక బృందాలు గ్రామాల్లో పర్యటించి పంట నష్టం అంచనాలను తయారుచేసే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. నలుగురి మృతి.. ఇద్దరి గల్లంతు తుపాను ప్రభావంతో జిల్లాలో శనివారం నలుగురు మృతిచెందారు. మరో ఇద్దరు వాగుల్లో కొట్టుకుపోయి గల్లంతయ్యారు. విజయవాడ రూరల్ మండలం నిడమానూరు వద్ద తెగిన కరెంటు తీగ తగలడంతో బోత్సా వెంకటరమణ (23) అనే యువకుడు అక్కడికక్కడే మృతిచెందాడు. హనుమాన్‌జంక్షన్‌లో ట్రినిటీ స్వచ్ఛంద సంస్థ పేరుతో నిర్వహిస్తున్న హాస్టల్లో మాదాసు ఆనందరాజు (7) అనే బాలుడు స్నానం చేసేందుకు వెళ్లి వర్షపు నీటిలో జారి మోటారుపై పడ్డాడు. షాక్‌కు గురై అక్కడికక్కడే మృతిచెందాడు. తుపాను ప్రభావంతో వీచిన చలిగాలులకు జిల్లాలో ఇద్దరు వృద్ధులు మృతిచెందారు. అవనిగడ్డ మండలం బందలాయిచెర్వు దళితవాడలో గొరుముచ్చు పురుషోత్తం (74) శుక్రవారం రాత్రి చనిపోయాడు. నందివాడ మండలం శంకరంపాడులో గుడుమోలు కమలమ్మ (65) శనివారం తెల్లవారుజామున చలిగాలులకు తాళలేక మృతిచెందినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. జి.కొండూరు మండలం చెరువుమాధవరం తండా వద్ద పులివాగులో బూక్యా మోతి (35) అనే వ్యక్తి కొట్టుకుపోయాడు. లోలెవెల్ చప్టా వద్ద వాగును దాటే ప్రయత్నం చేయగా నీటి ఉధృతికి కొట్టుకుపోయాడని స్థానికులు తెలిపారు. నందివాడ మండలం ఎల్‌ఎన్‌పురం శివారు ఇమ్మనివానిగూడేనికి చెందిన కోరం ఇస్రాయేలు (70) శనివారం ఉదయం బుడమేరు డ్రెయిన్ దాటుతుండగా వర్షంతో నేల నాని ఉండటంతో కాలుజారి నీళ్లలో పడి కొట్టుకుపోయాడు. -
డైలమాలో అన్నదాత
మచిలీపట్నం, న్యూస్‌లైన్ : ఇటీవల కురిసిన భారీవర్షాలకు పంటలు దెబ్బతినడంతో రబీలో సా గునీటిని విడుదలచేస్తే దాళ్వా పంట సాగు చేసుకుంటామని రైతులు కోరుతున్నారు. ఇదే విషయాన్ని వారు మంగళవారం మచిలీపట్నంలో జరిగిన రచ్చబండ కార్యక్రమంలో మంత్రి సారథిని అడిగారు. నూటికి నూరుశాతం సాగునీరు విడుదల చేయించేందుకు ప్రయత్నిస్తానని, ఆ విషయాన్ని ముఖ్యమంత్రే స్వయంగా ప్రకటిస్తారని మంత్రి హామీ ఇచ్చారు. ఈ ఏడాది ఇంతవరకు నీటిపారుదల సమీక్షా మండలి సమావేశం కూడా నిర్వహించలేదు. రబీకి నీటి విడుదల విషయంపై నీటిపారుదలశాఖ మంత్రి సుదర్శన్‌రెడ్డిని ప్రశ్నిం చగా, ఆ జిల్లా నుంచి ఇంకా ప్రతిపాదనే రాలేదని, ప్రాజెక్టుల నీరు ఉందని చెప్పినట్లు ప్రచారం జరగడం జిల్లా నేతల పనితీరుకు అద్దం పడుతోంది. తిరుపతిలో ఉన్న ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి వద్దకు మంత్రి సారథి తదితరులు వెళ్లి సాగునీరు విడుదల చేయాలని కోరినా బుధవారం రాత్రి 9.30 గంటల వరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడకపోవడం రైతులను ఆందోళనకు గురిచేస్తోంది. రైతులు మానసిక సంఘర్షణకు లోనవుతుంటే పాల కులు పట్టీపట్టనట్లుగా వ్యవహరించడం బాధాకరమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రైతు విభాగం రాష్ట్ర కన్వీనర్ ఎం.వి.ఎస్.నాగిరెడ్డి ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. -
సా...గుతున్ననష్టం అంచనా
=మూడు వారాలైనా పూర్తికాని వైనం =ప్రభుత్వం ఆంక్షలతో పరిహారంపై అనుమానాలు =నైరాశ్యంలో అన్నదాతలు ప్రకృతి విపత్తులు, ప్రభుత్వ పోకడలతో రక్షణ కొరవడిన సేద్యం గాలిలో దీపమవుతోంది. అతివృష్టి అన్నదాతల వెన్ను విరిస్తే.. ఆదుకోవాల్సిన ప్రభుత్వం ఆంక్షలు విధిస్తోంది. నష్టం అంచనాలు త్వరితంగా పూర్తిచేయాల్సిన యంత్రాంగం మీనమేషాలు లెక్కిస్తోంది. మొత్తంగా రైతన్నల్లో నైరాశ్యం అలుముకుంటోంది. వరదలు వచ్చి మూడు వారాలవుతున్నా.. పంట నష్టం అంచనాలు పూర్తి కాలేదు. వారం రోజుల్లో పరిహారం అందిస్తామన్న సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి హామీ నీటిమూటలయింది. మంత్రులు, ఎమ్మెల్యేలు దాని ఊసెత్తడం లేదు. కనీసం రైతుల దుస్థితిని పట్టించుకున్న దాఖలాలే లేవు. విశాఖ రూరల్, న్యూస్‌లైన్ : జిల్లాను వరదలు ముంచెత్తి మూడు వారాలవుతోంది. అవి తగ్గిన రెండో రోజునే రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. బాధితులను ఆదుకుంటామని వారం రోజుల్లోగా నష్టం అంచనాలను పూర్తి చేసి పరిహారం అందిస్తామని ప్రకటించారు. కానీ ఆ ప్రక్రియ పూర్తి కాలేదు. గత నెల 21 నుంచి 27వ తేదీ వరకు కురిసిన భారీ వర్షాలకు జిల్లాలో వేలాది ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. అధికారుల ప్రాథమిక అంచనా ప్రకారం 17,855 హెక్టార్లలో వరి, 6079 హెక్టార్లలో చెరకు, 1212 హెక్టార్లలో పత్తి, 143 హెక్టార్లలో జొన్న, 653 హెక్టార్లలో రాజ్మా, 255 హెక్టార్లలో పొగాకు, 70 హెక్టార్లలో వేరుశెనగ, 813 హెక్టార్లలో రాగి, 155 హెక్టార్లలో పెసలు, 50 హెక్టార్లలో కంది పంటలు ఇలా మొత్తంగా 27,285 హెక్టార్లలో పంటలు దెబ్బతిని రూ.54.57 కోట్లు నష్టం వాటిల్లినట్లు అధికారులు అంచనా వేశారు. అలాగే ఉద్యానవన పంటలైన కూరగాయలు 811 హెక్టార్లు, తమలపాకు 135, పువ్వులు 101, అరటి 20, బొప్పాయి 65 హెక్టార్లు నీట మునగడంతో రూ.5.05 కోట్లు నష్టం జరిగింది. వారం రోజుల అనంతరం ప్రభుత్వం నష్టం అంచనాలకు మార్గదర్శకాలను రూపొందించింది. ఇళ్లు కోల్పోయిన వారి పరిస్థితి దయనీయంగా మారడంతో జిల్లా అధికారులు ముందుగా వాటికి సంబంధించిన లెక్కలు తయారు చేశారు. అనంతరం పంట నష్టం అంచనా పనిలో పడ్డారు. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం ఇందుకు మండల స్థాయిలో కమిటీలను ఏర్పాటు చేశారు. వాటి పనితీరు పట్ల సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది. మరో వారం రోజులకు కానీ నష్టం అంచనాలు పూర్తికావని స్వయానా అధికారులే పేర్కొంటున్నారు. ఆ తర్వాత ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం బాధిత రైతుల జాబితాను తహశీల్దారు, ఎంపీడీవో, గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో మూడు రోజులు ప్రదర్శించాల్సి ఉంటుంది. అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకొని తుది జాబితాను రూపొందిస్తారు. అనంతరం జిల్లా కలెక్టర్ ఆమోదంతో ప్రభుత్వానికి పంపుతారు. ఇదంతా పూర్తయ్యేసరికి మరో రెండు మూడు వారాలైన సమయం సమయం పడుతుంది. పరిహారంపై సందేహాలు వేలాది ఎకరాల్లో పంట నీట మునిగినట్లు స్పష్టంగా కనిపిస్తున్నా.. రైతులకు అందించే పరిహారంపై అనేక అనుమానాలు ముసురుకుంటున్నాయి. 50 శాతం కంటే అధికంగా పంట నష్టపోతేనే పరిగణనలోకి తీసుకోవాలన్న ప్రభుత్వ నిబంధనతో అన్యాయం జరుగుతుందేమోనన్న భయం రైతుల్లో వ్యక్తమవుతోంది. గతేడాది నీలం తుపాను పరిహారం కొందరు రైతులకు ఇప్పటికీ పూర్తిగా అందలేదు. ఈఏడాది మరోసారి తీవ్ర నష్టం వాటిల్లింది. ప్రధానంగా ఉద్యానవన పంట రైతుల పరిస్థితి దారుణంగా మారింది. గతేడాది ఉద్యానవన పంటలకు సంబంధించి రూ.4.12 కోట్లు ప్రతిపాదనలు పంపగా ప్రభుత్వం కేవలం రూ.67 లక్షలు మాత్రమే విడుదల చేసింది. వేలాది రైతులకు మొండి చేయి చూపించింది. ఈసారి పంటల నష్టం లెక్కింపులో జాప్యం, జాబితాల తయారీ, నిధులు విడుదల, పంపిణీలో ఆలస్యంతో రైతు సంఘాలు ప్రభుత్వంపై మండిపడుతున్నాయి. -
సాగు సంక్షోభం
=గిట్టుబాటు కాని ధరలు = భారంగా మారుతున్న పెట్టుబడులు =అమలుకు నోచని పాలకుల హామీలు =అప్పులపాలవుతున్న అన్నదాత = దిక్కుతోచని స్థితిలో కాడి వదిలేస్తున్న రైతన్న గుడ్లవల్లేరు, న్యూస్‌లైన్ : జిల్లాలో ఏయేటికాయేడు వ్యవసాయ సంక్షోభం రైతుల్ని పట్టిపీడిస్తోంది. వారిని ఆదుకునేందుకు సంక్షేమ పథకాలు ఎన్ని ఉన్నా వాటి అమలులో ప్రభుత్వం పూర్తిగా విఫలమవుతోంది. ఇతర దేశాల్లో ప్రభుత్వాలు వ్యవసాయానికిచ్చే ప్రోత్సాహకాలు.. నూటికి 65 శాతం జనాభా వ్యవసాయంపై ఆధారపడే మన దేశంలో లేకపోవడంపై విమర్శలు వినవస్తున్నాయి. నానాటికీ పెరుగుతున్న కూలీల ఖర్చులు రైతును ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. కూలీల ఖర్చు తగ్గించుకునేందుకు ప్రభుత్వం ఇచ్చే యంత్రపరికరాలతో సాగుచేద్దామంటే వాటని బినామీల పేరిట రాజకీయ నేతలు నొక్కేస్తున్నారు. ఎరువుల ధరలు పెరగడంతోపాటు తెగుళ్లు సోకిన పంట దిగుబడులు నాణ్యత లేక గిట్టుబాటు ధర రావడం లేదు. ఆరుగాలం శ్రమించి పండించిన పంటల్ని తుపానులు పొట్టన పెట్టుకుంటున్నాయి. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో చిన్న, సన్నకారు రైతులు, కౌలుదారులకు వ్యవసాయమంటే కత్తిమీద సాములా మారింది. ఈ దశలో కొందరు రైతులు నేలతల్లికి నీళ్లొదిలి ఉన్న ఊళ్లోనే ఇతర రంగాల వైపు మొగ్గుచూపుతున్నారు. మరికొందరు పొరుగు ప్రాంతాలకు వలసపోతున్నారు. సాగులో దెబ్బతిన్న రైతుల్ని ప్రభుత్వం గుర్తించి, వారికి సాయం అందిస్తే కొంతమేరకైనా వలసలు తగ్గుతాయని బాధిత రైతులు అంటున్నారు. ఇంకా వారేమంటున్నారో వారి మాటల్లోనే విందాం.. మూడు లక్షల అప్పు మిగిలింది.. పదెకరాల పొలాన్ని నాలుగేళ్లుగా కౌలుకు చేస్తే రూ.3 లక్షల అప్పు తేలింది. ఏటా వచ్చే తుపానులకు ఖరీఫ్‌లో పంట మునగడంతో అన్నీ అప్పులే మిగిలాయి. ఇక వ్యవసాయం జోలికి పోకూడదని నిర్ణయించుకున్నా. ఆటో డ్రైవర్‌గా జీవనం ప్రారంభించా. రోజుకు రూ.700 సంపాదిస్తున్నా. అందులో రూ.300 ఆటోకు అద్దె కడుతున్నా. కడుపులో నీళ్లు కదలడం లేదు. - నందం శ్రీనివాసరావు, ఆటో డ్రైవర్, సింగలూరు ఆయిల్ ఇంజిన్లు పెడుతున్నా.. గతంలో నేను 45 ఎకరాలు కౌలుకు చేసేవాడిని. మొదట్లో వ్యవసాయంలో అప్పులే ఉండేవి కావు. ఆ తర్వాత రూ.6 లక్షల వరకు అప్పుపడ్డా. సొంత పొలం 1.5 ఎకరాలు, ట్రాక్టర్‌ను అమ్మేసి ఉన్న అప్పులు తీర్చేశాను. మిగిలిన డబ్బుతో ఇంజిన్లు కొన్నాను. ప్రస్తుతం సార్వా, దాళ్వాలో పొలాలతో పాటు చేపల చెరువులకు కూడా ఆయిల్ ఇంజిన్లు పెడుతున్నా. - అంగడాల వీరప్రసాదరావు, వడ్లమన్నాడు, ఆయిల్ ఇంజిన్ల సప్లయర్ రాజకీయ నేతలకే సబ్సిడీలు.. కౌలు చేసే రైతులకు పంట రుణాలు ఇచ్చేవారే కరువయ్యారు. 50 ఎకరాలు చేసేవాడిని. లంచాలకు మరిగిన అధికారులు రుణాలు, సబ్సిడీలను రాజకీయ నేతలకే ఇస్తున్నారు. ఎరువుల ధరలు పెరిగాయి. సాగుకు రూ.50 లక్షల అప్పు కావడంతో మూడు ఎకరాలు విక్రయించి రెండేళ్లుగా వ్యవసాయానికి దూరమయ్యా. ప్రస్తుతం ట్రాక్టర్పైనే ఆధారపడ్డాను. - శేషం వెంకటేశ్వరరావు, వడ్లమన్నాడు, ట్రాక్టర్ యజమాని రైతుకూలీనయ్యా.. రాజకీయ నేతలు మాత్రం రైతే రాజు అని అంటారు. కాని నా వంటి బక్క రైతులంతా కూలీలయ్యారు. 12 ఎకరాలు కట్టుబడికి చేశా. మొదటి ఐదేళ్ల పాటు బాగానే ఉంది. సాగును నమ్ముకుని రూ.1.75 లక్షల అప్పులపాలయ్యా. సొంత పొలంలో కొంత భాగాన్ని అమ్మేసి రుణాలు చెల్లించేశా. వ్యవసాయం చేయలేక ఉన్న పొలం 1.75 ఎకరాలను కౌలుకు ఇచ్చేశా. కూలీగా అవతారమెత్తా. - చింతపల్లి లక్ష్మారెడ్డి, డోకిపర్రు, కూలీ సాగు భారమైంది... ఐదెకరాల సొంత పొలంతోపాటు 15 ఎకరాలు కట్టుబడికి 20 ఏళ్లుగా సాగు చేశా. ఎరువులు, పురుగుమందుల ధరలు ఒక్కసారిగా పెరిగిపోయి సాగు భారమైంది. తలకు మించిన అప్పులు మిగిలాయి. ఐదెకరాలతో పాటు తిండి పెట్టే ఎడ్లబండి కూడా అమ్మేశా. నాలుగేళ్లుగా వ్యవసాయం మానేసి తాపీమేస్త్రిగా స్థిరపడ్డా. ఇంకా సాగు తాలూకు రూ.30 వేల అప్పు ఉంది. - కొండేటి వెంకటస్వామి, డోకిపర్రు, తాపీమేస్త్రి పాడిని నమ్ముకున్నా.. వడ్లమన్నాడు మురుగుకాల్వ వర్షాలకు పొంగుతుండడంతో ప్రతి సార్వాలో పంటలు తుడిచిపెట్టుకుపోతున్నాయి. పంట మునకబారిన పడడంతో మొలకెత్తిన ధాన్యాన్ని ఎవరూ కొనక ఉన్న ఎనిమిది ఎకరాల్లో నాలుగు ఎకరాల్ని వేరే వారికి కౌలుకు ఇచ్చేశా. మరో నాలుగు ఎకరాలను అమ్మేసి వ్యవసాయం కోసం చేసిన అప్పులు తీర్చేశా. సాగుబాధ పడలేక రెండు పాడిగేదెలు పెంచుతున్నా. - దిమ్మెట నాంచారయ్య, వడ్లమన్నాడు, పాడి రైతు మెకానిక్‌గా మారా.. ఆరుగాలం కంటికి రెప్పలా కాపాడుకున్న పంటలు చేతికి వచ్చే సమయానికి వడ్లమన్నాడు డ్రెయిన్ పొంగిపోయి ముంచెత్తింది. పంటలు తుడిచిపెట్టుకుపోయాయి. ఐదేళ్ల పాటు ఎనిమిది ఎకరాలు కౌలుకు చేస్తే రూ.1.80 లక్షలు నష్టపోయా. మూడేళ్లగా వ్యవసాయం మానేశా. ఇంట్లో వయసు మీద పడిన తల్లిదండ్రులున్నారు. కుటుంబ పోషణకు పవర్ స్ప్రేయర్లు, బైక్‌లు బాగు చేసుకుంటున్నాను. - షేక్ దాదా, డోకిపర్రు, మెకానిక్ రెండేళ్లుగా పంక్చర్లు వేసుకుంటున్నా.. రూ.400 ఉండే యూరియా కట్ట ప్రస్తుతం రూ.1600కు పెరిగింది. నాలాంటి చిన్న రైతులు సాగు చేయాలంటే ప్రభుత్వ చేయూత అంతంతమాత్రమే. 11 ఏళ్లుగా మూడెకరాలు కౌలుకు చేస్తే రూ.70 వేలు నష్టం వచ్చింది. వ్యవసాయం వదిలేసి రెండేళ్లవుతోంది. బైక్‌లు, సైకిళ్లకు పంక్చర్లు వేస్తూ కాలం గడుపుతున్నా. - ఇలియాస్ బేగ్, డోకిపర్రు, పంక్చర్ల మేస్త్రి -
వీడని ముంపు
=భారీవర్షాలకు నీటమునిగిన పంటలు = రెండు క్రాప్హాలిడేలు ఇచ్చినా జరగని పనులు =ఆధునికీకరణ పూర్తయితే నష్టం తప్పేది =ఈ నిర్లక్ష్యం ప్రభుత్వానిదే అంటున్న అన్నదాతలు జిల్లాలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు రూ. 683 కోట్ల నష్టం వాటిల్లింది. డెల్టాలో 39 వేల హెక్టార్లలో వరి పంట ముంపు బారిన పడింది. డెల్టా ఆధునికీకరణ పనులు పూర్తయితే రైతులకు ఇంత పంట నష్టం జరిగేది కాదు. వైఎస్ రాజశేఖరరెడ్డి మరణానంతరం డెల్టా ఆధునికీకరణ పనులపై ప్రభుత్వం శ్రద్ధ చూపడం లేదు. ఆ పనులు పూర్తయితే తమ కష్టాలు తీరతాయన్న భావనతో రైతన్న వరుసగా రెండేళ్లపాటు రబీలో క్రాప్హాలిడేకి అంగీకరించినా.. పనులు మాత్రం మూడో వంతు కూడా పూర్తికాలేదు. అసలు సర్కారు నిర్లక్ష్యం వల్లే తమకీ దుర్గతి పట్టిందని ఆరోపిస్తున్నారు. సాక్షి, విజయవాడ : జిల్లాలో ఆధునికీకరణ పనులు నత్తనడకన జరుగుతుండడంతో రైతులను ముంపు బెడద వెంటాడుతోంది. చాలా ప్యాకేజీల గడువు ఈ ఏడాది డిసెంబర్‌కు ముగుస్తుండగా, కొన్ని ప్యాకేజీలు ఇప్పటికే అదనపు గడువు తీసుకున్నాయి. అయినా ఇప్పటివరకు జరిగిన పనులు చూస్తే మరో పదేళ్లయినా ఆధునికీకరణ పూర్తయ్యే అవకాశం కనపడడం లేదు. రెండుసార్లు క్రాప్‌హాలిడే ప్రకటించినా పనులు అనుకున్న స్థాయిలో జరగలేదు. గత ఏడాది సీఎం కిరణ్ కనీసం సమీక్షలైనా చేశారు. ఈ ఏడాది ఉన్నతస్థాయి సమీక్షలు జరిగిన పాపాన పోలేదు. అధికార పార్టీ ప్రజాప్రతినిధులు వీటిని పట్టించుకోవడం లేదు. అధికారులు కూడా మొక్కుబడిగానే పనులు పూర్తి చేయించారు. రైతాంగానికి ఉపయోగపడేలా కాల్వలు వెడల్పు చేయడం, డ్రైనేజీలలో డ్రెడ్జింగ్ పనులు చేసి ఉంటే పొలాల్లో నుంచి నీరు త్వరగా వెళ్లిపోయి ఉండేది. కాంట్రాక్టర్లు అసలు కాలువలను వెడల్పు చేయడం, లైనింగ్ పనులు మాని బ్రిడ్జిలు, రెగ్యులేటర్ల నిర్మాణానికే పరిమితం కావటం వల్ల ఇప్పటివరకూ జరిగిన పనులు కూడా రైతులకు ఉపయోగం లేకుండా పోయాయి. కీలక ప్రాంతాల్లో కాల్వల లైనింగ్ పనులు ప్రారంభమే కాలేదు. ఆధునికీకరణకు వైఎస్ నిర్ణయం.. గతంలో ఓగ్ని తుపాను సమయంలో డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా లేక జిల్లా వ్యాప్తంగా పంటపొలాలు నీట మునిగాయి. డెల్టా ప్రాంతంలో వారం రోజుల పాటు నీరు పొలాల నుంచి బయటకు వెళ్లని పరిస్థితి ఏర్పడింది. జిల్లా పర్యటనకు వచ్చిన అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి పరిస్థితిని లోతుగా సమీక్షించారు. 150 ఏళ్ల క్రితం ఏర్పాటు చేసిన సాగునీటి విధానం తప్ప, ఆ తర్వాత కాలంలో ఎటువంటి ఆధునికీకరణ జరగలేదని గుర్తించారు. దీంతో డెల్టాను పూర్తిస్థాయిలో ఆధునికీకరించాలని నిర్ణయించారు. కృష్ణా తూర్పు డెల్టాలో పంట కాల్వల ఆధునికీకరణకు 20 ప్యాకేజీలుగా టెండర్లు పిలిచారు. ఇందుకు రూ. 2,180 కోట్లకు పరిపాలనాపరంగా అనుమతి లభించింది. 14 ప్యాకేజీల కింద రూ. 1429.25 కోట్ల పనులకు ఆమోద ముద్ర పడింది. మొబలైజేషన్ అడ్వాన్సుల కింద రూ. 45.64 కోట్లు చెల్లించారు. ఐదేళ్లలో ఇప్పటివరకూ ఖర్చు పెట్టింది రూ. 412.32 కోట్లు మాత్రమే. ఈ సీజన్లో రూ. 429 కోట్ల విలువైన డెల్టా ఆధునీకరణ పనులు లక్ష్యంగా ఇరిగేషన్ అధికారులు నిర్ణయించారు. తర్వాత దీన్ని రూ. 327 కోట్లకు కుదించారు. ఈ సీజన్ కూడా పూర్తి అయిన తర్వాత చేసింది సగం కూడా లేదు. కేవలం రూ. 161 కోట్ల పనులు చేయించి మమ అనిపించారు. రైవస్ కాల్వ కిందే అధిక ఆయకట్టు.. తూర్పు డెల్టాలో కేఈ మెయిన్ కెనాల్ నుంచి తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద ఏలూరు, రైవస్, బందరు కాల్వలుగా విడిపోతుంది. ఒక్క రైవస్ కాల్వ కిందే ఎక్కువ ఆయకట్టు ఉంది. ఈ మూడు కాల్వలను నగరంలో వాటి సామర్ధ్యానికి అనుగుణంగా విస్తరించి లైనింగ్ చేయాల్సి ఉంది. వీటిని ఒకటో ప్యాకేజీలో చేర్చారు. సుమారు రూ. 204 కోట్ల విలువైన ఈ ప్యాకేజీ కింద కృష్ణామెయిన్ కెనాల్, ఏలూరు, బందర్ కాల్వలపై రెగ్యులేటర్ల పనులు మాత్రమే జరుగుతున్నాయి. రైవస్ కాల్వపై రెగ్యులేటర్ ఈ మధ్య కాలంలోనే నిర్మించడంతో గేట్లు మాత్రమే మారుస్తున్నారు. దిగువ ప్రాంతంలో లైనింగ్ పనులు జరుగుతున్నాయి. కాంట్రాక్టర్లు రెగ్యులేటర్లను పూర్తి చేసి చేతులు దులుపుకొనే అవకాశం కనపడుతోంది. అసలు బందరు కాల్వ ఆధునికకీరణకు ఇప్పటి వరకూ టెండర్లు రాలేదు. -
నిబంధనల బాధలతో రైతు
=అన్నదాతలో భయాందోళనలు =వరద నష్టం లెక్కింపుపై కలవరం =50శాతం పైగా నష్టపోతేనే పరిహారం =అంతరపంటలకు హుళక్కి =బ్యాంకు ఖాతా తప్పనిసరి =నిబంధనల బాధలతో రైతు ఉక్కిరిబిక్కిరి వరదలతో నిలువునా మునిగిన రైతన్నను నిబంధనల నయవంచనతో ప్రభుత్వం అతలాకుతలం చేస్తోంది. పంట నష్టం అంచనాకు సవాలక్ష నిబంధనలు పెట్టి పరిహా రం అందకుండా చూసేందుకు ఎన్నో ఎత్తులు వేస్తోంది. ‘50శాతం కన్న అధికంగా పంట నష్టపోతేనే పరిహారం. అంతర పంటలకైతే నో చాన్స్. బ్యాంకు ఖాతా లేకపోతే పరిగణనలోకి తీసుకోం.’ అంటూ ఆంక్షలు పెడుతోంది. ఈ నిబంధనలకు లోబడే పంట నష్టాన్ని అంచనా వేయనున్నట్టు స్పష్టం చేస్తోంది. సాక్షి, విశాఖపట్నం : వరద నష్టం నిర్ణయం రైతులను కలవరపెడుతోంది. 50శాతం లోపు నష్టపోయిన రైతులు సంగతేంటని వారు ప్రశ్నిస్తున్నారు. అంతర పంటలు సాగు చేసిన వారంతా నష్టపోవల్సిందేనా? అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బ్యాంకు ఖాతా లేకుంటే పరిగణన లోకి తీసుకోరా? అని నిలదీస్తున్నారు. కొండంత నష్టం వస్తే గోరంత సాయం చేస్తూ అన్నదాతను ప్రభుత్వం వంచిస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నష్టం లెక్క కట్టే నిబంధనలతో జిల్లాలో వేలాది మంది రైతులు నష్టపోతున్నారు. గతేడాది నీలం తుఫాన్ సమయంలో సంభవించిన నష్టం అంచనా విషయంలో ఇదే జరిగింది. 2012నవంబర్‌లో వచ్చిన నీలం తుఫాన్ కారణంగా జిల్లాలో 80,915 ఎకరాల్లో పంట నీట మునిగింది. రూ.97.8 కోట్ల నష్టం వాటిల్లింది. దాదాపు 1,45,487 మంది రైతులు నష్టపోయారు. కానీ 50 శాతం పైబడి నష్టం లేదని, అంతర పంటలు వేశారని, బ్యాంకు ఖాతా లేదని కారణాలు చూపుతూ దాదాపు 39వేల మంది రైతులకు పరిహారం ఎగ్గొట్టేందుకు ఎత్తు వేశారు. పంట నష్టానికి పరిహారంగా రూ. 30.24 కోట్లు మాత్రమే సరిపోతుందని అధికారులు ప్రతిపాదనలు పంపించారు. అందులో ఇంతవరకు రూ. 23 కోట్లు మాత్రమే విడుదల చేశారు. రూ. 10కోట్లు మాత్రమే పంపిణీ చేశారు. బ్యాంకు ఖాతాల్లేవని మిగతా నిధులను పంపిణీ చేయలేదు. ఈ ఏడాది కొస్తే ఇటీవల కురిసిన భారీ వర్షాలకు 75,580ఎకరాల పంటకు ముప్పు వాటిల్లింది. సుమారు రూ. 60 కోట్ల నష్టం జరిగినట్టు తాత్కాలిక అంచనా వేశారు. కానీ అంచనా లెక్కలపై ఉన్న ఆంక్షలతో ఆ నష్టంతో పాటు బాధిత రైతుల సంఖ్య గణనీయంగా తగ్గిపోనుంది. ముఖ్యంగా 50 శాతం లోపు నష్టం విలువ ఎకరాకు రూ.15 వేల నుంచి రూ. 30 వేలు మాత్రమే ఉంటోంది. దీంతో ఆ పరిధిలోకి వచ్చే రైతులంతా నష్టపోవల్సిందే. అంతర పంటల్ని కనీసం లెక్కలోకి కూడా తీసుకోలేదు. ఎన్యూమరేషన్ సమయంలో కూడా లెక్క కట్టరని తేల్చి చెప్పేశారు. వాస్తవానికైతే జిల్లాలో వేరుశనగ, పెసర, మినుములు, కంది, చోడి, తమలపాకులు, కూరగాయలు,గంటి, జొన్న తదితర అంతరపంటలు కూడా భారీ వర్షాలకు నీట మునిగాయి. వీటిని లెక్కలోకి తీసుకోమని చెప్పడంతో దీంతో దాదాపు 50వేల ఎకరాల్లో సాగు చేసిన అంతర పంటల రైతులు నష్టపోనున్నారు. ఈ విధంగా కళ్లెదుటే నష్టం కనిపిస్తున్నా.. 50 శాతం కంటే అధికంగా నష్టపోతేనే అంచనా లెక్కలు వేయాలన్న నిబంధన ఒకవైపు.. అంతర పంటల్ని లెక్కలోకి తీసుకోకపోవడం మరోవైపు... ఇలా అన్నదాతకు కుడిఎడమల దగాగా కనిపిస్తోంది. వరద నష్టం రూ.416.76 కోట్లు విశాఖ రూరల్ : అల్పపీడనం కారణంగా వారం రోజుల పాటు కురిసిన భారీ వర్షాలకు జిల్లాలో రూ.416.76 కోట్లు నష్టం వాటిల్లినట్లు జిల్లా అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. క్షేత్ర స్థాయిలో నష్టాల లెక్కింపు ప్రక్రియ శుక్రవారం నుంచి ప్రారంభం కానుంది. ఇప్పటి వరకు వివిధ శాఖలు వారి వారి నష్టాల అంచనాలను కలెక్టరేట్‌కు అందజేశారు. దీని ప్రకారం జిల్లాలో 364 గ్రామాలు వరద ప్రభావానికి గురవగా 67 గ్రామాలు నీట మునిగాయి. వరదలు కారణంగా ఐదుగు మరణించగా, ఇద్దరు గల్లంతయ్యారు. 12 పశువులు మృతి చెందాయి. ప్రధానంగా జిల్లాలో 27,285 హెక్టార్లలో ఆహార పంటలు నీట మునగడంతో రూ.54.57 కోట్లు, 1132 హెక్టార్లు ఉద్యానవన పంటలు దెబ్బతినడంతో రూ.5.05 కోట్లు నష్టం జరిగింది. అలాగే నీటి పారుదల శాఖకు సంబంధించి రూ.154.38 కోట్లు, వ్యవసాయ శాఖకు రూ.54.57 కోట్లు, ఉద్యానవన పంటలకు రూ.5.05 కోట్లు, ఆర్ అండ్ బీకు రూ.83.57 కోట్లు, పంచాయతీరాజ్ శాఖకు రూ.57.67 కోట్లు, గిరిజన సంక్షేమ శాఖకు రూ.10.58 కోట్లు, ఆర్‌డబ్ల్యూఎస్‌కు రూ.1.41 కోట్లు, ఏపీఈపీడీసీఎల్‌కు రూ.1.21 కోట్లు, జీవీఎంసీకి రూ.32.90 కోట్లు, పశుసంవర్ధక శాఖకు రూ.3 లక్షలు, మత్స్యశాఖకు రూ.70లక్షలు, చేనేత శాఖకు రూ.లక్ష, పట్టుపరిశ్రమకు రూ.2 లక్షలు, హౌసింగ్‌కు రూ. 12.15 కోట్లు నష్టం జరిగినట్లు అధికారులు ప్రాథమిక అం చనా వేశారు. క్షేత్ర స్థాయిలో సర్వే అనంతరం ఈ నష్టం మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. 172 రోడ్లు ధ్వంసం సాక్షి, విశాఖపట్నం : ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పంచాయతీరాజ్ శాఖకు పెద్ద ఎత్తున నష్టం వాటిల్లింది. వరదల కారణంగా రోడ్లు, పాఠశాల భవనాలు దెబ్బతిన్నాయి. దాదాపు రూ.57కోట్ల నష్టం సంభవించినట్టు అధికారులు అంచనా వేశారు. ఈమేరకు ప్రభుత్వానికి నివేదిక పంపారు. భారీ వర్షాలకు జిల్లా వ్యాప్తంగా 172 రోడ్లు శిథిలమయ్యాయి. 21జెడ్పీ పాఠశాల భవనాలు దెబ్బతిన్నాయి. వీటికి తాత్కాలిక మరమత్తులకు రూ.8.5కోట్లు కావాలి. శాశ్వత నిర్మాణం చేపట్టాలంటే రూ.57కోట్లు అవసరం అవుతోంది. ఇదే విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. రోడ్లు విషయానికి వస్తే విశాఖ డివిజన్లో 70, నర్సీపట్నం డివిజన్లో 44, పాడేరు డివిజన్లో 58 పాడయ్యాయి. ఇక పాఠశాల భవనాలకొస్తే విశాఖ డివిజన్లో ఒకటి, నర్సీపట్నం డివిజన్లో 11,పాడేరు డివిజన్లో 9 మరమ్మత్తుకు గురయ్యాయి. ఈమేరకు రోడ్లు, పాఠశాల భవనాల వారీగా అంచనాలు రూపొందించి ప్రభుత్వానికి పంపించారు. కొత్త మార్గదర్శకాలు పంట నష్టం అంచనాకు గ్రామ, మండల, డివిజన్ స్థాయిలో కమిటీలుంటాయి. నష్టపోయిన రైతుల జాబితాను తెలుగులోనే తయారు చేసి తహశీల్దారు, ఎంపీడీఓ, గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో విధిగా ప్రదర్శించాలి. అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుని తుది జాబితా రూపొందించాలి. పంటల నష్టాన్ని లెక్కించేటప్పుడు, జాబితా తయారు చేసే క్రమంలో ఆదర్శరైతుల పాత్ర లేకుండా చూడాలి. క్షేత్ర స్థాయిలో పంటల నష్టాన్ని అంచనా వేసే క్రమంలో పొలాన్ని సాగుచేస్తున్న రైతుకే పెట్టుబడి రాయితీ అందేలా చూడాలి. ఇందుకు కౌలు రైతుల పేర్లు, వారి బ్యాంకు ఖాతా నెంబర్లు సేకరించి జాబితాలో పొందుపర్చాలి. ఏటా ఇదే దుస్థితి.. వరి పంటకోసం రూ. 6వేలు మదుపుగా పెట్టాను. భారీ వర్షాలకు పంటంతా నీటమునిగింది. వర్షాలు తగ్గుముఖం పట్టినా 20రోజుల వరకు నీరు పోయే మార్గం లేదు. చెరకు తోటదీ ఇదే దుస్థితి. దానికీ రూ.వేలల్లో పెట్టుబడి పెట్టాను. గతేడాది పరిహారం నేటికీ మంజూ రు కాలేదు. అప్పుడూ నీలం తుఫాన్లో పంటంతా నీట మునిగింది. నష్టం అయినా జీవనాధారమైన వ్యవసాయాన్ని వదులుకోలేక ఏటా చేపడుతున్నాను. - భీమర శెట్టి గణేష్‌నాయుడు, తిమ్మరాజుపేట చెరకుకు పరిహారమేదీ? గతేడాది నవంబర్‌లో సంభవించిన నీలం తుఫాన్ వల్ల చెరకు పంట నేలకొరిగింది. నీరు నిలిచిపోవడంతో పిలకలు వచ్చాయి. తర్వాత ఏదోలా నిలబెట్టినా దిగుబడి సగానికి పైగా తగ్గిపోయింది. భారీ వర్షాలు, వరదల వల్ల చెరకు తోటల దిగుబడి తగ్గిపోతుంది. నష్టపరిహారం ఇచ్చి చెరకు రైతును ఆదుకోవాలి. - దొడ్డి చంద్ర అప్పారావు, రైతు నర్సాపురం -
అన్నదాతకు అభయం
అకాల వర్షాలతో నిండా మునిగిన అన్నదాతను ఓదార్చి వారికి భరోసానిచ్చేందుకు వచ్చిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మకు జిల్లావాసులు బ్రహ్మరథం పట్టారు. ఆదివారం జగ్గయ్యపేట, నందిగామ నియోజకవర్గాల్లో సాగిన ఆమె పర్యటనకు అడుగడుగునా మహిళలు, రైతులు ఘనస్వాగతం పలికారు. దారి పొడవునా రైతులు ఎదురెళ్లి విజయమ్మకు తమ గోడు వెళ్లబోసుకున్నారు. ఆదివారం కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం అనుమంచిపల్లిలో దెబ్బతిన్న పత్తిని పరిశీలిస్తున్న వైఎస్సార్ సీపీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ జగ్గయ్యపేట మండలం అనుమంచిపల్లిలో విజయమ్మకు పాడైపోయిన కాలీఫ్లవర్ పంటను చూపిస్తున్న రైతులుచిల్లకల్లులో పంచాయతీ కార్యాలయం వద్ద నష్టపోయిన రైతులను పరామర్శిస్తున్న విజయమ్మముండ్లపాడులో విజయమ్మను చూసేందుకు వచ్చిన జనంగౌరవరం వద్ద నష్టపోయిన పత్తి రైతులనుంచి వివరాలు తెలుసుకుంటున్న విజయమ్మవిజయవాడలో వరద బాధితులతో మాట్లాడుతున్న విజయమ్మవిజయమ్మను చూసేందుకు వచ్చిన మహిళలుఅదిగో విజయమ్మ...ఆదివారం కృష్ణాజిల్లా జగ్గయ్యపేట మండలం అనుమంచిపల్లిలో వైఎస్ విజయమ్మకు తమ గోడు వెళ్లబోసుకుంటున్న మహిళా రైతులుజగ్గయ్యపేటలో మహిళలతో మాట్లాడుతున్న విజయమ్మవిజయమ్మతో పేర్ని నాని, కొడాలి నాని, జోగి రమేష్, కుక్కల నాగేశ్వరరావు విజయవాడలో తమ గోడు వెళ్లబోసుకునేందుకు వచ్చిన బాధితులునవాబుపేటలో సర్పంచి కుటుంబసభ్యులను పలకరిస్తూ..విజయమ్మతోజ్యేష్ఠ రమేష్‌బాబు, ఉదయభాను, దుట్టా రామచంద్రరావు తదితరులుమీడియాతో మాట్లాడుతున్న వైఎస్ విజయమ్మ. చిత్రంలో ఉదయభాను, పేర్ని నాని, జోగి రమేష్. గౌతమ్‌రెడ్డి, వాసిరెడ్డి పద్మ తదితరులు -
అధైర్యపడకండి
ప్రకృతి విలయంతో కుదేలైన అన్నదాతకు వైఎస్సార్సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ భరోసా ఇచ్చారు. ప్రభుత్వం ఆదుకునేవరకు రైతుల తరఫున పోరాడతామని స్పష్టం చేశారు. వర్షాలతో దెబ్బతిన్న పంటలను చూసి చలించిపోయారు. రైతులు విజయమ్మను కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. సాక్షి, విజయవాడ : ‘అధైర్య పడకండి.. ప్రభుత్వం నుంచి మీకు సహాయం అందేంత వరకు అండగా ఉంటాం’ అంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ అన్నదాతలకు భరోసా ఇచ్చారు. భారీ వర్షాలు, వరదల వల్ల దెబ్బతిన్న పంట పొలాలను ఆమె ఆదివారం పరిశీలించారు. జగ్గయ్యపేట, నందిగామ నియోజకవర్గాల్లోని అనుమంచిపల్లి, షేర్‌మహ్మద్‌పేట, గౌరవరం, చిల్లకల్లు, ముండ్లపాడు, నవాబుపేట, రాఘవాపురం గ్రామాల్లో పెద్ద ఎత్తున నష్టపోయిన పంటలను చూసి ఆమె చలించిపోయారు. రైతులకు సాయం అందేంతవరకు ప్రభుత్వంతో పోరాడతానని స్పష్టం చేశారు. జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వచ్చాక అన్ని సమస్యలను పరిష్కరిస్తారని అభయమిచ్చారు. జిల్లా పర్యటనకు వచ్చిన ఆమెకు రైతులు తమ గోడు చెప్పుకొని కన్నీళ్ల పర్యంతమయ్యారు. వైఎస్ రాజశేఖరరెడ్డి బతికి ఉంటే తమకు ఈ గతి పట్టేది కాదని వారు విజయమ్మకు చెప్పుకొన్నారు. మీరైనా తమకు సాయం చేయాలని వేడుకున్నారు. దీనికి చలించిపోయిన విజయమ్మ మంచి రోజులు వస్తాయని... జగన్ అధికారంలోకి రాగానే రైతులకు మేలు చేస్తారని చెప్పారు. ఈ ప్రభుత్వం ఏ పనీ సరిగా చేయడంలేదని... ముఖ్యమంత్రి హైదరాబాద్ నుంచి బయటకు కాలు పెట్టడంలేదని విజయమ్మ ధ్వజమెత్తారు. కనీసం ఏరియల్ సర్వే చేయడానికి కూడా సీఎం రావడంలేదని విమర్శించారు. బారులుతీరిన జనం... విజయమ్మ వస్తున్న సమాచారం తెలుసుకున్న రైతులు, మహిళలు, అభిమానులు దారి పొడుగునా బారులతీరి నిలబడి ఆమెకు తమ కష్టాలు చెప్పుకున్నారు. పాడైపోయిన వరి పనలను, పత్తి గింజలను, మొక్కజొన్న కంకులను ఆమెకు చూపారు. పలు గ్రామాల నుండి మహిళలు ట్రాక్టర్లపై, ఆటోలపై పెద్ద సంఖ్యలో తరలిరావడం కనిపించింది. పంట పొలాలను పరిశీలించిన ఆమె రైతులతో ఎంతో ఆప్యాయంగా మాట్లాడారు. కొందరు మహిళా రైతులు ఆమెను చూడగానే కంటతడి పెట్టి వారి బాధలు చెప్పుకొన్నారు. పత్తి తీతకు వచ్చే దశలో వర్షానికి పూర్తిగా తడిసిపాడైంది. కాయలు నల్లగా మారి కుళ్లటంతో పాటు మొక్కలొచ్చాయి. ఎకరాకు రూ.30 వేలకు పైగా పెట్టుబడి పెడితే వర్షం మా ఆశలపై నీళ్లు చల్లిందని రైతులు కన్నీళ్ల పర్యంతమయ్యారు. ఒక మహిళ కౌలు రైతు తాను మూడు ఎకరాలు కౌలుకు తీసుకుని పత్తి పంటను సాగు చేశానని... వర్షాల ధాటికి పంట పూర్తిగా దెబ్బతినిపోయిందని వాపోయారు. ఎకరానికి రూ.35 వేలు పెట్టుబడి పెట్టి పంట కొద్దిరోజుల్లో చేతికి వచ్చే దశలో నష్టపోయామని విజయమ్మకు వివరించారు. ఇప్పుడు ఏంచేయాలమ్మా అంటూ గొల్లుమన్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు తమవైపు కన్నెత్తి కూడా చూడడంలేదని రైతులు ఫిర్యాదు చేశారు. రైతులకు జరిగిన నష్టాన్ని గురించి ఎవరూ పట్టించుకోలేదని ప్రతి ఒక్కరూ తమ ఆవేదన విజయమ్మకు వివరించారు. ఇంత నష్టం జరిగాక ప్రభుత్వం ఆదుకోకపోతే ఆత్మహత్యే శరణ్యమంటూ కొందరు రైతులు ఆవేదన వ్యక్తంచేశారు. మీరైనా ఆదుకోవాలని చేతులు జోడించి విజయమ్మకు విన్నవించారు. ఎవరూ రాలేదు మీరే వచ్చారు... జగన్ సీఎం కావాలి... ‘ఇంత నష్టం జరిగి కష్టంలో ఉన్నా మమ్మల్ని కన్నెత్తి చూసినవారు లేరు... మీరే మా కోసం వచ్చారు’ అంటూ రైతులు విజయమ్మతో చెప్పారు. ప్రభుత్వ పెద్దలు, మంత్రులు, అధికారులు ఎటెళ్లిపోయారోనని రైతులు తీవ్రంగా విమర్శించారు. రాజన్న పాలన రావాలన్నా, తమ కష్టాలు తొలగాలన్నా, జగన్ సీఎం కావాలని వారు ఆకాంక్షించారు. -
వర్షార్పణం
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : రాష్ట్రంలో ఈశాన్య రుతు పవనాలు రైతుకు గుండె కోతను మిగిల్చాయి. పలు జిల్లాల్లో నూర్పిడి దశలో ఉన్న వరి, వేరుశనగ దారుణంగా దెబ్బ తిన్నాయి. మలెనాడు, కోస్తా జిల్లాల్లో వరి పంట నీట మునగగా, పాత మైసూరు ప్రాంతంలో వేరుశనగకు అదే గతి పట్టింది. ఉత్తర కన్నడ, దక్షిణ కన్నడ, ఉడిపి, చిక్కమగళూరు, శివమొగ్గ జిల్లాల్లో వరి ప్రధాన పంట. కోతకు సిద్ధమైన తరుణంలో భారీ వర్షాలు కురవడంతో పంట చేలన్నీ నీటి మడుగులుగా మారిపోయాయి. చాలా మంది రైతులు కోతలను పూర్తి చేశారు. నూర్పిడికి సిద్ధమవుతున్న తరుణంలో భారీ వర్షాలు వాటిని ముంచేశాయి. ఈ దశలో వాటిని ఇంటికి తెచ్చుకోలేక, పొలంలోనే ఉంచలేక రైతు సతమతమై పోతున్నాడు. సుమారు 25 వేల ఎకరాల్లో వరి పంటకు నష్టం వాటిల్లిందని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. పాత మైసూరు ప్రాంతంలో సుమారు ఐదు వేల ఎకరాల్లో వేరుశనగకు నష్టం వాటిల్లి ఉండవచ్చని ప్రాథమిక అంచనా. అనేక జిల్లాల్లో వేరుశనగ నూర్పిడికి అవకాశం లేకపోవడంతో చేన్లపై వేసిన చెట్లలోని కాయలను ఫంగస్ ఆవరిస్తోందని రైతులు వాపోతున్నారు. ఒకటి, రెండు రోజుల్లో తెరపినివ్వకపోతే గింజలన్నీ చేదుగా మారిపోతాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక వేళ వేరుశనగను ఒలుచుకున్నా, ఎక్కడ ఆరబోయాలనే సమస్య ఎదురవుతోంది. ఇక వరి విషయానికొస్తే...కూలీల సమస్య కారణంగా పలు చోట్ల యంత్రాలతో వరి కోతలను పూర్తి చేసినా, అంతా నీట మునిగాయి. దాదాపుగా బురదలో కూరుకుపోయాయి. దీని వల్ల ధాన్యం నాసి రకంగా మారుతుందని, రేపు విక్రయించాలనుకున్నా సగం ధర దొరకడం గగనమవుతుందని రైతులు వాపోతున్నారు. -
అన్నదాతకు ఆపద
=బోరుమంటున్న రైతన్నలు =18 మండలాల్లో 13,117 ఎకరాల్లో వరి ముంపు =అనధికారిక లెక్కల ప్రకారం 50వేల ఎకరాలుంటుందని అంచనా సాక్షి, విశాఖపట్నం: అన్నదాతకు ఆపదొచ్చింది. వేలాది ఎకరాల్లో పంటలు నీట మునగడంతో కన్నీటి పర్యంతమవుతున్నారు. బంగాళాఖాతంలో అల్పపీడనం తో నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు అధికారుల ప్రాథమిక అంచనా ప్రకా రం జిల్లాలోని 18మండలాల్లో 13,117.5 ఎకరాల్లో వరి ముంపునకు గురయింది. 1925 ఎకరాల్లో చెరకు పంటకు నష్టం వాటిల్లినట్టు గుర్తించారు. ఇది ఇంకా పెరగవచ్చంటున్నారు. పంటపొలాలు నీటమునిగి ఉండటంతో నష్టం విషయంలో అధికారులు ఒక అంచనాకు రాలేకపోతున్నారు. మరికొన్ని మండలాల్లో పరిస్థితి పరిశీలన దశలో ఉంది. ఆయా ప్రాంతాల నివేదికలొస్తే ఇంకెంత పెరగనుందో చూడాలి. కానీ అనధికారిక లెక్కల ప్రకారం జిల్లా వ్యాప్తంగా 50వేల ఎకరాలకుపైగా వరి ముంపునకు గురైనట్టు తెలుస్తోంది. ఇక మబ్బుపట్టిన వాతావరణంతో వరికి అగ్గితెగులు,పాముపొడ ఆశించే ప్రమాదముందని అన్నదాతలు వాపోతున్నారు. ఆరుగాలం శ్రమ వర్పార్పణం కావడంతో లబోదిబోమంటున్నారు. రోజుల తరబడి నీటి నిల్వతో చెరకు పంటకు ముప్పు తప్పదంటున్నారు. ఏమాత్రం గాలి వీచినా నేలకొరిగే ప్రమాదముందంటున్నారు. అపరాల పంటలు కుళ్లిపోతున్నాయి. ముఖ్యంగా పెసర, మినుములతోపాటు పత్తి, పొగాకు పంటలకు నష్టం వాటిల్లింది. వరి కంకులు బయటకొచ్చే దశలో నిరంతరం వర్షంతో పువ్వంతా కరిగిపోయి దిగుబడి తగ్గుతుందని రైతులు వాపోతున్నారు. మండలాల వారీ తాత్కాలిక అంచనాలివి వరి విషయానికొస్తే పాయకరావుపేటలో 375ఎకరాలు, కోటవురట్లలో 250, వి.మాడుగులలో 350, భీమిలిలో 125,ఆనందపురంలో 125, పద్మనాభంలో 250, చోడవరంలో 1300,రాంబిల్లిలో 1425, అచ్యుతాపురంలో1137.5, అనకాపల్లిలో 1550, కశింకోటలో 300, మునగపాకలో 500, బుచ్చియ్యపేటలో 100, దేవరాపల్లిలో 450, చీడికాడలో 350, కె.కోటపాడులో 105, యలమంచిలిలో 1550,ఎస్.రాయవరంలో 2800ఎకరాలు ముంపునకు గురైనట్టు నిర్ధారించారు. -
వర్షపాతం ఎంత?
యలమంచిలి, న్యూస్‌లైన్: జిల్లాలో వర్షాభావ పరిస్థితులు నెలకొంటున్నాయి. కొన్ని మండలాల్లో పరిస్థితి తీవ్రంగా ఉంది. సాధారణంలో సగం కూడా వర్షం పడలేదు. వర్షాలు పుంజుకుంటేనే పంటలసాగు మెరుగవుతుంది. ఈ దశలో సమైక్యాంధ్ర సమ్మెతో మండల కేంద్రాల్లో వర్షపాత నమోదు నిలిచిపోవడంతో అన్నదాతల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. అన్ని ప్రభుత్వ శాఖల సిబ్బంది సమ్మెలో ఉండటంతో ఆయా శాఖల నుంచి సేవలు పూర్తిగా నిలిచిపోయాయి. తహ శీల్దార్ కార్యాలయాల్లో ఉన్న వర్షపాత నమోదు కేంద్రాల్లో వర్షపాతాన్ని నమోదు చేసేవారు కరువయ్యారు. జిల్లాలో ఈ ఏడాది తీవ్ర వర్షాభావం నెలకొంది. ఖరీఫ్ సీజన్ ముగుస్తున్నా 30 శాతం వరినాట్లు కూడా పూర్తి కాకపోవడంతో ఈ ఏడాది కరువు అనివార్యమన్న ఆందోళన రైతులను వెంటాడుతోంది. కరువు కోరల్లో చిక్కుకున్న రైతులకు వ్యవసాయ బీమా లభిస్తుంది. ప్రభుత్వం నుంచి నష్టపరిహారం కూడా అందుతుంది. అయితే ‘వర్షపాత’ నమోదు ప్రాతిపదికగానే అధికార యంత్రాంగం నష్టాన్ని అంచనా వేస్తుంది. మండల తహశీల్దార్ కార్యాలయాల్లో ఉన్న వర్షపాత నమోదు కేంద్రాలద్వారా వ్యవసాయ, ఉద్యానవన శాఖలతోపాటు కలెక్టర్ కార్యాలయాలకు సమాచారం అందుతుంది. ఈ కేంద్రాలద్వారా వచ్చే సమాచారంద్వారానే మండలాలవారీగా వర్షపాతాన్ని అంచనా వేస్తారు. అతి తక్కువ వర్షపాతం నమోదయిన మండలాలను కరువు ప్రాంతాలుగా ప్రభుత్వం ప్రకటిస్తుంది. తేలని వర్షపాతం : మండల కేంద్రాల్లో గత రెండు మాసాలుగా వర్షపాత నమోదుకు సంబంధించి అధికారికంగా ఎటువంటి సమాచారం ఉన్నతాధికారులకు చేరడం లేదు. వర్షాలు లేకపోవడంవల్ల పంటపొలాలు ఖాళీగా కనిపిస్తున్నాయి. జిల్లాలో ఖరీఫ్‌లో 90 వేల హెక్టార్లల్లో వరి సాగు చేపట్టాల్సి ఉండగా అది అసాధ్యమనిపిస్తోంది. ఖరీఫ్ ముగింపు దశకొచ్చినా పలువురు రైతులు ముదురునారునో, లేదంటే ఇతర ప్రాంతాల్లో కొనుగోలుచేసిన వరినారుతోనో నాట్లు వేస్తున్నారు. వరి సాగుపై నమ్మకాన్ని అన్నదాతలు వదులుకొంటున్నారు. గ్రామీణ జిల్లాలో వ్యవసాయ పరిశోధనా కేంద్రాల్లో మాత్రమే వర్షపాతం నమోదుచేసే సదుపాయాలు ఉన్నాయి. మిగిలిన ప్రాంతాల్లో వర్షపాతాన్ని ఎలా కొలుస్తారన్న సందేహం రైతుల్లో వ్యక్తమవుతోంది. ఆటోమేటిక్ వెదర్ స్టేషన్లు నిరుపయోగం తహశీల్దార్ కార్యాలయాల్లో నాలుగేళ్ల క్రితమే ఆటోమేటిక్ వెదర్ స్టేషన్లను ఏర్పాటు చేశారు. ఈ కేంద్రాల ద్వారా వర్షపాతం, వాతావరణం, గాలిలో తేమ, కాలుష్యం వంటి అంశాలకు సంబంధించిన గణాంకాలు సేకరించేలా ఏర్పాటు చేశారు. వీటిని కలెక్టర్ కార్యాలయాలతోపాటు హైదరాబాద్‌కు కూడా శాటిలైట్ద్వారా అనుసంధానం చేశారు. అయితే ఇవి అప్పటి నుంచి నిరుపయోగంగా ఉన్నాయి. సాధారణ పద్ధతిలో వర్షపాత నమోదుకు అవకాశం లేనపుడు వీటి ద్వారా సమాచారాన్ని సేకరించే అవకాశం ఉంది. దాంతో సమైక్యాంధ్ర సమ్మె ముగిసేవరకు వర్షపాత నమోదు లేనట్టేనని స్పష్టమవుతోంది. -
కొత్త బిల్లుతో అన్నదాతకు మేలు
యలమంచిలి, న్యూస్‌లైన్: బలవంతపు భూ సేకరణ కు కళ్లెం పడింది. పరిశ్రమల కోసం ఇంతకాలం ప్రభుత్వం, ఏపీఐఐసీలు అడ్డగోలుగా తక్కువ ధరకు భూములను రైతుల నుంచి సేకరించేవి. ఇందుకు నిరాకరించే అన్నదాతలపై ప్రభుత్వం కక్ష సాధింపునకు పాల్పడేది. లోక్‌సభ ఆమోదం పొందిన భూసేకరణ, పునరావాసం, పరిహారం-2012 బిల్లు ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లో భూములకు మార్కెట్ ధర కంటే నాలుగు రెట్లు, పట్టణప్రాంతాల్లో భూములకు మార్కె ట్ ధరకు రెట్టింపు పరిహారం చెల్లించవలసి ఉంది. రైతుల నుంచి సేకరించిన భూమిని అధిక ధర కు విక్రయిస్తే వచ్చే లాభంలో 40 శాతాన్ని భూమి యజమానికి చెల్లించాలన్న నిబంధనతో రైతులకు మేలు చేకూరుతుంది. ప్రాజెక్టులు, శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగులు ఉన్నారు. వీరందరూ ప్రతి నెలా 23వ తేదీలోగా జీతాల బిల్లులను ఖజానా శాఖకు సమర్పించాల్సి ఉంటుంది. అయితే ఉద్యోగులందరూ విధులను బహిష్కరించడంతో ఖజానాకు బిల్లులు సమర్పించలేదు. దీంతో జీతాలు ఆగిపోయాయి. ఖజానా శాఖ నుంచి ప్రతీ నెలా జీతాలు, పెన్షన్లు కలిపి మొత్తం రూ.135 కోట్లు చెల్లింపులు జరుగుతుంటాయి. సమైక్యాంధ్ర కోసం.. రాష్ట్ర విభజనపై యూపీఏ నిర్ణయాన్ని ప్రకటించిన వెంటనే ఏపీఎన్జీవో సంఘం సమ్మెకు పిలుపునిచ్చింది. దీంతో అన్ని ప్రభుత్వ ఉద్యోగుల సంఘాలు సమ్మె బాట పట్టాయి. ఆగస్టు 12 అర్ధరాత్రి నుంచి విధులను బహిష్కరించాయి. అన్ని ప్రభుత్వ శాఖలతో పాటు ఖజానా ఉద్యోగులు కూడా ఆందోళనలు చేస్తున్నారు. అన్ని శాఖల్లోను ఉన్నతాధికారుల నుంచి కింది స్థాయి వరకు సమ్మెలో ఉండడంతో ఉద్యోగుల జీతాల బిల్లులను తయారు చేసేవారు లేకుండా పోయారు. అలాగే ఉద్యోగులు కూడా తమ జీతాలు రావన్న విషయం తెలిసినప్పటికీ గడువు తేదీ ముగిసినప్పటికీ ఖజానా శాఖకు జీతాల బిల్లులు సమర్పించలేదు. వీరితో పాటు ఖజానా ఉద్యోగులు ఆందోళనలు చేస్తుండడంతో పెన్షనర్లకు కూడా పింఛన్లు రావడం లేదు. జిల్లాలో సుమారుగా 18 వేల మంది పింఛన్‌దారులు ఉన్నారు. వీరందరికీ ప్రతీ నెలా ఒకటినే పెన్షన్ వస్తుంటుంది. కానీ ఈనెల ఒకటిన మాత్రం రావడం లేదు. నాలుగు శాఖలకు అనామతు ఖాతాతో చెల్లింపు పోలీస్, జైలు, కోర్టు, ఫైర్ శాఖ ఉద్యోగులకు మాత్రం అనామతు ఖాతా ద్వారా జీతాలను చెల్లించాలని ప్రభుత్వం ఆదేశించింది. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే ఈ ఖాతా ద్వారా చెల్లింపులు చేస్తుంటారు. ప్రస్తుతం ఈ నాలుగు శాఖల ఉద్యోగులు మినహా మిగిలిన వారందరూ సమైక్యాంధ్ర ఉద్యమంలో పాల్గొంటున్నారు.