యలమంచిలి, న్యూస్‌లైన్: జిల్లాలో వర్షాభావ పరిస్థితులు నెలకొంటున్నాయి. కొన్ని మండలాల్లో పరిస్థితి తీవ్రంగా ఉంది. సాధారణంలో సగం కూడా వర్షం పడలేదు. వర్షాలు పుంజుకుంటేనే పంటలసాగు మెరుగవుతుంది. ఈ దశలో సమైక్యాంధ్ర సమ్మెతో మండల కేంద్రాల్లో వర్షపాత నమోదు నిలిచిపోవడంతో అన్నదాతల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. అన్ని ప్రభుత్వ శాఖల సిబ్బంది సమ్మెలో ఉండటంతో ఆయా శాఖల నుంచి సేవలు పూర్తిగా నిలిచిపోయాయి. తహ శీల్దార్ కార్యాలయాల్లో ఉన్న వర్షపాత నమోదు కేంద్రాల్లో వర్షపాతాన్ని నమోదు చేసేవారు కరువయ్యారు.
జిల్లాలో ఈ ఏడాది తీవ్ర వర్షాభావం నెలకొంది. ఖరీఫ్ సీజన్ ముగుస్తున్నా 30 శాతం వరినాట్లు కూడా పూర్తి కాకపోవడంతో ఈ ఏడాది కరువు అనివార్యమన్న ఆందోళన రైతులను వెంటాడుతోంది. కరువు కోరల్లో చిక్కుకున్న రైతులకు వ్యవసాయ బీమా లభిస్తుంది. ప్రభుత్వం నుంచి నష్టపరిహారం కూడా అందుతుంది. అయితే ‘వర్షపాత’ నమోదు ప్రాతిపదికగానే అధికార యంత్రాంగం నష్టాన్ని అంచనా వేస్తుంది. మండల తహశీల్దార్ కార్యాలయాల్లో ఉన్న వర్షపాత నమోదు కేంద్రాలద్వారా వ్యవసాయ, ఉద్యానవన శాఖలతోపాటు కలెక్టర్ కార్యాలయాలకు సమాచారం అందుతుంది. ఈ కేంద్రాలద్వారా వచ్చే సమాచారంద్వారానే మండలాలవారీగా వర్షపాతాన్ని అంచనా వేస్తారు. అతి తక్కువ వర్షపాతం నమోదయిన మండలాలను కరువు ప్రాంతాలుగా ప్రభుత్వం ప్రకటిస్తుంది.
తేలని వర్షపాతం : మండల కేంద్రాల్లో గత రెండు మాసాలుగా వర్షపాత నమోదుకు సంబంధించి అధికారికంగా ఎటువంటి సమాచారం ఉన్నతాధికారులకు చేరడం లేదు. వర్షాలు లేకపోవడంవల్ల పంటపొలాలు ఖాళీగా కనిపిస్తున్నాయి. జిల్లాలో ఖరీఫ్‌లో 90 వేల హెక్టార్లల్లో వరి సాగు చేపట్టాల్సి ఉండగా అది అసాధ్యమనిపిస్తోంది. ఖరీఫ్ ముగింపు దశకొచ్చినా పలువురు రైతులు ముదురునారునో, లేదంటే ఇతర ప్రాంతాల్లో కొనుగోలుచేసిన వరినారుతోనో నాట్లు వేస్తున్నారు. వరి సాగుపై నమ్మకాన్ని అన్నదాతలు వదులుకొంటున్నారు. గ్రామీణ జిల్లాలో వ్యవసాయ పరిశోధనా కేంద్రాల్లో మాత్రమే వర్షపాతం నమోదుచేసే సదుపాయాలు ఉన్నాయి. మిగిలిన ప్రాంతాల్లో వర్షపాతాన్ని ఎలా కొలుస్తారన్న సందేహం రైతుల్లో వ్యక్తమవుతోంది.
ఆటోమేటిక్ వెదర్ స్టేషన్లు నిరుపయోగం
తహశీల్దార్ కార్యాలయాల్లో నాలుగేళ్ల క్రితమే ఆటోమేటిక్ వెదర్ స్టేషన్లను ఏర్పాటు చేశారు. ఈ కేంద్రాల ద్వారా వర్షపాతం, వాతావరణం, గాలిలో తేమ, కాలుష్యం వంటి అంశాలకు సంబంధించిన గణాంకాలు సేకరించేలా ఏర్పాటు చేశారు. వీటిని కలెక్టర్ కార్యాలయాలతోపాటు హైదరాబాద్‌కు కూడా శాటిలైట్‌ద్వారా అనుసంధానం చేశారు. అయితే ఇవి అప్పటి నుంచి నిరుపయోగంగా ఉన్నాయి. సాధారణ పద్ధతిలో వర్షపాత నమోదుకు అవకాశం లేనపుడు వీటి ద్వారా సమాచారాన్ని సేకరించే అవకాశం ఉంది. దాంతో సమైక్యాంధ్ర సమ్మె ముగిసేవరకు వర్షపాత నమోదు లేనట్టేనని స్పష్టమవుతోంది.
వర్షపాతం ఎంత?
Published Thu, Sep 26 2013 1:57 AM | Last Updated on Fri, Sep 1 2017 11:02 PM
Advertisement
Advertisement