సాక్షి,చిత్తూరు: జిల్లాలో అన్నదాతలకు కరువు సాయం ఇప్పట్లో అందేలా కనిపించడంలేదు. పేరుకు మాత్రం జిల్లాలో 42 మండలాలను కరువు కింద ప్రకటించినా ఇప్పటికీ అధికారులు పంట నష్టం అంచనాలను ప్రభుత్వానికి నివేదించలేదు.ఎప్పటిలోగా అంచనాలు తయారు చేసి ప్రభుత్వానికి నివేదిస్తారో తెలియడంలేదు. దీంతో జిల్లా రైతులకు సకాలంలో కరువు సాయం అందుతుందన్న భరోసా లేకుండా పోయింది.
జిల్లాలో 42 మండలాలను కరువు మండలాలుగా ప్రభుత్వం గత నెలలో ప్రకటించింది. కరువు మండలాల ఎంపికలోనూ పారదర్శకత లోపించింది. తీవ్ర వర్షాభావ పరిస్థితి నెలకొన్నా కొన్ని మండలాలకు కరువు జాబితాలో చోటు దక్కలేదు. అధికారులు తొలుత 38 మండలాలను, ఆ తరువాత 20 మండలాలను ప్రతిపాదించినా చివరకు 42 మండలాలను మాత్రమే ప్రభుత్వం కరువు కింద ఎంపిక చేయడంపై విమర్శలు వెల్లువెత్తాయి. కరువు మండలాల ఎంపిక వివాదం సంగతి పక్కన పెడితే తీవ్ర వర్షాభావంతో జిల్లాలో ఖరీఫ్‌లో సాగైన పంటలు, పండ్లతోటలు దెబ్బతిన్నాయి.
ప్రధానంగా లక్షా 6 వేల హెక్టార్లలో సాగైన వేరుశెనగ పంట పూర్తిగా దెబ్బతింది. అన్నదాతలు *500 కోట్లమేర నష్టపోయినట్లు అంచనా. జిల్లా వ్యాప్తంగా పంటలు దెబ్బతిన్నా అధికారులు మాత్రం 42 మండలాల్లో మాత్రమే వేరుశెనగ నష్టం అంటూ నివేదికలిచ్చారు. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోనున్నారు. కరువు కింద ఎంపికైతేనే హెక్టారుకు *10 వేల ఇన్‌పుట్ సబ్సీడీ వస్తుంది. ఈ లెక్కన మిగిలిన 24 మండలాల రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ అందే అవకాశం లేకుండా పోయింది. పోనీ 42 మండలాల రైతులకైనా త్వరగా కరువు సాయం అందిస్తారనుకుంటే ఇప్పటికీ అతీగతీ లేదు.
కరువుకింద ఎంపికైన మండలాల పరిధిలో 76 వేల 452 హెక్టార్లలో వేరుశెనగ పంట సాగైనట్లు అధికార గణాంకాలు చెబుతున్నాయి. 50 శాతం పంట దెబ్బతింటేనే ఇన్‌పుట్ సబ్సిడీ వస్తుందని ఈ లెక్కన జిల్లాలో వేరుశెనగ పంటకు మాత్రమే ఇన్‌పుట్ సబ్సిడీ వచ్చే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. పోనీ ఆ వచ్చే మొత్తమైనా రైతులకు ఇప్పట్లో అందించే పరిస్థితి కానరావడంలేదు. కరువు కింద ఎంపికైతే ఇన్‌పుట్ సబ్సిడీతోపాటు తాగునీటి సరఫరా, పశుగ్రాసం, ఉపాధి పనులు, ఇరిగేషన్ పనులకు ప్రాధాన్యం ఇస్తారు. కరువు మండలాలకు అధికంగా నిధులు కేటాయించాల్సి ఉంది. కానీ కరువు మండలాల పరిస్థితిపై జిల్లా అధికారులు ఇప్పటికీ ప్రభుత్వానికి నివేదికలు అందించకపోవడం చూస్తుంటే కరువు సాయం ఇప్పట్లో అందేలా లేదన్న విషయం తేటతెల్లమవుతోంది.
గతేడాది ఇన్‌పుట్ సబ్సిడీ ఇవ్వని ప్రభుత్వం
కరువు నేపథ్యంలో గతేడాది జిల్లాలో 33 మండలాలను కరువు మండలాలుగా ప్రభుత్వం ప్రకటించింది. లక్షా ఒక వెరు్య హెక్టార్లలో వేరుశెనగపంట దెబ్బతింది. హెక్టార్‌కు *10 వేల చొప్పున ఇన్‌పుట్ సబ్సిడీ కింద 110 కోట్లు ఇవ్వాల్సి ఉంది. ఎన్నికల సమయంలో రైతులకు ఇవ్వాల్సిన ఇన్‌పుట్ సబ్సిడీని చెల్లిస్తామని చెప్పిన చంద్రబాబు ఇంతవరకూ పైసా ఇవ్వలేదు. మామిడి రైతులు నష్టపోయినా వారిని ఆదుకున్న పాపానపోలేదు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది కరువు సాయం అందేలా లేదని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు.
కరువు సాయం కోసం నిరీక్షణ
Published Mon, Jan 12 2015 6:41 AM | Last Updated on Sat, Sep 2 2017 7:36 PM
Advertisement
Advertisement