- గంట విద్యుత్ కోతపై అన్నదాత ల ఆగ్రహం
- ప్రభుత్వం కక్షగట్టిందని మండిపాటు
- ఏడు గంటలు ఇవ్వాల్సిందేనని రైతుల డిమాండ్
యాచారం/ తాండూరు న్యూస్‌లైన్: రైతులకు సర్కారు షాక్ ఇచ్చింది. వ్యవసాయానికి విద్యుత్ సరఫరాలో గంట కోత విధించింది. ఇప్పటికే అనధికారిక విద్యుత్ కోతలతో సతమతమవుతున్న అన్నదాతలను మరింత కష్టాల్లోకి నెట్టింది ప్రభుత్వం. వ్యవసాయానికి రెండు విడతల విద్యుత్ సరఫరా అనధికారిక కోతలతో 4-5గంటలకు మించి అందని పరిస్థితి. ఈ నేపథ్యంలో ఒక గంట విద్యుత్ సరఫరాకు అధికారికంగా కోత పెట్టడంతో రైతన్నల పరిస్థితి ‘గోరు చుట్టుపై రోకటి పోటు’ చందంగా మారింది.
ఏడు గంటల త్రీఫేజ్ కరెంటు ఇచ్చిన రోజుల్లోనే సరిగ్గా మూడు గంటలు కూడా సరఫరా కాని విద్యుత్ గంట కోత కారణంగా రెండు గంటలు కూడా నాణ్యమైన విద్యుత్ సరఫరా అయ్యే అవకాశాలు ఉండవని రైతులు అంటున్నారు. రైతులు బోరుబావులపైనే ఆధారపడి పంటలు సాగు చేశారు. యాచారం మండలంలోని 20 గ్రామాల్లో దాదాపు రెండు వేల ఎకరాలకు పైగా వరి సాగు చేశారు.
రెండు వేల ఎకరాలకు పైగా వివిధ రకాల కూరగాయల పంటలను సాగు చేయడానికి రైతులు సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం పంటలన్నీ ప్రారంభ దశలో ఉన్నాయి. మున్ముందు ఎండలు ముదరనుండడంతో నీరు ఎక్కువగా అవసరముంటుంది. ఏడు గంటలకు బదులు తొమ్మిది గంటల కరెంటు ఇచ్చినా పంటలకు నీరు అందడం కష్టమే. అటువంటి సమయంలో ఏడు గంటలు ఇచ్చే త్రీఫేజ్ ఉచిత విద్యుత్‌ను గంట కోత విధించి ఇక ఆరు గంటలే ఇస్తాననడంతో పంటలు ఎండిపోయి అప్పులుపాలు చేయడమేనని రైతులు మండిపడుతున్నారు.
వరి, వేరుశనగ, కూరగాయల పంటలపై ప్రభావం
అనధికార, అధికార కోతలతో వివిధ పంటల సాగుపై ప్రభావం పడే అవకాశం ఉందని వ్యవసాయరంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా ప్రస్తుతం రబీలో రెండో పంటగా వరి, కాయ తయారీ చివరి దశలో ఉన్న వేరుశనగ, పొలాల్లో చెరకు పంట సాగుకు కర్రలు నాటేందుకు రైతులు సిద్ధంగా ఉన్నారు. వేసవిలో పెళ్లిళ్ల సీజన్ ఉంటుంది.
ఈ క్రమంలో హైదరాబాద్ చుట్టూ విస్తరించి ఉన్న జిల్లాలో వేసవి పంటలుగా బెండ, టమాటా, వంకాయ తదితర కూరగాయల పంటలు అధికంగా సాగు చేస్తారు. పెళ్లిళ్ల సీజన్‌లో కూరగాయల వినియోగం అధికంగా ఉంటుంది కాబట్టి ఇప్పటి నుంచే పంటలు సాగు చేస్తే ఏప్రిల్, మే నెల నాటికి దిగుబడులు వస్తాయి. ఈ పరిస్థితుల్లో ఆయా పంటలకు నీటి వినియోగం ఎక్కువగా ఉంటుంది. దాదాపు ఆయా పంటలన్నీ బోర్ల కింద రైతులు సాగు చేస్తారు. ఈ నేపథ్యంలో గంట కోత విధించడం ఆయా పంటల సాగుకు నీటి కష్టాలు తప్పవని రైతులు దిగులు చెందుతున్నారు. జిల్లా శివారు ప్రాంతాల్లో పాల వినియోగం అధికం. అవసరమైన పాల ఉత్పత్తికి రైతులు పశువులకు పచ్చిమేతకు బోర్లకింద పశుగ్రాసం సాగు చేస్తారు. తాజాగా కరెంట్ కోత కారణంగా ఆయా పంటలకు ఇబ్బందులు తప్పవని వ్యవసాయ రంగ నిపుణులు అంటున్నారు.
కక్షపూరితంగా ప్రభుత్వ నిర్ణయం
ప్రభుత్వం రైతులపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోంది. సమృద్ధిగా వర్షాలు కురిసిన సమయంలో రైతులు పంటలు పూర్తిగా సాగు చేసుకున్నారు. ఈ దశలో కరెంటు సమస్యలు రైతులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. మళ్లీ గంట కోత విధింపు వల్ల పంటలు గట్టెక్కడం కష్టమే. - కాయితి యాదగిరిరెడ్డి,
సీపీఐ నాయకుడు మాల్, యాచారం మండలం
అప్పుల పాలు ఖాయం
నీటి వనరులతో పేద రైతులు వేల రూపాయలు ఖర్చు చేసి పంటలు సాగు చేసుకున్నారు. నేను రూ. 30 వేలు ఖర్చు చేసి రెండెకరాల్లో వరి, కూరగాయల పంటలు సాగు చేశాను. కరెంటు ఉంటేనే పొలం పారేది. కానీ ప్రస్తుత తీరు చూస్తుంటే పంటలు ఎండి అప్పులు మిగలడం ఖాయమనిస్తోంది.
- జోగు యాదయ్య, రైతు, యాచారం మండలం
మున్ముందు నీటి అవసరం ఎక్కువ
వచ్చేది ఎండా కాలం నీటి అవసరం ఎక్కువగా ఉంటుంది. నేను రూ. 60 వేలకు పైగా పెట్టుబడితో ఐదు ఎకరాల్లో వరి పంట సాగు చేశాను. కరెంటు ఆరు గంటలు ఉన్నప్పుడే పొలం పారడం కష్టంగా మారింది. ఇక గంట కోత విధింపుతో కష్టంగా మారనుంది. 15 రోజుల్లో ఎండలు ప్రారంభం కావడం, కోతల వల్ల పైరు ఎదగడం కష్టంగానే ఉంటుంది.
- లిక్కి పాండురంగారెడ్డి, రైతు, చింతపట్ల, యాచారం మండలం
కోత ఎత్తేయాలి
రైతుల ఇబ్బందులను ప్రభుత్వం దృష్టిలో పెట్టుకోవాలి. గంట కోత ఎత్తేసి నాణ్యమైన ఏడు గంటల త్రీఫేజ్ ఉచిత విద్యుత్ ఇవ్వాలి. అప్పుడే పంటలు చేతికొచ్చే అవకాశం ఉంటుంది. కానీ ప్రభుత్వానికి ఇవేమీ పట్టడం లేదు. అన్నదాలంటే చులకనైంది. వైఎస్ మరణం తర్వాత రైతుల బాధలను పట్టించుకునే వారే లేకుండాపోయారు.
- అమీర్‌పేట్ బుగ్గరాములు, రైతు,
చౌదర్‌పల్లి, యాచారం మండలం