రైతుల్లో స్వయం ప్రతిపత్తిని పెంపొందించడానికి ఉద్దేశించిన గ్రామ విత్తనోత్పత్తి పథకానికి మంగళం పాడినట్లే కనపడుతోంది. 50శాతం సబ్సిడీపై రైతుకు ఫౌండేషన్ సీడ్ (మూల విత్తనం) అందించి నాణ్యమైన విత్తనాలు రైతులే ఉత్పత్తి చేసుకునే అవకాశం ఇక లేకుండా పోయింది. మూడేళ్లుగా ఈ పథకం ఊసే లేకపోవడంతో రైతులు నిరాశ చెందుతున్నారు.
వానాకాలానికి సంబంధించి 5.80లక్షలు ఎకరాల్లో పంటలు సాగవుతుంటాయి. ఇందులో వరి, పత్తి, మొక్కజొన్న, కంది తదితర పంటలు ఉంటాయి. యాసంగికి సంబంధించిన వివిధ రకాల పంటలు 3.5లక్షల ఎకరాలకుపైగా సాగులోకి వస్తుంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో రైతులందరికీ నాణ్యమైన విత్తనం అందించడం ప్రభుత్వానికి కష్టతరంగా మారుతోంది.
ఈ దుస్థితిని నివారించి రైతుల్లో స్వయం ప్రతిపత్తిని పెంపొందించడానికి గతంలో వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో విత్తనోత్పత్తి పథకాన్ని అమలు చేశారు. సిద్దిపేట జిల్లాను విత్తన హబ్‌గా తయారు చేయాలనే సంకల్పంతో పనిచేశారు. ప్రతిసారి ఏదో పంటను ఎంచుకొని ఈ పథకం అమలు చేసేవారు. ఏటా జిల్లాలోని పలు గ్రామాల్లో వానాకాలానికి సంబంధించి వరి, కంది, మొక్కజొన్న, యాసంగిలో శనగ పంటల్లో విత్తనోత్పత్తి చేసేవారు. దీని ద్వారా రైతులకు 50శాతం సబ్సిడీపై మూల విత్తనం అందిస్తారు.
పరిశోధనా స్థానాల నుంచి నేరుగా వచ్చే వీటి వల్ల విత్తనోత్పత్తికి అవకాశముంటుంది. విత్తనాలు అందించిన తర్వాత వ్యవసాయశాఖ విత్తనం వేసింది మొదలు.. పంట చేతికొచ్చేసరికి మూడుసార్లు శిక్షణ అందించి నాణ్యమైన విత్తన ఉత్పత్తికి బాటలు వేసేవారు. ఉత్పత్తిగా వచ్చిన విత్తనాలను రైతులే స్వయంగా తెలిసిన రైతులకు అమ్ముకోవడం, లేదా ప్రభుత్వమే విత్తన కంపెనీలతో అగ్రిమెంట్ చేయించి మార్కెటింగ్ చేసేవారు. కొంత కాలం ఈ పథకం సత్ఫలితాలనిచ్చింది. క్రమేపి ఈ విధానం వల్ల ఆశించిన ఫలితాలు రాక మొగ్గుబడిగా సాగింది.
రైతులు ఉత్పత్తి చేసిన విత్తనాలు నాణ్యాత ప్రమాణాలు కలిగి ఉన్నాయా? లేదా అనే విషయం తెలియక కొనుగోలు చేయడానికి చుట్టు పక్కల గ్రామాల రైతులు ఆసక్తి చూపలేదు. కంపెనీలతో అగ్రిమెంట్ చేయించే విషయంలో వ్యవసాయ శాఖ చొరవ చూపలేదు. మరీ మూడేళ్ల నుంచి అయితే పథకం ఊసే కరువైంది. ఫలితంగా ఆసక్తి ఉన్న రైతులకు ఫౌండేషన్ సీడ్‌ను కూడా అందలేదు. దీనిని బట్టి చూస్తే ఈ పథకానికి నిధులు విడుదల చేయడానికి ప్రభుత్వం పెద్దగా ఆసక్తి చూపడం లేదు.
కొత్త ప్రభుత్వం చొరవపైనే ఆశలు..
కొత్త ప్రభుత్వం చొరవ చూపితేనే ఈ గ్రామ విత్తనోత్పత్తి పథకం సమర్థవంతంగా అమలయ్యే అవకాశముంది. ప్రధానంగా రైతులకు నాణ్యమైన విత్తన సబ్సిడీతోపాటు ఎరువులు, క్రిమిసంహారకాలను సబ్సిడీపై అందించాల్సి ఉంది.
దీంతోపాటు రైతులు ఉత్పత్తి చేసే విత్తనాలను రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ కొనుగోలు చేసేలా రైతులకు ఒప్పందం కుదిరిస్తే.. రైతుల ఉత్పత్తులకు మంచి ధర లభించి భారీ ప్రయోజనం జరిగే అవకాశముంది. ఇవేకాకుండా ఆత్మకమిటీల పనితీరు మెరుగుపరచడం, నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ మిషన్ (ఎన్‌ఎఫ్‌ఎస్‌ఎం) పథకాలను సైతం పునరుద్ధరించాల్సి ఉంది.
ఇవి చదవండి: కృష్ణా బోర్డు ప్రాజెక్టుల నిర్వహణకు ఏపీ,తెలంగాణ అంగీకారం!
Comments
Please login to add a commentAdd a comment