కామెల్లియా..అచ్చం గులాబీలా ఉంటుంది..! కానీ.. | Camellia How To Grow And Care | Sakshi
Sakshi News home page

కామెల్లియా..అచ్చం గులాబీలా ఉంటుంది..! కానీ..

Published Wed, Jan 8 2025 1:57 PM | Last Updated on Wed, Jan 8 2025 1:57 PM

Camellia How To Grow And Care

గులాబీ ఎంత అందమైనదో అంత సున్నితమైనది. కామెల్లియా పువ్వు కూడా చూడటానికి గులాబీ పువ్వంత అందంగానే ఉంటుంది. అయితే, ఇది అంత సున్నితమైనది కాదు. ఈ పువ్వు రేకులు దృఢంగా ఉంటాయి. అందుకే, కామెల్లియా పంటను గులాబీ పంటకు చక్కని ప్రత్యామ్నాయంగా నిపుణులు అభివర్ణిస్తున్నారు.

కామెల్లియా ఆకర్షణీయమైన, అద్భుతమైన పువ్వులు. కామెల్లియా సొగసైన పుష్పించే మొక్క. తూర్పు ఆసియాకు చెందినది. ముఖ్యంగా జపాన్, చైనా, కొరియా దేశాల్లో సాగులో ఉంది. థియేసి కుటుంబానికి చెందినది. కామెల్లియా పూజాతిలో వైవిధ్యపూరితమైన అనేక వంగడాలతో పాటు సంకరజాతులు ఉన్నాయి.

నిగనిగలాడే సతత హరిత ఆకులతో ఈ చెట్టు అన్ని కాలాల్లోనూ నిండుగా ఉంటుంది. అందానికి, అలంకారానికి ప్రతీకగా అద్భుతమైన తెలుపు, గులాబీ, ఎరుపు, ఊదా రంగుల్లో కామెల్లియా మొక్క పూస్తుంది. అందమైన నున్నని రేకులు, సున్నితమైన సువాసనకు ప్రసిద్ధి చెందిన కామెల్లియాను తరచుగా గులాబీతో పోల్చుతూ ఉంటారు. గులాబీలు సాంప్రదాయకంగా ప్రేమ ప్రతీకలైతే.. కామెల్లియా పూలు స్వచ్ఛత, అభిరుచి, పరివర్తనలకు ప్రతీకగా చెబుతుంటారు.

నీడలోనూ పెరుగుతుంది
గులాబీ చెట్టు చల్లదనాన్ని, నీడను తట్టుకోలేదు. అయితే, కామెల్లియా అందంగా కనిపించటమే కాదు ఇటువంటి విభిన్న వాతావరణాన్ని కూడా తట్టుకుంటుంది. పదగా, చిన్నపాటి చెట్టుగా పెంచినా ముదురు ఆకుపచ్చని ఆకులతో కామెల్లియా మొక్క పూలు లేనప్పుడు కూడా ఆకర్షణీయంగా ఉంటుంది. అందువల్ల గార్డెన్‌లో గాని, అలంకరణలో గానీ కామెల్లియా పూలు గులాబీలకు ప్రత్యామ్నాయాలుగా నిలుస్తాయి. 

కామెల్లియా పూలు గులాబీల మాదిరిగానే అనేక రంగుల్లో పూస్తాయి కాబట్టి ఆయా సందర్భాలకు తగిన రంగు పూలను ఉపయోగపెట్టుకోవచ్చు. పూరేకులు మృదువుగా, గుండ్రంగా, మందంగా ఉంటాయి కాబట్టి ఇన్‌డోర్‌ బొకేల్లో పెట్టినా, గార్డెన్‌లో పెంచినా ఈ పూలు ఏడాది పొడవునా చూడముచ్చటగా ఒదిగిపోతాయి. గులాబీలు ఇలా కాదు. గులాబీ రేకులు బాగా సున్నితమైనవి, పల్చటివి కాబట్టి త్వరగా వాడిపోతాయి. 

కామెల్లియా పూలు రంగు, రూపు, నిర్మాణం, పరిమాణం విషయంలో ఇతర పూజాతుల మధ్య వైవిధ్యంగా నిలబడుతుంది. ఈ పువ్వులోనే ఆడ (పిస్టిల్‌), మగ (స్టేమెన్స్‌) భాగాలు అమరి ఉండటం వల్ల పరాగ సంపర్కానికి అనువుగా ఉంటుంది. ఈ పువ్వులో వంగడాన్ని బట్టి 5 నుంచి 9 రేకులు ఉంటాయి. ఇవి సాధారణంగా గుడ్డు ఆకారంలో స్పైరల్‌ పద్ధతిలో కూడుకొని ఉంటాయి. కామెల్లియా పూలలో రేకుల వరుసలు సింగిల్‌ (కొద్ది రేకులతో) లేదా సెమీ డబుల్‌ నుంచి డబుల్‌ (అనేక వరుసలు కలిసి) ఉంటాయి.  

పూల రంగులు... ప్రతీకలు
పూలు లేత గులాబీ నుంచి ముదురు ఎరుపు రంగులో ఉంటాయి. కొన్ని రకాల్లో ఊదా రంగులో, అనేక రంగులతో కూడిన రేకులతోనూ కామెల్లియా పూలు పూస్తాయి. తెల్ల కామెల్లియా పూలు స్వచ్ఛతకు, అమాయకత్వానికి, అనురాగానికి ప్రతీకలు. గులాబీ రంగు కామెల్లియా పూలుఇష్టానికి, ప్రేమకు ప్రతీకలు. ఎర్ర కామెల్లియా పూలు అభినివేశానికి, గాఢమైన ప్రేమకు ప్రతీకలు. ఊదా రంగు కామెల్లియా పూలు ఆరాధనకు, పరివర్తనకు ప్రతీకలుగా చెబుతారు. 

ఈ పువ్వు 5–10 సెం.మీ. (2–4 అంగుళాలు) వ్యాసార్థంతో ఉంటుంది. కొన్ని కామెల్లియా రకాల పూలు 12 సెం.మీ. (4.7 అంగుళాల) వరకు ΄÷డవుగా, గుండ్రంగా అద్భుతమైన ఆకర్షణీయంగా పెరుగుతాయి. ఈ చెట్టు ఏ సీజన్‌లో అయిన నిగనిగలాడే ముదురు ఆకుపచ్చని ఆకులతో కళకళలాడుతూ ఉంటుంది. ఆకులు 5–10 సెం.మీ.ల ΄÷డవున, 2–5 సెం.మీ. (0.8 నుంచి 2 అంగుళాల) వెడల్పున ఉంటాయి.

2 నుంచి 12 మీటర్ల ఎత్తు 
కామెల్లియా మొక్కను పొద మాదిరిగా పెంచుకోవచ్చు లేదా చిన్నపాటి నుంచి మధ్యస్థ ఎత్తు ఉండే చెట్టుగానూ పెంచుకోవచ్చు. రకాన్ని, పరిస్థితులను బట్టి 2 నుంచి 12 మీటర్ల (6.5 నుంచి 40 అడుగుల) ఎత్తు వరకు పెరుగుతుంది. కాయ ఆకుపచ్చగా లేదా లేత పసుపు రంగులో ఉంటుంది. విత్తనాలు ఓవల్‌ షేపులో చిన్నగా, గట్టిగా ఉంటాయి. వీటి నూనెను సౌందర్యసాధనాల్లో వాడతారు. వంటకు కూడా వాడుతుంటారు. కామెల్లియా జాతిలో చాలా రకాల చెట్లు శీతాకాలంలో పూతకొస్తాయి. ఇవి పెరిగే వాతావరణ స్థితిగతులు, నేలలను బట్టి పూత కాలం మారుతూ ఉంటుంది.

పూలు.. అనేక వారాలు! 
కామెల్లియా మొండి జాతి. చల్లని ప్రాంతాల్లో బాగా పెరుగుతుంది. ఉష్ణోగ్రతల్లో తీవ్ర హెచ్చుతగ్గులున్న ప్రాంతాల్లోనూ తట్టుకుంటుంది. గులాబీ చెట్లతో  పోల్చితే కామెల్లియా చెట్లు పెద్దవి, చాలా కాలం మనుగడసాగిస్తాయి. దీర్ఘకాలం ఆధారపడదగిన పూల చెట్ల జాతి ఇది. దీని పూలు అనేక వారాల పాటు చెక్కుచెదరకుండా ఉంటాయి. ఈ చెట్లకు ఆకులు ఏడాది పొడవునా నిండుగా, ముచ్చటగొలుపుతుంటాయి.

ఆమ్ల నేలల్లో పెరుగుతుంది
గులాబీ మొక్కను జాగ్రత్తగా పెంచాలి. తరచూ కొమ్మలు కత్తిరించాలి. చీడపీడల నుంచి జాగ్రత్తగా రక్షించుకోవాలి. తరచూ మట్టిలో ఎరువులు వేస్తూ ఉండాలి. కానీ, కామెల్లియా చెట్లు అలాకాదు. వీటి మెయింటెనెన్స్‌ చాలా సులభం. మొక్క నాటిన తర్వాత నిలదొక్కుకుంటే చాలు. నీరు నిలవని ఆమ్ల నేలల్లో పెరుగుతుంది. ఏడాదిలో చాలా తక్కువ రోజులు మాత్రమే ఎండ తగిలే ప్రాంతాల్లో పూల తోటను పెంచాలంటే కామెల్లియాను ఎంచుకోవాలి. 

చిన్న పొదగా పెంచుకోవచ్చు. తరచూ కత్తిరిస్తూ హెడ్జ్‌లుగా అనేక రకాలుగా, అనేక సైజుల్లో దీన్ని పెంచుకోవచ్చు. గులాబీ మొక్కల్ని పొదలుగా, తీగలుగా మాత్రమే పెంచగలం. గులాబీల మాదిరిగానే అనేక రంగుల్లో అందంగా పూస్తుంది. ఎక్కువ కాలం మన్నిక కలిగి ఉండే పూలు కావటం కూడా ముఖ్యమైన విషయం. ఇన్ని ప్రత్యేకతలున్నందునే గులాబీకి కామెల్లియాను చక్కని ప్రత్యామ్నాయంగా చెబుతారు. 

ఆకులతో టీ, గింజలతో నూనె
కామెల్లియా జాతిలో 100–250 వైవిధ్యపూరితమైన రకాలు ఉండటం విశేషం. పువ్వు రూపు, రంగును బట్టి అది ఏ రకమో గుర్తించవచ్చు. ‘కామెల్లియా జ΄ోనికా (జూన్‌ కామెల్లియా) రకం ఎక్కువగా సాగులో ఉంది. దీని పూలు పొడవుగా, ఆకర్షణీయంగా ఉంటాయి. తెలుపు నుంచి ముదురు ఎరుపు, గులాబీ రంగుల పూలు జూన్‌ కామెల్లియా చెట్టు పూస్తుంది. కామెల్లియా సినెన్సిస్‌ (టీ కామెల్లియా) రకం చెట్టు ఆకులతో టీ కాచుకొని తాగుతారు. అందువల్ల దీని ఆకుల ద్వారా కూడా ఆదాయం పొందవచ్చు.

దీని తెల్లని పూలు చిన్నగాను, తక్కువ ఆకర్షణీయంగానూ ఉంటాయి. కామెల్లియా ససన్‌కువ రకం పూలు చిన్న, అతి సున్నితంగా ఉన్నా సువాసనను వెదజల్లుతాయి. జూన్‌ కామెల్లియా రకం కన్నా చాలా ముందుగానే ఈ రకం చెట్టు పూస్తుంది. కామెల్లియా రెటిక్యులాట జాతి చెట్లకు పొడవాటి పూలు పూస్తాయి. అందరినీ ఆకర్షించగల ఈ రకం చెట్లు చైనాలో విస్తారంగా కనిపిస్తాయి. కామెల్లియా ఒలీఫెరా రకం కూడా చైనాలో విస్తారంగా కనిపిస్తుంది. దీని విత్తనాల్లో నూనె శాతం ఎక్కువగా ఉంటుంది. ఈ నూనెను వంటకాల్లో, సౌందర్య సాధనాల తయారీకి కూడా వాడుతున్నారు. చిన్న, తెల్లని పూలు పూస్తుంది. వాణిజ్యపరంగా చూస్తే మంచి ఆదాయాన్నిచ్చే రకం ఇది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement