సుస్థిర వ్యవసాయ కేంద్రం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డా. జీవీ రామాంజనేయులు పిలుపు
సాక్షి, హైదరాబాద్: మారిన వాతావరణ పరిస్థితులు, రైతుల ఆకాంక్షల నేపథ్యంలో వ్యవసాయ రంగంలో ఎదురవుతున్న సరికొత్త సవాళ్లకు పాత కాలపు ఆలోచనలతో కూడిన పరిష్కారాలు సరిపడవని, క్లైమెట్ ఎమర్జెన్సీ కాలంలో సరికొత్త పరిష్కారాలు వెతకాల్సిన అవసరం ఉందని సుప్రసిద్ధ వ్యవసాయ శాస్త్రవేత్త, సుస్థిర వ్యవసాయ కేంద్రం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ జీవీ రామాంజనేయులు పిలుపునిచ్చారు. సెంటర్ ఫర్ ఎకనమిక్ అండ్ సోషల్ స్టడీస్ (సెస్) మినీ ఆడిటోరియంలో మిల్లెట్ నెట్‌వర్క్ ఆఫ్ ఇండియా, డెక్కన్ డెవలప్‌మెంట్ సొసైటీ (డీడీఎస్) సంయుక్త ఆధ్వర్యంలో సోమవారం జరిగిన చర్చాగోష్టిలో ఆయన మాట్లాడారు.
చిరుధాన్యాలపై అనేక రాష్ట్రాల్లో పనిచేస్తున్న సామాజిక కార్యకర్తలు, శాస్త్రవేత్తలు, స్వచ్ఛంద సంస్థల బాధ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ‘క్లైమెట్ ఛేంజ్, మిల్లెట్స్, ఎకోసిస్టమ్ సర్వీసెస్’ అనే అంశంపై జరిగిన చర్చాగోష్టికి రామాంజనేయులు సమన్వయకర్తగా వ్యవహరించారు. రైతులకు వెన్నుదన్నుగా నిలిచేందుకు 30 ఏళ్ల నాడు పాలకులు ఏర్పాటు చేసిన మద్దతు వ్యవస్థలు ఇప్పటి సవాళ్లను ఎదుర్కోవటానికి పనికిరావని, కొత్త తరహా మద్దతు వ్యవస్థలను అమల్లోకి తెచ్చుకోవాల్సిన అవసరం ఉందని డా. రామాంజనేయులు సూచించారు. రైతుబంధు వంటి పథకాలను కొత్త సవాళ్ల వెలుగులో సమీక్షించుకోవాలన్నారు.
రైతులకు ప్రభుత్వాలు అండగా నిలవాలి
పర్యావరణ సేవలకు చెల్లింపులు అవసరం అజిమ్ ప్రేమ్‌జీ యూనివర్సిటీ అధ్యాపకురాలు డాక్టర్ మంజుల మేనన్ మాట్లాడుతూ.. రసాయనిక ఎరువులు, పురుగుమందులు వాడకుండా ప్రకృతి/ సేంద్రియ వ్యవసాయ పద్ధతుల్లో చిరుధాన్యాలు, పప్పుధాన్యాలు, నూనెగింజలు వంటి మిశ్రమ పంటలు సాగు చేసే రైతులకు ప్రభుత్వాలు అండగా నిలవాలన్నారు. వారు ప్రభుత్వం నుంచి ఎరువులకు సంబంధించి ఎటువంటి సబ్సిడీలు పొందటం లేదు. ప్రకృతికి అనుగుణమైన సాగు పద్ధతి వల్ల పర్యావరణానికి, సమాజానికి ఎన్నో విధాలుగా ప్రయోజనం ఒనగూడుతున్నది. ఈ పర్యావరణ సేవలకు గుర్తింపుగా ఈ రైతులకు ప్రత్యేక చెల్లింపులు చేయాల్సిన అవసరం ఉందని మంజుల సూచించారు.
ఇది కొత్త భావన కాదని, ఇప్పటికే అనేక దేశాల్లో అమల్లో ఉన్నదేనన్నారు. డీడీఎస్ మాదిరి రసాయన రహిత జీవవైవిధ్య సాగు వల్ల భూసారాన్ని పెంపొందించటం, సాగు నీరు ఆదా అవుతుంది, పోషక విలువలతో కూడిన ఆహారం ప్రజలకు అందుతుంది కాబట్టి ఈ రైతులకు ప్రత్యేక మద్దతు వ్యవస్థను నెలకొల్పాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. వ్యవసాయానికి ప్రభుత్వం కేటాయిస్తున్న నిధుల్లో 6% అదనపు నిధులతోనే ఈ మద్దతు వ్యవస్థను అందుబాలోకి తేవచ్చని తమ అధ్యయనంలో వెల్లడైందని మంజుల అన్నారు.
రైతులు ఎందుకు నష్టపోవాలి?
సీనియర్ పాత్రికేయుడు డాక్టర్ కెవి కూర్మనాధ్ మాట్లాడుతూ వాతావరణ మార్పుల వల్ల రైతులకు ఎదురవుతున్న సరికొత్త సమస్యలను పాలకులు గుర్తించకపోవటం విడ్డూరంగా ఉందన్నారు. కుండపోత వర్షాలు, అకాల వర్షాల వల్ల పత్తి, ధాన్యంలో అధిక మోతాదులో తేమ ఉంటే అందుకు రైతులు ఎందుకు నష్టపోవాలని ప్రశ్నించారు. వాతావరణ మార్పుల నేపథ్యంలో నిబంధనలు సడలించి రైతులకు అండగా నిలవాల్సిన అవసరాన్ని ప్రభుత్వం ఎందుకు గుర్తెరగటం లేదన్నారు.
చిరుధాన్యాల సాగును ప్రోత్సహించాలి
రైతు స్వరాజ్య వేదిక నేత కన్నెగంటి రవి మాట్లాడుతూ, తెలంగాణ ఏర్పాటైన తర్వాత మద్దతు ధర, సేకరణ సదుపాయాల్లేక రాష్ట్రంలో చిరుధాన్యాల సాగు మరింత దిగజారిందన్నారు. అధిక బ్యాంకు రుణాలు పొందటం కోసం చిరుధాన్యాలు సాగు చేసే రైతులు కూడా తాము పత్తి, వరి వంటి పంటలు సాగు చేస్తున్నామని అధికారులతో చెబుతున్నారని, అందుకే చిరుధాన్యాల వాస్తవ సాగు విస్తీర్ణం కూడా గణాంకాల్లో ప్రతిఫలించటం లేదన్నారు. అత్యంత కాలుష్యానికి కారణమయ్యే ఇథనాల్ పరిశ్రమలు మరో 30 రాష్ట్రంలో రానున్నాయని, వీటికి ముడిసరుకు అందించటం కోసమే ప్రభుత్వం వరి సాగును ప్రత్యేక బోనస్ ప్రకటించి మరీ ప్రోత్సహిస్తున్నదన్నారు. మూడు చిరుధాన్య పంటలకు మద్దతు ధర ప్రకటించినా, జొన్నలను మాత్రమే కోర్టు ఆదేశించినప్పుడే ప్రభుత్వం సేకరిస్తోందన్నారు. పర్యావరణానికి, ప్రజారోగ్యానికి మేలు చేసే చిరుధాన్యాల సాగును ప్రోత్సహించేదుకు ప్రభుత్వం తన విధానాలను మార్చుకోవాలని రవి కోరారు.
Comments
Please login to add a commentAdd a comment