
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే నాటికి రాష్ట్రంలో అస్తవ్యస్త ఆర్థిక పరిస్థితులు ఉన్నప్పటికి రైతులకు ఇచ్చిన హామీ మేరకు ఏకకాలంలో రూ.2 లక్షల వరకున్న పంట రుణాలన్నింటినీ మాఫీ చేసినట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పునరుద్ఘాటించారు. 25,35,964 మంది రైతులకు సంబంధించిన రూ.20,616.89 కోట్ల రుణాలను మాఫీ చేసినట్లు ఆదివారం ఆయన ఒక ప్రకటనలో తెలిపారు.
వివిధ కారణాల వల్ల రుణమాఫీకి నోచుకోని అర్హులైన రైతులను ఈ పథకం కిందకి తీసుకొచ్చే విధంగా 3 నెలల పాటు అధికారులు ఇంటింటికి తిరిగి సమాచారం సేకరించి, చివరి విడతగా 3,13,896 మంది రైతులకు రూ. 2,747.67 కోట్లు రుణమాఫీ చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. బీఆర్‌ఎస్ హయాంలో రెండుసార్లు రుణమాఫీ పేరుతో రైతులను వంచించిన తీరును తెలంగాణ సమాజం గుర్తించిందని పేర్కొన్నారు.
2014లో రూ.లక్ష వరకు రుణమాఫీ చేస్తామని ఎన్నికల హామీ ఇచ్చి, అందుకోసం నాలుగు సంవత్సరాల సమయం తీసుకున్న చరిత్ర బీఆర్‌ఎస్‌దని అన్నారు. విడతల వారీగా రుణమాఫీ చేయడం వల్ల రైతులపై రూ. 2,630 కోట్ల అధిక వడ్డీ భారం పడిందని గుర్తు చేశారు.
గ్రామాలవారీ పంట నష్టం వివరాలివ్వండి
రాష్ట్ర వ్యాప్తంగా శుక్ర, శనివారాల్లో సంభవించిన వడగండ్ల వాన, ఈదురుగాలుల కారణంగా జరిగిన పంటనష్టంపై వివరాలు వెంటనే ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు వెంటనే గ్రామాలవారీ పంట నష్టంపై సర్వే చేసి వివరాలు అందజేయాలని వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులకు ఆ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదివారం ఆదేశాలు జారీ చేశారు. కాగా, ప్రస్తుతానికి అందిన వివరాల ప్రకారం రాష్ట్రంలోని 13 జిల్లాల్లోని 11వేల ఎకరాల్లో పంట నష్టం జరిగినట్టు అధికారులు ప్రాథమికంగా తేల్చారు. తుమ్మల తాజా ఆదేశాలతో పూర్తి స్థాయి పంటనష్టం వివరాలు సేకరించే పనిలో వ్యవసాయ శాఖ యంత్రాంగం నిమగ్నం కానుంది.
Comments
Please login to add a commentAdd a comment