రుణమాఫీ నిధులపై బ్యాంకర్లకు భట్టి, తుమ్మల సూచన
రూ.31 వేల కోట్లు ఒకేసారి రికవరీ కావడం ఓ చరిత్ర
రైతులతో పాటు బ్యాంకర్లు కూడా పండుగ జరుపుకోవాలి
సాక్షి, హైదరాబాద్: దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒకే దఫాలో ఇంత భారీ స్థాయిలో రుణమాఫీ చేసిన చరిత్ర లేదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు, మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు పేర్కొన్నారు. ఆగస్టు నెల దాటకముందే మొత్తం రూ.31 వేల కోట్లు బ్యాంకుల్లో జమ చేస్తామని చెప్పారు. రుణమాఫీ కింద విడుదల చేస్తున్న నిధులను రైతులకు సంబంధించిన ఇతర బకాయిల కింద జమ చేసుకోవద్దని బ్యాంకర్లకు స్పష్టం చేశారు. గురువారం ఉదయం సచివాలయంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశంలో వారు మాట్లాడారు.
రూ.2 లక్షల కంటే ఎక్కువ రుణం ఉన్న రైతులతో బ్యాంకర్లు మాట్లాడి బకాయిలు రికవరీ చేసుకోవాలని డిప్యూటీ సీఎం సూచించారు. ప్రభుత్వం ఇచ్చే రూ.2 లక్షలు, బ్యాంకులు రికవరీ చేసే మొత్తం కలుపుకొని రైతులను రుణ విముక్తులను చేయాలని చెప్పారు. పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేతగా తాను రైతు రుణమాఫీ గ్యారెంటీ కార్డుపై సంతకం చేసి ఎన్నికల ప్రచారంలోకి వెళ్లామని గుర్తు చేశారు.
ఇచి్చన మాట మేరకు రుణమాఫీ చేస్తున్నామని అన్నారు. 40 లక్షల బ్యాంకు ఖాతాల నుంచి రూ.31 వేల కోట్ల రైతు రుణాలు ఒకేసారి రికవరీ కావడం ఓ చరిత్ర అని అన్నారు. బ్యాంకర్లను వన్ టైమ్ సెటిల్‌మెంట్ అడగకుండా పూర్తిగా చెల్లిస్తున్నందుకు బ్యాంకర్లు కూడా రైతుల మాదిరి పండుగ చేసుకోవాలని భట్టి అన్నారు. రుణమాఫీ కాగానే రైతులకు అవసరమైన రుణాలు విరివిగా ఇవ్వాలని బ్యాంకర్లను కోరారు.
దేశం గరి్వంచదగ్గ రోజు: తుమ్మల
ఇది దేశం గర్వించదగిన రోజు అని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు అన్నారు. రుణమాఫీ కోసం సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు తీవ్రంగా శ్రమించారని తెలిపారు. వర్షాలు మొదలయ్యాయని, రైతు రుణమాఫీ నిధులు సకాలంలో అందితే వ్యవసాయం పండుగలా మారుతుందని అన్నారు. ఈ సమావేశంలో ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు, వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్‌రావు, బ్యాంకుల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
నల్లగొండ జిల్లాకు ఎక్కువ నిధులు
గురువారం తొలివిడత కింద రూ.లక్ష వరకు ఉన్న రుణాలను మాఫీ చేస్తూ విడుదల చేసిన నిధుల్లో అత్యధికం నల్లగొండ జిల్లాకు వెళ్లాయి. ఈ జిల్లాకు చెందిన 78,463 కుటుంబాల బ్యాంకు ఖాతాల్లో రూ.454.49 కోట్లు జమ అయ్యాయి. అసెంబ్లీ నియోజకవర్గం వారీగా తీసుకుంటే అత్యధికంగా ఆందోల్ నియోజకవర్గంలో 19,186 కుటుంబాలకు రూ.107.83 కోట్లు విడుదల అయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment