Loan waiver funds
-
నేడు పాలమూరులో రైతు పండుగ బహిరంగ సభ
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం పూర్తికానున్న సందర్భంగా ప్రజాపాలన విజయోత్సవాలను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా మహబూబ్‌నగర్ జిల్లా అమిస్తాపూర్‌లో ప్రతిష్టాత్మకంగా ఈ నెల 28 నుంచి మూడు రోజుల పాటు చేపట్టిన రైతు పండుగ సదస్సుకు శనివారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హాజరుకానున్నారు. వ్యవసాయం, దాని అనుబంధ రంగాలకు సంబంధించి వ్యవసాయ యాంత్రీకరణ.. నూతన సాంకేతిక విధానాలు, ప్రకృతి వ్యవసాయం వంటి అంశాలపై ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించిన అనంతరం అక్కడే మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగసభలో పాలొంటారు.సీఎం రాక ఇలా.. : సీఎం రేవంత్ శనివారం మధ్యాహ్నం 3 గంటలకు ఆయన స్వగృహం నుంచి బయలుదేరి రోడ్డు మార్గంలో బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి హెలీకాప్టర్‌లో సాయంత్రం 3:30 గంటల వరకు మహబూబ్‌నగర్ జిల్లా అమిస్తాపూర్‌కు వస్తారు. సమీపంలోని రైతు పండుగ సదస్సుకు చేరుకొని స్టాళ్లను పరిశీలిస్తారు. అనంతరం నాలుగున్నర గంటలకు బహిరంగసభలో ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్, తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావుతోపాటు మరికొందరు మంత్రులు సైతం సదస్సుకు హాజరుకానున్నట్టు తెలుస్తోంది. బహిరంగసభ ముగిశాక సాయంత్రం ఆరుగంటలకు తిరుగు పయనమై హైదరాబాద్‌లోని తన నివాసానికి సీఎం చేరుకుంటారు. భారీగా రైతుల సమీకరణ.. బహిరంగసభకు అధికార యంత్రాంగం భారీగా ఏర్పాట్లు చేసింది. ప్రభుత్వం రైతు పండుగను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి రైతులను సమీకరించే బాధ్యత కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు తీసుకున్నారు. మహబూబ్‌నగర్ రీజియన్ నుంచి ఆర్టీసీ 657 బస్సులను కేటాయించింది. వీటితోపాటు ప్రైవేట్ బస్సులు, జీబులు తదితర వాహనాల్లో రైతులు తరలిరానున్నారు. సుమారు లక్ష మంది వస్తారనే అంచనాతో బహిరంగసభకు తగిన ఏర్పాట్లు చేశారు. పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో 2 వేల మందితో భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు.రుణమాఫీ, రైతు భరోసాపై ఆశలు.. కాంగ్రెస్ ప్రభుత్వం రూ.2 లక్షలలోపు పంట రుణాలను మాఫీ చేసిన విషయం తెలిసిందే. అయితే సాంకేతిక కారణాలతో పలువురు రైతులకు రుణాలు మాఫీ కాలేదు. ఈ మేరకు అధికారులు ఇప్పటికే సేకరించిన వివరాలతో జాబితా రూపొందించగా.. దీంతోపాటు రైతు భరోసా నిధుల విడుదలపై రైతు పండుగవేళ సీఎం శుభవార్త అందిస్తారని రైతులు ఆశగా ఎదురుచూస్తున్నారు. రూ.2 లక్షలకు పైగా పంట రుణాలను మాఫీ చేస్తామని.. అయితే రూ.2 లక్షలు ప్రభుత్వమే చెల్లిస్తుందని.. మిగతా మొత్తాన్ని రైతులు భరించాలని ప్రజాప్రతినిధులు పలు సందర్భాల్లో చెప్పారు. ఈ నేపథ్యంలో రూ.2 లక్షలకు పైగా రుణాల మాఫీపై రేవంత్‌రెడ్డి ప్రకటన చేయొచ్చనే ఆకాంక్ష అన్నదాతల్లో వ్యక్తమవుతోంది. -
Telangana: నేడు రెండో విడత రుణమాఫీ
సాక్షి, హైదరాబాద్: రెండో విడత రుణమాఫీకి ప్రభుత్వం సిద్ధమైంది. మంగళవారం దాదాపు 7 లక్షల మంది రైతులకు సంబంధించిన రుణాలు మాఫీ చేసేందుకు ఏర్పాట్లు చేసినట్లు సమాచారం. రూ.లక్షన్నర వరకు రుణాలున్న వారి బ్యాంకు ఖాతాల్లో ఈ సొమ్ము జమ చేస్తారు. రుణ మాఫీ మొదటి విడతలో రూ.లక్ష లోపు రుణా లకు సంబంధించి 11.50 లక్షల కుటుంబాలకు రూ.6,098.94 కోట్లు విడుదల చేసిన సంగతి తెలిసిందే. కాగా వీటిలో.. రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా నుంచి ప్రభుత్వానికి అందిన సమాచారం ప్రకారం 11.32 లక్షల కుటుంబాలకు రూ.6,014 కోట్లు జమయ్యాయి.కొన్ని సాంకేతిక కారణాలతో 17,877 ఖాతాలకు చెందిన రూ.84.94 కోట్లు రైతుల ఖాతాల్లో జమ కాలేదు. కాగా రెండో విడత రుణమాఫీ చెల్లింపులకు సంబంధించి సోమవారం రాత్రి వరకు మండలాల్లోని వ్యవసాయశాఖ అధికారులకు కూడా లబి్ధదారుల జాబితా అందలేదని సమాచారం. రాత్రి పొద్దుపోయాక జాబితా అందుతుందని భావిస్తున్నారు. మొదటి విడతలో లక్ష వరకు రుణాలున్న అనేకమంది అర్హులకు రుణమాఫీ కాలేదనే విమర్శలు వచ్చాయి. దీంతో రెండో విడత రుణమాఫీలో అలాంటి పొరపాట్లు తలెత్తకుండా చర్యలు తీసుకున్నామని అధికారులు చెబుతున్నారు. వచ్చే నెలలో రూ.2 లక్షల వరకు మాఫీ: మంత్రి తుమ్మల మంగళవారం లక్షా యాభై వేల రూపాయల వరకు ఉన్న రుణాలను మాఫీ చేయనున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమాన్ని వీడియో కాన్ఫరెన్స్ సౌకర్యం ఉన్న అన్ని రైతువేదికల్లో ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు ఏర్పాట్లు చేశామని పేర్కొన్నారు.ఈ కార్యక్రమానికి ముందు నిర్వహించే రైతునేస్తం కార్యక్రమంలో రూ.లక్ష వరకు జరిగిన రుణ మాఫీకి సంబంధించి సందేహాలు ఉన్న రైతులు.. అక్కడ ఉన్న అధికారులు, బ్యాంకర్లను సంప్రదించి నివృత్తి చేసుకోవాలని సూచించారు. అనంతరం రూ.లక్షన్నర వరకు జరిగే రుణమాఫీ కార్యక్రమాన్ని వీక్షించాల్సిందిగా రైతులకు విజ్ఙప్తి చేశారు. వచ్చే నెలలో రూ.2 లక్షల వరకు మాఫీ చేస్తామని ప్రకటించారు. ఇదీ గత ప్రభుత్వ నిర్వాకం తమ ప్రభుత్వానికి ఒక స్పష్టమైన విధానం లేదని విమర్శించిన పెద్దలకు, గత ప్రభుత్వం అనుసరించిన అసమంజస విధానాలను గుర్తు చేయదల్చుకున్నానని మంత్రి తెలిపారు. ’ప్రతి సంవత్సరం ఒక కొత్త విధానంతో రైతాంగాన్ని ఆందోళనలోకి నెట్టడమే వారి విధానంగా ఉండేది. ఒక ఏడాది పత్తి వద్దు అన్నారు. రైతులు వారి మాటలు నమ్మి కంది పంట వేస్తే కందులు కొనే నాధుడే లేరు. మరో ఏడాది పంట కాలనీలు అని ఊక దంపుడు ఉపన్యాసాలు ఇచ్చారు.తరువాత దాని ఉసే లేదు. వరి వేస్తే ఉరి అన్నారు.. ఆ మాట నమ్మి మొక్కజొన్న వేస్తే కొనుగోలు సమయానికి మొహం చాటేశారు. సన్నాల సాగు అని సన్నాయి నొక్కులు నొక్కి తీరా మార్కెటింగ్‌కు వచ్చేసరికి బోనస్ కాదు కదా మద్దతు ధర కూడా దక్కలే. ఇక రుణమాఫీ 2014 కానీ, 2018 కానీ.. అసలు రుణమాఫీ పథకాలు కావని, వడ్డీ మాఫీ పథకాలుగా ప్రతి రైతు చెబుతాడు..’అని మంత్రి దుయ్యబట్టారు. -
మాఫీ సంబురాలు
సాక్షి, హైదరాబాద్: రైతు రుణమాఫీ అమలుతో రాష్ట్రంలోని కాంగ్రెస్ శ్రేణులు సంబురాలు జరుపుకున్నాయి. పార్టీ రాష్ట్ర కార్యాలయమైన గాం«దీభవన్ మొదలు గ్రామ స్థాయిలోని రైతు వేదికల వరకు అన్ని స్థాయిల్లో పార్టీ కేడర్, నాయకులు.. రైతులతో కలిసి వేడుకలు జరుపుకున్నారు. జిల్లా, నియోజకవర్గ, మండల, గ్రామాల స్థాయిలో టపాసులు పేల్చి, మిఠాయిలు పంచుకున్నారు. సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కల చిత్రపటాలకు పాలాభిõÙకం చేశారు.నృత్యాలు చేస్తూ తమ ఆనందాన్ని పంచుకున్నారు. ట్రాక్టర్లు, ఎడ్లబండ్ల ర్యాలీలు నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, పలు కార్పొరేషన్ల చైర్మన్లు, టీపీ సీసీ కార్యవర్గం పాల్గొన్నారు. నల్లగొండలో స్వయంగా ట్రాక్టర్ నడుపుతూ మంత్రి కోమటిరెడ్డి ర్యాలీలో పాల్గొన్నారు. రైతులకు రుణ విముక్తి కల్పించిన ఘనత కాంగ్రెస్‌దేనని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా.. పైసా పైసా కూడబెట్టి రైతులను రుణ విముక్తి చేస్తున్నామన్నారు. నాగర్‌కర్నూల్ జిల్లాలో జరిగిన కార్యక్రమానికి ఎంపీ మల్లురవి హాజరయ్యారు. రైతు వేదికల వద్ద కోలాహలం గ్రామాల్లో రైతు వేదికల వద్ద రైతులతో కలిసి కాంగ్రెస్ నేతలు సంబురాలు చేసుకున్నారు. క్లస్టర్ స్థాయిలో జరిగిన ఈకార్యక్రమాల్లో రైతులు, వ్యవసాయ అధికారులు పాల్గొన్నారు. ఇక సీఎం రేవంత్‌రెడ్డి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొనేందుకు కూడా రైతులు రైతు వేదికల వద్దకు వచ్చారు. చప్పట్ల ద్వారా ప్రభుత్వానికి సంఘీభావం ప్రకటించారు. రైతు వేదికల వద్ద రుణమాఫీ లబి్ధదారుల జాబితాలు కూడా పెట్టడంతో కాంగ్రెస్ నేతల హడావుడి కనిపించింది. కాగా శుక్రవారం మండల స్థాయిలో రుణమాఫీ సంబురాలు జరగనున్నాయి. శని, ఆదివారాల్లో గ్రామ స్థాయిల్లో జరిగే ర్యాలీల కోసం పార్టీ శ్రేణులు ఏర్పాట్లు చేస్తున్నారు. మున్షీ, యాష్కీల సమక్షంలో.. హైదరాబాద్ గాం«దీభవన్‌లో రైతు రుణమాఫీ సంబురాలు నిర్వహించారు. టపాసులు పేల్చి, డప్పు లు వాయిస్తూ, నృత్యాలు చేస్తూ నినాదాలు చేస్తూ పెద్ద ఎత్తున కేడర్ వేడుకల్లో పాల్గొన్నారు. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దీపాదాస్ మున్షీ, టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ గౌడ్, ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్షుడు రోహిణ్‌రెడ్డి, రాష్ట్ర మత్స్యకార సొసైటీల సమాఖ్య చైర్మన్ మెట్టు సాయికుమార్, టీపీసీసీ అధికార ప్రతినిధులు సత్యం శ్రీరంగం, కమల్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మధుయాష్కీ మీడియాతో మాట్లాడుతూ రైతు లకు ఏకకాలంలో రూ.2 లక్షల రుణమాఫీ చేయడం దేశ చరిత్రలోనే తొలిసారని వ్యాఖ్యానించారు. రుణమాఫీ ప్రారంభించిన జూలై 18 రైతుల మదిలో చిరస్థాయిగా నిలిచిపోతుందన్నారు. -
ఇతర బకాయిలకు జమ చేసుకోవద్దు
సాక్షి, హైదరాబాద్: దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒకే దఫాలో ఇంత భారీ స్థాయిలో రుణమాఫీ చేసిన చరిత్ర లేదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు, మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు పేర్కొన్నారు. ఆగస్టు నెల దాటకముందే మొత్తం రూ.31 వేల కోట్లు బ్యాంకుల్లో జమ చేస్తామని చెప్పారు. రుణమాఫీ కింద విడుదల చేస్తున్న నిధులను రైతులకు సంబంధించిన ఇతర బకాయిల కింద జమ చేసుకోవద్దని బ్యాంకర్లకు స్పష్టం చేశారు. గురువారం ఉదయం సచివాలయంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశంలో వారు మాట్లాడారు.రూ.2 లక్షల కంటే ఎక్కువ రుణం ఉన్న రైతులతో బ్యాంకర్లు మాట్లాడి బకాయిలు రికవరీ చేసుకోవాలని డిప్యూటీ సీఎం సూచించారు. ప్రభుత్వం ఇచ్చే రూ.2 లక్షలు, బ్యాంకులు రికవరీ చేసే మొత్తం కలుపుకొని రైతులను రుణ విముక్తులను చేయాలని చెప్పారు. పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేతగా తాను రైతు రుణమాఫీ గ్యారెంటీ కార్డుపై సంతకం చేసి ఎన్నికల ప్రచారంలోకి వెళ్లామని గుర్తు చేశారు.ఇచి్చన మాట మేరకు రుణమాఫీ చేస్తున్నామని అన్నారు. 40 లక్షల బ్యాంకు ఖాతాల నుంచి రూ.31 వేల కోట్ల రైతు రుణాలు ఒకేసారి రికవరీ కావడం ఓ చరిత్ర అని అన్నారు. బ్యాంకర్లను వన్ టైమ్ సెటిల్మెంట్ అడగకుండా పూర్తిగా చెల్లిస్తున్నందుకు బ్యాంకర్లు కూడా రైతుల మాదిరి పండుగ చేసుకోవాలని భట్టి అన్నారు. రుణమాఫీ కాగానే రైతులకు అవసరమైన రుణాలు విరివిగా ఇవ్వాలని బ్యాంకర్లను కోరారు. దేశం గరి్వంచదగ్గ రోజు: తుమ్మల ఇది దేశం గర్వించదగిన రోజు అని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు అన్నారు. రుణమాఫీ కోసం సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు తీవ్రంగా శ్రమించారని తెలిపారు. వర్షాలు మొదలయ్యాయని, రైతు రుణమాఫీ నిధులు సకాలంలో అందితే వ్యవసాయం పండుగలా మారుతుందని అన్నారు. ఈ సమావేశంలో ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు, వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్‌రావు, బ్యాంకుల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.నల్లగొండ జిల్లాకు ఎక్కువ నిధులు గురువారం తొలివిడత కింద రూ.లక్ష వరకు ఉన్న రుణాలను మాఫీ చేస్తూ విడుదల చేసిన నిధుల్లో అత్యధికం నల్లగొండ జిల్లాకు వెళ్లాయి. ఈ జిల్లాకు చెందిన 78,463 కుటుంబాల బ్యాంకు ఖాతాల్లో రూ.454.49 కోట్లు జమ అయ్యాయి. అసెంబ్లీ నియోజకవర్గం వారీగా తీసుకుంటే అత్యధికంగా ఆందోల్ నియోజకవర్గంలో 19,186 కుటుంబాలకు రూ.107.83 కోట్లు విడుదల అయ్యాయి. -
రుణం.. మాఫీ అయ్యేనా!
పంట రుణాల మాఫీ కోసం అన్నదాతలు ఆశగా ఎదురుచూస్తున్నారు. గతేడాది బ్యాంకుల నుంచి తీసుకున్న పంట రుణాల చెల్లింపునకు సమయం ఆసన్నం కావడంతో ఆందోళనలో పడ్డారు. ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రాకపోవడంతో అసలు రుణ మాఫీ ఉందా.. లేదా అని రైతులు సందేహం వ్యక్తం చేస్తున్నారు. మరోపక్క తీసుకున్న రుణ మొత్తాన్నిగానీ.. లేదంటే వడ్డీగానీ చెల్లించాలని రైతులకు బ్యాంకర్లు ఫోన్లు చేస్తున్నారు. దీనికితోడు ప్రస్తుత ఖరీఫ్ సీజన్ ప్రారంభం కావడంతో కొత్త రుణాల కోసం బ్యాంకుల వద్దకు వెళ్తున్న రైతులకు చేదు అనుభవం ఎదురవుతోంది. ‘పాత బకాయిలు చెల్లించండి.. లేదంటే వడ్డీ కట్టి రెన్యూవల్ చేసుకోండి’ అని బ్యాంకర్లు చెబుతున్నారు. ఒక్కో రైతుకు గరిష్ఠంగా రూ.లక్ష వరకు పంట రుణాణం మాఫీ చేస్తామని ప్రభుత్వం నుంచి హామీ వచ్చినప్పటికీ ఈ ప్రక్రియకు సంబంధించిన మార్గదర్శకాలు వెలువడకపోవడంతో ఖరీఫ్ పంట కాలానికి రుణ వితరణ నిలిచిపోయింది. సాక్షి, రంగారెడ్డి జిల్లా: జిల్లాలో గత ఖరీఫ్, రబీ సీజన్లలో కలిపి రూ.880 కోట్ల వరకు పంట రుణాలు, వ్యవసాయ అనుబంధ రుణాలు పంపిణీ చేశారు. ప్రభుత్వం పేర్కొన్న నిబంధనల ప్రకారం 2018 డిసెంబరు 11వ తేదీ కన్నా ముందుగా తీసుకున్న రుణాలన్నింటికీ మాఫీ వర్తింపచేసే అవకాశముంది. ఈ మేరకు జిల్లాలో దాదాపుగా రూ.475 కోట్ల వరకు పంట రుణాలు మాఫీ కావాల్సి ఉంది. జిల్లా వ్యాప్తంగా 2.72 లక్షల మంది రైతులు ఉండగా.. ఇందులో సుమారు 1.40 లక్షల మంది రైతులు రుణాలు పొందారు. వీరిలో రూ.లక్ష లోపు రుణం తీసుకున్న రైతులు 95 వేల మంది ఉండొచ్చని అంచనా. పాత రుణాలను 2018 డిసెంబరు 11 తర్వాత రెన్యూవల్ చేసుకున్నా మాఫీ వర్తిస్తుంది. కానీ, డిసెంబరు 11 తర్వాత రెన్యూవల్ చేసినా మాఫీ పరిధిలోకి తాము రామని రైతులు ఆందోళన చెందుతు న్నారు. పాత రుణాలన్నింటికీ మాఫీ వర్తిస్తుందని అధికారులు పేర్కొంటున్నా.. రైతుల్లో నమ్మకం కలగటం లేదు. పెరుగుతున్న వడ్డీ భారం పంట రుణం తీసుకున్న తేదీ నుంచి ఏడాదిలోపు వడ్డీతో సహా అసలు చెల్లిస్తే రూ.లక్ష వరకు సున్నా వడ్డీ, రూ.లక్ష నుంచి రూ.3 లక్షల వరకు పావలా వడ్డీ వర్తింపజేస్తారు. కాగా, రుణ మాఫీపై స్పష్టత వచ్చేవరకు అప్పు చెల్లిం చేది లేదని రైతులు స్పష్టం చేస్తున్నారు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం వడ్డీరాయితీ రీయింబర్స్‌మెంట్‌ను సకాలంలో బ్యాంకులకు విడుదల చేయకపోవడంతో కొందరు బ్యాంకర్లు రైతుల నుంచి వడ్డీ వసూలు చేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సహకార సంఘాలకు ఐదేళ్ల నుంచి రిబేటుని సర్కారు విడుదల చేయకపోవడం కారణంగా సంఘాలు కూడా ప్రస్తుతం వడ్డీ వసూలు చేస్తున్నాయి. ఫలితంగా రైతులపై అదనపు భారం పడుతోంది. ఈ నేపథ్యంలో పంట రుణ మాఫీ మార్గదర్శకాలను త్వరితగతిన విడుదల చేయాల్సిన అవసరం ఉంది. ఈ విషయమై జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ రిజ్వాన్‌ను ‘సాక్షి’ వివరణ కోరగా.. పంట రుణ మాఫీకి సంబంధించి మార్గదర్శకాలు తమకు ఇంకా అందలేదని సమాధానమిచ్చారు. రెన్యూవల్ చేసుకోవాలని చెబుతున్నారు బ్యాంకుల నుంచి రుణాలు ఇవ్వకపోవడంతో వ్యవసాయం చేసేందుకు పెట్టుబడికి డబ్బులు లేవు. గత ఏడాది మే నెలలో నా పేరు మీద ఉన్న 4ఎకరాల పొలానికి ఎస్బీఐ బ్యాంకులో రూ.99 వేల పంట రుణం తీసుకున్నా. రూ.లక్షలోపు పంట రుణాలు మాఫీ చేస్తారని చెప్పడంతో రెన్యూవల్ చేయించుకోలేదు. వారం రోజుల క్రితం పెట్టుబడి కోసం బ్యాంకుకు వెళితే ‘రుణమాఫీ తర్వాత అవుతుంది.. మొదట మీ బాకీ రెన్యూవల్ చేసుకోండి. రుణం పెంచి ఇస్తాం’ అని బ్యాంకు అధికారులు చెప్పారు. – బాలమోని కృష్ణయ్య, అవురుపల్లి. మాడ్గుల అప్పు చెల్లిస్తేనే కొత్త రుణం ఇస్తామంటున్నారు తలకొండపల్లి మండలం వెంకట్రావ్‌పేట్‌కు చెందిన రైతు సైదుపల్లి వెంకట్‌రెడ్డి 2014లో తలకొండపల్లి గ్రామీణ వికాస్ బ్యాంక్ నుంచి రూ.లక్ష పంట రుణం తీసుకున్నారు. ప్రభుత్వం సంవత్సరానికి 25 శాతం చొప్పున నాలుగు విడతలుగా మాఫీ చేసినా వడ్డీకే సరిపోయింది. అసలు రూ.లక్ష అలాగే మిగిలింది. రూ.లక్షలోపు పంట రుణాన్ని మాఫీ చేస్తానని సీఎం ఇచ్చిన హామీ ఎప్పుడు అమలవుతుందోనని ఆరు నెలలుగా ఎదురుచూస్తున్నాడు. ఖరీఫ్ సీజన్ రావడంతో రుణాల కోసం బ్యాంకుల వెళ్తే.. పాత అప్పు చెల్లిస్తేనే రుణాలు ఇస్తామని బ్యాంక్ అధికారులు అంటున్నారు. మాఫీ కోసం ఎదురుచూస్తున్నాం నాకు మా గ్రామ శివారులో ç2ఎకరాల 14గుంటల భూమి ఉంది. గతేడాది నందిగామలోని పంజాబ్ నేషనల్ బ్యాంకులో రూ.86 వేలు పంట రుణం తీసుకున్నా. ఇవిమాఫీ చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. మాఫీ కోసం ఎదురుచూస్తున్న. ఖరీఫ్ సాగు పెట్టుబడుల కోసం బ్యాంకుకు వెళ్తే రెన్యూవల్ చేసుకోవాలని అధికారులు చెబుతున్నారు. –ఓజిని విఠలయ్య, వీర్లపల్లి, నందిగామ మండలం. -
తెలంగాణలో రుణమాఫీకి మరో రూ.2043 కోట్లు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం రైతుల రుణమాఫీ రెండో విడత నిధులను విడుదల చేసింది. ఆర్థిక ఇబ్బందులతో గత నెల 20న కేవలం రూ.2043 కోట్లు విడుదల చేసిన ఆర్థిక శాఖ.. మిగతా సగం నిధులను పెండింగ్‌లో పెట్టింది. క్షేత్ర స్థాయిలో ఖరీఫ్ రుణాల రెన్యువల్‌కు ఇబ్బంది తలెత్తకుండా మిగతా నిధులను సైతం ప్రభుత్వం విడుదల చేసింది. రూ.2043 కోట్లను వ్యవసాయ శాఖకు కేటాయిస్తూ ఆర్థిక శాఖ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. తొలి ఏడాది రుణాల మాఫీ నిధులను ఒకేసారి బ్యాంకులకు విడుదల చేసిన ప్రభుత్వం ఈసారి రెండు విడతలుగా మంజూరు చేసింది. టీఆర్ఎస్ అధికారంలోకి రాగానే ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా రాష్ట్రంలో పంట రుణాల మాఫీకి నిర్ణయం తీసుకుంది. రైతులకు సంబంధించి రూ. లక్షలోపు పంట రుణాలు మాఫీ చేసింది. మొత్తం 35.56 లక్షల మంది రైతులకు సంబంధించి రూ.17 వేల కోట్ల రుణాలు మాఫీ చేయనున్నట్లు ప్రకటించింది. ఏడాదికి 25 శాతం చొప్పున వరుసగా నాలుగేళ్లలో రుణమాఫీ నిధులను బ్యాంకులకు విడుదల చేయనుంది. తొలి ఏడాది ఆలస్యంగా ఈ నిధులు విడుదల చేయటంతో రైతుల రుణాల మాఫీ ఏడాది పొడవునా సాగటం గందరగోళానికి దారి తీసింది. ఈసారి సకాలంలో నిధులు విడుదల చేయటంతో రైతులు తమ రుణాలు రెన్యువల్ చేసుకునే వెసులుబాటు కలిగింది. మరోవైపు బ్యాంకుల నుంచి అందుతున్న యుటిలైజేషన్ సర్టిఫికెట్ల ఆధారంగా రుణమాఫీ నిధుల్లో కొంతమేరకు ఆదా అవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. తొలి ఏడాది రూ.4250 కోట్ల రుణమాఫీ నిధులు విడుదల చేస్తే.. అందులో దాదాపు రూ.140 కోట్లు రైతుల ఖాతాలకు రీఎంబర్స్ కాకుండా మిగిలిపోయాయి. అందుకే ఈసారి రూ.4086 కోట్ల నిధులనే విడుదల చేయటం గమనార్హం. -
ఎదురుచూపులేనా?
రుణమాఫీ నిధుల కోసం అన్నదాతల నిరీక్షణ * ఖరీఫ్ ప్రారంభానికి సమీపిస్తున్న గడువు * రెండో విడత 25 శాతం సొమ్ము వస్తేనే రుణాలు రెన్యువల్ చేస్తామంటున్న బ్యాంకర్లు * జిల్లాకు మంజూరు కావాల్సింది రూ.447.5 కోట్లు మోర్తాడ్: పంట రుణాల మాఫీకి సంబంధించిన రెండో విడత 25 శాతం సొమ్ము కోసం రైతులు నిరీక్షిస్తున్నారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభానికి సమయం దగ్గర పడుతుండటంతో కొత్త పంటల సాగు కోసం రైతులు రుణాలను రెన్యువల్ చేయించుకోవాలి. అయితే రెండో విడత మాఫీ సొమ్ము జమ అయ్యూకనే రుణాలు రెన్యువల్ చేస్తామని బ్యాంకర్లు స్పష్టం చేస్తున్నారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే రూ. లక్ష వరకు పంట రుణాలను రెన్యువల్ చేస్తామని ఎన్నికల ముందు కేసీఆర్ హమీ ఇచ్చిన విషయం విదితమే. తర్జన భర్జనల అనంతరం పంట రుణాల మాఫీకి ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఒకేసారి రూ.లక్ష రుణం మాఫీ కాకుండా నాలుగు విడతల్లో నిధులను కేటాయిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. చివరకు గత సంవత్సరం అక్టోబర్‌లో తొలి విడతగా 25 శాతం రుణం మాఫీ సొమ్మును ప్రభుత్వం కేటాయించింది. జిల్లాలో 3.62 లక్షల మంది రైతులు పంట రుణాల మాఫీకి అర్హత సాధించారు. వారికి రూ.1,790 కోట్ల రుణాలు మాఫీ అయ్యూయి. ఇందులో తొలి విడతగా 25 శాతం అంటే రూ.447.5 కోట్లు బ్యాంకర్లకు చేరగా, వారు అర్హులైర రైతుల ఖాతాల్లో జమ చేశారు. దీంతో రైతు తీసుకున్న రుణం మొత్తంలో 25 శాతం తగ్గింది. ఇక రెండో విడతలో ఇచ్చే మరో 25 శాతం కోసం గత బడ్జెట్లోనే ప్రభుత్వం నిధులు కేటాయించింది. కానీ ఇంకా బ్యాంకర్లకు చేర్చకపోవడంతో రుణాల రెన్యువల్‌కు బ్రేక్ పడినట్లు అయింది. త్వరలో మొదలయ్యే ఖరీఫ్ సీజన్లో రైతులు ఎరువులు, విత్తనాలు కొనుగోలు చేయాల్సి ఉంది. తొలకరి రాకతోనే పంటల సాగు పనులు మొదలు పెడతారు. సకాలంలో బ్యాంకుల్లో రుణాల రెన్యువల్ చేస్తేనే తమ చేతిలో డబ్బు ఉండి అన్ని పనులు ఊపందుకుంటాయని అంటున్నారు. కాగా ప్రభుత్వం మాత్రం ఇంత వరకు రెండో విడత రుణ మాఫీ సొమ్ము విషయాన్ని ఇంకా స్పష్టం చేయలేదు. బ్యాంకులకు నిధులు కేటాయిస్తే వారు రైతుల రుణ ఖాతాల్లో నిధులను జమ చేస్తారు. రెండో విడత మాఫీ సొమ్ము ఆలస్యమైతే రుణాలు రెన్యూవల్ కాక వడ్డీ వ్యాపారులను ఆశ్రయించక తప్పదని రైతులు అభిప్రాయపడుతున్నారు. బడ్జెట్లో నిధులు కేటాయించినా ఇంత వరకు మాఫీ సొమ్ము బ్యాంకులకు చేరక పోవడం వల్ల రైతులు నిరాశ చెందుతున్నారు. ప్రభుత్వం తొందరగా స్పందించి రెండో విడత మాఫీ సొమ్మును బ్యాంకులకు చేర్చాలని పలువురు కోరుతున్నారు.