సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం రైతుల రుణమాఫీ రెండో విడత నిధులను విడుదల చేసింది. ఆర్థిక ఇబ్బందులతో గత నెల 20న కేవలం రూ.2043 కోట్లు విడుదల చేసిన ఆర్థిక శాఖ.. మిగతా సగం నిధులను పెండింగ్‌లో పెట్టింది. క్షేత్ర స్థాయిలో ఖరీఫ్ రుణాల రెన్యువల్‌కు ఇబ్బంది తలెత్తకుండా మిగతా నిధులను సైతం ప్రభుత్వం విడుదల చేసింది. రూ.2043 కోట్లను వ్యవసాయ శాఖకు కేటాయిస్తూ ఆర్థిక శాఖ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. తొలి ఏడాది రుణాల మాఫీ నిధులను ఒకేసారి బ్యాంకులకు విడుదల చేసిన ప్రభుత్వం ఈసారి రెండు విడతలుగా మంజూరు చేసింది. టీఆర్‌ఎస్ అధికారంలోకి రాగానే ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా రాష్ట్రంలో పంట రుణాల మాఫీకి నిర్ణయం తీసుకుంది.
రైతులకు సంబంధించి రూ. లక్షలోపు పంట రుణాలు మాఫీ చేసింది. మొత్తం 35.56 లక్షల మంది రైతులకు సంబంధించి రూ.17 వేల కోట్ల రుణాలు మాఫీ చేయనున్నట్లు ప్రకటించింది. ఏడాదికి 25 శాతం చొప్పున వరుసగా నాలుగేళ్లలో రుణమాఫీ నిధులను బ్యాంకులకు విడుదల చేయనుంది. తొలి ఏడాది ఆలస్యంగా ఈ నిధులు విడుదల చేయటంతో రైతుల రుణాల మాఫీ ఏడాది పొడవునా సాగటం గందరగోళానికి దారి తీసింది. ఈసారి సకాలంలో నిధులు విడుదల చేయటంతో రైతులు తమ రుణాలు రెన్యువల్ చేసుకునే వెసులుబాటు కలిగింది. మరోవైపు బ్యాంకుల నుంచి అందుతున్న యుటిలైజేషన్ సర్టిఫికెట్ల ఆధారంగా రుణమాఫీ నిధుల్లో కొంతమేరకు ఆదా అవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. తొలి ఏడాది రూ.4250 కోట్ల రుణమాఫీ నిధులు విడుదల చేస్తే.. అందులో దాదాపు రూ.140 కోట్లు రైతుల ఖాతాలకు రీఎంబర్స్ కాకుండా మిగిలిపోయాయి. అందుకే ఈసారి రూ.4086 కోట్ల నిధులనే విడుదల చేయటం గమనార్హం.