రూ.లక్షన్నర వరకు అప్పులున్న రైతుల ఖాతాల్లో జమ
దాదాపు 7 లక్షల మందికి లబ్ధి!
రైతు వేదికల్లో ప్రత్యక్ష ప్రసారం: మంత్రి తుమ్మల
తొలి విడతలో రూ.లక్ష వరకు రుణాలున్న 11.50 లక్షల
కుటుంబాలకు ఇప్పటికే రూ.6,098.94 కోట్లు విడుదల
సాక్షి, హైదరాబాద్: రెండో విడత రుణమాఫీకి ప్రభుత్వం సిద్ధమైంది. మంగళవారం దాదాపు 7 లక్షల మంది రైతులకు సంబంధించిన రుణాలు మాఫీ చేసేందుకు ఏర్పాట్లు చేసినట్లు సమాచారం. రూ.లక్షన్నర వరకు రుణాలున్న వారి బ్యాంకు ఖాతాల్లో ఈ సొమ్ము జమ చేస్తారు. రుణ మాఫీ మొదటి విడతలో రూ.లక్ష లోపు రుణా లకు సంబంధించి 11.50 లక్షల కుటుంబాలకు రూ.6,098.94 కోట్లు విడుదల చేసిన సంగతి తెలిసిందే. కాగా వీటిలో.. రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా నుంచి ప్రభుత్వానికి అందిన సమాచారం ప్రకారం 11.32 లక్షల కుటుంబాలకు రూ.6,014 కోట్లు జమయ్యాయి.
కొన్ని సాంకేతిక కారణాలతో 17,877 ఖాతాలకు చెందిన రూ.84.94 కోట్లు రైతుల ఖాతాల్లో జమ కాలేదు. కాగా రెండో విడత రుణమాఫీ చెల్లింపులకు సంబంధించి సోమవారం రాత్రి వరకు మండలాల్లోని వ్యవసాయశాఖ అధికారులకు కూడా లబి్ధదారుల జాబితా అందలేదని సమాచారం. రాత్రి పొద్దుపోయాక జాబితా అందుతుందని భావిస్తున్నారు. మొదటి విడతలో లక్ష వరకు రుణాలున్న అనేకమంది అర్హులకు రుణమాఫీ కాలేదనే విమర్శలు వచ్చాయి. దీంతో రెండో విడత రుణమాఫీలో అలాంటి పొరపాట్లు తలెత్తకుండా చర్యలు తీసుకున్నామని అధికారులు చెబుతున్నారు.
వచ్చే నెలలో రూ.2 లక్షల వరకు మాఫీ: మంత్రి తుమ్మల
మంగళవారం లక్షా యాభై వేల రూపాయల వరకు ఉన్న రుణాలను మాఫీ చేయనున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమాన్ని వీడియో కాన్ఫరెన్స్ సౌకర్యం ఉన్న అన్ని రైతువేదికల్లో ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు ఏర్పాట్లు చేశామని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమానికి ముందు నిర్వహించే రైతునేస్తం కార్యక్రమంలో రూ.లక్ష వరకు జరిగిన రుణ మాఫీకి సంబంధించి సందేహాలు ఉన్న రైతులు.. అక్కడ ఉన్న అధికారులు, బ్యాంకర్లను సంప్రదించి నివృత్తి చేసుకోవాలని సూచించారు. అనంతరం రూ.లక్షన్నర వరకు జరిగే రుణమాఫీ కార్యక్రమాన్ని వీక్షించాల్సిందిగా రైతులకు విజ్ఙప్తి చేశారు. వచ్చే నెలలో రూ.2 లక్షల వరకు మాఫీ చేస్తామని ప్రకటించారు.
ఇదీ గత ప్రభుత్వ నిర్వాకం
తమ ప్రభుత్వానికి ఒక స్పష్టమైన విధానం లేదని విమర్శించిన పెద్దలకు, గత ప్రభుత్వం అనుసరించిన అసమంజస విధానాలను గుర్తు చేయదల్చుకున్నానని మంత్రి తెలిపారు. ’ప్రతి సంవత్సరం ఒక కొత్త విధానంతో రైతాంగాన్ని ఆందోళనలోకి నెట్టడమే వారి విధానంగా ఉండేది. ఒక ఏడాది పత్తి వద్దు అన్నారు. రైతులు వారి మాటలు నమ్మి కంది పంట వేస్తే కందులు కొనే నాధుడే లేరు. మరో ఏడాది పంట కాలనీలు అని ఊక దంపుడు ఉపన్యాసాలు ఇచ్చారు.
తరువాత దాని ఉసే లేదు. వరి వేస్తే ఉరి అన్నారు.. ఆ మాట నమ్మి మొక్కజొన్న వేస్తే కొనుగోలు సమయానికి మొహం చాటేశారు. సన్నాల సాగు అని సన్నాయి నొక్కులు నొక్కి తీరా మార్కెటింగ్‌కు వచ్చేసరికి బోనస్ కాదు కదా మద్దతు ధర కూడా దక్కలే. ఇక రుణమాఫీ 2014 కానీ, 2018 కానీ.. అసలు రుణమాఫీ పథకాలు కావని, వడ్డీ మాఫీ పథకాలుగా ప్రతి రైతు చెబుతాడు..’అని మంత్రి దుయ్యబట్టారు.
Comments
Please login to add a commentAdd a comment