మా జన్మ ధన్యమైంది | CM Revanth Reddy launches crop loan waiver second phase: Telangana | Sakshi
Sakshi News home page

మా జన్మ ధన్యమైంది

Published Wed, Jul 31 2024 4:02 AM | Last Updated on Wed, Jul 31 2024 4:14 AM

CM Revanth Reddy launches crop loan waiver second phase: Telangana

రెండో విడత రుణమాఫీ నిధుల విడుదల కార్యక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు దామోదర రాజనర్సింహ, జూపల్లి కృష్ణారావు, కోమటిరెడ్డి, తుమ్మల, పొంగులేటి, శాసనసభ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్, మండలి చైర్మన్‌ గుత్తా తదితరులు

రుణమాఫీ రెండో విడత నిధుల విడుదల కార్యక్రమంలో సీఎం రేవంత్‌ 

రైతు రుణమాఫీతో లక్షలాది రైతుల ఇళ్లల్లో పండుగ 

మా చిత్తశుద్ధి, పరిపాలన దక్షతతో రుణమాఫీ చేసి చూపించాం

మా నిబద్ధ్దతను భట్టి అన్న నిరూపించారని వెల్లడి 

రూ.6,190 కోట్ల చెక్కు రైతులకు అందజేత

సాక్షి, హైదరాబాద్‌: రైతులకు రుణమాఫీతో తమ జన్మ ధన్యమైందని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ఏ రైతు కుటుంబంలోనూ విషాదం ఉండకూడదని, రైతులు ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోకుండా ఆదుకోవాలనే ఉద్దేశంతో రైతు రుణమాఫీ చేస్తున్నామని చెప్పారు. ఈ మాఫీతో లక్షలాది మంది రైతుల ఇళ్లల్లో పండుగ వాతావరణం నెలకొందని అన్నారు.

రైతు రుణమాఫీ రెండో విడతలో భాగంగా రూ.1.50 లక్షల్లోపు రుణమున్న రైతుల రుణమాఫీ కోసం రూ.6,190 కోట్ల నిధులను మంగళవారం ఆయన విడుదల చేశారు. 5.9 లక్షల కుటుంబాలకు చెందిన 6.4 లక్షల బ్యాంకు ఖాతాలకు సంబంధించిన చెక్కును రాష్ట్ర మంత్రుల చేతుల మీదుగా రైతులకు అందజేశారు. ఈ సందర్భంగా అసెంబ్లీ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఎం మాట్లాడారు. 

వ్యవసాయం పండుగ అని నిరూపించేందుకే 
‘కార్పొరేట్లకు వేలాది కోట్ల రూపాయలను బ్యాంకులు అప్పులుగా ఇస్తే, నష్టాల పాలయ్యామంటూ తప్పుడు లెక్కలు చూపెట్టి రుణాలు ఎగ్గొట్టి దేశాలు విడిచి పారిపోతున్నారు. కానీ రైతులు మాత్రం తాను అప్పులపాలైనా పదిమందికి అన్నం పెట్టాలనే ఉద్దేశంతో రుణాలు తీసుకుంటారు. అప్పుల వాళ్లు ఇంటికొస్తే ఆత్మాభిమానం దెబ్బతిని సిరులు పండించే పొలాల్లోనే పురుగుల మందు తాగి చనిపోయిన ఘటనలు జరిగాయి. అందుకే వరంగల్‌ డిక్లరేషన్‌లో రైతు రుణమాఫీ ప్రకటించాం. సోనియా, రాహుల్‌గాం«దీలిచి్చన మాట మేరకు వ్యవసాయం దండగ కాదు పండుగ అని నిరూపించేందుకు రుణమాఫీ చేస్తున్నాం..’అని ముఖ్యమంత్రి చెప్పారు.  

తొలి విడత తర్వాత రెండు వారాలు కాకుండానే.. 
‘రైతులకు రుణమాఫీ చేస్తామంటే ఎలా చేస్తారని కొందరు శాపనార్థాలు పెట్టారు. కానీ మా చిత్తశుద్ధి, పరిపాలన దక్షతతో చేసి చూపించాం. కాంగ్రెస్‌ పార్టీ చిత్తశుద్ధిని శంకించలేరు.. ప్రణాళికలను ప్రశ్నించలేరు. తొలి విడత రైతు రుణమాఫీ చేసిన తర్వాత రెండు వారాలు కూడా కాకముందే రెండో విడత రుణమాఫీ చేస్తున్నాం.

ఈ ఏడాది జూలై, ఆగస్టు నెలలు చరిత్రలో లిఖింపదగినవి. గత ప్రభుత్వం రూ.7 వేల కోట్లు మాఫీ చేయకుండా చేతులెత్తేసింది. వారు పాలించిన 120 నెలల కాలంలో రుణమాఫీ కోసం రూ.25 వేల కోట్లు కూడా చెల్లించలేకపోయింది. మేం మాత్రం అధికారంలోకి వచి్చన 8 నెలల కాలంలోనే ఏకకాలంలో రుణమాఫీ చేసి, 12 రోజుల వ్యవధిలోనే రెండుసార్లు నిధులు విడుదల చేశాం. 

రైతుల కోసమే ఈ రికార్డు 
    75 ఏళ్ల భారత స్వాతంత్య్ర చరిత్రలో ఏ రాష్ట్రం కూడా రూ.31 వేల కోట్ల రుణమాఫీ చేయలేదు. ఇలా చేయడం ఓ రికార్డు. ఈ రికార్డు తెలంగాణ ప్రజల కోసమే. సాధారణంగా ఎన్నికలున్నప్పుడు ఓట్లడిగే సమయంలో రాజకీయ ప్రయోజనాల కోసం పార్టీలు ఇలాంటివి చేస్తుంటాయి. మేము మాత్రం రైతు ప్రయోజనాలే ధ్యేయంగా ఓట్లు లేనప్పుడు కూడా రుణమాఫీ చేసి రైతులకు అండగా నిలబడతామనే విశ్వాసాన్ని కలిగించాం..’అని రేవంత్‌ చెప్పారు. 

మా నిబద్ధతను భట్టి అన్న నిరూపించారు 
    ‘బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ధనిక తెలంగాణ రాష్ట్రాన్ని రూ.7 లక్షల కోట్ల అప్పుల్లో ముంచి వెళ్లిపోతే.. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆర్థిక మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన 8 నెలల్లోనే రూ.43 వేల కోట్లు పాత అప్పులు, వడ్డీలకు కట్టారు.

సామాజిక పింఛన్లు, ఫీజు రీయింబర్స్‌మెంట్, ప్రతి నెలా ఒకటో తేదీన ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాలు, ఆరోగ్యశ్రీ, 200 యూనిట్లలోపు ఉచిత విద్యుత్, ఇందిరమ్మ ఇళ్లకు అనుమతి, అంగన్‌వాడీల నుంచి ఆశా వర్కర్ల వరకు వేతనాలు.. ఇలా ఏ కార్యక్రమం ఆగకుండానే రైతు రుణమాఫీకి భట్టి అన్న నిధులు సమకూర్చారు. మా నిబద్ధతను నిరూపించారు. ఇందుకు ఆర్థిక శాఖ అధికారులు సహకరించారు..’అంటూ సీఎం అభినందించారు.  

సంకల్ప బలమే కారణం: డిప్యూటీ సీఎం భట్టి 
    డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ రైతు రుణమాఫీ కోసం రాష్ట్రంలోని 16.29 లక్షల రైతు కుటుంబాలకు చెందిన 17.91 లక్షల ఖాతాల్లో రూ.12,208 కోట్లు జమ చేశామని తెలిపారు. ‘రుణమాఫీ ఎప్పుడో చేస్తారులే అన్న ఊహలు పటాపంచలు చేశాం. ఇందుకు సంకల్ప బలమే కారణం. ప్రతి క్షణం ప్రజలకు మేలు చేసేందుకే మేం తపిస్తున్నాం.

అందుకే ఒక్కరోజు కూడా అలస్యం కాకూడదనే ఉద్దేశంతోనే ఈనెల 15న రుణమాఫీ మార్గదర్శకాలు విడుదల చేసి, 18న మొదటి విడత నిధులిచ్చాం. మళ్లీ రెండు వారాలు పూర్తి కాకుండానే ఇప్పుడు రెండోవిడత నిధులు విడుదల చేశాం. రూ.2 లక్షల లోపు రుణమాఫీ ఆగస్టు నెలలో పూర్తి చేస్తాం. రైతులకిది పండుగ రోజు. బ్యాంకుల్లో ఉన్న అప్పుల భారం దిగిపోతుంటే వారు సంతోషంగా ఉన్నారు..’అని చెప్పారు.  

ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం: మంత్రి తుమ్మల 
    వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ అప్పుల్లో ఉన్న రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని సరిదిద్దుతూనే రైతులకు ఇచి్చన మాట నిలబెట్టుకున్నామని చెప్పారు. రుణమాఫీకి నిధులు విడుదల చేసినందుకు గాను రైతాంగం పక్షాన ధన్యవాదాలు తెలిపారు. రుణమాఫీ కాని రైతులు వ్యవసాయ అధికారుల వద్దకు వెళ్లి రైతు సమాచార పత్రం తీసుకుని తమ సమస్యలు తెలియజేయాలని, నెలరోజుల్లో అర్హులైన అందరు రైతుల ఖాతాల్లోకి రుణమాఫీ నిధులు జమ చేయించే బాధ్యత వ్యవసాయ శాఖదని చెప్పారు.

ఈ కార్యక్రమంలో శాసనమండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి, అసెంబ్లీ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్, రాష్ట్ర మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, శ్రీధర్‌బాబు, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, సీతక్క, సురేఖ, జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్, దామోదర రాజనర్సింహ, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ఆర్థిక, వ్యవసాయ శాఖల ఉన్నతాధికారులు, కాంగ్రెస్, సీపీఐ, బీజేపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement