సాక్షి, యాదాద్రి: ఎన్ని కేసులు పెట్టినా చివరి రైతుకు రుణమాఫీ జరిగే వరకు తమ పోరాటం ఆగదని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు స్పష్టం చేశారు. ప్రపంచం తలకిందులు అయినా ఆగష్టు పదిహేను వరకు రుణమాఫీ చేస్తామన్న సీఎం రేవంత్.. మాట తప్పారని విమర్శించారు. రుణమాఫీ చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. ఈ అంశంలో ప్రభుత్వ తీరును నిరసిస్తూ హరీష్ రావు ఆలయాల పర్యటన చేపట్టారు.
ఈ సందర్భంగా గురువారం యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్నారు. ఆగస్టు 15లోగా రైతులందరికీ రుణమాఫీ చేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి మీద ఒట్టేసి రైతులను దగా చేశారని ఆరోపించారు. పాలకుడు మాట తప్పితే తెలంగాణ ప్రజలకు ఎలాంటి కీడు జరగొద్దని కోరుతూ ఆలయంలో పాప పరిహార పూజలు చేసినట్లు తెలిపారు.
‘రైతులనే కాదు దేవుడిని రేవంత్ మోసం చేశాడు. కేసీఆర్ ఆదేశిస్తే మంత్రి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన చరిత్ర నాది. పార్టీ మారిన చరిత్ర నీది. రేవంత్ రుణమాఫీ అయింది అంటున్నాడు. మంత్రులు కాలేదని అంటున్నారు. ఉత్తమ్, పొంగులేటి, తుమ్మల రుణమాఫీ పూర్తిగా కాలేదని అంటున్నారు. 42 లక్షల మందిలో 20 లక్షల మందికే రుణమాఫీ అయింది. 46 శాతం మాత్రమే రుణమాఫీ పూర్తి అయ్యింది. దేవుళ్లపై ప్రమాణం చేసి రైతుల్ని మోసం చేసిన ప్రభుత్వం కాంగ్రెస్‌ది.
బహిరంగంగా రేవంత్ క్షమాపణ చెప్పాలి. దేవుళ్ల వద్దకు వెళ్లి ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. తెలంగాణ ప్రజల మొఖం చూసి రేవంత్ ను క్షమించాలని లక్ష్మీ నరసింహస్వామిని ప్రార్థించా. బోనస్ ఇస్తామని మోసం చేశాడు. రైతులు, అన్ని వర్గాల పక్షాన పోరాడే శక్తిని ఇవ్వాలని దేవుణ్ణి కోరాం. వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని మూడు వందల రోజులు వచ్చినా అమలు కాలేదు.
ఎంత మందికి రుణమాఫీ చేశావో శ్వేతపత్రం విడుదల చేయాలి. రైతు భరోసా కింద 7500 కోట్లు గతంలో కేసీఆర్ ఇచ్చేవారు. అవెప్పుడు ఇస్తావు? స్పీకర్, ఎమ్మెల్యేలకు రుణమాఫీ చేసి చిన్న చిన్న ఉద్యోగులకు ఎందుకు కోత పెడుతున్నావు? రేవంత్ ఏ చోట ప్రమాణం చేశాడో అన్ని చోట్లకు పోతాం. రేవంత్ దేవాలయాలన్నింటినీ శుద్ధి చేయాలి. కాంగ్రెస్ మంత్రులు వెరైటీగా ఉన్నారు. రైతులకు ఇచ్చిన హామీని అమలు చేయమంటే నన్ను రాజీనామా చేయమంటున్నారు
కాంగ్రెస్ ప్రజా పాలనలో ధర్నాలు నిషేదం అంటూ రైతులకు పోలీసులు నోటీసులు ఇస్తున్నారు. జర్నలిస్ట్ సరితపై రేవంత్ అనుచరులు దాడి చేశారు. ఆదిలాబాదులో పోలీస్ యాక్ట్ తీసుకొచ్చారు. వీటన్బింటినీ తీవ్రంగా ఖండిస్తున్నాం. లాఠీలతో మోసాన్ని అడ్డుకోలేరు. రుణమాఫీ చేస్తామని రైతులతో రైతులతో రణం చేస్తున్నాడు. రుణమాఫీ కాలేదంటే రైతులపై కేసులు పెట్టి వేధిస్తున్నావు. ఇందిరమ్మ రాజ్యం అంటే అణిచివేయడమా?’ అంటూ హరీష్ రావు ఫైర్ అయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment