నల్గొండ: ఉమ్మడి జిల్లాకు చెందిన ఇద్దరు ఎంపీలు ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. నల్లగొండ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి 2019 పార్లమెంట్ ఎన్నికల్లో గెలిచిన విషయం తెలిసిందే. అయితే, ఇటీవల వీరిద్దరూ అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచి విజయం సాధించారు. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి హుజూర్‌నగర్ నుంచి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి నల్లగొండ నుంచి ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు.
వీరు ఎమ్మెల్యేలుగా కొనసాగాలంటే ఎంపీ పదవులకు రాజీనామా చేయాల్సి ఉంది. అయితే, వీరి రాజీనామాతో రెండు ఎంపీ స్థానాలకు ఉప ఎన్నికలు వస్తాయా అనే చర్చ జరుగుతోంది. రిప్రజేంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ 1951, సెక్షన్ 151–ఎ ప్రకారం.. ఖాళీ అయిన పార్లమెంట్ స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం ఆరు నెలల్లో ఉప ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది.
అయితే, 17వ పార్లమెంట్ సాధారణ ఎన్నికలు 2024 మేలో జరుగనున్నాయి. వీరిద్దరు ఇప్పుడు రాజీనామా చేసినా.. పార్లమెంట్ ఎన్నికలకు ఐదు నెలలే గడువు ఉండడంతో ఉప ఎన్నికలు దాదాపు లేనట్లేనని తెలుస్తోంది. ఇద్దరు ఎంపీలు రాజీనామా చేస్తే వచ్చే పార్లమెంట్ ఎన్నికల వరకు ఆ స్థానాలు ఖాళీగానే ఉండనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment