కాంగ్రెస్‌ నేస్తం కాదు..  భస్మాసుర హస్తం  | Minister KTR Aggressive Comments On Congress Party | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌ నేస్తం కాదు..  భస్మాసుర హస్తం 

Published Tue, Nov 21 2023 4:22 AM | Last Updated on Tue, Nov 21 2023 4:22 AM

Minister KTR Aggressive Comments On Congress Party - Sakshi

సోమవారం బీఎస్‌రెడ్డినగర్‌ చౌరస్తా రోడ్‌ షోలో మాట్లాడుతన్న కేటీఆర్‌ 

సాక్షి, యాదాద్రి, మిర్యాలగూడ, ఎల్‌బీనగర్‌/మన్సూరాబాద్‌: ‘కాంగ్రెస్‌ నేస్తం కాదు.. భస్మాసుర హస్తం’అని బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్, ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్రాన్ని 55 సంవత్సరాలు పరిపాలించి ఇప్పుడు ఒక్కసారి అవకాశం ఇవ్వమనడం సిగ్గుచేటని పేర్కొన్నారు. సోమవారం యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట, వలి గొండ, నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో రోడ్‌షో, కార్నర్‌ మీటింగ్‌లలో ఆయన ప్రసంగించారు.

తెలంగాణలో వ్యవసాయానికి 24 గంటల కరెంట్‌ రావడం లేదంటున్న టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి.. కరెంట్‌ వైర్లు పట్టుకుంటే రాష్ట్రానికి పట్టిన దరిద్రం వదిలిపోతుందన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వంలో సాగుకు అర్ధరాత్రి కరెంట్‌ ఇస్తే భార్యాపిల్లలను వదిలి పాములు, తేళ్లు, విష పురుగుల భయంతో పొలానికి మోటారు పెట్టడాని కి వెళ్లేవారని చెప్పారు.

చీకట్లో కరెంట్‌ షాక్‌కు గురై అనేక మంది రైతన్నలు ప్రాణాలు వదిలారని.. ఆ రైతుల ఉసురు తగిలే కాంగ్రెస్‌ పార్టీ అడ్రస్‌ గల్లంతైందన్నారు. వారి హయాంలో విత్తనాలు, ఎరువు ల కోసం రైతులు గంటల కొద్దీ పడిగాపులు కాయా ల్సి వచ్చేదని.. కానీ, స్వరాష్ట్రంలో రైతులకు అలాంటి అవస్థలు లేవన్నారు. తెలంగాణ అభివృద్ధితో పాటు సుభిక్షంగా ఉండాలంటే మరోసారి కేసీఆర్‌ను గెలిపించాలని కేటీఆర్‌ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. 

రాహుల్‌గాందీకి వ్యవసాయం తెలియదు.. 
కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాందీకి వ్యవసాయం గురించి తెలియదని, పబ్బులు క్లబ్బులు మాత్రమే తెలుసన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పాటైతే పింఛన్‌ రూ.4 వేలు ఇస్తామని చెప్పుకునే కాంగ్రెస్‌ నేతలు వారు పాలిస్తున్న రాష్ట్రాల్లో ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. అందరూ ప్రియమైన ప్రధాని అని అంటున్నారు.. కానీ ప్రధాని మోదీ పిరమైన ప్రధానిగా మారారని ఎద్దేవా చేశారు. బీజేపికి ఓట్లు వేస్తే మూసీలో వేసినట్లే అన్నారు.  

టీఎస్‌పీఎస్‌సీని పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేస్తాం 
టీఎస్‌పీఎస్‌సీని పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేసి జాబ్‌ కేలెండర్‌ను విడుదల చేస్తామని మంత్రి కేటీఆర్‌ అన్నారు. బీఆర్‌ఎస్‌ ఎల్‌బీనగర్‌ అభ్యర్థి దేవిరెడ్డి సుదీర్‌రెడ్డికి మద్దతుగా ఎల్‌బీనగర్‌లోని పలు ప్రాంతాల్లో సోమవారం రాత్రి రోడ్‌ షో నిర్వహించారు. మన్సూరాబాద్, బీఎస్‌రెడ్డినగర్‌ చౌరస్తాలలో మంత్రి మాట్లాడుతూ, టీఎస్‌పీఎస్‌సీలోని తప్పులను సవరించి శాశ్వత ప్రతిపాదికన ఉద్యోగులను నియమిస్తామన్నారు.

కొత్తపేట ప్రూట్‌మార్కెట్‌ స్థలంలో అధునాతన వెయ్యి పడకల టిమ్స్‌ హాస్పిటల్‌ను నిర్మిస్తున్నట్లు పేర్కొన్నారు. కాంగ్రెస్‌ నేతలు అధికారంలోకి వస్తామని కలలు కంటూ సీఎం కుర్చీ కోసం 11 మంది కొట్లాడుకుంటున్నారని ఎద్దేవా చేశారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీకి ఓటేసి అన్యాయం అయ్యారని, మళ్లీ అలాంటి తప్పు చేయవద్దని కోరారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే దేవిరెడ్డి సుదీర్‌రెడ్డి, ఎమ్మెల్సీ బొగ్గారపు దయానంద్‌ తదితరులు పాల్గొన్నారు. 

ప్రతిపక్షాలపై కేటీఆర్‌ పరుష పదజాలం
ప్రతిపక్ష పార్టీల నేతలపై కేటీఆర్‌ నిప్పులు చెరి గారు. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండలో రోడ్‌షో సందర్భంగా.. ‘ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎక్కడ, ఇంటికో ఉద్యోగం ఎక్కడ, కేజీ టు పీజీ ఉచిత విద్య ఎక్కడ’అని కొందరు యువకులు ప్లకార్డులు పట్టుకున్నారు. దీంతో ఆగ్రహానికి గురైన కేటీఆర్‌ ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డారు. ‘55 ఏళ్లు పరిపాలించిన వాళ్లు ఏం పీకారు. అడగడానికి ఇజ్జత్‌ లేదు, మానం లేదు. ఆ సన్నాసులు అడుగుతున్నారు ప్రభుత్వ డిగ్రీ కళాశాల కావాలని, వీపు పగులగొట్టే వాళ్లు లేకనా’అని తీవ్ర స్వరంతో ప్రశ్నించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement