నేడు సీఎల్పీ భేటీ | CLP Emergency Meeting In Hyderabad | Sakshi
Sakshi News home page

నేడు సీఎల్పీ భేటీ

Published Mon, Dec 4 2023 4:22 AM | Last Updated on Mon, Dec 4 2023 8:53 AM

CLP Emergency Meeting In Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌:  అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్‌ పార్టీ.. నూతన ప్రభుత్వ ఏర్పాటులో భాగంగా సోమవారం పార్టీ శాసనసభాపక్ష (సీఎల్పీ) సమావేశాన్ని నిర్వహించనుంది. హైదరాబాద్‌లోని ఎల్లా హోటల్‌ వేదికగా ఉదయం 9:30 గంటలకు ప్రారంభమయ్యే ఈ భేటీలో సీఎం ఎంపికపై కొత్త ఎమ్మెల్యేల నుంచి అభిప్రాయాలను సేకరించనున్నారు. కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ పర్యవేక్షణలో, ఇతర ఏఐసీసీ ముఖ్యుల సమక్షంలో ఈ సమావేశం జరగనుంది. దీనికోసం కాంగ్రెస్‌ కొత్త ఎమ్మెల్యేలంతా ఆదివారం రాత్రే హైదరాబాద్‌కు చేరుకున్నారు. 

భేటీ తర్వాత అధిష్టానం పరిధిలోకి.. 
పార్టీ ఎమ్మెల్యేల అభిప్రాయాలు సేకరించాక సీఎం ఎంపిక, మంత్రివర్గ కూర్పు అంశం అధిష్టానం పెద్దల చేతికి వెళ్లనుంది. డీకే బృందం ఎమ్మెల్యేలతో భేటీ పూర్తికాగానే ఢిల్లీ వెళ్లనున్నట్టు సమాచారం. అక్కడ ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే, అగ్రనేత రాహుల్‌గాందీలతో సమాలోచనలు జరిపి సీఎం ఎవరన్న దానిపై నిర్ణయం తీసుకోనున్నారు. తర్వాత సీఎం రేసులో ఉన్న ఇతర నేతలను ఢిల్లీకి పిలిపించి బుజ్జగించి, ఏకాభిప్రాయం సాధించే అవకాశం ఉందని తెలిసింది. తర్వాత మరోమారు ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహించి లాంఛనంగా సీఎల్పీ నాయకుడి ఎంపికను పూర్తి చేయనున్నారు. ఈ నెల 9వ తేదీకల్లా ఈ ప్రక్రియ అంతా పూర్తిచేసి ఎల్బీ స్టేడియం వేదికగా ప్రమాణస్వీకార కార్యక్రమాన్ని నిర్వహించవచ్చని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. 

సోమ, మంగళవారాల్లోనే ప్రమాణ స్వీకారం? 
ఎక్కువ రోజులు పొడిగించకుండా సోమవారం లేదా మంగళవారమే సీఎంతోపాటు ఒకరిద్దరు మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించే అవకాశాలు కూడా ఉన్నాయని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. సోమవారం సీఎల్పీ భేటీ తర్వాత డీకే శివకుమార్, ఇతర పెద్దలు ఇక్కడి నుంచే ఢిల్లీ పెద్దలతో మాట్లాడి, నేరుగా గవర్నర్‌ను కలసి రాజ్‌భవన్‌లోనే ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని పూర్తి చేస్తారనే చర్చ జరుగుతోంది. ఇదే జరిగితే ఈనెల 9 నాటికి మంత్రివర్గాన్ని కూర్చి పరేడ్‌ గ్రౌండ్స్‌లో భారీ సభలో మంత్రుల ప్రమాణ కార్యక్రమాన్ని నిర్వహిస్తారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. 

పోలీసుల పేరిట లేఖ ఫేక్‌ 
సీఎంగా రేవంత్‌రెడ్డి సోమవారం ప్రమాణస్వీకారం చేస్తారని, ఆ కార్యక్రమానికి రాహుల్, ప్రియాంక వచ్చే అవకాశం ఉందని, ఇందుకోసం తగిన భద్రత ఏర్పాటు చేయాలంటూ పోలీసు ఉన్నతాధికారుల పేరిట ఓ లేఖ వైరల్‌గా మారింది. అయితే అది ఫేక్‌ అని టీపీసీసీ వర్గాలు ప్రకటించాయి.

గవర్నర్‌ను కలసిన కాంగ్రెస్‌ నేతలు 
ఫలితాల అనంతరం హైదరాబాద్‌లోని ఎల్లా హోటల్‌లో సమావేశమైన కాంగ్రెస్‌ నేతలు.. రాత్రి 9 గంటల సమయంలో రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌ తమిళిసైను కలిశారు. కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్‌రావ్‌ ఠాక్రే, టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి, ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఏఐసీసీ పరిశీలకులు దీపాదాస్‌మున్షీ, కేజీ జార్జ్‌ తదితరులు రాజ్‌భవన్‌కు వెళ్లిన బృందంలో ఉన్నారు. తమకు 65 మంది సభ్యుల మద్దతు ఉందని, ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరుతూ వారు గవర్నర్‌కు లేఖ అందజేశారు. తర్వాత రాజ్‌భవన్‌ ఎదుట డీకే శివకుమార్‌ ఈ వివరాలను మీడియాకు వెల్లడించారు. 

సీఎంపై సోమవారమే స్పష్టత: ఉత్తమ్‌ 
గవర్నర్‌ను కలవడానికి ముందు ఎల్లా హోటల్‌ వద్ద ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మీడియాతో మా ట్లాడారు. సోమవారం సీఎల్పీ సమావేశం జరగనుందని, సీఎం ఎవరన్నదానిపై స్పష్టత వస్తుందని చెప్పారు. ఈ విషయంలో తన అభిప్రాయాన్ని సమావేశంలోనే వెల్లడిస్తానని, బయ ట చెప్పనని వివరించారు. తెలంగాణలో కాంగ్రెస్‌ విజయం ప్రజల విజయమని అభివర్ణించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement