సాక్షి, హైదరాబాద్: ఎన్నికల ప్రచారం ముగిసిన నేపథ్యంలో నేటి పోలింగ్ ప్రక్రియకు కాంగ్రెస్ సిద్ధమవుతోంది. రాష్ట్రవ్యాప్తంగా పార్టీ పరిస్థితి సానుకూలంగా ఉందన్న అంచనాల నేపథ్యంలో ఆ సానుకూలతను ఓట్ల రూపంలో మార్చుకునే అంశంపై దృష్టి సారించింది. బుధవారమంతా కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్‌రావ్ ఠాక్రే గాంధీభవన్ వార్ రూం నుంచి సమీక్షించారు.
ఏ నియోజకవర్గంలో ప్రచార తీరు ఎలా ఉందన్న విషయాలను తెలుసుకోవడంతోపాటు పోలింగ్ ఏజెంట్ల నియామకం, పోల్ మేనేజ్‌మెంట్ లాంటి విషయాలపై అభ్యర్థులతోపాటు నియోజకవర్గాల పరిశీలకులు, సమన్వయకర్తలు, స్థానిక నేతలతో ఆయన టెలి కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ఎట్టి పరిస్థితుల్లోనూ పోలింగ్ ముగిసేంతవరకు అభ్యర్థులతో సహా కేడర్ పూర్తిగా అప్రమత్తంగా ఉండాలని, ఇతర పార్టీల వ్యూహాలు, డబ్బు, మద్యం పంపిణీ లాంటి అంశాలపై దృష్టి సారించి ఎప్పటికప్పుడు ఎన్నికల కమిషన్ వర్గాలను సంప్రదించాలని సూచించారు.
పూజలు... ప్రమాణాలు
ఎన్నికల ప్రచారంలో భాగంగా నియోజకవర్గ ప్రజలకు బాండ్‌పేపర్లు రాసిచ్చిన కాంగ్రెస్ నేతలు ప్రచారం ముగిసిన మరుసటి రోజు దేవుడి సన్నిధిలో పూజలతో ప్రమాణాలు చేశారు. ఉదయం గాంధీభవన్‌కు వచ్చిన టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, మాణిక్‌రావ్ ఠాక్రే, టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీగౌడ్, మాజీ ఎంపీలు వి.హనుమంతరావు, అంజన్‌కుమార్ యాదవ్ కొంతసేపు ప్రచార సరళిపై సమీక్ష జరిపారు.
అనంతరం బిర్లామందిర్‌కు వెళ్లి అక్కడ వెంకటేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు చేశారు. ఆరు గ్యారంటీలకు మొదటి మంత్రివర్గంలోనే చట్టబద్ధత కల్పిస్తామని, మేనిఫెస్టోను పూర్తిస్థాయిలో అమలు చేస్తామని ప్రమాణం చేశారు. ఆ తర్వాత నాంపల్లిలోని యూసుఫైన్ దర్గాకు వెళ్లి ప్రార్థనలు చేశారు.
కేటీఆర్‌పై ఫిర్యాదు
మంత్రి కేటీఆర్ ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించారంటూ కాంగ్రెస్ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. నిబంధనలకు విరుద్ధంగా రాష్ట్రవ్యాప్తంగా దీక్షా దివస్‌ను నిర్వహించాలంటూ ఆయన మీడియాలో పిలుపునివ్వడం, 144 సెక్షన్ అమల్లో ఉన్నప్పటికీ బీఆర్‌ఎస్ కార్యాలయంలో రక్తదానం లాంటి కార్యక్రమాలు నిర్వహించడంపై చర్యలు తీసుకోవాలని కోరుతూ టీపీసీసీ ఎన్నికల సమన్వయ కమిటీ చైర్మన్ జి.నిరంజన్ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్‌రాజ్‌కు లేఖ రాశారు. అదేవిధంగా తెలంగాణలో ఓటు హక్కు ఉండి ఏపీలో నివసిస్తున్న వారిని ఎలాంటి ఆంక్షలు లేకుండా ఏపీ నుంచి తెలంగాణకు వచ్చి ఓటు వేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
ఎవరెక్కడ ఉన్నారంటే...!
ఉదయం ప్రత్యేక పూజల అనంతరం రేవంత్‌రెడ్డి.. జూబ్లీహిల్స్‌లోని తన నివాసానికి వెళ్లారు. రాత్రికి కొడంగల్‌కు చేరుకున్నారు. గురువారం కొడంగల్‌లోని జెడ్పీహెచ్‌ఎస్ పోలింగ్ బూత్‌లో ఆయన ఓటు వేయనున్నారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క బుధవారమంతా మధిర నియోజకవర్గంలోనే ఉన్నారు.
కార్యకర్తలతో తీరిక లేకుండా భేటీలు జరిపారు. మండలాలు, గ్రామాలు, పోలింగ్ బూత్‌ల వారీగా పోలింగ్ ఏర్పాట్లపై పార్టీ ముఖ్య నేతలతో సమాలోచనలు జరిపారు. జ్వరంతో బాధపడుతున్నప్పటికీ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి హుజూర్‌నగర్‌లోని తన నివాసం నుంచి పోలింగ్ ఏర్పాట్లపై పార్టీ కేడర్‌తో సమీక్షించారు.
Comments
Please login to add a commentAdd a comment