సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరు సీఎం అనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇందుకు పోటీపడుతున్న వారి సంఖ్య సహజంగానే కాంగ్రెస్ పార్టీలో ఎక్కువగా ఉన్న నేపథ్యంలో అధిష్టానం ఎవరిని ఎంపిక చేస్తుందన్నది హాట్‌టాపిక్‌గా మారింది. రాజకీయ వర్గాల విశ్లేషణల ప్రకారం.. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి (మహబూబ్‌నగర్), సీఎల్పీ నేత మల్లుభట్టి విక్రమార్క (ఖమ్మం), ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి (నల్లగొండ) పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. ఈ ముగ్గురిలో ఎవరిని చాయిస్‌గా ఎంచుకోవాలన్న దానిపై అధిష్టానం ఇప్పటికే సమాలోచనలు ప్రారంభించగా, తెలంగాణకు పరిశీలకుడిగా వచ్చిన కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డి.కె.శివకుమార్ కూడా ఢిల్లీ పెద్దలతో టచ్‌లోకి వెళ్లినట్టు తెలుస్తోంది.
ఉప ముఖ్యమంత్రులుంటారా?
కర్ణాటక తరహాలో ఉప ముఖ్యమంత్రి పదవులు తెలంగాణలోనూ లభించే అవకాశాలు కనిపిస్తున్నా యి. సీఎంగా ఏ సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థిని ఎంపిక చేస్తారన్న దాన్నిబట్టి మరో రెండు ఉప ముఖ్యమంత్రి పదవులు ఇచ్చే అవకాశముందని తెలుస్తోంది. సీఎం హోదా రెడ్డి సామాజిక వర్గానికి ఇస్తే ఎస్సీ, బీసీలకు చెరో ఉప ముఖ్యమంత్రి, దళితులకు సీఎం హోదా ఇస్తే రెడ్డి, బీసీలకు చెరో ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తారనే చర్చ గాందీభవన్ వర్గాల్లో జరుగుతోంది.
ఈ క్రమంలో మైనార్టీలకూ ప్రాధాన్యమిచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే, ఈ ఎన్నికల్లో మైనార్టీల పక్షాన ఎవరూ విజయం సాధించకపోవడంతో ఉప ముఖ్యమంత్రి హోదా మైనార్టీలకు ఇవ్వాలంటే నామినేటెడ్ ఎమ్మెల్సీ హోదా ఇవ్వాల్సి ఉండడం గమనార్హం.
అమాత్యులెవరంటే...!
మంత్రివర్గ కూర్పులో కూడా సామాజిక వర్గాలు, జిల్లాల వారీ లెక్కలు కట్టుకుంటూ తమ నాయకుడికి కచ్చితంగా మంత్రి పదవి వస్తుందనే చర్చ కీలక నేతల అనుచరుల్లో జరుగుతోంది. కొండా సురేఖ, సీతక్కకు కేబినెట్‌లో చోటు లాంఛనప్రాయమేనని గాందీభవన్ వర్గాలంటున్నాయి. ముఖ్యమంత్రి రేసులో ఉన్న ఉత్తమ్ ఒకవేళ తనకు అవకాశం ఇవ్వని పక్షంలో ఇతరుల కేబినెట్‌లో ఉండేందుకు అంగీకరించకపోతే ఆయన సతీమణి పద్మావతికి మంత్రి పదవి అవకాశం లేకపోలేదు.
ఇక, ఆదిలాబాద్ నుంచి ప్రేంసాగర్‌రావు, మహబూబ్‌నగర్ నుంచి జూపల్లి కృష్ణారావు, ఖమ్మం నుంచి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, కరీంనగర్ నుంచి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్, మెదక్ నుంచి ఆంథోల్ రాజనర్సింహ, రంగారెడ్డి నుంచి రామ్మోహన్‌రెడ్డి, గడ్డం ప్రసాద్‌కుమార్, ఆదివాసీతో పాటు ఎస్టీల్లో లంబాడాలకు కూడా ఇవ్వాలనుకుంటే నేనావత్ బాలూనాయక్, ఆదిలాబాద్ నుంచి వివేక్ బ్రదర్స్‌లో ఒకరికి మంత్రివర్గంలో అవకాశమిస్తారని చర్చ జరుగుతోంది.
ఎంపికలో ఇవే కీలకం
సీఎం అభ్యర్థి ఎంపికలో కాంగ్రెస్ అధిష్టానం నాలుగైదు కీలకాంశాలను పరిగణనలోకి తీసుకోనున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా పార్టీపై విధేయత, ప్రభుత్వాన్ని నడిపించగల సామర్థ్యం, సామాజిక న్యాయంతో పాటు రానున్న లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకోనున్నట్టు గాంధీభవన్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. రాష్ట్రమంతా ప్రచారం నిర్వహించి, సీఎం కేసీఆర్‌పై పోటీచేసి, పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న నేపథ్యంలో రేవంత్‌రెడ్డి పేరును అభిప్రాయ సేకరణలో కాంగ్రెస్ పెద్దలు ప్రతిపాదించనున్నారు.
ఇక, శాసనసభాపక్షం (సీఎల్పి) నాయకుడిగా పనిచేసి, పాదయాత్ర నిర్వహించడం ద్వారా కేడర్‌లో కదలిక తెచ్చి, పార్టీకి విధేయుడిగా ఉంటున్న భట్టి విక్రమార్క పేరునూ సీఎం అభ్యర్థిత్వానికి ప్రతిపాదించనున్నారు. అలాగే, పార్టీలో వివిధ పదవులు నిర్వహించడంతో పాటు బలమైన సామాజిక వర్గానికి చెందిన ఉత్తమ్ పేరునూ ఈ జాబితాలో ప్రతిపాదించనున్నారు. వీరిలో ఒకరిని సీఎంగా ఎంపిక చేసే అవకాశాలున్నట్టు కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment