ఇంట్లో ఫైట్‌.. బయట టైట్‌ | Internal Disputes In Telangana Congress And It Help To BJP | Sakshi
Sakshi News home page

‘చేతి’ రాత మారేదెలా

Published Thu, Sep 12 2019 2:46 AM | Last Updated on Thu, Sep 19 2019 8:44 PM

Internal Disputes In Telangana Congress And It Help To BJP - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : నూట ముప్పై నాలుగేళ్ల వయసు.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో నాలుగు దశాబ్దాలకు పైగా పాలన.. అన్నింటికీ మించి తెలంగాణ ప్రజల చిరకాల వాంఛ అయిన ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చిన ఘనత.. ఇదీ కాంగ్రెస్‌ పార్టీ చరిత్ర. కానీ ప్రస్తుతం ఆ పార్టీ పరిస్థితి దారుణంగా మారిపోయింది. రాష్ట్ర రాజకీయ పరిణామాలు కాంగ్రెస్‌ను డోలాయమానంలో పడేస్తున్నాయి. అధికారాన్ని దక్కించుకునే స్థాయి నుంచి గత ఐదేళ్లలో ప్రధాన ప్రతిపక్షం హోదాను కూడా కోల్పోయే పరిస్థితులు ఏర్పడటం ఆ పార్టీ నేతలు, కేడర్‌కు రుచించడం లేదు.

పార్టీ నుంచి వలసలకు తోడు వరుసగా ఎదురవుతున్న ప్రతికూల పరిణామాలతో హస్తం పార్టీ అల్లాడుతోంది. పార్టీ నుంచి ఒక్కొక్కరుగా నాయకులు వెళ్లిపోతుండటం, ఉన్న నేతల్లో సమన్వయం లేకపోవడం, నాయకత్వ మార్పు అంశంలో గందరగోళం, కేడర్‌లో ఆత్మస్థైర్యం కల్పించే చర్యలు లేకపోవడం, కమలనాథుల దూకుడుతో రాష్ట్ర రాజకీయాలు టీఆర్‌ఎస్, బీజేపీ చుట్టూ తిరుగుతుండటం వంటి అంశాలు కాంగ్రెస్‌ పార్టీలో తీవ్ర కలవరం కలిగిస్తున్నాయి. 

అసెంబ్లీలో ఖేల్‌ ఖతమేనా? 
ముందస్తు ఎన్నికల్లో అధికారం దక్కకపోయినా 19 అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించి ప్రధాన ప్రతిపక్ష హోదాను దక్కించుకుని ఊరట పొందిన కాంగ్రెస్‌ పార్టీకి పది నెలల్లోనే ఆ హోదా దూరమైపోయింది. పార్టీ నుంచి ఎమ్మెల్యేలుగా గెలిచిన వారిలో ఒకరు ఎంపీగా వెళ్లిపోవడం, 12 మంది టీఆర్‌ఎస్‌లో చేరుతున్నట్టు ప్రకటించి సీఎల్పీని టీఆర్‌ఎస్‌లో విలీనం చేస్తున్నట్టు అధికారికంగా లేఖ ఇవ్వడంతో కాంగ్రెస్‌ ప్రధాన ప్రతిపక్ష హోదాను కోల్పోవాల్సి వచ్చింది. అందుకు తగినట్టుగానే ఈ నెల 9న ప్రారంభమైన అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల్లో గతంలో కాంగ్రెస్‌కి కేటాయించిన సీట్లను ఎంఐఎంకు కేటాయిస్తూ స్పీకర్‌ నిర్ణయం తీసుకున్నారు.

దీంతో ప్రధాన ప్రతిపక్షంగా అధికార టీఆర్‌ఎస్‌ను ప్రశ్నించే స్థాయిలో అసెంబ్లీలో ప్రాతినిధ్యం లేకపోవడం, కనీసం ముందు వరుసల్లో కూడా కనిపించే పరిస్థితి లేకపోవడంతో ఇప్పుడు ఏం చేయాలనే అంశం కాంగ్రెస్‌ నేతలను కలవరపెడుతోంది. బడ్జెట్‌ సమావేశాల్లో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే అవకాశం వస్తుందా లేదా అన్నది కూడా సందేహాస్పదం కావడంతో ప్రజల పక్షాన తాము నిలబడుతున్నామనే అంశాన్ని ఎలా తీసుకెళ్లాలన్న దానిపై ఆ పార్టీ నేతలు మల్లగుల్లాలు పడుతున్నారు. 

సమన్వయం ఏదీ..? 
రాజకీయ పరిణామాల మాట ఎలా ఉన్నా.. పార్టీలో అంతర్గత సమన్వయం లేకపోవడం కూడా కాంగ్రెస్‌ పార్టీని ఇరుకున పెడుతోంది. రాష్ట్రం ఏర్పాటైన తర్వాత నుంచి నిన్న మొన్నటి వరకు నిస్తేజంగా నడిచిన ఆ పార్టీలోని నేతలు.. ఒక్క తాటిపై నిలబడే పరిస్థితులు ఇప్పటికీ కనిపించడం లేదు. అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువగా ఉండే కాంగ్రెస్‌లో నేతలను నియంత్రించే అవకాశం లేకపోవడం, ప్రధాన పదవులు ఆశించేవారి జాబితా చాంతాడంత ఉండడంతో వారి మధ్య సమన్వయం కుదరడం లేదని రాజకీయ వర్గాలంటున్నాయి.

ప్రజాసమస్యలపై పోరాట పంథాను ఎంచుకునే విషయంలో టీపీసీసీ నాయకత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తోందని, దీని కారణంగానే ప్రజల్లో పార్టీపై భరోసా లేకుండా పోయిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. గత లోక్‌సభ ఎన్నికల్లో జాతీయ స్థాయిలో పార్టీ ఘోర ఓటమి పాలు కావడంతో ఢిల్లీ స్థాయిలో ఏర్పడిన నాయకత్వ సమస్య కూడా రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీపై ప్రభావం చూపుతోంది. రాహుల్‌గాంధీ అధ్యక్ష పదవి నుంచి తప్పుకున్న నాటి నుంచి సోనియాగాంధీ మళ్లీ బాధ్యతలు చేపట్టేంత వరకు ఎప్పుడు ఏం జరుగుతుందోననే ఆందోళన గాంధీభవన్‌ వర్గాల్లో కనిపించేది. ప్రస్తుతానికి ఆ ఆందోళన కుదురుకున్నా స్థానిక నేతల మధ్య సమన్వయం లేకపోవడం, అది వచ్చే పరిస్థితి కూడా లేకపోవడం పార్టీ భవిష్యత్తుపై ప్రభావం చూపనుంది. 

టీఆర్‌ఎస్‌ వర్సెస్‌ బీజేపీ 
తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో రాష్ట్రంలో రాజకీయం టీఆర్‌ఎస్‌ వర్సెస్‌ బీజేపీగా మారడం కూడా కాంగ్రెస్‌కు మింగుడు పడడంలేదు. కొందరు టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు బీజేపీలోకి వెళ్తారని సోషల్‌ మీడియాలో ఉధృతంగా ప్రచారం జరుగుతోంది. ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్‌ వైపు వచ్చే పరిస్థితి కాకుండా బీజేపీ వైపు అధికార పార్టీ నేతలు చూస్తున్నారన్న ప్రచారం కాంగ్రెస్‌పై తీవ్ర ప్రభావాన్నే చూపుతోంది. దీంతో ఆ రెండు పార్టీల మ«ధ్య జరుగుతున్న రాజకీయ యుద్ధంలో తాము కూడా అనివార్యంగా పాలుపంచుకుని కాంగ్రెస్‌ కూడా ఉందని చెప్పుకోవాల్సిన స్థితి ఏర్పడింది. ఐదేళ్ల పాటు నిస్తేజంగా ఉన్న కాంగ్రెస్‌ పార్టీ బీజేపీ దూకుడుతో తప్పనిసరి పరిస్థితుల్లో ప్రజల్లోకి వెళుతోంది.

అయితే, రాష్ట్రంలో త్రిముఖ పోరు తమకే మేలు చేస్తుందని కాంగ్రెస్‌ అంచనా వేస్తోంది. టీఆర్‌ఎస్‌ నుంచి 10–15 శాతం ఓటుబ్యాంకు బీజేపీ తీసుకున్నా తమకు నష్టం లేదని, అప్పుడు టీఆర్‌ఎస్‌ బలహీనపడుతుందని, తమకున్న స్థిరమైన ఓటు బ్యాంకుతో గట్టెక్కుతామనే అభిప్రాయం టీపీసీసీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. ఇందుకు త్వరలో జరగనున్న మున్సిపల్‌ ఎన్నికలు కాంగ్రెస్‌ పార్టీకి బలపరీక్షగా మారనున్నాయి. పట్టణ ప్రాంతాల్లో కొంత పట్టు కలిగి ఉండే బీజేపీ మున్సిపల్‌ ఎన్నికల్లో సాధించే ఫలితాలను బట్టి రాష్ట్రంలో రాజకీయం మారిపోతుందని, జాతీయ స్థాయిలో అధికారంలో ఉన్న పార్టీ బలపడితే కాంగ్రెస్‌కు నష్టమేనని రాజకీయ నిపుణులంటున్నారు. ఈ నేపథ్యంలో కేవలం కేడర్‌ మీద భరోసా పెట్టుకుని మున్సిపల్‌ ఎన్నికలకు కాంగ్రెస్‌ సిద్ధమవుతోంది.
 

కేడర్‌లోనూ ‘అవిశ్వాసం’ 
రాష్ట్రంలోని కాంగ్రెస్‌ కేడర్‌పై నేతలకు భరోసా ఉన్నా పార్టీ నాయకులపై కేడర్‌కు విశ్వాసం లేని పరిస్థితులు కనిపిస్తున్నాయి. వరుసగా రెండు సార్లు అధికారం దక్కకపోవడం, గత ఐదేళ్లుగా కేడర్‌లో విశ్వాసం కల్పించే చర్యలు పార్టీ తీసుకోకపోవడం, నమ్మి ఓట్లు వేసిన నేతలు వేరే పార్టీల్లోకి వెళుతుండడంతో క్షేత్రస్థాయి కేడర్‌లో ఆత్మస్థైర్యం కనిపించడం లేదు. అయితే, ఇటీవలి కాలంలో మేల్కొన్న రాష్ట్ర కాంగ్రెస్‌ నేతలు కొంత దూకుడుగానే ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఉద్యమాలు చేసేందుకు సన్నద్ధమవుతున్నారు.

అందులో భాగంగానే రాష్ట్రంలోని పలు ఆసుపత్రుల సందర్శన ద్వారా రాష్ట్రంలో నెలకొన్న అనారోగ్య పరిస్థితులను ఫోకస్‌ చేయడంలో సఫలీకృతులయ్యారు. దీనికి తోడు టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కూడా అసెంబ్లీ నియోజకవర్గాల స్థాయి «ధర్నాలకు పిలుపునిచ్చి కేడర్‌ను కదిలించే ప్రయత్నం చేశారు. అసెంబ్లీ లోపల, బయటా ప్రభుత్వంపై పోరాడేందుకు రేవంత్, కోమటిరెడ్డి, కోదండరెడ్డి, వీహెచ్, పొన్నాల, దామోదర రాజనర్సింహ వంటి నేతలకు బాధ్యతలు కూడా అప్పగించారు. అయితే, వీరి మధ్య సమన్వయం కుదిరి ఉధృతంగా ప్రజల్లోకి వెళ్లగలిగితేనే ఫలితం ఉంటుందని, లేదంటే చూస్తుండగానే ఓడలు బండ్లు, బండ్లు ఓడలుగా మారిపోయే పరిస్థితులు రాష్ట్ర రాజకీయాల్లో ఏర్పడినా ఆశ్చర్యం లేదనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది.  

నాయకత్వం కోసం ‘అంతర్గత పోరు’ 
రాష్ట్ర కాంగ్రెస్‌లో చాలా కాలంగా నాయకత్వ మార్పు అంశం చర్చనీయాంశమవుతోం ది. అసెంబ్లీ ఎన్నికలలో ఓటమి ఎదురైనప్పటి నుంచి అదిగో ఇదిగో అంటూ ఊరిస్తున్న ఈ అంశం పార్టీలో అంతర్గత పోరుకు దారి తీస్తోంది. టీపీసీసీ అధ్యక్షుడిగా తప్పుకునేందుకు ఉత్తమ్‌ సిద్ధంగానే ఉన్నా ఇప్పుడు మార్పు సరి కాదనే ఆలోచనలో అధిష్టానం ఉంది. కానీ, టీపీసీసీ అధ్యక్షుడి మార్పు విషయంలో ఊహాగానాలు ఆగడంలేదు. ఫలానా నేతకు అధ్యక్ష పదవి అంటూ జరుగుతున్న ప్రచారంతో ఇతర నేతలు ఉలిక్కి పడుతున్నారు.

ఫలానా వ్యక్తికి పార్టీ అధ్యక్ష పదవి ఇవ్వద్దంటూ కొంతమంది అధిష్టానానికి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. మరికొంతమంది తమకు అధ్యక్ష పదవి కావాలంటూ విజ్ఞాపనలు, పైరవీలు చేసుకుంటున్నారు. అయితే, టీపీసీసీ రేసులో మల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్‌రెడ్డితోపాటు ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, ఎమ్మెల్యే శ్రీధర్‌బాబులు ముందు వరుసలో ఉన్నా చాలా మంది ఆ పదవిని ఆశిస్తుండడం గమనార్హం. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement