హస్తినలో సీఎం రేవంత్‌ | CM Revanth Reddy And Congress Leaders Tour To Delhi | Sakshi
Sakshi News home page

హస్తినలో సీఎం రేవంత్‌

Published Tue, Feb 20 2024 5:23 AM | Last Updated on Tue, Feb 20 2024 5:23 AM

CM Revanth Reddy And Congress Leaders Tour To Delhi - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర కాంగ్రెస్‌ పెద్దలు ఢిల్లీ వెళ్లారు. ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డితోపాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమా­ర్క, మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు సోమవారం సాయంత్రం బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో హస్తిన చేరుకున్నారు. సీఎం రేవంత్‌ తదిత­రులు ఏఐసీసీ కీలక నేత రణ్‌దీప్‌ సూర్జేవాలా కుమారుడి వివాహానికి హాజరై వధూవరులను ఆశీర్వదించారు. మంగళవా­రం పార్టీ పెద్దలను కలిసే అవకాశమున్నట్టు టీపీసీసీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. పార్టీ సంస్థాగత వ్యవహారాల ఇన్‌చార్జి  కె.సి.వేణుగోపాల్‌ సహా వీలును బట్టి మరికొందరు పెద్దలతో వీరు స­మా­వేశమవుతారని తెలుస్తోంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్‌ను కూడా కలిసి రాష్ట్రానికి అందించాల్సిన ఆర్థిక సా­యం­పై వినతిపత్రం ఇవ్వనున్నట్టు సమాచారం. అలాగే మరో కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీని కలిసే అవకాశం ఉన్నట్లు తెలిసింది.

మూడు కీలకాంశాలపై చర్చ ఉంటుందా? 
సీఎం, డిప్యూటీ సీఎంతో పాటు మరో మంత్రి ఢిల్లీ బయలుదేరడంతో రాష్ట్ర కాంగ్రెస్‌ వర్గాల్లో పలు రకాల చర్చలు జరుగుతున్నాయి. ఈ ముగ్గురూ పార్టీ హైకమాండ్‌ను కలిసి మూడు కీలకాంశాలపై చర్చించే అవకాశముందని టీపీసీసీ వర్గాలంటున్నాయి. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల విషయంతో పాటు నామినేటెడ్‌ పోస్టుల గురించి హైకమాండ్‌తో చర్చించిన తర్వాత కొంత స్పష్టత వస్తుందని తెలుస్తోంది. ఈ రెండింటితో పాటు కీలకమైన కేబినెట్‌ విస్తరణ గురించి కూడా చర్చ జరుగుతుందని సమాచారం. అయితే, కేబినెట్‌ విస్తరణ లోక్‌సభ ఎన్నికల తర్వాత ఉంటుందా? ఇప్పుడే ఉంటుందా అన్న దానిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

సామాజిక సమీకరణల ప్రకారం ఎస్టీ (లంబాడా), బీసీ, మైనార్టీలకు కేబినెట్‌లో బెర్తులు దక్కాల్సి ఉంది. ఈ బెర్తులను భర్తీ చేసి పార్లమెంటు ఎన్నికలకు వెళితే ఉపయోగం ఉంటుందనే చర్చ పార్టీ వర్గాల్లో జరుగుతోంది. అయితే, మరో మూడు బెర్తులకు పోటీ తీవ్రంగా ఉన్నందున ఇప్పుడే కాకుండా లోక్‌సభ ఎన్నికల తర్వాత కేబినెట్‌ విస్తరణ చేపట్టడం ద్వారా ఎలాంటి ఇబ్బందులు ఉండవనే అభిప్రాయాన్ని కూడా కొందరు వ్యక్తం చేస్తున్నారు. సీఎం రేవంత్‌ మాత్రం మంత్రివర్గ విస్తరణ గురించి ఇప్పటికే ఓ అభిప్రాయానికి వచ్చారని, ఒకవేళ ఈ పర్యటనలో హైకమాండ్‌తో ఈ విషయం గురించి చర్చ జరిగి, ఢిల్లీ పెద్దల నుంచి గ్రీన్‌సిగ్నల్‌ లభిస్తే త్వరలోనే మంత్రివర్గ ప్రమాణ స్వీకారం ఉంటుందని, లేదంటే పార్లమెంటు ఎన్నికల వరకు ఆగాల్సిందేనని కాంగ్రెస్‌ నేతలు చెబుతున్నారు. 

కొత్తగా వచ్చిన వారికి అవకాశంపై చర్చ? 
లోక్‌సభ అభ్యర్థుల విషయంలో కూడా కాంగ్రెస్‌ పార్టీ క్రమంగా ఓ అభిప్రాయానికి వస్తున్నట్టు అర్థమవుతోంది. హైదరాబాద్‌ (మైనార్టీ), కరీంనగర్‌ మినహా 15 స్థానాల్లో పోటీకి ఎవరిని దింపాలన్న దానిపై షార్ట్‌ లిస్ట్‌ రెడీ అయిందని, ఈ జాబితాను ఇప్పటికే హైకమాండ్‌కు పంపారని, కేంద్ర ఎన్నికల కమిటీ (సీఈసీ) భేటీ అనంతరం పార్టీ అభ్యర్థిత్వాలను ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. పార్టీలోకి ఇటీవలి కాలంలో జరుగుతున్న చేరికలు కూడా పార్లమెంటు అభ్యర్థిత్వాల చుట్టూనే తిరుగుతున్నాయి.

బొంతు రామ్మోహన్‌ (సికింద్రాబాద్‌), నీలం మధు (మెదక్‌), పట్నం సునీతారెడ్డి (చేవెళ్ల), వెంకటేశ్‌ నేతకాని (పెద్దపల్లి), కంచర్ల చంద్రశేఖర్‌రెడ్డి (మల్కాజ్‌గిరి), తాటికొండ రాజయ్య (వరంగల్‌)కు లోక్‌సభ అభ్యర్థిత్వం విషయంలో స్పష్టత వచ్చిందనే చర్చ జరుగుతోంది. దీనికి తోడు నల్లగొండ, భువనగిరి, పెద్దపల్లి, ఖమ్మం స్థానాల్లో పార్టీ నేతల బంధువులు, కుటుంబ సభ్యులు టికెట్లు అడుగుతున్నారు. ఈ నేపథ్యంలో లోక్‌సభ అభ్యర్థిత్వాల విషయంలో అనుసరించనున్న మార్గదర్శకాలపై కూడా సీఎం, డిప్యూటీ సీఎం, శ్రీధర్‌బాబు చర్చించే అవకాశాలున్నట్టు సమాచారం.  

నామినేటెడ్‌ ‘నారాజ్‌’.... 
పార్టీ అధికారంలోకి వచ్చి రెండు నెలలు పూర్తయినా నామినేటెడ్‌ పోస్టులను భర్తీ చేయడం లేదనే అసంతృప్తి రాష్ట్ర కాంగ్రెస్‌ వర్గాల్లో కనిపిస్తోంది. అదిగో, ఇదిగో అంటూ ఊరిస్తున్నా ఈ పదవులను పంపిణీ చేయకపోవడంతో ఎప్పుడెప్పుడా అని కాంగ్రెస్‌ నేతలు చాలా మంది ఎదురుచూస్తున్నారు. తొలుత 9 కార్పొరేషన్లకు చైర్మన్లు, డైరెక్టర్లను ప్రకటిస్తారనే చర్చ జరగ్గా, ఆ తర్వాత ఆ సంఖ్య 18కి చేరింది.

పార్లమెంటు ఎన్నికలకు ముందే ఈ పదవుల పంపకాలుంటాయని ఓసారి, ఎన్నికల తర్వాతే ఉంటాయని మరోసారి చర్చలు జరుగుతున్నాయి. అయితే, అడపాదడపా కొందరికి నామినేటెడ్‌ పదవులు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో త్వరలోనే నామినేటెడ్‌ పోస్టులను భర్తీ చేసే (పార్లమెంటు ఎన్నికలకు ముందే) అంశంపై కూడా ఈ పర్యటనలోనే రాష్ట్ర కాంగ్రెస్‌ ముఖ్యులు ఢిల్లీ పెద్దలతో చర్చిస్తారని టీపీసీసీ వర్గాల ద్వారా తెలుస్తోంది.   

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement