మా జోలికొస్తే ఊరుకోం: సీఎం రేవంత్‌రెడ్డి | CM Revanth Reddy Fires On BRS | Sakshi
Sakshi News home page

మా జోలికొస్తే ఊరుకోం: సీఎం రేవంత్‌రెడ్డి

Published Mon, Sep 16 2024 12:42 AM | Last Updated on Mon, Sep 16 2024 12:42 AM

CM Revanth Reddy Fires On BRS

వచ్చిన వారికి ఇక మూడినట్లే... ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హెచ్చరిక

కొందరు సన్నాసులు మనవాళ్ల ఇంటికొస్తామన్నారు.. మనవాళ్లే అక్కడికి వెళ్లారు..

చింతపండు అయ్యాక మనమే వచ్చి దాడి చేశామంటున్నారు.. ఎందుకు రమ్మనాలి?

బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి ఉదంతాన్ని పరోక్షంగా ప్రస్తావిస్తూ వ్యాఖ్యలు

టీపీసీసీ కొత్త చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించిన మహేశ్‌కుమార్‌గౌడ్‌

అనంతరం జరిగిన సభలో ప్రసంగించిన ముఖ్యమంత్రి

పార్టీని, ప్రభుత్వాన్ని జోడెద్దుల్లా ముందుకు తీసుకెళ్తామని వెల్లడి

మూడు, నాలుగు నెలల తర్వాత ‘స్థానిక’ఎన్నికలు అనే సంకేతాలు

పదేళ్లు కాంగ్రెస్‌దే అధికారం

నేను పవర్‌ సెంటర్‌ను కాదు.: మహేశ్‌కుమార్‌గౌడ్‌

ప్రభుత్వానికి, పార్టీకి మధ్య వారధిగా పనిచేస్తానని వెల్లడి

సాక్షి, హైదరాబాద్‌: కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలు ఎవరి జోలికి వెళ్లబోరని.. అలాగని ఎవరైనా తమ జోలికి వస్తే ఊరుకోబోమని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి హెచ్చరించారు. పాడి కౌశిక్‌రెడ్డి, అరికెపూడి గాందీల వివాదాన్ని పరోక్షంగా ప్రస్తావిస్తూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ‘‘వాడొకడు వీడొ­కడు మోపైండు. కార్యకర్తలపై కేసులు పెట్టాలని చూస్తున్నారు. కొందరు సన్నాసులు మన వాళ్ల ఇంటికి వస్తామన్నారు. కానీ మనవాళ్లే వాళ్ల ఇంటికి వెళ్లారు. 

ఇంటికి రమ్మన్నవాడికి చింతపండు అయినంక దాడికి వచ్చారని అంటున్నాడు. మరి ఇంటికి ఎందుకు రమ్మనాలి? .. .. డానికి పిలవాల్నా’’ అని పేర్కొన్నారు. తమ మంచితనాన్ని చేతగానితనంగా తీసుకుని ఎవరైనా తమ జోలికి వస్తే.. వీపు చింతపండు అవుతుందని వ్యాఖ్యానించారు. పీసీసీ కొత్త అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌ సౌమ్యుడేనని.. కానీ ఆయన వెనుక తాను ఉన్నానని గుర్తుపెట్టుకోవాలని హెచ్చరించారు. 

పార్టీ జెండాను మోస్తున్న కార్యకర్తలను కాపాడుకుంటామని.. పార్టీని, ప్రభుత్వాన్ని జోడెద్దుల్లా ముందుకు తీసుకెళతామని చెప్పారు. టీపీసీసీ కొత్త అధ్యక్షుడిగా ఎమ్మెల్సీ బి.మహేశ్‌కుమార్‌గౌడ్‌ ఆదివారం గాందీభవన్‌లో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో సీఎం రేవంత్‌రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. 

పదేళ్లు అధికారంలో ఉంటాం.. 
కొత్త పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌గౌడ్‌పై పార్టీ గురుతర బాధ్యతను పెట్టిందని రేవంత్‌ అన్నారు. ‘‘మా ఎన్నికలు అయిపోయాయి. ఇప్పుడు మీ ఎన్నికలు రాబోతున్నాయి. సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, జెడ్పీటీసీ ఎన్నికలు వస్తాయి. ఈ ఎన్నికల్లో పార్టీ జెండా మోసిన కార్యకర్తలను గెలిపించుకునే బాధ్యతలను నేను, మహేశ్‌గౌడ్‌ తీసుకుంటాం. మా ఎన్నికల కంటే ఎక్కువగా మీ ఎన్నికల కోసం పనిచేస్తాం. 

మీరు గెలిస్తేనే మేం గెలిచినట్టు, కాంగ్రెస్‌ పార్టీ గెలిచినట్టు. స్థానిక ఎన్నికల్లో విజయానికి పునరంకితమవుదాం’’అని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. మూడు, నాలుగు నెలల్లో కులగణన పూర్తవుతుందని.. ఆ తర్వాత స్థానిక ఎన్నికలు జరుగుతాయని రేవంత్‌ చెప్పారు. గతంలో పదేళ్లు టీడీపీ, ఆ తర్వాత పదేళ్లు కాంగ్రెస్, మళ్లీ పదేళ్లు టీఆర్‌ఎస్‌ రాష్ట్రంలో అధికారంలో ఉన్నాయని.. ఇదే పద్ధతిలో మరో పదేళ్లపాటు రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో ఉంటుందని చెప్పారు. 

ఆ ఎన్నికలు ఫైనల్స్‌ 
2023 అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు సెమీఫైనల్స్‌లో లభించిన విజయం మాత్రమేనని సీఎం రేవంత్‌ అన్నారు. ‘‘2029లో ఫైనల్స్‌ జరగబోతున్నాయి. ఆ ఎన్నికల్లో ఢిల్లీ గద్దెపై కాంగ్రెస్‌ జెండా ఎగరాలి. మోదీని ఓడించి రాహుల్‌గాం«దీని ప్రధానిని చేయాలి. అప్పుడే మనం ఫైనల్స్‌లో గెలిచినట్టు. తెలంగాణ నుంచి ఆ ఎన్నికల్లో 15 మందిని కాంగ్రెస్‌ ఎంపీలుగా గెలిపించాలి. అప్పటివరకు ఎవరూ విశ్రమించొద్దు’’అని పిలుపునిచ్చారు. 

రాజీనామా చేస్తానన్న వ్యక్తి ఎక్కడ? 
తాను టీపీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించాక ఇంద్రవెల్లిలో సమరశంఖం పూరించానని సీఎం రేవంత్‌ గుర్తు చేసుకున్నారు. అప్పటి నుంచి వెనుదిరిగి చూడకుండా నేతలను, కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ.. రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి తెచ్చేందుకు పనిచేశానని చెప్పారు. అధికారంలోకి వచ్చిన రెండు రోజులకే ఆరు గ్యారంటీల అమలు ప్రారంభించామన్నారు. 

‘‘దేశంలో ఎక్కడా లేని విధంగా రైతులకు ఒకేసారి రూ.18 వేల కోట్లు రుణమాఫీ చేశాం. కాంగ్రెస్‌ రైతు రుణమాఫీ చేస్తే రాజీనామా చేస్తానన్న సన్నాసి ఎక్కడ? కావాలంటే వివరాలు పంపిస్తా..’’అని రేవంత్‌ వ్యాఖ్యానించారు. కేసీఆర్, కేటీఆర్‌ల ఉద్యోగాలు ఊడగొడితేనే నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయని తాను చెప్పానని.. చెప్పినట్టుగానే ఇప్పటికే 65 వేల ఉద్యోగాలు ఇచ్చామని పేర్కొన్నారు. 

దేశానికి ఒలింపిక్స్‌ బంగారు పతకం తెస్తాం! 
క్రీడలను ప్రోత్సహించేందుకు రాష్ట్రంలో స్పోర్ట్స్‌ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నామని సీఎం రేవంత్‌ చెప్పారు. 2028 ఒలింపిక్స్‌లో దేశం తరఫున బంగారు పతకాన్ని తెచ్చే బాధ్యతను తెలంగాణ తీసుకుంటుందన్నారు. రాష్ట్ర భవిష్యత్‌ అవసరాలకు తగినట్టుగా ఫోర్త్‌ సిటీ ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. 

నేను పవర్‌ సెంటర్‌ను కాదు 
– సీఎం, మంత్రులు గాంధీభవన్‌కు రావాలి: టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌గౌడ్‌ 
కార్యకర్తలకు కాంగ్రెస్‌ పార్టీ గుర్తింపు ఇస్తుందనేందుకు తన నియామకమే నిదర్శనమని నూతన టీపీసీసీ చీఫ్‌గా మహేశ్‌కుమార్‌గౌడ్‌ చెప్పారు. తాను పీసీసీ అధ్యక్షుడిని అవుతానని అనుకోలేదని.. పార్టీ బాధ్యతలు చూడాల్సి వస్తుందని అప్పుడప్పుడూ రేవంత్‌రెడ్డి అంటుంటే ఊరికే అంటున్నారని భావించేవాడినని తెలిపారు. పీసీసీ అధ్యక్షుడిగా తనకెలాంటి భేషజాలు లేవని.. తాను పవర్‌ సెంటర్‌ను కానని చెప్పారు. 

తాను ప్రభుత్వానికి, పారీ్టకి మధ్య వారధిగా ఉంటానని.. తాను పీసీసీ అధ్యక్షుడిగా, రేవంత్‌రెడ్డి సీఎంగా ఉన్నంత కాలం పార్టీ కార్యకర్తలపై గీత కూడా పడనీయమని పేర్కొన్నారు. ప్రతి జిల్లాలో పార్టీ కార్యాలయాలు నిర్మించాలన్నదే తన లక్ష్యమని, ఆ దిశలో ప్రభుత్వం కూడా సహకారం అందించాలని కోరారు. మంత్రులు వారంలో రెండు రోజులు గాంధీ భవన్‌కు రావాలని.. జిల్లాలకు వెళ్లినప్పుడు జిల్లా పార్టీ కార్యాలయాలకు వెళ్లాలని కోరారు. సీఎం రేవంత్‌ కూడా వీలును బట్టి నెలకు రెండు సార్లయినా గాం«దీభవన్‌కు వచ్చి వెళ్లాలన్నారు. దీనివల్ల పార్టీ శ్రేణులతో మమేకం కావొచ్చన్నారు. 

సౌమ్యుడినేగానీ.. కరాటే బ్లాక్‌ బెల్ట్‌ ఉంది.. 
రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని బద్నాం చేయాలని ప్రతిపక్షాలు చూస్తున్నాయని.. సోషల్‌ మీడియాను సోషల్‌సెన్స్‌ లేకుండా ఉపయోగించుకుంటున్నాయని మహేశ్‌గౌడ్‌ విమర్శించారు. వాటిని ఎదుర్కోవాల్సింది కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలేనని, గ్రామగ్రామానికి వెళ్లి ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను వివరించాలని పిలుపునిచ్చారు. తనను సౌమ్యుడని సీఎం రేవంత్‌రెడ్డి అంటున్నారని.. ప్రజాస్వామ్యంలో తాను సౌమ్యుడినే అయినా కరాటేలో బ్లాక్‌బెల్ట్‌ ఉందని చమత్కరించారు. 

గాందీభవన్‌లో ‘లాల్‌ సలామ్‌’! 
టీపీసీసీ కొత్త చీఫ్‌ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో కమ్యూనిస్టుల తరహాలో ‘లాల్‌సలామ్‌’ వినిపించడం ఆసక్తిగా మారింది. ప్రజాగాయకుడు గద్దర్‌కు నివాళి అరి్పస్తూ సాగిన పాటలో ‘లాల్‌సలామ్‌’ అనే చరణం ఉంది. ఇది విని కొందరు కాంగ్రెస్‌ ఆఫీసులో కమ్యూనిస్టు పాట అంటూ చమత్కరించారు. 
– పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌గౌడ్‌ ప్రసంగిస్తున్న సమయంలోనే మంత్రి శ్రీధర్‌బాబు వేదిక మీదకు వచ్చారు. ఆయనకు స్వాగతం పలికిన మహేశ్‌గౌడ్‌.. ‘అయ్యగారు వచ్చారు. ఆయన రాకతో మంత్రిమండలి సంపూర్ణంగా వచ్చినట్టయింది..’ అని వ్యాఖ్యానించారు. 
– సీనియర్‌ కాంగ్రెస్‌ నేత వీహెచ్‌ వేదికపైకి వచ్చినప్పుడు.. తొలి వరుసలో కూర్చున్న మంత్రి పొన్నం ప్రభాకర్‌ లేచి, వీహెచ్‌కు తన స్థానం ఇచ్చి వెనుక వరుసలోకి వెళ్లి కూర్చున్నారు. 
– సభలో ఎవరెవరు మాట్లాడాలనే విషయంలో గందరగోళం లేకుండా స్వయంగా సీఎం రేవంత్‌రెడ్డి ఆ జాబితాను రాసి ఇచ్చారు. 

పెళ్లి ముహూర్తం పెట్టిన అయ్యగారితోనే.. 
మహేశ్‌కుమార్‌గౌడ్‌ తన పెళ్లికి ముహూర్తం పెట్టిన పురోహితుడితోనే పీసీసీ అధ్యక్ష బాధ్యతల స్వీకార కార్యక్రమంలో పూజలు చేయించారు. ఆయన నిజామాబాద్‌ జిల్లా డిచ్‌పల్లికి చెందిన పూజారి కృష్ణమాచార్యులు. ఆయన, గాంధీభవన్‌ పూజారి శ్రీనివాసమూర్తి ఇద్దరూ కలిసి పూజలు చేశారు. ఇక గాంధీభవన్‌తో తనకు 40 ఏళ్ల అనుబంధం ఉందని, తన అడుగుపడని మిల్లీమీటర్‌ స్థలం కూడా గాందీభవన్‌లో లేదని.. ప్రతి గోడ, కిటికీ, తలుపును తాను తాకానని మహేశ్‌గౌడ్‌ గుర్తు చేసుకున్నారు. పీసీసీ అధ్యక్షుడిగా తన తొలి ప్రసంగంతోనే కార్యకర్తలను ఆకట్టుకున్నారు. సౌమ్యుడిని అంటూనే కరాటేలో బ్లాక్‌బెల్ట్‌ ఉందన్నారు. పార్టీ నేతలకు అందుబాటులో ఉండటం కోసం మంత్రులు తరచూ గాంధీభవన్‌కు, జిల్లా కార్యాలయాలకు రావాలని కోరారు. 

రేవంత్‌ నుంచి జెండా అందుకుని.. 
పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకునేందుకు మహేశ్‌గౌడ్‌ హైదరాబాద్‌లోని నార్సింగి నుంచి భారీ ర్యాలీగా అమరవీరుల స్థూపం వద్దకు వచ్చారు. అక్కడ నివాళులు అర్పించిన అనంతరం గాందీభవన్‌కు చేరుకుని.. సీఎం రేవంత్‌రెడ్డి నుంచి టీపీసీసీ చీఫ్‌ బాధ్యతలు తీసుకున్నారు. సభా ప్రాంగణంలో రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా పార్టీ జెండాను అందుకున్నారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement