నిధులు కేటాయిస్తేనే ‘ హైస్పీడ్ ’
యాదాద్రికి ఎంఎంటీఎస్ వచ్చేనా..
వందే మెట్రో కోసం సిటీ వెయిటింగ్
పూర్తిస్థాయిలో అందుబాటులోకి రాని ఎంఎంటీఎస్– 2
నేటి నుంచి కేంద్ర బడ్జెట్ సమావేశాలు
నగరవాసుల్లో మరోసారి చిగురిస్తున్న ఆశలు
సాక్షి, హైదరాబాద్: ఎంఎంటీఎస్ రెండో దశ ప్రాజెక్టు తుది దశకు చేరుకుంది. దాదాపు ఎంపిక చేసిన అన్ని లైన్‌లు పూర్తయ్యాయి. కానీ ఇప్పటి వరకు కొత్త రైళ్లను కొనుగోలు చేయలేదు. కనీసం 9 రైళ్లను కొత్తగా కొనుగోలు చేస్తే తప్ప కొత్త మార్గాల్లోకి ఎంఎంటీఎస్ సేవలను విస్తరించడం సాధ్యం కాని పరిస్థితి. గతంలో కేంద్ర, రాష్ట్రాల మధ్య సమన్వయం కొరవడడంతో ఎంఎంటీఎస్ రెండో దశకు నిధుల కొరత సవాల్‌గా మారింది. ఇప్పటికైనా రెండో దశకు నిధులు కేటాయిస్తే ఔటర్ చుట్టూ వివిధ ప్రాంతాల నుంచి నగరంలోకి రాకపోకలు సాగించేలా ఎంఎంటీఎస్ విస్తరణకు అవకాశం ఉంటుంది.
ఘట్కేసర్ నుంచి యాదాద్రి వరకు ఎంఎంటీఎస్‌ను పొడిగించే ప్రతిపాదన ఇప్పటికీ ఆచరణకు నోచలేదు. ఇటీవల ఈ ప్రాజెక్టు కోసం అవసరమైన భూమిని ఇచ్చేందుకు ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఐదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఈ ప్రాజెక్టు ఈ ఏడాదైనా ఆచరణలోకి వస్తే నగరవాసులకు ఎంతో ఊరట. అలాగే.. వందే మెట్రో రైళ్లు, హైస్పీడ్ రైళ్లు వంటి అధునాతన సదుపాయాల కోసం నగరం ఎదురు చూస్తోంది. మరికొద్ది గంటల్లో కేంద్ర బడ్జెట్ సమావేశాలు ఆరంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో నగరంలో చేపట్టాల్సిన రైల్వే ప్రాజెక్టులపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం.
ఔటర్ వరకు ఎంఎంటీఎస్..
మహా నగర విస్తరణకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. జీహెచ్‌ఎంసీ పరిధిని ఔటర్ వరకు విస్తరించనున్నారు. ఈ క్రమంలో ప్రజా రవాణాను కూడా అన్ని వైపులా విస్తరించవలసిందే. మెట్రో రెండో దశ కోసం ప్రభుత్వం ఇప్పటికే కార్యాచరణ చేపట్టింది. కానీ దక్షిణమధ్య రైల్వే రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో చేపట్టిన ఎంఎంటీఎస్ రెండో దశ ఇప్పటికే పూర్తయింది.
మేడ్చల్, పటాన్‌చెరు, ఉందానగర్, చర్లపల్లి, ఘట్కేసర్ తదితర నగర శివారు ప్రాంతాలను అనుసంధానం చేసేలా రెండో దశ లైన్‌ల నిర్మాణం పూర్తి చేశారు. ప్రస్తుతం మౌలాలీ– సనత్‌నగర్ మధ్య కూడా పనులు తుది దశకు చేరుకున్నాయి. కానీ నగర విస్తరణకు అనుగుణంగా ఎంఎంటీఎస్ రైళ్లు లేకపోవడంతో.. అందుబాటులో ఉన్న వాటినే వివిధ మార్గాల్లో నడుపుతున్నారు.
గతంలో లింగంపల్లి– ఫలక్‌నుమా, నాంపల్లి–లింగంపల్లి, ఫలక్‌నుమా–లింగంపల్లి మార్గాల్లో రోజుకు 121 సరీ్వసులు నడిచాయి. కానీ ప్రస్తుతం సరీ్వసుల సంఖ్య సగానికి తగ్గింది. ఎంఎంటీఎస్ రెండో దశలో భాగంగా 9 కొత్త రైళ్లను కొనుగోలు చేయాలని దక్షిణమధ్య రైల్వే ప్రతిపాదించింది. ఇప్పటి వరకు ఒక్క రైలు కూడా కొత్తగా పట్టాలెక్కలేదు.
యాదాద్రికి పొడిగిస్తారా..
సికింద్రాబాద్ నుంచి ప్రస్తుతం ఘట్కేసర్ వరకు చేపట్టిన ఎంఎంటీఎస్ రెండో దశ ప్రాజెక్టును రాయగిరి వరకు మరో 33 కిలోమీటర్లు పొడిగించేందుకు 2015లో ప్రణాళికలను సిద్ధం చేశారు. కానీ ఇప్పటి వరకు పనులు ప్రారంభం కాలేదు. ఇటీవల ఈ ప్రాజెక్టు కోసం అవసరమైన భూమిని ఇచ్చేందుకు రాష్ట్రప్రభుత్వం సంసిద్ధతను వ్యక్తం చేసింది. ఈసారైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయం ఏర్పడితే ఈ ప్రాజెక్టు పట్టాలెక్కేందుకు అవకాశం ఉంది.
‘హైస్పీడ్’ను పట్టాలెక్కించండి....
గంటకు 220 కిలోమీటర్‌లకు పైగా వేగంతో దూసుకెళ్లే హైస్పీడ్ రైల్ కారిడార్ కోసం తెలుగు రాష్ట్రాలు ఎదురు చూస్తున్నాయి. సుమారు 922 కిలోమీటర్‌ల దూరం చేపట్టనున్న హైస్పీడ్ రైల్ కారిడార్ ప్రాజెక్టులో.. శంషాబాద్ నుంచి ప్రారంభమై విజయవాడ మీదుగా విశాఖ వరకు ఒక రూట్.. మరో రూట్‌లో విశాఖ పట్టణం నుంచి విజయవాడ మీదుగా కర్నూల్ వరకు మరో హైస్పీడ్ కారిడార్‌ను ఏర్పాటు చేస్తారు. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల మధ్య అత్యంత వేగంతో దూసుకెళ్లే రైలు సేవలు అందుబాటులోకి వస్తాయి. దీంతో శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి సుమారు 4 గంటల్లోనే విశాఖకు చేరుకునే అవకాశం ఉంటుంది.
వందే మెట్రో కోసం సిటీ వెయిటింగ్..
వందేమెట్రో రైళ్ల కోసం నగరవాసులు ఎదురు చూస్తున్నారు. హైదరాబాద్ నుంచి 250 కిలోమీటర్‌ల వరకు ఈ రైళ్లను నడపాలనే ప్రతిపాదన ఉంది. సికింద్రాబాద్– గుంటూరు, సికింద్రాబాద్– సిర్పూర్‌కాగజ్‌నగర్, సికింద్రాబాద్–పెద్దపల్లి, కాచిగూడ–కర్నూల్, సికింద్రాబాద్–నాందేడ్, సికింద్రాబాద్–రాయ్‌చూర్, తదితర మార్గాల్లో ఈ రైళ్లకు డిమాండ్ ఉంది.
పాతబస్తీ మెట్రో సంగతేంటీ?
పాతబస్తీ మెట్రో మార్గానికి నిధుల కొరత సవాల్‌గా మారింది. ఎంజీబీఎస్ నుంచి ఫలక్‌నుమా వరకు 5.5 కిలోమీటర్‌ల మెట్రో కారిడార్ కోసం సుమారు రూ.2000 వరకు ఖర్చు కానున్నట్లు అంచనా. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ సందర్భంగా రూ.500 కోట్లు కేటాయించారు. కానీ.. ఇప్పటి వరకు నిధులు విడుదల కాకపోవడంతో పనులు ప్రారంభం కాలేదు. త్వరలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టనున్న క్రమంలో పాతబస్తీ మెట్రోను పట్టాలెక్కించేందుకు నిధులు విడుదల చేస్తే పనులు పరుగులు పెట్టే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment