mmts trains
-
Hyderabad: ఎంఎంటీఎస్ రైళ్లపై ఎందుకీ నిర్లక్ష్యం?
సాక్షి, హైదరాబాద్: ఎంఎంటీఎస్ రైళ్ల రద్దుపై ప్రయాణికుల సంఘాలు, వివిధ కాలనీలకు చెందిన సంక్షేమ సంఘాలు ఆందోళన వ్యక్తం చేశాయి. ‘ఏ రైలు ఎపుడొస్తుందో తెలియదు, ఏ క్షణంలో ఎందుకు రద్దవుతుందో తెలియదు. నగరానికి లైఫ్‌లైన్‌గా నిలిచిన ఎంఎంటీఎస్‌పైన నిర్లక్ష్యమెందుకు’ అంటూ రైల్వే ఉన్నతాధికారులను ప్రశ్నించారు. ఎంఎంటీఎస్ రైళ్ల నిర్వహణపైన దక్షిణమధ్య రైల్వే హైదరాబాద్, సికింద్రాబాద్ డివిజన్లకు చెందిన ఉన్నతాధికారులు రెండు రోజుల క్రితం ప్రయాణికుల సంఘాలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వివిధ మార్గాల్లో నడుస్తున్న ఎంఎంటీఎస్, సబర్బన్ రైళ్ల రాకపోకల పట్ల వివిధ సంఘాలకు చెందిన ప్రతినిధులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు.సికింద్రాబాద్ డివిజనల్ రైల్వే మేనేజర్ భరతే కుమార్ జైన్, హైదరాబాద్ డివిజనల్ రైల్వేమేనేజర్ లోకేష్ విష్ణోయ్, వివిధ విభాగాలకు చెందిన అధికారులు సికింద్రాబాద్‌లోని సంచాలన్‌భవన్, హైదరాబాద్ భవన్లలో ప్రయాణికుల సంఘాలతో సమావేశాలను ఏర్పాటు చేశారు. డివిజనల్ రైల్వే వినియోగదారుల సంప్రదింపుల కమిటీ, జంటనగరాల సబర్బన్ ట్రావెలర్స్ అసోసియేషన్, అమ్ముగూడ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్, శ్రీ రాఘవేంద్ర నగర్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్, వివేకానందపురం వెల్ఫేర్ అసోసియేషన్, దక్షిణ మధ్య రైల్వే రైల్ ఫ్యాన్స్ అసోసియేషన్, తదితర సంఘాలకు చెందిన ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.సకాలంలో రైళ్లు నడపాలి.. మేడ్చల్ నుంచి సికింద్రాబాద్ వరకు, మేడ్చల్ నుంచి ఉందానగర్ వరకు గతేడాది సర్వీసులను ప్రారంభించారు. కానీ ఈ రూట్లలో ప్రతి రోజు రైళ్లు రద్దవుతున్నాయి. పైగా ఏ ట్రైన్ ఎప్పుడొస్తుందో తెలియదు. మధ్యాహ్నం సమయంలో నడిపే రైళ్ల వల్ల ప్రయాణికులకు ఎలాంటి ప్రయోజనం ఉండదు. ప్రయాణికుల రద్దీ, డిమాండ్ ఉండే సమయాల్లోనే రైళ్లు అందుబాటులో ఉండడం లేదు. ఈ రూట్లో సకాలంలో రైళ్లు నడపాలని జంటనగరాల సబర్బన్ ట్రావెలర్స్ అసోసియేషన్ ప్రతినిధి నూర్ కోరారు. ఉదయం 9 గంటలకు రావలసిన ట్రైన్ 11 గంటలకు రావడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదన్నారు. మరోవైపు మల్కాజిగిరి చుట్టుపక్కల ప్రాంతాలకు చెందిన వందలాది కాలనీలకు సిటీబస్సుల కంటే ఎంఎంటీఎస్ ఎంతో ప్రయోజనంగా ఉంటుందని భావిస్తే ఈ రూట్లో మేడ్చల్ నుంచి సికింద్రాబాద్ వరకు రైళ్లు ప్రారంభించినా ఫలితం లేకుండా పోయిందని అమ్ముగూడ, రాఘవేంద్రనగర్ కాలనీలకు చెందిన ప్రతినిధులు తెలిపారు. చదవండి: హైదరాబాద్‌లో ప్రభుత్వ భూముల రీ సర్వే.. రంగంలోకి సర్వేయర్లు ‘హైలైట్స్’ పునరుద్ధరించాలి... ఎంఎంటీఎస్ రైళ్ల రాకపోకలపై ప్రయాణికులకు ఎప్పటికప్పుడు కచ్చితమైన సమాచారాన్ని అందజేసే ‘హైలైట్స్’ మొబైల్ యాప్ సేవలను పునరుద్ధరించాలని ప్రయాణికుల సంఘాలు కోరాయి. చిన్న చిన్న కారణాలతో ఎంఎంటీఎస్ సర్వీసులను రద్దు చేయడం పట్ల కూడా ప్రయాణికుల సంఘాలు అభ్యంతరం తెలిపాయి. మరోవైపు సికింద్రాబాద్ స్టేషన్ పునరభివృద్ధి పనుల దృష్ట్యా కూడా రైళ్లను రద్దుచేస్తున్నట్లు చెప్పారు. ప్రయాణికుల సంఘాల నుంచి వచ్చిన సమస్యలను, సలహాలను, సూచనలను పరిగణనలోకి తీసుకొని చర్యలు చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు. ప్రయాణికుల అభ్యర్ధనలను పరిశీలించిన అనంతరం, ఎంఎంటీఎస్ రైళ్ల నిర్వహణలో ఎలాంటి జాప్యానికి తావు లేకుండా చర్యలు చేపట్టాలని దక్షిణమధ్యరైల్వే జనరల్మేనేజర్ అరుణ్‌కుమార్‌జైన్ ఉన్నతాధికారులను ఆదేశించారు. -
యాదాద్రికి ఎంఎంటీఎస్ వచ్చేనా..
సాక్షి, హైదరాబాద్: ఎంఎంటీఎస్ రెండో దశ ప్రాజెక్టు తుది దశకు చేరుకుంది. దాదాపు ఎంపిక చేసిన అన్ని లైన్లు పూర్తయ్యాయి. కానీ ఇప్పటి వరకు కొత్త రైళ్లను కొనుగోలు చేయలేదు. కనీసం 9 రైళ్లను కొత్తగా కొనుగోలు చేస్తే తప్ప కొత్త మార్గాల్లోకి ఎంఎంటీఎస్ సేవలను విస్తరించడం సాధ్యం కాని పరిస్థితి. గతంలో కేంద్ర, రాష్ట్రాల మధ్య సమన్వయం కొరవడడంతో ఎంఎంటీఎస్ రెండో దశకు నిధుల కొరత సవాల్‌గా మారింది. ఇప్పటికైనా రెండో దశకు నిధులు కేటాయిస్తే ఔటర్ చుట్టూ వివిధ ప్రాంతాల నుంచి నగరంలోకి రాకపోకలు సాగించేలా ఎంఎంటీఎస్ విస్తరణకు అవకాశం ఉంటుంది. ఘట్కేసర్ నుంచి యాదాద్రి వరకు ఎంఎంటీఎస్‌ను పొడిగించే ప్రతిపాదన ఇప్పటికీ ఆచరణకు నోచలేదు. ఇటీవల ఈ ప్రాజెక్టు కోసం అవసరమైన భూమిని ఇచ్చేందుకు ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఐదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఈ ప్రాజెక్టు ఈ ఏడాదైనా ఆచరణలోకి వస్తే నగరవాసులకు ఎంతో ఊరట. అలాగే.. వందే మెట్రో రైళ్లు, హైస్పీడ్ రైళ్లు వంటి అధునాతన సదుపాయాల కోసం నగరం ఎదురు చూస్తోంది. మరికొద్ది గంటల్లో కేంద్ర బడ్జెట్ సమావేశాలు ఆరంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో నగరంలో చేపట్టాల్సిన రైల్వే ప్రాజెక్టులపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం. ఔటర్ వరకు ఎంఎంటీఎస్.. మహా నగర విస్తరణకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. జీహెచ్ఎంసీ పరిధిని ఔటర్ వరకు విస్తరించనున్నారు. ఈ క్రమంలో ప్రజా రవాణాను కూడా అన్ని వైపులా విస్తరించవలసిందే. మెట్రో రెండో దశ కోసం ప్రభుత్వం ఇప్పటికే కార్యాచరణ చేపట్టింది. కానీ దక్షిణమధ్య రైల్వే రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో చేపట్టిన ఎంఎంటీఎస్ రెండో దశ ఇప్పటికే పూర్తయింది. మేడ్చల్, పటాన్చెరు, ఉందానగర్, చర్లపల్లి, ఘట్కేసర్ తదితర నగర శివారు ప్రాంతాలను అనుసంధానం చేసేలా రెండో దశ లైన్ల నిర్మాణం పూర్తి చేశారు. ప్రస్తుతం మౌలాలీ– సనత్‌నగర్ మధ్య కూడా పనులు తుది దశకు చేరుకున్నాయి. కానీ నగర విస్తరణకు అనుగుణంగా ఎంఎంటీఎస్ రైళ్లు లేకపోవడంతో.. అందుబాటులో ఉన్న వాటినే వివిధ మార్గాల్లో నడుపుతున్నారు. గతంలో లింగంపల్లి– ఫలక్‌నుమా, నాంపల్లి–లింగంపల్లి, ఫలక్‌నుమా–లింగంపల్లి మార్గాల్లో రోజుకు 121 సరీ్వసులు నడిచాయి. కానీ ప్రస్తుతం సరీ్వసుల సంఖ్య సగానికి తగ్గింది. ఎంఎంటీఎస్ రెండో దశలో భాగంగా 9 కొత్త రైళ్లను కొనుగోలు చేయాలని దక్షిణమధ్య రైల్వే ప్రతిపాదించింది. ఇప్పటి వరకు ఒక్క రైలు కూడా కొత్తగా పట్టాలెక్కలేదు. యాదాద్రికి పొడిగిస్తారా.. సికింద్రాబాద్ నుంచి ప్రస్తుతం ఘట్కేసర్ వరకు చేపట్టిన ఎంఎంటీఎస్ రెండో దశ ప్రాజెక్టును రాయగిరి వరకు మరో 33 కిలోమీటర్లు పొడిగించేందుకు 2015లో ప్రణాళికలను సిద్ధం చేశారు. కానీ ఇప్పటి వరకు పనులు ప్రారంభం కాలేదు. ఇటీవల ఈ ప్రాజెక్టు కోసం అవసరమైన భూమిని ఇచ్చేందుకు రాష్ట్రప్రభుత్వం సంసిద్ధతను వ్యక్తం చేసింది. ఈసారైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయం ఏర్పడితే ఈ ప్రాజెక్టు పట్టాలెక్కేందుకు అవకాశం ఉంది. ‘హైస్పీడ్’ను పట్టాలెక్కించండి.... గంటకు 220 కిలోమీటర్లకు పైగా వేగంతో దూసుకెళ్లే హైస్పీడ్ రైల్ కారిడార్ కోసం తెలుగు రాష్ట్రాలు ఎదురు చూస్తున్నాయి. సుమారు 922 కిలోమీటర్ల దూరం చేపట్టనున్న హైస్పీడ్ రైల్ కారిడార్ ప్రాజెక్టులో.. శంషాబాద్ నుంచి ప్రారంభమై విజయవాడ మీదుగా విశాఖ వరకు ఒక రూట్.. మరో రూట్లో విశాఖ పట్టణం నుంచి విజయవాడ మీదుగా కర్నూల్ వరకు మరో హైస్పీడ్ కారిడార్‌ను ఏర్పాటు చేస్తారు. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల మధ్య అత్యంత వేగంతో దూసుకెళ్లే రైలు సేవలు అందుబాటులోకి వస్తాయి. దీంతో శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి సుమారు 4 గంటల్లోనే విశాఖకు చేరుకునే అవకాశం ఉంటుంది. వందే మెట్రో కోసం సిటీ వెయిటింగ్.. వందేమెట్రో రైళ్ల కోసం నగరవాసులు ఎదురు చూస్తున్నారు. హైదరాబాద్ నుంచి 250 కిలోమీటర్ల వరకు ఈ రైళ్లను నడపాలనే ప్రతిపాదన ఉంది. సికింద్రాబాద్– గుంటూరు, సికింద్రాబాద్– సిర్పూర్కాగజ్నగర్, సికింద్రాబాద్–పెద్దపల్లి, కాచిగూడ–కర్నూల్, సికింద్రాబాద్–నాందేడ్, సికింద్రాబాద్–రాయ్‌చూర్, తదితర మార్గాల్లో ఈ రైళ్లకు డిమాండ్ ఉంది. పాతబస్తీ మెట్రో సంగతేంటీ? పాతబస్తీ మెట్రో మార్గానికి నిధుల కొరత సవాల్‌గా మారింది. ఎంజీబీఎస్ నుంచి ఫలక్‌నుమా వరకు 5.5 కిలోమీటర్ల మెట్రో కారిడార్ కోసం సుమారు రూ.2000 వరకు ఖర్చు కానున్నట్లు అంచనా. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ సందర్భంగా రూ.500 కోట్లు కేటాయించారు. కానీ.. ఇప్పటి వరకు నిధులు విడుదల కాకపోవడంతో పనులు ప్రారంభం కాలేదు. త్వరలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టనున్న క్రమంలో పాతబస్తీ మెట్రోను పట్టాలెక్కించేందుకు నిధులు విడుదల చేస్తే పనులు పరుగులు పెట్టే అవకాశం ఉంది. -
సికింద్రాబాద్ నుంచి పలు రైళ్లు రద్దు
సాక్షి, హైదరాబాద్: సాంకేతిక కారణాల దృష్ట్యా వివిధ మార్గాల్లో 20 దూరప్రాంతాల రైళ్లను, నగరంలోని వివిధ మార్గాల్లో నడిచే మరో 16 ఎంఎంటీఎస్ రైళ్లను ఈ నెల 4 నుంచి 10 వరకు రద్దు చేయనున్నట్లు దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో సీహెచ్.రాకేశ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు కాజీపేట్–డోర్నకల్, విజయవాడ–డోర్నకల్, భద్రచాలం రోడ్–డోర్నకల్, కాజీపేట్–సిర్పూర్ కాగజ్‌నగర్, బల్లార్ష– కాజీపేట్, సికింద్రాబాద్–వరంగల్, సి ర్పూర్ టౌన్–భద్రాచలం, వరంగల్– హైదరాబాద్, కరీంనగర్–సిర్పూర్టౌన్, కరీంనగర్–నిజామాబాద్, కాజీపేట్–బల్లార్ష తదితర మార్గాల్లో రైళ్లు రద్దు కానున్నట్లు పేర్కొన్నారు. ఎంఎంటీఎస్‌లు రద్దు: ఈ నెల 4 నుంచి 10 వరకు లింగంపల్లి–నాంపల్లి, లింగంపల్లి–ఫలక్‌నుమా, ఉందానగర్–లింగంపల్లి, నాంపల్లి–లింగంపల్లి, తదితర మార్గాల్లో 16 సర్వీసులు రద్దు కానున్నట్లు వెల్లడించారు. -
ఎంఎంటీఎస్ కొత్త రూట్‌తో వారికి నిరాశే! హైటెక్ సిటీకి వెళ్లాలంటే కష్టమే!
సాక్షి, సిటీబ్యూరో: ప్రయాణికులను ఎంతో ఊరించిన ఎంఎంటీఎస్ కొత్త రూట్ అరకొర కనెక్టివిటీతో ఉస్సూరుమనించే అవకాశం కనిపిస్తోంది. మేడ్చల్ నుంచి సికింద్రాబాద్ వరకే ఇది పరిమితం కానుంది. ఈ నెల 8న ప్రధాని మోదీ చేతుల మీదుగా ఈ రూట్లో ఎంఎంటీఎస్ రైళ్లను ప్రారంభించనున్న సంగతి తెలిసిందే. అలాగే ఉందానగర్–ఫలక్‌నుమా మధ్య కూడా రైళ్లను ప్రారంభించనున్నారు. కానీ మేడ్చల్, మల్కాజిగిరి వాసులు హైటెక్‌సిటీ, లింగంపల్లి వైపు వెళ్లాలంటే సికింద్రాబాద్‌లో మరో రైలు మారాలి. ఇది కొంతవరకు ఇబ్బందిగానే ఉంటుంది. సాఫీగా వెళ్లేందుకు అవకాశం ఉండదు. మరో ట్రైన్ కోసం సికింద్రాబాద్‌లో పడిగాపులు కాయాల్సి ఉంటుంది. మేడ్చల్ నుంచి నేరుగా లింగంపల్లి వరకు నడిపేందుకు అవకాశం ఉన్నప్పటికీ ప్రస్తుతం సికింద్రాబాద్ వరకే పరిమితం చేసినట్లు సమాచారం. ప్రతి రోజు లక్షలాది మంది ప్రయాణికులు మేడ్చల్, సుచిత్ర, కొంపల్లి, అల్వాల్, నేరేడ్మెట్, సైనిక్‌పురి, బొల్లారం, మల్కాజిగిరి తదితర ప్రాంతాల నుంచి హైటెక్ సిటీ వైపు రాకపోకలు సాగిస్తున్నారు. వారంతా సిటీ బస్సులు, సొంత వాహనాల్లో ప్రయాణం చేస్తున్నారు. మేడ్చల్ వాసులు ఎంతోకాలంగా ఎదురు చూస్తున్న ఎంఎంటీఎస్ సర్వీస్ అందుబాటులోకి వచ్చినప్పటికీ అరకొర కనెక్టివిటీ వల్ల పాక్షిక సదుపాయంగానే మిగలనుందనే భావన కలుగుతోంది. ఉందానగర్ నుంచి ఉన్నా... ● పాలు, కూరగాయలు తదితర వస్తువులను విక్రయించే చిరువ్యాపారులు ఉందానగర్ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి నగరంలోని వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తారు. మేడ్చల్, మల్కాజిగిరి వైపు రాకపోకలు సాగించేవారు ఉన్నారు. ఉందానగర్, ఫలక్‌నుమా నుంచి వచ్చేవారు. లేదా మేడ్చల్, మల్కాజిగిరి ప్రాంతాల నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు వెళ్లేవారు సికింద్రాబాద్‌లో దిగి మరో రైలు మారాలి. దీంతో ఈ రూట్లోనూ ఇది అరకొర సదుపాయమే కానుంది. ● అలాగే ఉందానగర్ నుంచి నేరుగా లింగంపల్లి వరకు ఇప్పట్లో రైళ్లు అందుబాటులోకి రాకపోవచ్చని అధికారులు పేర్కొంటున్నారు. ఎంఎంటీఎస్ రెండో దశలో కొత్తగా రెండు రూట్లలో ఏకంగా ప్రధాని చేతుల మీదుగా రైళ్లను ప్రారంభించనున్నప్పటికీ వందశాతం కనెక్టివిటీ లేకపోవడంతో ప్రయాణికులకు పెద్దగా ప్రయోజనం ఉండకపోగా, అలంకారప్రాయంగా మారే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. తెల్లాపూర్ రూట్ తెల్లారినట్టే.. ఎంఎంటీఎస్ రెండో దశలో భాగంగా తెల్లాపూర్– బీహెచ్ఈఎల్ మధ్య కొత్తగా లైన్లను నిర్మించి రైళ్లను అందుబాటులోకి తెచ్చారు. కానీ లింగంపల్లి నుంచి తెల్లాపూర్ మీదుగా ఉదయం ఒకటి, రాత్రి ఒకటి చొప్పున రెండు సర్వీసులు మాత్రమే నడిపారు. దీంతో ప్రయాణికులు పెద్దగా వినియోగించుకోలేకపోయారు. ప్రస్తుతం ఆ రూట్లో రైళ్లు తిరగడం లేదు. ఇలా అయితే ఎంతో మేలు.. ఉత్తరం వైపు ఉన్న మేడ్చల్ నుంచి పడమటి వైపున ఉన్న లింగంపల్లి వరకు సుమారు 50 కిలోమీటర్ల వరకు రైళ్లను నడపడం వల్ల ప్రయాణికులకు ఎంతో ప్రయోజనం ఉంటుంది. దక్షిణం వైపున ఉన్న ఉందానగర్ నుంచి నేరుగా లింగంపల్లికి రైళ్లను నడిపితే ఈ రూట్లో కనెక్టివిటీ పెరుగుతుంది. నగరంలోని ఉత్తర, దక్షిణ ప్రాంతాలను పడమటి వైపు ఉన్నప్రాంతాలతో పూర్తిస్థాయిలో అనుసంధానం చేసినట్లవుతుంది.మేడ్చల్ నుంచి ఉందానగర్ వరకు నేరుగా రైళ్లను ఏర్పాటు చేస్తే ఉత్తర– దక్షిణ ప్రాంతాల మధ్య కనెక్టివిటీ పెరుగుతుంది. -
మేడ్చల్– ఉందానగర్ మార్గంలో వాహనదారులకు బ్రేక్‌లు.. అదొక్కటే పరిష్కారం!
సాక్షి, హైదరాబాద్: అది సుమారు ఇరవై ఎనిమిది కిలోమీటర్ల మార్గం. మేడ్చల్‌లో రైలు ఎక్కితే నేరుగా ఉందానగర్ వరకు వెళ్లొచ్చు. అక్కడి నుంచి శంషాబాద్ విమానశ్రయానికి మరో ఆరు కిలోమీటర్లు మాత్రమే. ఎంఎంటీఎస్ రెండో దశలో ఈ లైన్‌ను దక్షిణమధ్య రైల్వే ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించి పూర్తి చేసింది. జీఎమ్మార్ సంస్థ అనుమతిస్తే ఉందానగర్ నుంచి ఎయిర్‌పోర్టు వరకు కూడా ఎంఎంటీఎస్ రైళ్లను నడపాలనేది అప్పటి ప్రతిపాదన. ఈ క్రమంలోనే రూ.కోట్లు వెచ్చించి మేడ్చల్ నుంచి ఉందానగర్ వరకు లైన్ల డబ్లింగ్, విద్యుదీకరణ తదితర పనులను పూర్తి చేశారు. సికింద్రాబాద్ నుంచి బొల్లారం వరకు రైల్వేభద్రతా తనిఖీలు కూడా పూర్తయ్యాయి. కానీ.. ఆ మార్గంలో రైళ్లను ప్రారంభించాలంటే అధికారులు హడలెత్తుతున్నారు. ఎంఎంటీఎస్ రెండో దశ రైళ్లను నడిపేందుకు లైన్ క్లియర్‌గా ఉన్నా వెనుకడుగు వేస్తున్నారు. కేవలం 10 కిలోమీటర్ల మార్గంలో కనీసం 10 చోట్ల లెవల్ క్రాసింగ్‌లు ఉండడమే ఇందుకు కారణం. వీటితో నగరవాసులకు తీవ్ర ఆటంకం ఏర్పడనుంది. వాహనదారుల రాకపోకలు స్తంభించిపోనున్నాయి. లెవల్ క్రాసింగ్లను తొలగించేందుకు ఎలాంటి కార్యాచరణ లేకుండానే పట్టాలు పరిచారు. దీంతో ఇప్పుడు ఆ లైన్ ఉన్నా లేనట్లుగానే మారింది. అక్కరకొచ్చేది ఎలా..? ఎంఎంటీఎస్ రెండో దశలో చేపట్టిన రైల్వే లైన్ల విస్తరణతో ఇప్పుడు మేడ్చల్ నుంచి సికింద్రాబాద్ మీదుగా ఫలక్‌నుమా నుంచి ఉందానగర్ వరకు ఎంఎంటీఎస్ రైళ్లు నడిపేందుకు మార్గం సుగమమైంది. సికింద్రాబాద్ నుంచి ఫలక్‌నుమా వరకు ప్రస్తుతం ఎంఎంటీఎస్ రైళ్లు నడుస్తున్న సంగతి తెలిసిందే. కొత్తగా పూర్తి చేసిన ఫలక్‌నుమా– ఉందానగర్ మార్గంలోనే రైళ్లు నడిపేందుకు ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ మేడ్చల్ నుంచి సికింద్రాబాద్ వరకే కనీసం 10 చోట్ల లెవల్ క్రాసింగ్‌లు ఉన్నాయి. కనీసం ప్రతి 2 కిలోమీటర్లకు ఒకటి చొప్పున లెవల్ క్రాసింగ్ ఉంది. అంటే ట్రైన్ బయలుదేరిన తర్వాత రెండు, మూడు నిమిషాలకోసారి గేట్లు వేసి వాహనాల రాకపోకలను నిలిపివేయాల్సి ఉంటుంది. దీంతో పెద్ద ఎత్తున ట్రాఫిక్ రద్దీ నెలకోనుంది. దయానంద్‌నగర్, సఫిల్‌గూడ, తుకారంగేట్, అమ్ముగూడ, మల్కాజిగిరి, అల్వాల్, బొల్లారం తదితర ప్రాంతాల్లో లెవల్ క్రాసింగ్‌లు ఉన్నాయి. ఈ రూట్ పూర్తిగా కాలనీలు, బస్తీల్లోంచే వెళ్తుంది. దీంతో లెవల్ క్రాసింగ్‌లు తీసివేసేందుకు కొన్ని చోట్ల జనావాసాలను, దుకాణాలను, ఇతర నిర్మాణాలను తొలగించాల్సి ఉంటుంది. పైగా రైల్ ఓవర్ బ్రిడ్జీల (ఆర్ఓబీ)ను నిర్మించాలంటే చాలా చోట్ల భూమి లభ్యత సమస్యగా మారింది. ఈ క్రమంలో రైల్ అండర్ బ్రిడ్జీలు (ఆర్యూబీ) ఒక్కటే పరిష్కారం. ఇందుకు ప్రభుత్వం నుంచి ఆర్థిక సహకారం, మౌలిక సదుపాయాల కల్పన తప్పనిసరి. ప్రస్తుతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయం కొరవడడంతో నిధుల లేమి ప్రధాన అడ్డంకిగా మారింది. లెవల్ క్రాసింగ్‌లు తొలగిస్తే తప్ప రైళ్లు నడపడం సాధ్యం కాదని దక్షిణమధ్య రైల్వే ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. -
హైదరాబాద్: పలు రైళ్లు తాత్కాలికంగా రద్దు
సాక్షి, హైదరాబాద్: నగరంలో పలు ఎంఎంటీఎస్‌లు, దూర ప్రాంతాలకు మధ్య నడిచే ప్యాసింజర్ రైళ్లు తాత్కాలికంగా రద్దు అయ్యాయి. మరమ్మతుల పనుల కారణంగానే దక్షిణ మధ్య రైల్వే ఈ నిర్ణయం తీసుకుంది. నేడు(బుధవారం),రేపు(గురువారం) నడిచే ప్యాసింజర్ రైళ్లు కూడా రద్దు చేసిన దక్షిణ మధ్య రైల్వే. ప్యాసింజర్ రైళ్లలో.. విజయవాడ-భద్రాచలం రోడ్, భద్రాచలం రోడ్-విజయవాడ, సికింద్రాబాద్-వరంగల్, వరంగల్-సికింద్రాబాద్ సర్వీసులు ఉన్నాయి. అలాగే.. ఎంఎంటీఎస్ రైళ్ల వివరాలకొస్తే.. లింగంపల్లి-హైదరాబాద్, హైదరాబాద్-లింగంపల్లి, ఫలక్‌నుమా-లింగంపల్లి లింగంపల్లి-ఫలక్‌నుమా ఆర్సీ పురం-ఫలక్‌నుమా ఫలక్‌నుమా-ఆర్సీ పురం ఫలక్‌నుమా-హైదరాబాద్‌ల మధ్య ఎంఎంటీఎస్ సర్వీసులు రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది దక్షిణ మధ్య రైల్వే. రెండురోజుల పాటు ఈ అంతరాయం కొనసాగుతుందని ట్విటర్ ద్వారా స్పష్టం చేసింది దక్షిణ మధ్య రైల్వే. Cancellation of Passenger and MMTS Trains pic.twitter.com/RuX3ewtDG2 — South Central Railway (@SCRailwayIndia) January 11, 2023 -
Hyderabad: ద్విచక్ర వాహనాలే టాప్.. మెట్రోకు ఆదరణ అంతంతే !
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ పరిధిలో ఇప్పటికీ ప్రజా రవాణాలో సింహభాగం వాటా ద్విచక్ర వాహనాలదే కావడం విశేషం. నిత్యం సిటీలో వ్యక్తిగత వాహనాలపై రాకపోకలు సాగించే వారు 39 శాతం ఉండగా.. బస్సుల్లో జర్నీ చేసే వారు 34 శాతం ఉన్నారు. ఇక ఆటోలు, క్యాబ్‌ల్లో రాకపోకలు సాగించేవారు 17 శాతం మంది.. మెట్రో, ఎంఎంటీఎస్ రైళ్లలో జర్నీ చేసేవారు కేవలం 10 శాతం మించకపోవడం గమనార్హం. నగరంలో కాలుష్యాన్ని, కర్బన ఉద్గారాల కాలుష్యాన్ని గణనీయంగా తగ్గిస్తున్నప్పటికీ ఆశించిన స్థాయిలో మెట్రో ప్రజల ఆదరణను చూరగొనలేకపోయింది. ఇవే శాపం.. ► నగర మెట్రో నిర్మాణ, నిర్వహణ వ్యయాలు తడిసి మోపెడవుతున్నాయి. ఒక కిలోమీటరు మేర ఎలివేటెడ్ మెట్రో మార్గాన్ని ఏర్పాటు చేయాలంటే సుమారు రూ.272 కోట్లు వ్యయం చేయాల్సి ఉంది. ప్రస్తుతం నగర మెట్రో నిత్యం రూ.కోటి నష్టంతో నెట్టుకొస్తోంది. మెట్రో డిపోలు, స్టేషన్లు, రైళ్ల నిర్వహణ, ఉద్యోగుల జీతాలు, సాంకేతిక నష్టాలను అరికట్టేందుకు ఎక్కువ వ్యయం చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ► ఇక రెండో దశ మెట్రో ఏర్పాటుకు అవసరమైన రూ.8,400 కోట్లు కేటాయించాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల కేంద్రాన్ని కోరింది. ఆ స్థాయిలో నిధులు విడుదల చేసే పరిస్థితులో అటు కేంద్రం.. ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు లేవని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నగరంలో రెండో దశ మెట్రో మార్గాన్ని పబ్లిక్– ప్రైవేటు భాగస్వామ్యంలో చేపట్టేందుకు ఏ సంస్థ ముందుకొస్తుందన్న అంశంపై పలు అనుమానాలు నెలకొంటున్నాయి. మెట్రోతో కాలుష్యం తగ్గిందిలా.. ► గతేడాది సరాసరి లెక్కను పరిశీలిస్తే సుమారు 3.8 కోట్ల కిలోల కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలు నగర వాతావరణంలో చేరకుండా మెట్రో నివారించడం విశేషం. నగర మెట్రో రైళ్లు విద్యుత్ ఆధారంగా పని చేస్తున్న విషయం విదితమే. స్టేషన్లలో విద్యుత్ అవసరాలకు సౌర విద్యుత్‌ను విరివిగా వినియోగిస్తున్నారు. మెట్రో రైళ్లు గతేడాది సుమారు 1.6 కోట్ల లీటర్ల ఇంధనాన్ని సైతం ఆదా చేసినట్లు మెట్రో వర్గాలు తెలిపాయి. ► మూడు బోగీలుండే మెట్రో రైలులో ఏకకాలంలో 975 మంది ప్రయాణించవచ్చు. ఇక కాలుష్య ఉద్గారాల విషయానికి వస్తే 30 కిలోమీటర్లు మెట్రోలో జర్నీ చేస్తే కేవలం 190 కిలోల కార్బన్ డయాక్సైడ్ కాలుష్యం విడుదల అవుతుంది. అదే బస్సులో కేవలం 50 మంది ప్రయాణించవచ్చు. కాగా.. ఒక మెట్రో రైలులో ప్రయాణించేవారి సంఖ్య 20 సిటీ బస్సులతో సమానం. వీటిలో జర్నీ చేస్తే ఏకంగా 405 కిలోల కార్బన్ డయాక్సైడ్ విడుదలై పర్యావరణ హననం జరుగుతోంది. ► ద్విచక్ర వాహనంపై ఇద్దరు జర్నీ చేసే వీలుంది. సుమారు 975 మంది జర్నీ చేయాలంటే 488 వాహనాలు అవసరం. వీటిపై 30 కిలోమీటర్లు జర్నీ చేస్తే 730 కిలోల సీఓ 2 కాలుష్యం విడుదల అవుతుంది. కారులో నలుగురు వ్యక్తులు జర్నీ చేయవచ్చు. 975 మంది 30 కి.మీ మేర జర్నీ చేసేందుకు 244 కార్లు అవసరం అవుతాయి. ఇన్ని కార్లలో జర్నీ చేస్తే ఏకంగా 1200 కిలోల కార్బన్ డయాక్సైడ్ విడుదలవుతుందని కాలుష్య నియంత్రణ మండలి లెక్కలు చెబుతున్నాయి. అంటే బస్సు, కారు, ద్విచక్రవాహనాలతో సిటీ కిక్కిరిసిపోయి.. పొగచూరుతుండగా.. మెట్రోతో కాలుష్యం గణనీయంగా తగ్గుముఖం పడుతున్నట్లు ఈ లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. (క్లిక్ చేయండి: పంజాగుట్ట టు శంషాబాద్.. సిగ్నల్ ఫ్రీ) -
ప్రయాణికులకు చుక్కలు చూపిస్తున్న హైదరాబాద్ ఎంఎంటీఎస్ రైళ్లు
సాక్షి, సిటీబ్యూరో : ఎంఎంటీఎస్ రైళ్లు ప్రయాణికులకు చుక్కలు చూపిస్తున్నాయి. ఈ రైళ్ల కోసం ప్రయాణికులు గంటల తరబడి పడిగాపులు కాయాల్సి వస్తుంది. ట్రైన్ ఎక్కిన తరువాత కూడా ఏ సమయానికి గమ్యం చేరుకుంటారో తెలియని పరిస్థితి నెలకొంది. ఒకప్పుడు సమయపాలనలో నెంబర్ వన్‌గా నిలిచిన ఎంఎంటీఎస్ రైళ్లు ఇప్పుడు అట్టర్‌ప్లాప్ అయ్యాయి. మరోవైపు సరీ్వసుల సంఖ్యను సైతం భారీగా తగ్గించడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రధాన రైళ్ల నిర్వహణ కోసం ఎంఎంటీఎస్ రైళ్లను నిలిపివేస్తున్నారు. దీంతో ఈ సరీ్వసుల నిర్వహణలో తీవ్ర నిర్లక్ష్యం కనిపిస్తోంది. ప్రతి సర్వీసు ఆలస్యమే... ‘రాజధాని ఎక్స్‌ప్రెస్ కంటే ఎంఎంటీఎస్‌కే అత్యధిక ప్రాధాన్యతనివ్వాలనే’ లక్ష్యంతో ప్రారంభించిన ఈ లోకల్ రైళ్ల సేవలు క్రమంగా మసకబారుతున్నాయి. కోవిడ్ ప్రభావంతో కుదేలైన ఎంఎంటీఎస్ వ్యవస్థను పునరుద్ధరించి ఏడాది దాటినా ఇప్పటికీ ఈ రైళ్ల నిర్వహణ పట్టాలెక్కకపోవడం గమనార్హం. ఉదయం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఈ రైళ్లు అందుబాటులో ఉంటాయి. కానీ ప్రతి సరీ్వసు అరగంట నుంచి గంట వరకు ఆలస్యంగా నడుస్తున్నట్లు ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకప్పుడు ప్రభుత్వ, ప్రైవేట్ రంగంలో పని చేసే ఉద్యోగులు, సాఫ్ట్వేర్ నిపుణులు ఎంఎంటీఎస్‌ను నమ్ముకొని ప్రయాణం చేశారు. ఇప్పుడు ఉద్యోగ వర్గాలకు చెందిన వేలాది మంది ఈ సరీ్వసులకు దూరమయ్యారు. కేవలం సమయపాలన లేకపోవడం వల్లనే ఎంఎంటీఎస్‌లో ప్రయాణించలేకపోతున్నట్లు బాలకిషన్ అనే సాఫ్ట్వేర్ ఉద్యోగి తెలిపారు.‘మధ్యాహ్నం 3 గంటలకు ఒక ట్రైన్ లింగంపల్లి నుంచి ఫలక్‌నుమాకు బయలుదేరితే సాయంత్రం 4.30 వరకు మరో ట్రైన్ అందుబాటులో ఉండదు. పైగా ఏ రైలు ఎక్కడ ఆగిపోతుందో తెలియదు.’ అని శేఖర్ అనే మరో ప్రయాణికుడు తెలిపారు.ఏదో ఒక విధంగా బేగంపేట్ వరకు చేరినా అక్కడి నుంచి సికింద్రాబాద్‌కు రావడానికే అరగంట కంటే ఎక్కువ సమయం పడుతుంది. దీంతో లింగంపల్లి నుంచి సికింద్రాబాద్‌కు గంటలో చేరుకోవలసి ఉండగా ఒక్కోసారి గంటన్నర నుంచి రెండు గంటల సమయం పడుతుంది. భారీగా ట్రిప్పుల రద్దు.. కోవిడ్‌కు ముందుకు ప్రతి రోజు 121 సరీ్వసులు నడిచాయి. ఫలక్‌నుమా–సికింద్రాబాద్–లింగంపల్లి, ఫలక్‌నుమా–నాంపల్లి–లింగంపల్లి మధ్య ప్రతి రోజు 1.6 లక్షల మంది ప్రయాణం చేశారు. కోవిడ్ అనంతరం 75 నుంచి 100 సర్వీసులను పునరుద్ధరించారు. కానీ నిర్వహణలో నిర్లక్ష్యం, సరైన సమయపాలన లేకపోవడం వల్ల ఈ రైళ్లపైన ప్రయాణికులు నమ్మకం కోల్పోయారు. దీంతో రైళ్ల సంఖ్య తగ్గింది. శని, ఆదివారాల్లో గంటకు ఒక రైలు కూడా అందుబాటులో ఉండడం లేదు. ప్రతి వారం 34 రైళ్లను రద్దు చేస్తున్నట్లు చెబుతున్నారు. కానీ అందుబాటులో ఉండే రైళ్ల సంఖ్య చాలా తక్కువ. సికింద్రాబాద్‌పై ఒత్తిడి.. మరోవైపు ఎంఎంటీఎస్‌కు ప్రత్యేక లైన్ లేకపోవడం వల్ల ప్రధాన రైళ్ల రాకపోకలతో ఈ రైళ్లకు బ్రేకులు పడుతున్నాయి. సికింద్రాబాద్, కాచిగూడ, నాంపల్లి స్టేషన్లలో పండుగ రద్దీ కారణంగా రెండు రోజులుగా ప్లాట్‌ఫామ్‌లపై ఒత్తిడి పెరిగింది. దీంతో ఎంఎంటీఎస్‌లు నిలిపేందుకు అవకాశం లేకపోవడంతో తీవ్రమైన జాప్యం నెలకొంటుందని రైల్వే అధికారి ఒకరు తెలిపారు. -
సాంకేతిక లోపంతో ఆగిపోయిన ఎంఎంటీఎస్ లోకల్ ట్రైన్
-
హైదరాబాద్: 34 ఎమ్ఎమ్టీఎస్ రైళ్లు రద్దు
సాక్షి, హైదరాబాద్: నిర్వహణ సమస్యల కారణంగా ఆదివారం 34 ఎంఎంటీఎస్ రైలు సర్వీసులను రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. లింగంపల్లి-ఫలక్‌నుమా రూట్లో 9 సర్వీసులు, హైదరాబాద్-లింగంపల్లి రూట్లో 9 సర్వీసులు, ఫలక్‌నుమా-లింగంపల్లి రూట్లో 7, లింగంపల్లి ఫలక్‌నుమా రూట్ 7, సికింద్రాబాద్-లింగంపల్లి రూట్లో ఒక్క సర్వీస్, లింగంపల్లి-సికింద్రాబాద్ రూట్లో ఒక్క సర్వీసు రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. -
Secunderabad Railway Station: సాఫీగా రైలు కూత!
సాక్షి, హైదరాబాద్/రాంగోపాల్‌పేట్: ఆర్మీ అభ్యర్థులు సృష్టించిన విధ్వంసం నుంచి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పూర్తిగా తేరుకుంది. శుక్రవారం రాత్రే రైళ్ల రాకపోకలను పునరుద్ధరించిన అధికారులు.. శనివారం చాలా వరకు రైళ్ల రాకపోకలను యథాతథంగా కొనసాగించారు. దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఆందోళనలు, లింక్ రైళ్లు నడవకపోవడం వంటి ఇబ్బందులో కొన్ని రైళ్లను రద్దు చేశారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో శనివారం ప్రయాణికుల రద్దీ సాధారణంగానే కనిపించింది. మరోవైపు ప్రయాణికుల భద్రత, రైల్వే ఆస్తుల రక్షణ దృష్ట్యా ఆర్పీఎఫ్, జీఆర్పీ, ఆర్ఏఎఫ్ బలగాలు, పోలీసులతో కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. రైల్వేస్టేషన్ రెండు వైపులా సాయుధ సిబ్బందితో కాపలా ఏర్పాటు చేసి, అందరినీ పూర్తిగా తనిఖీ చేశాకే ప్లాట్‌ఫామ్‌లపైకి అనుమతిస్తున్నారు. మరికొద్ది రోజులు ఇబ్బందులు శుక్రవారం నాటి ఘటనతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి పెద్ద సంఖ్యలో రైళ్లు రద్దయిన విషయం తెలిసిందే. సాధారణంగా రైళ్ల నిర్వహణ జతలుగా ఉంటుంది. ఒకవైపు నుంచి మరోవైపు రైలు వెళితేనే మళ్లీ అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు సర్వీసులు కొనసాగుతాయి. ఒక దగ్గరే నిలిచిపోతే అంతరాయం ఏర్పడుతుంది. శుక్రవారం ఇలా రైళ్లు ఆగిపోవడంతో.. శనివారం కూడా పలు రైళ్లను నడపలేకపోయారు. ఇక విశాఖపట్నం మీదుగా ఉత్తరాదికి వెళ్లే మార్గంలో ఏర్పడ్డ ఆటంకాలతో మరికొన్ని రైళ్లు రద్దయ్యాయి. ఈ కారణాలతో వచ్చే మూడు నాలుగు రోజులపాటు కూడా పలు రైళ్లకు ఆటంకం కొనసాగనున్నట్టు రైల్వే అధికారులు తెలిపారు. ఈ నెల 21వ తేదీ వరకు కొన్ని రైళ్లను రద్దు చేస్తూ దక్షిణ మధ్య రైల్వే శనివారం రాత్రి ప్రకటన వెలువరించింది. శనివారం 18 సాధారణ రైళ్లు, సిటీలో నడిచే 40 ఎంఎంటీఎస్ రైళ్లను రద్దు చేయగా.. ఆదివారం ఐదు రైళ్లను.. సోమ, మంగళవారాల్లో ఒక్కో రైలు రద్దయినట్టు ప్రకటించింది. రాకపోకలకు ఆటంకాలతో ఏర్పడ్డ రద్దీ నేపథ్యంలో 19న రెండు ప్రత్యేక రైళ్లను నడపనున్నారు. పార్శిళ్లకు నష్ట పరిహారం ఆందోళనకారుల విధ్వంసంలో నష్టపోయిన పార్శిళ్లకు రైల్వే నుంచి నష్టపరిహారం అందిస్తామని అధికారులు తెలిపారు. అయితే పార్శిల్‌ను బుకింగ్ చేసుకునే సమయంలో పేర్కొన్న విలువ మేరకు నష్ట పరిహారం ఇస్తామని వెల్లడించారు. వేగంగా మరమ్మతులు.. ఆందోళనకారుల చేతిలో ధ్వంసమైన పరికరాలు, మౌలిక వసతులకు రైల్వే అధికారులు మరమ్మతులు చేపట్టారు. ట్యూబ్‌లైట్లు, సీసీ కెమెరాలు, ఫ్యాన్లు కొత్తవి బిగిస్తున్నారు. పగిలిన సిమెంటు బెంచీలకు మరమ్మతులు చేయిస్తున్నారు. విధ్వంసంలో దెబ్బతిన్న దుకాణాలను నిర్వాహకులు పునరుద్ధరించుకున్నారు. రద్దయిన, షెడ్యూల్ మారిన రైళ్లు ఇవీ.. ► భువనేశ్వర్–సికింద్రాబాద్, త్రివేండ్రం సెంట్రల్–సికింద్రాబాద్, దర్బంగా–సికింద్రాబాద్, షాలీమార్–సికింద్రాబాద్ తదితర రైళ్లను అధికారులు రద్దు చేశారు. ► ఆదివారం సికింద్రాబాద్–షాలిమార్ (ఉదయం 4.20), కాచిగూడ–నర్సాపూర్ (రాత్రి 11 గంటలకు) మధ్య ప్రత్యేక రైళ్లను నడుపుతున్నారు. సికింద్రాబాద్–దానాపూ ర్, సికింద్రాబాద్–రాజ్‌కోట్, సికింద్రాబాద్–విశాఖపట్నం ఎక్స్‌ప్రెస్‌లను సమయా లను రీషెడ్యూల్ చేసి నడుపుతున్నారు. నేడూ ఎంఎంటీఎస్ రైళ్లు రద్దు సికింద్రాబాద్ ఘటన నేపథ్యంలో శుక్రవారం నుంచి ఎంఎంటీఎస్ రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. శనివారం కూడా పలు మార్గాల్లో ఎంఎంటీఎస్‌లను రద్దు చేశారు. ఆదివారం కూడా ఫలక్‌నుమా–సికింద్రాబాద్–లింగంపల్లి, నాంపల్లి–లింగంపల్లి, సికింద్రాబాద్–లింగంపల్లి, ఫలక్‌నుమా–నాంపల్లి–లింగంపల్లి తదితర రూట్లలో నడిచే రైళ్లను రద్దు చేస్తున్నట్టు అధికారులు తెలిపారు. -
ఎంఎంటీఎస్ ప్రయాణికులకు గుడ్‌న్యూస్
సాక్షి, హైదరాబాద్: అతి తక్కువ చార్జీలతో ప్రయాణికులకు రవాణా సదుపాయాన్ని అందజేస్తున్న ఎంఎంటీఎస్ రైళ్లలో మరో సదుపాయాన్ని కల్పించారు. ఫస్ట్‌క్లాస్ చార్జీలను 50 శాతం తగ్గించనున్నట్లు దక్షిణమధ్య రైల్వే ప్రకటించింది. ఇవి ఈ నెల 5 నుంచి అమల్లోకి రానున్నాయి. గ్రేటర్లో సబర్బన్ రైలు సర్వీసుగా సేవలందజేస్తున్న ఎంఎంటీఎస్‌లో ఫస్ట్ క్లాస్‌లో ప్రతి సింగిల్ రూట్ ప్రయాణంలో ఈ రాయితీ వర్తిస్తుందని ద.మ.రైల్వే ఇన్చార్జి జనరల్ మేనేజర్ అరుణ్‌కుమార్ జైన్ తెలిపారు. ఈ మేరకు గ్రేటర్‌లోని సికింద్రాబాద్– లింగంపల్లి, ఫలక్‌నుమా– సికింద్రాబాద్– లింంగంపల్లి–రామచంద్రాపురం, నాంపల్లి– లింగంపల్లి– రామచంద్రాపురం, ఫలక్‌నుమా– నాంపల్లి– లింగంపల్లి– రామచంద్రాపురం నుంచి తెల్లాపూర్ వరకు 29 స్టేషన్ల మీదుగా ప్రస్తుతం 86 సర్వీసులు నడుస్తున్నాయి. (క్లిక్: పక్కాగా ప్లాన్.. కథ మొత్తం కారు నుంచే..) 50 కిలోమీటర్లకుపైగా ఎంఎంటీఎస్ సదుపాయం ఉంది. రోజుకు సుమారు లక్ష మంది రాకపోకలు సాగిస్తున్నారు. వీరిలో ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులు, సాఫ్ట్వేర్ నిపుణులు, తదితర సుమారు 30 శాతం రెగ్యులర్ ప్రయాణికులకు ప్రయోజనం కలుగుతుంది. కొంతకాలంగా ఎంఎంటీఎస్ ప్రయాణికుల సంఖ్య పెరుగుతోందని, ఫస్ట్‌క్లాస్ ప్రయాణికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ( ఏదీ నిఘా.. ఉత్తుత్తి చర్యగా మారిన లైసెన్స్ రద్దు) -
ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. అరగంటకో ఎంఎంటీఎస్
సాక్షి, హైదరాబాద్: ఎంఎంటీఎస్ సర్వీసుల సంఖ్య పెరిగింది. ప్రయాణికుల రద్దీకనుగుణంగా ప్రతి అరగంటకో రైలు చొప్పున అందుబాటులోకి రానుంది. మొదట్లో కోవిడ్ కారణంగా ఎంఎంటీఎస్ రైళ్లను రద్దు చేశారు. ఆ తర్వాత పునరుద్ధరించినప్పటికీ ప్రయాణికుల ఆదరణ లేకపోవడంతో సర్వీసులు రద్దయ్యాయి. కొద్దిరోజులుగా నగరంలోని అన్ని మార్గాల్లో ప్రయాణికుల రద్దీ పెరగడంతో ఎంఎంటీఎస్ సర్వీసులను గణనీయంగా పెంచారు. ఐటీ సంస్థలు చాలా వరకు పునరుద్ధరించడంతో నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి హైటెక్ సిటీకి రాకపోకలు సాగించే సాఫ్ట్వేర్ నిపుణులు, ఐటీ ఉద్యోగుల రద్దీ పెరిగింది. ప్రయాణికుల డిమాండ్ మేరకు సర్వీసులను పెంచినట్లు దక్షిణమధ్య రైల్వే ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. మరోవైపు ఎంఎంటీఎస్ రైళ్ల నిర్వహణపై ఇన్చార్జి జనరల్ మేనేజర్ అరుణ్‌కుమార్ జైన్ సైతం ప్రత్యేక దృష్టి సారించారు. అతి తక్కువ చార్జీలతో రవాణా సదుపాయాన్ని అందజేసే ఎంఎంటీఎస్ సర్వీసులను ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అర్ధరాత్రి వరకూ సర్వీసులు.. కోవిడ్ కారణంగా రద్దు చేసిన ఎంఎంటీఎస్ రైళ్ల సమయపాలనను కూడా పునరుద్ధరించారు. ఇక నుంచి తెల్లవారుజామున 4.30 గంటల నుంచి అర్ధరాత్రి 12.30 గంటల వరకు ఎంఎంటీఎస్ రైళ్లు నడుస్తాయి. గతేడాది జూన్ 21 నుంచే దశలవారీగా ఎంఎంటీఎస్ రైళ్లను ప్రవేశపెట్టారు. కొన్ని రూట్లలో ప్రయాణికుల డిమాండ్ లేకపోవడంతో తరచూ సర్వీసులను రద్దు చేశారు. ప్రస్తుతం పెరిగిన రద్దీని దృష్టిలో ఉంచుకొని యథావిధిగా అర్ధరాత్రి వరకూ నడపాలని అధికారులు నిర్ణయించారు. ► ప్రస్తుతం ప్రతి రోజు 86 సర్వీసులు నడుస్తున్నాయి. ఫలక్‌నుమా నుంచి సికింద్రాబాద్ వరకు, నాంపల్లి నుంచి లింగంపల్లి వరకు, లింగంపల్లి మీదుగా తెల్లాపూర్ నుంచి రామచంద్రాపురం వరకు 29 రైల్వే స్టేషన్లను కవర్ చేస్తూ 50 కిలోమీటర్లకు పైగా సర్వీసులను విస్తరించారు. చార్జీలు తక్కువ... ►ప్లాట్‌ఫాం చార్జీల కంటే తక్కువ చార్జీలతో ఎంఎంటీఎస్ సదుపాయం లభించనుంది. సాధారణంగా సిటీ బస్సుల్లో సికింద్రాబాద్ నుంచి లింగంపల్లి వరకు రూ.40 వరకు చార్జీ ఉంటే ఎంఎంటీఎస్ రైళ్లలో కేవలం రూ.15. బస్సులు, ఆటోలు, క్యాబ్‌లు తదితర వాహనాల కంటే తక్కువ చార్జీలతో ఎక్కువ వేగంతో నగరం నలువైపులా అందుబాటులో ఉన్న సర్వీసులను వినియోగించుకోవాలని జనరల్ మేనేజర్ కోరారు. టికెట్ బుకింగ్ కౌంటర్లతో పాటు ఆటోమేటిక్ టికెట్ వెండింగ్ మెషిన్లు, యూటీఎస్ మొబైల్ యాప్ ద్వారా కూడా టికెట్లను తీసుకోవచ్చని పేర్కొన్నారు. -
హైదరాబాద్: ఎంఎంటీస్ రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్
సాక్షి, హైదరాబాద్: జంట నగరాల ప్రజలకు మరో గుడ్‌న్యూస్. దక్షిణ మధ్య రైల్వే ఎంఎంటీస్ రైళ్ల పునరుద్ధరణపై కీలక ప్రకటన చేసింది. ఏప్రిల్ 11వ తేది నుంచి నగరంలో మరో 86 ఎంఎంటీస్ రైళ్లను నడుపుతున్నట్టు తెలిపింది. అలాగే రైళ్ల రాకపోకల సమయాల్లో పలు మార్పులు చేసినట్టు పేర్కొంది. తాజాగా ఉదయం 4.30 నుంచి రాత్రి 12.30 రైళ్లు రాకపోకలు సాగించనున్నట్టు స్పష్టం చేసింది. The popular suburban transport services in the twin cities providing affordable and convenient travel option. 86 #MMTS services running as on 11th April, 2022 between Falaknuma - Lingampalli - Hyderabad- Secunderabad @drmsecunderabad @drmhyb pic.twitter.com/dsVrdrGrVW — South Central Railway (@SCRailwayIndia) April 13, 2022 అయితే, గతంతో ఉదయం 6 నుండి రాత్రి 11.45 వరకు రాకపోకలు రైళ్లు నడిచేవి. అలాగే, సీజనల్ టికెట్స్‌ను సైతం సౌత్ సెంట్రల్ రైల్వే మళ్ళీ అందుబాటులో తీసుకువచ్చింది. #MMTS #TwinCities Secunderabad to Hyderabad; Secunderabad - Lingampalli - Secunderabad; Falaknuma to Hyderabad & Falaknuma - Ramchandrapuram - Falaknuma @drmsecunderabad @drmhyb pic.twitter.com/dgCiB1bQmQ — South Central Railway (@SCRailwayIndia) April 14, 2022 -
2018 నాటికే ప్రారంభం అన్నారు.. నాలుగేళ్లవుతున్నా ఊసే లేదు!
సాక్షి, ఘట్కేసర్: ఎంఎంటీఎస్ (మల్టీ మోడల్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్) సేవల విస్తరణలో భాగంగా 2వ దశలో సికింద్రాబాద్ నుంచి ఘట్కేసర్ వరకు పొడగించాలని 2012లో ప్రతిపాదన చేశారు. 2013లో పనులు ప్రారంభించి మౌలాలి–ఘట్కేసర్ మధ్య ఉన్న 12.20 కిలోమీటర్ల దూరంలో ట్రాక్ నిర్మాణం, విద్యుద్దీకరణ పనులు చేపట్టారు. ఒప్పందం ప్రకారం కేంద్రం 1/3, రాష్ట్ర ప్రభుత్వం 2/3 నిధులతో పనులు చేపట్టాలి. గతంలో ఘట్కేసర్లో ఎంఎంటీఎస్ పనులు పరిశీలించిన దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ వినోద్‌కుమార్ 2018 డిసెంబర్ నాటికి ఎంఎంటీఎస్ రైళ్లను నడపనున్నట్లు ప్రకటించారు. కాని మూడేళ్లయినా ఎంఎంటీఎస్ రైళ్లు నడిపించడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం తన వాటా నిధులు కేటాయించకపోవడంతోనే ఎంఎంటీఎస్ రైళ్లు ఆలస్యం అవుతున్నట్లు రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్, మంత్రి కిషన్‌రెడ్డి ఇటీవల ప్రకటించారు. ఘట్కేసర్లో ఎంఎంటీఎస్ ప్లాట్‌ఫాం నిరాశలో స్థానికులు.. ఎంఎంటీఎస్ రైళ్ల రాకతో తక్కువ సమయం.. తక్కువ వ్యయంతో నగరానికి చేరుకోవచ్చని భావించిన విద్యార్థు«లు, ఉద్యోగులు, మధ్యతరగతి ప్రజలు నిరాశ చెంతుతున్నారు. రైళ్లు పెరిగితే ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని.. ఎక్స్‌ప్రెస్ రైళ్లను ఆపుతారని భావించారు. ప్రజలు సికింద్రాబాద్‌కు వెళ్లాలంటే 25 కిలోమీటర్లు దూరం ట్రాఫిక్ బాధను భరించలేక రైలు ప్రయాణాన్ని కోరుకుంటున్నారు. బస్సులోనైతే గంటన్నర సమయం పడుతుండగా రైలులో కేవలం 35 నిమిషాల్లోనే సికింద్రాబాద్‌కు చేరుకోవచ్చు. చదవండి: కూతురి మరణం జీర్ణించుకోలేకే.. నిందితుడిని కాల్చి చంపారా? ఎంఎంటీఎస్ రాకతో మరింత అభివృద్ధి.. స్థానికంగా ఇన్ఫోసిస్, రహేజా తదితర అంతర్జాతీయ వ్యాపార సంస్థలు, కొత్త కాలనీలు వెలుస్తున్నందున ఎంఎంటీఎస్ రాకతో మరింత అభివృద్ధి చెందడమే కాకుండా ఎంఎంటీఎస్ రైళ్ల రాకతో యంనంపేట్, ఇస్మాయిల్‌ఖాన్‌గూడ పరిధిలో రైల్వే స్టేషన్లు ఏర్పడి రవాణ సౌకర్యం మెరుగు పడుతుంది. సంబంధిత అధికారులు స్పందించి ఎంఎంటీఎస్ రైళ్ల రాకపోకులకు ఏమైనా పెండింగ్ పనులు ఉంటే యుద్ధప్రాతిపదికన పూర్తి చేసి ప్రజలకు అందుబాటలోకి తేవాలని కోరుతున్నారు. ఎంఎంటీఎస్ బండి.. ఎంతకాలం ఆగాలండి.! మేడ్చల్‌రూరల్: సికింద్రాబాద్ నుంచి మేడ్చల్ వరకు ఎంఎంటీఎస్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చి పనులు చేపట్టింది. ఈ పనులు చేపట్టి ఏళ్లు గడిచినా మేడ్చల్ ప్రజలకు నేటికి ఎంఎంటీఎస్ కల నెరవేరలేదు. మేడ్చల్ రైల్వే స్టేషన్లో ఎంఎంటీఎస్ కోసం ఏర్పాటు చేసిన కొత్త ట్రాక్ సికింద్రాబాద్ – బొల్లారం – మేడ్చల్ సికింద్రాబాద్ నుంచి బొల్లారం మీదుగా మేడ్చల్‌కు ఎంఎంటీఎస్ రైళ్లు నడపాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం వందల కోట్ల నిధులు కేటాయించి పనులను ప్రారంభించింది. దీంతో మేడ్చల్ వరకు ప్రత్యేక రైల్యే ట్రాక్, విద్యుత్ లైన్, నూతన ప్లాట్ఫార్మ్ నిర్మాణ పనులను చేపట్టారు. ప్రారంభం కాని రెండోదశ పనులు.. ఏళ్ల పాటు సాగిన పనులకు కరోనా అడ్డంకిగా మారింది. అదేవిధంగా అధికారుల అలసత్వం వల్ల నేటికి పనులు పూర్తి కాక మరింత ఆలస్యం అవుతోంది. ప్రస్తుతం కరోనా విపత్కర పరిస్థితులు తొలగినా ఎంఎంటీఎస్ రెండో దశ పనులు మాత్రం ప్రారంభం కాలేదు. వీటికి తోడు నిధుల లేమి కూడా కారణంగా మారడంతో ఎక్కడి పనులను అక్కడే నిలిచిపోయాయి. ఢిల్లీకి వెళ్లి అనుమతి తెచ్చి.. మేడ్లల్ పట్టణంలోని మేడ్చల్ – గిర్మాపూర్, గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని కండ్లకోయ – గుండ్లపోచంపల్లి రోడ్డులో రైల్వే గేట్లు ఉండటంతో నిత్యం వాహనదారులకు ఇబ్బందిగా మారింది. దీంతో స్థాని క నేతలు అండర్‌పాస్‌ల ఏర్పాటు చేయాలని ఢిల్లీకి వె ళ్లి రైల్వేశాఖ మంత్రికి పరిస్థితిని వివరించారు. ఆయన ఆదేశాలతో అండర్‌పాస్‌ల నిర్మాణం చేపట్టారు. -
హైదరాబాద్: ఉందానగర్ వరకు ఎంఎంటీఎస్ రైళ్లు, జీఎమ్మార్ అంగీకరిస్తే..
సాక్షి, హైదరాబాద్: ఉందానగర్ వరకు ఎంఎంటీఎస్ రైళ్లు త్వరలో అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటివరకు లింగంపల్లి నుంచి సికింద్రాబాద్ మీదుగా ఫలక్‌నుమా వరకు పరిమితమైన ఈ సర్వీసులను ఉందానగర్‌కు విస్తరించేందుకు దక్షిణ మధ్య రైల్వే సన్నాహాలు చేస్తోంది. రెండో దశలో ఉందానగర్ నుంచి శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం వరకు మరో 6 కిలోమీటర్ల మార్గా న్ని కొత్తగా నిర్మించి ఎయిర్‌పోర్టుకు రైళ్లు నడిపేం దుకు దక్షిణమధ్య రైల్వే సిద్ధంగా ఉన్నా జీఎమ్మార్ నిరాకరించడంతో ఈ ప్రాజెక్టు నిలిచిపోయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఉందా నగర్ వరకు నడిపేందుకే అధికారులు పరిమితమ య్యారు. భవిష్యత్తులో జీఎమ్మార్ అంగీకరిస్తే, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తే అతి తక్కువ చార్జీలతో ప్రయాణికులు ఎయిర్‌పోర్టుకు చేరుకొనేలా విస్తరిం చనున్నట్లు అధికారులు తెలిపారు. సికింద్రాబాద్ నుంచి మహబూబ్‌నగర్ వరకు 95 కిలోమీటర్ల మార్గం డబ్లింగ్, విద్యుదీకరణ పనులు ఈ నెల 31 నాటికి పూర్తి కానున్నాయి. దీంతో ఉందానగర్ వరకు ఎంఎంటీఎస్‌ను పొడిగించేందుకు అవకాశం లభించింది. అలాగే సికింద్రాబాద్ నుంచి మహబూ బ్‌నగర్ వరకు ఇంటర్సిటీ సర్వీసులు నడిచే అవకా శం ఉంది. ప్రస్తుతం 8 ప్యాసింజర్ రైళ్లు మాత్రమే రాకపోకలు సాగిస్తున్నాయి. డబ్లింగ్ పూర్తయిన దృష్ట్యా మరో రెండు సర్వీసులు కొత్తగా ప్రవేశపెట్ట నున్నారు. కాగా, హైదరాబాద్ నుంచి బెంగళూర్, తిరుపతికి వెళ్లే రైళ్లు ఇకపై సికింద్రాబాద్–డోన్ మార్గంలోనూ రాకపోకలు సాగిస్తాయి. ఫలితంగా దూరంతో పాటు, కనీసం గంటకు పైగా ప్రయాణ సమయం తగ్గనుంది. -
చుక్..చుక్.. చిత్రాలెన్నో ! మారిన రైల్వేస్టేషన్ రూపు రేఖలు
సాక్క్షి, హైదరాబాద్(శేరిలింగంపల్లి): నగర శివారులోనే అతిపెద్దది అయిన లింగంపల్లి రైల్వేస్టేషన్ ఒకప్పుడు కళాహీనంగా ఉండేంది. నిత్యం ప్రయాణికులతో కళగా ఉండే ఈ స్టేషన్ ఇప్పుడు అభివృద్ధికి నోచుకుంది. స్టేషన్‌లోని గోడలకు వేసిన వివిధ చిత్రాలు వచ్చిపోయే ప్రయాణికులను ఆకర్షిస్తున్నాయి. చిత్రం చెప్పే అర్థం.. జంతువులు..పక్షులు..పర్యావరణం..స్వచ్ఛభారత్..ఇలా ఎన్నెన్నో చిత్రాలు కొలువుదీరాయి. రైల్వేస్టేషన్‌లోని ప్రతి గోడకు రకరకాల జంతువులు, పక్షులతోపాటు రాజుల కాలం నాటి వైభవాన్ని ప్రతిబింబించేలా ఆకట్టుకుంటున్నాయి. పులి, ఏనుగు, నెమలి, ఇతర పక్షుల చిత్రాలు అలరిస్తున్నాయి. గ్రామీణ వాతావరణంతోపాటు జలపాతాలు, పడవలు, సూర్యుడు ఉదయించే దృశ్యాలు ఇలా ఎన్నో చిత్రాలు ప్రయాణికుల హృదయాలను హత్తుకునేలా ఉన్నాయి. శివారులోనే అతిపెద్దది నగర శివారులోనే అతిపెద్ద రైల్వేస్టేషన్‌గా లింగంపల్లి స్టేషన్‌కు గుర్తింపు ఉంది. దేశంలోని అన్ని ప్రాంతాలకు రైళ్ల రాకపోకలు ఇక్కడి నుంచే సాగుతాయి. పలు కొత్త రైళ్లు కూడా ఇక్కడి నుంచే ఆరంభించాలనే ఆలోచన కూడా ఉంది. ఎంఎంటీఎస్ ఇక్కడి నుంచే... ఎంఎంటీఎస్ రైళ్లను నగరంలోని నాంపల్లి, సికింద్రాబాద్ ప్రాంతాలకు ఇక్కడి నుంచే బయలుదేరతాయి. దీంతో ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఐటీ కారిడార్‌కు కేంద్రంగా ఈ ప్రాంతం మారడంతో రోజురోజుకూ ప్రయాణికుల సంఖ్య పెరుగుతోంది. పలు ఐటీ సంస్థలు తమ సంస్థ ఉద్యోగుల కోసం లింగంపల్లి రైల్వేస్టేషన్‌కు ప్రత్యేక బస్సులు, ఇతర వాహనాలు సైతం నడుపుతున్నాయి. నగర శివారులోనే అతిపెద్ద రైల్వేస్టేషన్‌గా లింగంపల్లి స్టేషన్ అభివృద్ధికి నోచుకుంది -
ఎంఎంటీఎస్ రైళ్లకు మళ్లీ బ్రేక్
సాక్షి, హైదరాబాద్: నగరంలోని వివిధ ప్రాంతాల మధ్య ప్రయాణికులకు రవాణా సదుపాయాన్ని అందజేసే ఎంఎంటీఎస్ రైళ్లకు మరోసారి బ్రేక్ పడింది. ట్రాక్ నిర్వహణ, మరమ్మతుల దృష్ట్యా సోమవారం 36 రైళ్లను రద్దు చేయనున్నట్లు దక్షిణమధ్య రైల్వే ప్రకటించింది. ఫలక్‌నుమా– లింగంపల్లి, సికింద్రాబాద్– లింగంపల్లి, లింగంపల్లి– ఫలక్‌నుమా, సికింద్రాబాద్– లింగంపల్లి తదితర ప్రాంతాల మధ్య నడిచే రైళ్లు రద్దు కానున్నాయి. నిర్వహణపరమైన కారణాలతో రైళ్లను నిలిపివేస్తున్నట్లు అధికారులు చెబుతున్నప్పటికీ ప్రయాణికుల నుంచి పెద్దగా ఆదరణ లేకపోవడం, కనీస స్థాయిలో ఆదాయం లభించకపోవడం వంటి కారణాలతోనే సర్వీసులు రద్దవుతున్నాయి. గడ్డుకాలం.. తాజాగా కోవిడ్ మూడో ఉద్ధృతి మొదలైన నేపథ్యంలో ఎంఎంటీఎస్ రైళ్ల నిర్వహణ మరింత భారంగా ఉండవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. రూ.5 కనిష్ట చార్జీల నుంచి రూ.15 గరిష్ట చార్జీలతో 40 కిలోమీటర్ల వరకు రవాణా సదుపాయాన్ని అందజేసే అత్యంత చౌకైన రవాణా సర్వీసులు నగరంలో ఎంఎంటీఎస్ ఒక్కటే. రెండేళ్ల క్రితం మొదలైన కరోనా ఎంఎంటీఎస్‌కు గడ్డుకాలంగా మారింది. లా క్‌డౌన్ అనంతరం దశలవారీగా సర్వీసులను పునరుద్ధరించినప్పటికీ పెద్దగా ఆదరణ లభించడం లేదు. (చదవండి: అనాథగా సికింద్రాబాద్ వీధుల్లో.. ఏడేళ్లకు సురక్షితంగా..!) వారంలో రెండు మూడుసార్లు.. ► గతంలో సికింద్రాబాద్– లింగంపల్లి, ఫలక్ను మా– సికింద్రాబాద్, లింగంపల్లి– ఫలక్‌నుమా, నాంపల్లి– లింగంపల్లి తదితర రూట్లలో ప్రతిరోజూ 121 సర్వీసులు నడిచేవి. రోజుకు 1.5 లక్షల మంది రాకపోకలు సాగించేవారు. కోవిడ్ వల్ల ఏడాది పాటు సర్వీసులను నిలిపివేశారు. గతేడాది మొదట్లో 25 సర్వీసులతో పునరుద్ధరణ మొదలుపెట్టి దశలవారీగా ప్రస్తుతం 79 కి పెంచారు. (చదవండి: హైదరాబాద్‌లో అమెజాన్ సొంత క్యాంపస్.. అదిరిపోయే సౌకర్యాలు) ► ప్రయాణికుల ఆదరణ లేకపోవడంతో వారంలో రెండు మూడు సార్లు కనీసం 20 నుంచి 25 సర్వీసులు రద్దవుతున్నాయి. ప్రస్తుతం సగానికి సగం అంటే 36 సర్వీసులను సోమవారం ఒక్కరోజే రద్దు చేయనున్నారు. సాధారణంగా సికింద్రాబాద్– లింగంపల్లి మార్గంలో ప్రయాణికులు రాకపోకలు ఎక్కువగా సాగిస్తుంటారు. కోవిడ్ మూడో ఉద్ధృతితో అనేక ప్రైవేట్ సంస్థలు, ఐటీ సంస్థలు తిరిగి వర్క్‌ఫ్రం హోమ్‌కు అవకాశం కల్పించాయి. దీంతో ఈ మార్గంలో రాకపోకలు తగ్గుముఖం పట్టాయి. -
అయ్యో!.. ఎంఎంటీఎస్ రైలు ఎవరెక్కడం లేదా?
సాక్షి, హైదరాబాద్: ప్రయాణికులు లేక ఎంఎంటీఎస్ రైళ్లు వెలవెలబోతున్నాయి. కరోనా సంక్షోభం తర్వాత ఈ రైళ్లను పునరుద్ధరించి 45 రోజులు దాటినప్పటికీ ప్రయాణికుల ఆదరణ కనిపించడం లేదు. రోజుకు 30 వేల మంది కూడా ఎంఎంటీఎస్ సేవలను వినియోగించుకోవడం లేదు. సాధారణ రోజుల్లో 1.6 లక్షల మంది రాకపోకలు సాగించగా ఇప్పుడు మూడొంతుల మంది ఎంఎంటీఎస్‌కు దూరమయ్యారు. ఆర్టీసీ బస్సులు, మెట్రో రైళ్ల కంటే అతి తక్కువ చార్జీలతో ప్రయాణికులకు రవాణా సదుపాయాన్ని అందజేసే ఎంఎంటీఎస్ సర్వీసులపైన పునరుద్ధరణ అనంతరం పెద్దగా ప్రచారం లేకపోవడం వల్ల ప్రయాణికుల వినియోగం పెరగడం లేదు. మరోవైపు కోవిడ్ నేపథ్యంలో గతేడాది నుంచి ఐటీ రంగం పునరుద్ధరణకు నోచకపోవడం వల్ల వివిధ మార్గాల్లో ప్రయాణాలు తగ్గుముఖం పట్టాయి. సికింద్రాబాద్–లింగంపల్లి, ఫలక్‌నుమా–లింగంపల్లి, నాంపల్లి–లింగంపల్లి, ఫలక్‌నుమా–లింగంపల్లి స్టేషన్ల మధ్య ప్రస్తుతం 45 నుంచి 50 ఎంఎంటీఎస్ సరీ్వసులు రాకపోకలు సాగిస్తున్నాయి. ఈ రైళ్లలో సగం వరకు ప్రయాణికులు లేక ఖాళీగా తిరుగుతున్నట్లు రైల్వే అధికారులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. 16 నెలల తర్వాత పట్టాలపైకి.. కోవిడ్ నేపథ్యంలో గతేడాది మార్చి 22వ తేదీన నగరంలోని వివిధ మార్గాల్లో నడిచే 121 ఎంఎంటీఎస్ రైళ్లు నిలిచిపోయాయి. దేశంలోని ఇతర మెట్రోపాలిటన్ నగరాల్లో లోకల్ రైళ్లను చాలా రోజుల క్రితమే పునరుద్ధరించినప్పటికీ హైదరాబాద్‌లో మాత్రం ఈ ఏడాది జూన్ 22వ తేదీన పునరుద్ధరించారు. 2003లో ఈ రైళ్లను ప్రారంభించిన అనంతరం మొట్టమొదటిసారి కోవిడ్ కారణంగా స్తంభించాయి. సుమారు 16 నెలల పాటు ఎంఎంటీఎస్ సేవలు ఆగిపోవడంతో నగరవాసులు దాదాపుగా ఈ రైళ్లను మరిచారు. ఇదే సమయంలో సొంత వాహనాల వినియోగం గణనీయంగా పెరిగింది. మరోవైపు ఐటీ రంగం పునరుద్ధరించకపోవడం వల్ల సికింద్రాబాద్–హైటెక్‌సిటీ, లింగంపల్లి–హైటెక్‌సిటీ మార్గంలో డిమాండ్ పూర్తిగా తగ్గింది. ప్రభుత్వ,ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు, చిరువ్యాపారులు, వివిధ వర్గాలు ఈ ఏడాదిన్నర కా లంలో చాలా వరకు సొంత వాహనాల వైపు మ ళ్లారు. దీంతో సిటీ బస్సులు, మెట్రో రైళ్లకు ఆదరణ తగ్గినట్లుగానే ఎంఎంటీఎస్ రైళ్లకు సైతం తగ్గింది. రద్దు దిశగా ఎంఎంటీఎస్ ► గతంలో రోజుకు 121 సరీ్వసులు నడిచేవి. ప్రస్తుతం 45 నుంచి 50 సరీ్వసులు మాత్రమే నడుస్తున్నాయి. ► ఈ సరీ్వసులకు సైతం ఆదరణ లేకపోవడం వల్ల సికింద్రాబాద్–లింగంపల్లి, నాంపల్లి–లింగంపల్లి మధ్య నడిచే రైళ్లను తగ్గించారు. ► ప్రతి ఆదివారం 10 రైళ్లను రద్దు చేస్తున్నారు. గ త మూడు వారాలుగా ఈ రద్దు కొనసాగుతోంది. కొరవడిన ప్రచారం ► దక్షిణమధ్య రైల్వేలో ప్రయాణికుల సదుపాయాలపైన ఎలాంటి పథకాలను ప్రవేశపెట్టినా విస్తృతంగా ప్రచారం చేస్తారు. వివిధ రూపాల్లో ఈ ప్రచారం కొనసాగుతుంది. 16 నెలల తరువాత పునరుద్ధరించిన ఎంఎంటీఎస్‌పైన ఆ స్థాయిలో ప్రచారం లేకపోవడం వల్లనే ప్రయాణికుల ఆదరణ లేదని ప్రయాణికుల సంఘాల ప్రతినిధులు ఆరోపిస్తున్నారు. -
ఎంఎంటీఎస్ ప్రయాణీకులకు శుభవార్త!
సాక్షి, హైదరాబాద్: ఎంఎంటీఎస్ సీజనల్ టిక్కెట్ల గడువును పొడిగించారు. కోవిడ్ కారణంగా గతేడాది మార్చి నుంచి నిలిచిపోయిన ఎంఎంటీఎస్ సరీ్వసులను బుధవారం నుంచి పాక్షికంగా నడుపనున్నారు. దీంతో గతేడాది రైళ్ల రద్దు కారణంగా చాలామంది ప్రయాణికులు తమ సీజనల్ టికెట్లను వినియోగించుకోలేకపోయారు. అలాంటి వారు నష్టపోయిన కాలాన్ని ప్రస్తుతం సద్వినియోగం చేసుకోవచ్చు. ఈ మేరకు సీజనల్ టికెట్ల గడువును పొడిగించాలని రైల్వే బోర్డు నిర్ణయించింది. సీజనల్ టికెట్ ప్రయాణికులు బుధవారం నుంచి ఈ పొడిగింపు సేవలను పొందవచ్చు. అంటే సీజనల్ టికెట్ మిగిలిన రోజులను ఇప్పుడు వినియోగించుకోవచ్చు. మొబైల్ అప్లికేషన్ ద్వారా బుక్ చేసుకున్నా, కౌంటర్ నుంచి కొనుగోలు చేసిన టికెట్లయినా ఈ సదుపాయం లభిస్తుంది. ప్రయాణికులు తమ సీజనల్ టికెట్ పొడిగింపునకు ఎమ్ఎమ్టీఎస్/సబర్బన్ స్టేషన్లలోని బుకింగ్ కౌంటర్ల వద్ద సంప్రదించాలని దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో సీహెచ్ రాకేష్ సూచించారు. యూటీఎస్‌ను వినియోగించుకోండి... ► ఎంఎంటీఎస్ ప్రయాణానికి బుకింగ్ కౌంటర్ల వద్ద టికెట్లు కొనుగోలు చేయడమే కాకుండా నగదు రహితంగా టికెట్లను పొందవచ్చు. ► అన్ని ఎంఎంటీఎస్ స్టేషన్లలో అందుబాటులో ఉన్న అటోమెటిక్ టికెట్ వెండింగ్ మిషన్లలో స్మార్ట్ కార్డుల ద్వారా టికెట్లను పొందవచ్చు. ఈ టిక్కెట్లపైన 3 శాతం బోనస్ లభిస్తుంది. ► ఈ మేరకు తమ పాత స్మార్ట్ కార్డులను పునరుద్ధరించుకొనేందుకు ఎంఎంటీఎస్ స్టేషన్లలో సంప్రదించవచ్చు. ► అలాగే అన్ రిజర్వుడ్ టికెటింగ్ సిస్టం (యూటీఎస్) మొబైల్ యాప్ వినియోగించే వారు కూడా ఎంఎంటీఎస్ టికెట్లను పొంద వచ్చు. యూటీఎస్ నుంచి టిక్కెట్లు తీసుకొనేవారికి 5 శాతం బోనస్ లభిస్తుంది. ► కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా ఎంఎంటీఎస్ సేవలను వినియోగించుకోవాలని దక్షిణమధ్య రైల్వే జనరల్ మేనేజర్ గజానన్ మాల్యా కోరారు. చదవండి: ‘కాళేశ్వర ఫలం’: 2.70 లక్షల ఎకరాలకు తొలి తడి -
హైదరాబాద్ లో ఎంఎంటీస్ రైళ్ల పునరుద్ధరణ
-
రెడ్‌సిగ్నల్ ఇంకెన్నాళ్లు!
సాక్షి, సిటీబ్యూరో: దశల వారీగా రైళ్ల పునరుద్ధరణకు చర్యలు చేపట్టారు. ఎంఎంటీఎస్ రైళ్లపై మాత్రం ఇంకా ప్రతిష్టంభన కొనసాగుతూనే ఉంది. ప్రతిరోజూ లక్షన్నర మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చే ఈ రైళ్లకు నగరంలో ఎంతో డిమాండ్ ఉంది. ప్రత్యేకించి ఐటీ, ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులు, చిరు వ్యాపారులు ఎంఎంటీఎస్ రైళ్లపై ఆధారపడి రాకపోకలు సాగిస్తారు. లాక్డౌన్ ఆంక్షలు క్రమంగా తొలగిపోయి సాధారణ పరిస్థితులు నెలకొంటున్నప్పటికీ ఈ సర్వీసులు అందుబాటులోకి రావపోవడంతో నగరవాసులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. దక్షిణమధ్య రైల్వే పరిధిలో సుమారు వంద శ్రామిక్ రైళ్ల ద్వారా 2.5 లక్షల మందిని వివిధ ప్రాంతాలకు తరలించారు. అలాగే ప్రయాణికుల రద్దీ, డిమాండ్ దృష్ట్యా ప్రత్యేక రైళ్లు సైతం అందుబాటులోకి వచ్చాయి. జూన్ 1 నుంచి నుంచి మరిన్ని రైళ్లు పట్టాలెక్కనున్నాయి. సాధారణ రైళ్ల తరహాలోనే ఇవి సేవలందజేస్తాయి. అన్ని ప్రధాన స్టేషన్లలో ఈ రైళ్లను నిలుపుతారు. ఈ రైళ్లలాగే నగరంలోని వివిధ ప్రాంతాల మధ్య కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా.. ఎంఎంటీఎస్ రైళ్లను నడిపేందుకు అవకాశం ఉంది. కానీ ఆ దిశగా దక్షిణమధ్య రైల్వే ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై ప్రయాణికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రెట్టింపు చార్జీలకు చెక్ పెట్టొచ్చు.. ‘సిటీ బస్సుల కంటే ఎంఎంటీఎస్ రైళ్లు సురక్షితమే కాకుండా రైల్వేస్టేషన్లలో ప్రయాణికుల రాకపోకలను నియంత్రించేందుకు అవకాశం ఉంటుంది. థర్మల్ స్క్రీనింగ్ పరీక్షలు కూడా చేయవచ్చు. స్టేషన్లలో ఎంఎంటీఎస్ ఎక్కేవారు, దిగేవారిపై కచ్చితమైన అంచనాలు ఉంటాయి.’ అని ఎంఎంటీఎస్ రైల్వే ప్రయాణికుల సంక్షేమ సంఘాలు అభిప్రాయపడుతున్నాయి. ‘లాక్డౌన్ నిబంధనలు చాలావరకు సడలించారు. ఉద్యోగ, వ్యాపారాలు తప్పనిసరి. ఈ పరిస్థితుల్లో ఒకచోట నుంచి మరో చోటకు వెళ్లేందుకు క్యాబ్‌లు, ఆటోలు మాత్రమే నడుస్తున్నాయి. కానీ వాటిలో చార్జీలను రెట్టింపు చేశారు. నిలువుదోపిడీకి పాల్పడుతున్నార’ని సబర్బన్ ట్రైన్ ప్యాసింజర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు నూర్ ఆందోళన వ్యక్తం చేశారు. లాక్‌డౌన్‌తో బ్రేక్.. నగరంలోని ఫలక్‌నుమా– లింగంపల్లి, నాంపల్లి– లింగంపల్లి, ఫలక్‌నుమా– నాంపల్లి, సికింద్రాబాద్– నాంపల్లి మధ్య ఎంఎంటీఎస్ రైళ్లు అందుబాటులో ఉన్నాయి. ప్రతిరోజూ 121 సర్వీసులు నడుస్తాయి.1.5 లక్షల మంది ఈ సర్వీసులను వినియోగించుకుంటారు. ప్రత్యేకంగా లింగంపల్లి నుంచి సికింద్రాబాద్ వరకు, లింగంపల్లి నుంచి నాంపల్లి వరకు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. ఈ రెండు రూట్లలోనే ఉద్యోగులు, వ్యాపారులు, సాధారణ ప్రజల రాకపోకలు అధికంగా ఉంటాయి. సికింద్రాబాద్, నాంపల్లి స్టేషన్లలో దిగిన ప్రయాణికులు ఎంఎంటీఎస్ సర్వీసుల్లో ఇళ్లకు చేరుకుంటారు. లాక్డౌన్ కారణంగా సిటీ బస్సులు, మెట్రో రైళ్లలాగే సుమారు 68 రోజుల క్రితం ఈ రైళ్లు నిలిచిపోయాయి. దీంతో ప్రజా రవాణా పూర్తిగా స్తంభించింది. కానీ ప్రస్తుతం లాక్డౌన్ నిబంధనలను చాలా వరకు సడలించిన దృష్ట్యా ఎంఎంటీఎస్ రైళ్లను పరిమితంగా అందుబాటులోకి తెచ్చేందుకు అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ రెండు రూట్లలోఇలా నడపొచ్చు.. ♦ సికింద్రాబాద్ నుంచి లింగంపల్లి వరకు, నాంపల్లి నుంచి లింగంపల్లి వరకు ఉదయం, సాయంత్రం పరిమిత సంఖ్యలో రైళ్లను నడపవచ్చు ♦ ఈ రెండు రూట్లలో హైటెక్ సిటీ వరకు రాకపోకలు సాగించే వారి సంఖ్య ఎక్కువ ఈ మార్గాల్లోని అన్ని స్టేషన్లను,రైళ్లను శానిటైజ్ చేయాలి ♦ ప్రయాణికులకు థర్మల్ స్క్రీనింగ్ చేయడం పెద్దగా ఇబ్బంది ఉండబోదు ♦ భౌతిక దూరం, మాస్కులు తప్పనిసరి చేసి సీట్ల సామర్థ్యం వరకు అనుమతించవచ్చు ♦ ఉదయం, సాయంత్రం వేళల్లో మాత్రమే నడిపితే ప్రయాణికులపై కచ్చితమైన అంచనా ఉంటుంది ♦ ప్రస్తుతం సాధారణ టికెట్ల కొనుగోళ్లను నిలిపివేశారు. కానీ యూటీఎస్ మొబైల్ యాప్ ద్వారా ఎంఎంటీఎస్ టిక్కెట్ బుకింగ్ సదుపాయం కల్పిస్తే ప్రయాణం చేసే వారి వివరాలు కూడా నమోదవుతాయి -
ఎక్కడి రైళ్లు, బస్సులు అక్కడే
సాక్షి, హైదరాబాద్: జనతా కర్ఫ్యూ నేపథ్యంలో ఎక్కడి రైళ్లు అక్కడే నిలిచిపోనున్నాయి. ప్రధాన మంత్రి మోదీ పిలుపు నేపథ్యంలో రైల్వే శాఖ ఇప్పటికే ఆదివారం ఉదయం ఏడు నుంచి రాత్రి తొమ్మిది మధ్య బయలుదేరాల్సిన రైళ్లను రద్దు చేసింది. జనతా కర్ఫ్యూ మొదలయ్యే ముందు బయలుదేరిన రైళ్లు మాత్రం యథావిధిగా నడుస్తాయి. ఇక నగర పరిధిలో మా త్రం ప్రజల అత్యవసర ప్రయాణాల దృ ష్ట్యా 12 ఎంఎంటీఎస్ రైళ్లను మాత్రం నడుపుతోంది. ఉదయం ఆరు గంటలకు సికింద్రాబాద్ –ఫలక్‌నుమా రైలు, ఉ.6.50, 9.55, 1.00, 5.10Sకు ఫలక్ను మా–లింగంపల్లి మధ్య, 8.23, 11.30, 3.30, రాత్రి 8.45లకు లింగంపల్లి–ఫలక్‌నుమా, సాయంత్రం 6.50కి లింగంపల్లి–హైదరాబాద్, 7.35కి హైదరాబాద్–లింగంపల్లి, రాత్రి 10.30కి ఫలక్‌నుమా–సి కింద్రాబాద్ సర్వీసులు బయల్దేరతాయి. ఆదివారం ఉదయం 6 నుంచి సోమవా రం ఉదయం 6 వరకు అన్ని బస్సులు ని లిచిపోనున్నాయి. అత్యవసరాలకు కొన్ని బస్సులు మాత్రం సిద్ధంగా ఉంటాయి. -
తాత్కాలికంగా ఎంఎంటీఎస్ రైళ్లు రద్దు
సాక్షి, హైదరాబాద్: నిర్వహణాపరమైన కారణాల దృష్ట్యా హైదరాబాద్‌లో ఎంఎంటీఎస్ రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. బుధవారం 19 రైళ్లను పూర్తిగా, మరో 24 రైళ్లను పాక్షికంగా రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో సీహెచ్ రాకేశ్ ఒక ప్రకటనలో తెలిపారు. గురువారం కూడా ఎంఎంటీఎస్ రైళ్ల పాక్షిక, పూర్తిస్థాయి రద్దు కొనసాగనుంది. ఈ మేరకు నాంపల్లి–లింగంపల్లి, సికింద్రాబాద్–ఫలక్‌నుమా, జనగామ–ఫలక్‌నుమా (ఇది ప్యాసింజర్ ట్రైన్), నాంపల్లి–ఫలక్‌నుమా, లింగంపల్లి–నాంపల్లి, ఫలక్‌నుమా–సికింద్రాబాద్ రూట్లలో 19 సర్వీసులను రద్దు చేశారు. అలాగే మరో 24 సర్వీసులను సికింద్రాబాద్–ఫలక్‌నుమా, నాంపల్లి–ఫలక్‌నుమా మధ్య రద్దు చేశారు. దీంతో ఈ రైళ్లు లింగంపల్లి–సికింద్రాబాద్, లింగంపల్లి–నాంపల్లి మధ్య మాత్రమే రాకపోకలు సాగిస్తాయి. -
నిమజ్జనానికి సులువుగా వెళ్లొచ్చు ఇలా..
సాక్షి, హైదరాబాద్: గణేశ్ నిమజ్జనం సందర్భంగా ఈ నెల 12వ తేదీ రాత్రి 10 గంటల నుంచి 13న తెల్లవారు జామున 4 గంటల వరకు 8 ప్రత్యేక రైళ్లు నడుపనున్నట్లు దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో సీహెచ్ రాకేష్ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రతి 30 నిమిషాల నుంచి 45 నిమిషాలకు ఒకటి చొప్పున ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా ఈ సర్వీసులు నడుస్తాయి. లింగంపల్లి–ఫలక్‌నుమా, సికింద్రాబాద్–ఫలక్‌నుమా, సికింద్రాబాద్–నాంపల్లి, ఫలక్‌నుమా–లింగంపల్లి, నాంపల్లి–ఫలక్‌నుమా, నాంపల్లి–లింగంపల్లి మధ్య ఈ అదనపు రైళ్లు నడుస్తాయి. ఎంఎంటీఎస్... ‘హైలైట్స్’ యాప్ నగరంలో రైళ్ల రాకపోకల సమాచారం కోసం ‘హైలైట్స్’ మొబైల్ యాప్ ఎంతో దోహదం చేస్తుంది. ప్రయాణికులు ఈ మొబైల్ యాప్ ద్వారా ఎంఎంటీఎస్ రైళ్ల ప్రత్యక్ష సమాచారాన్ని తెలుసుకోవచ్చు. అలాగే సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ స్టేషన్ల నుంచి రాకపోకలు సాగించే ప్రధాన రైళ్ల వేళలు ఈ యాప్ ద్వారా ఎప్పటికప్పుడు లభిస్తాయి. జంటనగరాల్లో ప్రతి రోజు 121 ఎంఎంటీఎస్ సర్వీసులు ప్రయాణికులకు సదుపాయాన్ని అందజేస్తున్నాయి. నాంపల్లి– లింగంపల్లి, ఫలక్‌నుమా–సికింద్రాబాద్, ఫలక్‌నుమా–లింగంపల్లి, నాంపల్లి–ఫలక్‌నుమా మార్గాల్లో రైళ్లు నడుస్తున్నాయి. ప్రతి రోజు 1.5 లక్షల మంది ప్రయాణికులు ఎంఎంటీఎస్ సేవలను వినియోగించుకుంటున్నారు. పలువురు ఐటీ ఉద్యోగులు, ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులు ఎంఎంటీఎస్‌పైనే ఆధారపడి రాకపోకలు సాగిస్తున్నారు. ఇలాంటి ప్రయాణికులకు ‘హైలైట్స్’ యాప్ ఎంతో ఉపయోగంగా ఉంటుంది. ఉదయం 5 గంటల నుంచి రాత్రి 10.30 గంటల వరకు వివిధ రూట్లలో నడిచే రైళ్లను ప్రత్యక్షంగా ఈ యాప్ ద్వారా తెలుసుకొనేందుకు అవకాశం లభిస్తుంది. ఏ ట్రైన్ ఏ రూట్లో ఎక్కడి వరకు వచ్చిందనేది ఈ యాప్ ద్వారా తేలిగ్గా తెలుసుకోవచ్చు. మూడేళ్ల క్రితం అందుబాటులోకి తెచ్చిన ఈయాప్‌ను ప్రతి రోజు వేలాది మంది ప్రయాణికులు వినియోగించుకుంటున్నారు. (ఆటంకాలు లేకుండా ఖైరతాబాద్ గణపతి దర్శనం ఎలా?.. ఇక్కడ క్లిక్ చేయండి)