
హైదరాబాద్ : ఒకే ట్రాక్‌పైకి రెండు ఎంఎంటీఎస్ రైళ్లు ఎదురెదురుగా అతి సమీపంలోకి రావడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. అయితే డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించడంతో రెండు రైళ్లు ఒకదానికొకటి దగ్గరగా వచ్చి కొద్ది దూరంలో ఆగిపోవడంతో పెనుప్రమాదం తప్పింది. ఈ ఘటన కాచిగూడ రైల్వే స్టేషన్ సమీపంలో బుధవారం చోటుచేసుకుంది. ఈ రెండు రైళ్లు దగ్గరగా వచ్చి కొద్ది దూరంలో ఆగిపోవడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.
రైల్వే అధికారుల నిర్లక్ష్యం, సిగ్నలింగ్ వ్యవస్థలో లోపం కారణంగా తరచూ ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని ప్రయాణికులు చెబుతున్నారు. అయితే ఈ ఘటనపై రైల్వే అధికారులు స్పందించారు. ఎంఎంటీఎస్ రైళ్లకు ప్రత్యేక సిగ్నలింగ్ వ్యవస్థ ఉంటుందని, ప్రతి 400 మీటర్ల దూరంలో డ్రైవర్లు రైలును ఆపుకునే వీలుందని తెలిపారు. ఒకే ట్రాక్‌పైన ఎంఎంటీఎస్ రెండు రైళ్లు పద్ధతి ప్రకారమే ఎలాంటి ఇబ్బందులు లేకుండా నడుస్తున్నాయని చెప్పారు. ప్రయాణికులు భయాందోళనలు చెందాల్సిన అవసరం లేదు అని అధికారులు వివరణ ఇచ్చారు.