సాక్షి, సిటీబ్యూరో: దశల వారీగా రైళ్ల పునరుద్ధరణకు చర్యలు చేపట్టారు. ఎంఎంటీఎస్ రైళ్లపై మాత్రం ఇంకా ప్రతిష్టంభన కొనసాగుతూనే ఉంది. ప్రతిరోజూ లక్షన్నర మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చే ఈ రైళ్లకు నగరంలో ఎంతో డిమాండ్ ఉంది. ప్రత్యేకించి ఐటీ, ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులు, చిరు వ్యాపారులు ఎంఎంటీఎస్ రైళ్లపై ఆధారపడి రాకపోకలు సాగిస్తారు. లాక్‌డౌన్ ఆంక్షలు క్రమంగా తొలగిపోయి సాధారణ పరిస్థితులు నెలకొంటున్నప్పటికీ ఈ సర్వీసులు అందుబాటులోకి రావపోవడంతో నగరవాసులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. దక్షిణమధ్య రైల్వే పరిధిలో సుమారు వంద శ్రామిక్ రైళ్ల ద్వారా 2.5 లక్షల మందిని వివిధ ప్రాంతాలకు తరలించారు. అలాగే ప్రయాణికుల రద్దీ, డిమాండ్ దృష్ట్యా ప్రత్యేక రైళ్లు సైతం అందుబాటులోకి వచ్చాయి. జూన్ 1 నుంచి నుంచి మరిన్ని రైళ్లు పట్టాలెక్కనున్నాయి. సాధారణ రైళ్ల తరహాలోనే ఇవి సేవలందజేస్తాయి. అన్ని ప్రధాన స్టేషన్లలో ఈ రైళ్లను నిలుపుతారు. ఈ రైళ్లలాగే నగరంలోని వివిధ ప్రాంతాల మధ్య కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా.. ఎంఎంటీఎస్ రైళ్లను నడిపేందుకు అవకాశం ఉంది. కానీ ఆ దిశగా దక్షిణమధ్య రైల్వే ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై ప్రయాణికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
రెట్టింపు చార్జీలకు చెక్ పెట్టొచ్చు..
‘సిటీ బస్సుల కంటే ఎంఎంటీఎస్ రైళ్లు సురక్షితమే కాకుండా రైల్వేస్టేషన్లలో ప్రయాణికుల రాకపోకలను నియంత్రించేందుకు అవకాశం ఉంటుంది. థర్మల్ స్క్రీనింగ్ పరీక్షలు కూడా చేయవచ్చు. స్టేషన్లలో ఎంఎంటీఎస్ ఎక్కేవారు, దిగేవారిపై కచ్చితమైన అంచనాలు ఉంటాయి.’ అని ఎంఎంటీఎస్ రైల్వే ప్రయాణికుల సంక్షేమ సంఘాలు అభిప్రాయపడుతున్నాయి. ‘లాక్‌డౌన్ నిబంధనలు చాలావరకు సడలించారు. ఉద్యోగ, వ్యాపారాలు తప్పనిసరి. ఈ పరిస్థితుల్లో ఒకచోట నుంచి మరో చోటకు వెళ్లేందుకు క్యాబ్‌లు, ఆటోలు మాత్రమే నడుస్తున్నాయి. కానీ వాటిలో చార్జీలను రెట్టింపు చేశారు. నిలువుదోపిడీకి పాల్పడుతున్నార’ని సబర్బన్ ట్రైన్ ప్యాసింజర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు నూర్ ఆందోళన వ్యక్తం చేశారు.
లాక్‌డౌన్‌తో బ్రేక్..
నగరంలోని ఫలక్‌నుమా– లింగంపల్లి, నాంపల్లి– లింగంపల్లి, ఫలక్‌నుమా– నాంపల్లి, సికింద్రాబాద్– నాంపల్లి మధ్య ఎంఎంటీఎస్ రైళ్లు అందుబాటులో ఉన్నాయి. ప్రతిరోజూ 121 సర్వీసులు నడుస్తాయి.1.5 లక్షల మంది ఈ సర్వీసులను వినియోగించుకుంటారు. ప్రత్యేకంగా లింగంపల్లి నుంచి సికింద్రాబాద్ వరకు, లింగంపల్లి నుంచి నాంపల్లి వరకు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. ఈ రెండు రూట్లలోనే ఉద్యోగులు, వ్యాపారులు, సాధారణ ప్రజల రాకపోకలు అధికంగా ఉంటాయి. సికింద్రాబాద్, నాంపల్లి స్టేషన్లలో దిగిన ప్రయాణికులు ఎంఎంటీఎస్ సర్వీసుల్లో ఇళ్లకు చేరుకుంటారు. లాక్‌డౌన్ కారణంగా సిటీ బస్సులు, మెట్రో రైళ్లలాగే సుమారు 68 రోజుల క్రితం ఈ రైళ్లు నిలిచిపోయాయి. దీంతో ప్రజా రవాణా పూర్తిగా స్తంభించింది. కానీ ప్రస్తుతం లాక్‌డౌన్ నిబంధనలను చాలా వరకు సడలించిన దృష్ట్యా ఎంఎంటీఎస్ రైళ్లను పరిమితంగా అందుబాటులోకి తెచ్చేందుకు అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఈ రెండు రూట్లలోఇలా నడపొచ్చు..
♦ సికింద్రాబాద్ నుంచి లింగంపల్లి వరకు, నాంపల్లి నుంచి లింగంపల్లి వరకు ఉదయం, సాయంత్రం పరిమిత సంఖ్యలో రైళ్లను నడపవచ్చు
♦ ఈ రెండు రూట్లలో హైటెక్ సిటీ వరకు రాకపోకలు సాగించే వారి సంఖ్య ఎక్కువ ఈ మార్గాల్లోని అన్ని స్టేషన్లను,రైళ్లను శానిటైజ్ చేయాలి
♦ ప్రయాణికులకు థర్మల్ స్క్రీనింగ్ చేయడం పెద్దగా ఇబ్బంది ఉండబోదు
♦ భౌతిక దూరం, మాస్కులు తప్పనిసరి చేసి సీట్ల సామర్థ్యం వరకు అనుమతించవచ్చు
♦ ఉదయం, సాయంత్రం వేళల్లో మాత్రమే నడిపితే ప్రయాణికులపై కచ్చితమైన అంచనా ఉంటుంది
♦ ప్రస్తుతం సాధారణ టికెట్ల కొనుగోళ్లను నిలిపివేశారు. కానీ యూటీఎస్ మొబైల్ యాప్ ద్వారా ఎంఎంటీఎస్ టిక్కెట్ బుకింగ్ సదుపాయం కల్పిస్తే ప్రయాణం చేసే వారి వివరాలు కూడా నమోదవుతాయి
Comments
Please login to add a commentAdd a comment