ఈజీ జర్నీ | Hyderabad City People Happy With Easy Journey | Sakshi
Sakshi News home page

ఈజీ జర్నీ

Published Sat, Nov 3 2018 9:46 AM | Last Updated on Sat, Nov 10 2018 1:16 PM

Hyderabad City People Happy With Easy Journey - Sakshi

సాక్షి,సిటీబ్యూరో: మహానగర వాసులకు ప్రయాణ సదుపాయాలు మరింత చేరువయ్యాయి. తక్కువ సమయంలోనే ప్రజలు ప్రజా రవాణాను అందుకోగలుగుతున్నారు. సిటీ బస్సులు, ఎంఎంటీఎస్, విస్తృతమవుతోన్న మెట్రో రైళ్ల సేవలతో ప్రయాణ సదుపాయాలు మెరుగుపడుతున్నట్లు ‘ఓలా మొబిలిటీ ఇనిస్టిట్యూట్, ఓలా థింక్‌ ట్యాంక్‌’ సంస్థల తాజా అధ్యయనంలో వెల్లడైంది. క్యాబ్‌లు అందుబాటులోకి వచ్చాక నగరంలో ప్రయాణం కోసం ఎదురు చూసే సమయం బాగా తగ్గిపోయినట్టు ఆ సంస్థలు గుర్తించాయి. అతి తక్కువ కాలినడక దూరంలో ప్రయాణ సదుపాయాలు గల నగరంగా హైదరాబాద్‌ నిలిచింది. ఈ అంశంలో ఢిల్లీ, ముంబై నగరాలు మొదటి రెండు స్థానాల్లో ఉండగా, మూడో స్థానంలో హైదరాబాద్‌ నిలిచింది.

ఓలా సంస్థ దేశవ్యాప్తంగా ఢిల్లీ, ముంబై, కోల్‌కత్తా, బెంగళూరు, చెన్నై, అహ్మదాబాద్, తిరువనంతపురం తదితర 20 నగరాల్లో ప్రయాణ సదుపాయాలపై ఇటీవల సర్వే నిర్వహించింది. మొత్తం 43 వేల మంది ఈ సర్వేలో పాల్గొన్నారు. ఈ నివేదికను కేంద్ర రవాణాశాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ రెండు రోజుల క్రితం వెల్లడించారు. పర్యావరణ ప్రియమైన రవాణా సదుపాయాలను ప్రజలు ఎక్కువగా కోరుకుంటున్నారని, అతి తక్కువ సమయంలో, కాలుష్యం, వాహనాల రద్దీ లేని రవాణా సదుపాయాన్ని ప్రజలకు అందజేయడంపై రవాణా సంస్థలు, ప్రజా రవాణా రంగంలో ఉన్న భాగస్వామ్య సంస్థలు దృష్టి సారించాల్సి ఉందని ఈ సందర్భంగా మంత్రి పేర్కొన్నారు. 

ప్రజారవాణాయే ప్రధానం..
ప్రజలు రాకపోకలు సాగించే ప్రధాన మార్గాలు, నగరంలో అందుబాటులో ఉన్న రవాణా సదుపాయాలు, ప్రజల కొనుగోలుశక్తి, సంస్కృతి, తదితర అంశాలను పరిగణనలోకి తీసుకొని ఈ సర్వే చేశారు. ఓలా చేసిన సర్వే ప్రకారం హైదరాబాద్‌లో ప్రయాణ సదుపాయాల కల్పనలో సిటీ బస్సులు, ఎంఎంటీఎస్‌ రైళ్లు, మెట్రో రైళ్లే ప్రధాన ప్రజారవాణా సాధనాలుగా నిలిచాయి. నగరంలో (సొంత వాహనాల్లో ప్రయాణం చేసేవారు కాకుండా) అందుబాటులో ఉన్న రవాణా సదుపాయాలను వినియోగించుకుంటున్న వారిలో 64 శాతం మంది బస్సులు, రైళ్లను ఎంపిక చేసుకుంటుండగా, 33 శాతం మంది షేర్‌ క్యాబ్‌లను వినియోగిస్తున్నారు. మిగతావారు ఆటోలు వంటి ప్రైవేట్‌ వాహనాలను ఆశ్రయిస్తున్నారు. సుమారు 3,850 బస్సులతో నగరంలోని అన్ని ప్రాంతాలకు రవాణా సదుపాయాలను అందజేసే సామర్థ్యం ఉన్న ఆర్టీసీకి 87 శాతం వినియోగదారులు ఉన్నట్లు ఈ అధ్యయనం వెల్లడించింది. నగరంలోని ఏ మారుమూల ప్రాంతం నుంచి అయినా సరే కేవలం 15 నిమిషాల కాలినడక దూరంలో ప్రజా రవాణాను చేరుకోగలుగుతున్నట్టు సర్వేలో గుర్తించారు. 

పర్యావరణ సహిత వాహనాలకే జై..
మరోవైపు నగరవాసులు ఎలక్ట్రిక్‌ వాహనాలు, ఇథనాల్, సీఎన్‌జీ వంటి ఇంధనాలను వినియోగించే పర్యావరణ ప్రియమైన వాహనాలకు అత్యధిక ప్రాధాన్యతనిస్తున్నట్లు ఈ సర్వేలో పాల్గొన్న  80 శాతం మంది అభిప్రాయపడ్డారు. గత ఐదేళ్లలో పర్యారవణ ప్రమాణాలు మెరుగుపడ్డాయని పేర్కొన్నారు. 2030 నాటికి నగరంలో పూర్తిగా ఈ తరహా సదుపాయాలు అందుబాటులోకి రాగలవని చాలామంది విశ్వాసం వ్యక్తం చేశారు. సిటీ బస్సులు, మెట్రో రైళ్లు, ఎంఎంటీఎస్‌ సర్వీసుల్లో పయనిస్తున్న వారిలో 50 శాతం మేర పాస్‌లు, స్మార్ట్‌ కార్డులనే వినియోగిస్తున్నారు. ఇటీవల మెట్రో అందుబాటులోకి వచ్చిన తరువాత స్మార్ట్‌కార్డుల వినియోగం బాగా పెరిగింది. అలాగే ఎంఎంటీఎస్‌ రైళ్లలోనూ ఉద్యోగులు, రెగ్యులర్‌గా రాకపోకలు సాగించేవారు నెలవారీ పాస్‌లను ఎక్కువగా  వినియోగిస్తున్నారు. ‘‘ప్రయాణ సదుపాయాల్లో విప్లవాత్మకమైన మార్పులు వస్తున్నాయి. ఆర్థిక, సామాజిక రంగాల్లో ఇది కీలకమైన మలుపు కానుంది’’ అని ఓలా సహ వ్యవస్థాపకులు, సీఈఓ భవీష్‌ అగర్వాల్‌ అభిప్రాయపడ్డారు. రవాణా రంగంలో అద్భుతమైన ప్రాజెక్టులు చేపట్టేందుకు పుష్కలమైన అవకాశాలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement