సాక్షి, సిటీబ్యూరో: లాస్ట్‌మైల్ కనెక్టివిటీ మరోసారి తెరపైకి వచ్చింది. మెట్రో రైలు దిగిన ప్రయాణికులు గమ్యస్థానం చేరుకునేందుకు వీలుగా బస్సులను నడిపేందుకు ఆర్టీసీ తాజాగా ప్యాసింజర్ ట్రాకింగ్ వ్యవస్థకు శ్రీకారం చుట్టింది. ప్రధాన మెట్రో స్టేషన్‌లలో ట్రైన్ దిగిన ప్రయాణికుల లాస్ట్‌మైల్ కనెక్టివిటీకి అనుగుణంగా బస్సులను నడుపుతారు. ఇప్పటికే హైటెక్‌సిటీ స్టేషన్ నుంచి ప్రారంభించిన ఈ తరహా సేవలను మిగతా ప్రాంతాలకు కూడా విస్తరించేందుకు ఆర్టీసీ కార్యాచరణ చేపట్టింది. ప్రస్తుతం హైటెక్‌సిటీ మెట్రో స్టేషన్ నుంచి రద్దీ వేళల్లో సుమారు 400–500 మంది ప్రయాణికులు వివిధ ప్రాంతాలకు వెళ్తున్నారు. వారిలో ఎక్కువ శాతం ఐటీ కారిడార్‌లోని వేవ్‌రాక్, లెమన్‌ట్రీ, అమెజాన్, మైండ్‌స్పేస్ తదితర ప్రాంతాలకు వెళ్తున్నట్లు గుర్తించారు. ఇందుకు అనుగుణంగా బస్సుల నిర్వహణలో మార్పులు చేశారు. ప్రస్తుతం వివిధ ప్రాంతాల నుంచి ఐటీ కారిడార్‌కు ప్రతిరోజు 393 బస్సులు రాకపోకలు సాగిస్తున్నాయి. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని కొద్ది రోజుల క్రితం మరో 30 బస్సులను అదనంగా ఏర్పాటు చేశారు. హైటెక్‌సిటీ కేంద్రంగా అన్ని మార్గాల్లో రోజుకు 3,796 ట్రిప్పులు తిరుగుతున్నట్లు ఆర్టీసీ గ్రేటర్ హైదరాబాద్ ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్ వెంకటేశ్వర్లు తెలిపారు. అదే తరహాలో వివిధ మెట్రో స్టేషన్‌ల నుంచి రాకపోకలు సాగించే ప్రయాణికుల అవసరాలను, లాస్ట్‌మైల్ కనెక్టివిటీని దృష్టిలో ఉంచుకొని బస్సుల నిర్వహణ కోసం ఒక నోడల్ వ్యవస్థను ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. ఇందుకోసం మెట్రో రైలు అధికారులతో కలిసి ప్యాసింజర్ ట్రాకింగ్‌నిర్వహిస్తారు.
మెట్రో కారిడార్లలో నష్టాలు...
రెండు ప్రధాన మార్గాల్లో మెట్రో రైలు అందుబాటులోకి రావడంతో ఆర్టీసీపై తీవ్ర ప్రభావం పడింది. ఉప్పల్ నుంచి అమీర్‌పేట్ వరకు మొదట్లో పెద్దగా ప్రభావం లేకపోయినా హైటెక్‌సిటీకి సేవలు మొదలైన తరువాత ఆర్టీసీకి ఆదరణ తగ్గింది. అలాగే ఎల్‌బీనగర్ నుంచి అమీర్‌పేట్–హైటెక్‌సిటీ, ఎల్‌బీనగర్ నుంచి మియాపూర్ సేవలు అందుబాటులోకి రావడంతో ఏసీ బస్సులపై ప్రభావం పడింది. దీంతో ఎల్‌బీనగర్–మియాపూర్ రూట్లో 18 ఏసీ బస్సులను ఆర్టీసీ ఉపసంహరించుకుంది. మొత్తంగా మెట్రో కారిడార్లలో ఒక కిలోమీటర్‌కు రూ.7 చొప్పున నష్టం వస్తున్నట్లు ఆర్టీసీ ఈడీ తెలిపారు. రెండు ప్రధాన మెట్రో కారిడార్లలో ఒక కిలోమీటర్‌పై రూ.28 ఆదాయం లభిస్తే రూ.35 ఖర్చవుతోంది. వందలకొద్దీ బస్సులు తీవ్ర నష్టాలను చవిచూస్తున్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకొని ప్యాసింజర్ ట్రాకింగ్ చేపట్టేందుకు ఆర్టీసీ సన్నాహాలు చేస్తోంది. గతంలో మెట్రో స్టేషన్‌లకు ఫీడర్ బస్సులను నడిపారు. కానీ పెద్దగా ఆదరణ లభించలేదు. దీంతో మరోసారి ప్రయాణికుల అవసరాలపై సమగ్రమైన అధ్యయనం జరిపి బస్సులను ఏర్పాటు చేయాలని ఆర్టీసీ భావిస్తోంది.
పొగ లేని బస్సులు...
అలాగే బ్లాక్‌స్మోక్ బస్సులను అరికట్టేందుకు కూడా ఆర్టీసీ చర్యలు చేపట్టింది. నల్లటి కారుమబ్బుల్లా కాలుష్యాన్ని వదిలే బస్సులను ఎట్టి పరిస్థితుల్లోనూ రోడ్డెక్కించకుండా జాగ్రత్త పడాలని, అలాంటి బస్సులలో అవసరమైన విడి భాగాలను మార్చాలని అధికారులు భావిస్తున్నారు. ‘ఇంజెక్టర్‌లు, ఎఫ్‌ఐబీలు చెడిపోవడం వల్లనే ఇలాంటి పరిస్థితి వస్తుంది. కొన్ని బస్సుల్లో ఇంజిన్ మార్చాల్సిన అవసరం ఉండవచ్చు. అలాంటి వాటిని గుర్తించి తగిన చర్యలు తీసుకుంటాం’ అని ఈడీ చెప్పారు. ఈ ఆర్థిక సంవత్సరం చివరి నాటికి 300 ఎలక్ట్రిక్ బస్సులు రానున్న దృష్ట్యా 12 డిపోల్లో విద్యుత్ చార్జింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు ఈడీ తెలిపారు.
ఫిర్యాదు చేయండి...
ప్రస్తుతం గ్రేటర్‌లో రోజుకు 3,550 బస్సులు నడుస్తున్నాయి. సుమారు 9.15 లక్షల కిలోమీటర్లు తిరుగుతున్నాయి. అయినా ఈ బస్సులపై ప్రతిరోజు రూ.1.5 కోట్ల నష్టం వాటిల్లుతోంది. కిలోమీటర్‌కు రూ.42 లభిస్తే ఖర్చు మాత్రం రూ.58 వరకు ఉంటోంది. అంటే ఒక కిలోమీటర్‌పై రూ.16 చొప్పున నష్టం వస్తోంది. ఈ నష్టాలను ఎదుర్కొనేందుకు ప్రయాణికుల ఆదరణను పెంచుకోవడం మినహా మరో మార్గం లేదని అధికారులు భావిస్తున్నారు. ఈ మేరకు ప్రయాణికుల ఫిర్యాదులపై సత్వరమే స్పందించి చర్యలు చేపట్టనున్నట్లు ఆర్టీసీ ఈడీ వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. ‘ఇందుకోసం ప్రతి బస్సుపైన బయటి వైపు డిపో మేనేజర్‌ల ఫోన్ నంబర్లు డిస్‌ప్లే చేస్తాం. లోపలి వైపు కూడా నంబర్లు ఉంటాయి. బస్సుల కోసం ఎదురుచూసే ప్రయాణికులు తమకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా డిపో మేనేజర్లను, అవసరమైతే డివిజనల్ మేనేజర్లను ఫోన్ ద్వారా సంప్రదించవచ్చు. వెంటనే పరిష్కారం పొందవచ్చు. బస్టాపుల్లో బస్సులు నిలపకపోయినా, అర్ధాంతరంగా ట్రిప్పులు రద్దయినా, బస్సులు పరిశుభ్రంగా లేకపోయినా డిపో మేనేజర్‌కు ఫిర్యాదు చేయండి’ అని ఈడీ ప్రయాణికులను కోరారు.
Comments
Please login to add a commentAdd a comment