డీలక్స్, ఎక్స్‌ప్రెస్‌ల కంటే రెండు మీటర్ల పొడవు, 8 సీట్లు ఎక్కువ
హైదరాబాద్‌లో పలు రూట్లలో సెమీ డీలక్స్ ప్రారంభం
‘ఉచిత ప్రయాణ’ వసతితో తగ్గిన టికెట్ ఆదాయం పెంచుకునే లక్ష్యం
సాక్షి, హైదరాబాద్: మహిళలకు ఉచిత ప్రయాణ వెసులుబాటుతో కోల్పోయిన రోజువారీ టికెట్ ఆదాయాన్ని కొంతమేర తిరిగి రాబట్టుకునేందుకు ఉద్దేశించిన సెమీ డీలక్స్ కేటగిరీ బస్సులను ఆర్టీసీ రోడ్డెక్కించింది. ప్రయోగాత్మకంగా మూడు నెలల పాటు ఈ కేటగిరీ బస్సులను తిప్పి ప్రయాణికుల స్పందనను పరిశీలించాలని నిర్ణయించింది. తొలుత నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లో బస్సులను ప్రారంభించారు. కొత్త బస్సులు సమకూరే కొద్దీ ఇతర జిల్లాలకు పంపనున్నారు. ఇదే తరహాలో హైదరాబాద్ నగరంలో కొత్తగా మెట్రో డీలక్స్ కేటగిరీ బస్సులను ప్రారంభించారు. నగరంలో 125 బస్సులను వివిధ మార్గాల్లో నడపబోతున్నారు. ఇప్పటికే 24 బస్సులను.. 300, 1హెచ్, 49ఎం, 3కే, 16ఏ రూట్లలో ప్రారంభించారు.
ప్రయాణికుల్లో అయోమయం..
ప్రస్తుతం ఆర్డినరీ, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయా ణ వెసులుబాటు కొనసాగుతోంది. నగరంలో ఈ కేటగిరీ బస్సులే ఎక్కువగా ఉంటాయి. మెట్రో లగ్జరీ పేరుతో నడిచే ఏసీ బస్సులు చూడగానే గుర్తించేలా ఉండటంతో.. మహిళలకు వేటిలో ఉచితం, ఏ తరహా బస్ పాస్‌లు చెల్లుబాటు అవుతాయన్న స్పష్టత ఉంది. అయితే కొత్తగా ప్రవేశపెట్టిన మెట్రో డీలక్స్ బస్సులు కూడా ఎక్స్‌ప్రెస్‌లే అనుకుని ఉచితంగా ప్రయాణించేందుకు ఎక్కుతు న్నారు. కాదని తెలిశాక దిగిపోతున్నారు. ఈ కేటగిరీ బస్సులపై ప్రచారం లేకపోవటమే దీనికి కారణం. జిల్లాల్లో ప్రారంభమైన సెమీ డీలక్స్‌ల విషయంలోనూ ఇదే తరహా గందరగోళం ఏర్పడు తోంది. ప్రస్తుతం అవి తక్కువ ఆక్యుపెన్సీతో నడుస్తున్నా యి.
కనీస చార్జీ రూ.30
హైదరాబాద్‌లో రోడ్డెక్కిన మెట్రో డీలక్స్ బస్సులు పూర్తిగా కొత్తవి. కంపెనీ నుంచి కొత్త ఛాసిస్‌లు మాత్రమే కొని బస్ బాడీని విడిగా తయారు చేయించినవి. కానీ జిల్లాల్లో తిరిగే సెమీ డీలక్స్‌లు మాత్రం పాత బస్సులే. ఆర్టీసీ పాతబడిపోయిన రాజధాని బస్సులను ఒక్కొక్కటిగా తొలగిస్తూ.. వాటి స్థానంలో కొత్త బస్సులను చేరుస్తోంది. తొలగించిన పాత రాజధాని బస్సుల బాడీ తొలగించి.. వాటి ఛాసిస్‌లపై కొత్తగా సెమీ డీలక్స్ బస్ బాడీలను ఏర్పాటు చేయిస్తోంది. సాధారణంగా డీలక్స్, ఎక్స్‌ప్రెస్ బస్సులు 10 మీటర్ల పొడవు ఉంటే.. రాజధాని ఏసీ బస్సులు 12 మీటర్ల పొడవు ఉంటాయి. వాటినే సెమీ డీలక్స్‌గా మార్చుతున్నందున.. పొడవుకు అనుగుణంగా సీట్ల సంఖ్య ఎక్కువగా ఉంటోంది.
అంటే డీలక్స్, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో 51 సీట్లే ఉంటే.. సెమీ డీలక్స్‌లలో 59 సీట్లు వస్తున్నాయి. ఎక్స్‌ప్రెస్ తరహాలో సెమీ డీలక్స్ బస్సుల్లో 3 ప్లస్ 2 పద్ధతిలో సీట్లు ఏర్పాటు చేశారు. ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో సాధారణ రెగ్జిన్ సీట్లు ఉంటే.. సెమీ డీలక్స్‌లలో ఫ్యాబ్రిక్ సింగిల్ సీట్లను ఏర్పాటు చేశారు. ఇవి చూడటానికి ఆకర్షణీయంగా ఉన్నాయి. ఎక్స్‌ప్రెస్ బస్సుల్లాగే సెమీ డీలక్స్ కనీస చార్జీని రూ.30గానే నిర్ధారించినా.. తదుపరి ప్రతి కిలోమీటర్‌కు 11 పైసల చొప్పున ఎక్స్‌ప్రెస్‌ల కంటే అదనంగా చార్జీ ఉంటుంది.
ప్రస్తుతం ఆర్టీసీ 280 డీలక్స్ బస్సులను తిప్పుతోంది. అవి లేని మార్గాల్లో సెమీ డీలక్స్ బస్సులు తిరుగుతాయి. ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో సీట్ల కోసం నిత్యం కుస్తీలు పట్టాల్సి వస్తున్నందున.. పురుష ప్రయాణికులు, కొంతమేర మహిళలు ఖాళీగా, కొత్తగా కనిపించే సెమీ డీలక్స్ బస్సుల వైపు మళ్లుతారని ఆర్టీసీ భావిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment