సాక్షి, హైదరాబాద్: ఎయిర్‌పోర్టు మెట్రో ప్రాజెక్టును వేగంగా పట్టాలెక్కించేందుకు ప్రభుత్వం సీరియస్‌గా దృష్టి సారించింది. ఇప్పటికే మంత్రిమండలి తీర్మానం ప్రకారం నగరం నలువైపులా మెట్రో విస్తరణ కోసం చేపట్టాల్సిన కార్యాచరణపై కసరత్తు చేపట్టింది. ఈ మేరకు మంత్రి కేటీఆర్ గురువారం బేగంపేట్‌లోని మెట్రో భవన్‌లో ఉన్నతస్థాయి సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. హైదరాబాద్ మెట్రో రైల్ మాస్టర్ ప్లాన్, ఎయిర్‌పోర్ట్ మెట్రో ప్రాజెక్టుపై విస్తృతంగా చర్చించారు.
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, హైదరాబాద్ మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి, హెచ్‌ఎండీఏ కమిషనర్ అర్వింద్‌కుమార్, జయేష్ రంజన్ తదితర ఉన్నతాధికారులు సమావేశంలో పాల్గొన్నారు. హైదరాబాద్ విశ్వనగరంగా అభివృద్ధి చెందేందుకు బలమైన ప్రజారవాణా వ్యవస్థ ఎంతో అవసరమని, అందుకు మెట్రో రైల్ విస్తరణ దోహదం చేస్తుందని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ అభిప్రాయపడ్డారు.
ఇప్పటికే సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు నగరంలో ప్రజా రవాణా వ్యవస్థ విస్తరణకు అనేక చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ఈ దిశగా మెట్రో రైల్ విస్తరణ పనులను కూడా ముందుకు తీసుకెళ్లాలని అధికారులకు ఆయన దిశానిర్దేశం చేశారు. నగరంలో ట్రాఫిక్ రద్దీని, కాలుష్యాన్ని తగ్గిస్తూ విశ్వ నగరంగా మార్చాలన్నదే ప్రభుత్వ ఆలోచన అని చెప్పారు. ప్రజారవాణా వ్యవస్థను బలోపేతం చేయడం ద్వారా నగరానికి మరిన్ని భారీ పెట్టుబడులు వచ్చే అవకాశం కూడా ఉంటుందన్నారు.
రద్దీ మేరకు అదనపు కోచ్‌లు..
ప్రస్తుతం నగరంలో మెట్రో ప్రయాణికుల సంఖ్య 5 లక్షలు దాటింది. రోజురోజుకూ మెట్రోకు ఆదరణ పెరుగుతోంది. పలు మార్గాల్లో అనూహ్యంగా రద్దీ పెరిగింది. ఇందుకనుగుణంగా మెట్రో రైళ్లకు అదనపు కోచ్‌లను ఏర్పాటు చేయాలని కేటీఆర్ సూచించారు. మెట్రో లాస్ట్‌మైల్ కనెక్టివిటీపైన దృష్టి సారించాలని, ఎక్కువ మంది ప్రయాణికులను మెట్రో వైపు ఆకర్షించడం వల్ల వ్యక్తిగత వాహనాల వినియోగం గణనీయంగా తగ్గడమే కాకుండా మెట్రో ప్రయాణికుల సంఖ్య కూడా రెట్టింపవుతుందని పేర్కొన్నారు.
ఇందుకోసం ఫీడర్ సర్వీసులను పెంచాలని చెప్పారు. ఈ సందర్భంగా మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి, ఎయిర్‌పోర్టుమెట్రో ఎక్స్‌ప్రెస్‌వేతో పాటు, ప్రభుత్వం ప్రకటించిన హైదరాబాద్ మెట్రో రైల్ మాస్టర్ ప్లాన్ ప్రణాళికలపై పూర్తి వివరాలతో పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.
మెట్రో డిపోకు 48 ఎకరాలు ఇవ్వాలి..
రాయదుర్గం నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టు వరకు 31 కిలోమీటర్ల మార్గంలో చేపట్టనున్న ఎయిర్‌పోర్ట్ మెట్రో ఎక్స్‌వేపై సమావేశంలో ప్రధానంగా చర్చించారు. 48 ఎకరాల భూమిని జీఎంఆర్ ఆధ్వర్యంలోని ఎయిర్‌పోర్ట్ అథారిటీ వర్గాలు వెంటనే మెట్రో డిపో కోసం కేటాయించాలని ఆదేశించారు. ఈ మేరకు హైదరాబాద్ ఎయిర్‌పోర్టు మెట్రోకు భూమిని అప్పగించాలని కోరారు.
మరోవైపు మెట్రో విస్తరణ ప్రణాళికలపై ఎప్పటికప్పుడు సమీక్షించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి మంత్రి కేటీఆర్ సూచించారు. ఇప్పటికే సవివరమైన నివేదికలను సిద్ధం చేసిన బీహెచ్‌ఈఎల్–లక్డీకాపూల్, ఎల్‌బీనగర్–నాగోల్ కారిడార్‌లపై కేంద్రం నుంచి రూ.9100 కోట్ల అంచనా వ్యయంలో కొంత ఆర్థిక సహాయాన్ని అడిగామని, దీనికి సంబంధించిన అంశాన్ని కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారులతో సమన్వయం చేసుకోవాలని ఆయన అధికారులకు సూచించారు.
నివేదికలను సిద్ధం చేయండి...
నగరం నలువైపులా భారీగా మెట్రో విస్తరించాలన్న ప్రభుత్వ నిర్ణయం మేరకు ఆయా మార్గాలలో వెంటనే అవసరమైన సర్వేలను చేపట్టి ప్రాథమిక నివేదికలను, అనంతరం సవివరమైన ప్రాజెక్టు నివేదికలను సిద్ధం చేయాలని మంత్రి మెట్రో రైల్ అధికారులను ఆదేశించారు. మెట్రో రైల్ విస్తరణలో భాగంగా మెట్రో స్టేషన్లతో పాటు భారీ కార్ పార్కింగ్ కాంప్లెక్సుల నిర్మాణానికి ప్రభుత్వ ఆధీనంలో ఉన్న ఖాళీ స్థలాలను గుర్తించాలని హైదరాబాద్, మేడ్చల్, సంగారెడ్డి, జిల్లాలకు చెందిన కలెక్టర్లను మంత్రి కేటీఆర్ ఆదేశించారు.
వేగంగా పాతబస్తీ మెట్రో..
అనంతరం మంత్రి కేటీఆర్‌తో ఎంఐఎం శాసనసభా పక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీ సమావేశమయ్యారు. పాతబస్తీ మెట్రోను వేగంగా చేపట్టాలని కోరారు. ఈ సందర్భంగా పాతబస్తీ మెట్రో కారిడార్‌కు అవసరమైన భూ సేకరణ ప్రక్రియను చేపట్టామని త్వరలోనే కారిడార్ నిర్మాణ పనులు ప్రారంభమవుతాయని తెలిపారు. ఎంజీబీఎస్ నుంచి ఫలక్‌నుమా వరకు ఉన్న మార్గాన్ని ఎయిర్‌పోర్టు మెట్రో వరకు పొడిగించేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని మంత్రి కేటీఆర్ మెట్రో అధికారులకు సూచించారు.
సమీక్ష సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి కేటీఆర్
Comments
Please login to add a commentAdd a comment