Airport Metro
-
ఎయిర్ పోర్టు మెట్రో అలైన్ మెంట్ మార్పులు
-
ఎయిర్పోర్ట్ మెట్రోకు గ్రీన్‌సిగ్నల్
సాక్షి, హైదరాబాద్: ఎయిర్పోర్ట్ మెట్రోకు గ్రీన్‌సిగ్నల్ పడింది. సామాన్య, మధ్యతరగతి వర్గాలకు మెట్రో రైళ్లు అందుబాటులో ఉండాలనే లక్ష్యంతో పాతబస్తీ నుంచి శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి మెట్రో రెండో దశ విస్తరణకు ప్రభుత్వం ప్రతిపాదనలు రూపొందించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ప్రస్తుతం గతంలోనే ప్రణాళికలను రూపొందించినప్పటికీ పనులు చేపట్టకుండా మిగిలిపోయిన ఎంజీబీఎస్ నుంచి ఫలక్‌నుమా వరకు 5.5 కిలోమీటర్ల మార్గాన్ని నిర్మించేందుకు ప్రభుత్వం తాజాగా అనుమతినిచ్చింది. ఎయిర్‌పోర్టు మెట్రో విస్తరణలో భాగంగా నాగోల్–ఎల్బీనగర్, ఫలక్‌నుమా–చాంద్రాయణగుట్ట వరకు మెట్రో నిర్మాణం చేపట్టనున్నారు. చాంద్రాయణగుట్ట మెట్రో జంక్షన్ నుంచి మైలార్‌దేవ్‌పల్లి, పి–7 రోడ్డు మీదుగా ఎయిర్‌పోర్టు వరకు మెట్రో రైళ్లు పరుగులు తీస్తాయి. మెట్రో తొలిదశలో నాగోల్ నుంచి హైటెక్‌సిటీ వరకు, అక్కడి నుంచి రాయదుర్గం వరకు మెట్రో విస్తరణ చేపట్టిన సంగతి తెలిసిందే. దీంతో నగరానికి పడమటి వైపున ఐటీ అభివృద్ధికి మెట్రో దోహదం చేసింది. ప్రస్తుతం దక్షిణం వైపు నుంచి ఎయిర్‌పోర్టుకు మెట్రో నిర్మాణం చేపట్టనున్న దృష్ట్యా దక్షిణ హైదరాబాద్ వైపు అభివృద్ధి జరిగే అవకాశం ఉందని రియల్ వర్గాలు భావిస్తున్నాయి. ముఖ్యంగా నిర్మాణ రంగం ఊపందుకోనుంది. ప్రస్తుతం పడమటి వైపు ఔటర్‌కు ఇరువైపులా బహుళ అంతస్థుల భవనాలు పెద్ద ఎత్తున వినియోగంలోకి వచ్చాయి. 50 అంతస్థులకు మించిన హైరైజ్ బిల్డింగ్‌లను నిర్మించారు. అదే తరహాలో ఎయిర్‌పోర్టు చుట్టుపక్కల ప్రాంతాల్లో పెద్ద ఎత్తున హైరైజ్ భవనాల నిర్మాణం జరిగే అవకాశం ఉంది. అన్ని వర్గాలకు అందుబాటులో మెట్రో... హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి విదేశాలకు వెళ్లే వారిలో ఎక్కువ శాతం విద్యార్ధులు, ఉద్యోగాల కోసం వెళ్లే వారే ఉన్నారు. మరోవైపు పాతబస్తీ నుంచి, తెలంగాణలోని వివిధ జిల్లాల నుంచి ఏటా వేలాది మంది ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం తరలి వెళ్తారు. ఈ ప్రయాణికులంతా జేబీఎస్, ఎంజీబీఎస్,ఎల్బీనగర్ తదితర ప్రాంతాల నుంచి ఎయిపోర్టుకు వెళ్లేవారే ఎక్కువగా ఉంటారు. ప్రస్తుతం ప్రతిరోజు సుమారు 65 వేల మంది జాతీయ, అంతర్జాతీయ ప్రయాణికులు ఎయిర్‌పోర్టు నుంచి రాకపోకలు సాగిస్తున్నారు. ఈ ప్రయాణికుల్లో 80 శాతం వరకు నగరానికి తూర్పు, ఉత్తరం, దక్షిణం వైపు నుంచి ఎయిర్‌పోర్టుకు వెళ్లే వాళ్లే ఉంటారు. గత ప్రభుత్వం ప్రతిపాదించిన రాయదుర్గం–ఎయిర్‌పోర్టుకు బదులు ప్రస్తుత ప్రభుత్వం ప్రతిపాదించిన ఎంజీబీఎస్–ఎయిర్‌పోర్టు రూట్ వల్ల అన్ని వర్గాల ప్రజలకు మెట్రో సదుపాయం లభించనుంది. రియల్ భూమ్ మరోవైపు ఈ కొత్త రూట్ వల్ల ప్రయాణికులు జూబ్లీబస్‌స్టేషన్ నుంచి నేరుగా ఎయిర్‌పోర్టుకు వెళ్లవచ్చు. అలాగే రాయదుర్గం, అమీర్‌పేట్, ఉప్పల్, నాగోల్ మీదుగా ఎల్బీనగర్ నుంచి ఎయిర్‌పోర్టుకు రాకపోకలు సాగించేందుకు అవకాశం లభిస్తుంది. ‘ఈ ప్రాజెక్టు వల్ల ఎక్కువ మంది ప్రయాణికులకు మెట్రో రైలు సేవలు అందుబాటులో ఉంటాయని, నగరం నలుమూలల నుంచి కనెక్టివిటీ అందుబాటులోకి వస్తుందని’ అధికారులు పేర్కొంటున్నారు. రెండో దశలో 70 కిలోమీటర్ల మార్గంలో మెట్రో సేవలు అందుబాటులోకి రానున్నాయి. మొత్తం ఆరు కారిడార్లలో నిర్మించనున్న రెండో దశలో ఎయిర్‌పోర్టు మెట్రోతో పాటు రాజేంద్రనగర్ నుంచి హైకోర్టు ప్రాంగణం, రాయదుర్గం నుంచి అమెరికా కాన్సులేట్, మియాపూర్ నుంచి పటాన్చెరు,ఎల్బీనగర్ నుంచి హయత్‌నగర్ వరకు మెట్రో విస్తరణకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఇప్పటికే శంషాబాద్ ఎయిర్‌పోర్టు చుట్టుపక్కల ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ పరుగులు తీస్తోంది. మెట్రో రాకతో ఈ ప్రాంతంలో భూముల ధరలు భారీగా పెరిగే అవకాశం ఉంది. భారీ లే అవుట్లు, హైరైజ్ బిల్డింగ్లు, టౌన్‌షిప్పులు పెద్ద ఎత్తున అందుబాటులోకి రానున్నాయి. చాంద్రాయణగుట్ట, పహీడీషరీఫ్, రావిర్యాల, మహేశ్వరం, కడ్తాల్, ఫార్మాసిటీ,కందుకూరు,షాద్‌నగర్, తదితర ప్రాంతాల్లో నిర్మాణరంగం పెద్ద ఎత్తున విస్తరించుకోనుంది. ఇప్పటికే ఔటర్‌కు అన్ని వైపులా నివాస సముదాయాలు, కాలనీలు అభివృద్ధి చెందాయి. మెట్రో రెండోదశతో మరిన్ని కొత్త ప్రాంతాలు హైదరాబాద్ మహానగరంలో కలిసిపోనున్నాయి. ఔటర్‌రింగ్‌రోడ్డుకు, రీజనల్ రింగ్‌రోడ్డుకు మధ్య నగర విస్తరణకు మెట్రో కనెక్టివిటీ దోహదం చేయనుంది. -
ఎయిర్‌పోర్టు మెట్రోపై మేధోమథనం
హైదరాబాద్: ప్రతిపాదిత ఎయిర్‌పోర్టు మెట్రో ఫేజ్– 2పై అధికారులు కసరత్తు చేస్తున్నారు. నాగోల్, ఎల్బీనగర్, ఎంజీబీఎస్, ఫలక్‌నుమా మార్గాల్లో చాంద్రాయణగుట్ట మీదుగా ఎయిర్‌పోర్టు వరకు చేపట్టనున్న రూట్లో చాంద్రాయణగుట్ట వద్ద ఇంటర్చేంజ్ స్టేషన్ ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు కొత్త ఎయిర్పోర్ట్ రూట్, చాంద్రాయణగుట్ట ఇంటర్చేంజ్ స్టేషన్‌పై ఆదివారం మెట్రో భవన్లో హెచ్ఎంఆర్ఎల్ ఎండీ ఎనీ్వఎస్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన మేధోమథన సమావేశంలో ఉన్నతాధికారులు, ఇంజినీరింగ్ నిపుణులు, కన్సల్టెన్సీ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాల ప్రకారం.. నాగోల్ నుంచి ఎల్బీనగర్ వరకు మెట్రోను పొడిగించి అక్కడి నుంచి మైలార్‌దేవ్‌పల్లి మీదుగా శంషాబాద్ ఎయిర్‌పోర్టు వరకు మెట్రో విస్తరణ చేపట్టాల్సి ఉంది. ఈ మార్గంలో వ్యవసాయ విశ్వవిద్యాలయం వద్ద కొత్తగా హైకోర్టు భవనం అందుబాటులోకి రానున్న దృష్ట్యా మైలార్‌దేవ్‌పల్లి నుంచి నూతన హైకోర్టు భవనం మీదుగా ఎయిర్‌పోర్టు వరకు మెట్రోను విస్తరించే అంశాన్ని కూడా పరిశీలించాలని ఎనీ్వఎస్ రెడ్డి అధికారులకు సూచించారు. మెట్రోస్టేషన్లు, డిపోల ఏర్పాటు, ఆపరేషన్ కంట్రోల్ సిస్టమ్, సిగ్నలింగ్ వ్యవస్థ, తదితర సాంకేతిక అంశాలు, ప్రయాణికుల లగేజీ తనిఖీలు, సెక్యూరిటీ చెకింగ్లు వంటి అంశాలను సైతం సమగ్రంగా చర్చించారు. సమగ్రమైన ప్రాజెక్టు నివేదికను (డీపీఆర్)ను సిద్ధం చేయాలని చెప్పారు. అమీర్‌పేట్ తరహాలో చాంద్రాయణగుట్ట వద్ద అతిపెద్ద ఇంటర్చేంజ్ స్టేషన్ అందుబాటులోకి రానున్న దృష్ట్యా దాని నిర్మాణంపై ప్రత్యేక అధ్యయనం చేపట్టాలని నిర్ణయించారు. సమావేశంలో చీఫ్ ఎలక్ట్రికల్ ఇంజినీర్ డీవీఎస్ రాజు, చీఫ్ సిగ్నల్ అండ్ టెలికం ఇంజినీర్ ఎస్కె దాస్, చీఫ్ ప్రాజెక్ట్ మేనేజర్ బి.ఆనంద్మెహన్, జనరల్ మేనేజర్లు ఎం.విష్ణువర్ధన్‌రెడ్డి, బీఎన్ రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. -
ఎక్స్‌ప్రెస్ వేగంతో ఎయిర్‌పోర్టు మెట్రో.. కేటీఆర్ కీలక సూచనలు
సాక్షి, హైదరాబాద్: ఎయిర్‌పోర్టు మెట్రో ప్రాజెక్టును వేగంగా పట్టాలెక్కించేందుకు ప్రభుత్వం సీరియస్‌గా దృష్టి సారించింది. ఇప్పటికే మంత్రిమండలి తీర్మానం ప్రకారం నగరం నలువైపులా మెట్రో విస్తరణ కోసం చేపట్టాల్సిన కార్యాచరణపై కసరత్తు చేపట్టింది. ఈ మేరకు మంత్రి కేటీఆర్ గురువారం బేగంపేట్‌లోని మెట్రో భవన్లో ఉన్నతస్థాయి సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. హైదరాబాద్ మెట్రో రైల్ మాస్టర్ ప్లాన్, ఎయిర్పోర్ట్ మెట్రో ప్రాజెక్టుపై విస్తృతంగా చర్చించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, హైదరాబాద్ మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి, హెచ్ఎండీఏ కమిషనర్ అర్వింద్‌కుమార్, జయేష్ రంజన్ తదితర ఉన్నతాధికారులు సమావేశంలో పాల్గొన్నారు. హైదరాబాద్ విశ్వనగరంగా అభివృద్ధి చెందేందుకు బలమైన ప్రజారవాణా వ్యవస్థ ఎంతో అవసరమని, అందుకు మెట్రో రైల్ విస్తరణ దోహదం చేస్తుందని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ అభిప్రాయపడ్డారు. ఇప్పటికే సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు నగరంలో ప్రజా రవాణా వ్యవస్థ విస్తరణకు అనేక చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ఈ దిశగా మెట్రో రైల్ విస్తరణ పనులను కూడా ముందుకు తీసుకెళ్లాలని అధికారులకు ఆయన దిశానిర్దేశం చేశారు. నగరంలో ట్రాఫిక్ రద్దీని, కాలుష్యాన్ని తగ్గిస్తూ విశ్వ నగరంగా మార్చాలన్నదే ప్రభుత్వ ఆలోచన అని చెప్పారు. ప్రజారవాణా వ్యవస్థను బలోపేతం చేయడం ద్వారా నగరానికి మరిన్ని భారీ పెట్టుబడులు వచ్చే అవకాశం కూడా ఉంటుందన్నారు. రద్దీ మేరకు అదనపు కోచ్‌లు.. ప్రస్తుతం నగరంలో మెట్రో ప్రయాణికుల సంఖ్య 5 లక్షలు దాటింది. రోజురోజుకూ మెట్రోకు ఆదరణ పెరుగుతోంది. పలు మార్గాల్లో అనూహ్యంగా రద్దీ పెరిగింది. ఇందుకనుగుణంగా మెట్రో రైళ్లకు అదనపు కోచ్‌లను ఏర్పాటు చేయాలని కేటీఆర్ సూచించారు. మెట్రో లాస్ట్‌మైల్ కనెక్టివిటీపైన దృష్టి సారించాలని, ఎక్కువ మంది ప్రయాణికులను మెట్రో వైపు ఆకర్షించడం వల్ల వ్యక్తిగత వాహనాల వినియోగం గణనీయంగా తగ్గడమే కాకుండా మెట్రో ప్రయాణికుల సంఖ్య కూడా రెట్టింపవుతుందని పేర్కొన్నారు. ఇందుకోసం ఫీడర్ సర్వీసులను పెంచాలని చెప్పారు. ఈ సందర్భంగా మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి, ఎయిర్పోర్టుమెట్రో ఎక్స్‌ప్రెస్‌వేతో పాటు, ప్రభుత్వం ప్రకటించిన హైదరాబాద్ మెట్రో రైల్ మాస్టర్ ప్లాన్ ప్రణాళికలపై పూర్తి వివరాలతో పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. మెట్రో డిపోకు 48 ఎకరాలు ఇవ్వాలి.. రాయదుర్గం నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టు వరకు 31 కిలోమీటర్ల మార్గంలో చేపట్టనున్న ఎయిర్పోర్ట్ మెట్రో ఎక్స్వేపై సమావేశంలో ప్రధానంగా చర్చించారు. 48 ఎకరాల భూమిని జీఎంఆర్ ఆధ్వర్యంలోని ఎయిర్పోర్ట్ అథారిటీ వర్గాలు వెంటనే మెట్రో డిపో కోసం కేటాయించాలని ఆదేశించారు. ఈ మేరకు హైదరాబాద్ ఎయిర్‌పోర్టు మెట్రోకు భూమిని అప్పగించాలని కోరారు. మరోవైపు మెట్రో విస్తరణ ప్రణాళికలపై ఎప్పటికప్పుడు సమీక్షించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి మంత్రి కేటీఆర్ సూచించారు. ఇప్పటికే సవివరమైన నివేదికలను సిద్ధం చేసిన బీహెచ్ఈఎల్–లక్డీకాపూల్, ఎల్బీనగర్–నాగోల్ కారిడార్లపై కేంద్రం నుంచి రూ.9100 కోట్ల అంచనా వ్యయంలో కొంత ఆర్థిక సహాయాన్ని అడిగామని, దీనికి సంబంధించిన అంశాన్ని కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారులతో సమన్వయం చేసుకోవాలని ఆయన అధికారులకు సూచించారు. నివేదికలను సిద్ధం చేయండి... నగరం నలువైపులా భారీగా మెట్రో విస్తరించాలన్న ప్రభుత్వ నిర్ణయం మేరకు ఆయా మార్గాలలో వెంటనే అవసరమైన సర్వేలను చేపట్టి ప్రాథమిక నివేదికలను, అనంతరం సవివరమైన ప్రాజెక్టు నివేదికలను సిద్ధం చేయాలని మంత్రి మెట్రో రైల్ అధికారులను ఆదేశించారు. మెట్రో రైల్ విస్తరణలో భాగంగా మెట్రో స్టేషన్లతో పాటు భారీ కార్ పార్కింగ్ కాంప్లెక్సుల నిర్మాణానికి ప్రభుత్వ ఆధీనంలో ఉన్న ఖాళీ స్థలాలను గుర్తించాలని హైదరాబాద్, మేడ్చల్, సంగారెడ్డి, జిల్లాలకు చెందిన కలెక్టర్లను మంత్రి కేటీఆర్ ఆదేశించారు. వేగంగా పాతబస్తీ మెట్రో.. అనంతరం మంత్రి కేటీఆర్‌తో ఎంఐఎం శాసనసభా పక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీ సమావేశమయ్యారు. పాతబస్తీ మెట్రోను వేగంగా చేపట్టాలని కోరారు. ఈ సందర్భంగా పాతబస్తీ మెట్రో కారిడార్‌కు అవసరమైన భూ సేకరణ ప్రక్రియను చేపట్టామని త్వరలోనే కారిడార్ నిర్మాణ పనులు ప్రారంభమవుతాయని తెలిపారు. ఎంజీబీఎస్ నుంచి ఫలక్‌నుమా వరకు ఉన్న మార్గాన్ని ఎయిర్‌పోర్టు మెట్రో వరకు పొడిగించేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని మంత్రి కేటీఆర్ మెట్రో అధికారులకు సూచించారు. సమీక్ష సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి కేటీఆర్ -
ఎయిర్‌పోర్టు మెట్రోకు యమ క్రేజ్.. పోటీలో అంతర్జాతీయ దిగ్గజ సంస్థలు
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఎయిర్‌పోర్టు మెట్రో ఎక్స్‌ప్రెస్ నిర్మాణానికి అంతర్జాతీయ దిగ్గజ సంస్థలు పోటీపడుతున్నాయి. బిడ్డింగ్ గడువు సమీపిస్తుండడంతో పలు నిర్మాణసంస్థల నుంచి అనూహ్యమైన స్పందన వస్తోంది. ఇంజనీరింగ్, ప్రొక్యూర్మెంట్ అండ్ కన్స్ట్రక్షన్ (ఈపీసీ) పద్ధతిలో ఈ ప్రాజెక్టు నిర్మాణం కోసం హైదరాబాద్ ఎయిర్పోర్ట్ మెట్రో రైల్ సంస్థ టెండర్లను ఆహ్వానించిన సంగతి తెలిసిందే. సుమారు రూ.6 వేల కోట్లకు పైగా అంచనా వ్యయంతో చేపట్టనున్న ఈ ప్రాజెక్టును దక్కించుకొనేందుకు అనేక సంస్థలు ఆసక్తి చూపుతున్నాయని, మరో ఐదు రోజులే మిగిలి ఉన్నందువల్ల మరిన్ని సంస్థలు బిడ్లను దాఖలు చేసే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. నాగోల్–రాయదుర్గం, ఎల్బీనగర్–మియాపూర్, జేబీఎస్–ఎంజీబీఎస్ కారిడార్లలో మెట్రో అందుబాటులోకి వచ్చిన తరువాత హైదరాబాద్ ముఖచిత్రం మారింది. వ్యాపార, వాణిజ్య రంగాలు, రియల్ ఎస్టేట్ పరుగులు పెట్టాయి. దీంతో నగరంలో మెట్రో రైలును నిర్మాణ సంస్థలు లాభదాయకమైన ప్రాజెక్టుగా భావిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఐటీ, రియల్ రంగాల్లో గణనీయమైన అభివృద్ధిని సాధించిన రాయదుర్గం– శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయ కారిడార్‌ను దక్కించుకొనేందుకు గ్లోబల్‌స్థాయిలో పోటీ పెరిగింది. నిర్మాణ సంస్థలు ఈ కారిడార్‌ను ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించడమే ఇందుకు కారణమని ఒక అధికారి అభిప్రాయపడ్డారు. చదవండి: విద్యార్థులకు గుడ్‌న్యూస్ చెప్పిన హైదరాబాద్ మెట్రో ఇప్పటికే ఎల్అండ్టీ, ఆల్స్టామ్, సీమెన్స్, టాటా ప్రాజెక్ట్స్, ఐఆర్సీఓఎన్, ఆర్వీఎన్ఎల్, బీఈఎంఎల్, పీఏఎన్డీఆర్ఓఎల్ రహీ టెక్నాలజీస్ తదితర జాతీయ, అంతర్జాతీయ స్థాయికి చెందిన కంపెనీలు పోటీలో ఉండగా, గడువు ముగిసేనాటికి మరిన్ని సంస్థలు పోటీలో నిలిచే అవకాశం ఉన్నట్లు అధికారులు చెప్పారు. రెండేళ్లలో పూర్తి... మరోవైపు ఈ మార్గాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ 2026 నాటికి పూర్తి చేసేవిధంగా హైదరాబాద్ ఎయిర్‌పోర్టు మెట్రో రైల్ కార్యాచరణ చేపట్టింది. తాము విధించిన నిబంధనలు, షరతులకు అనుగుణంగానే నిర్మాణ సంస్థలు తమ బిడ్లను దాఖలు చేయాలని గతంలోనే అధికారులు స్పష్టం చేశారు. రాయదుర్గం నుంచి ఎయిర్‌పోర్టు వరకు సుమారు 31 కిలోమీటర్ల దూరంలో అందుబాటులోకి రానున్న ఎయిర్పోర్ట్ మెట్రో ఎక్స్‌ప్రెస్ కోసం ఇప్పటి వరకు సర్వే, పెగ్‌మార్కింగ్, అలైన్మెంట్ తదితర పనులు పూర్తయ్యాయి. ఈ మార్గంలో 29.3 కిలోమీటర్ల ఎలివేటెడ్ కారిడార్ కాగా, 1.7 కిలోమీటర్ల వరకు భూగర్భమార్గంలో ట్రాక్ నిర్మాణం చేపట్టవలసి ఉంటుంది. ఎయిర్‌పోర్టు టర్మినల్ సమీపంలో ఒక భూగర్భ మెట్రో స్టేషన్‌తో పాటు మొత్తం 9 మెట్రో స్టేషన్లు రానున్నాయి. ఈ ప్రాజెక్టు వ్యయంలో హెచ్ఎండీఏ, జీఎమ్మార్ ఎయిర్‌పోర్టు 10 శాతం చొప్పున భరిస్తుండగా, మిగతా మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందజేయనుంది. మొదట 11 రైళ్లతో ప్రారంభం.. రాయదుర్గం –ఎయిర్‌పోర్టు మార్గంలో మొదట 11 రైళ్లను ప్రవేశపెట్టనున్నారు. ప్రతి మెట్రోకు 3 కోచ్‌లు ఉంటాయి. మొత్తం 33 కోచ్‌లతో సర్వీసులను అందుబాటులోకి తెస్తారు. ప్రయాణికుల రద్దీ, డిమాండ్‌కు అనుగుణంగా కోచ్‌ల సంఖ్యను పెంచనున్నట్లు అధికారులు చెప్పారు. ప్రస్తుతం ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌మెట్రో 6 కోచ్‌లు, చైన్నె ఎయిర్పోర్ట్ మెట్రో 4 కోచ్‌లతో నడుస్తోంది. మొదట్లో రద్దీ సమయంలో ప్రతి 8 నిమిషాలకు ఒకటి, రద్దీ లేని సమయాల్లో ప్రతి 10 నిమిషాలకు ఒక ట్రైన్ చొప్పున నడుపుతారు. ఆ తరువాత రద్దీ వేళల్లో ప్రతి 3 నిమిషాలకు ఒకటి, రద్దీ లేని సమయాల్లో ప్రతి 5 నిమిషాలకు ఒకటి చొప్పున నడిపే విధంగా ప్రణాళికలను రూపొందించినట్లు తెలిసింది. నగరం పడమటి వైపు శరవేగంగా అభివృద్ధి చెందుతున్న దృష్ట్యా కేవలం ఎయిర్‌పోర్టు ప్రయాణికులే కాకుండా అన్ని వర్గాల ప్రయాణికులు కూడా ఎయిర్పోర్ట్ మెట్రో సేవలను వినియోగించుకొనే అవకాశం ఉంది. దీంతో రైళ్లు, సర్వీసుల సంఖ్య భారీగా పెరగవచ్చునని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రాథమికంగా 9 స్టేషన్లను ఖరారు చేసినప్పటికీ ప్రాజెక్టు నిర్మాణ క్రమంలో మరిన్ని స్టేషన్లకు కూడా డిమాండ్ నెలకొనే అవకాశం ఉంది. -
ఎయిర్పోర్ట్ మెట్రో మార్గంలో సోలార్ పవర్!
సాక్షి, హైదరాబాద్: రాయదుర్గం మైండ్‌స్పేస్ జంక్షన్ నుంచి శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం వరకు నిర్మించనున్న ఎక్స్‌ప్రెస్ మెట్రో సౌరకాంతుల శోభను సంతరించుకోనుంది. 31 కి.మీ. మేర చేపడుతున్న ఈ ప్రాజెక్టులో మొత్తంగా 9 నుంచి 10 స్టేషన్లను నిర్మించనున్నారు. స్టేషన్లలో పూర్తిస్థాయిలో సౌరశక్తి వినియోగం ఆధారంగా విద్యుత్ దీపాలు, ఎలివేటర్లు, ఎస్కలేటర్లు తదితర విద్యుత్ ఆధార ఉపకరణాలు పనిచేసేలా హైదరాబాద్ ఎయిర్పోర్ట్ మెట్రో లిమిటెడ్ సంస్థ చర్యలు చేపట్టనుంది. ఇప్పటికే తొలిదశ మెట్రో ప్రాజెక్టులో 28 మెట్రోస్టేషన్ల పైకప్పులు, ఉప్పల్, మియాపూర్ డిపోల్లోని ఖాళీప్రదేశాల్లో 8.35 మెగావాట్ల క్యాప్టివ్ సోలార్ పవర్‌ను ఉత్పత్తి చేస్తుండటం గమనార్హం. మెట్రోస్టేషన్లు, కార్యాలయాల్లో ఉపయోగించే విద్యుత్ అవసరాల్లో సుమారు 15 శాతం సౌరశక్తి ద్వారానే పొందుతున్నట్లు తొలిదశ మెట్రో నిర్మాణ సంస్థ ఎల్ అండ్ టీ వర్గాలు తెలిపాయి. తొలిదశలో సౌరశక్తి వినియోగం ఇలా.. సంప్రదాయేతర ఇంధన వనరులపై మెట్రో సంస్థ దృష్టి సారించింది. ఇప్పటికే మెట్రో రైళ్లలో బ్రేకులు వేసినప్పుడు ఉత్పన్నమయ్యే బలంతో విద్యుత్ ఉత్పత్తి అయ్యేలా రిజనరేటివ్ బ్రేకింగ్ వ్యవస్థను ఉపయోగిస్తున్నారు. సౌరశక్తి, రిజనరేటివ్ బ్రేకింగ్ వ్యవస్థలను ఉపయోగిస్తున్నందుకు 20 మెట్రోస్టేషన్లు ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ గుర్తింపు పొందాయి. లీడర్షిప్ ఇన్ ఎనర్జీ అండ్ ఎన్విరాన్మెంటల్ డిజైన్ ప్లాటినం సర్టిఫికెట్‌ను కూడా మెట్రో సాధించింది. మెట్రోస్టేషన్లను 100 శాతం సౌరవెలుగును ఉపయోగించుకోవడం, క్రాస్ వెంటిలేషన్ ఉండేలా జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఇంధన వినియోగాన్ని పరిమిత మోతాదులో వినియోగించుకునేలా చర్యలు తీసుకున్నారు. ఉప్పల్, మియాపూర్ డిపోల్లో వర్షపునీటిని ఒడిసిపట్టేందుకు 150 భారీ ఇంకుడుగుంతలను ఏర్పాటు చేశారు. ఆయా ప్రాంగణాల్లో వర్షపునీరు నిల్వ ఉండకుండా చర్యలు చేపట్టింది. -
ఎయిర్పోర్ట్ మెట్రోపై ‘విదేశీ’ ఆసక్తి.. జనరల్ కన్సల్టెంట్‌దే కీలక పాత్ర
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఎయిర్పోర్ట్ ఎక్స్‌ప్రెస్ మెట్రో ప్రాజెక్టులో పాలుపంచుకునేందుకు పలు విదేశీ కంపెనీలు ఆసక్తి చూపుతున్నాయి. ప్రాజెక్టు నిర్మాణంలో అత్యంత కీలక పాత్ర పోషించే జనరల్ కన్సల్టెంట్ నియామకానికి సంబంధించి నిర్వహించిన అర్హత అభ్యర్థన (రిక్వెస్ట్ ఫర్ క్వాలిఫికేషన్)కు పలు విదేశీ సంస్థల నుంచి పలు బిడ్లు దాఖలయ్యాయి. ఈ జాబితాలో ఫ్రాన్స్, జర్మనీ, జపాన్, స్పెయిన్, సౌత్ కొరియా, స్విట్జర్లాండ్ తదితర దేశాలకు చెందిన కంపెనీలున్నాయి. మొత్తంగా 13 ప్రతిష్టాత్మక దేశ, విదేశీ సంస్థలు అయిదు కన్సార్షియంలుగా ఏర్పడి ప్రీ క్వాలిఫికేషన్ బిడ్లు దాఖలు చేసినట్లు హైదరాబాద్ ఎయిర్పోర్ట్ మెట్రో లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. ఆయా కన్సార్షియంలు దాఖలు చేసిన బిడ్లను మూల్యాంకన ప్రక్రియను ఈ నెలాఖరుకు పూర్తి చేస్తామన్నారు. చదవండి: కరోనా కొత్త వేరియంట్‌పై తెలంగాణ ప్రభుత్వం అలర్ట్ బిడ్ దాఖలు చేసిన కన్షార్షియంలు ఇవే.. ►సిస్ట్రా (ఫ్రాన్స్), ఆర్ఐటీఈఎస్ (ఇండియా, డీబీ ఇంజినీరింగ్ అండ్ కన్సల్టింగ్(జర్మనీ). ►ఆయేసా ఇంజనెర్సియా ఆర్కెటెక్ట్రా (స్పెయిన్),నిప్పాన్ కోయి (జపాన్), ఆర్వీ అసోసియేట్స్ (ఇండియా). ►టెక్నికా వై ప్రోయెక్టోస్ (టీవైపీఎస్ఏ–స్పెయిన్), పీనీ గ్రూప్ (స్విట్జర్లాండ్). ►ఏఈకామ్ ఇండియా, ఈజిస్ రెయిల్(ఫ్రాన్స్), ఈజిస్ ఇండియా. ►కన్సల్టింగ్ ఇంజినీర్స్ గ్రూప్ (ఇండియా), కొరియా నేషనల్ రైల్వే (సౌత్ కొరియా). జనరల్ కన్సల్టెంట్ నిర్వహించాల్సిన విధులివే.. ►హైదరాబాద్ ఎయిర్పోర్ట్ మెట్రో లిమిటెడ్‌కు అన్ని సాంకేతిక, ప్రాజెక్ట్ నిర్వహణ సంబంధిత విధుల్లో జనరల్ కన్సల్టెంట్ ఏజెన్సీ సహాయం చేస్తుంది. మూడేళ్ల కాల వ్యవధిలో ఈ కింది విధులు నిర్వహించాల్సిఉంటుంది. ►సమగ్ర ప్రాజెక్ట్ నివేదికను సమీక్షిస్తుంది. టెండర్ డాక్యుమెంటేషన్ ,మూల్యాంకనం చేపడుతుంది. డిజైన్ మేనేజ్మెంట్. వివిధ రకాల కాంట్రాక్టర్లు, సరఫరాదారులు సమర్పించిన డిజైన్లు,డ్రాయింగ్ల ప్రూఫ్ చెక్ చేస్తుంది. దస్తావేజు నియంత్రణ. ►ప్రాజెక్ట్ ప్రణాళిక. ఇంటర్ఫేస్ నిర్వహణ. నిర్మాణ నిర్వహణ. నాణ్యత హామీ, నాణ్యత నియంత్రణ. ఆరోగ్యం, భద్రత నిర్వహణ, కాంట్రాక్ట్ అడ్మిని్రస్టేషన్, పునరుత్పాదక శక్తి వ్యవస్థ, లోపాలు సరిదిద్దడంతో సహా అంగీకార ప్రమాణాలు సరిపోలుస్తుంది. ఓఅండ్ఎం ప్రణాళిక. హెచ్ఏఎంఎల్, మెట్రో సిబ్బందికి శిక్షణ. ప్రాజెక్ట్ కోసం సెక్యూరిటీ ఆడిట్ మొదలైన విధులు నిర్వహించాల్సి ఉంటుంది. -
అందరికీ అందుబాటులో ఉండేలా చూడండి
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ మెట్రో రైలు అందరికీ అందుబాటులో ఉండేలా చూడాలని సంబంధిత అధికారులకు కేంద్ర పట్టణ అభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు సంబంధిత అధికారులకు సూచించారు. మెట్రో రైలును ప్రోత్సహించడంతోపాటు ప్రయాణికుల సాధక బాధకాలను ఆలకించేందుకు ఆయన సోమవారం ఎయిర్పోర్ట్ మెట్రో మార్గంలో అంతర్జాతీయ ఎయిర్‌పోర్టు స్టేషన్ నుంచి శివాజీ పార్కు స్టేషన్ వరకూ ప్రయాణించారు. వీటి సేవలు ప్రజాదరణ పొందేలా చేసేందుకు ప్రయత్నిస్తామన్నారు. అదేవిధంగా ప్రయాణ చార్జీల భారం తగ్గించేం దుకు కృషి చేస్తామన్నారు. మెట్రో రైలు నిర్వహణ బాధ్యతలను సమర్థంగా నిర్వర్తిస్తోం దంటూఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్‌పై ఆయన ప్రశంసల జల్లులు కురిపించారు. మెట్రో రైలు వ్యవస్థ బాగుందన్నారు. ‘నిజంగా సకాలంలో, అత్యంత సౌకర్యవంతంగా తమ తమ గమ్యస్థానాలకు చేరుకోవాలనుకునేవారికి ఇదొక చక్కని ప్రజారవాణా వ్యవస్థ అని నేను భావిస్తున్నా. ఢిల్లీ మెట్రోతోపాటు దేశంలోని ఇతర ప్రాంతాల్లో అందుబాటులోకి రానున్న ఈ వ్యవస్థ నవీన భారతానికి సూచిక .మనం కనుక మంచి అవకాశాలు కల్పించగలిగితే వాటిని సద్వినియోగం చేసుకోగల సామర్థ్యం మన ప్రజలకు ఉంది. వారు అద్భుతాలు సృష్టించగలుగుతారు’ అని అన్నారు. ఈ సందర్భంగా వెంకయ్య... పలువురు ప్రయాణికులతో ముచ్చటించి వారి సాధక బాధకాలను ఎంతో ఓపిగ్గా ఆలకించారు. వారి సలహాలు, సూచనలను స్వీకరించారు. ప్రయా ణ చార్జీలు, ఆయా స్టేషన్లలో వెసులుబాట్లు, మెట్రో రైళ్ల ఫ్రీక్వెన్సీ పెంపు తదితర అంశాలపై వారితో ఆయన మాట్లాడారు. ‘ప్రయాణికులతో మాట్లాడేందుకు నాకో సువర్ణావకాశం లభించింది. వారితో అనేక అంశాలపై మాట్లాడాను. చార్జీలు ఎక్కువగా ఉన్నాయని వారు నాతో చెప్పారు. ఈ అంశాన్ని పరిశీలించాలని, వీలైనంత త్వరగా ఓ నిర్ణయానికి రావాలని సంబంధిత అధికారులకు సూచించా. ఢిల్లీ మెట్రో- ఢిల్లీ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్( డీటీసీ)లను అనుసంధానం చేయడంద్వారా కనె క్టివిటీ పెంచేందుకు తగు చర్యలు తీసుకోవాలని కూడా సూచించా. ఇందువల్ల ప్రయాణికులకు మరింత వెసులుబాటు కలుగుతుంది. అయితే ఇదంతా జరిగేందుకు కొంత సమయం పడుతుంది. ఎల్లకాలం ప్రభుత్వ సబ్సిడీలపై ఆధారపడడం మంచిది కాదు’ అని అన్నారు. ఢిల్లీ మెట్రో స్టేషన్లలో ఏటీఎంలు, ఫుడ్ కోర్టులను ఏర్పాటు చేయడంతో ప్రకటనలకు అవకాశం కల్పిస్తే డీఎం ఆర్సీ ఆదాయం పెరుగుతుందన్నారు. ఢిల్లీ మెట్రో సేవలను విస్తరించాలని యోచిస్తున్నట్టు వెంకయ్య నాయుడు చెప్పారు. జాతీయ రాజధాని నుంచి ఉత్తరప్రదేశ్, హర్యానా, రాజస్థాన్‌లకు వెళ్లే ప్రయాణికులకు దీనిని అనువుగా ఉండేవిధంగా తీర్చిదిద్దుతామన్నారు. ఇదంతా ప్రణాళికాబద్ధంగా జరుగుతుందన్నారు. రాజధానికి ఉత్తరప్రదేశ్, హర్యానా, రాజస్థాన్ ప్రతిరోజూ రాకపోకలు సాగించేవారికి ఇది అనువుగా ఉండడమనేది అత్యం త ముఖ్యమన్నారు. రహదార్లపై రాకపోకలు సాగి స్తున్న వాహనాల సంఖ్య నానాటికీ పెరిగిపోతోం దని, దీంతో నగరవాసులతోపాటు ఇతర ప్రాంతాల నుంచి వచ్చేవారు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. మెట్రో రైలులో ప్రయాణం వల్ల తనకు 40 నిమిషాల సమయం ఆదా అయిందని తెలిపారు. రహదారులపై ప్రయాణంవల్ల సమయం వృథా అవడమే కాకుండా అలసట కలుగుతుందన్నారు. తన మాదిరిగానే తన సహచర మంత్రులు కూడా దీనిలో ప్రయాణించాలని ఆయన సూచించారు.