సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఎయిర్‌పోర్టు మెట్రో ఎక్స్‌ప్రెస్ నిర్మాణానికి అంతర్జాతీయ దిగ్గజ సంస్థలు పోటీపడుతున్నాయి. బిడ్డింగ్ గడువు సమీపిస్తుండడంతో పలు నిర్మాణసంస్థల నుంచి అనూహ్యమైన స్పందన వస్తోంది. ఇంజనీరింగ్, ప్రొక్యూర్‌మెంట్ అండ్ కన్‌స్ట్రక్షన్ (ఈపీసీ) పద్ధతిలో ఈ ప్రాజెక్టు నిర్మాణం కోసం హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ మెట్రో రైల్ సంస్థ టెండర్లను ఆహ్వానించిన సంగతి తెలిసిందే. సుమారు రూ.6 వేల కోట్లకు పైగా అంచనా వ్యయంతో చేపట్టనున్న ఈ ప్రాజెక్టును దక్కించుకొనేందుకు అనేక సంస్థలు ఆసక్తి చూపుతున్నాయని, మరో ఐదు రోజులే మిగిలి ఉన్నందువల్ల మరిన్ని సంస్థలు బిడ్‌లను దాఖలు చేసే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు.
నాగోల్–రాయదుర్గం, ఎల్‌బీనగర్–మియాపూర్, జేబీఎస్–ఎంజీబీఎస్ కారిడార్‌లలో మెట్రో అందుబాటులోకి వచ్చిన తరువాత హైదరాబాద్ ముఖచిత్రం మారింది. వ్యాపార, వాణిజ్య రంగాలు, రియల్ ఎస్టేట్ పరుగులు పెట్టాయి. దీంతో నగరంలో మెట్రో రైలును నిర్మాణ సంస్థలు లాభదాయకమైన ప్రాజెక్టుగా భావిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఐటీ, రియల్ రంగాల్లో గణనీయమైన అభివృద్ధిని సాధించిన రాయదుర్గం– శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయ కారిడార్‌ను దక్కించుకొనేందుకు గ్లోబల్‌స్థాయిలో పోటీ పెరిగింది. నిర్మాణ సంస్థలు ఈ కారిడార్‌ను ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించడమే ఇందుకు కారణమని ఒక అధికారి అభిప్రాయపడ్డారు.
చదవండి: విద్యార్థులకు గుడ్‌న్యూస్ చెప్పిన హైదరాబాద్ మెట్రో
ఇప్పటికే ఎల్‌అండ్‌టీ, ఆల్‌స్టామ్, సీమెన్స్, టాటా ప్రాజెక్ట్స్, ఐఆర్‌సీఓఎన్, ఆర్‌వీఎన్‌ఎల్, బీఈఎంఎల్, పీఏఎన్‌డీఆర్‌ఓఎల్ రహీ టెక్నాలజీస్ తదితర జాతీయ, అంతర్జాతీయ స్థాయికి చెందిన కంపెనీలు పోటీలో ఉండగా, గడువు ముగిసేనాటికి మరిన్ని సంస్థలు పోటీలో నిలిచే అవకాశం ఉన్నట్లు అధికారులు చెప్పారు.
రెండేళ్లలో పూర్తి...
మరోవైపు ఈ మార్గాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ 2026 నాటికి పూర్తి చేసేవిధంగా హైదరాబాద్ ఎయిర్‌పోర్టు మెట్రో రైల్ కార్యాచరణ చేపట్టింది. తాము విధించిన నిబంధనలు, షరతులకు అనుగుణంగానే నిర్మాణ సంస్థలు తమ బిడ్‌లను దాఖలు చేయాలని గతంలోనే అధికారులు స్పష్టం చేశారు. రాయదుర్గం నుంచి ఎయిర్‌పోర్టు వరకు సుమారు 31 కిలోమీటర్ల దూరంలో అందుబాటులోకి రానున్న ఎయిర్‌పోర్ట్ మెట్రో ఎక్స్‌ప్రెస్ కోసం ఇప్పటి వరకు సర్వే, పెగ్‌మార్కింగ్, అలైన్‌మెంట్ తదితర పనులు పూర్తయ్యాయి.
ఈ మార్గంలో 29.3 కిలోమీటర్ల ఎలివేటెడ్ కారిడార్ కాగా, 1.7 కిలోమీటర్ల వరకు భూగర్భమార్గంలో ట్రాక్ నిర్మాణం చేపట్టవలసి ఉంటుంది. ఎయిర్‌పోర్టు టర్మినల్ సమీపంలో ఒక భూగర్భ మెట్రో స్టేషన్‌తో పాటు మొత్తం 9 మెట్రో స్టేషన్‌లు రానున్నాయి. ఈ ప్రాజెక్టు వ్యయంలో హెచ్‌ఎండీఏ, జీఎమ్మార్ ఎయిర్‌పోర్టు 10 శాతం చొప్పున భరిస్తుండగా, మిగతా మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందజేయనుంది.
మొదట 11 రైళ్లతో ప్రారంభం..
రాయదుర్గం –ఎయిర్‌పోర్టు మార్గంలో మొదట 11 రైళ్లను ప్రవేశపెట్టనున్నారు. ప్రతి మెట్రోకు 3 కోచ్‌లు ఉంటాయి. మొత్తం 33 కోచ్‌లతో సర్వీసులను అందుబాటులోకి తెస్తారు. ప్రయాణికుల రద్దీ, డిమాండ్‌కు అనుగుణంగా కోచ్‌ల సంఖ్యను పెంచనున్నట్లు అధికారులు చెప్పారు. ప్రస్తుతం ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌మెట్రో 6 కోచ్‌లు, చైన్నె ఎయిర్‌పోర్ట్ మెట్రో 4 కోచ్‌లతో నడుస్తోంది. మొదట్లో రద్దీ సమయంలో ప్రతి 8 నిమిషాలకు ఒకటి, రద్దీ లేని సమయాల్లో ప్రతి 10 నిమిషాలకు ఒక ట్రైన్ చొప్పున నడుపుతారు.
ఆ తరువాత రద్దీ వేళల్లో ప్రతి 3 నిమిషాలకు ఒకటి, రద్దీ లేని సమయాల్లో ప్రతి 5 నిమిషాలకు ఒకటి చొప్పున నడిపే విధంగా ప్రణాళికలను రూపొందించినట్లు తెలిసింది. నగరం పడమటి వైపు శరవేగంగా అభివృద్ధి చెందుతున్న దృష్ట్యా కేవలం ఎయిర్‌పోర్టు ప్రయాణికులే కాకుండా అన్ని వర్గాల ప్రయాణికులు కూడా ఎయిర్‌పోర్ట్ మెట్రో సేవలను వినియోగించుకొనే అవకాశం ఉంది. దీంతో రైళ్లు, సర్వీసుల సంఖ్య భారీగా పెరగవచ్చునని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రాథమికంగా 9 స్టేషన్‌లను ఖరారు చేసినప్పటికీ ప్రాజెక్టు నిర్మాణ క్రమంలో మరిన్ని స్టేషన్‌లకు కూడా డిమాండ్ నెలకొనే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment