వినూత్నంగా మేడ్చల్, శామీర్‌పేట్ మెట్రో కారిడార్లు
ఈ రెండు కారిడార్‌లతో ఎయిర్‌పోర్ట్ అనుసంధానం
మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి వెల్లడి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ మెట్రో (Hyderabad Metro) రెండో దశలో సరికొత్త సాంకేతిక ఆవిష్కరణలకు శ్రీకారం చుట్టనుంది. జేబీఎస్ (JBS) వద్ద ప్రపంచ స్థాయి ఇంటిగ్రేటెడ్ మెట్రో రైల్ హబ్ ఏర్పాటు దిశగా పరిశీలిస్తోంది. ఫలితంగా మేడ్చల్, శామీర్ పేట్ (Shamirpet) దిశగా సాగే కారిడార్లు కొత్త రూపురేఖలు సంతరించుకోబోతున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఆదేశాల మేరకు ప్యారడైజ్ – మేడ్చల్ (23 కి.మీ.), జేబీఎస్ – శామీర్‌పేట్ (22 కి.మీ.) ప్రతిపాదిత కారిడార్ అలైన్‌మెంట్ విషయంలో సాంకేతిక సవాళ్లను పరిష్కరించడానికి మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి, (NVS Reddy) సీనియర్ ఇంజినీర్లు, సాంకేతిక సలహాదారులు ఆదివారం క్షేత్ర స్థాయిలో పరిశీలించారు.
బేగంపేట్ విమానాశ్రయం, ప్యారడైజ్, బోయినపల్లి వరకు రహదారి వంపు ఎక్కువగా ఉండటం, విమానాశ్రయ అధికారుల ఆంక్షల కారణంగా, హెచ్‌ఏండీఎ తన ఎలివేటెడ్ మార్గాన్ని కొంత దూరం పాటు భూగర్భ మార్గంగా మార్చుకుంది. ఈ అలైన్‌మెంట్‌ను బేగంపేట విమానాశ్రయం (తాడ్‌బండ్/బోయినపల్లి వైపు) రన్‌వే కింద దాదాపు 600 మీటర్ల దూరం భూగర్భ సొరంగం ద్వారా తీసుకువెళ్తుంది. దీనికి సంబంధించిన సమస్యలను అధిగమించేందుకు మెట్రో అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.
పలు ప్రాంతాల పరిశీలన..
మేడ్చల్, శామీర్ పేట్ కారిడార్ల స్థానాన్ని జేబీఎస్ వద్ద ఏకీకృతం చేయడం, ఇక్కడ ప్రపంచ స్థాయి ఇంటిగ్రేటెడ్ మెట్రో రైల్ హబ్ ఏర్పాటుకు సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తోంది. ఇందుకోసం జేబీఎస్ పరిసరాల్లో రాష్ట్ర ప్రభుత్వానికి, రక్షణ శాఖకు చెందిన సుమారు 30 ఎకరాల భూమిని సమీకరించవచ్చని మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి వెల్లడించారు. జేబీఎస్ – సికింద్రాబాద్ క్లబ్‌రోడ్, స్టాఫ్ రోడ్ (పికెట్ కేంద్రీయ విద్యాలయ స్కూల్ రోడ్), మడ్ ఫోర్ట్, టివోలీ, డైమండ్ పాయింట్, సెంటర్ పాయింట్, హస్మత్‌పేట్, బోయినపల్లి (సరోజిని పుల్లారెడ్డి బంగ్లా) రోడ్, తాడ్‌బండ్–ఆంజనేయ స్వామి ఆలయం –తాడ్‌బండ్ జంక్షన్, ఎయిర్ పోర్ట్ ఆఫీస్, బోయినపల్లి చెక్ పోస్ట్ తదితర ప్రాంతాల్లో మెట్రో ఎండీ కాలినడకన కలియతిరిగారు.
లాభ నష్టాలను బేరీజు వేయండి..
క్లిష్టమైన మలుపులను, విమానాశ్రయం కింద భూగర్భంలో అలైన్‌మెంట్‌ను తీసుకువెళ్లే ఆవశ్యకతను నివారించే విధంగా, ప్రైవేట్ ఆస్తుల సేకరణను వీలైనంత తగ్గించే విధంగా ప్రత్యామ్నాయ మార్గాల లాభనష్టాలను అంచనా వేయాలని అధికారులను ఎన్వీఎస్ రెడ్డి ఆదేశించారు. అలైన్‌మెంట్ వీలైనన్ని ఎక్కువ నివాస కాలనీలకు, వాణిజ్య, వ్యాపార కేంద్రాలకు ప్రయోజనకరంగా ఉండాలని, స్టేషన్ స్థానాల నిర్ధారణ, వాటి సమీపంలో ఖాళీగా ఉన్న రాష్ట్ర ప్రభుత్వ/రక్షణ భూముల లభ్యత, మెరుగైన పార్కింగ్, ప్రయాణికులకు కల్పించే సౌకర్యాలను పరిశీలించాలన్నారు.
ఇదీ చదవండి: ముందు డిజైన్లు.. ఆపై టెండర్లు
జేబీఎస్ వద్ద ప్రారంభంలో రెండు మెట్రో కారిడార్‌లను కలపడం ఉపయోగకరంగా ఉంటుందన్నారు. మేడ్చల్–జేబీఎస్–ఎంజీబీఎస్–చాంద్రాయణగుట్ట– విమానాశ్రయ లింక్ కూడా ఏర్పడుతుందని, దాదాపు 60 కిలోమీటర్ల సుదీర్ఘ మెట్రో కారిడార్ ఏర్పాటు సాధ్యమవుతుందని స్పష్టం చేశారు. పర్యటనలో హెచ్‌ఏఎంఎల్ చీఫ్ ప్రాజెక్ట్ మేనేజర్ బి.ఆనంద్ మోహన్, జనరల్ మేనేజర్లు బి.ఎన్. రాజేశ్వర్, ఎం. విష్ణు వర్ధన్ రెడ్డి, ఎ.బాలకృష్ణ, డిప్యూటీ సీఈ (రైల్వేస్) జె.ఎన్. గుప్తా తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment