సాక్షి, హైదరాబాద్: ఎయిర్‌పోర్ట్ మెట్రోకు గ్రీన్‌సిగ్నల్ పడింది. సామాన్య, మధ్యతరగతి వర్గాలకు మెట్రో రైళ్లు అందుబాటులో ఉండాలనే లక్ష్యంతో పాతబస్తీ నుంచి శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి మెట్రో రెండో దశ విస్తరణకు ప్రభుత్వం ప్రతిపాదనలు రూపొందించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ప్రస్తుతం గతంలోనే ప్రణాళికలను రూపొందించినప్పటికీ పనులు చేపట్టకుండా మిగిలిపోయిన ఎంజీబీఎస్ నుంచి ఫలక్‌నుమా వరకు 5.5 కిలోమీటర్ల మార్గాన్ని నిర్మించేందుకు ప్రభుత్వం తాజాగా అనుమతినిచ్చింది.
ఎయిర్‌పోర్టు మెట్రో విస్తరణలో భాగంగా నాగోల్–ఎల్‌బీనగర్, ఫలక్‌నుమా–చాంద్రాయణగుట్ట వరకు మెట్రో నిర్మాణం చేపట్టనున్నారు. చాంద్రాయణగుట్ట మెట్రో జంక్షన్ నుంచి మైలార్‌దేవ్‌పల్లి, పి–7 రోడ్డు మీదుగా ఎయిర్‌పోర్టు వరకు మెట్రో రైళ్లు పరుగులు తీస్తాయి. మెట్రో తొలిదశలో నాగోల్ నుంచి హైటెక్‌సిటీ వరకు, అక్కడి నుంచి రాయదుర్గం వరకు మెట్రో విస్తరణ చేపట్టిన సంగతి తెలిసిందే.
దీంతో నగరానికి పడమటి వైపున ఐటీ అభివృద్ధికి మెట్రో దోహదం చేసింది. ప్రస్తుతం దక్షిణం వైపు నుంచి ఎయిర్‌పోర్టుకు మెట్రో నిర్మాణం చేపట్టనున్న దృష్ట్యా దక్షిణ హైదరాబాద్ వైపు అభివృద్ధి జరిగే అవకాశం ఉందని రియల్ వర్గాలు భావిస్తున్నాయి. ముఖ్యంగా నిర్మాణ రంగం ఊపందుకోనుంది. ప్రస్తుతం పడమటి వైపు ఔటర్‌కు ఇరువైపులా బహుళ అంతస్థుల భవనాలు పెద్ద ఎత్తున వినియోగంలోకి వచ్చాయి. 50 అంతస్థులకు మించిన హైరైజ్ బిల్డింగ్‌లను నిర్మించారు. అదే తరహాలో ఎయిర్‌పోర్టు చుట్టుపక్కల ప్రాంతాల్లో పెద్ద ఎత్తున హైరైజ్ భవనాల నిర్మాణం జరిగే అవకాశం ఉంది.
అన్ని వర్గాలకు అందుబాటులో మెట్రో...
హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి విదేశాలకు వెళ్లే వారిలో ఎక్కువ శాతం విద్యార్ధులు, ఉద్యోగాల కోసం వెళ్లే వారే ఉన్నారు. మరోవైపు పాతబస్తీ నుంచి, తెలంగాణలోని వివిధ జిల్లాల నుంచి ఏటా వేలాది మంది ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం తరలి వెళ్తారు. ఈ ప్రయాణికులంతా జేబీఎస్, ఎంజీబీఎస్,ఎల్‌బీనగర్ తదితర ప్రాంతాల నుంచి ఎయిపోర్టుకు వెళ్లేవారే ఎక్కువగా ఉంటారు. ప్రస్తుతం ప్రతిరోజు సుమారు 65 వేల మంది జాతీయ, అంతర్జాతీయ ప్రయాణికులు ఎయిర్‌పోర్టు నుంచి రాకపోకలు సాగిస్తున్నారు. ఈ ప్రయాణికుల్లో 80 శాతం వరకు నగరానికి తూర్పు, ఉత్తరం, దక్షిణం వైపు నుంచి ఎయిర్‌పోర్టుకు వెళ్లే వాళ్లే ఉంటారు. గత ప్రభుత్వం ప్రతిపాదించిన రాయదుర్గం–ఎయిర్‌పోర్టుకు బదులు ప్రస్తుత ప్రభుత్వం ప్రతిపాదించిన ఎంజీబీఎస్–ఎయిర్‌పోర్టు రూట్ వల్ల అన్ని వర్గాల ప్రజలకు మెట్రో సదుపాయం లభించనుంది.
రియల్ భూమ్
మరోవైపు ఈ కొత్త రూట్ వల్ల ప్రయాణికులు జూబ్లీబస్‌స్టేషన్ నుంచి నేరుగా ఎయిర్‌పోర్టుకు వెళ్లవచ్చు. అలాగే రాయదుర్గం, అమీర్‌పేట్, ఉప్పల్, నాగోల్ మీదుగా ఎల్‌బీనగర్ నుంచి ఎయిర్‌పోర్టుకు రాకపోకలు సాగించేందుకు అవకాశం లభిస్తుంది. ‘ఈ ప్రాజెక్టు వల్ల ఎక్కువ మంది ప్రయాణికులకు మెట్రో రైలు సేవలు అందుబాటులో ఉంటాయని, నగరం నలుమూలల నుంచి కనెక్టివిటీ అందుబాటులోకి వస్తుందని’ అధికారులు పేర్కొంటున్నారు. రెండో దశలో 70 కిలోమీటర్‌ల మార్గంలో మెట్రో సేవలు అందుబాటులోకి రానున్నాయి. మొత్తం ఆరు కారిడార్‌లలో నిర్మించనున్న రెండో దశలో ఎయిర్‌పోర్టు మెట్రోతో పాటు రాజేంద్రనగర్ నుంచి హైకోర్టు ప్రాంగణం, రాయదుర్గం నుంచి అమెరికా కాన్సులేట్, మియాపూర్ నుంచి పటాన్‌చెరు,ఎల్‌బీనగర్ నుంచి హయత్‌నగర్ వరకు మెట్రో విస్తరణకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు.
ఇప్పటికే శంషాబాద్ ఎయిర్‌పోర్టు చుట్టుపక్కల ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ పరుగులు తీస్తోంది. మెట్రో రాకతో ఈ ప్రాంతంలో భూముల ధరలు భారీగా పెరిగే అవకాశం ఉంది. భారీ లే అవుట్‌లు, హైరైజ్ బిల్డింగ్‌లు, టౌన్‌షిప్పులు పెద్ద ఎత్తున అందుబాటులోకి రానున్నాయి. చాంద్రాయణగుట్ట,
పహీడీషరీఫ్, రావిర్యాల, మహేశ్వరం, కడ్తాల్, ఫార్మాసిటీ,కందుకూరు,షాద్‌నగర్, తదితర ప్రాంతాల్లో నిర్మాణరంగం పెద్ద ఎత్తున విస్తరించుకోనుంది. ఇప్పటికే ఔటర్‌కు అన్ని వైపులా నివాస సముదాయాలు, కాలనీలు అభివృద్ధి చెందాయి. మెట్రో రెండోదశతో మరిన్ని కొత్త ప్రాంతాలు హైదరాబాద్ మహానగరంలో కలిసిపోనున్నాయి. ఔటర్‌రింగ్‌రోడ్డుకు, రీజనల్ రింగ్‌రోడ్డుకు మధ్య నగర విస్తరణకు మెట్రో కనెక్టివిటీ దోహదం చేయనుంది.
Comments
Please login to add a commentAdd a comment