డిసెంబర్ 31న రాత్రి 10 తర్వాత వాహనాలకు అనుమతి లేదు
డ్రగ్స్ సరఫరా, వినియోగంపై కఠిన చర్యలు
సాక్షి, హైదరాబాద్: న్యూ ఇయర్ వేడుకలకు పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. గత ఏడాది అనుభవాల దృష్ట్యా ఈసారి కొత్త సంవత్సరాన్ని శాంతి భద్రతల నడుమ జరపాలని తగిన భద్రతా చర్యలు చేపడుతున్నారు. బైక్ రేసులు, అతివేగంతో దూసుకెళ్లే ప్రమాదం పొంచి ఉండటంతో నగరంలోని అన్ని ఫ్లై ఓవర్లు బంద్ చేయాలని నిర్ణయించారు.
ఈ క్రమంలో డిసెంబర్ 31న రాత్రి 10 గంటల తర్వాత ద్విచక్ర వాహనాలు, వాణిజ్య వాహనాలకు ఫ్లై ఓవర్ల మీదకు అనుమతి ఉండదు. విమానాశ్రయానికి వెళ్లే ప్రయాణికులకు మాత్రం తగిన ఆధారాలు చూపిస్తే పీవీఎన్‌ఆర్ ఫ్లై ఓవర్ మీదికి అనుమతి ఇస్తారు. నూతన సంవత్సర వేడుకల సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా ప్రజలు సహకరించాలని రాచకొండ కమిషనర్ సు«దీర్ బాబు సూచించారు. ఔట్ డోర్ కార్యక్రమాలు జరిగే చోట డీజేలకు అనుమతి లేదన్నారు.
ఎటువంటి బాణసంచా కాల్చడానికి వీల్లేదని, ఈవెంట్లలోకి పరిమితికి మించి ప్రేక్షకులను అనుమతించకూడదని ఆయన పేర్కొన్నారు. మహిళలపై ఎటువంటి వేధింపులు జరగకుండా నిరోధించడానికి షీ టీమ్ బృందాలు విధుల్లో ఉంటాయన్నారు. న్యూ ఇయర్ వేడుకల్లో డ్రగ్స్ వినియోగాన్ని అరికట్టడానికి తనిఖీలు చేస్తామని చెప్పారు. నిషేధిత డ్రగ్స్ సరఫరా చేసే ముఠాలపై ఉక్కుపాదం మోపుతున్నామని కమిషనర్ పేర్కొన్నారు.
నిర్దేశిత సమయంలోపే మూసేయాలి..
⇒పబ్‌లు, బార్లు, వైన్ షాపులు నిర్దేశిత సమయం లోపు మూసి వేయాలని, మైనర్ యువతకు మద్యం అమ్మే దుకాణాలపై కఠిన చర్యలు ఉంటాయని సుధీర్ బాబు హెచ్చరించారు. వాహనాల పార్కింగ్‌కు సరైన ఏర్పాట్లు చేయాలన్నారు. నగర శివార్లలోని ఫాంహౌస్‌లలో ఏర్పాటు చేసే కార్యక్రమాలు నిబంధనలకు లోబడి ఉండాలని, ఎటువంటి డ్రగ్స్ వినియోగం జరగకూడదని, మహిళలతో అసభ్యకర డాన్స్ ప్రోగ్రామ్స్ నిర్వహించకూడదని, మైనర్లకు వాహనాలు ఇస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment