సాక్షి,హైదారబాద్ : నగర వాసులకు శుభవార్త. డిసెంబర్ 31 న్యూ ఇయర్ సెలబ్రేషన్ సందర్భంగా తెలంగాణ ఫోర్ వీలర్స్ డ్రైవర్ అసోసియేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పరిధిలోని ప్రయాణికులకు ఉచిత రవాణా సదుపాయం అందించేందుకు సిద్ధమైంది.
ఈ సందర్భంగా మద్యం సేవించి వాహనాలు నడిపితే ప్రమాదాలకు గురవుతారని ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఫోర్ వీలర్స్ అసోసియేషన్ తెలిపింది. ఈ సదుపాయాన్ని నగర వాసులు వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేసింది. ఇందుకోసం హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పరిధిలో 500 కార్లు 250 బైక్ టాక్సీలు అందుబాటులో ఉంటాయని, ప్రయాణికులే క్షేమమే లక్ష్యంగా ఉచిత రవాణా సదుపాయం అందుబాటులో తెచ్చినట్లు తెలంగాణ ఫోర్ వీలర్స్ డ్రైవర్ అసోసియేషన్ నిర్వాహకులు తెలిపారు. రేపు రాత్రి 10 గంటల నుంచి అర్దరాత్రి 1 గంట వరకు ఉచిత రవాణా సదుపాయం అందుబాటులో ఉండనుంది.
మరోవైపు,న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ సందర్భంగా మంగళవారం(రేపు)హైదరాబాద్‌లో అర్దరాత్రి వరకు మెట్రో రైల్ సేవలు కొనసాగనున్నాయి. ప్రయాణికుల సౌకర్యార్థం రేపు అర్ధరాత్రి 12:30 కి చివరి రైలు స్టేషన్ నుండి బయలుదేరి 1.15 వరకు చివరి స్టేజి వరకు అందుబాటులో ఉండనుంది. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ సందర్భంగా ప్రయాణికులు సురక్షితంగా ప్రయాణించేందుకు మెట్రో రైలు విభాగం సేవలు అర్ధరాత్రి వరకు పొడిగిస్తున్నట్లు హైదరాబాద్ మెట్రో రైల్ అధికారులు తెలిపారు.
న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా హైదరాబాద్ నగర పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. మంగళవారం రాత్రి 11గంటల నుండి ఉదయం 5గంటల వరకు వాహనాల పోకల్ని నిషేధిస్తూ ఓఆర్‌ఆర్,ఫ్లైఓవర్‌లు మూసివేయనున్నారు. భారీ వాహనాలకు మాత్రమే అనుమతి ఇవ్వనున్నారు. టాక్సీ , ఆటో డ్రైవర్లు తప్పనిసరిగా డ్రెస్ కోడ్ తప్పనిసరి. బార్లు, పబ్బులు,క్లబ్‌లు నిబంధనలు పాటించాలని సూచించారు. మద్యం సేవించి వాహనం నడపకుండా చూడాల్సిన బాధ్యత యజమానులదేనని, మద్యం తాగి డ్రైవింగ్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని,మైనర్ డ్రైవింగ్ చెస్తే వాహనాలు స్వాధీనం చేసుకొని కేసులు నమోదు చేస్తామని హెచ్చరికలు జారీ చేశారు. పోలీసుల ఆంక్షలు రేపు రాత్రి 11నుండి జనవరి 1 ఉదయం వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయని హైదరాబాద్ పోలీసులు వెల్లడించారు.
న్యూఇయర్ వేడుకలపై మాదాపూర్ డీసీపీ వినీత్ సాక్షి మీడియాతో ప్రత్యేకంగా మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నూతన సంవత్సరంలో భద్రత విషయంలో అన్నీ ఏర్పాట్లు పూర్తి చేశాం.మాదాపూర్ జోన్లో 61 ఈవెంట్స్ జరగనున్నాయి. 43పబ్స్ ఉన్నాయి. 20 కమ్యూనిటీ ఈవెంట్స్ జరగనున్నాయి.నిర్వాహకులు తప్పని సరిగా సమయం, నిబంధనలు తప్పకుండా పాటించాలి. ఈవెంట్‌లో ఐడీకార్డ్‌లు తప్పని సరి.మైనర్లకి మద్యం సప్లయ్ చేయకూడదు. సౌండ్ ఎక్కువగా ఉండకూడదు.. స్థానికులను ఇబ్బందులు పెట్టొద్దు.ఎలాంటి ఇబ్బందులు లేకుండా న్యూఇయర్ వేడుకలు జరుపుకోవాలి.కెపాసిటీ మేరకు మాత్రమే కస్టమర్స్ ను అనుమతించాలి. ప్రతి ఈవెంట్స్ లో అన్నీ ఏర్పాట్లు నిర్వాహకులు చూసుకోవాలి. భద్రత ,పార్కింగ్, మహిళలకు ప్రత్యేక ఏర్పాట్లు ఉండేలా చూడాలి. క్యాబ్, టాక్సీ,ఆటో డ్రైవర్లకు సూచనలు ఇచ్చాం. డ్రంక్ అండ్ డ్రైవ్ రాత్రంతా కొనసాగుతుంది. తాగి డ్రైవ్ చేస్తే కఠిన చర్యలు. డ్రగ్స్ వినియోగంపై నిఘా ఉంటుంది.న్యూ ఇయర్ ఎంజాయ్ చెయ్యాలి కానీ ఇతరులకు ఇబ్బందులు కలిగించొద్దని విజ్ఞప్తి చేశారు.
Comments
Please login to add a commentAdd a comment