
విదేశీ మహిళపై అత్యాచార ఘటనలో ఆరా తీస్తున్న పోలీసులు
నిందితుడు అరెస్ట్
రంగారెడ్డి జిల్లా : సంచలనం సృష్టించిన విదేశీ యువతిపై అత్యాచార ఘటనలో రంగారెడ్డి జిల్లా పహాడీషరీఫ్ పోలీసులు కేసు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఈ ఘటనకు పాల్పడిన పాతబస్తీ యాకుత్‌పురాకు చెందిన నిందితుడు మహ్మద్ అస్లాంను మంగళవారం రాత్రి అరెస్ట్ చేశారు.
కేవలం గంట రెండుగంటల వ్యవధిలోనే నిందితుడు యువతితో పాటు ఆమె స్నేహితుడిని అంతగా ఎలా నమ్మించాడనే విషయమై పోలీసులు ఆరా తీస్తున్నారు. గతంలో దుబాయ్‌లో డ్రైవర్‌గా పనిచేసిన నిందితుడికి ఆంగ్లంపై పట్టుండటంతో చలాకీగా మాట్లాడి ఆకర్షించాడా.. వేరే కారణాలు ఉన్నాయా? అనే కోణంలో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. సెల్ఫ్ డ్రైవింగ్ కారును అద్దెకు తీసుకున్న నిందితుడు..
గతంలో కూడా ఇదే తరహా ఏవైనా నేరాలకు పాల్పడ్డాడా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. పవిత్రమైన రంజాన్ పర్వదినం రోజున అస్లాం ఇలాంటి ఘటనకు పాల్పడటంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిందితుడికి కఠిన శిక్ష విధించాలని డిమాండ్ చేస్తున్నారు. కాగా, విజిటింగ్ వీసాపై జర్మనీ నుంచి వచ్చిన యువతిపై జరిగిన అత్యాచార ఘటనకు సంబంధించి పోలీసులు భారత్‌లోని జర్మన్ కాన్సులేట్‌కు నివేదికను పంపనున్నారు. ఇదిలా ఉండగా, మీర్‌పేట మిథులానగర్‌లోని స్నేహితుడి ఇంట్లో ఉంటున్న ఆ యువతి గురువారం అర్ధరాత్రి తిరిగి స్వదేశానికి వెళ్లనుంది.