సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి రాష్ట్రంలో పెను సంచలనం సృష్టించిన, జలకాలుష్యానికి సంబంధించిన భోలక్‌పూర్ ట్రాజడీ కేసులో నిందితులపై ఎట్టకేలకు అభియోగపత్రాలు దాఖలయ్యాయి. ఈ విషాదానికి బాధ్యులుగా గుర్తించిన జల మండలి అధికారులు, సిబ్బందిని నగర నేర పరిశోధన విభాగం (సీసీఎస్) పోలీసులు పదిన్నరేళ్ళ క్రితం అరెస్టు చేశారు. వీరిపై కోర్టులో అభియోగపత్రాలు దాఖలు చేయడానికి ప్రభుత్వం నుంచి ప్రాసిక్యూషన్ అనుమతి అవసరం కావడంతో ఆ మేరకు లేఖ రాశారు. ఈ ఫైల్‌కు ఇటీవల మోక్షం లభించడంతో దాదాపు పన్నెండున్నర ఏళ్ల తర్వాత ముగ్గురిపై చార్జ్‌షీట్ దాఖలైంది.
ఈ కాలంలో నిందితులు పదవీ విరమణ చేసేశారు. నాటి విషాదంలో 15 మంది మృతి చెందగా, మరో 250 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. జలమండలి నిర్లక్ష్యం కారణంగా 2009 మే 5న భోలక్‌పూర్ ట్రాజడీ చోటు చేసుకుంది. ఆ ప్రాంతంలో సరఫరా అయిన నీటిలో వీ–కలరా అనే వైరస్ ఉండటంతో పరిస్థితి చేయిదాటింది. నాటి మే నెల్లో ఉన్న మండే ఎండల కారణంగా వేడి తోడవడం వల్లే వీ–కలరా విజృంభించి 15 ప్రాణాలు బలిగొంది. భోలక్‌పూర్ ప్రాంతంలో తాగునీటి, మురుగునీటి (సీవరేజ్ లైన్) పైపు లైన్లు పక్కపక్కనే ఉండేవి. ప్రధాన తాగునీటి పైను నుంచి అక్కడున్న ఇళ్లకు కనెక్షన్లు ఇచ్చారు. ఇలా ఇచ్చిన వాటిలో కొన్ని మురుగునీటి పైపు కింది నుంచి ఉన్నాయి. ఇలా కింద ఉన్నవే ప్రమాద హేతువులుగా మారాయి. భోలక్‌పూర్ ప్రాంతంలో ఉన్న తోళ్ల మండిల వల్ల వీటితో పాటు రక్తం, ఉప్పు, తోలు వ్యర్థాలు, వెంట్రుకలు, జంతు పేగులు సైతం ఈ డ్రైనేజ్ పైప్‌లైన్‌లో ప్రవహించాయి. వీటిలో ఉండే ఉప్పు వలన సీవరేజ్ పైపు లైన్లు దెబ్బతిన్నాయి.
దానికి రంధ్రాలు ఏర్పడి దాని కింద ఉన్న మంచినీటి కనెక్షన్ పైపుల మీద ఉప్పు, ఇతర వ్యర్థాలు పడ్డాయి. ఈ ఉప్పు ప్రభావంతో మంచినీటి కనెక్షన్ పైపుకీ రంధ్రాలు పడి అందులోకి ఈ వ్యర్థాలు కలిశాయి. భోలక్‌పూర్ డివిజన్‌లోని భోలక్‌పూర్, ఇందిరానగర్, సిద్ధిఖ్‌నగర్, గుల్షన్ నగర్, బంగ్లాదేశ్ బస్తీల్లో కుళాయి ద్వారా వచ్చిన ఈ నీటిని స్థానికులు తాగడంతోనే పెను విషాదం చోటు చేసుకుంది. ఈ ఉదంతంపై ముషీరాబాద్‌లో నమోదైన కేసు సీసీఎస్‌కు బదిలీ అయింది. అధికారుల అజాగ్రత్త వల్లే ఈ ఉదంతం చోటు చేసుకున్నట్లు తేలండంతో కేసును రీ–రిజిస్టర్ చేశారు. ఈ దుర్ఘటన చోటు చేసుకోడంలో ప్రభుత్వ విభాగాల బాధ్యత అనేది దర్యాప్తు చేశారు.
జలమండలి అధికారుల పాత్రపై ఆధారాలు లభించడంతో నాటి చీఫ్ జనరల్ మేనేజర్, జనరల్ మేనేజర్, డిప్యూటీ జనరల్ మేనేజర్, బోట్స్ క్లబ్ సెక్టార్ ఏరియా ఇన్‌చార్జ్, భోలక్‌పూర్ లైన్‌మ్యాన్‌లను అరెస్టు చేసినప్పటికీ సొంత పూచీకత్తుపై విడిచిపెట్టారు. దర్యాప్తు పూర్తి చేసినప్పటికీ న్యాయస్థానంలో అభియోగపత్రాలు దాఖలు చేయడానికి ప్రభుత్వ అనుమతి (ప్రాసిక్యూషన్ పర్మిషన్) తప్పనిసరైంది. ఏదైనా కేసులో ప్రభుత్వ ఉద్యోగులపై చార్జ్‌షీట్ దాఖలు చేయాలంటే ప్రభుత్వం అనుమతి తప్పనిసరి. భోలక్‌పూర్ ట్రాజడీ కేసులోనూ ప్రాసిక్యూషన్ పర్మిషన్ కోరుతూ దాదాపు పదేళ్ళ క్రితం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. అప్పటి నుంచి ఈ ఫైల్ పెండింగ్‌లోనే ఉండిపోయినా... నెల రోజుల క్రితం అనుమతి వచ్చింది. దీంతో నిందితుల్లో ముగ్గురిపై ఇటీవల అభియోగపత్రాలు దాఖలు చేశారు.
చదవండి: Hyderabad: సెక్స్‌వర్కర్లతో ఒప్పందం.. సోదరుడి ఇంట్లోనే..
Comments
Please login to add a commentAdd a comment