సాక్షి, హైదరాబాద్: ప్రవల్లిక ఆత్మహత్య కేసులో నిందితుడు శివరామ్ రాథోడ్‌కు నాంపల్లి కోర్టు శనివారం బెయిల్ మంజూరు చేసింది. రూ.5 వేల వ్యక్తిగత పూచీకత్తుపై కోర్టు బెయిల్ ఇస్తూ ఆదేశాలిచ్చింది. గాంధీ ఆసుపత్రిలో వైద్య పరీక్షల అనంతరం నిందితుడిని నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. విచారణ చేపట్టిన కోర్టు.. ప్రవల్లిక ఆత్మహత్య కేసులో శివరామ్ పాత్రపై సరైన ఆధారాలు లేవంటూ బెయిల్ మంజూరు చేసింది.
మర్రి ప్రవల్లిక ఆత్మహత్యకు కారణమైనట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న శివరామ్ రాథోడ్ శుక్రవారం నాంపల్లి కోర్టులో లొంగిపోయిన సంగతి తెలిసిందే. మూడు రోజులుగా చిక్కడపల్లి పోలీసులు ఇతడి కోసం ముమ్మరంగా గాలించారు. వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం బిక్కాజిపల్లికి చెందిన ప్రవల్లిక టీఎస్‌పీఎస్సీ గ్రూప్స్ పరీక్షలకు సిద్ధం కావడానికి నగరానికి వచ్చి అశోక్‌నగర్‌లోని బృందావన్ హాస్టల్‌లో ఉంటోంది. గతవారం ఆమె హాస్టల్ గదిలోనే ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఉదంతంపై పోలీసులు తొలుత అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు.
ప్రవల్లిక రూమ్‌లో సోదా చేసిన అధికారులకు సూసైడ్ నోట్ లభించింది. ఆమె సెల్‌ఫోన్‌ను సీజ్ చేసి అందులోని అంశాలను విశ్లేషించగా ఆత్మహత్యకు గల కారణాలు బయటపడ్డాయి. మహబూబ్‌నగర్ జిల్లా కోస్గి ప్రాంతానికి చెందిన శివరామ్ రాథోడ్ అనే యువకుడితో వాట్సాప్‌లో చాటింగ్ చేసినట్లు గుర్తించారు. అతడికి ఆమె రాసిన ఉత్తరాలను స్వాధీనం చేసుకున్నారు. వీటిని విశ్లేషించిన పోలీసులు శివరామ్ రాథోడ్‌కు మరో యువతితో వివాహం నిశ్చయం కావడంతో ప్రవల్లిక తాను మోసపోయానని కుంగిపోయినట్లు తేల్చారు.
ఈ మేరకు ప్రవల్లిక తన సోదరుడు ప్రణయ్‌కి వాట్సాప్ సందేశాల ద్వారా తెలిపింది. సోమవారం నగరానికి వచ్చిన ప్రణయ్ పోలీసులకు వాంగ్మూలం ఇవ్వడమేకాకుండా సందేశాల ప్రింటవుట్స్ సైతం అందించారు. వీటి ఆధారంగా పోలీసులు అనుమానాస్పద మృతిగా నమోదు చేసిన కేసును మార్చారు. ఐసీపీలోని 417, 420, 306 సెక్షన్లు జోడిస్తూ శివరామ్‌ను నిందితుడిగా చేర్చారు.
అప్పటి నుంచి గాలిస్తున్న ప్రత్యేక బృందాలకు గురువారం మహారాష్ట్రలో అతడు చిక్కి నట్లు వార్తలు కూడా వెలువడ్డాయి. అయితే శివరామ్ శుక్రవారం నాంపల్లి కోర్టులో తన న్యాయవాది ద్వారా సరెండర్ పిటిషన్ దాఖలు చేసుకున్నాడు. కోర్టు అనుమతించడంతో లొంగిపోయాడు. అయితే, ఈ కేసుపై శనివారం విచారణ చేపట్టిన న్యాయస్థానం.. శివరామ్ పాత్రపై సరైన ఆధారాలు లేవంటూ బెయిల్ మంజూరు చేసింది.
చదవండి: సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఆత్మహత్య
Comments
Please login to add a commentAdd a comment