Bholakpur
-
హైదరాబాద్: బోలక్‌పూర్‌లో పేలుడు..
సాక్షి, హైదరాబాద్: నగరంలోని ముషీరాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధి బోలక్‌పూర్‌లో స్క్రాప్ గోడౌన్లో పేలుడు సంభవించింది. నార్త్ ఇండియాకు చెందిన కార్మికుడికి తీవ్ర గాయాలు కాగా, గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఆ ప్రాంతంలో పెద్ద శబ్దం వినిపించడంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు కార్మికుడి పరిస్థితి విషమంగా ఉంది. కెమికల్ బాక్స్‌లను కట్ చేస్తుండగా పేలుడు జరిగింది. హైదరాబాద్: ట్రాన్స్జెండర్ల వేషం వేసుకుని బెగ్గింగ్.. -
Hyderabad: భోలక్‌పూర్‌లో భారీ అగ్ని ప్రమాదం
సాక్షి, హైదరాబాద్: భోలక్‌పూర్ భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. స్క్రాప్ గోడౌన్లో మంటలు చెలరేగాయి. భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. రోడ్డు ఇరుకుగా ఉండటంతో ఫైరింజన్లు వెళ్లడానికి ఇబ్బందికరంగా మారింది. చుట్టు పక్కల వారిని అధికారులు ఖాళీ చేయిస్తున్నారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మూడు ఫైర్ ఇంజిన్ల సహాయంతో మంటలను అదుపు చేశారు. గోదాంలో ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది. -
బస్తీల వాసుల పాలిట శాపంగా కలుషిత జలాలు
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పలు బస్తీల వాసులకు కలుషిత జలాలు శాపంగా పరిణమిస్తున్నాయి. గతంలో భోలక్‌పూర్.. ఇటీవల మాదాపూర్ వడ్డెర బస్తీ.. మంగళవారం ముషీరాబాద్ చేపల మార్కెట్ ప్రాంతంలో కలుషిత జలాల కారణంగా పలువురు బస్తీవాసులు వాంతులు, విరేచనాలతో ఆస్పత్రుల పాలయ్యారు. ఆయా ప్రాంతాల్లో అతిసారం ప్రబలడం కలవరం సృష్టిస్తోంది. మరుగుదొడ్లు, అపరిశుభ్ర పరిసరాలు, గుంతల్లో నల్లా లేని కనెక్షన్లతో పాటు దశాబ్దాల క్రితం ఏర్పాటు చేసిన పురాతన తాగునీటి పైప్లైన్లు ఏదో ఒకచోట తరచూ ఈ పరిస్థితికి కారణమవుతుండడం ఆందోళన కలిగిస్తోంది. పాత నగరంతో పాటు ప్రధాన నగరంలో సుమారు రెండువేల కిలోమీటర్ల పరిధిలో పురాతన పైప్లైన్లు ఉన్నట్లు జలమండలి వర్గాలు చెబుతున్నాయి. వీటి స్థానంలో తక్షణం డక్టైల్ ఐరన్ (డీఐ), మైల్డ్‌స్టీల్ (ఎంఎస్) పైప్లైన్లు ఏర్పాటు చేసి పైప్‌లైన్ లీకేజీల కారణంగా ఏర్పడుతున్న కలుషిత జలాల సమస్యను పరిష్కరించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. పురాతన పైప్లైన్ల మార్పుతోనే పరిష్కారం.. ► మహానగరం పరిధిలో సుమారు 9 వేల కిలోమీటర్ల పరిధిలో మంచినీటి సరఫరా పైప్‌లైన్ వ్యవస్థ అందుబాటులో ఉంది. ఇందులో పాతనగరం, ప్రధాన నగరం పరిధిలో సుమారు 2 వేల కిలోమీటర్ల పరిధిలో వివిధ సామర్థ్యాలున్న పురాతన పైప్ లైన్లున్నాయి. వీటికి తరచూ లీకేజీలు ఏర్పడడం, పక్కనే మురుగు నీటి పైప్లైన్లు, నాలాలుండడంతో తరచూ మురుగు నీరు లీకేజీ ఏర్పడిన తాగునీటి పైప్లైన్లలోకి చేరి శుద్ధి చేసిన తాగునీరు కలుషితమవుతోంది. ► ఈ నీటిని తాగిన వారు ఆస్పత్రుల పాలవుతున్నారు. వీటిని తక్షణం మార్చితేనే కలుషిత జలాల సమస్యకు చెక్ పెట్టవచ్చని నిపుణులు స్పష్టంచేస్తున్నారు. ప్రధానంగా ముషీరాబాద్, చార్మినార్, బహదూర్‌పురా, సికింద్రాబాద్, కార్వాన్ తదితర నియోజకవర్గాల పరిధిలోనే పురాతన పైప్లైన్లు అత్యధికంగా ఉన్నట్లు జలమండలి వర్గాలు చెబుతున్నాయి. వీటిని మార్చేందుకు సుమారు రూ.1500 కోట్లు అవసరమవుతాయని అంచనా వేస్తున్నారు. ఇవీ కారణమే.. ► పలు బస్తీల్లో ఇళ్ల ముందున్న కనెక్షన్లు గుంతల్లో ఏర్పాటు చేసినవే ఉన్నాయి. వీటికి చాలా ప్రాంతాల్లో నల్లాలు లేవు. ఇవన్నీ మరుగుదొడ్లు, దుస్తులు, వంట పాత్రలు శుభ్రం చేసుకునే ప్రదేశాలకు ఆనుకొని ఉన్నాయి. దీంతో ఈ మురుగు నీరు నల్లా గుంతల్లోకి చేరుతోంది. ► మంచినీటి సరఫరా జరిగిన అనంతరం ఈ మురుగు నీరు ఆయా కనెక్షన్లలోకి రివర్స్ వెళుతోంది. తిరిగి తాగునీటి సరఫరా జరిగిన సమయంలో నల్లా నీటితో పాటు ఈ మురుగు నీరు వస్తోంది. ఈ నీటిని తాగిన వారు అస్వస్థతకు గురవుతున్నట్లు వడ్డెర బస్తీలో జలమండలి క్షేత్రస్థాయి పర్యటనలో తేలింది. ► మహానగరం పరిధిలోని సుమారు 1470 మురికి వాడలున్నాయి. పలు బస్తీల్లో కనెక్షన్లకు నల్లాలు లేని చోట జలమండలి జీఐ పైప్లైన్లతో తక్షణం నల్లా కనెక్షన్లను కొంత ఎత్తున.. పబ్లిక్ నల్లా తరహాలో ఏర్పాటు చేయాలి. దీంతో కలుషిత ముప్పు తప్పుతుందని నిపుణులు సూచిస్తున్నారు. (క్లిక్: జీవో 111ను ఎత్తేస్తున్నాం.. కేబినెట్ కీలక నిర్ణయాలు వెల్లడించిన సీఎం కేసీఆర్) జలమండలి మేనేజర్, వర్క్ఇన్స్పెక్టర్ సస్పెన్షన్ ముషీరాబాద్ చేపల మార్కెట్లో కలుషిత జలాల కలకలం నేపథ్యంలో జలమండలి ఎండీ దానకిశోర్ సీరియస్ అయ్యారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన మేనేజర్, వర్క్ ఇన్స్పెక్టర్ను సస్పెండ్ చేశారు. ఈ ప్రాంతంలో కలుషిత జలాల సమస్యను అరికట్టేందుకు నూతన పైప్‌లైన్ వర్క్ మంజూరు చేసి నెల రోజులు గడుస్తున్నా పనులు మొదలు పెట్టనందుకు వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారు. సుమారు రూ.4.2 లక్షలతో కొత్త పైప్‌లైన్‌ను మంజూరు చేసినట్లు ఎండీ తెలిపారు. (చదవండి: కేసీఆర్ కీలక నిర్ణయం.. నెరవేరనున్న 26 ఏళ్ల కల) -
కేటీఆర్ సీరియస్.. ఎంఐఎం కార్పొరేటర్ అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: పోలీసుల పట్ల దురుసుగా ప్రవర్తించిన ఎంఐఎం కార్పొరేటర్ గౌసుద్దీన్‌ను పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల పట్ల గౌసుద్దీన్ ప్రవర్తన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిని కొంతమంది మంత్రి కేటీఆర్‌కు ట్యాగ్ చేశారు. ట్విటర్లో స్పందించిన కేటీఆర్ నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీ మహేందర్ రెడ్డిని కోరారు. మంత్రి ఆదేశాల మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు భోలక్‌పూర్ కార్పొరేషన్ గౌసుద్దీన్‌ను అరెస్ట్ చేశారు. అతనిపై సెక్షన్ 350, 506 కింద కేసులు నమోదు చేశారు. కాగా ముషీరాబాద్‌లోని భోలక్‌పూర్ ఎంఐఎం కార్పొరేటర్ మంగళవారం రాత్రి పెట్రోలింగ్ పోలీసులతో దుర్భాషలాడాడు. రాత్రిపూట హోటళ్లు నడిపేందుకు అనుమతి లేదని చెప్పిన పెట్రోలింగ్ పోలీసుల పట్ల కార్పొరేటర్ గౌసుద్దీన్ అనుచితంగా ప్రవర్తించాడు. రంజాన్ నెల మొత్తం హోటళ్లు, షాపులను ముషిరాబాద్ ప్రాంతంలో తెరిచే ఉంచుతామని.. ఏం చేసుకుంటారో చేసుకోండి అంటూ వార్నింగ్ ఇచ్చాడు. అంతేగాక మీరంతా వంద రూపాయలకు పనిచేసే వ్యక్తులు అంటూ దురుసుగా వ్యవహరించాడు. చదవండి: నేనేమీ అధికారం చెలాయించడం లేదు: గవర్నర్ తమిళిసై అయితే ఈ ఘటనపై మంత్రి కేటీఆర్ సీరియస్ అయ్యారు. విధుల్లో ఉన్న పోలీసులను అడ్డుకోవడమే కాకుండా దౌర్జన్యం చేయడంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తెలంగాణలో ఇలాంటి ఘటనలను ఉపేక్షించబోమని మంత్రి స్పష్టం చేశారు. Request @TelanganaDGP Garu to take stern action against the individuals who obstructed police officers on duty No such nonsense should be tolerated in Telangana irrespective of political affiliations https://t.co/zLbxa8WZW2 — KTR (@KTRTRS) April 6, 2022 -
ఎంఐఎం కార్పొరేటర్‌పై కేటీఆర్ సీరియస్
హైదరాబాద్: భోలక్‌పూర్ ఎంఐఎం కార్పొరేటర్ మొహ్మద్ గౌసుద్దీన్ ప్రవర్తనపై మంత్రి కేటీఆర్ సీరియస్ అయ్యారు. పోలీసుల విధులకు ఆటంకం కలిగించినందుకు, వాళ్లతో దురుసుగా వ్యవహరించినందుకు కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీని కేటీఆర్ బుధవారం కోరారు. భోలక్‌పూర్ కార్పొరేటర్ ‘నెల రోజులు కనిపించొద్దంటూ..’ పోలీసులకు వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి వైరల్ అయ్యింది కూడా. ఈ మేరకు విషయాన్ని ట్విటర్లో కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లగా.. ఆయన స్పందించారు. Request @TelanganaDGP Garu to take stern action against the individuals who obstructed police officers on duty No such nonsense should be tolerated in Telangana irrespective of political affiliations https://t.co/zLbxa8WZW2 — KTR (@KTRTRS) April 6, 2022 పోలీసుల విధులకు ఆటంకం కలిగిస్తే సహించేది లేదని పేర్కొన్న కేటీఆర్, తెలంగాణలో ఇలాంటి వాటిని సహించేది లేదన్నారు. ఏ రాజకీయ పార్టీతో సంబంధం ఉన్నా ఆ వ్యక్తులను వదలొద్దంటూ డీజీపీకి ఆయన సూచించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి మంగళవారం అంతా ట్విటర్లో వైరల్ కాగా. మొహ్మద్ గౌసుద్దీన్ ముషీరాబాద్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి సిబ్బందికి క్షమాపణలు చెప్పినట్లు తెలుస్తోంది. చదవండి: కేటీఆర్ ట్వీట్ హాస్యాస్పదం! -
హైదరాబాద్: 15 మందిని బలిగొన్న భోలక్‌పూర్ విషాద ఘటన.. 12 ఏళ్లకు..
సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి రాష్ట్రంలో పెను సంచలనం సృష్టించిన, జలకాలుష్యానికి సంబంధించిన భోలక్‌పూర్ ట్రాజడీ కేసులో నిందితులపై ఎట్టకేలకు అభియోగపత్రాలు దాఖలయ్యాయి. ఈ విషాదానికి బాధ్యులుగా గుర్తించిన జల మండలి అధికారులు, సిబ్బందిని నగర నేర పరిశోధన విభాగం (సీసీఎస్) పోలీసులు పదిన్నరేళ్ళ క్రితం అరెస్టు చేశారు. వీరిపై కోర్టులో అభియోగపత్రాలు దాఖలు చేయడానికి ప్రభుత్వం నుంచి ప్రాసిక్యూషన్ అనుమతి అవసరం కావడంతో ఆ మేరకు లేఖ రాశారు. ఈ ఫైల్‌కు ఇటీవల మోక్షం లభించడంతో దాదాపు పన్నెండున్నర ఏళ్ల తర్వాత ముగ్గురిపై చార్జ్‌షీట్ దాఖలైంది. ఈ కాలంలో నిందితులు పదవీ విరమణ చేసేశారు. నాటి విషాదంలో 15 మంది మృతి చెందగా, మరో 250 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. జలమండలి నిర్లక్ష్యం కారణంగా 2009 మే 5న భోలక్‌పూర్ ట్రాజడీ చోటు చేసుకుంది. ఆ ప్రాంతంలో సరఫరా అయిన నీటిలో వీ–కలరా అనే వైరస్ ఉండటంతో పరిస్థితి చేయిదాటింది. నాటి మే నెల్లో ఉన్న మండే ఎండల కారణంగా వేడి తోడవడం వల్లే వీ–కలరా విజృంభించి 15 ప్రాణాలు బలిగొంది. భోలక్‌పూర్ ప్రాంతంలో తాగునీటి, మురుగునీటి (సీవరేజ్ లైన్) పైపు లైన్లు పక్కపక్కనే ఉండేవి. ప్రధాన తాగునీటి పైను నుంచి అక్కడున్న ఇళ్లకు కనెక్షన్లు ఇచ్చారు. ఇలా ఇచ్చిన వాటిలో కొన్ని మురుగునీటి పైపు కింది నుంచి ఉన్నాయి. ఇలా కింద ఉన్నవే ప్రమాద హేతువులుగా మారాయి. భోలక్‌పూర్ ప్రాంతంలో ఉన్న తోళ్ల మండిల వల్ల వీటితో పాటు రక్తం, ఉప్పు, తోలు వ్యర్థాలు, వెంట్రుకలు, జంతు పేగులు సైతం ఈ డ్రైనేజ్ పైప్‌లైన్‌లో ప్రవహించాయి. వీటిలో ఉండే ఉప్పు వలన సీవరేజ్ పైపు లైన్లు దెబ్బతిన్నాయి. దానికి రంధ్రాలు ఏర్పడి దాని కింద ఉన్న మంచినీటి కనెక్షన్ పైపుల మీద ఉప్పు, ఇతర వ్యర్థాలు పడ్డాయి. ఈ ఉప్పు ప్రభావంతో మంచినీటి కనెక్షన్ పైపుకీ రంధ్రాలు పడి అందులోకి ఈ వ్యర్థాలు కలిశాయి. భోలక్‌పూర్ డివిజన్లోని భోలక్‌పూర్, ఇందిరానగర్, సిద్ధిఖ్‌నగర్, గుల్షన్ నగర్, బంగ్లాదేశ్ బస్తీల్లో కుళాయి ద్వారా వచ్చిన ఈ నీటిని స్థానికులు తాగడంతోనే పెను విషాదం చోటు చేసుకుంది. ఈ ఉదంతంపై ముషీరాబాద్‌లో నమోదైన కేసు సీసీఎస్‌కు బదిలీ అయింది. అధికారుల అజాగ్రత్త వల్లే ఈ ఉదంతం చోటు చేసుకున్నట్లు తేలండంతో కేసును రీ–రిజిస్టర్ చేశారు. ఈ దుర్ఘటన చోటు చేసుకోడంలో ప్రభుత్వ విభాగాల బాధ్యత అనేది దర్యాప్తు చేశారు. జలమండలి అధికారుల పాత్రపై ఆధారాలు లభించడంతో నాటి చీఫ్ జనరల్ మేనేజర్, జనరల్ మేనేజర్, డిప్యూటీ జనరల్ మేనేజర్, బోట్స్ క్లబ్ సెక్టార్ ఏరియా ఇన్చార్జ్, భోలక్‌పూర్ లైన్మ్యాన్లను అరెస్టు చేసినప్పటికీ సొంత పూచీకత్తుపై విడిచిపెట్టారు. దర్యాప్తు పూర్తి చేసినప్పటికీ న్యాయస్థానంలో అభియోగపత్రాలు దాఖలు చేయడానికి ప్రభుత్వ అనుమతి (ప్రాసిక్యూషన్ పర్మిషన్) తప్పనిసరైంది. ఏదైనా కేసులో ప్రభుత్వ ఉద్యోగులపై చార్జ్‌షీట్ దాఖలు చేయాలంటే ప్రభుత్వం అనుమతి తప్పనిసరి. భోలక్‌పూర్ ట్రాజడీ కేసులోనూ ప్రాసిక్యూషన్ పర్మిషన్ కోరుతూ దాదాపు పదేళ్ళ క్రితం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. అప్పటి నుంచి ఈ ఫైల్ పెండింగ్‌లోనే ఉండిపోయినా... నెల రోజుల క్రితం అనుమతి వచ్చింది. దీంతో నిందితుల్లో ముగ్గురిపై ఇటీవల అభియోగపత్రాలు దాఖలు చేశారు. చదవండి: Hyderabad: సెక్స్‌వర్కర్లతో ఒప్పందం.. సోదరుడి ఇంట్లోనే.. -
'వెతక్కండి.. నేను వెళ్లిపోవడానికి ఎవరూ కారణం కాదు'
సాక్షి, ముషీరాబాద్: ‘నా కోసం వెతక్కండి... నేను వెళ్లిపోవడానికి ఎవరూ కారణం కాదు’... అంటూ ఓ లేఖ రాసి ఇద్దరు పిల్లలతో సహా ఓ మహిళ అదృశ్యమైన సంఘటన ముషీరాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో బుధవారం వెలుగులోకి వచ్చింది. ఎస్సై వెంకట్‌రెడ్డి కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. భోలక్‌పూర్ డివిజన్ వెంకటేశ్వరకాలనీకి చెందిన వెంకటరమణ, రజిని లావణ్య దంపతులకు ప్రణతి ప్రియ(8), దేవాన్‡్ష (5) సంతానం. ఈ నెల 3న వెంకటరమణ డ్యూటీ నుంచి ఇంటికి వచ్చే సరికి ఇళ్లంతా ఖాళీగా ఉంది. స్థానికులను విచారించగా రజిని లావణ్య ఇంట్లో సామాను సర్దుకుని ఇద్దరు పిల్లలతో సహా వెళ్లిపోయినట్లు తెలిపారు. ఇంట్లో లభ్యమైన లేఖలో తన కోసం వెతకొద్దని, తాను వెళ్లిపోవడానికి ఎవరూ కారణం కాదని పేర్కొంది. వెంకటరమణ ఫిర్యాదు మేరకు బుధవారం ముషీరాబాద్ ఎస్సై వెంకట్‌రెడ్డి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
భోలక్‌పూర్‌లో బంగారు లడ్డూ వేలం..
సాక్షి, సిటీబ్యూరో: రాష్ట్ర రాజధాని గ్రేటర్ హైదరాబాద్ నగరంలో లంబోదరుడి లడ్డూ ప్రసాదాలకు ఉన్న క్రేజ్ అ‘ధర’హో అనిపిస్తోంది. లడ్డూ ప్రసాదమంటేనే రెండు తెలుగురాష్ట్రాల్లో మార్మోగే బాలాపూర్ లడ్డూ గత ఏడాది అత్యధికంగా రూ.16.60 లక్షలకు స్థానిక ఆర్యవైశ్యసంఘం ప్రతినిధులు దక్కించుకోవడం విశేషం. ఏటా ఇంతింతై.. అన్నచందంగా ఈ లడ్డూ ధర ఏడాదికి రూ.50 వేల నుంచి రూ.75 వేల మేర అధికంగా పలుకుతోంది. బాలాపూర్ లడ్డూ వేలంపాట 1994 నుంచి మొదలైంది. ప్రారంభంలో రూ.500 నుంచి మొదలైన వేలంపాట.. ఇప్పుడు లక్షల రూపాయల మార్కును చేరుకొంది. ప్రతిఏటా రాష్ట్రవ్యాప్తంగా లడ్డూ వేలంపాటలో ఆల్‌టైమ్ రికార్డు ధర పలుకుతుండడం ఈ లడ్డూ ప్రత్యేకత. ఇక ఏటా ఈ ప్రసాదాన్ని దక్కించుకున్న వారు రాజకీయ, నిర్మాణరంగం, ఇతర రంగాల్లో గణనీయంగా అభివృద్ధి సాధింస్తుండడంతో దీనికి క్రేజ్ మరింత పెరుగుతూనే ఉంది. ఈసారి కూడా ఈ మహిమాన్విత లడ్డూ ప్రసాదాన్ని దక్కించుకునేందుకు నగరంలోని పలువురు రాజకీయ, వ్యాపార, వాణిజ్య, రియల్టర్లు, బిల్డర్లు తమ పేర్లు నమోదుచేసుకొని పోటీ పడనున్నారు. ఇదే తరహాలో నగరంలో రియల్ ఎస్టేట్, నిర్మాణరంగం, ఐటీ, బీపీఓ, కేపీఓ రంగాలకు కొంగుబంగారంగా ఉన్న శివారు ప్రాంతాల్లో నవరాత్రి పూజలందుకున్న గణనాథుల మండపాల్లో నేడు నిర్వహించనున్న లడ్డూ వేలంపాటలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. లక్షల్లో ధర పలికే ఈ వేలంపాటలు ఆద్యంతం భక్తుల జయజయధ్వానాలు, కోలాహలం మధ్యన వేడుకగా జరగనున్నాయి. ఈ ప్రసాదాన్ని తమ అదృష్టానికి చిరునామా అని భావిస్తోన్న వారంతా వీటి కొనుగోలుకు ఆసక్తి చూపుతుండడం విశేషం. ఏటా లడ్డూ వేలంపాటలో పాల్గొనే వారి సంఖ్య పెరుగుతూనే ఉంది. ప్రధానంగా నగరంలో బాలాపూర్, బడంగ్పేట్, సాహెబ్‌నగర్, మంచిరేవుల, కూకట్పల్లి, బోరంపేట్, కొత్తగూడ, మీరాలం మండి, ముషీరాబాద్, ఫిల్మ్‌నగర్, నార్సింగి, కోకాపేట్ తదితర ప్రాంతాలు లడ్డూ వేలంపాటలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తున్నాయి. గురువారం నగరవ్యాప్తంగా అంగరంగవైభవంగా జరగనున్న వేలంపాటల్లో మరోసారి లడ్డూ ప్రసాదాలకు రూ.లక్షల్లో ధర పలకనున్నాయి. మీరాలంమండిలో.. రూ.11.51 లక్షలు.. చార్మినార్: మీరాలంమండి శ్రీ మహంకాళేశ్వర దేవాయం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వినాయకుని లడ్డూలు ఈసారి గతంలో కన్నా ఎక్కువ ధర పలికాయి. మీరాలంమండి బొజ్జ గణపయ్య భక్త మండలి సభ్యులు రూ.11.51లక్షలకు లడ్డూను దక్కించుకున్నారని శ్రీ మహంకాళేశ్వర దేవాలయ కమిటీ చైర్మన్ గాజుల అంజయ్య పేర్కొన్నారు. భోలక్‌పూర్‌లో రూ.7.56 లక్షలు కవాడిగూడ: ముషీరాబాద్ నియోజకవర్గంలోని భోలక్‌పూర్ హౌస్ వద్ద శ్రీసిద్ధి వినాయక భగత్‌సింగ్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వాహకులు బంగారు లడ్డూను ఏర్పాటు చేశారు. అసోసియేషన్ నిర్వాహకుడు జి.అనిల్ కుమార్ ఆధ్వర్యంలో 12 తులాల, 3 గ్రాముల బంగారం లడ్డూను ప్రత్యేకంగా తయారుచేయించారు. నిమజ్జనం కార్యక్రమంలో భాగంగా బుధవారం బంగారు లడ్డూకు వేలం పాట నిర్వహించారు. భక్తులు పోటీపోటీగా వేలం పాడారు. స్థానిక చేపల విక్రయాల వ్యాపారి బైరు విష్ణుప్రసాద్ రూ.7.56 లక్షలకు ప్రసాదం, బంగారు లడ్డూనుకైవసం చేసుకున్నారు. ఈ సందర్భంగా ముఖ్యఅతిథిగా ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ చేతులమీదుగా విష్ణుప్రసాద్‌కు ప్రసాదంతో పాటు బంగారు లడ్డూను అందజేశారు. -
పదేళ్లయినా పర్మిషన్ లేదు!
సాక్షి, సిటీబ్యూరో: ఉమ్మడి రాష్ట్రంలో పెనుసంచలనం సృష్టించిన, జల కాలుష్యానికి సంబంధించిన భోలక్‌పూర్ ట్రాజడీలో నిందితులు ఇప్పటికీ ‘సేఫ్’గానే ఉన్నారు. పదేళ్ల క్రితం చోటు చేసుకున్న ఈ విషాదానికి బాధ్యులుగా గుర్తించిన జలమండలి అధికారులు, సిబ్బందిని నగరనేర పరిశోధన విభాగం (సీసీఎస్) పోలీసులు ఎనిమిదిన్నరేళ్ల క్రితం అరెస్టు చేశారు. వీరిపై కోర్టులో అభియోగపత్రాలు దాఖలు చేయడానికి ప్రభుత్వం నుంచి ప్రాసిక్యూషన్ అనుమతి అవసరం కావడంతో ఆ మేరకు లేఖ రాశారు. ఈ ఫైల్ ఇప్పటికీ సర్కారు వద్ద పెండింగ్‌లో ఉండిపోవడంతో 15 మంది మృతికి, మరో 250 మంది తీవ్ర అస్వస్థతకు కారణమైన అధికారులు, సిబ్బందిపై మాత్రం ఇప్పటికీ చట్టపరమైన చర్యలు లేకుండాపోయాయి. వీరిలో కొందరు ఇప్పటికే పదవీ విరమణ సైతం చేసి ఉండచ్చని పోలీసులు వ్యాఖ్యానిస్తున్నారు. ఉసురు తీసిన జలకాలుష్యం... జలమండలి నిర్లక్ష్యానికి తోడు స్థానికుల్లో ఉన్న అవగాహనా లోపం కారణంగా 2009 మే 5న భోలక్‌పూర్ ట్రాజడీ చోటు చేసుకుంది. ఆ ప్రాంతంలో సరఫరా అయిన నీటిలో వి–కలరా అనే వైరస్ ఉండటంతో పరిస్థితి చేయిదాటింది. సాధారణంగా సోడియం క్లోరైడ్ (ఉప్పు), ప్రోటీన్ రిచ్ ఆర్టికల్స్‌గా పిలిచే తోలు వ్యర్థాలు, రక్తం తదితరాలతో ఇది ఉంటుంది. నాటి మే నెల్లో ఉన్న మండే ఎండల కారణంగా వేడి తోడవడం వల్లే వీ–కలరా విజృంభించి 15 ప్రాణాలు బలిగొంది. భోలక్‌పూర్ ప్రాంతంలో తాగునీటి, మురుగునీటి (సీవరేజ్ లైన్) పైపులైన్లు పక్కపక్కనే ఉండేవి. ప్రధాన తాగునీటి పైపు నుంచి అక్కడున్న ఇళ్లకు కనెక్షన్లు ఇచ్చారు. ఇలా ఇచ్చిన వాటిలో కొన్నింటిని మురుగునీటి పైపు పైనుంచి, మరికొన్ని కనెక్షన్లు కింది నుంచి ఇచ్చారు. పైనుంచి ఇచ్చిన వాటివల్ల ఎలాంటి ఇబ్బంది లేకపోయినా... కిందనుంచి ఇచ్చినవే ప్రమాద హేతువులుగా మారాయి. భోలక్‌పూర్ ప్రాంతంలో ఉన్న తోళ్ల మండీల వల్ల వీటితో పాటు రక్తం, ఉప్పు, తోలు వ్యర్థాలు, వెంట్రుకలు, జంతు పేగులు సైతం ఈ డ్రైనేజ్ పైప్‌లైన్‌లో ప్రవహించాయి. వీటిలో ఉండే ఉప్పు వలన సీవరేజ్ పైపు లైన్లు దెబ్బతిన్నాయి. దానికి రంధ్రాలు ఏర్పడి దాని కింద ఉన్న మంచినీటి కనెక్షన్ పైపుల మీద ఉప్పు, ఇతర వ్యర్థాలు పడ్డాయి. ఈ ఉప్పు ప్రభావంతో మంచినీటి కనెక్షన్ పైపుకీ రంధ్రాలు పడి అందులోకి ఈ వ్యర్థాలు కలిశాయి. భోలక్‌పూర్ డివిజన్లోని భోలక్‌పూర్, ఇందిరానగర్, సిద్ధిఖ్‌నగర్, గుల్షన్ నగర్, బంగ్లాదేశ్ బస్తీల్లో కుళాయి ద్వారా వచ్చిన ఈ నీటిని స్థానికులు తాగడంతోనే పెను విషాదం చోటు చేసుకుంది. కేసు దర్యాప్తు చేసిన సీసీఎస్... ఈ ఉదంతంపై తొలుత ముషీరాబాద్ పోలీసుస్టేషన్లో అనుమానాస్పద మృతిగా (ఐపీసీ 174 సెక్షన్) కేసులు నమోదయ్యాయి. దర్యాప్తు నిమిత్తం కేసును సీసీఎస్‌కు బదిలీ చేశారు. ప్రాథమిక పరిశీలన, దర్యాప్తు నేపథ్యంలో అధికారుల అజాగ్రత్త వల్లే ఈ ఉదంతం చోటు చేసుకున్నట్లు తేలడంతో ఐపీసీలోని 304 (ఎ), 269, 270 సెక్షన్ల కింద రీ–రిజిస్టర్ చేశారు. ఈ దుర్ఘటన చోటు చేసుకోడంలో జలమండలి, జీహెచ్ఎంసీ, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ తదితర సంస్థల్లో ఎవరి బాధ్యత ఎంత వరకు ఉందనే విషయంపై అధికారులు దర్యాప్తు చేశారు. వివిధ లాబొరేటరీలకు నమూనాలు పంపి విశ్లేషణలు చేయించారు. జలమండలి అధికారుల పాత్రపై పూర్తి ఆధారాలు లభించడంతో ఉదంతం చోటు చేసుకున్న 15 నెలల తర్వాత చర్యలు చేపట్టారు. అప్పటి జలమండలి చీఫ్ జనరల్ మేనేజర్ పి.మనోహర్‌బాబు, జనరల్ మేనేజర్, డిప్యూటీ జనరల్ మేనేజర్, బోట్స్ క్లబ్ సెక్టార్ ఏరియా ఇన్చార్జ్, భోలక్‌పూర్ లైన్‌మాన్‌లను అరెస్టు చేశారు. ఇప్పటికీ పోలీసుల ఎదురు చూపులు... వీరిపై నమోదైన కేసుల్లోని సెక్షన్లు బెయిలబుల్ కావడంతో రిమాండ్‌కు తరలించకుండా సొంత పూచీకత్తుపై విడుదల చేశారు. ఈ దుర్ఘటన చోటు చేసుకోవడంతో జలమండలికి చెందిన ఆ ఐదుగురే కాకుండా ఇతరుల పాత్ర కూడా ఉన్నట్లు పోలీసులు అనుమానించారు. దీంతో దర్యాప్తు పూర్తి చేసి న్యాయస్థానంలో అభియోగపత్రాలు దాఖలు చేసే సమయంలో వారి పేర్లనూ చేర్చాలని భావించారు. ఈ కేసులో నిందితులుగా ఉన్న వారంతా ప్రభుత్వోద్యోగులే. ఏదైనా కేసులో వీరిపై అభియోగపత్రాలు దాఖలు చేయాలంటే ప్రభుత్వం అనుమతి తప్పనిసరి. పోలీసులు పంపే నివేదికలను పరిగణలోకి తీసుకునే ప్రభుత్వం ప్రాసిక్యూషన్ పర్మిషన్‌గా పిలిచే ఈ అనుమతిని మంజూరు చేస్తుంటుంది. భోలక్‌పూర్ ట్రాజడీ కేసులోనూ ప్రాసిక్యూషన్ పర్మిషన్ కోరుతూ దాదాపు ఎనిమిదేళ్ల క్రితం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. అప్పటి నుంచి ఈ ఫైల్ పెండింగ్‌లోనే ఉండిపోవడంతో అభియోగపత్రాల దాఖలు సాధ్యం కావట్లేదు. చార్జ్షీట్లు వేసి, కోర్టులో విచారణ జరిగి, నిందితులు దోషులుగా తేలితేనే బాధితులకు పూర్తిస్థాయి న్యాయం జరిగినట్లు అవుతుంది. అయితే అనివార్య కారణాలతో ప్రభుత్వం ప్రాసిక్యూషన్ పర్మిషన్ ఇవ్వడం లేదు. -
హైదరాబాద్ భోలక్‌పూర్‌లో అగ్నిప్రమాదం
-
భారీ వర్షాలకు కూలిన మసీద్ గోడ,పాత ఇల్లు
-
వైద్య రంగం ప్రైవేటీకరణకు కుట్ర:విమలక్క
భోలక్‌పూర్: ప్రభుత్వ వైద్య రంగాన్ని ప్రైవేటు శక్తులకు అప్పగించేందుకే తెలంగాణ ప్రభుత్వం కుట్రలు చేస్తుందని అరుణోదయ సంస్థ కన్వీనర్ విమలక్క విమర్శించారు. గత 38 రోజులుగా తమ న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం సమ్మె చేస్తున్న జూనియర్ డాక్టర్ల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఆమె ఆరోపించారు. ఇందిరాపార్కు ధర్నాచౌక్‌లో మంగళవారం జూనియర్ డాక్టర్ల రిలే నిరాహార దీక్షలకు విమలక్క సంఘీభావం తెలిపి ప్రసంగించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో శాశ్వత నియామకాలను చేపట్టాలని, జూనియర్ డాక్టర్ల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని కోరారు. సమ్మెతో ప్రభుత్వ ఆస్పత్రుల్లో రోగులు అనేక రకాల ఇబ్బందులకు గురవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. జూనియర్ డాక్టర్ల ఉద్యమానికి పూర్తిగా మద్దతునిస్తున్నామన్నారు. కార్యక్రమంలో తెలంగాణ జూనియర్ డాక్టర్ల అసోసియేషన్ కన్వీనర్ డాక్టర్ శ్రీనివాస్, అధ్యక్షులు క్రాంతి చైతన్య, నాయకులు నాగారు ్జన, అనిల్ తదితరులు పాల్గొన్నారు.