భోలక్‌పూర్‌లో బంగారు లడ్డూ వేలం.. | Golden Laddu Auction in Bholakpur Hyderabad | Sakshi
Sakshi News home page

లడ్డూ.. లంబోధర

Published Thu, Sep 12 2019 9:13 AM | Last Updated on Mon, Sep 23 2019 9:52 AM

Golden Laddu Auction in Bholakpur Hyderabad - Sakshi

ఎమ్మెల్యే ముఠా గోపాల్‌ చేతులమీదుగా బంగారు లడ్డూ తీసుకుంటున్న విష్ణుప్రసాద్‌

సాక్షి, సిటీబ్యూరో: రాష్ట్ర రాజధాని గ్రేటర్‌ హైదరాబాద్‌ నగరంలో లంబోదరుడి లడ్డూ ప్రసాదాలకు ఉన్న క్రేజ్‌ అ‘ధర’హో అనిపిస్తోంది. లడ్డూ ప్రసాదమంటేనే రెండు తెలుగురాష్ట్రాల్లో మార్మోగే బాలాపూర్‌ లడ్డూ గత ఏడాది అత్యధికంగా రూ.16.60 లక్షలకు స్థానిక ఆర్యవైశ్యసంఘం ప్రతినిధులు దక్కించుకోవడం విశేషం. ఏటా ఇంతింతై.. అన్నచందంగా ఈ లడ్డూ ధర ఏడాదికి రూ.50 వేల నుంచి రూ.75 వేల మేర అధికంగా పలుకుతోంది. బాలాపూర్‌ లడ్డూ వేలంపాట 1994 నుంచి మొదలైంది. ప్రారంభంలో రూ.500 నుంచి మొదలైన వేలంపాట.. ఇప్పుడు లక్షల రూపాయల మార్కును చేరుకొంది. ప్రతిఏటా రాష్ట్రవ్యాప్తంగా లడ్డూ వేలంపాటలో ఆల్‌టైమ్‌ రికార్డు ధర పలుకుతుండడం ఈ లడ్డూ ప్రత్యేకత. ఇక ఏటా ఈ ప్రసాదాన్ని దక్కించుకున్న వారు రాజకీయ, నిర్మాణరంగం, ఇతర రంగాల్లో గణనీయంగా అభివృద్ధి సాధింస్తుండడంతో దీనికి క్రేజ్‌ మరింత పెరుగుతూనే ఉంది.

ఈసారి కూడా ఈ మహిమాన్విత లడ్డూ ప్రసాదాన్ని దక్కించుకునేందుకు నగరంలోని పలువురు రాజకీయ, వ్యాపార, వాణిజ్య, రియల్టర్లు, బిల్డర్లు తమ పేర్లు నమోదుచేసుకొని పోటీ పడనున్నారు. ఇదే తరహాలో నగరంలో రియల్‌ ఎస్టేట్, నిర్మాణరంగం, ఐటీ, బీపీఓ, కేపీఓ రంగాలకు కొంగుబంగారంగా ఉన్న శివారు ప్రాంతాల్లో నవరాత్రి పూజలందుకున్న గణనాథుల మండపాల్లో నేడు నిర్వహించనున్న లడ్డూ వేలంపాటలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. లక్షల్లో ధర పలికే ఈ వేలంపాటలు ఆద్యంతం భక్తుల జయజయధ్వానాలు, కోలాహలం మధ్యన వేడుకగా జరగనున్నాయి. ఈ ప్రసాదాన్ని తమ అదృష్టానికి చిరునామా అని భావిస్తోన్న వారంతా వీటి కొనుగోలుకు ఆసక్తి చూపుతుండడం విశేషం. ఏటా లడ్డూ వేలంపాటలో పాల్గొనే వారి సంఖ్య పెరుగుతూనే ఉంది. ప్రధానంగా నగరంలో బాలాపూర్, బడంగ్‌పేట్, సాహెబ్‌నగర్, మంచిరేవుల, కూకట్‌పల్లి, బోరంపేట్, కొత్తగూడ, మీరాలం మండి, ముషీరాబాద్, ఫిల్మ్‌నగర్, నార్సింగి, కోకాపేట్‌ తదితర ప్రాంతాలు లడ్డూ వేలంపాటలకు కేరాఫ్‌ అడ్రస్‌గా నిలుస్తున్నాయి. గురువారం నగరవ్యాప్తంగా అంగరంగవైభవంగా జరగనున్న వేలంపాటల్లో మరోసారి లడ్డూ ప్రసాదాలకు రూ.లక్షల్లో ధర పలకనున్నాయి.

మీరాలంమండిలో.. రూ.11.51 లక్షలు..
చార్మినార్‌: మీరాలంమండి శ్రీ మహంకాళేశ్వర దేవాయం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వినాయకుని లడ్డూలు ఈసారి గతంలో కన్నా ఎక్కువ ధర పలికాయి. మీరాలంమండి బొజ్జ గణపయ్య భక్త మండలి సభ్యులు రూ.11.51లక్షలకు లడ్డూను దక్కించుకున్నారని  శ్రీ మహంకాళేశ్వర దేవాలయ కమిటీ చైర్మన్‌ గాజుల అంజయ్య పేర్కొన్నారు.   

భోలక్‌పూర్‌లో రూ.7.56 లక్షలు
కవాడిగూడ: ముషీరాబాద్‌ నియోజకవర్గంలోని భోలక్‌పూర్‌ హౌస్‌ వద్ద శ్రీసిద్ధి వినాయక భగత్‌సింగ్‌ యూత్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో నిర్వాహకులు బంగారు లడ్డూను ఏర్పాటు చేశారు. అసోసియేషన్‌ నిర్వాహకుడు జి.అనిల్‌ కుమార్‌ ఆధ్వర్యంలో 12 తులాల, 3 గ్రాముల బంగారం లడ్డూను ప్రత్యేకంగా తయారుచేయించారు. నిమజ్జనం కార్యక్రమంలో భాగంగా బుధవారం బంగారు లడ్డూకు వేలం పాట నిర్వహించారు. భక్తులు పోటీపోటీగా వేలం పాడారు. స్థానిక చేపల విక్రయాల వ్యాపారి బైరు విష్ణుప్రసాద్‌ రూ.7.56 లక్షలకు  ప్రసాదం, బంగారు లడ్డూనుకైవసం చేసుకున్నారు. ఈ సందర్భంగా ముఖ్యఅతిథిగా ముషీరాబాద్‌ ఎమ్మెల్యే ముఠా గోపాల్‌ చేతులమీదుగా విష్ణుప్రసాద్‌కు ప్రసాదంతో పాటు బంగారు లడ్డూను అందజేశారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement