సాక్షి, సిటీబ్యూరో: ఉమ్మడి రాష్ట్రంలో పెనుసంచలనం సృష్టించిన, జల కాలుష్యానికి సంబంధించిన భోలక్‌పూర్ ట్రాజడీలో నిందితులు ఇప్పటికీ ‘సేఫ్’గానే ఉన్నారు. పదేళ్ల క్రితం చోటు చేసుకున్న ఈ విషాదానికి బాధ్యులుగా గుర్తించిన జలమండలి అధికారులు, సిబ్బందిని నగరనేర పరిశోధన విభాగం (సీసీఎస్) పోలీసులు ఎనిమిదిన్నరేళ్ల క్రితం అరెస్టు చేశారు. వీరిపై కోర్టులో అభియోగపత్రాలు దాఖలు చేయడానికి ప్రభుత్వం నుంచి ప్రాసిక్యూషన్ అనుమతి అవసరం కావడంతో ఆ మేరకు లేఖ రాశారు. ఈ ఫైల్ ఇప్పటికీ సర్కారు వద్ద పెండింగ్‌లో ఉండిపోవడంతో 15 మంది మృతికి, మరో 250 మంది తీవ్ర అస్వస్థతకు కారణమైన అధికారులు, సిబ్బందిపై మాత్రం ఇప్పటికీ చట్టపరమైన చర్యలు లేకుండాపోయాయి. వీరిలో కొందరు ఇప్పటికే పదవీ విరమణ సైతం చేసి ఉండచ్చని పోలీసులు వ్యాఖ్యానిస్తున్నారు.
ఉసురు తీసిన జలకాలుష్యం...
జలమండలి నిర్లక్ష్యానికి తోడు స్థానికుల్లో ఉన్న అవగాహనా లోపం కారణంగా 2009 మే 5న భోలక్‌పూర్ ట్రాజడీ చోటు చేసుకుంది. ఆ ప్రాంతంలో సరఫరా అయిన నీటిలో వి–కలరా అనే వైరస్ ఉండటంతో పరిస్థితి చేయిదాటింది. సాధారణంగా సోడియం క్లోరైడ్ (ఉప్పు), ప్రోటీన్ రిచ్ ఆర్టికల్స్‌గా పిలిచే తోలు వ్యర్థాలు, రక్తం తదితరాలతో ఇది ఉంటుంది. నాటి మే నెల్లో ఉన్న మండే ఎండల కారణంగా వేడి తోడవడం వల్లే వీ–కలరా విజృంభించి 15 ప్రాణాలు బలిగొంది. భోలక్‌పూర్ ప్రాంతంలో తాగునీటి, మురుగునీటి (సీవరేజ్ లైన్) పైపులైన్లు పక్కపక్కనే ఉండేవి. ప్రధాన తాగునీటి పైపు నుంచి అక్కడున్న ఇళ్లకు కనెక్షన్లు ఇచ్చారు. ఇలా ఇచ్చిన వాటిలో కొన్నింటిని మురుగునీటి పైపు పైనుంచి, మరికొన్ని కనెక్షన్లు కింది నుంచి ఇచ్చారు. పైనుంచి ఇచ్చిన వాటివల్ల ఎలాంటి ఇబ్బంది లేకపోయినా... కిందనుంచి ఇచ్చినవే ప్రమాద హేతువులుగా మారాయి. భోలక్‌పూర్ ప్రాంతంలో ఉన్న తోళ్ల మండీల వల్ల వీటితో పాటు రక్తం, ఉప్పు, తోలు వ్యర్థాలు, వెంట్రుకలు, జంతు పేగులు సైతం ఈ డ్రైనేజ్ పైప్‌లైన్‌లో ప్రవహించాయి. వీటిలో ఉండే ఉప్పు వలన సీవరేజ్ పైపు లైన్లు దెబ్బతిన్నాయి. దానికి రంధ్రాలు ఏర్పడి దాని కింద ఉన్న మంచినీటి కనెక్షన్ పైపుల మీద ఉప్పు, ఇతర వ్యర్థాలు పడ్డాయి. ఈ ఉప్పు ప్రభావంతో మంచినీటి కనెక్షన్ పైపుకీ రంధ్రాలు పడి అందులోకి ఈ వ్యర్థాలు కలిశాయి. భోలక్‌పూర్ డివిజన్‌లోని భోలక్‌పూర్, ఇందిరానగర్, సిద్ధిఖ్‌నగర్, గుల్షన్ నగర్, బంగ్లాదేశ్ బస్తీల్లో కుళాయి ద్వారా వచ్చిన ఈ నీటిని స్థానికులు తాగడంతోనే పెను విషాదం చోటు చేసుకుంది.
కేసు దర్యాప్తు చేసిన సీసీఎస్...
ఈ ఉదంతంపై తొలుత ముషీరాబాద్ పోలీసుస్టేషన్‌లో అనుమానాస్పద మృతిగా (ఐపీసీ 174 సెక్షన్) కేసులు నమోదయ్యాయి. దర్యాప్తు నిమిత్తం కేసును సీసీఎస్‌కు బదిలీ చేశారు. ప్రాథమిక పరిశీలన, దర్యాప్తు నేపథ్యంలో అధికారుల అజాగ్రత్త వల్లే ఈ ఉదంతం చోటు చేసుకున్నట్లు తేలడంతో ఐపీసీలోని 304 (ఎ), 269, 270 సెక్షన్ల కింద రీ–రిజిస్టర్ చేశారు. ఈ దుర్ఘటన చోటు చేసుకోడంలో జలమండలి, జీహెచ్‌ఎంసీ, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ తదితర సంస్థల్లో ఎవరి బాధ్యత ఎంత వరకు ఉందనే విషయంపై అధికారులు దర్యాప్తు చేశారు. వివిధ లాబొరేటరీలకు నమూనాలు పంపి విశ్లేషణలు చేయించారు. జలమండలి అధికారుల పాత్రపై పూర్తి ఆధారాలు లభించడంతో ఉదంతం చోటు చేసుకున్న 15 నెలల తర్వాత చర్యలు చేపట్టారు. అప్పటి జలమండలి చీఫ్ జనరల్ మేనేజర్ పి.మనోహర్‌బాబు, జనరల్ మేనేజర్, డిప్యూటీ జనరల్ మేనేజర్, బోట్స్ క్లబ్ సెక్టార్ ఏరియా ఇన్‌చార్జ్, భోలక్‌పూర్ లైన్‌మాన్‌లను అరెస్టు చేశారు.
ఇప్పటికీ పోలీసుల ఎదురు చూపులు...
వీరిపై నమోదైన కేసుల్లోని సెక్షన్లు బెయిలబుల్ కావడంతో రిమాండ్‌కు తరలించకుండా సొంత పూచీకత్తుపై విడుదల చేశారు. ఈ దుర్ఘటన చోటు చేసుకోవడంతో జలమండలికి చెందిన ఆ ఐదుగురే కాకుండా ఇతరుల పాత్ర కూడా ఉన్నట్లు పోలీసులు అనుమానించారు. దీంతో దర్యాప్తు పూర్తి చేసి న్యాయస్థానంలో అభియోగపత్రాలు దాఖలు చేసే సమయంలో వారి పేర్లనూ చేర్చాలని భావించారు. ఈ కేసులో నిందితులుగా ఉన్న వారంతా ప్రభుత్వోద్యోగులే. ఏదైనా కేసులో వీరిపై అభియోగపత్రాలు దాఖలు చేయాలంటే ప్రభుత్వం అనుమతి తప్పనిసరి. పోలీసులు పంపే నివేదికలను పరిగణలోకి తీసుకునే ప్రభుత్వం ప్రాసిక్యూషన్ పర్మిషన్‌గా పిలిచే ఈ అనుమతిని మంజూరు చేస్తుంటుంది. భోలక్‌పూర్ ట్రాజడీ కేసులోనూ ప్రాసిక్యూషన్ పర్మిషన్ కోరుతూ దాదాపు ఎనిమిదేళ్ల క్రితం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. అప్పటి నుంచి ఈ ఫైల్ పెండింగ్‌లోనే ఉండిపోవడంతో అభియోగపత్రాల దాఖలు సాధ్యం కావట్లేదు. చార్జ్‌షీట్లు వేసి, కోర్టులో విచారణ జరిగి, నిందితులు దోషులుగా తేలితేనే బాధితులకు పూర్తిస్థాయి న్యాయం జరిగినట్లు అవుతుంది. అయితే అనివార్య కారణాలతో ప్రభుత్వం ప్రాసిక్యూషన్ పర్మిషన్ ఇవ్వడం లేదు.
Comments
Please login to add a commentAdd a comment