Water department
-
తెలంగాణలో 64,056 జల వనరులు
తెలంగాణలో మొత్తం 64,056 జల వనరులు ఉన్నాయని.. వీటిలో 98.5% (63,064) గ్రామీణ ప్రాంతాల్లో, మిగిలిన 1.5% (992) పట్టణాల్లో ఉన్నాయని కేంద్ర జలశక్తి శాఖ విడుదల చేసిన తొలి జల వనరుల సెన్సస్ నివేదిక వెల్లడించింది. 80.5% (51,593) జల వనరులు ప్రభుత్వ యాజమాన్యంలో ఉండగా, 19.5% (12,463) ప్రైవేట్ యాజమాన్యంలో ఉన్నాయి. 17.3% (11,076) జల వనరులు ‘కరువు పీడిత ప్రాంతాల కార్యక్రమం’కింద, 10.6% (6,781) గిరిజన ప్రాంతాల్లో, మిగిలిన 72.1% (46,199) వరద పీడిత ప్రాంతాలు, నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో ఉన్నాయి. అంతేగాక 64,056 జల వనరుల్లో 80.8% (51,733) వాడుకలో ఉండగా, 19.2% (12,323) ఎండిపోవడం, పూడిక తీయకపోవడం, మరమ్మతు చేయలేని విధంగా నాశనం కావడం, లవణీయత ఇతర కారణాల వల్ల ఉపయోగంలో లేవని నివేదికలో వెల్లడించారు. – సాక్షి, న్యూఢిల్లీ నిండిన స్థితిలో 43,695 జల వనరులు రాష్ట్రంలో 10,170 సహజసిద్ధమైన, 53,886 మానవ నిర్మిత జల వనరులు ఉన్నాయి. సహజ జల వనరుల్లో 96.2% (9,781) గ్రామీణ ప్రాంతాల్లో, 3.8% (389) పట్టణ ప్రాంతాల్లో ఉన్నాయి. మానవ నిర్మిత జల వనరుల్లో 98.9% (53,283) పల్లెల్లో, 1.1% (603) పట్టణాల్లో ఉన్నాయి. రాష్ట్రంలోని 64,056 జల వనరుల్లో 43,695 వనరులు ‘నిండిన నిల్వ సామర్థ్యం’/ ’నిండిన స్థితి’కలిగి ఉన్నాయి. గత ఐదేళ్లలో నిల్వ సామర్థ్యాన్ని పెంచడం లాంటి ప్రమాణాల ఆధారంగా ఈ 43,695 వనరుల్లో 20.3% (8,862) ప్రతి ఏటా నిండుతున్నట్లు గుర్తించారు. 41.9% (18,301) సాధారణంగా నిండుతుండగా, 29.8% (13,033) చాలా అరుదుగా నిండుతున్నాయని, 8.0% (3,499) ఎప్పుడూ నిండట్లేదని నివేదికలో వెల్లడించారు. మొత్తమ్మీద 38,540 వనరులు జిల్లా నీటిపారుదల ప్రణాళిక/రాష్ట్ర నీటిపారుదల ప్రణాళికలో ఉన్నాయి. వీటిలో 45.9% (17,681) చెరువులు కాగా, 54.1% (20,859) ట్యాంకులు, సరస్సులు, రిజర్వాయర్లు, నీటి సంరక్షణ పథకాలు/చెక్ డ్యామ్‌లు మొదలైనవి ఉన్నాయి. 1,540 చెరువులు, 1,492 ట్యాంకులు, సరస్సుల్లో ఆక్రమణలు రాష్ట్రంలోని 3,032 జల వనరుల్లో ఆక్రమణలను గుర్తించారు. వాటిలో 50.8% (1,540) చెరువులు, 49.2% (1,492) ట్యాంకులు, సరస్సులు, రిజర్వాయర్లు, జల సంరక్షణ పథకాలు/చెక్ డ్యామ్‌లు మొదలైనవి ఉన్నాయి. వీటిలో 3,032 ఆక్రమణకు గురైన జల వనరులు, 2,028 జల వనరుల్లో ఆక్రమణ ప్రాంతాన్ని అంచనా వేశారు. ఈ 2,028 వనరులకుగాను 1,415 జల వనరుల్లో 25% కంటే తక్కువ విస్తీర్ణంలో ఆక్రమణలకు గురవుతున్నాయని, 402 జలవనరులు 25%–75% మధ్య ఆక్రమణ కలిగి ఉన్నాయని నివేదికలో పొందుపరిచారు. మిగిలిన 211 జల వనరులు 75% కంటే ఎక్కువ ఆక్రమణకు గురైనట్లు గుర్తించారు. 64,056 జల వనరుల్లో 63,769 వనరుల్లో ‘జల వ్యాప్తి ప్రాంతం’నివేదించారు. వీటిలో 51.6% (32,914) జల వనరులు 0.5 హెక్టార్ల కంటే తక్కువ జల వ్యాప్తిని కలిగి ఉన్నాయి. అయితే 1.8% (1,166) జల వనరులు 50 హెక్టార్ల కంటే ఎక్కువ జల వ్యాప్తిని కలిగి ఉన్నట్లు నివేదికలో పేర్కొన్నారు. -
పదేళ్లయినా పర్మిషన్ లేదు!
సాక్షి, సిటీబ్యూరో: ఉమ్మడి రాష్ట్రంలో పెనుసంచలనం సృష్టించిన, జల కాలుష్యానికి సంబంధించిన భోలక్‌పూర్ ట్రాజడీలో నిందితులు ఇప్పటికీ ‘సేఫ్’గానే ఉన్నారు. పదేళ్ల క్రితం చోటు చేసుకున్న ఈ విషాదానికి బాధ్యులుగా గుర్తించిన జలమండలి అధికారులు, సిబ్బందిని నగరనేర పరిశోధన విభాగం (సీసీఎస్) పోలీసులు ఎనిమిదిన్నరేళ్ల క్రితం అరెస్టు చేశారు. వీరిపై కోర్టులో అభియోగపత్రాలు దాఖలు చేయడానికి ప్రభుత్వం నుంచి ప్రాసిక్యూషన్ అనుమతి అవసరం కావడంతో ఆ మేరకు లేఖ రాశారు. ఈ ఫైల్ ఇప్పటికీ సర్కారు వద్ద పెండింగ్‌లో ఉండిపోవడంతో 15 మంది మృతికి, మరో 250 మంది తీవ్ర అస్వస్థతకు కారణమైన అధికారులు, సిబ్బందిపై మాత్రం ఇప్పటికీ చట్టపరమైన చర్యలు లేకుండాపోయాయి. వీరిలో కొందరు ఇప్పటికే పదవీ విరమణ సైతం చేసి ఉండచ్చని పోలీసులు వ్యాఖ్యానిస్తున్నారు. ఉసురు తీసిన జలకాలుష్యం... జలమండలి నిర్లక్ష్యానికి తోడు స్థానికుల్లో ఉన్న అవగాహనా లోపం కారణంగా 2009 మే 5న భోలక్‌పూర్ ట్రాజడీ చోటు చేసుకుంది. ఆ ప్రాంతంలో సరఫరా అయిన నీటిలో వి–కలరా అనే వైరస్ ఉండటంతో పరిస్థితి చేయిదాటింది. సాధారణంగా సోడియం క్లోరైడ్ (ఉప్పు), ప్రోటీన్ రిచ్ ఆర్టికల్స్‌గా పిలిచే తోలు వ్యర్థాలు, రక్తం తదితరాలతో ఇది ఉంటుంది. నాటి మే నెల్లో ఉన్న మండే ఎండల కారణంగా వేడి తోడవడం వల్లే వీ–కలరా విజృంభించి 15 ప్రాణాలు బలిగొంది. భోలక్‌పూర్ ప్రాంతంలో తాగునీటి, మురుగునీటి (సీవరేజ్ లైన్) పైపులైన్లు పక్కపక్కనే ఉండేవి. ప్రధాన తాగునీటి పైపు నుంచి అక్కడున్న ఇళ్లకు కనెక్షన్లు ఇచ్చారు. ఇలా ఇచ్చిన వాటిలో కొన్నింటిని మురుగునీటి పైపు పైనుంచి, మరికొన్ని కనెక్షన్లు కింది నుంచి ఇచ్చారు. పైనుంచి ఇచ్చిన వాటివల్ల ఎలాంటి ఇబ్బంది లేకపోయినా... కిందనుంచి ఇచ్చినవే ప్రమాద హేతువులుగా మారాయి. భోలక్‌పూర్ ప్రాంతంలో ఉన్న తోళ్ల మండీల వల్ల వీటితో పాటు రక్తం, ఉప్పు, తోలు వ్యర్థాలు, వెంట్రుకలు, జంతు పేగులు సైతం ఈ డ్రైనేజ్ పైప్‌లైన్‌లో ప్రవహించాయి. వీటిలో ఉండే ఉప్పు వలన సీవరేజ్ పైపు లైన్లు దెబ్బతిన్నాయి. దానికి రంధ్రాలు ఏర్పడి దాని కింద ఉన్న మంచినీటి కనెక్షన్ పైపుల మీద ఉప్పు, ఇతర వ్యర్థాలు పడ్డాయి. ఈ ఉప్పు ప్రభావంతో మంచినీటి కనెక్షన్ పైపుకీ రంధ్రాలు పడి అందులోకి ఈ వ్యర్థాలు కలిశాయి. భోలక్‌పూర్ డివిజన్లోని భోలక్‌పూర్, ఇందిరానగర్, సిద్ధిఖ్‌నగర్, గుల్షన్ నగర్, బంగ్లాదేశ్ బస్తీల్లో కుళాయి ద్వారా వచ్చిన ఈ నీటిని స్థానికులు తాగడంతోనే పెను విషాదం చోటు చేసుకుంది. కేసు దర్యాప్తు చేసిన సీసీఎస్... ఈ ఉదంతంపై తొలుత ముషీరాబాద్ పోలీసుస్టేషన్లో అనుమానాస్పద మృతిగా (ఐపీసీ 174 సెక్షన్) కేసులు నమోదయ్యాయి. దర్యాప్తు నిమిత్తం కేసును సీసీఎస్‌కు బదిలీ చేశారు. ప్రాథమిక పరిశీలన, దర్యాప్తు నేపథ్యంలో అధికారుల అజాగ్రత్త వల్లే ఈ ఉదంతం చోటు చేసుకున్నట్లు తేలడంతో ఐపీసీలోని 304 (ఎ), 269, 270 సెక్షన్ల కింద రీ–రిజిస్టర్ చేశారు. ఈ దుర్ఘటన చోటు చేసుకోడంలో జలమండలి, జీహెచ్ఎంసీ, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ తదితర సంస్థల్లో ఎవరి బాధ్యత ఎంత వరకు ఉందనే విషయంపై అధికారులు దర్యాప్తు చేశారు. వివిధ లాబొరేటరీలకు నమూనాలు పంపి విశ్లేషణలు చేయించారు. జలమండలి అధికారుల పాత్రపై పూర్తి ఆధారాలు లభించడంతో ఉదంతం చోటు చేసుకున్న 15 నెలల తర్వాత చర్యలు చేపట్టారు. అప్పటి జలమండలి చీఫ్ జనరల్ మేనేజర్ పి.మనోహర్‌బాబు, జనరల్ మేనేజర్, డిప్యూటీ జనరల్ మేనేజర్, బోట్స్ క్లబ్ సెక్టార్ ఏరియా ఇన్చార్జ్, భోలక్‌పూర్ లైన్‌మాన్‌లను అరెస్టు చేశారు. ఇప్పటికీ పోలీసుల ఎదురు చూపులు... వీరిపై నమోదైన కేసుల్లోని సెక్షన్లు బెయిలబుల్ కావడంతో రిమాండ్‌కు తరలించకుండా సొంత పూచీకత్తుపై విడుదల చేశారు. ఈ దుర్ఘటన చోటు చేసుకోవడంతో జలమండలికి చెందిన ఆ ఐదుగురే కాకుండా ఇతరుల పాత్ర కూడా ఉన్నట్లు పోలీసులు అనుమానించారు. దీంతో దర్యాప్తు పూర్తి చేసి న్యాయస్థానంలో అభియోగపత్రాలు దాఖలు చేసే సమయంలో వారి పేర్లనూ చేర్చాలని భావించారు. ఈ కేసులో నిందితులుగా ఉన్న వారంతా ప్రభుత్వోద్యోగులే. ఏదైనా కేసులో వీరిపై అభియోగపత్రాలు దాఖలు చేయాలంటే ప్రభుత్వం అనుమతి తప్పనిసరి. పోలీసులు పంపే నివేదికలను పరిగణలోకి తీసుకునే ప్రభుత్వం ప్రాసిక్యూషన్ పర్మిషన్‌గా పిలిచే ఈ అనుమతిని మంజూరు చేస్తుంటుంది. భోలక్‌పూర్ ట్రాజడీ కేసులోనూ ప్రాసిక్యూషన్ పర్మిషన్ కోరుతూ దాదాపు ఎనిమిదేళ్ల క్రితం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. అప్పటి నుంచి ఈ ఫైల్ పెండింగ్‌లోనే ఉండిపోవడంతో అభియోగపత్రాల దాఖలు సాధ్యం కావట్లేదు. చార్జ్షీట్లు వేసి, కోర్టులో విచారణ జరిగి, నిందితులు దోషులుగా తేలితేనే బాధితులకు పూర్తిస్థాయి న్యాయం జరిగినట్లు అవుతుంది. అయితే అనివార్య కారణాలతో ప్రభుత్వం ప్రాసిక్యూషన్ పర్మిషన్ ఇవ్వడం లేదు. -
నేడు నీటి సరఫరా బంద్
సాక్షి, సిటీబ్యూరో: ఎస్ఆర్డీపీ పనులతో పాటు కృష్ణా రెండోదశ రింగ్‌మెయిన్–2 పైపులైన్ల లీకేజీలు, మరమ్మతు పనుల కారణంగా బుధవారం పలు ప్రాంతాలకు నీటి సరఫరా నిలిపి వేయనున్నట్లు జలమండలి మంగళవారం ప్రకటించింది. బుధవారం ఉదయం 11గంటల నుంచి గురువారం ఉదయం 11గంటల వరకు ఆయా ప్రాంతాలకు నీటి సరఫరా నిలిచిపోనుంది. మరమ్మతులు పూర్తయిన వెంటనే సరఫరా పునరుద్ధరిస్తామని పేర్కొంది. వైశాలినగర్, బీఎన్‌రెడ్డినగర్, ఆటోనగర్, వనస్థలిపురం, మీర్పేట్, బాలాపూర్, బార్కాస్, మైసారం, ఎలుగుట్ట, రామంతాపూర్, ఉప్పల్, హబ్సిగూడ, నాచారం, చిల్కానగర్, తార్నాక, లాలాపేట్, బౌద్ధనగర్, మారేడ్‌పల్లి, కంట్రోల్‌రూమ్, మేకలమండి, భోలక్‌పూర్, హస్మత్‌పేట్, సికింద్రాబాద్ రైల్వేస్, ఎంఈఎస్, కంటోన్మెంట్ బోర్డు, ప్రకాశ్‌నగర్, పాటిగడ్డ తదితర ప్రాంతాలకు నీటి సరఫరా నిలిచిపోనుంది. -
జలమండలికి సోలార్ పవర్!
సాక్షి,సిటీబ్యూరో: మహానగరానికి తాగునీరు అందిస్తోన్న జలమండలి త్వరలో సౌరకాంతులు సంతరించుకోనుంది. వాటర్‌బోర్డుకు చెందిన 59 రిజర్వాయర్లు, పంప్‌హౌజ్‌ల వద్ద టీఎస్రెడ్కో(తెలంగాణ సంప్రదాయేతర ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ) ఆధ్వర్యంలో 30 మెగావాట్ల సౌర విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం గల సౌరఫలకలను ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం గురువారం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. సుమారు రూ.150 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేయనున్న ఈ ప్రాజెక్టుతో జలమండలికి యూనిట్‌కు రూ.3 లోపే విద్యుత్‌ను సరఫరా చేయనున్నారు. దీంతో బోర్డుపై విద్యుత్ బిల్లుల భారం గణనీయంగా తగ్గనుంది. ప్రస్తుతం జలమండలికి పరిశ్రమల కేటగిరి కింద విద్యుత్ సరఫరా జరుగుతుండడంతో యూనిట్‌కు రూ.5.60 చెల్లించాల్సి వస్తోంది. మార్చి రెండోవారంలోగా కేంద్ర సంప్రదాయేతర ఇంధన వనరుల మంత్రిత్వశాఖ అనుమతితో ఈప్రాజెక్టుకు సంబంధించిన టెండర్ల ప్రక్రియను టీఎస్రెడ్కో పూర్తి చేయనున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఈ టెండర్‌ను దక్కించుకున్న సంస్థ ఆధ్వర్యంలో సౌరవిద్యుత్ ఉత్పత్తి ప్రారంభిస్తారు. దానకిశోర్ చొరవతో.. సోలార్ ప్రాజెక్టుకు జలమండలి అనుమతి సాధించడంతో దేశంలో పలు మహానగరాల్లోని జలబోర్డులకు జలమండలి ఆదర్శంగా నిలవనుంది. ప్రభుత్వ రంగ జలబోర్డుల పరిధిలో సౌరవిద్యుత్ ప్రాజెక్టును సాకారం చేసి విద్యుత్ బిల్లుల భారం నుంచి ఉపశమనం పొందడంలో బోర్డు సరికొత్త రికార్డు సృష్టించనుంది. ప్రభుత్వరంగ సంస్థలో ఇలాంటి ప్రాజెక్టును సాకారం చేసిన ఘనత బోర్డు మేనేజింగ్ డైరెక్టర్ ఎం.దానకిశోర్‌కు దక్కనుంది. ప్రతీనెలా విద్యుత్‌బిల్లుల భారంతో కుదేలవుతోన్న బోర్డుకు సౌరవిద్యుత్ సరైన ప్రత్యామ్నాయమని గుర్తించిన ఆయన టీఎస్రెడ్కో సౌజన్యంతో ఈ సోలార్‌పవర్ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. ఈ ప్రాజెక్టుతో జలమండలిపై ఎలాంటి ఆర్థికభారం ఉండదని బోర్డు వర్గాలు స్పష్టంచేస్తున్నాయి. జలమండలికివిద్యుత్ బిల్లుల కష్టాలు ఇప్పటికే రూ.140 కోట్ల పెండింగ్ విద్యుత్ బిల్లులు చెల్లించలేక వాటర్‌బోర్డు ఆపసోపాలు పడుతోంది. దీనికితోడు ప్రతినెలా రూ.70 కోట్ల మేర విద్యుత్ బిల్లులు చెల్లించడం గుదిబండగా మారింది. వందల కిలోమీటర్ల దూరం నుంచి గ్రేటర్‌కు తరలిస్తోన్న కృష్ణా,గోదావరి జలాల పంపింగ్, స్టోరేజి రిజర్వాయర్ల నుంచి నల్లా కనెక్షన్లకు నీటిసరఫరాకు నెలకు సుమారు 120 మెగావాట్ల విద్యుత్ అవసరం అవుతోంది. మరోవైపు జలమండలికి నెలవారీగా నీటిబిల్లుల వసూలు, ట్యాంకర్ నీళ్ల సరఫరా, నూతన నల్లా కనెక్షన్ల జారీతో రెవెన్యూ ఆదాయం కనాకష్టంగా రూ.100 కోట్ల మేర సమకూరుతోంది. కానీ నెలవారీ వ్యయం రూ.114 కోట్లు మించుతోంది. ప్రధానంగా నెలవారీగా విద్యుత్ బిల్లుల రూపేణా రూ.70 కోట్లు చెల్లించాల్సి వస్తోంది. మిగతా మొత్తంలో ఉద్యోగుల జీతభత్యాలు, గతంలో తీసుకున్న రుణాలకు సంబంధించిన వాయిదాలు, వడ్డీ చెల్లింపులు, నిర్వహణ వ్యయాలు, మరమ్మతులు, నీటిశుద్ధి తదితర ప్రక్రియలకు సుమారు రూ.44 కోట్లు వ్యయం చేస్తున్నారు. ప్రతినెలా బోర్డు దాదాపు రూ.12 కోట్ల లోటుతో నెట్టుకొస్తోంది. దీనికితోడు కొన్ని నెలలుగా రూ.140 కోట్ల మేర విద్యుత్ బిల్లులు పేరుకుపోవడంతో బోర్డు ఖజానాకు షాక్‌లా పరిణమిస్తోంది. -
‘నీళ్ల శాఖ’ మెయిల్ హ్యాక్
సాక్షి, హైదరాబాద్: ఫేస్బుక్, ట్వీటర్లను హ్యాక్ చేస్తున్న సైబర్ నేరగాళ్లు ఇప్పుడు ఏకంగా నీటిపారుదల శాఖనే టార్గెట్ చేశారు. కమాండ్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ (కాడా) పరిధిలోని నాగార్జునసాగర్ ఆధునీకరణ పనులకు సంబంధించి వినియోగిస్తున్న మెయిల్‌నే హ్యాక్ చేశారు. హ్యాక్ చేసిన మెయిల్ నుంచే ఏకంగా ప్రపంచబ్యాంకు ప్రతినిధులకు ‘వుయ్ నీడ్ ఏ ఫేవర్’అంటూ మెయిళ్లు పంపారు. మెయిల్‌ను రిసీవ్ చేసుకున్న కొందరు ఎలాంటి ఫేవర్ కావాలంటూ శాఖ అధికారులకే ఫోన్లు చేయడంతో హ్యాక్ విషయం బయటపడింది. అసలేం జరిగిందంటే... రాష్ట్ర ప్రభుత్వం 2008లో ప్రపంచ బ్యాంకు నిధులతో సాగర్ ఆధునీకరణ పనులకు శ్రీకారం చుట్టింది. ఈ పనులకు సంబంధించి ‘కాడా’అధికారులు అప్పట్లోనే ఆంధ్రప్రదేశ్ వాటర్ సెక్టార్ ఇంప్లిమెంట్ ప్లాన్‌ను తయారు చేశారు. అదే అర్థం వచ్చేలా ఏపీడబ్ల్యూఎస్ఐపీ’పేరుతో ఒక మెయిల్ అడ్రస్‌ను క్రియేట్ చేసి దాని నుంచే ప్రపంచబ్యాంకు ప్రతినిధులు, ఇతర శాఖల ప్రతినిధులతో సంప్రదింపులు జరుపుతున్నారు. అయితే మంగళవారం రాత్రి ఈ మెయిల్‌ను హ్యాక్ చేసిన సైబర్ నేరగాళ్లు, దాన్నుంచి అందులోని ప్రధాన మెయిల్ అడ్రస్‌లన్నింటికీ ‘వుయ్ నీడ్ ఏ ఫేవర్’అంటూ మెయిల్ సందేశం పంపారు. సుమారు 50 నుంచి 60 మంది వరకు ఇదే రకమైన మెయిల్ వెళ్లింది. ఈ మెయిల్ రాత్రిపూట పంపడంతో దీన్ని శాఖ అధికారులెవరూ గుర్తించలేదు. అయితే ఉదయం ఈ విభాగం ప్రాజెక్టు డైరెక్టర్, ‘కాడా’కమిషనర్‌గా ఉన్న మల్సూర్‌కు ప్రపంచ బ్యాంకు ప్రతినిధి నుంచి ఫోన్ వచ్చింది. ‘రాత్రి మెయిల్ పంపారు. మీకు ఎలాంటి ఫేవర్ కావాలి’అని ఆ ప్రపంచబ్యాంకు ప్రతినిధి అడగడంతో ఆయన అవాక్కయ్యారు. ఎలాంటి మెయిల్ పంపలేదని చెప్పడంతో ఫోన్ చేసిన ప్రతినిధి సైతం కంగుతిన్నారు. ‘ఉదయం ప్రపంచబ్యాంకు ప్రతినిధి ఫోన్‌చేసి ఎలాంటి ఫేవర్ కావాలని అడగ్గానే కంగారు పడ్డా. తరువాత మెయిల్ విషయం చెప్పాడు. మరికొద్ది సేపటికే మరో ప్రపంచ బ్యాంకు అధికారి నుంచి ఫోన్‌చేసి మెయిల్ విషయమే అడిగారు. అయితే నేను హైదరాబాద్‌లో లేకపోవడంతో ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకోలేదు. మళ్లీ కొద్దిసేపటికే ప్రస్తుతం ఏపీలో సెక్రటరీ స్థాయిలో ఉన్న ఐఏఎస్ అధికారి నుంచి ఇదే మెయిల్ గురించి ఫోన్ వచ్చింది. వెంటనే మా సిబ్బందిని అప్రమత్తం చేయడంతో అసలు విషయం బయటపడింది’అని మల్సూర్ ‘సాక్షి’కి తెలిపారు. వెంటనే దీనిపై బషీర్‌బాగ్‌లోని సైబర్ సెల్ అధికారులకు ఫిర్యాదు చేశారు. ప్రాథమిక విచారణలో దీన్ని నైజీరియన్‌కు చెందిన సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేసినట్లుగా గుర్తించినట్లు తెలిసింది. అనంతరం మెయిల్ సందేశం పంపిన అడ్రస్‌లన్నింటికీ ‘ఈ మెయిల్ హ్యాక్ చేయబడింది. ఫేవర్ చేయాలంటూ వచ్చిన మెయిల్‌ను పరిగణనలోకి తీసుకోవద్దు’అంటూ తిరిగి మెయిల్ పంపారు. -
శ్రీశైలం నుంచి నీటి సేకరణ పెంచాలి
రిటైర్డ్ ఇంజనీర్ల తీర్మానం సాక్షి, హైదరాబాద్: పాత మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాల ఫ్లోరైడ్ బాధిత మండలాలకు తాగునీటిని అందించే లక్ష్యంతో చేపడుతున్న పాలమూరు, డిండి ఎత్తిపోతల పథకాలకు శ్రీశైలం నుంచి 2.75 టీఎంసీలు తీసుకునేలా ప్రభుత్వాన్ని ఒప్పించాలని నీటి పారుదల శాఖ రిటైర్డ్ ఇంజనీర్లు నిర్ణయించారు. శ్రీశైలం నుంచి తీసుకునే 2.75 టీఎంసీలలో 2 టీఎంసీలు పాలమూరు ప్రాజెక్టుకు, మరో 0.75 టీఎంసీ డిండికి కేటాయించేలా చూడాలని తీర్మానించారు. ఈ ప్రతిపాదనను ప్రభుత్వం ముందుంచాలని నిర్ణయించారు. బుధవారం ఈ మేరకు ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్ కార్యాలయంలో నీటి పారుదల శాఖ రిటైర్డ్ ఇంజనీర్ల ఫోరం, రిటైర్డ్ ఇంజనీర్ల అసోసియేషన్ సంయుక్త భేటీ నిర్వహించింది. సమావేశంలో పాలమూరు, డిండి పరిధిలో నెలకొన్న వివాదాలపై చర్చించారు. సమావేశంలో రిటైర్డ్ ఇంజినీర్లు శ్యాంప్రసాద్‌రెడ్డి, చంద్ర మౌళి, రాంరెడ్డి, రమేశ్‌రెడ్డి, డి.గోవర్ధన్‌రెడ్డి, ఎన్.రఘుమారెడ్డి పాల్గొన్నారు.